– కుప్పిలి పద్మ
మళ్లీ ఫాల్గుణం మన జీవనంలోకి. విప్పారిన వేపపువ్వుల కమ్మని వగరు గాలి, ముదురాకుపచ్చ ఆకుల గుబురుల్లోంచి దోబూ చు లాడుతోన్న చిన్నచిన్న మామిడి కాయలు, లేతాకుపచ్చ చిగురుల్లోంచి మొగ్గలేసిన మల్లెలు, వీధివీధంతా నగరమంతా ప్రవహిస్తున్న దిరిసెన పువ్వుల పసుపచ్చని కాంతులు.
మబ్బులు లేని ఆకాశం, నక్షత్రాలు వెదజల్లుతోన్న కాంతి. అయినా యెక్కడినుంచో అమ్మ కన్నుకప్పి అటూ ఇటూ తిరుగుతూ స్నేహితులతో దొంగాటాడే అల్లరి పిల్లలా వో మేఘం గబగబా జల్లు కురిపించింది కాసేపు. మట్టి సుగంధం వెచ్చగా… కోయిలాగమనానికి స్వాగతం పలుకుతూ..
ఈ ఫాల్గుణాన్ని వూహ తెలిసినప్పటి నుంచి ప్రతి యేడాది చూస్తూనే వున్నా ఎప్పుడూ మనసంతా వసంతహేల గిలిగిం తలు పెడుతూనే వుంటుంది. అడివైనా, మైదానాలైనా, ఎడారైనా, కొండలైనా, నదీమతీరాలైనా, పల్లెలైనా, నగరాలైనా రుతువులు తమ ఆగమగీతాలని మనకి కాన్క చేస్తూనే ఉన్నాయి. మన ఆంతరంగాన్ని సంతోషపు సన్నాయి నాదంతో స్పర్శిస్తూనే ఉన్నాయి.
ఈ ప్రపంచం ఇప్పుడు అత్యంత వేగవంతమైంది. ఈ వేగంలో వేదన ఉంది. ఈ వేగంలో హింస ఉంది. ఈ వేగంలో అనిచ్చితి వుంది. ఇంత వేగవంతమైన ప్రపంచంలో మనమింకా సమభావన కోసం సంభాషిస్తూనే ఉన్నాం. అంతే కాదు మనం మన జీవితాలని సీసీ కెమారాల చాటున సాగిస్తున్నాం. కారంపొడి, పెప్పర్ స్ప్రే మనం మోసుకు తిరగాల్సిన దుస్థితి.
ఇవన్నీ ఒక ఎత్తైతే మన వెంట ”వాళ్లు” తిరగటాన్ని చాలా సరదాయైన విషయంగా మన నాయకులు మాట్లాడ టం, ఆ మాటలకి వినిపిస్తున్న నవ్వులు చూస్తుంటే ఇప్పుడు ”వాళ్ల” చిలిపితనం చిలిపితనంలా లేదు. వాళ్లు ఫాలో అవ్వటం అడుగులని తడబడనీ యటం లేదు. అవన్నీ ఇప్పుడు పరమ హింసాత్మకంగా వాళ్ల ఆధిపత్యాన్ని ప్రదర్శించే సంఘటనలవుతున్నాయి. మనం మన భద్రత కోసం రేయిపగళ్ళు నినదించాల్సి వస్తుంది. మనం మన రోజువారి ప్రయాణా ల్లో పరిగెడుతున్న చెట్లనో, ఎగురుతోన్న పక్షులనో, పుస్తకం చదువుకోవటమో, పక్కవారితో మాటాడ టమో, కునుకు తీయటమో మనమిప్పుడు చేయలేకపో తున్నాం. మనకళ్లు ఇప్పుడు నిరంతరం మనలని ఏ కళ్లు అయినా వెంటాడు తున్నాయా అని చుట్టూ చూస్తున్నాయి. ఏ చూపులు మనలని విసిగిస్తున్నాయోననో లేదా వేటాడుతు న్నాయో ననో మనకి మనమే నిరంతర కాపలాదారుల్లా ఉంటున్నాం. అయినప్ప టికి మనం మన సంతోషపు దారులకి సర్వ సమయాలలో మన మనోగవాక్షపు తలుపులని తెరిచే ఉంచు కొన్నాం. ప్రపంచం ఎంత వేగవంతమైనా కానీ ఈ బయట ప్రపంచం ఎంతగా భయాన్ని విసరనీ, మన చుట్టూ రకరకాల పేర్లతో ఎంతటి ద్వేషాన్నైనా రహస్యంగానో, బహిరంగంగానో కుమ్మరించినా మనం ఎల్లవేళలా జాగ్రత్తగా వుంటూనే, మనం మన లోపలి స్వేచ్ఛని కాపాడుకోటానికి నిరంతరం మనం సాధన చేయాల్సిందే. ఎటువంటి సాధన చెయ్యాలి. ఇది ఎవరికి వారే గుర్తించుకోవాల్సిన విషయంగా అనిపిస్తోంది.
అలానే మన చుట్టూ జరుగుతున్న వాటికి హృదయమెంత కలత చెందినా చిన్నిచిన్ని రేకుల పువ్వులు వికసించటం చూస్తుంటే మనసు ఉత్సాహపు ప్రవాహమవుతుంది. గత కొంత కాలంగా దేశ రాజధానిలో జరిగిన సంఘటనలు, రాష్ట్ర రాజధానిలో జరిగిన పేలుళ్ళు అందరినీ ఆందోళనకి, దుఃఖానికి లోనుచేసినవి. ఇప్పటికీ ఆ పరిసరాలలో అప్పటి జనసం దోహం కనిపించటం లేదు. ఇంకా పూర్తిగా కోలుకోలేదు నగరం. అటువంటి పరిస్థితుల్లో ఫాల్గుణ పునరా గమనం, గాయా లని మాన్పే లేపనం పూస్తూ తెల్ల తెల్లగా. ఈ నగరానికి కోకిలా వచ్చేస్తుంది త్వరలో బాధాతప్త హృదయాలకి ఉపశమానాన్నిచ్చే తీయన శాంతి గీతాలని వినిపించడానికి.
ఇది ఒక సాధన. మన చుట్టూ సంక్షోభమున్నా, విద్వేషమున్నా మనలని ఎంతో విశాల హృదయంతో హత్తుకొనే రుతువుల ప్రేమస్పర్శతో మనం తిరిగి తిరిగి ఈ ప్రపంచాన్ని నూతన శిశువు కనురెప్పలని విప్పార్చినంత కొత్త జీవనాశక్తితో ఆలింగనం చేసుకుందాం.
అలాంటి ఫాల్గుణపు సుమసౌర భాలు కమ్ముకొంటున్న ఈ కాలంలో సమస్త విద్వేషాలని ఎలా శుభ్రపరచొచ్చో మిత్రులతో కలిసి మాటాడుదాం.