(గత సంచిక తరువాయి)
ఇంకొక విషయం నేను తెలుసుకున్నాను. నేను నవజీవనమండలిలో పనిచేసేటప్పుడు నాకు చదువొచ్చినా… నా వెనక చరిత్ర నేనెప్పుడూ కొంచెం ఫీలయ్యేదాన్ని… ఎట్లా చెప్పాలి? కొంచెం అసక్తత (నర్వస్)గా అనిపించేది. పెద్ద చదువులేదు. మంచి గతం లేదు. నేనప్పుడుత్తి మెట్రిక్యులేషన్‌ని, నా దగ్గర ఆస్తిలేదు, ఏమీ లేదు అనిపించింది. నేనెప్పుడూ అనుకునేదాన్ని కనీసం గ్రాడ్యుయేట్‌ని కావాలని. అది సరైందో కాదో తెలీదుకాని ఎప్పుడూ నా ఆలోచనల్లో వుండేది నేను చదివితే నాకు హోదా వస్తుందని. అందుకని బెనారస్ పోయి పరీక్షలు రాయటానికని రెండు నెలలు సెలవు కావాలని పార్టీ అనుమతి అడిగాను. ఉద్యమం మంచి తీవ్రస్థానంలో వుంది, నిన్ను పంపించటానికి వీలుపడదని సమాధానం చెప్పారు. అప్పుడు నేను నిర్ణయించుకున్నాను. వాళ్ళొప్పుకున్నా లేకపోయినా నేను వెళ్తాను, నేను లక్ష్యపెట్టనని వెళ్ళాను. నాకప్పుడు వాళ్ళు ముప్ఫైరూపాయలిచ్చే వాళ్ళు, నేను వెళ్ళేటప్పుడాడబ్బులు తీసుకోకుండా వెళ్ళిపోయాను. నేను 1942లో ఇంటర్మీడియట్, 1945లో గ్రాడ్యుయేషన్ పాసయ్యాను. రెండునెలలు బెనారస్‌పోయి పుస్తకాలన్నీ సేకరించాను. అన్నీ కాదనుకో కొన్ని. అందులో కొన్ని చదివాను. (నవ్వు) ఏదో పాసయ్యాను. నేనప్పుడు గ్రాడ్యుయేషన్ చేసినందుకే తర్వాత వుద్యోగం దొరికింది. నేను జైలునుంచి విడుదలయినప్పుడు సాయుధపోరాటంలో పాల్గొన్నవాళ్ళు చాలామంది కుద్యోగాలు దొరికినట్టులేదు. చాలాకొద్దిమంది, వెయ్యిమందికొక్కళ్ళమో బహుశ. గుప్తా చాలా సహాయకరంగా వుండేవాడు. కాని, నాకు డిగ్రీ-లేకపోతే ఆయనేంచేయగలిగేవాడు? నేను చేసింది సరైనదేనని నా నమ్మకం. పార్టీ క్రమశిక్షణకు వ్యతిరేకంగా నేనెట్లావెళ్ళాననే ప్రశ్న ఎవరూ వేయలేదు. వెనక్కి తిరిగొచ్చినప్పుడు పార్టీ హోల్ టైమరునయ్యాను. ఒకసారి జైలుకి పోయొచ్చినతర్వాత – మాత్రం బన్సీలాల్ వుద్యోగం ఇవ్వలేదనుకోండి. అప్పటికి బన్సీలాల్ సెక్రటరీ అయ్యాడు. అతను కమ్యూనిస్టులకు బద్ధశత్రువు. అతని తండ్రికి రాజకీయాల్లేవు. కాని మంచి మనసుంది. చాలా సున్నిత స్వభావం. అట్లానేను మళ్ళీ ఆ స్కూలుకి పోలేదు. ధర్మవంత్ ఉన్నత పాఠశాలకు వెళ్ళాను. అప్పటికది హిందీప్రచారసభ అధీనంలోకొచ్చిందిగనక వాళ్ళు నాకు ఉద్యోగం ఇచ్చారు.
