డా|| కె. సీత
మేము ఈ వేసవి సెలవులల్లో సిమ్లా వెళ్ళి అక్కడనుండి సట్లెజ్ నదీప్రవాహం వెంబడి సాగిన సాంగ్లా, కిన్నూర్, కైలాష్, కాల్పా టూర్ చేయాలని నిశ్చయించుకున్నాము.
సిమ్లా హిమాచల్‌ప్రదేశ్ ముఖ్య పట్టణం. శలవులు కావడంతో సిమ్లా అన్ని హిల్‌స్టేషన్స్ మాదిరిగానే బాగా రద్దీగా ఉంది. అనేకసార్లు సిమ్లా వెళ్ళడం వలన కూడా ఆ ప్రదేశం మమ్మల్ని అంతగా ప్రభావితం చేయలేదు. మేము వెళ్ళాలనుకున్న ఈ ప్రదేశాలకు కండక్టెడ్ టూర్స్ ఉండవు. ఇండియన్స్ అసలే రారు. ఎక్కువమంది ఫారినర్స్ వస్తారు.
మేము సిమ్లానుండి టాక్సీ మాట్లాడుకున్నాము, డ్రైవర్ కమ్ గైడ్ కుర్రవాడు 15 రోజులు మావెంట ఉండి ఆ ప్రదేశాలు పరిచయం ఉన్నవాడైన అతను.
మేము సిమ్లాలో ఉదయం 8 గం||లకు బ్రేక్‌ఫాస్ట్ ముగించుకొని సామాన్లు కార్ డిక్కీలో వేసుకొని బయలుదేరాము. ఆ రోజు మా ప్రయాణం సర్‌హన్ వరకూ మొత్తం 175 కి.మీ. నార్కండాలోని ఆపిల్, అప్రికాట్ గార్డెన్ రూట్ గుండా మా ప్రయాణం సాగింది. చల్లని వాతావరణంవల్ల మే నెల ఎండతాపం తెలియలేదు. ఒక స్వర్గసీమ గుండా ప్రయాణిస్తున్నట్లుగా ప్రకృతి మైమరపిస్తోంది. ప్రకృతిఒడిలో అంత సౌఖ్యం ఉందనే విషయం ఇలాంటి యాత్రల ద్వారా మాత్రమే అనుభవానికి వస్తుంది. మాతోబాటు సాగే సట్లెజ్‌నది పరవళ్ళు. సట్లెజ్ లోయ యొక్క పచ్చని కన్నులవిందైన ప్రకృతి మిగతా కేదార్‌నాథ్, బదరీనాథ్ హిమాలయ యాత్రలకంటే భిన్నమైన పరిసరాలు. మధ్యమధ్య గగుర్పొడిచే లాండ్ స్లైడింగ్ అయ్యే శిఖరాలు, సెలయేళ్ళను దాటుకుంటూ, హిమజలపాతాల జల్లులలో తడుస్తూ సాగింది మా ప్రయాణం. తరువాత నిర్థ్ మీదుగా జియోరి చేరేసరికి మధ్యాహ్నం 2 గం||లు అయింది. అక్కడ కొంచెం సేదదీరి భోజనం కానిచ్చి మళ్ళీ ప్రయాణమయ్యాము. మొత్తం ఘాట్ రోడ్డు ప్రయాణం బాగా అలసట కలిగించేదిగా ఉంది. సాయంత్రం 5 గం||లు అయ్యేసరికి దాదాపు 6 నుండి 8 గం||ల ప్రయాణం తరువాత చివరగా ‘సర్‌హన్’ చేరుకున్నాము.
కారుదిగి తలఎత్తిచూస్తే ఎదు రుగా అద్భుతమైన శ్రీఖండ్ హిమాలయ పర్వతశ్రేణులు. మంచుతో నిండిన హిమశిఖరాలతో ఎంతో అందమైన, ఆహ్లాదకరమైన చల్లని ప్రదేశం సర్‌హన్. హిమాలయాల ఎదురుగా ఉన్న స్నోవ్యూ హోటల్లో మా బస. వేడివేడి టీ తాగి వేడినీటిస్నానంతో మా ప్రయాణపు అలసట కొంత తీరింది. మెల్లగా చీకటి పడడంతో చలి బాగా వణికిస్తోంది. రెండు మూడు వరుసల ఉలెన్ డ్రస్‌లు వేసుకొని బెడ్‌పై కూర్చొని శ్రీఖండ్ హిమాలయాల సొగసుల్ని రూమ్ అద్దాలనుండి చూస్తుండగానే 7.45 ఆఖ కల్లా చీకటి పడిపోయింది. చీకటిలో కూడా వెండికొండలు మెరిసిపోతున్నాయి. రాత్రి భోజనం తరువాత నిద్రకు ఉపక్రమించాము.
మరుసటిరోజు ఉదయం 5 గం||లకు తెల్లవారిపోయింది. ఎదురుగా హిమశిఖరాలు రమ్మని ఆహ్వానిస్తున్నాయి. వేడి కాఫీ తాగి తయారై పక్కనే వంద గజాల దూరంలో ఉన్న అతిపురాతన ‘భీమ్‌కాళి’ ఆలయాన్ని దర్శించాము. చుట్టూ భూతలస్వర్గం. ప్రకృతిమాత గీసిన గొప్ప చిత్ర కళాఖండం సర్‌హన్ అంటే అందులో ఏమాత్రం అతిశయోక్తి లేదు. సట్లెజ్‌నదీలోయలో ఉన్న సర్‌హన్, పూర్వం పరిపాలించిన రాంపూర్ భుషైర్ రాజుల ముఖ్యపట్టణం. ఈ పట్టణంపై చాలా స్థలపురాణాలున్నాయి. కొన్ని శతాబ్దాల ముందు కుల్లూరాజు భుషైర్ రాజ్యంపై దండెత్తాడు. భయంకరమైన యుద్ధం, రక్తతర్పణాల తరువాత భుషైర్ రాజు కుల్లూ రాజుపై గెలిచాడు. కుల్లూ రాజు తల తెగిపడింది. తలను సర్‌హన్ తీసుకొచ్చారు. ఒక ఎత్తైన వేదికపై పెట్టారు. కుల్లూ రాజకుటుంబీకులు, ప్రజలు రాజు అంత్యక్రియలకై తలను తీసుకొని వెళ్ళడానికి వేడుకొన్నారు. భుషైర్ రాజు మూడు నిబంధనలు విధించాడు. ఒకటి కుల్లూరాజు ఆక్రమిత భూభాగాన్ని భుషైర్ రాజ్యానికి తిరిగి అప్పగించడం. రెండవది మళ్ళీ భవిష్యత్తులో భుషైర్ రాజ్యంపై కుల్లూ రాజులు దండెత్తరాదు. మూడు కుల్లూ పట్టణ దేవుడు రఘునాథుని విగ్రహాన్ని భుషైర్ రాజులు తిరిగి కుల్లూరాజుకు అప్పగించబోమని. ఓడించబడిన కుల్లూ రాజకుటుంబీకులు ఈ ఒప్పందాలకు తలఒగ్గి దసరా ఉత్సవాలను ఘనంగా జరపమని భుషైర్ రాజుని కోరారు. రఘునాథుని విగ్రహాన్ని భీమ్ కాళిమాత మందిరంలో ప్రతిష్టించారు.
