హేమావెంక్రటావు, నాయుడు వెంకటేశ్వరరావు, కె.జె. రామారావు
దేశవ్యాప్తంగా ప్రజలు తమ నేల, నీరు, అడవిని మొత్తంగా జీవించే హక్కు కోసం చేస్తున్న పోరాటాలపై ప్రభుత్వం పాశవికంగా విరుచుకుపడుతోంది. ఇటీవల ఆంధ్రప్రదేశ్‌లోని సోంపేటలో ఇద్దరి రైతుల ప్రాణాలను బలిగొన్నది. ఇంతేగాకుండా పొలేపల్లి, గంగవరం, కృష్ణపట్నం, సత్యవేడు కాకినాడ సెజ్ ప్రాంతాల్లో ఈ దమన కాండ కొనసాగుతూనే వుంది. ఇక్కడి ప్రజల పోరాటాలకు మద్దత్తుగా స్పందించిన కొందరు మేధావులు, సానుభూతిపరులు, ఉద్యమకార్యకర్తలు, న్యాయవాదులు రాష్ట్రస్థాయిలో ఒక ఐక్య కార్యాచరణ సంఘీభావ కమిటీగా ఏర్పడాలని అభిప్రాయపడ్డారు.
ఈ విషయమై 7.9.10న హైదరాబాద్ నిజాం కాలేజ్‌లో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసారు. దీనికి రాష్ట్రంలోని వివిధ ప్రజా ఉద్యమ కార్యకర్తలు హాజరయ్యారు. సమావేశాన్ని ప్రారంభిస్తూ న్యాయవాది సెజ్ వ్యతిరేక పోరాట నాయకురాలు హేమా వెంక్రటావు, విడి విడిగా జరుగుతున్న ప్రజాఉద్యమాలను సమన్వయ పరుస్తూ, ఉద్యమశక్తిని పెంచాల్సిన అవసరం వుందన్నారు. ఈ కమిటీ అవసరాన్ని గుర్తించి ప్రతిపాదించిన వారిలో ముఖ్యులైన నాయకుడు వెంకటేశ్వరావు (సాంప్రదాయక మత్స్య కారుల సేవా సంఘం , ప్రధాన కార్యదర్శి) వివిధ ప్రాంతాల్లో జరుగుతున్న పోరాటాల్ని వెలుగులోకి తీసుకు రావాలన్నారు. ఉద్యోగ క్రాంతి ఎడిటర్ కె. జె. రామారావు. ప్రపంచబ్యాంకు విధానాలకు తొత్తులైన పార్లమెంటరీ రాజకీయ పార్టీలు ప్రజల సమస్యల్ని పట్టించుకోవడంలో విఫలమైన ఈ తరుణంలో నిజమైన ఉద్యమ నిర్మాణాలకు మేధావుల పాత్ర ఎంతైనా అవసరం అని అన్నారు. రాష్ట్ర చేనేత జన సమాఖ్య అధ్యక్షుడు మాచర్ల మోహనరావు, ప్రైవేటీకరణ విధానాలతో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్న ప్రస్త్తుత తరుణంలో సామాజిక ఉద్యమాల ద్వారా ప్రజలను చైతన్య వంతులు చేయాల్సిన అవసరం వుందన్నారు. అయితే ఉద్యమాలలో ‘నాయకత్వం’ సమస్య ఉందని, దాన్ని దీర్షకాలిక ప్రజా ప్రయోజనాలను దృష్టిలో వుంచుకొని, ప్రజాస్వామికంగా పరిష్కరించుకోవాలని అన్నారు.
‘మత్స్యకారులు’ మాసపత్రిక సంపాదకులు గంటా పాపారావు, ప్రైవేటీకరణ దిశగా చట్టాలను సమూలంగా మారుస్తూ ప్రభుత్వం , ప్రజల ఉమ్మడి సామాజిక ప్రయోజనాలకు తిలోదకాలు ఇచ్చిందన్నారు. అభివృద్ధి పేరుతో ప్రభుత్వాలు చేస్తున్న ‘సెజ్’ లాంటి చట్టాల గురించి ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అవసరం వుందన్నారు. పర్యావరణానికి, ప్రజల ఉపాధి అవకాశాలకు తీవ్రమైన విఘాతాన్ని కల్పిస్తున్న ‘సెజ్’ ప్రత్యేక ఆర్థ్ధిక మండళ్ళు)లను వ్యతిరేకించాలన్నారు. సమకాలీన ఉద్యమాల్లో వర్గ ప్రయోజనాలే అధిక ప్రాధాన్యం వహిస్తున్నాయి. కాని వాటితోపాటు ప్రాంతీయ, అస్తిత్వ సమస్యలను కూడా పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం వుందన్నారు.