మా అమ్మ ఈ కార్యకలాపాలకభ్యంతరం చెప్పిందా అనడుగుతున్నారు కదా. చెప్పకుండా ఎట్లా వుంటుంది? (టేప్‌రికార్డరుని చూపించి) నాకప్పుడీ అవకాశమే వుంటే ఆమే మన్నదో మీకు వినిసించి వుండేదాన్ని. నేనుద్యోగం వదిలిపెట్టినరోజు మాకావుద్యోగమే ఆధారమయింది. నాకు బంధువుల్లేరు. మామయ్యలు, పినతండ్రులు, అన్నదమ్ములు సహితం చేసేవాళ్ళెవరూ లేరు. ఆ వుద్యోగం ఒక్కటే. నేనది వదిలిపెట్టినరోజు ఆమెకు నామీద చెప్పలేనంత కోపం వచ్చింది. ఆమె జీవితమే చాలా దుర్భరమైనది. అందుకే అన్నీ నేను భరించాల్సి వచ్చింది. నాకు అక్క, చెల్లి ఎవరూ లేరు. ఒక తమ్ముడుండేవాడు కాని పద్నాలుగోఏట చచ్చిపోయాడు. ఆదర్శవాదులంటే మరివన్నీ భరించక తప్పదు. నేను చాలా నమ్రతగల కూతురినయినా భావాలకి సంబంధించిన ప్రశ్న వచ్చినపుడుమాత్రం జరిగేదింతే. మా అమ్మ నన్నర్థం చేసుకొని నాపైన సానుభూతి చూపించిందోలేదో నాకు తెలియదు. దురదృష్టవశాత్తు నా చిన్నతనంనుంచి కూడా మా అమ్మకు నామీద ఏమీ అభిమానం లేదు. నాకు తనమీదుండింది. నేనర్థం చేసుకున్నాను. నిజానికి నేను తనకి తల్లినయ్యాను. మొదట్లోనే మా తండ్రి మమ్మల్నొదిలిపెట్టిపోయాడని, అతని బాధ్యతలు నేను తీసుకోవటం నా విధని నేనర్థం చేసుకున్నాను. అందుకే నేను మెట్రిక్ పాసు కాగానే వుద్యోగంకోసం వెళ్ళాల్సొచ్చింది. ఇంకాముందికి చదివే అవకాశం లేకుండా పోయింది. కాలేజి ప్రిన్సిపాల్ చదవమని ప్రోత్సహించటం జరిగింది. నాకు సహాయం చేస్తానని చెప్పాడతను. నేనే కాదన్నాను. మా తండ్రి వెళ్ళిపోయేటప్పటికి అమ్మకి పద్దెనిమిదేళ్ళు. ఆ తర్వాత ఆమెకు జీవితం లేకుండా పోయింది. అంతా ఛిన్నాభిన్నం అయిపోయింది. నేను సానుభూతితో, ఓర్పుతో అర్థం చేసుకోవటం తప్పనిసరయింది. కాని, అదే సమయంలో నా ఆదర్శాలకోసం గట్టిగా నిలబడడం కూడా అవసరమయింది. ఈ రోజుల్లో అమ్మాయిల్లో అదే లోపిస్తుందని అనిపిస్తుంది నాకు – ఆ ఆదర్శవాదం. పెద్ద చదువులు చదివిన అమ్మాయిలు కూడ తల్లిదండ్రులదగ్గరకొచ్చి ఏంకావాలో అడగటం కనిపిస్తుంది నాకు.
