– కొండపల్లి కోటేశ్వరమ్మ

మా కుటుంబాల్లో బంధువుల్నీ, పాత మిత్రుల కంటే కూడా ఈ పార్టీలో ఉన్న వాళ్ళమంతా ఒక ‘ఫ్యామిలీ’ లోన… మళ్ళీ మా అక్క చెల్లెళ్ళుగా, మిత్రులుగా కలిసి పనిచేశాం. కొందరు మహిళా సంఘాల్లో పనిచేసినా, కొందరు ప్రజానాట్యమండలిలో, కమ్యూన్లో బుల్లెమ్మకి సహకరించినా అందరం ఏకతాటిమీద వుండేవాళ్లం. మన అభిరుచులకి అనుగుణంగా ఉన్నవాళ్ళతోటే దగ్గర సంబంధాలు ఏర్పడి మనం దేశవ్యాప్తంగా వచ్చేదానికి కృషిచేయాలి అనే దాంతోటి మారోజుల్లో వర్ణాంతర వివాహాలు జరిగాయి.

మొదటిసారిగా దేశం, ప్రజలు, దేశభక్తి అనేది ఆనాడు ఎట్లా తెలిసిందంటే, మా బాబాయి కాంగ్రెస్‌ ఉద్యమంలో పనిచేస్తుండేవారు. నేను చదువుకునే రోజుల్లోనే కాంగ్రెస్‌ ఉద్యమం గురించీ, బ్రిటిషు వాళ్లు చేసే అరాచకాల గురించి పాటలు వింటే చిన్నతనంలోనే అసహ్యం పుట్టింది. ‘మా కొద్దీ తెల్లదొరతనం’, ‘వాడు కుక్కలతో పోరాడి కూడు తింటాడట’ అనే పాటలు వినేవాళ్ళం. అట్లాగే దేశాన్ని గురించి, దేశమంటే, దేశభక్తి గేయాలంటే నేను ప్రభావితమవుతూ, దేశభక్తులుగా పుట్టటం కూడా ఒక అదృష్టమేనేమో అనుకుంటూ వచ్చేదాన్ని. అట్లాగే కాంగ్రెస్‌ చరిత్ర. కాంగ్రెస్‌కు ఓటు వేస్తానంటే పదేళ్ళ దానివి నీకు ఓటు హక్కు ఎక్కడనుంచి వస్తుంది, వద్దు తర్వాత వేద్దువు గానీలే అనేవారు. అట్లా నేను ప్రతి కాంగ్రెస్‌ మీటింగ్‌కి హాజరవడం, దేశభక్తి గేయాలు పాడుతూ రావటం…. అట్లా ఉన్నపుడు కాంగ్రెస్‌ నుంచి కాంగ్రెసు సోషలిస్టు పార్టీ అనేదొకటి ఉద్భవించింది. అదే కుర్ర వాళ్ళందర్ని కూడగట్టి మంత్రివారిపాలెంలో ఇంకా కొన్నిచోట్ల సమ్మర్‌ స్కూల్స్‌ పెట్టి వాళ్ళల్లో మార్పు తీసుకొచ్చింది. అప్పుడది కాంగ్రెస్‌ సోషలిస్టు పార్టీగా వుండేది. వాళ్ళే కొన్నాళ్ళకు కమ్యూనిస్టులుగా మారారు. ఆ కాంగ్రెస్‌ సోషలిస్టు పార్టీలో ఉండే కుర్రాళ్ళని ఇట్లా దేశభక్తుండి చక్కగా పాడగలిగి ఉత్సాహమున్న పిల్లల్ని తీసికెళ్తే జీవితం రాణిస్తుంది, ఉద్యమం బలపడ్తుంది. ఆ ఉద్దేశంతో ఆలోచించి ఇలాయాక్టివిటీస్‌లో ఉన్న వాళ్ళందర్నీ తీసుకొచ్చి వివాహాలను కూడా ప్రోత్సహించారు. అట్లా నా వివాహం ఒక కమ్యూనిస్టుతోనే జరిగింది. వివాహం జరిగిన తర్వాత కూడా, కమ్యూనిస్టు భావాలతోటి, దేశభక్తితోటి స్వరాజ్యం రావాలి, అందరు సుఖపడాలి, తెల్లవాళ్ళు పోవాలి అనేవి మనసులో బాగా నాటుకున్నా, సంప్రదాయాలు, ఆచారాలు వాటికి ముడిబడివున్న జీవితం కాబట్టి, కొన్ని విషయాల్లో ముందుకు రాలేకపోయాం. స్త్రీలందరితో కూడా మేడే అనీ, విప్లవ దినోత్సవాలనీ పండుగలుగా చేసుకునే వాళ్ళం. ఆ పండుగ రోజుల్లో స్త్రీలందర్నీ కూడా పెద్దగా ఊరేగింపుల్లో తీసుకొచ్చే వాళ్ళం. చుట్టూరా ఉన్న ఫిర్కాలవాళ్ళంతా గుడివాడ సెంటరుకొచ్చేసి అక్కడ ఊరేగింపు, పెద్ద బహిరంగసభ అన్నీ జరిపేవాళ్ళం. ఆ మీటింగుల్లో పాటలు పాడడం, తర్వాత ప్రజా సంఘాలు ఏర్పడ్డాయి. ఆ ప్రజా సంఘాల్లో స్త్రీలందరు కూడా మహిళా సంఘాలుగా ఏర్పడాలి, మహిళలుగా కృషి చేసి సమస్యలపై పోరాడాలి. స్త్రీలకెవరేంచేశారో ముందు తెల్సుకోవాలి. స్త్రీ సమస్యలెట్లా సమాజాన్ని బట్టి, మానవుని అవసరాల్ని బట్టి, ధర్మాలు మారుతూ ఉంటాయి. కాబట్టి పూర్వం ఎన్ని ధర్మాలున్నా మారిపోయి ఇప్పుడు మానవత్వం మనుగడకు సమ సమాజంలో ఏ ధర్మాలు కావాలనేది గుర్తించి దానికి దోహదం చేసే సాహిత్యం… వీరేశలింగం అన్నారు. ”దేశభక్తియుతమైంది వందేమాతరం కాదు. అంతకంటే మంచిగేయం, దేశభక్తి గేయం గురజాడ రాశారు చూడం”డని. మేము చదివి దాన్లో ఉన్న సారాన్ని అర్థం చేసుకొని అట్లాగే మేము కూడా వట్టిమాటలు కాదు, కొంతయినా సొంతలాభం కొంత మానుకుని…. అంతా మానుకోవటం సాధ్యం కాదనుకోండి. కొంత మానుకునైనా ముందుకు రావాలని, అలా మహిళా ఉద్యమంలో పనిచేశాం. తర్వాత ఉపన్యాసాలతో పాటుగా మనసుకి ఉల్లాసాన్ని, ఆనందానిచ్చే పాటలూ, నాటకాలు, బుర్రకథలు కూడా కావాలి అనే దాంతోటి బయల్దేరాం. మీరు రండి అనే ప్రోత్సాహం కమ్యూనిస్టు పార్టీ ఇచ్చింది. మహిళా ఉద్యమంతో పాటుగా కల్చరల్‌ యాక్టివిటీస్‌ కూడా. అయితే అప్పట్లో స్త్రీలు నాటక రంగంలోకి వచ్చేది లేదు. కిరాయి స్త్రీలు వచ్చి నాటక రంగంలో పాల్గొనే వాళ్ళు. మహిళా ఉద్యమంలోకి వచ్చినంత చొరవగా నాటక రంగంలోకి రాలేకపోయారు. మేం బెంగాల్‌నే ఆదర్శంగా తీసుకునేవాళ్ళం. బెంగాల్‌లో రవీంద్రుని మనుమరాలు నాటకాల్లో యాక్ట్‌ చేసింది. ఇట్లా ‘ముందడుగు’ నాటకం స్టార్ట్‌ అయింది. దీన్ని సుంకర, వాసిరెడ్డి రాశారు. ముందడుగు నాటకాన్ని మొగవాళ్ళే యాక్ట్‌ చేస్తే అది ముందడుగు అన్పించదు. స్త్రీల పాత్రలు స్త్రీలే యాక్ట్‌ చేయాలి. అప్పుడే అది ముందడుగు అన్పించుకుంటుంది.