మరో స్థలపురాణం ప్రకారం బాణాసురుడు సోనిట్‌పూర్ రాజ్యాన్ని (ప్రస్తుత సర్‌హన్)ని పరిపాలించేవాడు. అతని కుమార్తె ఉషాదేవికి కలలో అందమైన, బలవంతుడైన వీరుడు కనిపించాడు. ఆమె నిద్రలేచి తన చెలికత్తె చిత్రలేఖకు అతని రూపురేఖలు వర్ణించింది. చిత్రలేఖ ఆ వర్ణనకు ఆధారంగా ఒక చిత్రపటాన్ని చిత్రించింది. ఉషాసుందరికి ఆనందం కలిగినా అతన్ని చూసేవరకు మనస్సు నిలువటంలేదని చెప్పింది. చిత్రలేఖ ఆ చిత్రపటాన్ని పట్టుకొని ఆ యువకుణ్ణి వెదకడం మొదలుపెట్టగా చివరకు అనిరుద్ధుడ్ని చూసి ఆశ్చర్యపోయింది. అతడు మరెవరోకాదు శ్రీకృష్ణుని మనమడు అని తెలుసుకుంటుంది. అతను నిద్రపోగా చూసి అతని శయ్యతోసహా ఉష వద్దకు తీసుకొని వస్తుంది. అది తెలుసుకొని శ్రీకృష్ణుడు బాణాసురుడిపై దండెత్తుతాడు. బాణాసురుడు యుద్ధంలో ఓడిపోతాడు. తరువాత కృష్ణుడు ఉష స్వప్న వృత్తాంతాన్ని తెలుసుకుని తన మనుమడు అనిరుద్ధుడికి, ఉషకి పరిణయం చేస్తాడు. బాణాసురుడికి అతని రాజ్యాన్ని తిరిగి (సోనిట్‌పూర్) అప్పగిస్తాడు. ఆ పట్టణమే ‘సర్‌హన్’ అని చెప్తారు.
సర్‌హన్‌లోని భీమ్‌కాళి మాత మందిరం 800 సం||ల క్రిందట నిర్మించబడింది. మందిరంలోని దేవత భీమ్‌కాళి (దుర్గామాత). భీమ్‌కాళి ముఖ్యమైన శక్తిపీఠాలలో ఒకటి. ఆలయం హిందూ, బుద్దిస్ట్, టిబెటన్ ఆర్కిటెక్చర్ స్టైల్లో కట్టబడింది. బంగారువర్ణ విగ్రహాలు కంచుతో చేయబడ్డాయి. పైకప్పు ఏటవాలుగా అమర్చిన పలకలతో బంగారువర్ణ శిఖరాలతో, పగోడాలు, ద్వారాలు వెండితో నగిషీలు చెక్కబడ్డాయి. ఇక్కడ దసరా ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తారు. జంతుబలులు తప్పనిసరిగా ఉంటాయి.
భీమ్‌కాళి మాత ఆలయానికి 2 కి.మీ. దూరంలో ఉన్న ‘కామరూ’ ఫోర్ట్‌కి నడకతోనే వెళ్ళాము. ఫోర్ట్ ఒక టవర్‌లా కనపడుతుంది. విశాలమైన బాల్కనీలతో ఉన్న ఫోర్ట్‌లో ‘కామాఖ్యా’దేవి 3వ అంతస్తులో ఉన్నది. దేవిని అస్సాం నుండి తీసుకొనివచ్చి స్థాపించినట్లుగా చెపుతారు. ఈ ఆలయం 15వ శతాబ్దంలో నిర్మించారు. బదరీనాథునికి ఆలయాన్ని అంకితం చేశారు. 3 సం||లకొకసారి జరిగే ఉత్సవంలో భాగంగా బదరీనాథుని గంగ జన్మస్థలమైన గంగోత్రికి తీసుకొని వెళ్ళి తిరిగి తీసుకొస్తారు.
శ్రీఖండ్ మహాదేవ్‌గా పిలవబడే హిమశిఖరాలు 5155 మీటర్ల ఎత్తున ఉండి శివలింగాకృతిలో దర్శనమిస్తాయి. మహాదేవుడైన శివుడు ఇక్కడ ధ్యానంలో ఉంటాడని ప్రసిద్ధి. పాండవులు తరచుగా శ్రీఖండ్ హిమాలయాన్ని దర్శించేవారుట.
సర్‌హన్‌లో మరో ప్రసిద్ధ స్థలం రాజా భుషైర్ పాలస్. పాలస్ మరియు దేవాలయ కాంప్లెక్స్ అనేక అంతస్తులతో చేయబడ్డ కలపతో నిర్మించబడినది. స్తంభాలు దేవదారు వృక్షాలవి. భుషైర్ పాలస్ కెమ్నార్‌ను పరిపాలించిన భుషైర్ రాజులు నిర్మించారు.