నేను 1969లో జర్మనీనుంచి తిరిగొచ్చినతర్వాత మా అమ్మ చచ్చిపోయింది. అందుకే నేనెక్కువకాలం అక్కడుండలేకపోయాను. తనొక్కతే ఇక్కడుండింది. ఇక్కడ వుద్యమం రోజుల్లో అంతా తను నా దగ్గరేవుండి నాతోటే వుంది. తనను చూసుకోవటం నా బాధ్యత. మొత్తం ప్రపంచంకోసం మనం పనిచేస్తున్నపుడు తననెట్లా నిర్లక్ష్యం చేస్తాం? నేను రహస్యంగా వున్నపుడు కూడా తనను చూసుకున్నాను. మాకు రెండు పాల దుకాణాలుండేవి. ఒకటి బేగంబజార్లో, ఒకటి సుల్తాన్‌బజార్లో. బేగంబజార్లో దుకాణం చూసుకోమని మా అమ్మనడిగాను. తనొప్పుకోలేదు. తనని నేను చూసుకోనని ఏదో నన్ననుమానించినట్టుంది. నేను చెప్పాను – రోజు దాదాపు నూటయాభైరూపాయలు వసూలవుతాయి. ఎవరైన బాధ్యతగల మనుషులుండాలి. నాకెవరైనా దొరికిందాకానైనా చూసుకో అని. నాకు తెలుసు తుఫాను రాబోతున్నదని, తనని చూసుకునేవాళ్ళెవరూ వుండరు. నేను రహస్యంగా వున్నపుడు ఈ దుకాణం కనీసం తనకాధారంగా వుంటుంది. ఆ తర్వాత తనే దుకాణం చూసుకుంది.
ఆమె నన్నర్థం చేసుకోలేదని నేను బాధపడ్డానా? తప్పకుండా. బాధపడకుండా ఎట్లా వుంటాం? మీరు బాధపడరూ? మీరూ పడతారు. నేనామెని ఎంత చూసుకున్నా ఎప్పుడూ చాలా బాధపడ్తూ చాలా టెన్షన్‌లో వుండేది. కాని నేను మా నాన్నకోసం చాలా ఫీలయ్యేదాన్ని. అదామె ఇష్టపడేది కాదు, నేను చిన్నదాన్నిగా వున్నప్పుడివన్నీ నాకేం తెలిసేవి కావు. ఇప్పుడర్థమవుతుంది. ఆమె చాలా దుర్భరజీవితం గడిపింది. నన్నెప్పుడూ అర్థం చేసుకోలేదు. ఆమెకెప్పుడూ కొరుకుడుపడేదికాదు ఈ పిల్లకి తండ్రంటే ఎందుకభిమానం అని. చిన్నపిల్లలదేముంది? తల్లీ తండ్రి ఇద్దరూ కావాలనుకుంటారుకదా! తల్లెంతమంచిదయినా పిల్లలకి తండ్రి కూడా కావాలి. నాకు నాన్నంటేవున్న అభిమానాన్నామె అపార్థం చేసుకుంది, అదే చివరివరకూ వుండింది, చివరివరకూ.
ఇహ నేను చేసే పనేమిటో ఆమెకర్థం కాలేదు. ఇక్కడికొచ్చిన వాళ్ళందరూ ఎందుకేడుస్తూ వస్తారు? ఇక్కడికెవరూ నవ్వుతూరారెందు కని? ప్రతొక్కళ్ళేదో సమస్యలోనో, బాధతోనో, ఏదో ఒక ఆరోపణతోనో వస్తారు. ఇదంతా ఆమెకేం నచ్చలేదు. నేనేం చేయలేకపోయాను.
ఆమె నర్సుగా పనిచేసేది. (మానాన్న తననొదిలేసినప్పుడు మమ్మల్నొక అనాథాశ్రమంలో వుంచి తను నర్సింగ్ కోర్సులో చేరి వుద్యోగం సంపాయించింది. అట్లా మమ్మల్ని పెంచింది. మేమంతా అనాథాశ్రమంలో వుండేవాళ్ళం. అప్పుడు పరిస్థితులు చాలా అధ్వాన్నంగా వుండేవి. ఇప్పుడు దాన్ని మంచివాళ్ళు నడుపుతున్నారను కుంటా. నాలుగైదు సంవత్సరాలే మేమక్కడున్నాం. నేను మొదటి సంతానం. మా అమ్మకి నేను పుట్టేటప్పటికి పదిహేనేళ్ళు. తర్వాత తమ్ముడు పుట్టాడు. మా నాన్న వదిలిపెట్టిపోయేటప్పటికి ఆమెకి పద్దెనిమిదేళ్ళు.
