ఎ. అంజన్ కుమార్
(భూమిక నిర్వహించిన కథ/వ్యాస రచన పోటీల్లో రెండవ బహుమతి పొందిన వ్యాసం)
ఆమె లేకపోతే రోజు గడవదు. ఆమె లేనిదే ప్రపంచానికి పుట్టుక లేదు. అవనికి, ఆమనికి అన్నింటికి ఆమె పర్యాయపదం. నిన్నటి అవస్థలను తట్టుకుని నేటి అభివృద్ధికి దారులు వేస్తున్న మహిళ గురించి చెప్పుకోడానికి ఒక్కరోజు చాలదు. ఆమెను స్మరించుకోవడానికి ఒక్క జీవితం చాలదు. ఈ మాటను మరోసారి మనస్పూర్తిగా చెప్పడానికి ఈ నూరు వసంతాల మహిళా దినోత్సవం ఒక సందర్భం.
మార్చి 8 మహిళల హక్కుల సాధనకు స్పూర్తినిచ్చిన రోజు. 103 ఏళ్ల క్రితం న్యూయార్క్ నగరంలో ఒక ఊరేగింపు జరిగింది. కుట్టుపని చేసే మహిళా కార్మికులు పనిగంటలు తగ్గించాలని సమాన వేతనం ఇవ్వాలని కోరుతూ నిర్వహించిన ప్రదర్శన అది. అస్తిత్వ పోరాటంలో భాగంగా మహిళలు తొలిసారిగా ప్రదర్శన నిర్వహించిన మార్చి 8వ తేదీని ‘అంతర్జాతీయ మహిళా దినోత్సవం’ గా పాటిస్తున్నారు.
సాధికారత అంటే స్వావలంబన, స్వయం నిర్ణయాధికారం. ఇది ప్రతి స్త్రీలో నిబిడీకృతమై ఉంటుంది. కానీ ఈ నిర్ణయాధికారాన్ని పురుషాధిక్యత అణచివేస్తోంది. నేటి సమాజంలో అన్నిరంగాల్లో పురుషులతో స్త్రీలు పోటీ పడుతున్నారు. అనితర సాధ్యమైన విజయాలు సాధిస్తున్నారు. ప్రభుత్వ అధినేతలై దేశాలను పాలిస్తున్నారు. పారిశ్రామిక వేత్తలుగా ఆర్థికాభివృద్ధికి తోడ్పడుతున్నారు. అయితే వ్యక్తిగత జీవితంలో ఆధునిక మహిళ సంపూర్ణ స్వయం నిర్ణయాధికారాన్ని కలిగివున్నదా? అన్ని రంగాలలో స్త్రీ ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది. ఆమెకు గౌరవ మర్యాదలు పెరుగుతున్నాయి. అయినా ఆమె అంతరంగిక భావాలకు సరైన గుర్తింపు, గౌరవం ఉన్నాయని చెప్పలేముకదా. ఎవరిజీవితాన్ని వారు తమ భావాలను అనుగుణంగా తీర్చిదిద్దుకునే హక్కు పురుషులకు ఉన్నపుడు ఆ హక్కు స్త్రీలకు మాత్రం ఉండనక్కరలేదా? కోట్లాది మహిళలు ఆ హక్కుకు కనీసస్థాయిలో కూడా నోచుకోలేదన్న కఠోరసత్యాన్ని అంతర్జాతీయ మహిళాదినోత్సవం సందర్భంగా మనం తప్పక గుర్తు చేసుకోవాలి.
2000 సంవత్సరాన్ని ఐక్యరాజ్యసమితి ‘మహిళా సాధికారత సంవత్సరం’ గా ప్రకటించింది. ఆధునిక మహిళ సంప్రదాయపు కట్టుబాట్లు సడలించుకుంటుంది. ఉపాధి, విద్య, వైద్య పారిశ్రామిక రంగాలన్నింటిలోను అగ్రస్థానాల్లో నిలబడుతోంది. ఎయిర్ హోస్టెస్ నుంచి ఎవరెస్టు శిఖరారోహణ వరకు, క్రీడాకారిణి నుంచి రక్షణాధికారి వరకు, పంతులమ్మ నుంచి సిఇవో స్థాయి వరకు ఏ రంగంలోనైనా మహిళా ప్రభావం లేని చోటు కనపడదు. మహిళ సవ్యసాచిలాగా అటు వ్యక్తిగత జీవితం ఇటు వృత్తి జీవితం రెండింటినీ నిర్వహిస్తుందని అనేక అధ్యయనాల్లో వెల్లడయ్యింది.
