– వనజ తాతినేని

ఏకబిగిన చదివింప జేసిన ఈ నవలలోని పాత్రలన్నింటిలోకి నన్ను ఆకర్షించిన పాత్ర ”ఇందిర”

ఇందిర గురించి ఈ పరిచయం

స్వాతంత్య్రానంతరం వచ్చిన నవలలన్నింటిలోనూ కొన్ని నవలలను పంచకావ్యాల వంటివని సాహితీ కారులు పేర్కొన్నారు. అందులో ”కాలాతీత వ్యక్తులు” నవల ఒకటి.

ఈ నవలా రచయిత్రి డా||పి. శ్రీదేవి. మనకి స్వాతంత్య్రం వచ్చిన పదేళ్ళకి వ్రాయబడిన సీరియల్‌ ఇది. ”తెలుగు స్వతంత్ర”లో 21 వారాల పాటు దారావా హికంగా వచ్చిన నవల ఇది. అప్పుడు గోరా శాస్త్రిగారు ఆ పత్రికకి సంపాదకులుగా ఉన్నారు.

దేశ స్వాతంత్య్రానంతరం పాశ్చాత్య నాగరికత ప్రభావంతో స్త్రీలలో వచ్చిన మార్పులకి వారి ఆలోచన విధానంకి మధ్య తరగతి మనుషుల మనస్తత్వానికి ఈ నవల అద్దం పట్టింది.

విశేషం ఏమిటంటే ఇప్పటి కాలానికి కూడా ఇందిర పాత్ర లాంటి స్త్రీలని మనం వ్యతిరేకిస్తూనే ఉండటం. యాభై ఐదు సంవత్సరాల క్రితం డా|| పి. శ్రీదేవి రాసిన ఈ నవలలోని ”ఇందిర” పాత్ర ఇప్పటి కాలంలోని చాలామంది స్త్రీల పాత్రలకి దర్పణం. స్త్రీ స్వతంత్రంగా ఆలోచించడం, సమాజం ఏమి అనుకున్నా పట్టించుకోకుండా తను బ్రతకాలి అనుకున్నట్లు బ్రతికి తీరడం తనదైన వ్యక్తిత్వం కల్గి ఉండటం, దానిని కాపాడుకోవాలని ప్రయత్నించడం ఇవన్నీ ఆ నవలలో గోచరిస్తాయి.

అసలు కాలాతీత వ్యక్తులు నవలలో ఎవరు ప్రధాన పాత్రధారిణి అనే విషయంపై కూడా భిన్నాభిప్రాయాలు ఉన్నాయి.

”కల్యాణి” పాత్ర ఆ నవలలో మరొక ముఖ్య పాత్ర.

ఈ నవలలోని పాత్ర లన్నింటి కంటే ఇందిర పాత్ర పాఠకులని ఆకర్షిస్తుంది. నవలలోని మిగతా పాత్రలన్నీ కూడా ఆమె చుట్టూనే తిరుగుతూ ఉంటాయి. అసలు ఈ పాత్రలేకుంటే ఈ నవల ఇంత ప్రసిద్ధి చెంది ఉండేది కాదు.

చాలామంది కాలానికి అనుగుణంగా కాలగమనంలో ఒదిగిపోయి కాల ప్రవాహంలో కలసిపోతారు. కానీ అలాంటి వ్యక్తి కాదు ఇందిర. చిన్నతనంలోనే తల్లి మరణించినా తండ్రి దురలవాట్లు, బాధ్యతా రాహిత్యం మధ్య స్వశక్తితో చదువుకొని ఉద్యోగం సంపాదించుకుంటుంది. చాలీ చాలని జీతం మధ్య అన్నీ అవసరాలు తీరక పోవడం, తండ్రిని కూడా తానే పోషించాల్సి రావడం వల్ల కొన్ని సాంఘిక కట్టుబాట్లని లోక మర్యాదలని ఎదిరించింది. తనకి నచ్చిన రీతిలో హాయిగా జీవించడం నేర్చుకుంది. ఒకవిధంగా కాలానికి లొంగకుండా తనకి ఎన్ని సమస్యలు వచ్చినప్పటికీ కూడా చలించకుండా మనిషి కృంగకుండా వాటిని ఎదిరించి అవసరం అయితే ఇతరులని మోసం చేయడం, వారిని నిర్దాక్షిణ్యంగా ప్రక్కకి నెట్టి పరిస్థితులని తనకి అనుకూలంగా మార్చు కుంటుంది.

