జీవచ్ఛవం

– బొద్దూరు విజయేశ్వరరావు

నవ్వే ఆడదానిని నమ్మకూడదంటూ

ఆమెను జీవితాంతం ఏడ్చేలా చేసిందెవరు?

ఆడది తిరిగితే చెడిపోతుందంటూ

ఆమెను ఇంటి బానిసగా మార్చిందెవరు?

ఆడది అణకువగా ఉండాలంటూ

ఆమెను మూగజీవిగా మలిచిందెవరు?

సంప్రదాయపు ముసుగులో

సామాజిక దోపిడీ చేస్తున్న

ఆచారాల అయ్యగార్లా?

అయ్యగార్ల అడుగుజాడలలో నడిచే

అహంకారపు అత్తమ్మలా?

హింసించేదెవరైనా సరే

కట్టుబాట్ల కటకటాల వెనుక

కన్నీరొలికిస్తూ కూర్చొంది అబలే!

చెదలుపట్టిన చారిత్రక పుటలలో

శిథిలమవుతున్న చిత్రం ఆమె!

అనాదిగా మృగాడి అణచివేతకు గురవుతూ

అహంకారానికి ఆహుతవుతుంది!

స్త్రీగా పుట్టినప్పటినుండి

ఎన్నో పాత్రలలో ఒదిగిపోతూ

వంటింటి పాత్రలకే అంకితమవుతూ

జీవచ్ఛవంలా బతుకు సాగిస్తుంది!

 

తెల్లారుతోంది

– రాజీవ

నడిసంద్రంలో తుఫానుల కెదురీదింది-

తనుమునకలేస్తున్నా, బిడ్డలను నెత్తిన పెట్టుకొని

తడవకుండా తడబడకుండా ధీటుగా గీటుగా

అలసట తెలియకుండా ప్రయాణించింది-

తాగుబోతు మొగుడితో తన్నులు తింటూ

బలవంతంగా పక్కకుచేరి ఎనమండుగుర్ని కంది!

నడిపి ఆరుగురు సందికొట్టి కడుపుబ్బి రోగాలతో కాటికెళ్ళారు

పెద్దది శాంతమ్మ, చిన్నోడు కిట్టయ్య మిగిలారు!

కిట్టయ్య పుట్టాక మొగుడు సన్నాసి మత్తులోనే కన్ను మూశాడు-

ఊపిరిపీల్చుకొని యిద్దర్నీ రెక్కలు చాటుపెట్టుకొని

దొరసానింట్లో పనిచేస్తూ- పిల్లల్ని బళ్ళో వేసింది.

పనయ్యాక దొరసాని బిడ్డ శైలమ్మ దగ్గర కూచునేది.

తన బ్రతుకు తెల్లారి పోతోంది – కొద్ది గంటల్లో

ఒక్కసారి జీవిత పుటలు తిరగేయాలనే ప్రయత్నం-

కరెక్షన్స్‌ చేసుకునే టైం లేదనికాదు – తప్పులేం లేవు-

జల్ది- యింకా తిరగేయాల్సిన పేజీలు చాలా ఉన్నాయె-

శైలమ్మ అమెరికా నుండి మొగుడితో కొట్లాడి వచ్చేసింది

ఉన్నోడైనా, లేనోడైనా ఒకటే – మగాడు మొగుడే!

నాటుసారా – బ్లాక్‌ – చిన్న ఫరక్‌ మాత్రమే

ఆడోళ్ళమైనా అంతే – నాతోటిది ఆ తల్లి శైలమ్మ కూడా-

అ ఆ నుండే ఆహా అనేదాకా యింగ్లీషు తెలుగు నేర్పింది

పిల్లలతో కూర్చుని సైన్సు లెక్కలు నేర్పుతూ నేర్చింది

నాలెడ్జి ఉంది – డిగ్రీ తెచ్చుకో అంది శైలమ్మ

నెత్తి కొట్టుకోనా! నీవిచ్చేది మస్తు- నా బిడ్డలకు

కావాలి- డిగ్రీలు- హోదాలు- సమాజంలో ప్రశంసలు

శాంత డాక్టరయ్యింది- కిట్టయ్య యింజనీరయ్యాడు- శ్రీకృష్ణగా!

