అబ్బూరి ఛాయాదేవి
ఈ మధ్య మా ఆఖరి ఆడపడుచు కూతురు మినీ తిమ్మరాజు అమెరికా నుంచి వచ్చినప్పుడు ‘ప్రజ్వల’ అనే సంస్థకి వెళ్ళి చూడాలనుకుంది. అమెరికాలో తన స్నేహితులెవరో చెప్పారుట ఆ సంస్థను చూసి రమ్మని. మినీ హ్యూస్టన్‌లో ‘ప్లాన్డ్ పేరెంట్ హుడ్’ అనే సంస్థలో బాధ్యతాయుతమైన పదవి నిర్వహిస్తోంది. ఇద్దరం కలిసి చార్‌మినార్ బస్‌స్టాండ్ వెనకాల వైపు మూడంతస్తుల భవనంలో, పైన ఉంటున్న ‘ప్రజ్వల’ సంస్థకి వెళ్ళాం. దాన్ని స్థాపించి, పధ్నాలుగేళ్ళుగా నిర్వహిస్తున్నది డా. సునీత కృష్ణన్. కేరళకి చెందిన యువతి. ఇంకా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలకి రూపకల్పన చేస్తున్నట్లు తెలిపింది.
ఈ ‘ప్రజ్వల’ సంస్థ – బాలికల్నీ, స్త్రీలనీ లైంగికంగా దోపిడీ చేసే వ్యాపారాన్ని అరికట్టడానికీ, బాధితులైన బాలికల్నీ, స్త్రీలనీ రక్షించి, వారికి పునరావాసాన్ని కల్పించడానికీ ఏర్పడిన సేవా సంస్థ. అసలు ఈ రంగంలో కృషి చెయ్యాలని ఎందుకు అనిపించింది అని మా మేనకోడలు డా. సునీతని అడిగింది. ఆమె ఎటువంటి తడబాటు లేకుండా స్పష్టంగా చెప్పింది – తను పదహారేళ్ళ వయస్సులో సామూహిక అత్యాచారానికి గురైందనీ, ఇక తన ఊళ్ళో ఉండకుండా బెంగుళూరు వెళ్ళి అక్కడ కొంతకాలం ఉన్నప్పుడు జైలు జీవితాన్ని కూడా అనుభవించిందనీ, తరవాత హైదరాబాదుకి వచ్చి ‘బ్రదర్’ ‘జోస్ వెట్టికటిల్’ సహకారంతో ‘ప్రజ్వల’ సంస్థని స్థాపించి, ఇద్దరూ కలిసి, మోసగింపబడి లైంగిక వ్యాపారానికి గురి అయిన స్త్రీలనీ, బాలికల్నీ సంరక్షించి, వారికి పునరావాసాన్ని కల్పించే బాధ్యతని చేపట్టినట్లు తెలిపింది డా. సునీత. ఆమె నిరాడంబరత, నిబ్బరం, స్పష్టత, స్థైర్యం చూస్తే ఆశ్చర్యం వేసింది. ఆమెకి ఇప్పటికీ తండ్రి సహకారం కూడా ఉంది అన్నివిధాలా.
‘ప్రజ్వల’ అంటే నిరంతర జ్వాల – వారి కర్తవ్యం సాధిస్తున్నంత వరకూ ఆ జ్వాల నిత్యం వెలుగుతూనే ఉంటుందని వారి నినాదం. మానవ హక్కుల ఉల్లంఘనలో లైంగికంగా దోపిడీ చేసే వ్యాపారం అత్యంత హీనమైనదనీ, హింసాపూరితమైనదనీ అందరికీ తెలిసిన విషయమే. ఆడపిల్లల్ని అమ్ముతూ, లైంగికంగా దోపిడీ చేసే వ్యాపారాన్ని నిరోధించడంలోనూ, రక్షించిన బాలికలకూ, స్త్రీలకూ పునరావాసాన్నీ, మంచి భవిష్యత్తునీ కల్పించడంలోనూ ‘ప్రజ్వల’ పూనుకున్న ఉద్యమానికి అందరూ సహకరించవలసిన అవసరం ఉంది. హెచ్‌ఐవి/ఎయిడ్స్ సోకిన వాళ్ళకి వైద్య సదుపాయాన్ని అనునిత్యం అందించడమే కాకుండా, బాలికలకు విద్య నేర్పించడం, స్త్రీలకు వృత్తివిద్యలు నేర్పించడం, హాస్టల్స్‌లో ఉంచిన బాలికలకు తిండి, బట్ట, రక్షణ కల్పించడం