మహిళా సాధికారత అనేది ఇప్పుడు ప్రపంచం మొత్తం అర్థం చేసుకుంటున్న పరిణామం. ఆహ్వానిస్తున్న పరిణామం కూడా. 1995 నాటికల్లా ప్రపంచంలోని పార్లమెంట్లలో కనీసం 30 శాతం మహిళా సభ్యులు ఉండాలని ఐక్యరాజ్యసమితి ఆర్థిక, సామాజిక మండలి ఏనాడో పిలుపునిచ్చింది. కానీ ప్రపంచం మొత్తం పార్లమెంట్లలో మహిళలు సాధించుకున్న స్థానాలు కేవలం 18 శాతమని ఐక్యరాజ్యసమితి రెండేళ్ల క్రితం ఒక సందర్భంలో పేర్కొంది. 1995-2008 మధ్యకాలంలో వచ్చిన మార్పులనుబట్టి చూస్తే ఈ పెరుగుదల 60 శాతమని అర్ధం చేసుకోవచ్చు. 54 దేశాల పార్లమెంట్లకు ఎన్నికైన సభ్యుల వివరాలు చూసిన తరువాత ఇంటర్ పార్లమెంటరీ యూనియన్ 1995లో 11.3 శాతం ఉన్న మహిళా ప్రాతినిధ్యం, 2008 నాటికి 18.3 శాతానికి పెరిగినట్టు తేల్చింది. ఏమైనా దేశ అత్యున్నత శాసననిర్మాణ సభలలో పురుషులతో స్త్రీలు కూడా సమాన హోదా పొందాలంటే ఇంకా చాలా సమయం పడుతుందని యూనియన్ ఒక నివేదికలో వెల్లడించింది. అంటే రాజకీయాలలో మహిళల ప్రవేశానికి ఇప్పటికీ ఎన్ని అడ్డంకులు ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. అయినా అత్యున్నత శాసన నిర్మాణ వ్యవస్థల్లో మహిళలకు సమహోదా ఇచ్చే విషయంలో వస్తున్న మార్పు మాత్రం విప్లవాత్మకమేననిపిస్తుంది. ఆఫ్రికాలో నిరంతరం సంఘర్షణలతో మనుగడ సాగించే రువాండా కూడా ఈ విషయంలో ముందంజ వేసింది. అక్కడ 50 శాతం స్థానాలు స్త్రీలకు కేటాయించారు. 1992 తరువాత మళ్లీ ఇన్నాళ్లకు (2008) అంగోలాలో ఎన్నికలు జరిగినా 37 శాతం మహిళలు పార్లమెంట్‌కు ఎన్నిక కాగలిగారు. మొజాంబిక్, దక్షిణాఫ్రికా, నమీబియా, టాంజానియా దేశాలు 25 శాతం మహిళా సభ్యులను ఎన్నుకున్నాయి. లాటిన్ అమెరికాలోని క్యూబా, గ్రెనెడా కూడా చాలా పురోగతి సాధించాయి. అమెరికాలో కూడా ఎగువ, దిగువ సభలలో సగటున పదిహేడు శాతం మహిళలకు చోటు లభించింది. అయినా అమెరికా మహిళలకు దక్కిన ఈ ప్రాతినిథ్యం ప్రపంచ పార్లమెంట్‌ల్లో కన్పించే మహిళా ప్రాతినిధ్యం కంటే తక్కువే.