ఆ రకంగా నాటకాలు వేశాం. దీనికి పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా సలహాలిచ్చేవారు. మొదట ఎవరూ రాలేకపోయారు. భయం, సంసార స్త్రీలు రంగంమీది కొస్తే ఏదో వేశ్యలను చూసినట్టు చూస్తారేమో అనే భయం. రాత్రి యాక్ట్‌ చేసిన అమ్మాయి అదిగో వెక్కిరిస్తారని చెప్పి నేను రానంటే సీతారామయ్యగారు ఉపవాసం ఉండి అసలు అన్నం తినకుండా ఉన్నారు. మరి పురుషునికున్నంత నిబ్బరం స్త్రీకి ఉండదు కదా! భర్త అన్నం తినకపోతే చాలా బాధపడిపోతుంది. ఈ మనస్తత్వం బాగా జీర్ణించుకుని ఉన్నవాళ్ళం. మరి సోవియట్‌ రష్యాలో వాళ్ళ కల్చర్‌ ఎట్లా ఉండేదో తెలియదు కానీ! భర్త తిడ్తుంటే సహించేవాళ్ళం. ఆయనెట్లా చెప్తే అట్లా వినాలి తప్పదు అనేదాంతో ఆ నాటకంలోకి వచ్చాం. అసలు ఇష్టంలేని పన్లు చేయిస్తున్నారనే బాధ ఎక్కువగా ఉండేది. ఇక తప్పదు విధి అనుకునేవాళ్ళం. కొన్నిసార్లు మా ప్రక్కన భర్తగా ఎవరో ఉంటే యాక్ట్‌ చేయలేకపోయేవాళ్ళం. నాటకమంతా చక్కగా ఉండాలంటే మీరట్లాకాక నటన బాగా చేయాలి. నటన సహజంగా ఉండాలి. ఆయన మీ అన్నయ్య లాంటివాడే అని చెప్పేవారు. కృత్రిమంగా లేకుండా నటన బాగుండేసరికి – అభినందనలు ప్రదర్శించే సరికి మాకు ఉత్సాహం వచ్చేసింది. మేమంతా ఉన్నాం గదా అనే దాంతోటి తీసుకురావటం జరిగింది మా మిత్రులు, కామ్రేడ్స్‌ అంతా!