అందుకే ఇందిర పాత్ర చాలా మందికి నచ్చకపోవచ్చు. కానీ ఈ నవలలో ప్రధాన పాత్ర ఇందిర. కాలాతీత వ్యక్తిగా కూడా ఆమెనే పేర్కొనవచ్చు. ప్రకాశంతో స్నేహం చేస్తుంది. షికారుగా అతనితో బీచ్‌కి వెళుతుంది. ప్రకాశం స్నేహితుడు కృష్ణమూర్తితో సెకండ్‌ షో సినిమాకి వెళుతుంది తన సరదాలు, అవసరాలు తీర్చుకోవడం కోసం వారితో చనువుగాను మెలుగుతుంది. పక్షిలా ఎగిరిపోయే స్వేచ్ఛ కావాలని తనకి ఆ స్వేచ్ఛ ఉన్నప్పటికి తన రెక్కలు పేదరికం అనే తడితో బరువెక్కి ఎగరలేకపోతున్నాను అని చెప్పుకుంటుంది.

తాను ఉంటున్న ఇంటి పై భాగంలో అద్దెకి ఉంటున్న ప్రకాశం తనతో పాటు తన గదిలో పేయింగ్‌ గెస్ట్‌గా ఉంటూ కాలేజీలో ఆనర్స్‌ చదువుకుంటున్న కల్యాణిల మధ్య చనువు పెరగడాన్ని గమనించిన ఇందిర ఈర్ష్య పడుతుంది. మగవారి దగ్గర కష్టాలు అన్నీ ఏకరువు పెట్టి సానుభూతి సంపాదిం చుకోవడం చేస్తుంది అనుకుంటుంది.

ఇందిర పాత్ర ముక్కు సూటిదనం ఇలా ఉంటుంది.

”ఏమిటి ఆలోచిస్తున్నావ్‌ ప్రకాశం” అని అడుగుతుంది ఇందిర.

కల్యాణి గురించి అంటాడు అతను.

”అస్తమాను కల్యాణి కల్యాణి అంటావ్‌? నా గురించి ఆలోచించు. నేను అంతకన్నా ఎక్కువ బరువు ఈడ్చుకొస్తున్నాను నా చదువుని మధ్యలో వదిలేసి ఉద్యోగం వెతుక్కోవలసి వస్తుంది. నాన్న సంగతి నీకు తెలుసు. అయినా గడియ గడియకు కాళ్ళు జాపి కూర్చుని ఏడవడం నాకు చేతకాదు, విశాలమైన కళ్ళు తిప్పి వల వలా ఏడ్చేస్తే నీలాంటి జాలిగుండె కల మగవాళ్ళు ఆదుకుంటారు. వాళ్లతో నేను కాలక్షేపం చేయలేను. ఆమెలా జాలిగా కళ్ళు తిప్పడం నాకు చేతగాదు. అంత నంగనాచి తనం నాకు లేదు. నా బరువుతో ఇంకొకరిపై ఒదిగిపోయి కాలక్షేపం చేద్దామన్న దురాశ నాకు లేదు. నేను బలపడి ఇంకొకరికి బలమివ్వాలనే తత్త్వం నాది” అంటుంది.

ఇందిర గురించి చదువుతున్నప్పుడు ఆ పాత్రపై అయిష్టం కలుగుతూ ఉంటుంది. ఆమెలో ఈర్ష్యని గమనిస్తాం. ప్రకాశం కల్యాణికి ఆకర్షితుడవుతున్నాడని తెలుసుకుని అతనిని తనవైపు మళ్ళించుకుంటుంది. పైగా కల్యాణిపై దుష్ప్రచారం చేసి ఆమె తన దారికి అడ్డురాకుండా చేసుకుంటుంది. అలాగే వసుంధర కృష్ణమూర్తిపై ఇష్టాన్ని పెంచుకుంటుందని గమనించి అతనిని తెలివిగా తను దక్కించుకుంటుంది.