ఆంధ్రా యూనివర్సిటీ ఆచార్యుడు మరియు మత్స్యకారుల రిజర్వేషన్ తీవ్ర పోరాట సమితి అధ్యక్షుడు మెరుగు సత్యనారాయణ ”తీరంలో సాంప్రదాయ మత్స్యకారులు చాలా దయనీయమైన పరిస్థితుల్లో ఉన్నారన్నారు. అభివృద్ధి పేరుతో వీరు ఆధారపడి బ్రతుకుతున్న వనరుల నుండి వారిని వేరు చేయడం వల్ల మత్స్యకారులు దిక్కు తోచని స్థితిలోఉన్నారు. రాజకీయ పార్టీలు ప్రజా ఉద్యమాలను అణచివేయ ప్రయత్నిస్తున్నాయి. డబ్బులు, ఉపాధి ఎరతో పాలకులు ప్రజలను నిర్వీర్వం చేస్తున్నారు. ఈ సమస్యలను అధిగమించడానికి నిజాయితీ కలిగిన నాయకత్వం అవసరం. నిర్మాణాత్మకమైన వ్యవస్థ, కార్యకర్తల ఆశయాలకు తగిన ప్రచారం అవసరమని” తెలియచేశారు. తెలంగాణ ఉద్యమ కార్యకర్త విమల ”తెలంగాణా పోరాటం వనరులపైన స్వయం నిర్ణయాధికారానికి చేస్తున్న పోరాటం. ఆ పోరాటానికి సృష్టత ఉంది. అదే సందర్భంలో ఎక్కడ ప్రజలు వనరులపైన ఉపాధి, స్వయం నిర్ణయాధికారానికి పోరాటం చేస్తున్నారో వారికి మా మద్దతు ఉంటుందన్నారు. ఉద్యమం సఫలం కావాలంటే సమస్యలపైన స్పష్టమైన అవగాహన ఉండాలి. దానికి పీపుల్స్ సాలిడారిటీ కమిటీ వంటి వేదిక అవసరమని అభిప్రాయపడ్డారు.
తెలంగాణ బెస్త సేవా సంఘం అధ్యక్షుడు పూస బాలకిషన్, ‘సమస్య ముదిరిన తరువాత ఆలోచిస్తున్నాం. ప్రభుత్వం కూడా పాశవికంగా ఉద్యమాలను అణచిపెట్టుడానికి ప్రయత్నిస్తుంది తప్ప ప్రజలు ఆలోచనలు, వారి బాధలు గురించి ఆలోచించడం లేదు. ఉద్యమాలలో ప్రజలను చంపి వారి ప్రాణాలకు వెలకట్టడం చాలా శోచనీయమన్నారు. ఈ దశలో ప్రజా పోరాటాల అవసరం, దానితో పాటు ప్రజల మద్దతు కూడగట్టటానికి తగిన ప్రచారం కూడా ఉండాలన్నారు.
సెంటర్ ఫర్ ఎకనామిక్ సోషల్ స్టడీస్ ఆచార్యుడు ‘అరుణ్ పట్నాయక్’ చైతన్యవంతమైన ప్రజాపోరాటాలు ”ప్రస్తుత తరుణంలోప్రజల బాధలకు సమస్యలకు ఊరట కలిగించగలవు. దానికి మేధావులు తీవ్రంగా కృషిచేయలన్నారు.