దీనికంటే ముందు అంటే ‘ముందడుగు’ కన్నా ముందు సాహిత్యంలో ఈ ఛందస్సు, గణాలు, కామాలు, ఫుల్‌స్టాపులు, ఈ బండి ర (ఱ) ఇవన్నీ అనవసరం అనే దాంతో తాపీ ధర్మారావుగారు రాసినవి, గురజాడ ‘కన్యాశుల్కం’ లాంటి నాటకాలు కొన్ని వేశాం. అంటే పాతవాళ్ళు అభ్యుదయ భావాలతో రాసిన నాటకాల్నే ముందువేశాం. అయితే గురజాడ, కందుకూరి నాటకాలు మావరకే వేసి చూపెట్టాం. బయట ప్రపంచానికి చూపెట్టలేదు. ‘ముందడుగు’, ‘మా భూమి’ నాటకాలు బయట ప్రపంచంలో వేయడానికి భయపడ్డాం. కమ్యూనిస్టు పార్టీ ఎంత బలంగా ఉందో తెలుసు కదా! మనవాళ్ళే కాదు, ఇతర స్త్రీలపై కూడా ఈగవాలితే మేం ఊరుకోం అని చెప్పేసి ఒక పొలిటికల్‌ అవగాహన తోనే కాకుండా ఈ సాంస్కృతిక కార్యక్రమాలతోటి తీసుకొచ్చామన్నమాట.

మా కుటుంబాల్లో బంధువుల్నీ, పాత మిత్రుల కంటే కూడా ఈ పార్టీలో ఉన్న వాళ్ళమంతా ఒక ‘ఫ్యామిలీ’ లోన… మళ్ళీ మా అక్క చెల్లెళ్ళుగా, మిత్రులుగా కలిసి పనిచేశాం. కొందరు మహిళా సంఘాల్లో పనిచేసినా, కొందరు ప్రజానాట్యమండలిలో, కమ్యూన్లో బుల్లెమ్మకి సహకరించినా అందరం ఏకతాటిమీద వుండేవాళ్లం. మన అభిరుచులకి అనుగుణంగా ఉన్నవాళ్ళతోటే దగ్గర సంబంధాలు ఏర్పడి మనం దేశవ్యాప్తంగా వచ్చేదానికి కృషిచేయాలి అనే దాంతోటి మారోజుల్లో వర్ణాంతర వివాహాలు జరిగాయి. వితంతు వివాహాలు కందుకూరి ప్రవేశపెట్టారు కానీ, విస్తృత ప్రాతిపదికమీద పార్టీవాళ్లే చేశారన్నమాట. వర్ణాంతర వివాహాలు కూడా ఉద్యమరీత్యా, ఉద్యమం బలపడ్డానికే… దేశవ్యాప్తంగా ఒకరొకరికి లింకులు ఏర్పడటానికే. గోదావరి జిల్లా అమ్మాయిని కృష్ణాజిల్లా అమ్మాయిని, నందిగామ తాలూకా, గుంటూరు ఇట్లా అన్ని చోట్లకీ సంబంధాలుండేలా! అయితే కమ్మారిలో నాలుగుతెగలు, రెడ్డరిలో పది తెగలుండేవి. కాపుల్లో ఇట్లా తెగలుండేవి. ఈ తెగలే కాకుండా కులాంతర, వర్ణాంతర, మతాంతర వివాహాల దాకా తీసుకొచ్చారు. ఇవి కూడా ఉద్యమంలో భాగంగా జరిగేవి. వీళ్ళు కట్నాల్లేకుండా చేసుకున్నా కానీ బయట వ్యతిరేకత బాగా ఉండేది. ఈ కమ్యూనిస్టు పిల్లలు ఉద్యోగాల్లేకుండా, జైళ్ళకే పోతారు, చేసుకుంటే మా పిల్లలు సుఖపడరేమోనని చాలామంది తల్లిదండ్రులు వ్యతిరేకించేవారు. అయితే ఆ పిల్లలను ధైర్యంగా ఉన్నవాళ్ళను ప్రోత్సహించి తీసుకొచ్చేవాళ్ళం.