భీమ్‌కాళి మందిరం నుంచి 2 కి.మీ. నడిస్తే ‘పీజెంట్ బర్డ్ పార్క్’. దాని ప్రక్కనే స్టేడియం ఉన్నాయి. పార్క్ ‘సర్‌హన్’ వన్యప్రాణి మండల్ వారి అధీనంలో ఉంది. ఎంతో అందమైన అరుదైన చిత్రమైన పలువర్ణాల పక్షులకిది ఆలవాలం. హిమాలయాలలో 3000 మీ. ఆపైన నివసించే అరుదైన పక్షులు ఉన్నాయి. ట్రెక్కింగ్ చేసి బర్డ్ పార్కుకి రావడం కష్టమైనా అక్కడి పీజెంట్ బర్డ్స్‌ని చూసి ఆ కష్టాన్ని మరిచిపోతాము. లోపురా (కారా పీజెంట్), జాజురానా (ట్రాగోమిలాన్ సెఫాలిస్) మొదలైన ఎరుపు, పసుపు ఈకలు కలిగిన వందలాది హిమాలయన్ పక్షులు, వాటి అందాలను కెమెరాలలో బంధించడానికి చాలా శ్రమపడాల్సి వచ్చింది.
అక్కడనుండి ‘పదమ్‌పాలస్’ నడకన చేరుకున్నాం. బ్రిటిష్ గవర్నర్ బసచేసిన పాలస్ అది. ఇపుడు హిమాచల్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి బసగా మార్చబడింది. చీకటిపడేసరికి మా హోటల్ స్నోవ్యూ చేరుకున్నాము.
మరుసటిరోజు ఉదయం అల్పాహారం, కాఫీ ముగించుకొని సామాన్లు కార్లో పడేసి తిరిగి సాంగ్లావాలీ వైపుగా ప్రయాణం సాగించాము.
సర్‌హన్ నుండి ‘రికాంగ్ పియో’ 87 కి.మీ. దూరంలో ఉంది. రికాంగ్ కిన్నూర్ జిల్లా హెడ్‌క్వార్టర్. మాకు తోడుగా సట్లెజ్ నదీప్రవాహం అక్కడక్కడ విశాలంగా, అక్కడక్కడ ఇరుకుగా ప్రయాణిస్తూ వస్తోంది. దారి మొత్తం ఘాట్ ప్రయాణం. సట్లెజ్ వాలీ అంతా పచ్చని ఓక్, పైన్, దేవదారు వృక్షాలతో నిండుగా ఉంది. అక్కడక్కడ కొండచరియలు విరిగిపడే ప్రమాదభరిత ప్రాంతాల గుండా మా ప్రయాణం కొంచెం భయంగొలిపేటట్లే సాగింది. ఎత్తైన హిమశిఖరాల మంచు కరిగి తెల్లని పాలధారలుగా కిందికి దుమికే జలపాతాలు అనేకం కనువిందు చేస్తాయి. ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ ‘భావనగర్’ చేరేసరికి మధ్యాహ్నం 3 గం||లయింది. కడుపులో కరకరలాడడంతో అక్కడ ఆగి లంచ్ ముగించుకొని మళ్ళీ బయలుదేరి ‘రికాంగ్ పియో’ చేరేసరికి సాయంత్రం 6 గం||లయింది. కారు ప్రయాణం గం|| పది కిలోమీటర్లుగా ఫస్ట్, సెకండ్ గేర్లలో మాత్రమే సాగింది. ఇది ఒకమాదిరి పెద్ద ఊరు. ఊరంతా కలిపి ఒక ఫర్లాంగ్ ఉంటుంది. రోడ్డుకి రెండుప్రక్కలా షాపులున్నాయి. బాంక్, పోస్టాఫీస్ కలిగిన ఊరు. ఆ రాత్రికి మా బస ‘రికాంగ్ పియో’. హోటల్లో టీ త్రాగి కొంచెం సేదదీర్చుకొని బయటికొచ్చి కాలినడకన ఊర్లోకి వచ్చాము. చుట్టూ ‘శివాలిక్ హిమాలయ పర్వత పంక్తులు’. హిమాలయాల సొగసుల్ని కెమెరాల్లో బంధిస్తూ ఈవినింగ్ వాక్ చేశాము. రికాంగ్ నించి అందంగా కుల్లూ లోయ కనపడుతోంది. ఊరు దాటేదాక నడచి 23వ ఇండో టిబెటన్ ఆర్మీ కమాండంట్‌తో ఆ ఊరి విశేషాలు తెలుసుకున్నాము. దారిలో వస్తూపోతూ ఉండే చిన్నచిన్న వ్యాపారస్తులు, జనం మమ్మల్ని కుతూహలంగా చూసి పలకరించారు. ప్రతివారూ జనసందోహం ఉన్న కుల్లూ, మనాలి వెళ్ళక ఇంత లోపలికి ఇంటీరియర్ హిమాలయాల్లోకి వచ్చినందుకు ఆనందించి మమ్మల్ని మనస్ఫూర్తిగా ఆహ్వానించారు. వేసవి శలవులు గడపడానికి వచ్చామని తెలిసి ఆశ్చర్యపోయి ఇక్కడకు ఇండియన్స్ రారు, ఫారినర్స్ మాత్రమే వస్తారని తెలిపారు. రాత్రి 7.45 ని||ల వరకు చీకటి పడడం మొదలైంది. హోటల్ చేరి, డిన్నర్, నిద్రతో ఆ రోజు గడిచింది.