చేస్తున్నారు. హైదరాబాదు పాతనగరంలో ప్రజ్వల ఏర్పాటు చేసిన రెండు బాలికల విద్యాసంస్థలనీ, ఒక వృత్తి విద్యా సంస్థనీ, దానితోపాటే నిర్వహింపబడుతున్న ఒక బాలికల హాస్టల్నీ చూశాం. అక్కడ (ఫలక్‌నుమా పేలెస్ దగ్గర) పెద్ద స్థలంలో 150 మంది బాలికలు అక్కడే ఉండి చదువుకుంటున్నారు. ఇంగ్లీషు మీడియమ్‌లో చదువు నేర్పిస్తున్నారు. తరవాత పైచదువులకి కూడా ఇతర విద్యాసంస్థల్లో చదువు చెప్పించే ఏర్పాటుకి ప్రభుత్వ సహకారం ఉంటుందన్నారు. స్త్రీలకి నేర్పిస్తున్న వృత్తివిద్యలు – పురుషులు మాత్రమే చెయ్యగలరు అనుకునేటటువంటి వడ్రంగి పని, బైండింగు, ప్రింటింగు మొదలైన పనులూ, కంప్యూటర్‌పై చేసే పనులూ అన్నిటిలో శిక్షణనివ్వడమే కాకుండా, వారుచేసిన సామగ్రిని హాస్పిటల్స్‌కీ, కొన్ని విద్యాసంస్థలకీ అమ్మే ఏర్పాటు కూడా ఉంది. ఆ వచ్చిన సొమ్ముని ఈ సంస్థని నిర్వహించడానికి ఉపయోగిస్తున్నారు. శిక్షణ నిస్తున్న వారిలోనూ, యాజమాన్యంలోనూ కొందరు పురుషుల్ని నియమించారు. అందరూ బాధ్యతాయుతంగా ఉంటున్నారు. హాస్టల్లో బాలికలకు విద్య నేర్పించేవారు మాత్రం అందరూ స్త్రీలే. వారి సంరక్షణ బాధ్యత కూడా స్త్రీలదే.
హైదరాబాదు పాత నగరంలో ఇది వరకు, హైకోర్టు ఎదురుగా ఉన్న స్థలంలోనే ‘మెహబూబ్ కీ మెహందీ’ అనే వేశ్యాగృహ సముదాయం ఉండేదిట. దాన్ని అక్కడ నుంచి తొలగించడం కేవలం 1996లో మాత్రమే జరిగింది. అక్కడ నుంచి వేశ్యలనందరినీ పంపించివేసినప్పుడు వాళ్ళు వీధిన పడినప్పుడు తెలుసుకున్నారు – తమకీ తమ పిల్లలకీ ఎంత భద్రతారాహిత్యం ఉందో. వాళ్ళు ఎక్కడికి పోవాలో, వాళ్ళ పిల్లల్ని ఎలా సంరక్షించుకోవాలో తెలియక సహాయం కోసం అల్లాడుతున్నప్పుడు ‘ప్రజ్వల’ సంస్థ ఉదయించింది – వాళ్ళ సంరక్షణ బాధ్యత తీసుకోవడానికీ, వాళ్ళ జీవితాలను ఉద్ధరించడానికీ. ముందుగా 50 మంది స్త్రీలకి తాత్కాలిక వసతిని ఏర్పాటుచేసి, వారికి వైద్య, విద్యారంగాల్లో వృత్తి శిక్షణ ఇచ్చే ఏర్పాట్లు చేయడం జరిగింది. ప్రభుత్వ సహకారంతో 400 మంది స్త్రీలకు వేరే ఇళ్ళూ, రేషన్‌కార్డులూ ఇప్పించారు. 1500 మందికి పైగా – 3 నుంచి 35 సం||ల వరకూ ఉన్నవాళ్ళని ఆ లైంగిక వ్యాపారం నుంచి రక్షించడం జరిగింది. ఇప్పటివరకూ 5000 మంది పిల్లల్ని అటువంటి వాతావరణానికి దూరంగా ఉంచడానికి ప్రయత్నం జరిగింది. హైదరాబాదు నగర పోలీసు వారు క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నవారికోసం రెండు సలహా కేంద్రాల చొప్పున ప్రముఖ పోలీసు స్టేషన్లలో ఏర్పాటుచేశారు – వాళ్ళ మళ్ళీ లైంగిక వ్యాపారంలో చిక్కుకోనివ్వకుండానూ, చిక్కుకున్నవాళ్ళని రక్షంచడానికీను.