టైం దగ్గర పడుతూంది- తెల్లారిపోతోంది

మగతగా ఉంది – మబ్బుల వెనుక తారకలు

తొంగిచూస్తున్నాయ్‌ – తోసుకుంటూ ముందుకు

అనుభవాల జ్ఞాపకాల దొంతరలు- షడ్రుచుల ఉగాది పచ్చడిలా-

దొర పోయాక శైలమ్మనే వ్యాపారాలు చూస్తూంది

తను సెక్రెటరీనే అనుకున్నా శైలమ్మ మాత్రం

తనకు భాగస్వామిగా సమాన హోదా యిచ్చింది

పిల్లల పెంపకంలో చదువులో లోటులేకుండా పెంచింది.

కొద్దికాలంగా శ్రీకృష్ణ నస పెడుతున్నాడు

”నీవు చేస్తున్నది వెట్టి- యీ చాకిరీకి నీవే

ఓ పెద్ద సంస్థ నడప గలవు- పదిమందికి తిండిపెట్టగలవ్‌” –

”అంటే యీ స్వతంత్ర సమత, సామరస్యం వదులుకొని

పైస కోసం పనిపేరుతో మళ్ళీ బానిస ఊడిగం చేయనా?

బిడ్డా- దొరసానిగాని, దళితవని గాని- క్వాలిటీ-

సామర్థ్యం, విజ్ఞానం, అవగాహన, ఆత్మీయత

వీటిబట్టే దేశ గౌరవ ప్రతిష్టలు నిలబెడతాయి

దోపిడీ పైసలు, ఫౌండేషన్‌ లేని పదవులు – కుళ్ళు

రాజకీయాలు – పెరుగుట విరుగుట కొరకే-

నెహ్రూ బిడ్డని కాదుగా – ఇందిరమ్మ సమర్ధత మరువగలమా?

జాతిపిత గాంధీ యీ దేశానికి ఒక్క వారసుడు నివ్వలేదేం?

క్వాలిటీ మెచ్చుకొని, క్వాలిటీ జీర్ణించుకొని, పెంచుకొని

భారత్‌ను క్వాలిటీ దేశంగా స్టాండర్డ్‌ నిలబెట్టండి!”

”క్వాలిటీ ఏం చేసుకోవాలి? మనిషి బ్రతకాలి”-

”అయితే నీ అయ్య స్టాండర్డ్‌ క్వాలిటీ తాగుబోతు అయ్యుండేవాడివి!”

తెల్లారిపోతోంది – మత్తుగా ఉంది- చుట్టూ ఏముంది?

స్తబ్దుగా అయిపోతోంది – కండ్లు చూస్తున్నాయ్‌

దేనికోసం ఎవరికోసం? యింకా ఎందుకోసం?

మహా అయితే మరో అరవై నిమిషాలు – ఊ హు…

శాంత ఎస్‌.సి. కోటాలో ఢిల్లీలో గైనకాలజీ హెడ్‌ అయింది

”మన ఊరు మనచుట్టూ పల్లెలు వదిలి అంతదూరం…”

”మాట మారుస్తావేం? నువ్వేగా సమాజం దేశం అంటావ్‌!

నిన్ను పట్టుకు కూచుంటే అవన్నీ ఎలా చేస్తాం!” అంటూ

వెళ్ళి రెడ్డి ప్రేమలోపడి పెండ్లి చేసుకుంది- ఆ దొర

ఎస్‌ సి తల్లిని చూసేదేముంది- ఎస్‌.సి. లకు సేవ ఢిల్లీలోనే చేస్తున్నారు-

శ్రీకృష్ణను శైలమ్మ భర్త అమెరికా పిలుచుకున్నాడు.