మరుసటిరోజు ఉదయం వణికించే చలిలో లేచి ఉలెన్స్ నిండుగా కప్పుకొని శివాలిక్ హిమాలయాల సొగసుల్ని తనివితీరా ఎంజాయ్ చేస్తూ మా కెమెరాలకు పనిచెప్పాము. తిరిగి 10 గం||లకు హోటల్ చేరి అల్పాహారం ముగించుకొని ప్రయాణ మయ్యాము. మా ప్రయాణం ‘కోఠీ’ గ్రామం గుండా సాగింది. ఇది రికాంగ్‌కు 2 కి.మీ. దూరంలో ఉంది. ఈ గ్రామాన్ని ‘కోస్టాంపి’ అని కూడా పిలుస్తారు. ఇక్కడ ‘కోఠీమాత’గా పిలవబడే ‘చండీకామాత’ ఆలయం ఉంది. ఆలయం వెనుక ఎత్తైన దేవదారువృక్షాలు, వాటి వెనుక హిమగిరులు. చాలా అందమైన ప్రదేశం. ఆ రోజు సరిగ్గా ఆదివారం. ప్రతి ఆదివారం చండీమాతను ఆలయంనుంచి గ్రామంలోనికి తీసుకొస్తారట. పల్లకిలో ఊరేగిస్తు తాళాలు, తప్పెట్లు, డోలు వాయిద్యాలతో ధూపదీపాలతో వింజామరలు వీస్తూ ఆర్భాటంగా ఊరేగిస్తున్నారు. అప్పుడే సరిగ్గా అక్కడకి మేము చేరాము. చుట్టుపక్కల గ్రామాల స్త్రీపురుషులు తలపై రంగురంగుల టోపీలు ధరించి మాతని దర్శించుకోవడానికి కోలాహలంగా వచ్చారు.
చండీమాతకు అందమైన 8 ముఖాలున్నాయి. తలపైనుంచి వేలాడే చమరీమృగం (గిబిది) వెండ్రుకలతో అల్లిన జడలు చుట్టూ అమరాయి. తల వెనుక పెద్ద జడ, బంగారు జడపూలు, చివర జడకుప్పలున్నాయి. ధగధగ మెరిసే సిల్కు వస్త్రాలతో, జరీతో చాలా అందంగా అలంకరించారు. పూజార్లలో ఒకతనికి పూనకం వచ్చింది. అతనికి భక్తులంతా నమస్కరించి వరుసలో వచ్చి వారి సమస్యలు విన్నవించుకొని సమాధానాలు విని సాంత్వన పొంది వెళుతున్నారు. అక్కడ బొత్తులుగా అందమైన టోపీలున్నాయి. ఆలయంలో ప్రవేశించే ప్రతిఒక్కరూ టోపీలు ధరించే లోపలికి ప్రవేశించాం. చండికామాతను దర్శించుకొని మేము తిరిగి ప్రయాణమైనాము.
రికాంగ్‌నించి మా ప్రయాణం దాదాపు 14 కి.మీ. దూరంలో ఉన్న 6050 మీ|| ఎత్తున ఉన్న ‘కిన్నెర కైలాష్’ హిమాలయ శ్రేణుల మధ్య లోయలో ఉన్న ‘కాల్పా’ అనే గ్రామాన్ని చేరాము. కాల్పామండి కిన్నెర కైలాష్ శిఖరం శివలింగాకృతిలో ఎత్తుగా ఉండి ధగధగ మెరిసిపోతూ దర్శనమిస్తుంది. సాక్షాత్తు పరమేశ్వరుడు ఉండేది ఈ కైలాష్ శిఖరంపై అని నమ్ముతారు. కిన్నెర కైలాష్ శిఖరం సూర్యోదయం, మధ్యాహ్నం, సాయంత్రం, అస్తమయ సమయాలలో ఎరుపు, పసుపు, ఆకుపచ్చ రంగుల్లో రంగులు మారుతూ దర్శనమిస్తుంది. సూర్యుని కాంతితోపాటు రంగులు మారడం కిన్నెర కైలాష్ ప్రత్యేకత.
పూర్వం భస్మాసురుడనే రాక్షసుడు శివుని ప్రార్థించి వరం పొంది శివుడ్నే భస్మం చేయాలనే సంకల్పంతో శివుని వెంట పడ్డాడు. శివుడు భస్మాసురుణ్ణి తప్పించుకోవడానికి అతిఎత్తైన కిన్నెర కైలాష్ చేరి యోగ, ధ్యానాలతో విష్ణువుని మెప్పించి భస్మాసుర సంహారానికి విష్ణువు సహాయాన్ని పొంది ఆ రాక్షసుడ్ని అంతం చేసినట్లుగా స్థలపురాణం చెపుతుంది.
కిన్నూర్ జిల్లా హిమాచల్ ప్రదేశ్‌లో తూర్పు-దక్షిణ దిశలో ఉంటుంది. ఈ జిల్లా 2320 మీ. నుండి 6816 మీ. ఎత్తున ఉంది. జాతీయ రహదారి నెం.22 ఈ జిల్లా గుండా పోతుంది. ఈ రహదారి హిందుస్తాన్-టిబెట్ రోడ్డుగా ప్రసిద్ధిగాంచింది. ఈ ప్రదేశమంతా ఓక్, ఛస్ట్‌నట్, మాపుల్, బిర్చ్, ఆల్డర్, మాగ్నోలియా, ఆపిల్, అప్రికాట్ వంటి వనాలతో నిండి ఉంది.
కాల్పాగ్రామం, దేవాలయాలు వేదకాలంనుంచి ప్రసిద్ధిగాంచినదిగా తెలుస్తుంది. కిన్నెర కైలాష్ ఒడిలో 9711 అడుగుల ఎత్తుపై ఈ గ్రామం ఉంది. సంవత్సరం మొత్తం మంచుతో నిండిన హిమశిఖరాలు దర్శనమిస్తాయి. బ్రిటిష్ గవర్నర్ లార్డ్ డల్‌హౌసి తరచు ఈ ప్రాంతానికి వచ్చేవాడట. డిసెంబర్-ఫిబ్రవరి నెలలో మంచుగడ్డకట్టిన జలపాతాలు రికాంగ్‌పియో-కాల్పా మధ్య ఉన్న ప్రదేశంలో కనీసం ఐదు ఆరు కనిపిస్తాయట.