ఒక సహకార సంస్థని ఏర్పరచి, దాన్ని ఒక చిన్న పరిశ్రమగా వ్యవస్థాగతం చేయడం జరిగింది. అందులో 75 మంది రక్షింపబడిన స్త్రీలను ఉద్యోగినులుగా నియమించింది. వాళ్ళకి శిక్షణనిస్తూ, వాళ్ళచేత ముద్రణలోనూ, నోట్‌పుస్తకాలూ, బల్లలూ మంచాలూ మొదలైనవి తయారుచెయ్యడంలోనూ, ఇతర ప్రత్యేక విద్యల్లోనూ, భవన సంరక్షణకి సంబంధించిన పనులలోనూ సాంకేతిక శిక్షణలు ఇస్తూ, వారిచేత ఆ పనులు చేయించి, వాళ్ళు ఉత్పత్తి చేసిన వాటిన విద్యాసంస్థలకీ, వైద్యసంస్థలకీ, ఇతర సంస్థలకీ అమ్ముతూ, ఆదాయాన్ని సృష్టిస్తూ ఇతర సంక్షేమ కార్యక్రమాలకి వినియోగిస్తున్నారు.
అమూల్ ఇండియా సంస్థ సహకారంతో కొందరు స్త్రీల చేత ఐస్‌క్రీమ్, పీజ్జా దుకాణాలను ముఖ్యకేంద్రాల్లో తెరిపించి, ఆర్థికంగా వాళ్ళు స్వయం పోషకులుగా అయేటట్లు చేస్తున్నారు. వివిధ వ్యాపారసంస్థల సహకారంతో 200 మంది స్త్రీలకు ప్రైవేట్ హాస్పిటల్స్‌లో నర్సింగు ఉద్యోగులుగానూ, పెద్ద పెద్ద హోటళ్ళలో హౌస్‌కీపర్స్‌గానూ స్థానాలు కల్పించారు. 100 మంది స్త్రీలకు వాళ్ళ అభిరుచులు, నైపుణ్యం ప్రకారం స్వతంత్రంగా చిన్నచిన్న వ్యాపారాలు – టిఫిన్లు తయారుచేసి అమ్మడం, ఎంబ్రాయిడరీ చెయ్యడం, దుస్తులు తయారుచెయ్యడం మొదలైనవి చేసి స్వయంపోషకత్వం సాధించడం కోసం కావల్సిన చిన్న మొత్తాలను రుణాలుగా ఇచ్చే ఏర్పాటు చేస్తున్నారు ‘ప్రజ్వల’ సంస్థ నిర్వాహకులు ఇతర సంస్థల సహకారంతో.
ఎక్కడెక్కడ నుంచి బాలికల్నీ, స్త్రీలనీ అమ్మడం జరిగే అవకాశాలున్నాయో అక్కడ కన్నువేసి ఉంచి, అటువంటి వ్యాపారం జరక్కుండా చేసే 64 గ్రూపులను ఏర్పాటుచేశారు. వాటిని కమ్యూనిటీ విజిలెంట్ గ్రూప్స్ అంటారు. బాలికల్నీ, స్త్రీలనీ అమ్మే సమాచారాన్ని సేకరించి దాని గురించి వ్యతిరేకంగా ప్రచారం చేసే కార్యనిర్వహణ కేంద్రాన్ని కూడా ఏర్పాటుచేశారు. ఆ కమ్యూనిటీ విజిలెంట్ గ్రూప్స్‌కి సహకరించేందుకు 500 మంది స్త్రీలను సమీకరించారు. 2500 మంది తల్లుల సహకారంతో తల్లుల కమిటీని ఏర్పాటుచేశారు – కొత్తతరం బాలికలను ఆ దోపిడీ నుంచి నివారించేందుకు.