బొల్గారం గంగపుత్ర సంఘం కార్యదర్శి పూస అమరానంద్ ”అభివృద్ధి పేరుతో అణిచివేతకు గురవుతున్న వారికి, వారి ఉద్యమానికి మద్దతు అవసరం వుంది. ఇందులో భావావేశానికి తావు ఉండకూడదు. దానికి బలమైన సంకల్పం అవసరం. అధికార కేంద్రంగా జరుగుతున్న రాజకీయాలు వ్యవస్థను భ్రష్టుపట్టిస్తున్నాయి. ఎక్కడ ప్రజలపై అణిచివేత చర్యలు, జరిగినా వాటిని ‘సుమెంటా’గా స్వీకరించి కేసులు నడిపే వ్యవస్థ రూపుదిద్దుకోవాలి. దానికి అవగాహన ఉన్న న్యాయవాదులు సహకరించాలి.
భూమిక మాస పత్రిక సంపాదకురాలు కొండవీటి సత్యవతి ప్రజా ఉద్యమాలకు రచనా వ్యాసంగం, విషయ సేకరణ తద్వారా ప్రజలలో అవగాహన కల్పించడానికి రచనలు కరపత్రాలు అవసరమెంతైనా ఉంది. పోరాటాలలో స్త్రీలు ముఖ్య భూమిక పోషిస్తున్న దృష్ట్యా తమ పత్రిక వారిని చైతన్య వంతులను చేయడానికి కృషి చేస్తుందన్నారు. దీనితో పాటు ఇంగ్లీషు భాషలో ఉన్న చట్టాలను ప్రజలు అర్థం చేసుకోవడానికి వాటిని తర్జుమా చేసే కార్యక్రమం చేపట్టాలన్నారు. ఈ ఉద్యమంలో పనిచేస్తున్న వారు గ్రూప్ ఇ మెయిల్ నెట్‌వర్క్ అభివృద్ధి చేసుకుంటే విషయాలను పరస్పరం ఇచ్చి పుచ్చుకోవచ్చని, నిరంతరం సమాచార మార్పిడికి సమాచార వ్యవస్థను నిర్మించుకోవాలన్నారు.
ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆచార్యుడు కె. శ్రీనివాసులు ‘నయా ఉదార వాదం, ప్రజావ్యతిరేక విధానాలు, నిర్వాసిత సమస్య రాను రాను దేశంలో పెరిగిపోతుందన్నారు. రాజ్యం ఎడల ప్రజా వ్యతిరేకత విషయమై 12 సంవత్సరాల క్రితం జరిపిన సర్వేలో ప్రజలు 21% మాత్రమే రాజకీయ పార్టీల పట్ల నమ్మకం వుందన్నారు. 70 % న్యాయవ్యవస్థపై 74% మంది ఎలక్షన్ కమీషన్ పైన నమ్మకం ఉందన్నారు. సమస్యలు జటిలమవుతున్న వాటిపట్ల స్పందన, ఉద్యమాలకు సంఘీభావం తెలపటం మాత్రం నామమాత్రంగానే ఉంటుంది. కాకినాడ సెజ్, సోంపేట ఉద్యమాలకు తగినంత న్యాయసహాయం, విధాన నిర్ణయాల మద్దతు లభించలేదు. వీటిని దృష్టిలో ఉంచుకొని అవసరమైన మద్దతు అందించాల్సిన అవసరం ఉందన్నారు.
గంటా పాపరావు ”ప్రభుత్వంలో రెవెన్యూ, రాజకీయ నాయకులు ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబించి పోలీసు వ్యవస్థతో పాటు అణచివేత విధానాలకు పాల్పడుతున్నాయి. చట్టాలను ప్రశ్నించే న్యాయసహాయం, సలహాలు యిచ్చే యంత్రాంగం అవసరం ఉంది. ఉద్యమాలకు మద్దతు పేరిట స్వచ్ఛంద సంస్థలకు 20% నుండి 30 % ప్రపంచ బ్యాంకు నిధులు అందుతున్నాయి. అందువలన ఆ సంస్థలు లోపాయికారిగా ప్రపంచ బ్యాంకు విధానాలకు మద్దతు పలుకుతూ ప్రజా ఉద్యమాలకు దెబ్బ తీస్తున్నాయి. వీటిపై అప్రమత్తత అవసరమన్నారు. నల్గొండ జిల్లా యురేనియం ప్రాజెక్టు వ్యతిరేక ఉద్యమకారుడు పాండు రంగారావు ‘ఉద్యమంలో ప్రజలకు నమ్మకం కలిగించే నాయకత్వం అవసరమన్నారు. జాతీయ ప్రజా ఉద్యమాల సమస్యలు కమిటీ రాష్ట్ర కన్వీనరు కృష్టంరాజు రాయలసీమ ప్రాంతం నుంచి పోరాటాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రతినిధులతో సంప్రదించి వారిని కమిటీలోకి తీసుకు రావాలని అభిప్రాయపడ్డారు. నిజాం కాలేజీ ప్రిన్సిపాల్ ప్రొ. అశోక్‌గారు సంఘీభావ కమిటీ కార్యక్రమాలకు చారిత్రాత్మకమైన నిజాం కాలేజీ ఆవరణను ఉపయోగించుకునేందుకు పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని కమిటీకి తమ మద్దతు తెలియచేసారు.