తాపీ ధర్మారావుగారి కోడలు రాజమ్మ. ఆమె బ్రాహ్మిన్‌. ఆమెని ముసలాయనకిచ్చి పెళ్ళి చేయబోతుంటే ఏడుస్తూ వచ్చి చెప్పి వెళ్ళిపోయింది. చెప్తే నీకేం భయంలేదు అని చెప్పేసి తీసుకొచ్చేశారు. మాకు కమ్యూనుం డేది. ఏ హోటల్లోనో, ఎవరింట్లోనో ఉండాలనే భయం లేదు. కమ్యూన్లో ఉండేది. అన్ని కార్యక్రమాల్లో ఆమె పాల్గొంటూ ఉండేది. ప్రజా నాట్యమండలిలో కూడా పాల్గొనేది. కొంతకాలం తర్వాత తాపీ ధర్మారావుగారి కొడుకు యోషన్‌రావుగారు ఆమెను వివాహం చేసుకున్నారు. ఇంకా ఎన్నో చోట్ల అలా చేశాం అనుకోండి – ఉదాహరణకి ఇది చెప్తున్నా.

అట్లా కొంతకాలానికి కమ్యూనిస్టు పిల్లల్ని చేసుకుంటే మా పిల్లలు సుఖపడ్తారనేది మా కుటుంబాల్ని చూసిన తర్వాత అనుకున్నారు. వాళ్ళకు విమర్శన, ఆత్మ విమర్శన ఉండేది. అసలిట్లా రాష్ట్ర వ్యాప్తంగా జరిగేవనుకోండి – ఏదైనా తప్పు చేస్తే పెద్దవాళ్ళు కోప్పడటం, వాళ్ళ సహకారం ఉంది కాబట్టి మా పిల్లల్నిస్తే సుఖపడ్తారనే స్థితి దాకా వచ్చారు.

ఇక సాహిత్యంలో చూస్తే స్త్రీలు ఎంతవరకు రాయగలిగారు అంటే అంత విస్తృతంగా అది వ్యాప్తిలోకి రాకపోవచ్చు కానీ సాహిత్యవారమని జరుపుకునేవాళ్ళం. ఈ మహిళా కార్యకర్తలందరూ కూడా మన ప్రోగ్రెసివ్‌ సాహిత్యమంతా సంచుల్లో పెట్టుకొని తిరిగేవాళ్ళు. ఇప్పటిలాగా బస్సు సౌకర్యాలు లేవు. మోయలేక, మోయలేక, మోసేవాళ్ళం. ఊరూరుకి తిరిగేవాళ్ళం, మాలపల్లి, శరత్‌, ప్రేమచంద్‌, వీరేశలింగం, గురజాడ, ఈ సాహిత్యంతో పాటు అభ్యుదయ సాహిత్యం. దాని తర్వాత ఇతర దేశాల సాహిత్యం కూడా ప్రవేశించింది. గోర్కీ రాసిన ‘అమ్మ’, ‘అన్నా కెరనీనా’, ‘నానా’, ఇట్లా కొన్ని నావెల్స్‌ వచ్చాయి. అప్పుడు సాహిత్యంలో కాల్పనికోద్యమం ఉండేది. ఆ కాల్పనిక సాహిత్యం నుంచి అభ్యుదయ సాహిత్యం మొదలైంది. దాంట్లోనుంచి వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కృష్ణశాస్త్రి, సోమసుందర్‌లాంటి వాళ్ళందరూ కాల్పనికోద్యమం నుంచి వచ్చారు. అభ్యుదయ సాహిత్యానికి శ్రీశ్రీ పెద్ద అన్నయ్యలాగ అన్పించేవారు. శ్రీశ్రీ ద్రోణాచార్యులైతే తెలియని ఏక లవ్యులెందరో. చలం సాహిత్యం కూడా కొంతమంది చదివేవారు. స్త్రీలకి చాలా న్యాయం చేశాడు. అంటరాని వాళ్ళెంతో స్త్రీలూ అంతే కానీ, ఈ సాహిత్యం ఆచరణ సాధ్యం కాదేమో అన్పించేది. ఆ రోజుల్లో, ఈ రోజుల్లో కూడా స్త్రీలకి ఇబ్బందులు అలాగే ఉన్నాయని నా భావన. ఎంత కమ్యూనిస్టు పార్టీ వచ్చినా, రివల్యూషన్‌ వచ్చినా స్త్రీల బాధలూ …. గాధలూ…. తప్పవనే అనుకోండి. చలంగారు స్త్రీ, పురుషుల్ని సమానంగా చిత్రించిన సాహిత్యం మేమందరం చదివామనుకోండి, కానీ అందరికీ ఇవ్వడం సాధ్యం కాదుగదా! చలం ‘బిడ్డల శిక్షణ’, స్త్రీ, ఇంకా ఉన్నాయి కదా, అవన్నీ చదివి మనం ఎంతవరకు జీర్ణించుకుంటాం. ఇప్పుడిప్పుడే ఉద్యమంలోకి వచ్చే వాళ్ళకి ఇస్తే అది ఎంతవరకు రాణిస్తుంది అనే ఉద్దేశ్యంతో పెద్దగా ఆ వైపుకి వెళ్ళలేదన్న మాట. ఈ సాహిత్య వారంలో, ఇతర దేశాల్నుంచి, ‘మార్క్సిస్ట్‌’ ఔట్‌లుక్‌, సిద్ధాంతంతో పాటు స్త్రీలను సభ్యులుగా చేర్పించి గ్రామాల్లో చదివించే వాళ్ళం. అభ్యుదయ రచయితల పాటలు పాడి విన్పించేవాళ్ళం. విన్పిస్తే వాళ్ళు కూడా చాలా సంతోషంగా వినేవాళ్ళు. మీటింగ్స్‌లో పాటలే కాకుండా చందాలు కూడా వసూలు చేసేవాళ్ళం.

