బతుకుతూనే వుందాం

వి. ప్రతిమ

ఇంకా ఆరని చితిమంటలతో

మనం ఒకటో తేదీని వెలిగించుకున్నాం,

మనకిదేమీ కొత్తకాదు

మూడేళ్ళ ముందు స్వప్నిక మరణంతోనే కదా

మనం సంబంరంగా సంవత్సరాన్ని ప్రారంభించుకున్నాం

శ్రీలక్ష్మి నుండి నిర్భయదాకా

ఒకటా రెండా

ఆ తర్వాత మరెన్నో?

అలవాటు పడ్డ దు:ఖాలతో

మొద్దుబారిపోయిన చర్మాలతో

మన చుట్టూ తాకితే తగిలేంత

దట్టమైన చీకట్లు మొలుచుకొచ్చినా సరే

నిర్దయగా మనం తింటూనే వుంటాం

తిరుగుతూనూ వుంటాం

మనకిదేమీ కొత్తకాదు

చివరిదిలెమ్మన్న ధైర్యము లేదు

బీటలు వారి తడారిపోయిన గుండెలతో

ఏ మాత్రం చెమ్మగిల్లని కను గవలతో

మనం బతుకుతూనే వుంటాం

మార్పు

వారణాసి నాగలక్ష్మి

రెప్ప వాలితే చాలు

కనుల గూడు తెరుచుకుని

కలలు రెక్కలొచ్చిన పిట్టల్లా ఎగిరేవి!

 

ఎగిరిన కలలు

మూసిన పెదవులపై

ముసిముసి నవ్వులై వాలేవి!

ఆలోచనల హరిత వనంలో

ఆదమరచిన వదనంపై

దరహాస రేఖలై సాగి

మెరుపు తీగలై నర్తించేవి

 

మెలకువొస్తే చాలు

తెరుచుకున్న కనులు

నిర్మలాకాశపు ప్రతి బింబాలతో

తళతళలాడేవి!

కౌమారమెంత కమనీయం!

 

ఇపుడు కనులు తెరిస్తే

ఆకాశంలో లేని మేఘాలు

కన్నుల్లో కాపురముంటున్నాయి

చిరునవ్వులు చిందించబోతే

పెదవులు ముళ్ళతీగలవుతున్నాయి!

 

అలసి సొలసి మేను వాలిస్తే

ముడుచుకుని మూలిగే కలలు

పెదవి వంపులకి అటూ ఇటూ

ముడతలై తేలుతున్నాయి

ఆందోళనల ఖాండవ వనంలో

పక్షులై దహించుకు పోతున్నాయి!

 

చెప్పేందుకేముంది?

గొప్పంతా అతనిదే!

ఏమరుపాటు తగదు

శీలాసుభద్రాదేవి

ప్రతి మనిషిలోనూ

అంతరాంతరాలలో ఏ మూలో

ఎక్కడో దాక్కునే వుంటుంది.

