పసుపులేటి గీత
‘నాపేరు బీబీ మీనా. ఉత్తారీ రామ్‌పూర్ రెడ్ లైట్ ఏరియాలో నివసించే అల్లావుద్దీన్‌తో నా పెళ్ళి జరిగింది. నా భర్తింటి వాళ్ళకి ఆడపిల్లల చేత వ్యభిచారం చేయించడం అలవాటు. అల్లావుద్దీన్‌కు నాకంటే ముందే మరో భార్య ఉండేది. ఆమెకు ఇద్దరు కూతుళ్ళు. నా మెట్టినింటి వాళ్ళు ఆ ఇద్దరు పిల్లల్ని వ్యభిచార వృత్తిలో దింపేశారు. నాకు ముగ్గురు కొడుకులు, ముగ్గురు కూతుళ్ళు. నా కొడుకులు కూలికి వెళతారు. నా కూతుళ్ళ చేత కూడా వ్యభిచారం చేయించాలని నా భర్త ప్రయత్నించాడు. వాళ్లని స్థానికంగా ఉన్న ఒక సామాజిక సేవా సంస్థ తాలూకు పాఠశాలలో చేర్పించి చదివిస్తున్నాను. కానీ 2010లో నా భర్త నా కూతుళ్లని బడి నుంచి లాక్కొచ్చేశాడు. అతని దురుద్దేశమేమిటో నాకు తెలుసు. నా కూతుళ్లని కాపాడుకోవడానికి నేను నా మెట్టినింటి వాళ్లతో చాలా పోరాటం చేశాను. పిల్లల్ని మళ్ళీ ఆ సామాజిక సేవా సంస్థ తాలూకు శరణాలయంలో చేర్పించి, నేను నా పుట్టింటికి చేరాను. నా పిల్లలు బాగా చదువుకుని, తమ కాళ్లమీద తాము నిలబడాలన్నదే నా కోరిక. రెడ్‌లైట్ ఏరియాలోని ఒక ఇంటి ముందు కూర్చుని వాళ్ళు జీవితంతో పోరాడకూడదన్నదే నా ఆశయం…’
ఒక్క బీబీ మీనానే కాదు, ఇలాంటి ఎందరెందరో రెడ్ ఏరియా బాధితుల స్వీయగాథలకు, వారి జీవన పోరాటాలకు అక్షరరూపమిస్తోంది ‘రెడ్‌లైట్ డిస్పాచ్’ అనే పత్రిక. రెడ్‌లైట్ ఏరియాలో స్త్రీలు జీవనభృతి కోసమో, కుటుంబం కోసమో క్షణక్షణం నరకాన్ని అనుభవిస్తూ వ్యభిచార వృత్తిలో మగ్గిపోతుంటారు. అక్కడ గట్టిగా ఐదడుగులు కూడా లేని గుడిసెల్లో జరిగే దారుణాలు సమాజంలోని చీకటి కోణానికి చిరునామాలు. రజస్వలలు కాని పసిపిల్లల మీద రోజుల పర్యంతం పదే పదే అత్యాచారాలు జరుగుతుంటాయి. రెడ్‌లైట్ ఏరియా ఒక భయంకరమైన హింసల కొలిమి. అక్కడ మహిళలు రోజంతా తమ శరీరాల్ని, ఆత్మగౌరవాన్ని ఫణంగా పెట్టి వందరూపాయల నుంచి ఐదువందల రూపాయల దాకా సంపాదిస్తుంటారు. ఈ సంపాదన కూడా వాళ్లకి ముఫ్పై ఏళ్ళు వచ్చే వరకే. అటు తరవాత శారీరకంగాను, మానసికంగాను, సామాజికంగాను కూడా ఆ స్త్రీలు వెలివేతకు, ఆకలికి బలవుతుంటారు.
ఇలాంటి మహిళల కోసం ఒక పత్రికను ప్రచురించడమన్నది విలక్షణమైన ఆలోచన. దేశంలోనే తొలిసారిగా ‘రెడ్‌లైట్ డిస్పాచ్’ అనే పత్రికను ప్రారంభించారు రుచిరాగుప్తా, అనురాగ్ చతుర్వేది. రుచిరాగుప్తా గతంలో ఫ్రీలాన్స్ జర్నలిస్టుగా పనిచేశారు. మూడువందల ఏళ్ళ క్రితం బ్రిటిష్ సైనికుల లైంగిక అవసరాల్ని తీర్చడానికి ముంబయి శివార్లలో ఏర్పరచిన కామాటిపురలో అక్టోబర్ 2006 న ‘రెడ్‌లైట్ డిస్పాచ్’ ప్రారంభమైంది. దేశంలోనే అతి పెద్దదయిన రెడ్‌లైట్ జిల్లా ఇది. ఇక్కడ 22 వేల మంది సెక్స్ వర్కర్లు ఉన్నారు. ఈ పరిస్థితిని గమనించిన రుచిరాగుప్తాకి ఈ సెక్స్ వర్కర్లకు తమ హక్కుల పట్ల, ఆరోగ్యం పట్ల సంక్షేమం పట్ల అవగాహన కలిగించడానికి ఒక పత్రికను ప్రారంభించాలన్న ఆలోచన వచ్చింది. అలా రూపం తీసుకున్న రెడ్‌లైట్ డిస్పాచ్‌లో సెక్స్ వర్కర్ల వ్యక్తిగత కథనాలు, న్యాయపరమైన సలహాలు, కవితలు వంటి ఎన్నో అంశాలు ప్రచురితమవుతుంటాయి. అక్షర జ్ఞానం ఉన్న సెక్స్ వర్కర్లు రెడ్‌లైట్ డిస్పాచ్ ఆఫీసుకు వచ్చి తమ కథనాల్ని ప్రచురణకు ఇస్తుంటారు. వాటిని ప్రచురణకు అనుకూలంగా మార్చడంలో వాళ్ళు రెడ్‌లైట్ డిస్పాచ్ సిబ్బంది సహాయాన్ని తీసుకుంటారు. అక్షరజ్ఞానంలేని వాళ్ళు మౌఖికంగా చెబుతుంటే, పత్రికా సిబ్బంది ఆ కథనాలకు వ్యాసరూపాన్నిస్తారు. హిందీ, ఇంగ్లీష్ భాషల్లో ప్రచురితమవుతున్న ఈ పత్రిక దేశవ్యాప్తంగా పదివేల మంది సెక్స్‌వర్కర్లకు చేరుతోంది. తోటి బాధితులతో తమ బాధను పంచుకున్న సంతృప్తితోపాటు, హక్కుల పట్ల అవగాహన కోసం సెక్స్‌వర్కర్లు ఈ పత్రికను ఎంతగానో ప్రేమిస్తుంటారు. ఈ దిశగా కేవలం పత్రిక ప్రచురణతోనే ఆగకుండా ముంబయిలో ‘అప్నే ఆప్’ అనే స్వచ్ఛంధ సంస్థను కూడా నడుపుతున్నారు రుచిరాగుప్తా. ఈ సంస్థ బాలికలకు చేతివృత్తుల్లో శిక్షణ ఇవ్వడం, ఎయిడ్స్ వంటి ఆరోగ్య సమస్యల మీద అవగాహన కల్పించడం, ఇంకా మహిళల సంక్షేమం కోసం పలు కార్యక్రమాల్ని నిర్వహిస్తుంటుంది.