హిమాచల్‌ప్రదేశ్ టూరిజం గెస్ట్‌హౌస్ ఒక ఎత్తైన కొండపై ఉంది. రోజూ తెల్లారేసరికి మంచు గెస్ట్‌హౌస్ చుట్టూ పేరుకొని ఉంటుంది. ఇక్కడనించి ఉదయపు నీరెండలో, మధ్యాహ్నపు ఎండలో కిన్నెర హిమాలయాల ధగధగలు చూస్తూ కూర్చుంటే ప్రపంచాన్ని, మన ఉనికిని మరిచిపోతాము. అంత చూడచక్కని అందమైన ప్రదేశం కల్పా. ఎండాకాలంవల్ల ఆపిల్ తోటలు నిండుగా తెల్లని పూలతో నిండి సువాసనభరితంగా ఉంది ఆ ప్రాంతం అంతా. మధ్యాహ్నం 2.30 గం||లు అయ్యేసరికి అకస్మాత్తుగా వాతావరణం మారిపోయింది. మబ్బులు మంచుకొచ్చి, తీవ్రమై చలిగాలులు వీయడం మొదలైంది. రూమ్‌లో రజాయిలలో దూరి కూర్చొని అద్దాలగుండా హిమాలయాల సొగసుల్ని చూస్తూ కూర్చుండి పోయాము. రాత్రి 8 గం||లకు చీకట్లు కమ్మడం మొదలై, చలి చాలా తీవ్రంగా ఎముకలు కొరికేదిగా ఉంది. ఈ ప్రశాంతమైన అద్భుతమైన కాల్పాలో మేము మూడురోజులుండిపోయాము.
మర్నాడు ప్రొద్దున్నే పక్కనే ఉన్న బౌద్ధారామాన్ని, ప్రాచీన నాగిని శివాలయాన్ని దర్శించాం. కాల్పా చిన్నచిన్న ఇళ్ళు ఉన్న కుగ్రామం. కాని ఫారినర్స్ ఎంటర్‌టైన్‌మెంట్‌కోసం అధునాతన సదుపాయాలు, ఇంటర్నెట్, స్నూకర్, వీడియోగేమ్స్ వంటి సౌకర్యాలతో వుంది. ఫారినర్స్ ఇక్కడ 10-15 రోజులపాటు ఉండిపోతారు.
మూడవరోజు కొంచెం దూరంగా కార్‌లో మాత్రమే వెళ్ళగలిగిన ఎత్తైన ప్రదేశంలో ఉన్న ‘రూగి’ అనే గ్రామం చేరాము. అది కోనిఫర్, దేవదారు అడవి మధ్య ఉన్న పచ్చని ప్రదేశం. ఆసక్తిగా ఫోటోలు తీసుకుని మధ్యాహ్నం లంచి సమయానికి హోటల్ చేరాము. ఇక్కడ ఇళ్ళపై టిన్ రేకులు, రాతిబెచ్చులు ఏటవాలుగా మంచు జారిపోవడానికి అనువుగా కప్పుతారు. సాయంత్రం కాల్పా కాళీ ఆలయానికి వెళ్ళాము. ఈ ఆలయం కూడా కోఠీ చండీమాత ఆలయంలాగే ఉంది. చండికాదేవి ఎనిమిది ముఖాలతో అత్యంత శోభాయమానంగా ఉంది. ఆలయం చుట్టూ ఉన్న చెలకల్లో స్త్రీలు చంటిబిడ్డల్ని వీపుకి కట్టుకొని వ్యవసాయం పనులు చేసుకుంటున్నారు. వయస్సులో ఉన్న స్త్రీలు తెల్లని దేహఛాయతో చెక్కిన శిల్పాల్లాంటి ముఖకవళికలతో అందంగా, నాజూకుగా ఉన్నారు. తిరిగి, తిరిగి చూడాలనిపించే రూపం వారిది. వయస్సు మళ్ళిన స్త్రీలు మాత్రం చలి, ఎండవల్ల కమిలిన శరీరాలతో, పనిపాటల భారం, వార్ధక్యంతో ఎర్రగా ముడతలు పడిన చర్మంతో కనిపిస్తారు. సాయంత్రం కాగానే పురుషులు దేవాలయాల మొండిగోడలపై కూర్చుని బీడీలు కాలుస్తూ, మద్యం, బాతాఖానీల మత్తులో మునిగి ఉన్నారు. పెద్దపెద్ద ఆసాములు పెంచే ఆపిల్, అప్రికాట్ తోటల్లో కూలీలుగా, తేనెటీగల పెంపకం, వ్యవసాయం వంటి పనులు చేసుకుంటారు. ఆపిల్ పళ్ళ తోటల్లో పెంచబడ్డ తేనెటీగల్నించి తీసిన తేనె తెల్లగా, సుమధురంగా, సువాసనభరితంగా ఉంది. మేము కొన్ని తేనె డబ్బాలు కొనుకున్నాము, కల్పా జ్ఞాపకంగా.
మరుసటిరోజు ఉదయం ఎర్లీ లంచ్ 11 గం||లకే ముగించుకొని సాంగ్లావాలీ దిక్కుగా ప్రయాణమైనాము. ‘కర్బామ్’ అనే ప్రదేశంవద్దనించి కుడివైపుగా పోతే సాంగ్లావాలీ ఎడమవైపు కాల్పాగ్రామం. కాల్పానించి బయలుదేరి దారిపొడుగునా 18000 అడుగులు నుంచి 20000 అడుగులు ఎత్తైన హిమశిఖరాల్ని దాటుకుంటూ మా ప్రయాణం సాగింది. దారి అంతా లాండ్ స్లైడింగ్ ప్రాంతాలతో, ఎత్తైన ఘాట్స్‌తో నిండి భయంగొల్పేలా ఉంది. మంచు కరిగి కిందికి ఉరికే పాలవంటి జలపాతాలు, సెలయేళ్ళూ దాటుకుంటూ సట్లెజ్ ఉపనదియైన ‘బస్పా’ నదీప్రవాహం వెంబడే సాంగ్లాలోయ పచ్చని పైన్, దేవదారు వనాలతో నిండి వుంది. దారిలో ‘కామరూ’ ప్రాంతాన్ని దాటి 57 కి.మీ. ప్రయాణించి సాంగ్లాలోయ చేరాము. లోయ యొక్క సహజ ప్రకృతి, మంచు నిండిన హిమగిరులు, బస్పానదీ ప్రవాహంతో కళ్ళు తిప్పుకోలేకుండా ఉంది.