తనకి కావాల్సిన దానిని బలవం తంగా అయినా దక్కించుకునే మనస్తత్వం ఆమెది. ప్రపంచంలో ఒకరికోసం ఒకరు ఏదీ చేయరు. ఎవరికోసం వాళ్ళే చేసుకుంటారు. అది నాకు చేతనవును అనుకునే వ్యక్తి ఇందిర.

ప్రకాశం మేనమామ కుదిర్చిన పెళ్లి సంబంధాన్ని వదులుకుని ఆమెకోసం వచ్చినప్పుడు అతనిని తిరస్కరిస్తూ ఇలా అంటుంది. ”సాధారణంగా పిల్లలకి తల్లిదండ్రులు గార్డియన్‌ లాగా ఉంటారు. నా దగ్గరికి వచ్చేసరికి తల్లక్రిందులై నేనే నాన్నకి గార్జియన్‌ కావాల్సి వచ్చింది. ఆడదాని మనసు నీకు తెలియదు ప్రకాశం! నేను నీకు ఉన్నాను. నీ సమస్యలు, నీ బరువులు అన్నీ నా మీద అనగల్గే మగవాడు అవసరమైతే నా కోసం అన్నీ వదిలేసే మొగవాడు కావాలి. ప్రేమ కోరిన త్యాగం చేయలేనివారు ప్రేమకి అనర్హులు. నీ మీద నేను చాలా మమకారం పెంచుకున్నాను. నువ్వొక వెన్నెముక లేని మనిషివని నాకు తెలుసు. తోమగా తోమగా కొంత గట్టిపడతావు అనుకున్నాను. కొన్ని అనుభవాల తర్వాత అయినా ఒక మనిషిలా ప్రవర్తిస్తావనుకున్నాను. పుట్టుక నుండే నువ్వో సగం మనిషివి. బీటలు వారిన వ్యక్తిత్వం. బాగు చేయాలని ప్రయత్నించాను కాని అది నావల్ల కాదు. నీకు నాకు కుదరదు” అని నిర్మొహమాటంగా చెబుతుంది.

ఇదంతా చదువుతున్న పాఠకుడికి ఆమె పాత్ర పట్ల సరియైన అభిప్రాయమే కలుగదు. ఇందిర కొలీగ్‌ వైదేహి అన్నదమ్ములు ఆమెకి ఇష్టంలేని వాడిని చేసుకోమని బలవంతం చేస్తుంటే ఇల్లు విడిచి వచ్చేసి ఇందిర ఇంట్లో ఉంటుంది…

వైదేహి ఇందిరతో ఇలా అంటుంది ‘అమ్మాయిల్ని యాభైసార్లు సంతలో పశువుల బేరంలా కూర్చోబెట్టి మాట్లాడటం నాకు ఇష్టం లేదు. అంటే ఇందిర ఇలా అంటుంది.’ ‘పశువు కాకపోతే మరో నందికేశుడు జీవితమే పశువుల సంతలా అయినప్పుడు అమాయ కంగా సుమతీ శతకంలో నీతులన్నీ వల్లే వేస్తే మనలని వెనక్కి నెట్టడం ఖాయం. ఎలాగోలా తీర్థంలో జనాన్ని మోచేతులతో నెట్టుకొని ముందుకు వెళ్ళడమే’ అంటుంది.

కావాలని కృష్ణమూర్తికి దగ్గరవుతుంది. తన జీవితం సుఖంగా సాగిపోవాలి అంటే కృష్ణమూర్తిలాంటి వాడే తగిన వ్యక్తి అనుకుం టుంది. అతనికి తగిన చదువు సంధ్యలు లేకపోయినా వెనుక ఆస్తి పాస్తులు ఉండటమే కాదు ఆ ఆస్తిపాస్తులే అతనిని నాశనం చేసాయి అనుకుంటుంది. మనిషిలోని మంచి తనాన్ని గుర్తించి అతనితో జీవితాన్ని పంచుకోవడానికి ఒప్పుకుంటుంది.

