ఆధునిక సాహిత్యంలో గురజాడ పాత్ర – ఒక పరిశీలన

జాలిగం స్వప్న

పరిచయం:

”ఎందరో మహానుభావులు

అందరికీ వందనములు”

”అడుగుజాడ గురజాడది అది భావికి బాట” అన్న ఒకే వాక్యంతో శ్రీశ్రీ ఆధునిక యుగకర్తగా తెలుగు సాహిత్య చరిత్రలో గురజాడ స్థానం గూర్చి తీర్పు ఇచ్చారు. గురజాడగా ప్రసిద్ధి పొందిన వీరి పూర్తిపేరు గురజాడ వెంకట అప్పారావు.

సమాజంలోని కుళ్ళును, మత మౌఢ్యాన్ని, కుల దురహంకారాన్ని, గ్రాంధిక భాషా ఛాందసత్వాన్ని, స్త్రీల పట్ల అణచివేతను తీవ్రంగా నిరసిస్తూ తన కలాన్ని కత్తిగా మలచి అభివృద్ధి నిరోధకత్వంపై పోరాడిన యుగకర్త గురజాడ. ఈయన దృష్టిలో సాహిత్యం ఒక భోగ (వినోద) వస్తువు కాక సమాజంలోని మార్పుకు ప్రజల పక్షాన కృషి చేసే ఆయుధంగా (దిక్సూచి)గా భావించారు. అందుకే గురజాడ అభ్యుదయ కవితా పితామహుడు, నవయుగ వైతాళికుడయ్యాడు.

జననం – కుటుంబ నేపథ్యం:

గురజాడగారు 1862 సెప్టెంబర్‌ 21వ తేదీన విశాఖ జిల్లా, ఎలమంచిలి తాలూకాలోని రాయవరం గ్రామంలో మాతామహుల ఇంట జన్మించారు. తల్లి కౌసల్యమ్మ, తండ్రి వెంకటరామదాసు. గురజాడ పూర్వీకులు కృష్ణాజిల్లా గురజాడ గ్రామంనుండి విశాఖ మండలానికి తరలివచ్చారు. గురజాడ తండ్రి ”చీపురుపల్లి”లో ఉద్యోగం చేసేవారు. అందువల్ల గురజాడ ఆ ఊరులో ఉన్న గ్రాంటు స్కూలులో మొదటి మూడు తరగతులు చదివారు. వెలువలి రామమూర్తి పంతులుగారి వద్ద సంస్కృత, ఆంధ్ర, ఆంగ్ల భాషలు నేర్చుకున్నారు. విజయనగరం మహారాజావారి హైస్కూలులో లోయర్‌ ఫోర్త్‌, అప్పర్‌ఫోర్త్‌, ఫిప్తు, మెట్రిక్యులేషన్‌ చదివారు. 1882లో మెట్రిక్యులేషన్‌ ఉత్తీర్ణులయ్యారు. 1882-1884 మధ్య ”ఎఫ్పే” చదివారు. 1884-1886లో ఫిలాసఫీలో బి.ఎ. చదివారు. బి.ఎ. చదువుతుండగా 1885లో అప్పారావు వివాహం జరిగింది. భార్యపేరు ”అప్పల నర్సమ్మ”. ఈ దపంతులకు 1887లో లక్ష్మీ నరసమ్మ (కుమార్తె), 1890లో వెంకటరామదాసు (కుమారుడు) 1902లో కొండయమ్మ (కుమార్తె) జన్మించారు.

గురజాడ బి.ఎ. ఉత్తీర్ణత పొందడంతో ప్రిన్స్‌పాల్‌ చంద్రశేఖరశాస్త్రి రాజావారి కళాశాలలో ఎనిమిదో అసిస్టెంట్‌ లెక్చరర్‌గా ఉద్యోగం వేయించారు. నెలకు 25 రూపాయలు జీతం కావడంతో, ఆర్థిక ఇబ్బందుల వల్ల 1886లో కళాశాల నుండి సెలవు తీసుకుని ”డిప్యూటీ కలక్టరాఫీసులో” హెడ్‌ క్లర్కుగా చేరారు. కాని ఆ ఉద్యోగం సంతృప్తినివ్వలేదు. తిరిగి 1887లో ఆనందగజపతి మహారాజా వారి కళాశాలలో నాలుగవ లెక్చరర్‌గా చేరారు. దానితో పాటు మహారాజావారికి వార్తాపత్రిలు చదివి విన్పించినందుకు మరో 50 రూపాయలు అదనంగా ఇచ్చేవారు. మొత్తంగా నెలసరి జీతం 150 రూపాయలు వచ్చేవి. 1889లో మహారాజావారి ఆస్థానంలో ఏర్పాటు చేయబడిన డిబేటింగ్‌ క్లబ్‌ చర్చావేదికకు ఉపాధ్యక్షుడైనారు. 1896లో విజయనగరం సంస్థానంలో శాసన పరిశోధకునిగా నియమితులైనారు. 1897లో ఆనందగజపతి మరణానంతరం సంస్థానం వ్యవహారాలను చక్కబెట్టే బాధ్యత నిర్వర్తించారు. 1898 నుండి 1912 వరకు రీవారాణి అంతరంగిక కార్యదర్శిగా చేసి 1913 ఫిబ్రవరిలో ఉద్యోగ విరమణ పొందారు.