ఇంటర్ పార్లమెంటరీ యూనియన్ నివేదికలో ఇంకొన్ని కీలకాంశాలు కూడా ఉన్నాయి. స్వీడన్, ఫిన్లాండ్, నెదర్లాండ్స్ ఐరోపాలు మహిళలకు చట్టసభల్లో స్థానం ఇచ్చిన తొలితరం దేశాలుగా పేరుపడ్డాయి. బేలారస్, స్పెయిన్, మాసిడోనియా, మొనాకో, ఫ్రాన్స్ ఎగువసభ ఒక పద్ధతి ప్రకారం మహిళా ప్రాతినిధ్యం తగ్గుతుంది. అయితే గడిచిన పదిహేను సంవత్సరాలుగా ఆసియా మాత్రం ఈ విషయంలో బాగా వెనుకబడింది. ఇక్కడి దేశాలలో సగటున 17.8 శాతం మాత్రమే మహిళలు పార్లమెంట్లలో అడుగుపెడుతున్నారు. మన పొరుగున ఉన్న నేపాల్ పార్లమెంట్‌లో 32.8 శాతం స్థానాలను మహిళలు గెలుచుకున్నారు. ఇది గరిష్ట సంఖ్య కాగా, కనిష్టంగా ఇరాన్ పార్లమెంట్ కేవలం 2.8 శాతం మహిళా సభ్యులకు చోటు ఇచ్చింది. మొత్తం అరబ్ పార్లమెంట్లలో మహిళలకు దక్కిన స్థానాలు 9 శాతం. భారత్‌కు అటు ఇటు ఉన్న పాకిస్థాన్‌లో 22 శాతం బంగ్లాలో 14 శాతం మహిళలు పార్లమెంట్‌లో స్థానం సంపాదించారు.
మన భారత పార్లమెంట్‌లో మహిళలకు లభించిన స్థానాల శాతం స్థిరంగా లేదు. 1952 నాటి తొలి లోక్‌సభలో 4.4 శాతం (మొత్తం 499 స్థానాలలో 22 మహిళలు గెల్చారు). 2009 నాటి పదిహేను లోక్‌సభలో 10.1 శాతం (543 స్థానాలలో 59 మంది మహిళలు ఉన్నారు) వారికి లభించాయి. రాజ్యసభలో 1952-2002 మధ్య గణాంకాలు చూస్తే మొత్తం 160 మంది మహిళలకు సభ్యత్వం లభించిన సంగతి గమనించవచ్చు. ప్రస్తుతం పెద్దల సభలో మహిళల సంఖ్య 25. అయితే ఒక్క 1980 సంవత్సరంలోనే అత్యధికంగా 29 మంది రాజ్యసభకు వచ్చారు. ఒక్క భారతదేశంలోనే కాదు. ఏ దేశంలో అయినా మహిళలకు సంబంధించిన హక్కులు సాధించుకోవడానికి పెద్ద ఉద్యమాలే అవసరమైనాయి. నిజానికి ఇక్కడైతే సంస్కరణ అంటే మహిళా జనోద్థరణకు మారుపేరుగా కూడా కన్పిస్తుంది. రజస్వలానంతర వివాహాలు, చదువుకునే హక్కు, ఉద్యోగం, ఆస్తి హక్కు ఇవన్నీ సాధించడానికి కొన్ని శతాబ్దాలు పట్టింది. కానీ విజయం సంస్కరణలదే అయింది. ఇప్పుడు కూడా అంటే చట్టసభల్లో రిజర్వేషన్ ఒక ముందడుగే అయినా, అంతకంటే ముందు ఇప్పటికి సాధారణ మహిళలకు అందుబాటులోకి రాని సౌకర్యాలు ఎన్నో ఉన్నాయి. ముఖ్యంగా గ్రామీణ ప్రాంత మహిళ పరిస్థితి దుర్భరంగా ఉంది. పౌష్టికాహారం, విద్య, ఆరోగ్యం వంటివి మహిళలకు అత్యవసరం.
శతాబ్దకాలంలో మహిళ సాధించిన విజయాలు, అద్భుతాలు అపారం. స్వేచ్ఛాగీతం పాడుతూ, స్వావలంబన సాధించేందుకు ఆమె నిత్యసమరం సాగిస్తోంది. ఇందిరాగాంధీ, సునీతా విలియమ్స్, ఇంద్రానూయి, కరణం మల్లీశ్వరి వంటి నలుగురు లేదంటే నాలుగువందల మంది నిజంగా విజయం సాధించారు సరే. మరి మిగిలిన వాళ్ల మాటేమిటి? ఆకాశంలో సగం అంటూ నినాదాలిస్తున్న మనకు ఈ నాలుగు లేదంటే నలభై విజయాలు సరిపోతాయా? మన సమాజంలో 90 శాతం మంది మహిళలు బతుకు వెళ్లదీయడానికే పోరాటం చేయాల్సివస్తుంటే తమ అస్తిత్వాన్ని చాటేదెన్నడు? వందేళ్ల పరిణామాన్ని ఒక్కసారి అవలోకిస్తే జయించిన స్త్రీల కంటే సమరం సాగిస్తున్న వాళ్లే ఎక్కువ. అందుకే నలభైమంది కాదు నలభై కోట్లు సామాన్య స్త్రీల ముఖాల్లో కూడా నవ్వుల పువ్వులు పూసిననాడే మహిళ నిజంగా విజయం సాధించిందనాలంటున్నారు అన్ని తరాల మహిళలు.
