దశాబ్దంన్నర ఎదురు చూసాక ఎట్టకేలకు ఫిబ్రవరి 26న పనిచేసే చోట లైంగిక వేధింపుల నిరోధక బిల్లు 2012, రాజ్యసభలో కూడా ఆమోదం పొంది చట్టరూపం దాల్చింది. ఈ బిల్లును రాజ్యసభలో ప్రవేశపెడుతూ కేంద్ర స్త్రీ, శిశు అభివృద్ధిశాఖ మంత్రి కృష్ణతీర్థ్ ”పనిచేసేచోట సురక్షిత వాతావరణం కల్పించడం, మహిళలు ఆర్ధికంగా స్వతంత్రత సాధించాలంటే, వారు సురక్షితంగా పనిచేసుకునేలా చర్యలు తీసుకోవడం అవసరం. మొదటిసారి దేశంలో సంఘటిత, అసంఘటిత రంగాల్లో పనిచేస్తున్న స్త్రీలందరిని ఈ చట్టపరిధిలోకి తీసుకువచ్చాం. ప్రతి పని ప్రదేశంలోను ఫిర్యాదుల కమిటీలను ఏర్పాటు చెయ్యాల్సి వుంటుంది. స్త్రీల ఆధ్వర్యంలో, సగం మందిపైగా మహిళా సభ్యులతో ఎస్.సి., ఎస్.టి., మైనారిటీ మహిళలకు ప్రాధాన్యం కల్పిస్తూ ఈ కమిటీలను రూపొందించాల్సి వుంటుంది. ఈ చట్టం గురించన అవగాహనా కార్యక్రమాలను యాజమాన్యాలు చేపట్టవలసి వుంటుంది” అని చెబుతూ బిల్లును రాజ్యసభలో ప్రవేశపెట్టడం సభ్యుల ఆమోదంతో అది చట్టరూపం దాల్చడం జరిగింది.
1997లో సుప్రీమ్ కోర్టు విశాఖ జడ్జిమెంట్‌లో మొట్టమొదటిసారి పనిచేసే చోట లైంగిక వేధింపులంటే ఏమిటి? నిత్యం మహిళలు ఎలాంటి వేధింపుల్ని ఎదుర్కొంటారు? అవి ఎలా వుంటాయి అంటూ ప్రస్తావిస్తూ వేధింపుల్ని చాలా విపులార్ధంలో నిర్వహించింది. ఈ సందర్భంలో విశాఖ కేసు పూర్వాపరాలను ఒకసారి పరికించాల్సి వుంటుంది. రాజస్థాన్‌లో ప్రభుత్వ శాఖలో ఉద్యోగం చేస్తూ, తన ఉద్యోగ ధర్మంగా బాల్య వివాహాలను ఆపే ప్రయత్నం చేసినందుకుగాను భన్వరీ దేవి అనే దళిత సేవిక సామూహిక లైంగిక దాడికి గురైంది. ఆమె కేసులో పోలీసులు ఎఫ్ఐఆర్ కూడా నమోదు చెయ్యనపుడు దేశవ్యాప్తంగా తీవ్రస్థాయిలో నిరసనలు చెలరేగాయి. మహిళోద్యమకారులు పెద్ద ఎత్తున ఉద్యమం చేసారు. అయితే అగ్రవర్ణాల పురుషులు దళిత మహిళలను ముట్టుకోరని, ముట్టుకోనప్పుడు అత్యాచారం ఎలా చేస్తారని రాజస్థాన్ హైకోర్టు దారుణమైన తీర్పునిచ్చింది. జైపూర్‌లో స్త్రీలతో పనిచేసే ‘విశాఖ’ అనే సంస్థ ఈ తీర్పుపై సుప్రీమ్‌కోర్టు కెళ్ళినపుడు సుప్రీమ్ కోర్టు 1997లో తన తీర్పును ప్రకటిస్తూ ”విశాఖ గైడ్‌లైన్స్” పేరుతో పనిచేసే చోట మహిళలెదుర్కొనే హింసను చాలా విపులంగా, వివరంగా నిర్వచించింది. భారతప్రభుత్వం ఈ అంశమై సమగ్రమైన చట్టం చేయాలని, చట్టం వచ్చే వరకు ఈ గైడ్‌లైన్స్ చట్టంగా చలామణి అవుతాయని కూడా పేర్కొన్నది. అన్ని కార్యాలయాల్లోను ఫిర్యాదుల కమిటీలను ఏర్పాటు చేసి, విశాఖ గైడ్‌లైన్స్ గురించి ప్రచారం చెయ్యాలని కూడా ఆదేశించింది. విశాఖ గైడ్‌లైన్స్ వెలువడిన తొలిరోజుల్లో ఈ అంశమై సమావేశాలు, సెమినార్లు జరిగాయి. స్త్రీల సంఘాలు ఉద్యమస్థాయిలో ప్రచారం నిర్వహిస్తూ, సమగ్ర చట్టం తేవాలని డిమాండ్ చేస్తూనే వున్నాయి. మహిళలు నిత్యం పనిచేసే చోట ఎదుర్కొనే హింసలకు సంబంధించిన ఈ చట్టం తేవడానికి అన్ని ప్రధాన పదవుల్లోను స్త్రీలే వున్న ఈ దేశంలో ఇంత కాలం పట్టింది. ఇప్పటికైనా చట్టరూపం దాల్చినందుకు సంతోషించాలో…. ఇంత ఆలస్యం జరిగినందుకు విచారపడాలో తెలియని సందర్భం.