ఇందిర ఏ పని అయినా మంచి అయినా చెడు అయినా తెలిసే చేస్తుంది. మొహమాట పడటం అనేది అసలు ఉండనే ఉండదు. తన బ్రతుకు తను బ్రతకాలి అనుకునప్పుడు ఇతరులకి ఇబ్బంది కల్గించినా పట్టించుకోకుండా తను బ్రతకడం నేర్చుకుం టుంది. ఆమె అతన్ని ఎప్పుడూ ఇష్టపడదు. అతి ప్రేమ చూపించినా అతిగా గౌరవించినా ఆమెకి ఇష్టం ఉండదు. ఆమె ప్రవర్తన తెలిసి కూడా ఆమెని పెళ్లి చేసుకుంటానికి ముందుకు వచ్చిన కృష్ణమూర్తికి కూడా ఆ విషయాన్నే చెపుతుంది. తానూ అతనికి లొంగి ఉండలేనని తన వ్యక్తిత్వంని చూపుకుని ఉండలేనని బ్రతుకంతా నిర్భయంగా బ్రతుకుతానని అంటుంది.

పురుషాధిక్య సమాజంలో మధ్య తరగతి కుటుంబంలో దుర్వ్యసనాల తండ్రికి కూతురిగా ఉండి పమాజ పోకడల్ని బాగా అర్థం చేసుకుని తనని తాను నిర్మించుకుంటూ అవసరం అయితే తనని తానూ తగ్గించు కుంటూ కొందరి బలహీనతలని తనకి అనుకూలంగా మలుచుకుంటూ నచ్చినట్టు ఉండగల్గే ఇందిర ఎక్కడా కూడా తొట్రుబాటు లేకుండా ఎలాంటి ముసుగు వేసుకోకుండా నిర్భయంగా, స్వేచ్ఛా ప్రవృత్తితో కనిపిస్తుంది. జీవిస్తుంది. ఇందిర లాంటి స్త్రీని సమాజం హర్షించక పోవచ్చు. సమాజంలో కల్యాణి లాంటి వారితో పాటు ఇందిరలు కూడా ఉంటారని చెప్పడమే కావచ్చు. స్త్రీల ఆలోచనా విధానం మారుతుందని చెప్పడం కూడా ఈ రచనలో గోచరిస్తుంది.

మనుషులు ఏ లోపాలు లేకుండా ఉండరు. మనుషులు మనుషుల్లాగానే ఉండాలి. తమలో ఉన్న లోపాలని సవరించుకుంటూ చైతన్యంగా ఆలోచించు కుంటూ ముదుకు సాగిపోవడమే మంచిదని ”కాలాతీత వ్యక్తులు” నవల చెపుతుంది.

పాశ్చాత్య నాగరికత ప్రభావంతో చదువులభ్యసించి ఉద్యోగాలు చేస్తున్న స్త్రీలలో ఆలోచనా పరిణతి పెరిగి వారి వారి అభిరుచిల మేరకు, ఆశలకు, ఆశయాలకు అనుగుణంగా జీవించాలనుకోవడం తప్పు కాదు. జీవితాన్ని జీవించడం కోసమే అనుకుంటూ ముందుకు సాగే వ్యక్తి ఇందిర పాత్ర. కాల గమనంలో అందరూ మరుగున పడిపోతారు కాలానికి విభిన్నంగా నడుచుకుని తనదైన వ్యక్తిత్వంతో తన చుట్టూ ఉన్న వారి జీవితాలనీ కూడా ప్రభావితం చేస్తూ సాగగల్గితే వారు మరి కొంతకాలం గుర్తుండిపోతారు. అది నవలలో పాత్రలు కావచ్చు నిజ జీవితంలో మనుషలు కావచ్చు. ఈ నవల లోని ఇందిర పాత్రని నేడు అధిక సంఖ్యలో నిత్యం మన సమాజంలో చూస్తునే ఉంటాము. కానీ ఇప్పటికి కూడా ‘ఇందిర’ ని హర్షించలేక పోతున్నాం. ఇంకా నవలలో మిగిలిన పాత్రలు కల్యాణి, వసుంధర, వైదేహి లాంటి స్త్రీల మధ్య ”ఇందిర” కాలాతీత వ్యక్తి. తానూ చీకటిలో ఉండాల్సి వచ్చినా వెరువని ధీరువు. చీకటిని చీల్చుకుంటూ వెలుగుతూ వచ్చిన ఇందిర. ఈ ఇందిరలా మిగతా స్త్రీలు ఆలోచించ గల్గితే బావుండును.

Share
This entry was posted in పుస్తక పరిచయం. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి)


తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.