మేమెప్పుడు మంచి స్నేహితుల్లాగా మాట్లాడుకోలేదు. ఆమె తన సమస్యల గురించి నాతో ఎప్పుడు చెప్పలేదు. పనిచేయటంలో వున్న సమస్యలేంటని అట్లా ఎప్పుడు నిర్మొహమాటంగా మాట్లాడుకోలేదు. ఏదో ఒక శత్రుత్వంలాగా వుండేది. అందుకే నేను కూడా, నా స్వభావం కూడా అంతే. ఇప్పుడు నువ్వు నీ మనసువిప్పి మాట్లాడకపోతే నేనొచ్చి నీనెత్తిమీద కూర్చునే తత్వం కాదు నాది. నేను మౌనంగా కూర్చొని సరైన సమయంకోసం ఎదురుచూస్తాను. అమ్మ చచ్చిపోయిన తర్వాత తన బాగ్‌లో నాన్న రాసిన వుత్తరాలు దొరికినవి. ఆమె నాతో ఎన్నడూ చెప్పలేదు. నాన్నెందుకు వెళ్ళిపోయాడు. ఆయన జీవితం ఎట్లా ఉండేది అని. ఆ వుత్తరాలు చదివినతర్వాతే నాకు తెలిసింది మా నాన్నేంటి అని. తర్వాత నేనే స్వయంగా డాక్టర్ శివాజీరావు పట్వర్దన్‌ను కలవటానికి అమరావతి వెళ్ళాను. ఆయనే నాకు చెప్పాడు మా నాన్న గురించంతా. ఆయన నిజంగా ఒక రకమైన సాధువు. ఈ ప్రపంచమంటే ఆయనకు గిట్టలేదు. నిజానికి ఏదో ఒక సిద్ధాంతంలో నమ్మకం ఆ బలం వుండకపోతే ఈ దుర్భర ప్రపంచంలో బ్రతకటం సాధ్యం కాదు. తుకారాం కావటమో, సన్యాసి కావటమో ఒక్కటే మార్గం. అప్పట్లో నాగపూరులో ఒక ముస్లిం సాధువుండేవాడు – తేజుద్దీన్‌బాబా. నాన్న ఆయనతోటే కలిశాడు.. నేను మాతోటే వుంటున్న డాక్టర్ శివాజీని అడిగాను. కాని ఆయన మా నాన్న గురించిగాని, కుటుంబం గురించిగానీ ఎక్కువ సమాచారం ఇవ్వలేకపోయాడు. నేను ప్రయత్నించాను, నాగపూర్ వెళ్ళాను. అక్కడ తేజుద్దీన్‌బాబా సమాధి వుంది. కాని నాకెవ్వరూ ఏమీ చెప్పలేకపోయారు. నేను మహేంద్రతోపాటు వెళ్ళాను. నేను చాలా ఆలస్యంగా వచ్చానని వాళ్ళన్నారు, వాళ్ళు నాకేం చెప్పలేకపోయారు. నాకు ఆ తర్వాత వెతకటం సాధ్యం కాలేదు. ఇప్పుడేం ప్రయోజనం కూడా లేదు. మా అమ్మ దగ్గర నేను చాలా నేర్చుకున్నాను. తన శుభ్రం, టైము ప్రకారం అన్నీ చేసుకోవటం, ఖచ్చితంగా వుండటం – ఈ మంచి లక్షణాలన్నీ తన దగ్గర్నుంచి నేర్చుకున్నవే. ఇంటిపనంటారా, మొదట్నుంచి అలవాటే, నాకు పన్నెండేళ్ళున్నప్పటినుంచీ కానీ ఇతర్ల దగ్గర్నుంచి కూడా మనం చాలా నేర్చుకుంటాం. పక్కవాళ్ళ దగ్గర్నుంచీ నేర్చుకుంటాం.