తొలివిడత తయారైన బిల్లులో అనేక లోపాలుండడం, అసంఘటిత రంగంలో పనిచేసే పనిమనుషుల్ని ఈ చట్టపరిధిలోకి తేకపోవడంతో మహిళా సంఘాలు దీనిమీద దృష్టి సారించాయి. ప్రస్తుతం చట్టరూపం దాల్చిన బిల్లులో వారిని కూడా చేర్చడం జరిగింది. ఈ బిల్లులమీద రాజ్యసభలో జరిగిన చర్చలో చాలా ఆసక్తికరమైన అంశాలు చోటుచేసుకున్నాయి. ఈ చట్టంలో వున్న లోపాలను మహిళా పార్లమెంటు సభ్యులు ఎత్తి చూపారు. డా|| నజమాహెఫ్తుల్లా మాట్లాడుతూ ”పని చేసే చోట మహిళలు లైంగిక వేధింపులే కాక మానసిక, శారీరక వేధింపులకు కూడా గురవుతారని, ప్రయివేట్ సెక్టర్లో ఈ చట్టాన్ని అమలు చేసే యంత్రాంగ యేమిటని” ప్రశ్నించారు. అలాగే మహిళా సంఘాలు తీవ్రంగా వ్యతిరేకించిన క్లాజ్ 14, అంటే తప్పుడు / అబద్దపు ఫిర్యాదు ఇచ్చినట్లు తేలితే ఫిర్యాదుదారుని శిక్షించే అంశాన్ని ఈ చట్టంలో చేర్చడం గురించి ఎం.పి.లు తీవ్రంగా వ్యతిరేకించినా గాని, ఆ క్లాజ్‌ని తీయకుండానే చట్టం చెయ్యడం జరిగిపోయింది.
ఎంతో కాలంగా మహిళా సంఘాలు కోరుతున్న చట్టం అమలులోకి వచ్చింది. పబ్లిక్, ప్రయివేట్, క్వాజి, సంఘటిత, అసంఘటిత రంగాలన్నింటిలోను ఫిర్యాదుల కమిటీలను ఏర్పాటు చెయ్యాలి. చెయ్యని పక్షంలో యాజమాన్యాలు శిక్షార్హమౌతాయి. అలాగే ఈ చట్టంలోని అంశాలను గురించి విస్తృతంగా ప్రచారం చేయ్యాల్సి వుంటుంది. ప్రభుత్వోద్యోగుల సర్వీస్ రూల్స్‌ను మార్చాల్సి వుంటుంది. తప్పులు చేసినపుడు ఎలాంటి శాఖాపరమైన క్రమశిక్షణా చర్యలుంటాయో లైంగిక వేధింపులకు పాల్పడితే అలాంటి శిక్షలు / క్రమశిక్షణాచర్యలు తప్పవనే హెచ్చరికతో యాజమాన్యాలు ఈ చట్టం అమలుకు చిత్తశుద్ధితో పనిచెయ్యాలి. పనిచేసే చోట భద్రమైన పరిస్థితులు కల్పించాల్సిన బాధ్యత యాజమాన్యాలదే కాబట్టి వారు తక్షణమే తగిన చర్యలు చేపట్టాలి. మహిళలు సురక్షితంగా, హాయిగా పనిచేసుకునే పరిస్థితులేర్పడే లాగా స్త్రీల సంఘాలు ఈ అంశం మీద పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలు మొదలు పెట్టాలి.
చివరగా, సిగెరెట్ తాగితే ఊపిరితిత్తులు చెడిపోతాయి, మధ్యం తాగితే లివర్ పాడైపోతుందని పురుషుల్ని హెచ్చరించే ప్రభుత్వం పనిచేసే చోట మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడితే ఉద్యోగాలూడిపోతాయని, క్రిమినల్ చర్యలుంటాయని కూడా మీడియా ద్వారా ప్రచారం చెయ్యాల్సి వుంటుంది. ఈ దిశగా ఈ కొత్త చట్టం గురించి యుద్ధ ప్రాతిపదికన ప్రచారం చేపట్టినపుడు మాత్రమే ఈ చట్టం ఉనికికి ఒక అర్ధం ఏర్పడుతుంది.