”స్వార్ధపరుడా” తిట్టింది శైలమ్మ- తను వారించింది.

అయిపోయింది – క్షణాలు – తెల్లారుతోంది – అమృతఘడియలు

కండ్లు మూసుకోవాలనుంది- అచేతనం- కదలికలేదు

ఓ వెలుగు తనదగ్గర కొస్తూంది- కండ్లు నిండుతుంది- ఆ మహిళ

తుదిశ్వాస వరకూ కర్తవ్య నిర్వహణ బోధించిన కిరణ్‌ శైలమ్మ!

 

నాలుగు స్థంభాలాట

– డా. కొత్తించి సునంద

1. కాల్మొక్కుతా నేనన్నో కాల్మొక్కుతా నేనయ్యో

బయమైతాదే ఓరన్నో దొరయింటికి నే బోనయ్యో

దుడ్లు, పైసలోరన్నో కూలిసేసి తెస్తనేనయ్యో

బీడీలు సుడతానన్నో, రాళ్ళు మోస్తాను నేనయ్యో

ఏదైన సేస్తానన్నో దొరయింటికి పోనయ్యో

కంపెనీ పనులల్ల అన్నో సావాస కత్తెలుంటారయ్యో

దొరల సేస్టలు ఓరన్నో యాష్ట తెప్పిస్తాయయ్యో

దొరసాని సూసికూడ ఓరన్నో సూడనట్టుంటాది అయ్యో

వాళ్ళ మెత్తల్లో ముళ్ళున్నవన్నో పాశంలో విషముండునయ్యో

ఎండల్లొ పనిసేస్తనన్నో కండల్లు కరిగిస్తనయ్యో

నీ తాగుడికి నేనన్నో పైసలు తెచ్చిస్తనయ్యో

నా తల్లిని తార్చొద్దన్నో పూరాగ ఎండిపోనాదయ్యో

ఎంత కష్టమైన ఓరన్నో నేనె సేస్తానె ఓరయ్యో

దొర యింటి పని నాకన్నో వల్లనే వల్లదయ్యో

2. పెద్దసారు ఓరక్కో పిలుస్తుండు పొమ్మంటివక్కో

యాల పిలుత్తుండో ఓరక్కో నీకెరిక లేదా ఓలక్కో

ఆడపుటుక పుట్టినావక్కో నీ బిడ్డనిట్లే అంపిస్తావ ఓలక్కో

నీకు కావాలంటె ఓరక్కో పై పదవి నీకక్కో

నీవె పోరాద ఓరక్కో దొరసరసానికోలక్కో

నన్నెందుకంపిస్తవక్కో నా ఉసురు తగిలేను నీకక్కో.

నీవు తీయించిన నా కడుపులోని బిడ్డక్కో

నీ బిడ్డలాంటిదె కదక్కో

పోలీసోడికి సెప్తేనక్కో నన్నె తప్పు పట్టిండక్కో

పక్కలో పండకపోతేనక్కో బొక్కలో ఏస్తనన్నాడక్కో

నాకెవరు దిక్కున్నరక్కో నేనాడికి పోదునక్కో.

