–సామాన్య
పాపాయిలు పుడితే అమ్మాయిల జీవితాలు ఎంతలా మారిపోతాయో, జీవితం టాం అండ్ జెర్రీ మయమౌతుంది. చూడని యానిమేషన్ సినిమాలు మరేం మిగలకపోగా, ఒక్కోటి చాలా సార్లు కూడా చూడాల్సి వస్తుంది. మా అమ్మాయికి అమ్మ కంపెనీ ఉంటె సినిమా మజాగా ఉంటుంది, అంచేత మాఅమ్మాయి వాళ్ళ అమ్మ, సదరు సినిమాలను అనివార్యంగా అనేకసార్లు చూడాల్సి వస్తుంది. అట్లా అనేకసార్లు చూసినవే సిండ్రెల్లా, బ్యూటీ అండ్ ది బీస్ట్….
రెండూ వాల్ట్ డిస్నీ వారి చిత్రాలే. ఈ రెండు సినిమాలలోనూ అమ్మాయిల పాత్రలు విభిన్నంగా ఉండి నన్ను బాగా ఆకర్షించాయి. నేను మా అమ్మాయిని అడిగాను వాళ్లిద్దర్లో నీకెవరు బాగా నచ్చారు.. ఎందుకు? అని మా అమ్మాయిచెప్పిన సమాధానం మళ్ళీ చెప్తాను మొదట ఆ ఇద్దరమ్మాయిల కథ చూద్దాం..
పిచుకలు సిండ్రెల్లాని తెల్లారింది నిద్ర లెమ్మనడంతో కథ మొదలవుతుంది. ఆ పిల్ల ఆ పిచుకలతో అంటుంది… అవును ఇది మంచి ఉదయమే కానీ నాకొచ్చిన కల ఇంకా అందమయినదని ”ఏ డ్రీం ఈస్ ఏ విష్ యువర్ హార్ట్ మేక్స్ వెన్ యు ఆర్ ఫాస్ట్ అస్లీప్, ఇన్ డ్రీమ్స్ యు లాస్ యువర్ హార్ట్ ఏక్స్. వాట్ ఎవర్ యు విష్ ఫర్, యు కీప్ హావ్ ఫెయిత్ ఇన్ యువర్ డ్రీమ్స్ అండ్ సమ్ డే యువర్ రెయిన్బో విల్ కం స్మైలింగ్ త్రూ, నో మేటర్ హౌ యువర్ హార్ట్ ఈస్ గ్రీవింగ్, ఇఫ్ యు కీప్ ఆన్ బిలీవింగ్ ది డ్రీం దట్ యు విష్ విల్ కం ట్రూ….” అంటూ కల గురించి అందమైన పాట పాడుతుంది. అసలు ఈ సిండ్రెల్లా ఎవరూ ఇంతకీ అంటే… తల్లి లేని పిల్ల. తండ్రి మరొక పెళ్లి చేసుకుంటాడు. సవతి తల్లి ఇంటికి వస్తుంది. ఆవిడకి ఇద్దరు ఆడ పిల్లలు. ఆ తల్లి సిండ్రెల్లాని తన ఇద్దరి పిల్లలకీ, తనకీ పనిమనిషిగా తయారు చేస్తుంది. పనిమనుషులు వుండే గదిలో పెడుతుంది. అక్కడ ఆ చావిట్లో సిండ్రెల్లాకి దొరికిన స్నేహితులూ ఆత్మీయులు అంతా జంతువులూ, పక్షులే.
ఆ రాజ్యపు రాజుకి ఓ కొడుకు. అతనికి ఎవరు నచ్చరు, తండ్రికేమో కొడుకుకు పుట్టే పిల్లల్ని ఆడించాలని కలలు, ఆ కలతో ఒక బాల్ ఏర్పాటు చేస్తాడు. ఆ రాజ్యంలో యువరాజుకి సమ వయస్కులయిన ఆడ పిల్లలందరికీ ఆహ్వానం ప్రకటించబడుతుంది. అట్లా అయినా తన కొడుకుకి ఒక్క పిల్లైనా నచ్చకపోతుందా అని ఆ తండ్రి ఆశ.
ఇక్కడ సిండ్రెల్ల సవతి తల్లి తన ఇద్దరు కూతుర్లనీ బాల్‌కి సిద్దం చేస్తుంది. తనని కూడా తీసికెళ్ళ మంటుంది సిండ్రెల్ల. మంచి గౌను ఉంటే రమ్మంటుంది సవతి తల్లి. కథ అలా మలుపులు తిరిగి ఒక ఫెయిరీ మహిమతో బాల్‌కి వెళ్తుంది ఆ అమ్మాయి. రాకుమారుడికి సిండ్రెల్లా నచ్చుతుంది. కానీ అర్థరాత్రి దాటాక మహిమలన్నీ వెళ్లిపోతాయి. ఆ అమ్మాయి అలంకరణ అంతా వెళ్ళిపోతుంది. అంచేత రాకుమారుడిని వదిలి వెళ్లిపోతుంది సిండ్రెల్లా. ఆ పిల్లకోసం రాకుమారుడి అన్వేషణ… సవతి తల్లి అడ్డు పుల్లలు, చివరికి వివాహం.. ఇది కథ.