పంచాయితీల్లో మహిళలకు ముప్పై మూడు శాతం సీట్లు రిజర్వు చేయడం తెల్సిందే. పంచాయితీరాజ్ వ్యవస్థలో ఎంపికయ్యే మహిళల్లో ఎంతమంది స్వతంత్రంగా వ్యవహరిస్తున్నారు? ఇప్పటికే వారి భర్తలు లేదా సమీప బంధువులే అంతా తామై వ్యవహరించటం లేదా? భార్యల పేరుతో అధికారం చెలాయించే భర్తలు ఎంత మంది లేరు!
స్త్రీలు ఎదుర్కొంటున్న సమస్యలకు పురుషులే కారణమని చెబుతున్నా పురుషులంతా ఆ కోవలోని వారేనని చెప్పలేం. మన సమాజంలో మహిళలు విద్యనభ్యసించి అనేకరంగాల్లో రాణిస్తున్నారంటే అందుకు కారణం కందుకూరి, గురజాడ వంటి పురుషులు కాదా? స్త్రీ జనోద్దరణకు అసమాన కృషిచేసిన మాన్యుడు కందుకూరి స్త్రీల అభివృద్ధిని కాంక్షిస్తూ ప్రత్యేకంగా స్త్రీలకోసం పత్రికలు స్థాపించారు. బాల్యవివాహాల్ని జరిపించారాయన. ఇక సమాజ గమనాన్ని కుంటుపరుస్తోన్న మూఢనమ్మకాల్ని తొలగించడానికి సాహిత్య సృజన ద్వారా ప్రయత్నించిన మహానీయుడు గురజాడ. స్త్రీలకు మహోన్నత స్థానాన్ని ఇవ్వాలని వారు మనకు ఉద్బోధించారు. సతీసహగమనాన్ని నిషేధించే చట్టం అమలులోకి తీసుకురావడానికి నాటి బ్రిటీష్ ప్రభుత్వంపై ఒత్తిడితెచ్చి ఆ దురాచారాన్ని రూపుమాపిన ఉదాత్తుడు రాజా రామమోహన్‌రాయ్. మరి ఆ మహనీయుల మనసులకు వారసులుగా నేడు ఎంతమంది కనిపిస్తున్నారు? స్త్రీకి సముచిత స్థానాన్ని ఇచ్చి గౌరవించాలని చిత్తశుద్ధితో అభిలాషించేవారు ఎంతమంది? భార్యలపై అమానుషంగా ప్రవర్తించే పురుషులు అసంఖ్యాకంగా ఉండడం వల్లే స్త్రీలోకానికి ఇన్ని సమస్యలు ఇన్ని వేదనలు.
మహాత్మాగాంధీ దృష్టిలో స్త్రీ ”అహింసాచిహ్నం”. స్త్రీలు అర్ధరాత్రి సమయంలో కూడా నిర్భయంగా తిరగగలిగినపుడు నిజమైన స్వాతంత్య్రం వచ్చినట్టు ఆయన అన్నారు. అర్ధరాత్రి మాట దేవుడెరుగు పట్టపగలు కూడా స్త్రీలు ఒంటరిగా తిరగలేని దౌర్భాగ్యపుస్థితి మన సమాజంలో ఉన్నదన్న వాస్తవాన్ని ఎవరు కాదనగలరు? ఈ పరిస్థితులు పోవాలంటే పురుషుల హృదయాల్లో మార్పు రావాలి. చట్టాలవల్ల, కఠినచర్యలవల్ల మార్పు తీసుకురాలేం. న్యాయస్థానాలు కఠినశిక్షలు వేస్తున్నా ఏదో ఒకచోట స్త్రీలపై అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి. మానవత్వం పరిమళించే పురుష హృదయాల సంఖ్య ఎక్కువైతేనే స్త్రీల స్థితిగతుల్లో శాశ్వత ప్రగతి కనిపిస్తుంది.