సాంగ్లాలోయలో బస్పా నదిపై హైడ్రో ఎలక్ట్రికల్ ప్రాజెక్ట్ కట్టబడింది. అక్కడ వుత్పత్తియైన కరంట్ మొత్తం కిన్నూర్ జిల్లాకి సరిపోగా మిగులు కూడా ఉందని ప్రాజెక్ట్ పర్సన్స్ తెలిపారు. లోయను ఆనుకునే హిమాచల్‌ప్రదేశ్ వారి అగ్రికల్చర్ రిసర్చ్ స్టేషన్ ఉంది. దానిలో సాఫ్రన్ తోటలు (కుంకుమపువ్వు) నల్లజీర, దాదాపు 20 రకాల రాజ్‌మా వంగడాలు ఉన్నాయి. అగ్రికల్చర్ సైంటిస్టులు ఆ రిసర్చ్ స్టేషన్ విశిష్టత గురించి చెప్పి వ్యవసాయ విశేషాలు తెలిపారు. వారు ఎంతో ఓర్పుతో, ఆసక్తికరంగా మా వివరాలు తెలుసుకొని చాలా ఆనందించారు. మేము కూడా ఇద్దరం జంతు, వృక్ష శాస్త్రజ్ఞులం, అందునా కళాశాల అధ్యాపకులం కావడంతో చాలా ఆసక్తికరంగా ఆ వివరాలు తెలుసుకొని ఆనందించాము. జనసంచారం లేని బస్పా లోయలో కొత్త మనుషులైన మమ్మల్ని వారు ఘనంగా ఆహ్వానించి సత్కరించారు. లోయలో 3 గం||లపాటు గడిపి లెక్కకు మించిన ఫోటోలు తీసుకొని మేము మళ్ళీ ప్రయాణమైనాము.
చిత్కుల్
మా ప్రయాణం ‘చిత్కుల్’ దిక్కుగా సాగింది. అతిభయానక మైన ఘాట్ ప్రయాణం, కచ్చా వంతెనలు, వాగులు, పెద్దపెద్ద రాళ్ళతో ఎగరేసే దారి రోడ్డే లేని ప్రదేశం. శరీరం కుదుపులకి ఎముకల్నీ ప్రతీకీలూ వేరైనట్లున్న అస్థిపంజరం. ప్రయాణం చాలా టఫ్‌గా ఉంది. అలా 2 గం||లు 24 కి.మీ. ప్రయాణించాక ‘చిత్‌కుల్’ చేరాము. మేము కారు దిగేసరికి ప్రయాణపు బడలికను మరిపించే అద్భుతమైన ప్రదేశంలో కాలుపెట్టామనిపించింది. చిన్న కుగ్రామం చిత్కుల్. కిన్నెర కైలాష్ పరిక్రమ చిత్కుల్ దగ్గర సమాప్తమవుతుంది. దాదాపు 3,450 మీ. ఎత్తుపై చిత్కుల్ ఉంది. చిత్కుల్ గ్రామం వరకే ప్రజలకి అనుమతి ఉంది. గ్రామం దాటిన 90 కి.మీ. ఏరియా అంతా 25వ ఇండో-టిబెటన్ బార్డర్ (|ఊఔఆ) సెక్యూరిటి వారి అధీనంలో ఉంది. |ఊఔఆ వారు ఈ గ్రామాన్ని దత్తత తీసుకున్నారు. గ్రామానికి చుట్టూ అతిదగ్గరగా హిమాలయ శిఖరాలు గ్రామమంతా మంచి కరిగి ప్రవహించే సెలయేళ్ళే. సెలయేళ్ళ నీటివరవడితో చక్కి (పిండిమర) ఉంది. గ్రామంలో చిన్న ప్రైమరీస్కూల్ తప్ప మరేమీ లేదు. హాస్పిటల్, క్లినిక్ సదుపాయాలు లేవు. చిన్నచిన్న రాతిబెచ్చులు, టిన్ రేకులతో కప్పబడిన ఇళ్ళు మొత్తం వందమంది జనాభా ఉండరు. బస్పా లోయలో దూరంగా ఉన్న హైస్కూలే ఇక్కడ చదివిన పిల్లల చదువు కొనసాగింపుకు ఆధారం. చిత్కుల్ మాతే (చండికాదేవి) ఆలయం గ్రామం మధ్యలో ఉంది. కిన్నూర్ కైలాష్ పరిక్రమ చేసిన భక్తులు తప్పనిసరిగా ఈ ఆలయం దర్శించుకొని మాతని ప్రార్థించుకుంటారు. కిన్నూర్ కైలాష్ పరిక్రమ మొత్తం 5 రోజులు పడుతుంది.