బ్యూటీ అండ్ ది బీస్ట్ నాయిక బెల్. ఆ పిల్లకి చదవడమంటే చాలా ఇష్టం. మరే ధ్యాసా ఉండదు, దాన్ని చక్కగా చిత్రించారు సినిమాలో. ఆ ఊరి అమ్మాయిల కలల వీరుడు గేస్టాన్, బెల్‌ని ఇష్టపడతాడు ”ఇటఖ ఈస్ నాట్ రైట్ ఫర్ వుమెన్ టు రీడ్” అనేది అతని అభిప్రాయం. అతను ఆ పిల్లకి ఎలా ప్రపోస్ చేస్తాడంటే ”దిస్ ఈస్ ది డే యువర్ డ్రీమ్స్ కం ట్రు” అంటాడు. ఆ పిల్ల ఆశ్చర్యపడ్తుంది ”వాట్ డు యు నో అబౌట్ మై డ్రీమ్స్” అని అడుగుతుంది ఛిఛి ”మీ ది వైఫ్ ఆఫ్ దట్ బూరిష్, బ్రైన్లెస్స్…” అనుకుంటుంది ”ఐ వాంట్ మచ్ మోర్ దెన్ ప్రోవిన్షియల్… టు హేవ్ సామ్ వన్ అండర్ స్టాండ్” అనుకుంటుంది. అతనితో పెళ్లిని నిర్ద్వందంగా తిరస్కరిస్తుంది.
ఇంతలో పరిసోధకుడయిన వాళ్ళ నాన్న అనుకోని పరిస్థితుల్లో, శాపవశాత్తు మృగంగా మారిన వ్యక్తికి బందీ అవుతాడు. తండ్రిని వెతుకుతూ వెళ్లి, తండ్రిని విడుదల చేసే షరతు మీద బెల్ తను ఆ క్రూర మృగానికి బంధీ అవుతుంది. కథ కొన్ని మలుపులు తిరిగి అతను మృగం అయినా ఆ పిల్ల అతన్ని, అతని మంచితనాన్ని ఇష్టపడ్తుంది. ”ట్రు దట్ హీ ఈస్ నో ప్రిన్స్ చార్మింగ్, బట్ దేరీస్ సమ్ థింగ్ ఇన్ హిం దట్ ఐ సింప్లీ డిడ్ నాట్‌సీ”.. అనుకుంటుంది. ఆ అమ్మాయి అపూర్వమైన ప్రేమతో ఆ మృగం శాపం తొలగి మనిషి అవుతాడు. రాకుమారుడ వుతాడు. కథ సుఖాంతమవుతుంది.
సిండ్రెల్ల ఎవరో తెలియని రాకుమారు డ్ని, రాకుమారుడు కావడంచేత అనివార్యంగా ఇష్టపడి పాకులాడుతుంది. అంతకు మునుపు సవతి తల్లి పెట్టే హింసను ఎదుర్కొనే మార్గాల గురించి కొంచెమన్నా ఆలోచించదు. సిండ్రెల్ల 1950 నాటి మూవీకి కొత్తగా ఇప్పుడొచ్చిన ”సిండ్రెల్ల ట్విస్ట్ ఇన్ టైం” 3వ భాగానికి ఈ పాకులాటల్లో పెద్ద తేడా లేకపోగా కొంచం పెరిగింది కూడా. బెల్ అలా కాదు ఆ పిల్లకి ఏ పాకులాటలు ఉండవు. క్రూర జంతువయినా ఆ మృగంలోని మంచితనాన్ని ఇష్టపడ్డ అరుదైన వ్యక్తిత్వం ఆ పిల్లది.