రక్తంలో కణప్రవాహంలోనా

మనసులో ఎగిరే వూహల రెక్కలక్రిందనా

హృదయ కవాట శబ్ద తరంగాల వెనకనా

కనురెప్పల కింద కలల అలజడి గానా

ఏ నిస్సహాయ క్షణంలోనోె సూక్ష్మశరీరమై దూరి

శరీరమంతటా సంచిరిస్తూనే వుండి వుంటుంది

నవమసాలూ మోసి రక్తం తో పాటూ

ఆకారాన్నీ అస్తిత్వాన్నీ పోత పోసిన

తల్లి నుండి అండరూపమై కలిసిందా

స్త్రీగర్భంలోకి సరాసరి బీజరూపమై జారిందా

అమాయకంగా కన్నిప్పిన శిశువు

పాలతోపాటూ విషాన్నీ తాగాడా

ఎదుగుతూ ఎదుగుతూ

ఇంతటి కసినీ కార్పణ్యాన్నీ

ఎక్కడనుండి సేకరించుకొని తనలో నిక్షిప్తం చేసుకొన్నాడు

ఏ అపజయమో గుండెని కోసిందనో

ఏ అగ్రహమో దావానలమై నిలువెల్లా దహిచిందనో

ఏ అవమానమో హృదయాన్ని చీల్చిందనో

ఎప్పుడో ఏ క్షణంలోనో నిస్పృహ

మనసుని ఆవరించిన సమయంలో

ప్రవేశించిన విశ్వరూపమై

సుడిగాలిలా శరీరాన్ని చుట్టేసి

మనసునీ మస్తిష్కాన్నీ ఆక్రమించి

ఆధిపత్యం సాధించే యత్నం చేస్తూనే వుంటుంది

 

నేలానీరు వాయువుల్నే కాదు

మనిషి తనలోని మనిషినీ

కాలుష్యంలోనే పెంచి పోషిస్తున్నాడేమో

అందుకే మరందుకేనేమో

కామ క్రోధ మద మాత్స్యరాలతో

ఒళ్ళంతా కళ్త్లెన ఇంద్రుళ్లు

మన చుట్టూ నిశాచరులై తిరుగుతున్నారు.

దంతాలు సాగి సాచిన కోరల్నీ

పదునుగోల్లు విచ్చిన పంజాల్నీ సారిస్తూ డ్రాకులాలు

వీధుల్నిండా కవాతు చేస్తున్నారు

సీసాల్లో కదిలేవి దాహం తీర్చే నీళ్ళు కావు

మత్తుని తలకెక్కించేవో

మల్లెల్ని మసి చేసే ఆంలాలో

హస్త భూషణాల్ని చేసుకొని

కన్నవారి కంటి దీపాలు

దేశానికి రేపటి నాయకులు

సమాజాన్ని నడపాల్సిన నవ యువత

మాదక ద్రవ్యాల మత్తులో నిర్వీర్యమై పోతూ

కురుక్షేత్ర యుద్ధంలో చీలిన గుండెనుండి

ప్రతి రక్తబిందువూ రూపెత్తిన దుశ్శాసనుళ్లలా మారి

భూమి మీద ప్రతి ప్రాంతానా

వస్త్రాపహరణ సన్నద్ధులై

చేతులు చాపుతూ తిరుగుతూనే వున్నారు

నిజానికి దానవత్వం కళ్ళు తెరవడానికి

అర్ధరాత్రో అపరాత్రో కానక్కర్లేదు

పచ్చటి కుటుంబాల మధ్య

తల్లీ పిల్లల్కీ

తండ్రికూతుళ్లకీ

అక్కాచెల్లెళ్ళకీ

ఒక్కటొక్కటిగా

పరిమళించాల్సిన మానవసంబంధాలన్నింటినీ

నిర్థాక్షిణ్యంగా చిధ్రం చేస్తూ

కుట్రలతో కుతంత్రాలతో రగిలిపోవడం

కళాత్మకంగా రంగుల్లో చూపే మాస్టార్లని

నోర్లెళ్ళబెట్టి చూడడం వరకైతే బాగానే ఉంటుంది

చూస్తూ..చూస్తుండగానే

ఏదో ఒకనాడు

మానసికంగా మనని కూడా చంపే

మానవత్వంపై యుద్ధం క్రపటించేందుకు

మనలో ఏ రక్తకణం చాటునో

మరో రక్తపిశాచి అవకాశంకోసం

పొంచి వుండే వుంటుంది

తస్మాత్‌..జాగత్త్ర

స్తీప్ర్రర్వం

ఆర్‌. శారదాదేవి

తరతరాలుగా స్త్రీలపై జరుగుతున్న అన్యాయాలకు చలించి

కంటినుండి రాలిన ఓ కన్నీటి సిరాచుక్క…..

అది బాల్యమైనా యౌవనమైనా వృద్ధాప్యమైనా స్త్రీకి మాత్రం శాపమే.

