”చెప్తున్నా ! విను”

సొన్నాయిల కృష్ణవేణి

మనుధర్మ శాస్త్రమో

మానవత్వ నిర్మూలనా శాస్త్రమో

పేరేదైతే నేం…

మన మనసున అగ్రవర్ణ అహంకారపు

విషబీజం నాటడమే కదా!

దానికి తెలిసిన ధర్మం

బ్రహ్మ ముఖం నుంచి పుట్టిన వాడా

శిరోస్థానం నీదే, పాదస్థానం నాదే

నేనొప్పుకుంటాను.

ఆ శిరస్సు ఊర్థ్వభాగాన నిలవడానికి

ఆసరానిచ్చింది పాదాలే కదా!

అది నువ్వొప్పుకుంటావా?

మాదిగనై నేను కుట్టిన చెప్పులే

నీ పాదాలకు రక్షణనిస్తున్నాయి

మాలనై నేనందించిన నీటితో

పండిన పంటే నీ కడుపునింపి

ఆకలి బాధను తీరుస్తోంది.

చాకలినై నేనుతికిన బట్టలే

నీ మాన మర్యాదలు కాపాడుతున్నాయి

అంతెందుకు అమ్మ కడుపు నుండి

నువ్వు బయట పడ్డ క్షణం మంత్రసానినై

నీ బొడ్డు పేగు కోసింది నేనే కదా!

నిన్ను తాకకుండానే నేనాపని చేసానా!

ఆ సమయంలో కూడా

ఈ కులపిచ్చి నీలో ఉండుంటే

నీ తొలిస్నానం నీళ్లతో కాదు

నిప్పులతో చేయించమనే

వాడివేమో కదా!

ఆధిపత్య భావనను అణువణువూ

నింపుకున్నవాడా

నాకో ధర్మ సందేహం, తీరుస్తావా?

నేనైతే అమ్మ కడుపునే పుట్టాను

నువ్వేమయినా ఆకాశం నుండి ఊడిపడ్డావా?

కాదు కదా!

నేను అమ్మ కడుపులో నవమాసాలే ఉన్నాను

నువ్వేమయినా పదిమాసాలున్నావా?

లేదు కదా!

నాకు ఆకలేస్తే అన్నమే తింటాను

నువ్వేమయినా బంగారం తింటావా?

కాదు కదా!

నాకు గాయమైతే రక్తం కారుతుంది

నీకు గాయమైతే పాలేమయినా కారుతాయా?

లేదు కదా!

మరి ఇన్ని విషయాల్లో నాతో సమానమైన

నువ్వు ఎక్కువెలా అయ్యావు

నేను తక్కువెలా అయ్యాను

చివరిగా ఒక్కమాట

నీ ఆధిపత్యం ఎన్నాళ్లో తెలుసా?

నాలో సహనం ఉన్నన్నాళ్లే.

ఈ రాతలు ఏ సిరాతో…

కొప్పర్తి వసుంధర

అతి అలంకరణలతో

వికృతపు అభివ్యక్తులతో

విషాల్ని కుమ్మరిస్తూ

నిప్పుల్ని కురిపిస్తూ

కళ్ళెర్ర జేస్తూ, కుట్రలు పన్నుతూ

మృదువైన మగువలు

మాయల మరాఠీలుగా మారిపోతూ

మరిచిపోయిన దుష్టపాత్రలు

మంధర, కైకలను బ్రతికిస్తూ

ఆత్మలేని శరీరాలతో అతివలు

ఆటబొమ్మలై ఆడుతున్న

ఈ జీడిపాకం ధారావాహికలు ఎవరికోసం?

ఈ రాతలు ఏ దుష్ట సిరాతో?

 