ఇక కల్చరల్‌గా ప్రజా నాట్యమండలి, మహిళాసంఘం, బాలల సంఘం ఎవరివి వాళ్ళకున్నాయి. ఈ ప్రజా సంఘాలన్నింటిని కమ్యూనిస్టు పార్టీ ప్రభావితం చేసింది. ఈ పార్టీ అంటే భయపడేవాళ్ళంతా ప్రజా సంఘాల్లోకి రావొచ్చు. కొందరు మాత్రం కమ్యూనిస్ట్‌ పార్టీ ఆధ్వర్యంలో వచ్చిన సంఘాలే గదా ఇవిగూడా అనేవారు. అట్లా ఉంటుండగానే జపాన్‌ ఫైట్‌, పీపుల్స్‌ వార్‌ ప్రకటించిన తర్వాత హిట్లర్‌, ముస్సోలిని దుయ్యబడ్తూ కొన్ని గేయాలు వచ్చాయి. ఆ గేయాలను కూడా ప్రచారం చేసేవాళ్ళం. సుంకర వాళ్ళు ప్రజలకు తేలిగ్గా అర్థమయ్యేలా గేయాలు రాశారు. తెలంగాణా మీద గోపాలకృష్ణయ్య ఒక వ్యాసం కూడా రాశారు. కొన్ని పుస్తకాలు అర్థమయ్యేవి. కొన్ని కొన్ని అర్థమయ్యేవి కావు. సోమసుందర్‌ రాసిన ‘వజ్రాయుధం’ అర్థమయింది. కాని ఆరుద్ర ‘త్వమేవాహం’ అర్థం కాలేదు. అట్లా అర్థం కానప్పుడు రచయితల్లో ఎట్లాంటి మార్పు వచ్చింది? ప్రజలు పలికే పలుకు, మాట్లాడే మాట దాంతోటి స్టార్ట్‌ చేస్తేనే బాగుంటుందని, గిడుగు రామ్మూర్తి పంతులుగారు, కందుకూరి వీరేశలింగం, గురజాడ అప్పారావు వీళ్లు ఆరాధ్యులుగా మన జాతికి ఎంతో మేలు చేశారు. అప్పుడే గిడుగు రామ్మూర్తిగారు చేశారు కానీ మనం ఇప్పటికీ చేయలేక పోతున్నాం. అప్పట్లో పార్టీకి, ఆంధ్రప్రతిక, మేమే పెట్టుకున్నాం.

అప్పట్లోనే బెంగాల్‌ కరువొచ్చింది. దాని కరువు నివారణకు మానవతా దృక్పథంతో మనమేం చేయాలి? దానికి చందాలు వసూలు చేయటమే కాకుండా, ప్రత్యక్షంగా కరువు గురించి గేయాలు రాసి పాడేవాళ్ళం. ‘ఇదీ లోకం’ అని శ్రీరామచంద్రమూర్తి అని ఒకాయన రాశారు. ఆ నాటకాన్ని తీసుకపోయి ప్రజల్లో ప్రవేశపెట్టాం. దాంట్లో ‘జీవచ్ఛవం’ పాత్ర వేశానన్నమాట. చాలా గుర్తింపు వచ్చింది. తర్వాత రాష్ట్ర కాన్ఫరెన్స్‌ జరిపినపుడు మా నాటకానికి ఫస్ట్‌ప్రైజ్‌ వచ్చింది. ఉత్తమ నటిగా నాకు వెండికప్పు ఫస్ట్‌ ప్రైజ్‌ వచ్చింది. అట్లా అన్ని ఆంగిల్స్‌లోంచి, బెంగాల్‌ కరువు తర్వాత రాయలసీమ కరువు వచ్చింది. జి. వరలక్ష్మితో పాటు అందరూ వచ్చి చాలా చాలా చేశారు. పోటీలు మనవాళ్ళకే కాకుండా అన్ని వేపులా సాహిత్య ఎకాడమీ వాళ్ళు పోటీలు పెడ్తే మనవాళ్ళు గెలిచారు. అప్పుడు మన మిత్రులందరూ ఏమనుకున్నారంటే కిరాయి స్త్రీలు వేస్తూ ఉండటం వల్ల ఇట్లా అణగారి పోయింది. ‘ప్రజానాట్య మండలి’ మంచి ఆర్గనైజేషన్‌, వాళ్ళు పెద్ద పెద్ద నాటకాలు వేయలేక పోయినా ఈ నాటకం రాణించడానికి చక్కగా దోహదం చేశారు. వాళ్ళంతా ఇంత ఆర్గనైజుడ్‌గా ప్రజల్లోకి చొచ్చుకు పోవటానికి వాళ్ళు పాత్రల్లో మిళితమై యాక్ట్‌ చేశారు. దీనికి కారణం ఉద్యమమే అని ఇతరులు గుర్తించారు.