గురజాడ రచనా వ్యాసంగం:

గురజాడలో మెట్రిక్యులేషన్‌ చదువుతున్నప్పుడే కవిత్వ శక్తి వికసించింది. ఆంగ్లంలో ”కకూ” (కోకిల) అనే కవితను వ్రాశారు. సంస్కృతంలో శ్లోకాలు వ్రాస్తుండేవారు. 1883లో ఇంగ్లీషులో ”సారంగధర” అనే కథా కావ్యాన్ని రాశారు. అది ”ది ఇండియన్‌ లీజ్జర్‌ అవర్‌” అనే ఆంధ్రాంగ్ల పత్రికలో ప్రచురించబడింది. కలకత్తా నుండి వచ్చే ”రీస్‌ అండ్‌ రయ్యత్‌” అనే పత్రికలో ”సారంగధర” ను పునర్ముద్రించారు. ఈ పత్రికా సంపాదకుడైన శంభుచంద్ర ముఖర్జీతో గురజాడకు ఉత్తర ప్రత్యుత్తరాలు నడిచేవి. గురజాడ రాసిన రచనల్లో కన్యాశుల్కం ఒక గొప్ప రచన. ఇది ప్రపంచ సాహిత్యంలో గొప్ప ఆదునిక నాటకాల సరసన నిలిచిన నాటకం. దీని తొలికూర్పు 1897లో, రెండవ ముద్రణ 1909లో జరిగింది.

1909లో నీలగిరి పాటలు రచించారు. 1910లో గురజాడను తెలుగు కవిత్వ చరిత్రలో చిరస్థాయిగా నిలిపిన ”ముత్యాల సరములు” రచన చేశారు. ఇది కవితా సంపుటి. ఇందులో ముత్యాల సరాలు, కాసులు, లవణరాజుకల, కన్యక, పూర్ణమ్మ, లంగరెత్తుము, డామన్‌ పితియస్‌, దేశభక్తి గేయం మొదలైన కవితా ఖండికలున్నాయి. కొండు భట్టీయం, బిల్హణీయం అనే అనువాద నాటకాలు రచించారు. దిద్దుబాటు, దేవుళ్లారా మీ పేరేమిటి? మతం – విమతం, సంస్కర్త హృదయం, మెటిల్డా వంటి కథానికలు రచించారు. గురజాడ గారి లేఖలు కూడా ఒక ప్రత్యేకతను సంతరించుకున్నాయి. మాటల మబ్బులు, పుష్పలావికలు, మెరుపులు, సుభద్ర, ఋతుశతకం వంటి సంస్కృత రచనలతో ఆపటు సౌదామిని వంటి నవలలను కూడా రచించారు. కథ చెప్పేటప్పుడు ఒక ఎత్తుగడా, నడిపించే తీరూ, నాటకీయత, ఒక పతాక స్థితి, ఒక ముగింపూ తప్పకుండా ఉంటాయి. వీటన్నింటి మేళవింపు గురజాడ రచనల్లో మనకు దర్శనమిస్తాయి.

ఆధునిక సాహిత్యంలో గురజాడ పాత్ర – ఒక పరిశీలన:

”జీవితం స్పష్టం చేయలేని దాన్ని సాహిత్యం స్పష్టం చేస్తుంది” అని కొడవటిగంటి కుటుంబరావు చెప్పిన మాట గురజాడ సాహిత్యానికి పూర్తిగా వర్తిస్తుంది. గురజాడ సాహిత్య పతాక సంఘ సంస్కరణకు మించిన సాంఘిక విప్లవం. అందుకే ఆయన ఆనాటి మొత్తం భారతదేశంలోనే విశిష్టమైన సాహితీవేత్త. సమకాలీన కొత్త వస్తువుతో, కొత్త దృక్పథంతో, కొత్త రూపంతో గురజాడ తన నాటక కళను కవిత్వాన్ని, కథానికను తీర్చిదిద్దినారు. దానికి నిదర్శనమే ఆనాటి కాలంలోని కన్యాశుల్క వివాహాలను నిరసిస్తూ, అనాదిగా కొనసాగుతున్న సంస్కృత నాటక కళను నిరాకరించి వాడుక భాషలో కన్యాశుల్కం రచించడం. వ్యవహారిక భాషలో రచన చేయడమే కాకుండా 1906లో సహాధ్యాయి అయిన గిడుగు రామమూర్తి పంతులుతో కలిసి వాడుకభాష కోసం మహోద్యమాన్ని ప్రారంభించారు. ఇలా వాడుకభాషలో రచనలు చేసి ఆధునిక సాహిత్యంలో వాడుక భాషకు పునాదివేసి ”ఆధునిక యుగకర్త” అయినారు. వేదాంతం పేరుతో మనదేశంలో ఎంత వంచన ఎంత మూర్ఖత్వం సాగుతుందో అని వాపోయాడు గురజాడ.