అక్క తర్వాత

మళ్ళీ ఆడపిల్లనే అని

అమ్మ కడుపులోనే నన్ను

చంపబూనిన నాన్న

తన మనసును మార్చుకున్నాడు

నన్ను చంపనని

అమ్మకు మాటిచ్చాడు

అప్పటిదాకా బిక్కు బిక్కుమంటూ

అమ్మ కడుపులో

ఒక మూలకు ఒదిగిన నేను

ఒక్కసారిగా ఎగిరి గంతేశాను

పాపం అమ్మకు ఎంత బాధ కలిగిందో

అయినా నేను బతుకుతున్నాను

అన్న ఆనందం ముందు

ఆ బాధే పాటిది

నేను పుట్టి పెరిగి పెద్దదాన్నయి

చదువులోనూ, ఉద్యోగంలోనూ ముందుండి

అన్నింటి విజయం సాధించి

ఆడపిల్ల తక్కువేమీ కాదని నిరూపిస్తా

అమ్మా నాన్నలను

కనుపాపల్లా కాపాడుకుంటా

కన్నవాళ్ళ రుణం తీర్చుకుంటా

అసమానతల విషబీజాలను

కూకటి వేళ్ళతో పెకిలిస్తా

సరికొత్త సమాజ నిర్మాణానికి

పునాదిని నేనే అవుతా

ఆడపిల్లపట్ల

దృక్పథాల్లో మార్పుకోసం

మళ్ళీ మళ్ళీ పరిశ్రమిస్తా

పరివర్తనను చూసి పరవశిస్తా.

 

ఎదిగే క్రమంలో

బి. కళాగోపాల్‌

ఎదిగే క్రమంలో అన్నీ ఒరవడులే!

ఒక అంకురం చిగురులు తొడిగి

మొక్కై ఎదిగే వైనంలో

ఎన్నెన్ని గాయాల ఒరవడులో!

ఒక చినుకు పిల్లకాలువై, మహానదై ఎదిగే క్రమంలో

ఎన్నెన్ని ఆటుపోట్లో!

ఒక మొగ్గ పూవై, తావై

పండిన పండై నేలకొరిగే అందమైన పరినామక్రమం

ఊయల బిడ్డయి, తల్లయిన ఆడుబిడ్డల

జీవ పరినామక్రమం అదో అనిర్వచనీయమైన జీవితానుభవం!

ప్రకృతి గతిశీలతలో నిత్య నూతనత్వం సంతరించుకొనే

మానవునిలో ఏదీ ఈ పరిణామ విద్య?

ఇంకా అలాగే ఆదిమ మానవుని అడుగుజాల్లోనే పయనం!

ఎదిగిన కొద్దీ ఒదిగి ఉండాలి కానేకాదు ఇప్పుడు,

వయస్సు మీద పడ్డా, వార్థక్యం బోనులో పులిలా తిరుగుతున్నా,

వారంతా మరో జాతి!

ఆడదానిపైన దాడి వారికి పరిపాటి

ఒంటరిగా కన్పిస్తే వేధించే ముష్కరుల జాతి!

పరువు హత్యల ముసుగులో ఆదిమజాతి!

వీరంతా ఎదిగే క్రమంలో తిరోగమిస్తున్న పాపాలజాతి!

ఇదో అమానవీయ మృగజాతి!

మొన్న సోనాలీ, నిన్న మరో అనామిక, రేపు ఎవరో అభాగిని?

గుండెల్లో గునపాలు దించే అమానుష పైశాచిక క్రీడ

ఏ శిక్షతో సరిపుచ్చుతారు మానని గాయాల్ని?

ఎదిగే పరిణామ క్రమంలో

మనకన్ని ఒరిపిడులే!

విప్పి చెప్పుకోలేని బాధలగాథలే!

వేధించే ప్రశ్నలే!

వెంటాడే ప్రశ్నలే!

వెంటాడే చూపులే! సీతాకోకచిలుకలా

ఎదిగే క్రమంలో అన్నీ వెక్కిరింతల వెకిలి చేష్టలే!!

(మహిళలపై పేడ్రేగుతున్న ఘాతుకాలకు ఆవేదన చెంది)

ఆ కళ్ళే

కోటం చంద్రశేఖర్‌

ఏ దూషణలకు బలికాని; ఏ తిరస్కారాలకు గురికాని కళ్ళు

మలినం లేని కళ్ళు; ఈర్షాసూయ జ్వలనం లేని కళ్ళు

మతాబులై మెరిసే కళ్ళు; కితాబులై విరిసే కళ్ళు

నవీనతను నడిపించే కళ్ళు; పునీతమై పులకించే కళ్ళు

నీలికళ్ళు

జాలికళ్ళు-

జ జ జ

నానమ్మ రాదని తెలిసి నానమ్మ లేదని ఎరిగి

సమాధి దగ్గర నిలబడి

ఉక్కబట్టి ఏడిస్తే

మరుభూమి తడిస్తే

ఆ కళ్ళే చింతనిప్పుల్లా చిటపటలాడి

ఆ కళ్ళే భీకరమబ్బుల్లా ఫెళఫెళలాడి-

ఆ ఊటకి ఊరట

ఆ పాటకి ఆగుట లేదు

 

Share
This entry was posted in కవితలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి)


తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.