ఇట్లా ప్రజానాట్యమండలిలో పనిచేశాను. పనిచేసిన తర్వాత సీతారామయ్య గార్ని వేరే తాలూకాకి వేశారు. ఆ తాలూకా బలహీనమైన తాలూకా. ఆ తాలూకాకి వెళ్ళినప్పుడు ఫ్యామిలీ అంతా అక్కడికి వెళ్ళిపోయాం. అక్కడికి వెళ్ళి తాలూకా ప్రజానాట్యమండలి, అక్కడ మహిళా ఉద్యమంలో పనిచేసేదాన్ని. మేం తాలూకా సంఘాల్లో, ప్రజాసంఘాల్లో, మహిళా సంఘాల్లో పనిచేస్తూ, ఈ కార్యక్రమాలన్నింట్లో పాల్గొంటూ కూడా మళ్ళీ పత్రికవైపు, ప్రజాశక్తి అని మాకో పత్రికుండేది. జనశక్తికి ముందు కాగడా ఉండేది. తాపీ ధర్మారావుగారు కొంత పనిచేసేవారు. పీపుల్స్‌వార్‌, ప్రజాశక్తి, ఇతర పత్రికలెన్నో ఉండేవి. బోల్షివీక్‌ పోటీతో ఉన్నాయన్నమాట.

బోల్షివిక్‌ చరిత్ర అంటే పెద్దగా తెలియకపోయినా కమ్యూనిస్టు పార్టీ అనే భక్తి భావంతోటి పనిచేశాం. ఒకరి కోటా పది పత్రికలైతే, ఒక్కోరు పాతికదాకా అమ్మేవారు. ఇట్లా వార, దిన పత్రికలన్నీ ఉండేవి. అవన్నీ చేతులమీద వేసుకుని బజార్లలో తిరిగి అమ్మేవాళ్ళం, రైల్వేస్టేషన్స్‌లో అమ్మేవాళ్ళం, చందాలు వసూలు చేసేవాళ్ళం. అయ్యో, ఎండకన్నెరగకుండా బ్రతికిన పిల్లవేతల్లీ, మీరెందుకే ఎండలో తిరిగి పని చేస్తారు. ఎండలో తిరిగి ఈ పత్రికలమ్మటమేంటీ ఏం దరిద్రమొచ్చిందే, మీ నాన్నగారు చాలా భాగ్యవంతులు. మీ అత్తగారు భాగ్యవంతులు. మీకు రూపాయి, అర్ధరూపాయెందుకు అని చెప్పేసి సానుభూతి తెలిపేవారు కొంతమంది దగ్గరివాళ్ళయితే. అదంతా మీకనవసరం, అంతగా అంటున్నారు కాబట్టి ఒక రూపాయి కాదు, పదిరూపాయలవి వేసుకోండి అనేవాళ్ళం మేం. పది రూపాయలంటే నవ్వుకుంటూ ‘ఒప్పుకోం’ అనేది. మీరు పుట్టినప్పుడు పార్టీ తెలీదు, ఇప్పుడు చూడు ఎంత విస్తరించిందో, మీరు కూడా ఎప్పటికైనా కమ్యూనిస్టులైపోవల్సిందే అనంటే నవ్వేవాళ్ళు. కొందరు కొంటెతనంగా చెప్తుంటే ఏం చేసేవాళ్ళంటే మా దగ్గరలేని పత్రికలడుగుతుండేవాళ్లు. అడిగినపుడు జస్ట్‌ వెయిట్‌ అని చెప్పేసి వేరేవాళ్ళ దగ్గర్నుంచి తెచ్చేవాళ్ళం. మీ ‘దుంపల్దెగ’ మీరు తేరనుకున్నామమ్మా, మా కెందుకీ పత్రికలు అనేవాళ్ళు. వాటిల్లో ఏముందో చదవండి, తీసుకోండి అని ఇచ్చేవాళ్ళం.

అట్లా ఇరవై రోజులకో, నెలరోజులకో ఎంత అమ్మాం, తప్పులు చేశామా అని విమర్శ, ఆత్మవిమర్శన చేసుకునేవాళ్ళం. ఈ విమర్శ ఆత్మవిమర్శన పార్టీకి గుండెకాయలాంటిది అప్పుడు. మరి ఇప్పుడెట్లా ఉందో నాకు తెలియదనుకోండి. మా రాజేశ్వరరావుగారు కూడా తప్పు చేస్తే మేం ధైర్యంగా వెళ్ళి అడిగేవాళ్ళం. ఇవన్నీ పెట్టీ బూర్జువా లక్షణాలని అనేవాళ్ళం. అర్థం తెలియకపోయినా తిట్టుగా అనుకునే వాళ్ళం. అప్పుడు మామూలుగా స్త్రీలు తిట్టుకునే తిట్లు మర్చిపోయాం. పార్టీ పుణ్యంతో కాస్త సంస్కారం ఏర్పడింది. అప్పుడు ఈ కులాల్లో తిట్లుండేవి కదా! చాకలి సచ్చినోడ, మంగలి సచ్చినోడ, మాదిగ సచ్చినోడ అని ఉండేవి. వాటిని నోటిమీద కొట్టినట్లుగా చెప్పి ఆ తిట్లన్నీ మాన్పించేశామన్నమాట. కొత్త తిట్టు పెట్టీ బూర్జువా అన్నమాట.