3. నీకు ప్రమోషన్‌ కావాలి కద మమ్మీ

నీవు చీఫ్‌ వార్డెన్‌ అవ్వాలి కద మమ్మీ

పెద్ద సారేమంటుండు మమ్మీ కమీషన్‌ చాలదన్నడా మమ్మీ

కన్నె పిల్లే కావాలన్నడా మమ్మీ నిన్ను ఒల్లనన్నడా మమ్మీ

హాస్టలు పిల్లల్నె మమ్మీ ఎందుకంపుతావు ఓ మమ్మీ

నే పనికి రానా ఓ మమ్మీ కన్నెపిల్ల నే కానా మమ్మీ

నీ బిడ్డ ఇజ్జత్‌ ఓ మమ్మీ నీవు కాపాడాలె కద ఓ మమ్మీ

దిక్కు మొక్కులేని పోరిల్ని ఓ మమ్మీ

సదువు పేరిట తెచ్చి ఓ మమ్మీ

రంకు పనులు సేసిస్తావా ఓ మమ్మీ

ఆళ్ళు నా అసుమంటి వాళ్ళు కారా మమ్మీ

నా అక్కచెల్లెళ్ళు కారా మమ్మీ

నేపోతనే ఓ మమ్మీ పెద్దసారుకాడికమ్మీ

నీకు ప్రమోషన్‌ ఓ మమ్మీ నే తెప్పిస్తనే ఓ మమ్మీ

నన్నంపవే ఓ మమ్మీ కన్నతల్లివి కద ఓ మమ్మీ.

4. ‘రేపు’లు మాపులు ఎరుగని పార్టీ మాదయ్యా

మేలైనది మా పెబుత్వం, ఎంతో ఘనత వహించిందయ్యా

పోలీసు రికార్డులు సూడండయ్యా

ఆడపిల్లల కన్యాయంయ్యా ఒక్క కేసు లేనెలేదయ్యా

ఆడపిల్లంటె మాకు ‘అమ్మే’ కదయ్యా

‘అమ్మే’ మాకు రక్ష కదయ్య, శక్తి స్వరూపిణి ఆమె కదయ్యా

పరాయోళ్ళ పద్ధతులు మాకయ్య పడనే పడవురయ్య

‘రేవులు’ కుప్పలు ఆ స్టేటులోన, యాసిడ్‌ దాడులు కొల్లలయ్యా

దిక్కు మొక్కూ లేదు ఆడపిల్లలకాడ కదయ్య

వాళ్ళ గోస మీకు ఓ అయ్యా వినపిస్తలేదా ఓ అయ్యా

నిలదీయండి ఓ అయ్యా! ఆ పార్టీని తగులేయండయ్యా

ఎవడ్రా మమ్ము నిలదీసే మొనగాడు

ఎవడ్రా మమ్ము తగలేసే పోటుగాడు

కుళ్ళ బొడుస్తాం! నాల్క చీరేస్తాం

కళ్ళు పీకేస్తాం, ఉతికి ఆరేస్తాం

వాళ్ళదే ‘రంకుల’ పెబుత్వం,

ఆళ్ళదే ‘రేపుల’ బాగోతం

‘రంకులు’ ‘బొంకులు’ మూసిపెట్టేదే ఆ పార్టీ

‘అమ్మ’ వారి పటం అడ్డు పెట్టుకొందా పార్టీ

రమ్మనండి బస్తీమె సవాలుకు, గుట్టు బయట పెడతాం మేము.

 

ఎలా నడవను?

– పుదోట శౌరీలు

ప్రతి ఉదయం బ్రహ్మ ముహూర్తాన లేచి

పేరు తెలియని పిట్టల కిలకిలలు వింటూ

చెట్ల సువాసనలు ఎద నిండా పీలుస్తూ

పిల్ల తెమ్మెలకు మనసు పులకరిస్తుండగా

నా బాల్యపు తీపి గురుతులను నెమరేస్తూ,

తెల్లారుజామున చకచక నడవటం నాకిష్టం

 

ఎప్పుడైనా ఊరకుక్కలు గుంపులుగా వచ్చినపుడో

పిల్లల పంది గుర్రుమంటూ దారికడ్డంగా వెళ్ళినపుడో

పొదలమాటున పాము జరజరమని పాకినపుడో

ఒక్క క్షణం గుండె గుభిల్లుమన్నా మరుక్షణమే నడక

 

మరినేడో తొలిజామున తలుపు తీయాలంటేనే భయం

ఎక్కడ కామపిశాచాలు గుంపులు గుంపులుగా వస్తాయో

సూత్రాలకోసం బైకుల మీద ఏ మూల నుండి ఎవడొస్తాడో

ఏ పొదలమాటు నుండి ఏ తాగుబోతు వెంట పడతాడో

యాసిడ్‌ సీసాలు, కత్తిపోట్లు, మత్తుమందులు, మాయమాటలు

నిర్భయలు, ఆయేషాలు, ప్రత్యూషలు, ఐదారేళ్ళ పసిమొగ్గలు

 

నాకిష్టమైన ఉదయపు నడకకు ఎలా వెళ్ళను?

