– ఇంద్రగంటి జానకీబాల
రచయిత : వి.ఏ.కె. రంగారావు
పేజీలు : 496 వెల రూ. 400/-
ఈ మరో ఆలాపన ముందున్న ఒక ఆలాపనకి పొడిగింపు. ‘వార్త’ పేపరులో ధారావాహికంగా ఈ వ్యాసాలు ప్రచురింపబడుతున్నప్పుడు, సినిమాపట్ల, ముఖ్యంగా తెలుగు సినిమా చరిత్ర పట్ల ఆసక్తీ, అభిమానంగల పాఠకుల్లో ఒకరకమైన సంచలనం వుండేది. ఈ ‘మరో ఆలాపన’ చదువుతున్నంత సపూ మరో ఆలోచన లేకుండా ఆ విషయాల వెల్లువలో కొట్టుకుపోతూ పూర్వజన్మ స్మృతులేమోననే భ్రమ కలిగించే సంగతుల సముద్రాల్లో బుడుంగుమని ములిగిపోతూ, ఉక్కిరిబిక్కిరై పోతూ, పైకి లేచి ఆశ్చర్యపడి పోతూ- ఆనందపడటం ఒక్కటే మిగిలిన అనుభవం అనిపిస్తుంది.
ఎన్ని సంగతులు? ఎంత చరిత్ర? ఒక్కొక్కసారి ఎంత నిరసన? మరోసారెంతగా కరిగిపోయి, నీరై ప్రవహించిన గలగల-,
ఎక్కడెక్కడి చరిత్రాంశాలూ వి.ఏ.కె వదలకుండా ఇందులో వ్రాశారు-, ఆయన కాలంతో నడుస్తున్నంతసేపు ప్రతీ నిముషాన్నీ, ప్రతిస్థలాన్నీ అనుభవిస్తూ, అనుభూతి పొందుతూ తన్మయంగా ఇందులో పొందుపరిచారు.
చాకిరేవూ బాన ఏమందీ?
ఏమందీ?- అనిపిస్తుందొకసారి.
మరొక్కసారి గతమెంత ఘనకీర్తి మనకుందీ’ అనిపిస్తుంది.
ప్రతీ వ్యాసం పేజీకి కుడివైపు కార్నర్‌లో ఒక ఫోటో వుంటుంది. పద్ధతి బాగుంది. అయితే ఆ ఫోటోతో (బొమ్మతో) లోపలున్న విషయానికి తప్పనిసరిగా సంబంధముంటుం దని ఆశిస్తే, ఒక్కోసారి నిరాశ ఎదురవుతుంది. అందుల్లో వున్నవారి గురించి, వెంటనే తెలుసుకోవాలంటే శ్రమ పడాల్సిందే. ఒకే వ్యాసంలో ఎన్నో విషయాల ప్రస్తావన వుంటుంది- ఒక ప్రశ్న వుంటుంది. గడిచిన వారాలలోని ప్రశ్నకి జవాబు వుంటుంది. వెంటనే ఈ ప్రశ్నకి జవాబు కావాలని ఆరాటపడితే వెదుకులాట చేయాల్సి వుంటుంది.
121 పేజీలో అలనాటి అందాలెవరు?
139 లో సీత – లవకుశులు (1934) నటులెవరు?
శ్రీ రంజని – మాష్టర్ భీమారావు – మల్లీశ్వరరావు అని కష్టపడి కనిపెట్టాలి.
106 పేజీలో ఎస్ వరలక్ష్మి అపురూపమైన, అరుదైన ఫోటో వివరాలు, చటుక్కున దొరకవు.
109- భావనా సోమయ ఫోటోవేసి మరీ ఆమెకీ, ఆమె పుస్తకానికీ అక్షింతలు వేశారు. వేయాల్సిందే-, తెలుగు సినిమా గురించి ఓనమాలు కూడా తెలియనివాళ్ళు కూడా తెలుగు సినిమా గురించి వ్యాసాలు వ్రాయబూనుకోవడం దురదృష్టకరం- అయితే వాళ్ళకి తెలీదు కదా, వాళ్ళకేం తెలీదని!!!