సరిగ్గా మేము ‘చిత్‌కుల్’ చేరేసరికి మధ్యాహ్నం 3 గం||లు అయింది. సడన్‌గా మబ్బులు కమ్మి, దూదిపింజల్లాంటి హిమం పూలవర్షాన్ని తలపిస్తు కురవడం మొదలైంది. ఎంత అద్భుతమైన దృశ్యం. ఎంతో అదృష్టం కలిగుంటే తప్ప ఈ కమనీయ దృశ్యాన్ని చూడగలం అనిపించింది. ఈ లోపు వర్షం, మొత్తం తడిసి ముద్దై వణకుతూ నిలబడ్డ మమ్మల్ని దూరంనించి చూసి అక్కడవున్న ఒకే ఒక గెస్ట్‌హౌస్ ఠాకూర్ గెస్ట్‌హౌస్ వాచ్‌మాన్ పరిగెత్తుకుంటూ వచ్చాడు. ఫారినర్స్ అనుకున్నాడు. తీరాచేసి మేం ఇండియన్స్. డిసప్పాయింట్ అయినా పాపం మమ్మల్ని సాదరంగా ఆహ్వానించి వేడివేడి చాయ్‌తో సత్కరించాడు. మా ప్రమేయం లేకుండా దవడలు టక, టక కొట్టుకుంటున్నాయి. చలి చాలా భీకరంగా ఉంది. మరో కప్పు వేడి వేడి చాయ్ తాగించాడతను. రిసెప్షన్ రూమ్‌లో అలా సాయంత్రం 5 గం||ల వరకూ కూర్చుండి చిత్కుల్ వివరాలను తెలుసుకున్నాము. సడన్‌గా వాన తగ్గి నీరెండ రావడం మొదలైంది. అస్తమయ సూర్యుడి నీరెండలో హిమశిఖరాలు తళ, తళ మెరిసిపోతున్నాయి. వాన తగ్గడంతో స్త్రీలు, పురుషులు ‘ఆలు’ సేద్యాన్ని ప్రారంభించారు. స్కూల్ వదలడంతో బిలబిల్లాడుతు పిల్లలు ఈ కొత్త ముఖాల్ని ఆశ్చర్యంతో చూస్తూ ఇళ్ళల్లోకి పరిగెత్తారు. మేము చలికి వణుకుతూనే ఆనందంతో మా ఫొటోగ్రఫి పని మొదలుపెట్టి ఎన్ని ఫొటోలు తీసామో లెఖ్ఖ తెలియలేదు. అలా రెచ్చిపోయి హిమాలయ శిఖర సౌందర్యాన్ని కెమెరాలో బంధించాము. నడుస్తుండగానే చలి రెచ్చిపోయి తన ప్రతాపాన్ని చూపడం ప్రారంభించింది. చలిగాలి చెవులని చిల్లులు పొడుస్తోంది. మేము మెల్లగా హోటల్ రూమ్‌కి చేరుకున్నాము. పాపం సర్వర్, కమ్ ఓనర్ కుర్రాడు మా స్థితి చూసి మళ్ళీ వేడి వేడి పొగలు కక్కే చాయ్ ఇచ్చాడు. చాయ్ తాగుతూ మైమరచి కిటికీల అద్దాల్లోంచి హిమాలయాలు చూస్తూ రజాయిల్లో దూరి కళ్ళు, ముక్కూ తప్ప మొత్తం కప్పేసుకుని కూర్చున్నాము. మా పారవశ్యాన్ని భంగపరుస్తూ సర్వర్ కుర్రాడూ రాత్రికి మా మెనూ గురించి అడిగాడు. అక్కడ ఏది ఉంటే అది తేలికపాటి వెజిటేరియన్ ఆహారం తయారుచేయమన్నాము. అతను వెజిటబుల్ పులావ్ చేస్తానన్నాడు. 9 గం||లకు రుచికరమైన వేడి వేడి వెజిటబుల్ పులావ్ కడుపునిండా పట్టించి వెచ్చగా 4 వరసలు రజాయిల్లోకి దూరి పడుకున్నాము. చలి బాగా ఎక్కువై శ్వాస తీసుకోవడం కష్టమైపోయింది. కిటికీ రెక్కలు తీసి గాలి పీల్చుదామంటే భయంకరమైన చలి. రాత్రంతా ఎప్పుడు తెల్లవారుతుందా అని అర్థ నిద్రావస్థలో ఒకరితో ఒకరు మాట్లాడుకోకుండా కూర్చునే ఉన్నాము. ఎలాగోలా తెల్లవారింది. సూర్యుని వెచ్చని కిరణాలు శరీరాన్ని సౌఖ్యంగా తాకాయి. హిమగిరులు వెండికొండల్లా మెరిసిపోతున్నాయి.
త్వరగా తయారై వేడి వేడి ఆలు పరోటాలు తిని టీ తాగి కెమెరాలు భుజాన్నేసుకొని గ్రామంలోకి బయలుదేరాము. పిల్లలు తయారై స్కూల్‌కి పరిగెత్తుతున్నారు. ఇంతలో తాళాలు, తప్పెట్ల మోతలు వినపడ్డాయి. వడివడిగా అడుగులేస్తూ ‘చిత్‌కుల్ మాతే’ ఆలయాన్ని చేరాము. ధూపదీపాలతో డోలు, ఢమరూ వాయిద్యాలతో ఆలయంలోంచి ఆలయ ఆవరణలోనికి మాతను భుజాలపై ఊరేగిస్తూ తీసుకొని వచ్చారు. భక్తుల ప్రశ్నావళి, పూనకం వచ్చినతని సమాధానాలు బాగా సందడిగా ఉంది. వారి అనుమతితో మేం ఆ సందర్భాన్ని ఫొటోలు తీయగలిగాము. ఈ కార్యక్రమం అంతా పురుషులదే. స్త్రీలెవ్వరికి ఏ బాధాలేదు. ఏ ప్రశ్నావళీ వార్ని బాధించటల్లేదు. ఉన్నా వారికి తీరికెక్కడిది. తెల్లవారగానే, గిన్నెలు తోమి, పిల్లలకి వండిపెట్టి, చంటిపిల్లల్ని వీపుపై మోస్తూ ఎడపిల్లల్ని స్కూల్‌కి తీసుకొని వస్తూ వున్నారు. దానికి తోడు పేదరికం. తెల్లని దేహఛాయ ఉన్నా చలికి ఎర్రగా కమిలి ముడతలుపడ్డ చర్మం, పెదవులపై పుళ్ళతో పోషకాహారలోపం వారిలో స్పష్టంగా కనిపిస్తోంది. మేం ఎంక్వైరీ చేయగా మొత్తం గ్రామస్తులంతా అక్షరాస్యులని తెలిసింది. కొద్దిమంది గ్రాడ్యుయేట్లు, ఒకరిద్దరు పోస్ట్‌గ్రాడ్యుయేట్లు ఉన్నారు. ఇది కూడా |ఊఔఆ వాళ్ళు దత్తత తీసుకోగా కలిగిన పరిణామం. పిల్లల్ని స్కూల్‌కి పంపేక స్త్రీలంతా నాగళ్ళు, కొడవళ్ళు తీసుకొని సేద్యానికి బయలుదేరారు. అక్కడ గోబి, క్యాబేజ్, టమాటా, ఆలు వంటి పంటలు కనిపించాయి. అది కూడా కొండలపై స్టెప్ వ్యవసాయం. స్త్రీలంతా కష్టజీవులు. యథాప్రకారం పురుషులు భంగు, మద్యపానం, బీడీలు మొదలైనవాటికి బానిసలు.