”మతములన్నియు మాసిపోవును

జ్ఞానమొక్కటి నిలిచి వెలుగును” – అని ఎలుగెత్తి చాటారు.

మతాచారాల పేరుమీద సాగే స్వార్థపరత్వాన్ని ఎండగడుతూ రాసిన కథ – ”మీ పేరేమిటి?” మానవ సంబంధాల ఉద్వేగాలు మతాలకు అతీతమైనవి అని పెద్ద మసీదు కథ విశదపరుస్తుంది. మూఢ విశ్వాసాలను తృణీకరించే విధంగా ”ముత్యాల సరములు’ రచన చేశారు.

”దేశమంటే మట్టికాదోయ్‌

దేశమంటే మనుషులోయ్‌” – అంటూ

దేశభక్తి గేయం ద్వారా ప్రజల్లో జాతీయ భావ స్ఫూర్తిని నింపారు.

”ఆధునిక మహిళ భారతదేశ చరిత్రను తిరగరాస్తుందని” ఆశాభావం వ్యక్తం చేశారు. గురజాడ రాసిన తెలుగులో మొదటి కథానిక అయిన ”దిద్దుబాటు” ద్వారా ”పురుషుడి అడుగుజాడల్లో స్త్రీ నడవటం కాదు, పురుషుడికి నడక నేర్పేది, పురుషుడి జీవితాన్ని తీర్చిదిద్దేది స్త్రీ” అని చాటి చెప్పారు. వర్ణవ్యవస్థను పూర్తిగా నిరాకరించి మంచి చెడ్డల ప్రాతిపదికగా మనుషులలో రెండే కులాలున్నాయి అని చెప్పారు.

”మంచి యన్నది మాలయైతే

మాలనే అగుదున్‌” అని గురజాడ

మంచివైపు నిలబడటానికి సంసిద్ధతను వ్యక్తం చేశారు. ఇలా సమాజం ఎదుర్కొనే సమస్యలను వస్తువుగా తీసుకొని శ్రీశ్రీ వంటి ఎందరో ఆధునిక రచయితలకు మార్గదర్శకులు అయ్యారు. ఆధునిక సాహిత్యంలో ఎన్నో ఉద్యమాలకు ప్రేరకులైనారు.

ముగింపు:

ప్రాచీన కాలం నుండి సాహిత్యాన్ని కేవలం ఒక భోగ(వినోదవస్తువు) వస్తువుగానే భావించి రచనలు చేశారు. నాటి వ్యవస్థను నిరసిస్తూ సమాజ మార్పే సాహిత్య లక్ష్యం అంటూ రచనలు చేశారు గురజాడ. ప్రజాస్వామ్య యుగపు లక్ష్యాలైన స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం సాధనకు కలంబట్టి నాటకం, కవిత్వం, కథలు, సాహిత్య, విద్యారంగంపై విమర్శనా రూపాలతో చివరి క్షణాల దాకా సమాజ ప్రగతికై రచనలు చేశారు. స్త్రీ జాతికి సమాన గౌరవం దక్కాలని పురుషాధిక్య సమాజాన్ని ధిక్కరించిన గురజాడ 1915 నవంబరు 30నాడు కన్నుమూశారు. కానీ ఆయన రచనలు మరియు కృషి కులమత తత్వాలు ఉన్నంత కాలము, స్త్రీలపై అణచివేత, పీడన కొనసాగినంత కాలం వాటికి వ్యతిరేకంగా పోరాడుతున్న శక్తులకు స్ఫూర్తిని, చైతన్యాన్ని అందిస్తూనే వుంటాయి. కొందరు జీవిస్తూ మరణిస్తారు. మరికొందరు మరణించి జీవిస్తారు. ప్రజాకవి గురజాడ మరణించినా కూడా ప్రజల గుండెల్లో జీవిస్తూనే ఉంటారు.

Share
This entry was posted in వ్యాసం. Bookmark the permalink.

One Response to ఆధునిక సాహిత్యంలో గురజాడ పాత్ర – ఒక పరిశీలన

  1. Pingback: ఆధునిక సాహిత్యంలో గురజాడ పాత్ర – ఒక పరిశీలన | Blogillu

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.