కొడవటిగంటి కుటుంబరావు గారొక మాటన్నారు. మనకి లేనిది ఎదుటివారు వుందనుకుంటున్నారని తెలిసినప్పుడు పొందే అన్ని ఆనందాలకన్నా, సినిమా గురించి మనకి తెలుసుననుకుంటున్నారు అనేటప్పుడు వుండే ఆనందం చాలా ఎక్కువట-,
478 పేజీలో ‘మనసున మనసై’ (డాక్టర్ చక్రవర్తి- అక్కినేని సావిత్రి – జగ్గయ్య) 1966. పాట ట్యూన్ సాలూరి రాజేశ్వరరావు గారిది కాదని, అది బెంగాలీ పాట కాపీ అన్నారు. అది తప్పు. రాజేశ్వరరావు ‘ఆరాధన’ (నాగేశ్వర రావు – సావిత్రి) చిత్రంలో ”నా హృదయంలో నిదురించే చెలీ” (శ్రీశ్రీ రచన) బెంగాలీ పాట ‘అమార్ స్వప్నేదేఖా రాజకన్యా’ తీసుకున్నారు. ‘ఆరాధన’ మొత్తం సినిమా బెంగాలీ ‘సాగరిక’ అనుకరణ. అందులో ఆ పియానో పాటను యథాతథం తీసుకున్నారు- ఆ బెంగాలీ కంపోజర్ రొబిన్ చటర్జీ.
డా|| చక్రవర్తి సినిమా కోడూరి కౌసల్యాదేవి రచించిన చక్రభ్రమణం నవల ఆధారంగా రూపొందించబడింది. ఇది కేవలం వి.ఏ.కె. గారు స్లిప్పయిన విషయంగా భావించాలి అంతేగానీ, ఆయనకు తెలియని విషయమేదో, ఈ వ్యాస రచయత్రి చెప్తోందని భావించవద్దని మనవి.
ఈ మరో ఆలాపన చదువుతున్నంత సేపూ అద్భుతమైన ఒక జానపద చిత్రం చూస్తున్నట్లనిపించింది. అయితే చదివిన విషయం మళ్ళీ పట్టుకుని, మళ్ళీ చదివి, ఖరారు చేసుకుందామంటే కుదిరేపని కాదు. 496 పేజీల పుస్తకాన్ని తిరగ వేయాల్సిందే – ఏది ఎక్కడుందీ, ఎప్పుడు జరిగింది తెలుసుకోవడం కష్టసాధ్యమైంది.
విషయసూచికలాంటిది లేకపోవడం, ఒకే వ్యాసంలో రెండు మూడు విభిన్నమైన అంశాల ప్రస్తావన వుండటం, సామాన్య పాఠకులకు కొంత అసౌకర్యం కలిగిస్తుంది.
223 పేజీలో మూడు తెలుగు సినిమాల్లో మోహినీ భస్మాసుర నాట్యం చేసిన వారి వివరాలు యిచ్చారు. మాయాబజార్ (1957) లో ఎవరు నాట్యం చేశారు?- అందులో లేదు. 224 ఎ.పి. కోమల గోల్డెన్ అవర్ గురించి మరింత వివరంగా వ్రాస్తే బాగుండేది ఆమె ఫోటో కింద ఎ.పి. కోమల అని మాత్రం వేస్తే ఇంకా బాగుండేది.
ఈ ‘మరో ఆలాపన’ కి ఏది ఎక్కడ వున్నదో సూచించే పట్టికలాంటిది లేకపోవడంవల్ల ఇది రిఫరెన్సు బుక్‌గా ఉపయోగపడే అవకాశం లేదనేది బాధ కలిగిస్తుంది. ఏమీ తెలియని వారికి కూడా ఒక పుస్తకం చదివితే ఎంతో కొంత తెలియాలి. అలాంటి వసతి రచయిత కలిగించాలి.
తెలుగు సినిమా గురించి, తెరవెనుక సంగతుల గురించి తెలుసుకోవాలంటే తప్పక చదవాల్సిన పుస్తకం ఎ.ఏ.కె. రంగారావు గారు రచించిన మరో ఆలాపన అని చెప్పక తప్పదు.