మనదేశంలో ఏటా దాదాపు 40 లక్షల మంది బాలికలు. యువతులు వ్యభిచార కూపంలోకి నెట్టివేయబడుతున్నారు. ప్రతీ ముగ్గురు మహిళల్లో ఒక స్త్రీ శారీరక హింసకు గురవుతోంది. ప్రతి 34 నిమిషాలకు ఒక స్త్రీ అత్యాచారానికి గురవుతోంది. ప్రతి 43 నిముషాలకు ఒక స్త్రీ లైంగిక వేధింపులకు గురౌతుంది. ప్రతి 93 నిముషాలకు ఒక స్త్రీ వరకట్న హత్యకు బలవుతోంది. అత్యాచారానికి గురవుతున్న మహిళల్లో 25 శాతం మంది 16 ఏళ్లలోపు బాలబాలికలే. ఇదేలాంటి మహిళా సాధికారత?
భారతదేశ ప్రథమపౌరురాలు మహిళ, భారతదేశాన్ని పాలిస్తున్న యుపిఎకు చైర్‌పర్సన్‌గా ఒక మహిళ, లోక్‌సభ స్పీకర్‌గా ఒక మహిళ ఉన్నపుడే మహిళలకు న్యాయం జరగకపోతే ఇక ఎప్పుడూ జరగకపోవచ్చు. కుటుంబ పాలనలోనే కాదు ప్రభుత్వ పాలనలో కూడా మహిళలు తమదైన ముద్ర వేసే రోజు దగ్గర్లోనే ఉంది. రాజకీయాల్లో మగవారికి తాముతీసిపోమని మహిళలు ఎప్పుడో నిరూపించారు. ఇందుకు దివంగత ప్రధాని ఇందిరాగాంధీయే నిదర్శనం. ఇందిరాగాంధీని స్ఫూర్తిగా తీసుకుని ఎందరో మహిళలు రాజకీయాల్లోకి వచ్చారు.
చట్టసభలలో 33 శాతం మహిళా రిజర్వేషన్ ఆలోచన చాలా దూరం ప్రయాణించింది. గమ్యం చేరకుండా ఆపడం ఇక ఎవరికీి సాధ్యం కాకపోవచ్చూ. అయితే ఇంత చరిత్రాత్మక మార్పును ఈ ప్రజాస్వామిక యుగంలో అందరి ఆమోదంతో తీసుకువస్తే పార్లమెంట్ సగౌరవంగా ఆమోదిస్తే ఈ చట్టం మరింత ఫలవంతంగా పనిచేస్తుంది. ఈ విషయంలో రువాండా, నమీబియా వంటి దేశాలను ఆదర్శంగా తీసుకోవడం అవసరం. ఎంత సంఘర్షణ ఉన్నా కాలానికి అనుగుణమైన మారక్పు విషయంలో ఆ దేశాలు తాత్సారం చేయకుండా మహిళలకు హక్కులను ఇచ్చాయి. ఇక్కడైనా వెనుకబడిన వర్గాల ప్రాధాన్యం క్రమంగా సాధించుకున్నది. మహిళా ప్రాతినిధ్యం విషయంలో దీనిని ఇంకాస్త ముందే సాధించుకునే అవకాశాలే ఎక్కువ.
