– కుప్పిలి పద్మ
వుదయమే తలుపులు తీసి ఆరుబయట కూర్చుంటే చల్లని వేసవి గాలి, మొక్కలకి విచ్చుకొన్న మల్లెల పరిమళంతో. అలానే ఆ గాలికి శరీరాన్ని అప్పచెప్పేసాను. కాసేపటికి ఆ గాలి కాస్త చిన్న వెచ్చదనానికి మారిపోయింది. చాలా తక్కువ సమయంలోనే వేడిగా మారిపోయింది. వేసవికాలం యెండెక్కే కొద్ది గాలి వేడెక్కిపోవటం సహజమే కదా… కానీ యీ వేడి తీవ్రత భరింపశక్యంగా లేదంటూ వింటున్నాం. వాస్తవానికి అలానే వుంది కూడా. యెండ తీవ్రత యీ కాలపు స్వభావమే కానీ ఆ స్వభావం భరించలేని స్థితికి తీసుకురావటంలో మన ప్రమేయమేమైనా వుందా.
హైదరాబాద్ నే తీసుకొందాం. వొకప్పుడు యెంత యెండ కాసినా సాయంకాలానికి చల్లబడేది. యిప్పుడా పరిస్థితి లేదు. అర్థరాత్రి అయినా వేడి తగ్గటం లేదు. యిటువంటి లక్షణాన్ని బెజవాడలో చూసేవాళ్లం. పాత పత్రికలు, ప్రభలు, జ్యోతులు, యువల్లో వచ్చిన సాహిత్యాన్ని చూస్తుంటే బెజవాడ, గుంటూరు యెండలు గురించిన ప్రస్థావన కనిపిస్తుంది. యిప్పుడు కథో, కవితో రాస్తే హైదరాబాద్ యెండల తీవ్రత గురించి రాయకుండా వుండలేం.
నగరాల్లో పట్టణాల్లో విపరీతంగా పెరిగి పోతున్న జనాభా అవసరాలకి అనుగుణంగా పెరుగుతున్న నిర్మాణాలు. కొట్టేస్తున్న చెట్లు. వో కాంక్రీట్ జంగిల్‌ల్లో యిళ్లని మనం యేం చూపించి అమ్మటానికి ప్రయత్నిస్తున్నామో చూస్తుంటే ప్రకృతికి మన జీవితాలు యెంత దూరంగా నెట్టివేయబడుతున్నాయో తెలుస్తుంది.
కొట్టేసిన చెట్టు స్థానాన్నే కొత్త చెట్లు నాటమంటారు. కొన్ని నాటుతుంటారు కూడా, కానీ అవి యెలాంటివి, యెండా కాలపు గాలిదుమారానికో, వానాకాలపు గాలులకో విరిగిపోతుంటాయి. అంత బలహీనమైన కొమ్మలున్న చెట్లు అవి. అలాంటి చెట్లని తెచ్చి పాతుతూ చుట్టూ సిమెంట్ చప్టా కడతారు. భూమిలో వేళ్లూరని యెదుగుదల చెట్టుకైనా, మనిషికైనా యేం బలం యిస్తుంది. యెంత తొందరగా యెదిగినట్టు కనిపిస్తాయో అంతే త్వరగా కూలిపోతాయి కదా. యివన్ని వాళ్లకి తెలీయవా… తెలుసు చాలా యెక్కువగానే తెలుసు. కానీ శ్రద్ధ లేకపోవటం, తాపత్రయమంతా ఆ రోజు చేసిన పనికి ఆ రోజుకి సరిపడే కవరేజ్ వచ్చిందా లేదాని మాత్రమే చూస్తుంటారు. యిలా రేపటిపై ఆసక్తి, యిష్టం లేకుండా చేస్తున్న అభివృద్ధి భయభ్రాంతులని చేస్తుంది. యీ అవస్థలకి కారణాలు అనేకం. ముఖ్యమైనది యీ వేగవంతమైన ప్రపంచంలో మనం ముందుకి వెళుతున్నామో వెనక్కి వెళుతున్నామో తెలీయనితనం మనల్ని నిరంతరం వెంటాడుతుంటుంది. వొకొక్కప్పుడు ప్రకృతికి చికాకొస్తుంది. దయని మర్చిపోతుంది. గూగుల్ గ్లాస్ సంబరంలో వున్న మనకి ప్రకృతి తీరుతెన్నులని యెందుకు కనిపెట్టలేకపోతున్నామనే విసుగొస్తుంది. నిస్సహాయంగా అనిపిస్తుంది.
యిల్లంతా, వూరంతా, యేసిమ యం అయిపోయిన కాలంలో వొళ్లంతా యేసిమయం చేసుకోవటం యెలా అని పరిశోధనలు యెవరైనా చేస్తున్నారాని గూగుల్ సెర్చ్‌కి కళ్లు అప్పగించకుండా అసలు యింతకు ముందు యీ ప్రకృతితో యెలా సహజీవనం చేసేవారో తెలుసు కోటానికి ప్రయత్నించాలేమో. కొన్ని మన చేతుల్లో వుండవ్. కాని వున్నవాటిని మనం యెలా ధ్వంసం చేసుకున్నామో లేదా చేస్తున్నామో తెలుసుకొంటే మనకి ఆయా రుతువులతో సంభాషించటం సులువవుతుం దనుకొంటాను.
పచ్చికబయళ్ల కోసం వో యాత్రా, పూలవనాల కోసం వో యాత్రా, నీటి చెలమల కోసం వో యాత్రా, చెట్టకొమ్మల నీడల కోసం వో యాత్రా కాకుండా మనం మన రోజువారి జీవితాన్ని కాస్త పచ్చికని వో పూలమొక్కని, వో నీటిచెలమని, చెట్టుకొమ్మని యెలా నింపుకొంటామోనని ఆలోచించా లేమో. ఆ ఆకాంక్ష మనల్ని వెంటాడితే మనం మన చెరువుల్ని కబ్జ కానీయం. ఆ చెరువుపై వో అపార్ట్‌మెంట్‌నో, వాణిజ్యసముదాయాన్నో, అమ్యూజ్‌మెంట్ పార్క్‌నో రానీయకుండా కాపాడుకొంటాం. మన వూరి పురాతన వృక్షాల కొమ్మలని కొట్టనీయం. వృక్షాలని నేల కూలనీయం. సీతాకోకచిలుకల కోసం పూలమొక్కలని పెంచేపాటి నేల వుంటేనే యే అపార్ట్‌మెంట్ లోని ఫ్లాట్‌నైనా కొంటామని స్పష్టంగా చెపుతాం.
మనం యాత్రలని హిమాలయాల ని చూడటానికో, మేఘాలు నేలని తాకి చెవి వొగ్గి మాటలు వినే దృశ్యం కోసమో, పూలతో విప్పారే లోయల రంగులని కళ్లల్లో నింపుకోవటం కోసమో, వో సాహితీవేత్త తిరగాడిన వెన్నెల వృక్షచ్ఛాయల్ని చూడడా నికో మనం యాత్రలు చేద్దాం. నిత్యజీవనా న్ని వో తోటతో, వో సూర్యరశ్మితో, వెన్నెల నీడలతో, పక్షుల కిలకిలలతో, నీటి మిలమిలలతో నింపుకొందాం.
అప్పుడు వేసవిగాలులూ వసంతపు అలకలుగానే అనిపిస్తాయనుకుంటాను.