పధ్నాలుగేళ్ళప్పుడు నా తమ్ముడు చచ్చిపోయాడు. టి.బి. వచ్చింది, ఆశ్రమంలో వుండగానే వచ్చింది. మా అమ్మ చేతనయినంతవరకు చేసింది. మీరట్‌లో టి.బి. హాస్పిటలుకి తీసుకెళ్ళింది. వాడు చచ్చిపోయినప్పుడే ఆమెకు స్థిమితం తప్పిపోయింది. మూర్ఛలు కూడా రావటం మొదలయింది. ఆ రోజుల్లో నర్సుపనంటే యిట్లాకాదు. అప్పట్లో వాళ్ళు సంఘటితంగా లేరు. అనాథాశ్రమం నుంచి నర్సులు కావాలని అడిగేవాళ్ళు. తర్వాత యిక్కడొక ధర్మాసుపత్రిలో మా అమ్మ పనిచేస్తే బాగుంటుందని అన్నాను నేను. తనకు కూడా అది చాలా బాగుండేది. కాని అమ్మ ఒప్పుకోలేదు. పన్నాలాల్‌సెట్టి యిక్కడొక ఆసుపత్రిని నడుపుతుండే వాడు. అక్కడ తాను పనిచేసే అవసరముండేదికాని తను నాకెందుకో అర్థంకాదు. అదేంటో నాకెప్పుడూ అర్థం కాలేదు. ఆమె బహుశ తన బాధ్యతను నేను పంచుకోనని అనుకునుంటుంది. లేదా అదోకరకమైన నిరసన వ్యక్తం చేయడం కావచ్చు. ఆమె మనస్సును నేనెప్పుడూ అర్థం చేసుకోలేకపోయాను. ఎందుకంటే సాధారణంగా ఎవరికైనా ఏదోపని చేయాలనుంటుంది. నాకారోగ్యం బాగలేకకానీ, లేకపోతే యిప్పటికీ ఏదో ఒక పని చేయాలనిపిస్తుంది. నాకు కాని ఎవరైనా వయసులో వున్నప్పుడు పనిచేయటానికెందుకిష్టపడరు? మాకొచ్చిన ముప్ఫై రూపాయల్లో కొంత మా అమ్మకు మహేంద్రవాళ్ళమ్మకు కూడా ఇచ్చేవాళ్ళం. మాకు ఖర్చులకేంవున్నా అందులో సహాయం చేసేవాళ్ళం. మా పెళ్ళి గురించి తానేమనుకుందో నాకు తెలీదు. నాకు పార్టీ అంగీకారం తెలియగానే అమ్మకి చెప్పాను. మేం రహస్యంగా వున్నాం కదా! చాలా తక్కువ కలిసేవాళ్ళం. అందుకే నా పెళ్ళి గురించి తనతో ఏం గొడవ రాలేదు.
నేను పొట్టి నిక్కర్లు, షర్టు వేసుకోని తలకేదన్నా కట్టుకోని మా కామ్రేడ్సు కొడుకులతోపాటు తిరిగేదాన్ని. నా కళ్ళద్దాలు తీసేసి మహేంద్రతోపాటు తిరిగేదాన్ని, మహేంద్రకెవరూ తెలీదుగద. ఉదాహరణకి మొదటిసారి అరుణా ఆసఫ్ ఆలీ వచ్చింది. అందరూ కామ్రేడ్సును కలవాలనుకుందామె. మహేంద్రనెట్లా తీసుకెళ్ళాలి, ఎట్లా కలవాలి తెలియలేదు. అందుకని నేను, అతను సైకిళ్ళమీద వెళ్ళేవాళ్ళం. అప్పుడీ స్కూటర్లుండేవి కావు. నేనతనితో కూర్చునేదాన్ని. అట్లాగే మా పరిచయం ఏర్పడింది కూడా. నేనొక్కదాన్ని వెళ్ళలేదు, నాకు సైకిలు తొక్కటంవచ్చుకానీ అంత శక్తిలేదు. అప్పుడు నేను చాలా సన్నగా