‘కేవలం ఒక చిన్న మందం మాత్రమే పట్టేంత ఐదడుగుల వెడల్పు కూడా లేని ఇరుకు గుడిసెలోనే మన సర్వస్వాన్ని, మన దేవుడి పటాన్ని, మన సౌందర్యసాధనల్ని, మన వంటింటిని కుక్కేసుకుంటూ, ఆ మంచమ్మీదే పిల్లల్ని ప్రసవిస్తూ, కన్నబిడ్డలు నేల మీద ఆడుకుంటుంటే, అదే మంచం మీద విటుల్ని ఆనందపరుస్తూ, మీరు మీరంతా ఒక వస్తువుగా మారిపోయి, క్షణ క్షణం మీ ఆత్మగౌరవంలోని అంగాంగం ఛిద్రమవుతూ ఉంటే…’ దాన్ని పేదరికం అనే చిన్నపదంతో సరిపెట్టేస్తున్న సమాజానికి జ్ఞానభిక్ష పెట్టడానికి రెడ్‌లైట్ డిస్పాచ్ వంటి ప్రయత్నాలు మరెన్నో జరగాలి.
సెక్స్‌వర్కర్ల పత్రిక గురించి భూమికలో సోదరి పసుపులేటి గీతగారి కథనం చదివి స్పందిస్తున్నాను. మూడువందల ఏళ్ళ క్రితం బ్రిటిష్ సైనికుల లైంగిక అవసరాల్ని తీర్చడానికి ముంబయి శివార్లలో ఏర్పరచినట్లు చెబుతున్న ఈ కామాటిపుర ప్రాంతం (రెడ్ లైట్ ఏరియా) ఇప్పటికీ మహిళలపాలిట భూలోక నరకంగా అలాగే కొనసాగుతుండటం నిజంగా సిగ్గుచేటు. స్త్రీకి భారత సంస్కృతి అత్యంత విలువనిస్తుందని ఒకపక్క చెప్పుకుంటూనే లక్షలాది మంది మన చెల్లెళ్ళు, అక్కలు, తల్లులు ఈ నిప్పులు కొలిమిలో మాడి మసైపోతుంటే గుడ్లప్పగించి చూస్తున్నాం. ఈ ముంబై నగరం ఒక రాష్ట్ర రాజధాని, దేశానికి ఆర్థిక రాజధాని, రాష్ట్ర ప్రభుత్వం కొలువై ఉన్న చోటు. ఇప్పటికీ ఈ కామాటిపుర ప్రాంతమనేది కొనసాగుతుండటం నిర్వీర్యమైన మహిళా శిశు సంక్షేమ చట్టాలు, భద్రతా వ్యవస్థల ఘోర వైఫల్యానికి, పాతరేసిన విలువలకు నిలువెత్తు నిదర్శనం. ఇక్కడ ఎలాంటి కార్యకలాపాలు కొనసాగుతున్నాయో అందరికీ తెలిసిందే అయినా ఎందుకని అక్కడి బాలికలు, మహిళల్ని మనం రక్షించి బయటకు తీసుకురాలేకపోతున్నాం ? మన కళ్ళెదురుగా ఇంత దారుణంగా చట్టాలు విఫలం కావడం ఏ అభివృద్ధికి సాక్ష్యం? చిన్న చిన్న ఊళ్ళలో సైతం వ్యభిచారాన్ని ప్రోత్సహించే లాడ్జీలపై పోలీసులు దాడులు నిర్వహించి విటులను పట్టుకుంటారు. మరి భూమ్మీద అతిపెద్ద వ్యభిచార వాటిక అయిన కామాటిపుర విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎందుకని ఏమీ చేయడంలేదు? పాలకులు అక్కడి రౌడీ శక్తులపై సైనిక చర్య చేపట్టి అయినా స్త్రీమూర్తులను కాపాడాలి. భారతదేశంలో కామాటిపుర అనే ప్రాంతం కొనసాగినంత కాలం మనమంతా ప్రతి క్షణం సిగ్గుతో కుంచించుకుపోయి తలదించుకోవాలి.