బురఖా వేసుకోనా? ఉక్కు కవచం ధరించనా?

కారప్పొడి పొట్లాలు, కత్తులు కటారులు, శిరస్త్రాణాలు

యుద్ధానికెళ్తున్న వీర రుద్రమలా ఎలా వెళ్ళను?

 

ఆరోగ్యాన్ని కాంక్షిస్తూ మలయమారుతాన్ని పీల్చాలని

భయాలను మోస్తూ అనుమానాలను భరిస్తూ

అతివనైన నేను ముందడుగు ఎలా వేయను?

నడతలేని సమాజాన నా నడకెలా సాగించను?

ఎందరో అక్రమార్కులున్న నేటి వక్రమార్గంలో

మనిషిని మామూలు మహిళనైన నేను ముందుకెలా సాగను?

 

ఏమో? ఎవరినడగాలి ప్రభుత్వాన్నా, ప్రజలనా?

అండ పిండ బ్రహ్మాండాలను సృష్టించిన ఆ బ్రహ్మదేవుడా??

 

 

 

బాలిక కల

– కె. విజయ నిర్మల

కడుపులో నేను ఉన్నానని తెలిసినా

నాకు జన్మను ఇస్తారు

పుట్టగానే అమ్మో అనేవారు

ఎవ్వరూ లేరు

ఎదుగుతుంటే నన్ను చూసి

భయపడరు, భయపెట్టరు

పెళ్ళి కాకపోతే అవ్వలేదు అని

అవమానించరు

పిల్లలు పుట్టకపోతే ఆ తప్పు

నాపై తోయరు

భర్త చనిపోతే చిన్నబుచ్చరు

వృద్ధాప్యంలో వృధా అనుకోరు

నా స్థానం ఎప్పుడు మరిచిపోరు, మార్చరు

ప్రేమ కలిగిన కుటుంబం

హింస లేని సమాజం, నా కల

 

పక్రృతి సీ్త

పొద్దున్నా పొడిచే పొద్దు పొడుపులో

కూసింతా అయిన రంగులేదే

చెరువు గట్టున చిరుగాలికి ఏమైంది

వేడిగా చూస్తుంది

నా ఊరి బాటలో నడిస్తే వచ్చే

హాయి ఆవిరి అయిందా

ఎటు చూసిన పచ్చదనం కనిపించే

నా పల్లె పడుచు అందంను

ఎవరో దోచుకున్నారా

అమృతాన్ని అందించి ఆయుస్సు పెంచే నీరు

మా ప్రాణాలు తీస్తుందీ ఏమిటి

తినడానికి కరువు లేకుండా

తిండి గింజలను ఇచ్చే నా

భూమాత వనికి, వనికి పోతుంది ఎందుకని

ఎండా వానలు కాలము మరిచి

యాలా, పాలా లేకుండా వస్తున్నా వైనం వింతగా అనిపించలేదా

ఆడ పిల్లలు రక్తంతో తడిసిన నేల

ఆ రక్త కణాలు గోషిస్తున్న గోల

తల్లుల కన్నీళ్ళు తడిపై వీచిన గాలి

ప్రకృతి భీభత్సానికి దారితీస్తుంది

కె. విజయనిర్మల, ఆర్‌.పి.

ఎ.పి. మహిళా సమత సొసైటి, దరిశి, ప్రకాశం డి.ఐ.యు.

Share
This entry was posted in Uncategorized. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.