ఆంధ్రప్రదేశ్ ‘ఎయిడ్స్ నిరోధక సొసైటీ’ సహకారంతో 120 ప్రభుత్వ ఆసుపత్రులలో స్వచ్ఛందంగా సలహాలివ్వడానికీ, పరీక్షలు చెయ్యడానికీ 145 మంది హెచ్.ఐ.వి. సలహాదారులను ఎంపిక చేసి, ఉద్యోగాలిచ్చి, శిక్షణనిచ్చి నియమించారు. ప్రభుత్వ ఆరోగ్యశాఖ సహకారంతో ఉస్మానియా జనరల్ హాస్పిటల్లో వ్యాధినిరోధక వైద్య సలహా కేంద్రాన్ని ఏర్పరచారు మొదటిసారిగా. ఒరిస్సా రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో 190 మంది సలహాదారులకు శిక్షణనిచ్చి, పోలీసుస్టేషన్లలో స్త్రీ శిశు సంక్షేమ కేంద్రాలలో పనిచేసేందుకు నియమించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సహకారంతో పౌరసంఘాల సభ్యులు ప్రభుత్వం నిర్వహిస్తున్న బాలికా శరణాలయాల్లో నిర్వహణ బాధ్యతల్ని సంయుక్తంగా నిర్వహించే ఏర్పాటు చేశారు. ‘టచ్ రివర్ పిక్చర్స్ ప్రైవేట్ లిమిటెడ్’ వారు 10 డాక్యుమెంటరీలనూ, 4 మంది ప్రఖ్యాత వ్యక్తులచేత ప్రచార చిత్రాలను తయారుచేశారు – బాలికల, స్త్రీల అమ్మకాలకు వ్యతిరేకంగానూ, హెచ్.ఐ.వి./ఎయిడ్స్ గురించీనూ. ‘అనామిక’ అనే డాక్యుమెంటరీ చిత్రం ద్వారా 5 లక్షల మంది యువతులను చైతన్యపరచగలిగారు. ‘అపరాజిత’ అనే పేరుతో, లైంగిక వ్యాపారం నుంచి బయటపడిన స్త్రీల గురించి జాతీయ స్థాయిలో మొట్టమొదటి జాబితాని తయారుచేశారు. ఆంధ్రప్రదేశ్ పోలీస్ అకాడమీ సహకారంతో పోలీస్ ఉన్నతోద్యోగులకు స్త్రీలను అమ్మే వ్యాపారం గురించి చైతన్యం కలిగించే శిక్షణా కార్యక్రమాలను నిర్వహించారు. స్త్రీలనూ బాలికలనూ అమ్మే వ్యాపారానికి వ్యతిరేకంగా పనిచేస్తున్న వివిధ సంస్థల్లో – రాష్ట్ర స్థాయిలోనూ, జాతీయస్థాయిలోనూ ‘ప్రజ్వల’కి సభ్యత్వం ఉంది.
ఈ విధంగా అందరూ కలిసి వచ్చి పనిచేసినప్పుడే సమాజంలో పురోగతి, అభ్యుదయం సాధ్యమవుతాయని ‘ప్రజ్వల’ నమ్మకం. (2006 డిసెంబర్‌లో ‘భూమిక’ హెచ్.ఐ.వి./ఎయిడ్స్’ గురించి ప్రత్యేక సంచికని వెలువరించింది.)
బాలికలతోనూ స్త్రీలతోనూ వ్యాపారం చెయ్యడం కేవలం ఒక ప్రాంతానికి సంబంధించిన సమస్య కాదు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సమస్య. ఈ సామాజిక రుగ్మత గురించి ప్రపంచంలోని పురుషులందర్నీ చైతన్యపరచవలసిన అవసరం వుంది. స్త్రీలూ బాలికలూ ప్రలోభాలకు గురికాకుండా వాళ్ళని చైతన్యపరచవలసిన అవసరం ఉంది. స్త్రీ పురుషుల, బాలబాలికల ఆరోగ్యానికి హాని కలిగించే ఈ వ్యాపారాన్ని నివారించవలసి ఉంది. వ్యాధి వచ్చిన తరవాత జీవితాంతం వైద్యం చేయించుకోవడం కన్న వ్యాధి రాకుండా నివారణ చర్యల్ని తీసుకోవడం వివేకవంతమైన మార్గం కదా. పోస్. 04024510290 / 55704048
-
Recent Posts
Recent Comments
- Aruna Gogulamanda on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- Manasa on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- రవి పూరేటి on తండ్రి ప్రేమలు సరే… తల్లి ప్రేమలెక్కడ?-కొండవీటి సత్యవతి
- Seela Subhadra Devi on సంక్షిప్త జీవన చిత్రాలు – తురగా జానకీరాణి కథలు శీలా సుభద్రాదేవి
- Pallgiri Babaiiahh on వీర తెలంగాణ విప్లవయోధ చెన్నబోయిన కమలమ్మ -అనిశెట్టి రజిత
Blogroll
- Bhumika HelpLine Bhumika HelpLine., Helping Women across AndhraPradesh !
- Bhumika Womens Collective
- Streevada Patrika Bhumika Streevada Patrika Bhumika published by K. satyavati
November 2024 S M T W T F S 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 Meta
Tags