మేము మా ఫొటోగ్రఫి ముగించి ఉదయం 10 గం||లకు బయలుదేరి సాంగ్లా లోయ, బస్పా నది, ‘వాంగ్‌టూ’ దాటి రాంపూర్ మీదుగా 175 కి.మీ. తిరుగుప్రయాణం చేసి రాత్రి 8 గం||లకు ‘నార్కండా’ చేరుకున్నాము. ఆ రాత్రి నార్కండాలో మా బస. మెయిన్‌రోడ్డులోని ‘మహామాయా’ హోటల్లో మా బస. సిమ్లాకి అతిదగ్గరగా ఉన్న ఆహ్లాదకరమైన చల్లని పిక్నిక్ స్పాట్ ‘నార్కండా’.
మేం ఉదయం తయారై ‘కుఫ్రి’ మీదుగా ప్రయాణించి ‘చైల్’ చేరాము. చైల్ ఇన్‌లో మా బస. జనసందోహం లేదు. అధునాతన వసతి గృహాలతో ఉన్న చిన్న ప్రాంతం చైల్.
మేము ఉదయపు, సాయంత్రపు వాకింగ్ చేస్తూ అందమైన సూర్యోదయాలు, సూర్యాస్తమయాలు చూస్తూ ‘వైల్డ్‌లైఫ్ పార్క్’ దేవాలయం, చైల్ పాలస్ దర్శిస్తూ 3 రోజులపాటు ఇక్కడే విశ్రాంతి తీసుకున్నాము. చైల్ ప్రస్తుతం హిమాచల్‌లో ఉన్నా వెనుకటి పాటియాలా రాజుల (పంజాబ్) వేసవికాలపు విడిదిగా ఉండింది.
రేణుకాజీ : నాల్గవరోజు ఉదయమే మా కారులో సోలన్ గుండా, బరోగ్‌హట్టి, సర్‌హన్, దదాహుల మీదుగా ప్రయాణించి ‘రేణుకాజీ’ అభయారణ్యం చేరుకున్నాము. రేణుకాజీ చేరేసరికి మధ్యాహ్నం ఒంటిగంటైంది. క.ఆ. టూరిజం వారి వసతిగృహంలో మా బస. భోజనం కానిచ్చి కాస్సేపు విశ్రాంతి తీసుకొని సాయంత్రం 5 గం||లకు కెమెరాలు భుజాన్నేసుకుని కాలినడకన 5 కి.మీ. ఉన్న రేణుకాజీ సరస్సు చుట్టూ ఉన్న వన్యప్రాణి అభయారణ్యంలోకి చేరుకున్నాము. అభయారణ్యంలో పీజెంట్ బర్డ్స్, స్పాటెడ్ డీర్లు, దుప్పులు, నీల్‌గాయ్, పెద్దపులులు, సింహాలు, చిరుతపులులు, ఎలుగుబంట్లు ఉన్నాయి. దట్టమైన ఈ అభయారణ్యంలోకి సూర్యరశ్మి కూడా ప్రవేశించటం లేదు. వన్యప్రాణుల్ని ఫొటోతీస్తూ రేణుకామాత, పరశురాముల ఆలయాన్ని చేరుకున్నాము. ఆలయ ప్రాంగణం విశాలంగా పరిశుభ్రంగా ఉంది. సరస్సు, చుట్టూ అరణ్యంలో చూడచక్కని ప్రదేశం ‘రేణుకాజీ’. రేణుకామాత ఋషి జమదగ్ని ధర్మపత్ని. తండ్రి ఆజ్ఞపై విష్ణుమూర్తి అవతారమైన పరశురాముడు తల్లి రేణుకామాత తలనరికిన ప్రదేశమే ఈ ఆలయం. పక్కనే పూజారి బస. ఎన్నో దర్మసత్రాలు, సాధూ సంత్‌ల ఆశ్రమాలు ఉన్నాయి. చీకటి పడడంతో మా హోటల్ ఆరుబయట వేడి వేడి టీ తాగుతూ కనుచీకటిలో సరస్సూ, అరణ్యం సౌందర్యాన్ని తనివితీరా చూస్తూ గడిపాము.
మర్నాడు ఉదయం అల్పాహారం తరువాత రేణుకాజీ నుంచి బయలుదేరి సర్‌హన్, పర్వాను మీదుగా కాల్కా ప్రయాణమైనాము. కాల్కాకి 5 కి.మీ. ముందు ‘రోప్‌వే’ ఉంది. మా టాక్సీవాలాకు హిమాచల్ స్టేట్ నుండి హర్యానాకు అనుమతి లేకపోవడంతో మమ్మల్ని ‘పర్‌వానో’ గ్రామం వద్ద మరో టాక్సీ మాట్లాడి బదలాయించాడు. కాల్కా చేరేసరికి మధ్యాహ్నం ఒంటిగంటయింది. రాత్రి 11 గం||లకు మా ఢిల్లీ ప్రయాణం. అక్కడనుండి మరుసటిరోజు కేరళ ఎక్స్‌ప్రెస్‌లో మా వరంగల్ ప్రయాణం.
మొత్తంమీద ఆంధ్రప్రదేశ్‌లోని మే నెల కాల్చేసే ఎండల్ని వడగాలుల్ని తప్పించుకొని 20 రోజులు హిమం కురిసే హిమాలయాల్లో ప్రకృతిమాత ఆరాధనలో సిమ్లా, సర్‌హన్, కాల్పా, సాంగ్లా లోయ, కిన్నెర కైలాష్, బస్పా వాలీ, చైల్, చిత్కుల్, రేణుకాజీ యాత్ర మా హృదయాలలో అద్భుతమైన మధురానుభూతిగా మిగిలిపోయింది. ఆ ఫొటోలు చూసినప్పుడల్లా మేం హిమాలయాల్లో తిరిగిన ఆ అనుభూతులను నెమరేసుకుంటా వుంటాము ఇప్పటికీ, ఎప్పటికీ.