వుండేదాన్ని. అందుకనే సులభంగా తప్పించుకోగలిగాను. పోలీసులు కూడా అనుమానించలేకపోయారు. ఒక్క గొంతుతప్ప ఇంకేం సమస్యుండేది కాదు. మొదటిసారి నేనట్లా మారువేషం వేసుకున్నపుడు నాతో ఒక మరాఠ్వాడా విద్యార్థి కామ్రేడున్నాడు. ఆతనొక షెల్టరున్నచోటికి వెళ్ళాలనుకున్నాడు. అదొక పాలసెంటరు నేనక్కడుండాల్సి వచ్చింది అదెక్కడుందో నాకు తెలీదు. ఎట్లాగో కనుక్కొనవల్సివచ్చింది. ఈ అబ్బాయి నాతో వున్నాడు. ఈ అబ్బాయిలు నిజంగా వీళ్ళ సంగతేంటో నాక్థం కాదు. వీళ్ళకు ధైర్యంలేదు, తెలివీలేదు, మెదడుకూడా సరిగ్గాలేదు. సరే, ఇద్దరం పోతున్నాం అఫ్జల్‌గంజ్‌లో అంతా పోలీసులు చుట్టూ వున్నారు. మా దొడ్డితలుపునుంచి మేం బయటపడ్డాం. చాదర్ఘాట్ వంతెనమీద నడుస్తున్నాం. ఈ అబ్బాయేం చేశాడు, పోలీస్‌స్టేషనుకు పోయి మహేంద్రపత్తా అడిగాడు. కాని ఏంటో ఆరోజుల్లో పోలీసులు కూడా అమాయకంగా వుండేవాళ్ళు.
అమోలక్‌రామ్ ఇంట్లో మా పెళ్ళి జరగటం గురించి కూడా వినటానికి మీకు ఆసక్తి వుంటుందనుకుంటా. పార్టీవాళ్ళందరూ వచ్చారు. పెళ్ళంటే పెద్ద ఏముంది? కామ్రేడ్సందరిముందూ ప్రకటించటం అంతే ఆ తర్వాత ఎక్కడివాళ్ళక్కడ వెళ్ళిపోవాలనుకున్నాం. మహేంద్ర, ఓంకార్ పర్షాద్ నన్ను పర్దాలు కట్టిన రిక్షా ఎక్కించి వాళ్ళు సైకిళ్ళమీద వెళ్ళిపోయారు. నేను గన్‌ఫౌండ్రీవైపునుంచి పాతసిటీవైపు వెళ్తున్నాను. ఆమూలమలుపులు ఆబిడ్స్‌మలుపులో, పోలీసువాడు నన్ను పట్టుకున్నాడు. నన్ను పోనియ్యట్లేదు. నా పేరడిగాడు. నేనొక్కదాన్నే వున్నందుకు నన్ననుమానించినట్టున్నాడు. పర్దా వుందనుకోండి, కాని అదున్నందుకు వాడి అనుమానం ఇంకా ఎక్కువయింది. వాడి అనుమానమేమొ నేనేదో బజారుమనిషినని నా అనుమానమేమొ వాడికి నేనెవరో, ఎక్కడినుంచొస్తున్నానో తెలిసిపోయిందని. తెల్లారి ఆరుగంటలయ్యేవరకు వాడు నన్ను పోనివ్వలేదు. పోలీస్‌స్టేషన్‌లోకి రమ్మంటాడు. నేను రానంటున్నాను. నేను పర్దావున్నస్త్రీని, మీ పోలీసాఫీసర్ని బయటకొచ్చి నాతో మాట్లాడమను అన్నాను. నా సీటు కింద కొన్ని పేపర్లున్నాయి. ఒకవేళ వీళ్ళు నన్ను పోనివ్వకపోతే రిక్షాని నన్ను తీసుకొచ్చినచోటికి తీసికెళ్ళి పేపర్లు వాళ్ళకప్పజెప్పితే తనకిపైసలు దొరుకుతవని నేను రిక్షా అతనికి చెప్పి వుంచాను. ఆ రోజుల్లో జనం కూడా కొంత అర్థం