తర్వాత కొంతకాలానికి పార్టీ పిలుపునిచ్చింది. కనుచూపు మేరలో సోషలిజం ఉందనుకున్నాం. అందుచేత అందరూ ఆస్తులన్నీ అమ్మేసేసి పార్టీకి పనిచేయండి అని. ఎన్ని పత్రికలున్నాయి! అవన్నీ నడవాలన్నా, పార్టీ నడవాలన్నా ఈ ఆస్తులు శాశ్వతం కాదుకదా! అందరికీ సమానమైన ఆస్తులు, హక్కులు, ఆర్థిక ప్రతిపత్తి అన్నీ వచ్చేస్తాయనే దాంతోటి తల్లిదండ్రుల ఆస్తి వాళ్ళకుంచేసి అట్లా అమ్మి వచ్చిన సంఘటనలు కూడా ఉన్నాయి. చాలా వరకు ముందు నాయకులు అమ్మేస్తే కొంతమంది కుర్రాళ్లు ఆ ఉత్సాహాన్ని తట్టుకోలేక మేంకూడా ఇది చేస్తాం, అది చేస్తామనే వాళ్ళు. చందాలు ఇవ్వగల్గితే ఇవ్వండి. ఈ ఉద్యమంలో శారీరకంగా పనిచేయండి, తర్వాత చైతన్యంతో ఈ తాత్కాలికోద్రేకంతో చేయకండని తిప్పి ఇచ్చేయటం. మీరు మార్కిస్ట్‌ ఔట్‌లుక్‌ బుర్రకి వంటబట్టాక ఇద్దురు కానీ అంటే, ఏం వీళ్ళేనా త్యాగమూర్తులు మేం కాదా, మాదంతా తిప్పి ఇచ్చేస్తారా అని వాళ్ళకి కోపం రావటం వాళ్ళ పేరెంట్స్‌ మాత్రం పిల్లలు తొందరపడ్డాకాని, వాళ్ళు మంచిగానే ఆలోచిస్తారని అర్థం చేసుకుని గుర్తించారన్నమాట.

నాకు నాలుగు సంవత్సరాలప్పుడు పెళ్ళి చేశారు. శారదా యాక్ట్‌ వస్తుందని భయపడి నాల్గు, అయిదు సంవత్సరాలకే పెళ్ళి చేశారు. నా అయిదో ఆరో ఏటనే మా మామయ్య చనిపోయారు. నాకు చనిపోయింది కూడా తెలియదు, పెళ్ళయిందీ తెలియదు. అప్పట్నుంచి మా అమ్మ నాకు మళ్ళీ పెళ్ళి చేయాలని తాపత్రయ పడుతూ వచ్చింది. ఈ కమ్యూనిస్టు కుర్రాళ్ళకియ్యాలనే దాంతోటి ఇచ్చారు. ఇచ్చినప్పుడు ఆ ఊళ్ళో ఒత్తిడే, అక్కడ సీతారామయ్యగారి ఊళ్ళో కూడా ఒత్తిడి. బయటివాళ్ళను చేసుకుంటే ఆస్తంతా బయటకు పోతుంది. మేనత్తకూతుళ్ళను చేసుకోలేదనే దాంతో ఆయన్ని ఒక బండ్లో ఘోషా స్త్రీలాగ తీసుకొచ్చారన్న మాట. మా ఊర్లో ఘోషా స్త్రీలకి బండికి ఇటూ, అటూ తెరలు కట్టి తీసుకొస్తారు. కర్రలు పట్టుకువచ్చి ఆగం చేస్తారు. చాలా గొడవై పోతుందనే దాంతోటి ఉద్యమం బలంగా ఉన్న ప్రాంతంలో, గ్రామంలో ఉంచి ఉద్యమ నాయకుని ఇంట్లో పెళ్ళి చేసేవారు. ఇట్లా మా ఇంట్లో ఎన్నో పెళ్ళిళ్ళు జరిగేవి. కన్నారు, అత్తారు అంతా మేమే, బాగానే రియాక్షన్‌ వచ్చేది. తర్వా త్తర్వాత కల్సిపోయేవారు.