అనంతరం సభ్యులందరూ కమిటీ నిర్మాణానికి తమ ఆమోదాన్ని తెలిపారు. మెజారిటీ సభ్యుల ఆమోదం మేరకు ‘సంఘం పేరును ‘ప్రజా ఉద్యమాల సంఘీభావ కమిటీ’గా ప్రకటించడం జరిగింది. రాష్ట్రంలో నెలకొన్న కుంభ పోత వర్షాల పరిస్థితి వలన కొన్ని ప్రాంతాల నుండి ఉద్యమ కార్యకర్తలు రానందువలన పూర్తిస్థాయి కమిటీగా కాక తాత్కాలిక కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కమిటీలో హేమావెంక్రటావు, నాయుడు వెంకటేశ్వరరావు, గంటా పాపరావు, పాండురంగారావు, విమల, ఆచార్య కె.శ్రీనివాసులు, కె.జె. రామారావు, మాచర్ల మోహనరావు, టి. రామారావు, కె. సత్యవతి, మధు కాగుల, రామకృష్ణంరాజు గార్లు తాత్కాలిక కమిటీ నిర్వాహక సభ్యులుగా ఎన్నుకోబడ్డారు.
కమిటీ అక్టోబరులోగా ఒక సెమినార్ నిర్వహించాలని నిర్ణయించింది. ఆ సందర్భంలోగా కమిటీ యొక్క లక్ష్యం విధి విధానాలు మొదలగు విషయాలపై చర్చ జరగాలని సభ్యులు సూచించారు. అదే విధంగా ఆంధ్ర ప్రదేశ్ ఇన్‌ఫ్రా స్ట్రక్చర్ ఎనేబ్లింగు ఆక్ట్ తర్జుమా చేయాలని, గ్రూపులు మెయిల్ క్రియేట్ చెయ్యాలని నిర్ణయించడం జరిగింది.
-
Recent Posts
Recent Comments
- Aruna Gogulamanda on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- Manasa on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- రవి పూరేటి on తండ్రి ప్రేమలు సరే… తల్లి ప్రేమలెక్కడ?-కొండవీటి సత్యవతి
- Seela Subhadra Devi on సంక్షిప్త జీవన చిత్రాలు – తురగా జానకీరాణి కథలు శీలా సుభద్రాదేవి
- Pallgiri Babaiiahh on వీర తెలంగాణ విప్లవయోధ చెన్నబోయిన కమలమ్మ -అనిశెట్టి రజిత
Blogroll
- Bhumika HelpLine Bhumika HelpLine., Helping Women across AndhraPradesh !
- Bhumika Womens Collective
- Streevada Patrika Bhumika Streevada Patrika Bhumika published by K. satyavati
November 2024 S M T W T F S 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 Meta
Tags
మంచి ప్రయత్నం.
అభినందనలు.
సత్యవతి గారు,
“ఇంగ్లీషు భాషలో ఉన్న చట్టాలను సత్వరమే తెలుగు భాష లోకి తర్జుమా చేయాల్సిన అవసరమున్నది.”
మీ ఈ సూచన చాలా విలువైనది.
`భూమిక` తరఫున ఈ విషయంలో హైకోర్టులో ఒక ప్రజా ప్రయోజనాల వ్యాజ్యాన్ని దాఖలు చేయగలరా?
(రామనర్సింహ, నల్లగొండ)