ఒకప్పుడు మనదేశంలో మహిళలు ఇంట్లో నుండి బయటకు రాకపోవడమే కాదు. అసలు ఓటుహక్కు, చదువుకునే హక్కు కూడా ఉండేవి కావు. సమాజంలో సమానత మృగ్యం. వారు నేడు అంతరిక్షంలో మహిళాశక్తిని చాటగలుగుతున్నా వారికి పూర్తిస్థాయిలో న్యాయం జరగడం లేదు. ఇందుకు కారణం మహిళలు పూర్తిస్థాయిలో చైతన్యవంతులు కాలేదని భావించాలి. అలాగే సమాజంలో పురుషాధిక్య ధోరణే వర్ధిల్లుతూనే ఉంది. తప్పు చేశారంటూ స్త్రీలను మాత్రమే భూతద్దంలో చూసే మన సమాజం ‘తప్పు’కు లింగభేదం లేదని గుర్తించడం లేదు. ఈ పరిస్థితి మారేందుకు మొదట మహిళల్లో చైతన్యం రావాలి. పురుషుల్ని చైతన్యపరచాలి. అప్పుడే స్త్రీలపై జరుగుతున్న హింసలన్నింటిని అడ్డుకోవచ్చు. మెరుగైన సమాజం కోసం స్త్రీ సాధికారత కోసం ప్రభుత్వాలు, స్వచ్ఛందసంస్థలు, ప్రజాసంఘాలపై రాజకీయపార్టీలు, మహిళా సంఘాలు విశేషకృషి చేయాల్సి ఉంది. అప్పుడే మహిళలకు పూర్తి భద్రతను, ఆత్మగౌరవాన్ని, స్వేచ్ఛను సాధికారతను కల్పించడం సాధ్యపడుతుంది.
శతాబ్దాలుగా అణగారి పురుష సమాజరథం కాడిని మోసేందుకు పరిమితమై అన్ని రకాల స్వేచ్ఛలకు వికాసాలకు దూరమైపోయిన భారతీయ మహిళలకు చట్టసభలలో 33 శాతం కాదు, 50 శాతం కోటా లభించవలసి ఉంది.
మహిళాభివృద్ధి కోసం అర్థవంతమైన పెట్టుబడులు పెట్టాలన్నది ఐక్యరాజ్యసమితి లక్ష్యం. చట్టపరమైన రక్షణలు పెంపొందించడం, అంతర్జాతీయంగా, మహిళాభ్యుదయం పట్ల మద్దతును సమీకరించడం, మహిళలు నేరుగా సహాయమందించడం మొదలైనవి సమితి లక్ష్యాలుగా ఉండడం స్త్రీలకు ఎంతో ప్రోత్సాహకరమైన విషయం. ఏమైనా మన సమాజంలో మహిళాసాధికారత నిజంగా సిద్ధించాలంటే ప్రభుత్వాలు, ప్రజలు చిత్తశుద్ధితో మరింత కృషి చేయాల్సిన అవసరమెంతైనా ఉంది.
ఆమె ఈ జగంలో సగపాలు. పాలిచ్చి, మురిపాలిచ్చి, లాలించే ఆమె పాలించే పగ్గాలు అందుకోవడంలో అర్ధభాగంకోసం లేదా అర్థవంతమైన భాగం కోసం అనాదిగా పోరాడుతూనే ఉంది. అయితే శత వసంతాల అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగానైనా ఆ కల సాకారమవుతుందని ఆశిద్దాం.
-
Recent Posts
Recent Comments
- Aruna Gogulamanda on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- Manasa on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- రవి పూరేటి on తండ్రి ప్రేమలు సరే… తల్లి ప్రేమలెక్కడ?-కొండవీటి సత్యవతి
- Seela Subhadra Devi on సంక్షిప్త జీవన చిత్రాలు – తురగా జానకీరాణి కథలు శీలా సుభద్రాదేవి
- Pallgiri Babaiiahh on వీర తెలంగాణ విప్లవయోధ చెన్నబోయిన కమలమ్మ -అనిశెట్టి రజిత
Blogroll
- Bhumika HelpLine Bhumika HelpLine., Helping Women across AndhraPradesh !
- Bhumika Womens Collective
- Streevada Patrika Bhumika Streevada Patrika Bhumika published by K. satyavati
November 2024 S M T W T F S 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 Meta
Tags
మీ వ్యాసం చాలా బాగుంది.
అభినందనలు.
జయించిన స్త్రీల కంటే సమరం చేస్తున్నవాళ్లే ఎక్కువ అనడం నిజం.తమని తాము నిలబేట్టుకోవడానికే నరకయాతనలు పడుతున్నారు మహిళలు.స్త్రీలు పురుషులు శాస్త్రీయం గా ఆలోచించగలిగినఫుడే ఎదైనా సాధ్యమవుతుంది.బాధల్లో ఉన్న మహిళల గురించి మొదట గా ఆలోచించింది
మాత్రం మహానుభావులైన పురుషులే!మంచి వ్యాసం రాసిన మీకు ధన్యవాదాలు!