అప్పుడు నాకు పదిహేడు, పద్దెనిమి దేళ్ళుండొచ్చు. నన్ను విడో (వితంతువు) అని తెలియకుండానే పెంచారు. పెద్దయ్యాక తెల్సింది అమ్మేడుస్తుంటే. తర్వాత కర్మ సిద్ధాంతం మీద నమ్మకం కదా. నాకు పెళ్ళి చేస్తే అతను చచ్చిపోయారు, నాకు పెళ్ళివద్దు అనేదాన్ని తెలీక. కానీ, ఈ పార్టీ కుర్రాళ్ళంతా కాదు కాదు అనటం, వితంతు వివాహం చేసుకుని పిల్లల్ని కన్నవాళ్ళన్ని చూపెట్టటం, కుటుంబాల్ని చూపెట్టటం. అప్పుడు నేను బాగా పాటలు పాడేదాన్ని. చక్కటి గొంతు, చొరవా, ధైర్యం ఉన్నాయి ఈ అమ్మాయిలో. ఈ అమ్మాయి జీవితం రాణించాలంటే మంచి కుర్రాణ్ని చూడాలని అలా వెతికారు. మా మారేజీ అయిపోగానే పార్టీలోకి వెళ్ళాను. పార్టీ అంటే మార్కిస్ట్‌ ఔట్‌లుక్‌ లేకపోయినా వెళ్ళాను. మా మామయ్యకు ఇన్‌ఫ్లూయెన్స్‌ బాగా ఉండేది. విద్యార్థి సంఘాల్లో పనిచేస్తున్నాడన్న మాట.

పెళ్ళిళ్ళు చేసుకుని విడిపోయే వారికి ఆనాడు ఎట్లా సౌకర్యాలుండేవంటే, ఇప్పుడు కన్నారు వచ్చి పురుళ్ళు పోసేవారు కదా. అట్లా పురుళ్ళకోసం డాక్టర్‌ అచ్చమాంబగారి ఇల్లు ఉండేది. కన్నారిల్లులాగే వాడుకునే వాళ్ళం. మీకెందుకే, పురుళ్ళొస్తే మీ అమ్మ లేకపోతే నేను లేనా అనేవారు. ఆమె పురుళ్ళు పోసి, మందులిచ్చి అన్ని రకాలుగా చూసేవారు. ఇక్కడే కమ్యూనుండేది భోజనాలు పెట్టడానికి. మేం అర్ధరాత్రి వచ్చినా వంట చేసుకోవల్సి ఉండేది కాదు. ఒక్కోసారి ఫ్యామిలీతో ఇబ్బంది వచ్చి వంటాగింటా చేయటానికి బాధైతే కమ్యూనుంది తినొచ్చని వచ్చేవాళ్ళం. కమ్యూన్లో నూటయాభై, రెండువందల మంది సభ్యులుండేవారు. బాచిలర్స్‌, విలేజెస్‌లో కార్యక్రమాలుండి ఇక్కడే కొన్నాళ్ళుండాల్సిన వాళ్ళు ఉండిపోయేవారు. మీటింగ్స్‌కి వచ్చి కొందరు రెండు మూడు రోజులుండేవారు. కొందరు హోటళ్ళలో తినేవారు. కొందరు కమ్యూన్లో ఉండేవారు. ఎప్పుడూ ఎంతో కొంతమంది ఉండేవారు. బుల్లెమాంబ ఆర్గనైజ్‌ చేసేవారు. మేమంతా గోర్కీ నవల ‘అమ్మ’ చదివిన తర్వాత ఆ అమ్మ ఈ బుల్లెమ్మ అనుకునే వాళ్ళం.

మా ఆస్థులన్నీ అమ్మినప్పుడు భాగాలు చేసి పిల్లలకీ, భర్తకీ, భార్యకీ, తల్లి దండ్రులకీ అట్లా భాగాలు చేసి ఎవరి భాగం వాళ్ళకిచ్చేసే వాళ్ళం. మా భాగాలన్నీ అమ్మి పార్టీకిచ్చేశాం. ఆస్థి దమ్మిడీ లేకుండా చేసుకుని ఇచ్చేశాం. బుల్లెమాంబ కూడా తనభాగం అమ్మేసి తనూ ఇచ్చేసింది. మీరంతా నా ఆస్తి అనేది. కమ్యూన్లో ఎంతమందున్నా కాని, ఎవరి రుచులేంటి, ఎవరు జబ్బు మనుషులు, ఎవరికెట్లా పెట్టాలి అవన్నీ ఆమెకే తెల్సు. ఆమె కమ్యూన్లోనే ఉండేవారన్నమాట. మేం ఆలస్యంగా వచ్చాం, ఆమెని బాధపెట్టడం ఎందుకని వస్తూ వస్తూ అరటిపళ్ళు తెచ్చుకుంటే, ‘నాకు తెల్సే మీరు అన్నం తినరు, రాత్రి తినకుండా పడుకుంటే పొద్దున్నే నీరసపడిపోతారే’ అంటూ ‘అంత పెరుగన్నం తినండి’, అంత చద్దన్నం తినండి అని తల్లికంటే ఎక్కువగా ఆదరించేది. మర్నాడు పొద్దున్నే లేచి మేం ఆకలేస్తుందంటే నాకు తెల్సే మీరు రాత్రుంటుందో లేదో అని తిని వచ్చామని మీరబద్ధం చెప్తారని అనేది. ఎవరటా.్ల చూస్తారు? (ఇంకావుంది)

(మనకు తెలియన మన చరిత్ర పుస్తకం నుంచి)

 

Share
This entry was posted in జీవితానుభవాలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.