పిండదశ నుండి వల్లకాటికి పోయేదాకా క్షణం క్షణం నరకమే.

మగవాడి పురుషాధిక్య దౌష్ట్యాలకు స్త్రీల జీవితాలు ఛిద్రమౌతున్నాయి.

ఘనీభవించిన మానస అగ్ని పర్వతాలు బ్రద్దలై లావా చిమ్ముతున్నాయి.

బాల్య కౌమార దశలు దాటి పెండ్లి చేసుకున్నా

అనేకమంది ఆలు మగల మధ్య అంతులేని అగాధాలు

ఎన్నో నిశీధులలో నిశ్శబ్ద రోదనలు కొనసాగుతున్నాయి.

పైకి చెప్పుకోలేని అంతులేని బాధలు నాగరిక ముసుగేసుకున్నాయి.

సభ్య సమాజం ముందు అందమైన ఆదర్శ జంటలుగా

కనబడే వాటిలో చాలావరకు గాజు బొమ్మలు- గాలి బుడగలు- పేకమేడలే.

సంసారాలలో- చీకటి వెలుగులు, సుఖదుఃఖాలు లాంటి

జంట పదాలలో చాలామందికి చీకటి, దుఃఖం మాత్రమే శేషం.

అలా కాకుండా స్త్రీ సంతోషంగా జీవించాలంటే

స్త్రీ తన జీవితాన్ని శాసించుకునే రోజు రావాలి

స్త్రీకి జరిగే అన్యాయాలను ప్రభుత్వం, సమాజం

చూస్తూ వదిలేస్తే కుదరదు.

కఠిన చట్టాలు సమూల మార్పులతో సత్వరం అమలు చేయాలి.

అందరిలో సామాజిక పరివర్తన రావాలి

మనుషులందరిలో మానవత్వం వెల్లివిరియాలి

మగువలకు మగవారు చేదోడు కావాలి

అప్పుడే స్త్రీలు ఆకాశంలో సగమై అభ్యున్నతి పొందుతారు.

అదే దేశ ప్రగతికి నాంది…..

నెత్తుటి పూలు

మొయిద శ్రీనివాసరావు

అంతటా… పొగమంచు మత్తుగా కమ్ముకుంటూ

తాగి తూగేలా సాగే నగరంలో

ఓ పువ్వు నలిగి

నెత్తురు కక్కుతూ నేలరాలింది

జరిగిన ఘోరాన్ని చూస్తూ

చీకటి చిక్కగా గడ్డకట్టింది

కళ్ళలో నగ్న దేహాలనుంచుకున్న వారి

కబంద హస్తాలు కింద

పూలు నలగడం… మూగగా రోదించడం

ఇక్కడ కొత్తేమీ కాదు…

ఒకరు సత్యవ్రతానికై

నడిబజారులో నిలబెట్టినప్పుడు

వేరొకరు నిండు సభలో

పందెంగా ఒడ్డినప్పుడు

దుఃఖంతో దగ్దమౌతూ

మౌనంగా ముడుచుకున్నాయే తప్పా

ముళ్ళుగా మారి ఎదురుతిరిగింది లేదు

ఆ చారిత్రిక అంగడి దారులలో నడిచి వస్తున్న వారి

కాలి మడమలు కింద

నలిగిన కుంకుమ పూలై

నేడు మంచు మైదానాలలో కునారిల్లుతున్నై

మన్యంలో గిట్టల కింద పడి నలిగిన

గడ్డిపూలై.. గత గాయాలను

తడితడిగా తడుముకుంటూనే వున్నాయి

రాలిన పూలకై…

నెత్తిన నిప్పుకత్తులు ధరించిన కొవ్వొత్తులై

కన్నీరు కారిస్తే

కమ్ముకొస్తున్న పొగమంచు

చిక్కనవుతున్న చీకటి చెదిరిపోవు

పూలన్నీ…. ముళ్ళై కదిలితేనే

నిర్బంధ హస్తాల మధ్య

సరికొత్త సూర్యోదయం పుట్టుకొస్తుంది!!