చేసుకునేవాళ్ళు. అయితే నేను రిక్షా దిగలేదు. ఆ పోలీసులు ఏం చేద్దామని వాళ్ళల్లోవాళ్ళు మాట్లాడుకుంటున్నారు. అమీను (సబ్-ఇన్‌స్పెక్టర్) గనుక వస్తే నన్ను గుర్తుపడతాడు. అందుకని నేనేం చేశాను, వీళ్ళతో మాట్లాడాను. మీరు కూడా హిందువులే, మీకేంకావాలి చెప్పండి అని ఆ సెంటిమెంటుని కూడా వుపయోగించాను. వేరేమార్గంలేదాయె నాకు మీకు డబ్బు కావాలంటే చెప్పండి అన్నా, నా పర్సులో మూడురూపాయలున్నవి. వాళ్ళల్లోవాళ్ళు మాట్లాడుకోని సరే పదిరూపాయలివ్వమన్నారు. నా పర్సు తెరిచి చూపించి అంతకంటే నా దగ్గరలేవు, మా ఇంటికొస్తే మిగతావిస్తానన్నాను. వాళ్ళు నన్ను నమ్మలేదు. అందుకని నేనుంటున్న అడ్రసు వాళ్ళకిచ్చాను, అదే నేను చేసిన తప్పు కాని చేశాను. వాళ్ళెందుకో నన్ను నమ్మి పంపేశారు, మూడురూపాయలు మాత్రం తీసుకున్నారు. నేను పాలసెంటరుకుపోయి వాళ్ళతో చెప్పాను నేనిట్లా చేశాను, నేనిక్కడుండను, దగ్గరలోవున్న లాహోటి ఇంటికిపోతాను. వాళ్ళొస్తే ఏడురూపాయలిచ్చి పంపించండి” అని. మా నిజాయితీ అట్లా వుండేది. (నవ్వు) నేను వెళ్ళిపోయాను. పోలీసులొచ్చారు. అయితే ఆమె వాళ్ళకి పైసలివ్వలేదనుకో. ఇక్కడెవరూ లేరని కొట్లాడి పంపించేసింది. కాని వాళ్ళు మళ్ళీ లాహోటీ ఇంటికొచ్చారు. లాహోటి తమ్ముడు కూడా వాళ్ళను బాగా తిట్టి పంపించేశాడనుకోండి. కాని మాకు వాళ్ళు నిజంగా వెళ్ళిపోయారా, ఇంటిమీద నిఘా వుంచరా నమ్మకం కుదరలేదు. ఆ తర్వాత మేం టాక్సీ తీసుకోని అక్కడనుంచి ఇంకొక ఇంటికి మార్చేశాం. అట్లాంటివెన్నోసార్లు జరిగినవి. కొంచెం తెలివితేటల్ని ఉపయోగించా లంతే.
ఒకసారి జవాద్‌రజ్వీ, రాజ్‌బహదూర్ ఇద్దరూ జైల్లో వున్నారు. వాళ్ళిక్కడ ఉస్మానియా ఆసుపత్రికి ట్రీట్‌మెంటుకోసం వచ్చేవాళ్ళు. అయితే మేం వాళ్ళని తప్పించి తీసుకెళ్ళటానికి ప్లానేశాం. అన్నీ ప్లాను వేసుకున్నాం. వాళ్ళిక్కడికి వచ్చారు. బాసిద్ అని ఒకతనుండేవాడు. అతను మొదటిమనిషి, అతను వీళ్ళనొకచోటికి తీసుకొస్తే అక్కణ్నుంచి వాళ్ళనింకొక షెల్టరుకు తీసుకుపోవాలని ప్లాను. దానిప్రకారం వాళ్ళను నేను తీసుకెళ్ళాను. కాని రోడ్డు మర్చిపోయాను. (నవ్వు) సిటీ బయట బజారులాంటి ప్రాంతాల్లో రోడ్డు నాకు సరిగ్గా తెలీదు. ఈ లోపల కార్లో పెట్రోలయిపోయింది.
ఇంకా వుంది
(మనకు తెలియని మనచరిత్ర)