(ఢిల్లీలో జరిగిన అత్యాచారాన్ని ఖండిస్తూ…)

ఫినిక్స్‌ మొలకా…

జ్వలిత

నరకం నడుస్తుంది

అక్షరాలేరుతానంటేనో

అరుణరేఖనై వెలుగుతానంటేనో

అధికారం అహంకారం హుంకరిస్తోంది

హింస హంసధ్వని ఆలపిస్తూంటే

నిస్సహాయకపోతాలు విలపిస్తూన్నాయి

ఉదయ సంధ్యల్లో ఒకే రుధిరార్ణవం

పాలపిట్టలు బుర్రుపిట్టలు సకలం

రక్తార్ణవంలో తేలుతూ

ఇక్కడ నవ్వులు కృత్రిమమే

సుఖాలు కృత్రిమమే

పిట్టల జాతేదైన దుఃఖం మాత్రమే సత్యం

మలాలా – షర్మిలా – సుల్తానా

ఓ అనామిక… పేరేదైనా

ఎదురీత మొదట్లోనే

బుల్లెటో, కత్తిపోటో, యాసిడో నిత్య ప్రయోగం

కాలిబూడిదైనా ఫినిక్స్‌ మొలకా…

అంకురమై ఆరంభించి

ప్రశ్నించి నిలవడం

ఇది మాత్రమే శాశ్వతం

పదుగురికి మార్గదర్శకమై వెలడం

నీవు నేర్పే సత్యం

పుట్టెడు దుఃఖంలో… నుంచి

కొలిపాక శోభారాణి, ఉమా, శైలజ

అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి

కంటినీరు జీవనదిలా నిరంతరంపారుతూనే ఉంది

పసిపాప అయినా పండు ముసలి అయినా

ఆడదైతే చాలు

ప్రక్కవాన్ని సైతం నమ్మలేని స్థితి

ప్రతివాడు

కాళ్ల మధ్య ఆయుధాన్ని ధరించి తిరుగుతున్నట్టే ఉంది

జీవితంలో అత్యాచారాలకు గురైన సమయాలే ఎక్కువ

కనిపించని హింసకు చితుకుతూ యాతనకు ఏతం

పోస్తున్నట్టుగానే ఉంటుంది

బయటకు వచ్చినా తిరిగి ఇల్లు చేరే వరకు నమ్మకం లేదు

రోజు పేపర్లనిండా చిదిమేయబడుతున్న మందారాలు

బడి గుడి బజారు ఇరుగు పొరుగు వాని వరుస వయస్సు

వ్యత్యాసమన్నదే లేకుండా… జరిగే అఘాయిత్యాలు

కండ్లు కన్నీరుకు బదులు రక్తమోడుస్తున్నాయి

అందరూ నడుస్తున్న రాస్తానే

రద్దీగానే ఉంది

మదమెక్కిన మృ(మ)గాల్లు

ఇక్కడ స్త్రీత్వమే శాపమైంది

కదిలితే మెదిలితే బుక్క బుక్కగా రక్తపు వాంతి

వివస్త్రను చేసి రోడ్డుపై విసిరేయబడ్డది.

మాంసపు ముద్దగా

నూరేండ్ల జీవితం కుత్తెమై ఇరువై మూడేండ్లకే

పదమూడు రోజుల్లో ముగిసిపోయింది

కన్నీళ్లు సానుభూతులు ఎవరిక్కావాలి

చట్టాలు దగా పడ్డ స్త్రీలకు దన్నుగా

నిలవాల్సే ఉంది.

Share
This entry was posted in కవితలు. Bookmark the permalink.

One Response to బతుకుతూనే వుందాం

  1. sreenivasulu says:

    చాలా భాగుంధి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.