ఈ రెండు సినిమాలలోని స్త్రీ పాత్ర చిత్రీకరణలో చాలా తేడా వుంది. సిండ్రెల్లా పాత్ర ఆర్థికంగా స్థిరపడిన వ్యక్తిని పెళ్లిచేసుకుంటే జీవితాన్ని సుఖంగా గడపవచ్చునని, స్త్రీకి అంతకంటే కావాల్సింది మరేమీ లేదనీ చెప్తుంది. అందుకోసం సిండ్రెల్ల, ఆమె సవతి అక్క చెల్లెళ్ళు పోటీలు పడతారు. ఇది ఫక్తు సంప్రదాయ భావజాలాన్ని, స్త్రీకి ఆత్మాభిమానం లేకపోవడాన్ని, ఆత్మ విశ్వాసమూ స్వశక్తిపై నమ్మకమో లేకపోవడాన్ని చెపుతుంది. ప్రధాన స్రవంతి భావజాలానికి ప్రతినిధులుగా, పురుషునికి బానిసలుగా అమ్మాయిల్ని తయారుచేస్తుంది.
బ్యూటీ అండ్ ది బీస్ట్ నాయిక బెల్, కాలాన్ని దాటుకొచ్చిన అపురూపమైన స్త్రీ పాత్ర ఇది. ఇవాల్టికి ఆదర్శనీయమైన పాత్ర. స్త్రీకి స్వంతంగా ఒక మెదడు, హృదయమూ, యుక్తాయుక్త విచక్షణ, సాహసమూ వున్నాయని ఈ పాత్ర ప్రతి కదలికా మనకు చెపుతుంది. తండ్రికోసం సాహసంగా వెతకడానికి వెళ్ళడము, ముసలివాడు, అమాయకుడు అయిన తండ్రికోసం అతని శిక్షను తను స్వీకరించడం నుండి, ప్రేమకు కావాల్సింది మంచి హృదయం మాత్రమే అనే వుదాత్తమైన అంశాన్ని నిరూపించడం వరకూ ఈమె అణువణువులో స్వతంత్రత తొణికిసలాడుతుంది. మనం మన పిల్లలకి ఇవాళ పరిచయం చేయాల్సింది ఇలాంటి స్త్రీ మూర్తులనే. సిండ్రెల్ల లాంటి వారు మన పిల్లలికి ఎన్నటికీ ఆదర్శం కారాదు.
నేను మా అమ్మాయిని నీకు ఇద్దర్లో ఎవరు నచ్చారు అని అడిగినప్పుడు నా బిడ్డ సిండ్రెల్ల నచ్చింది అన్నది. నేను కొంచం ఆశ్చర్యపడి ఎందుకట్లా అంటే సిండ్రెల్ల ”ఎప్పుడు ఏదో ఒక పని చేస్తూ ఉంటుందమ్మా ఖాళీగానే ఉండదు” అన్నది. దాని వయసుకు ఆ విశ్లేషణ బాగానే ఉందనిపించినా, అడిగాను, బెల్ ఎంత మంచిది కదా, నాన్న కోసం తను ఖైదీ అయ్యింది, బాగా పుస్తకాలు చదువుతుంది, జంతువు అయినా కూడా ఆ మృగంతో మంచిగా ప్రవర్తించింది అని వివరించడానికి ప్రయత్నించాను. అయినా మా అమ్మాయి ఖచ్చితత్వాన్ని ప్రదర్శిస్తూ అన్నది… బెల్ కూడా మంచిదే అమ్మ, కానీ సిండ్రెల్ల ఎప్పుడూ ఖాళీగా ఉండదు కదా అమ్మ.. అని పాత పాటే పాడింది… ఇప్పుడు నా బిడ్డ ఎనిమిదేళ్ళు కూడా నిండని చిన్ని అమ్మాయి. మరి పదిహేనేళ్ళు వచ్చాక ఏ మూవీ నచ్చుతుందని చెప్తుందో చూడాలని నాకు చాలా ఆసక్తిగా ఉంది. ఎందుకంటు పిల్లల భవిష్యత్తులోకి, మనం ఎక్కుపెట్టిన బాణాలు దేనికి గురి పెడుతున్నామన్నది నిర్ణయించుకోవాల్సింది మనమే. బెల్ ”చైతన్య భరితము, ఆదర్శ పూరితమైన వ్యక్తిత్వాలకు ప్రతినిధి కాగా, వ్యామోహాలు, విన్యాసాలు, సంగీతాలు నిండిన సర్వ సాధారణ ప్రధాన స్రవంతికి” సిండ్రెల్ల ప్రతినిధి.
మీ అమ్మాయికి మీరు సరిగా జవాబు చెప్పనే లేదు.
సిండ్రెల్లా చేసేది బానిస చాకిరీ అని చెప్ప లేదు మీరు.
బెల్ అలా కాదు. తన కోసం, తన ఇంటి కోసం తాను పని చేసుకుంటుంది. వృద్ధుడైన తండ్రిని కూడా చూసుకుంటుంది. ఏ పని చెయ్యకుండానే అవన్నీ జరుగుతాయా? బెల్ పుస్తకాలు చదువుతూ, లోకాన్ని అర్థం చేసుకుంటూ పని చేస్తుంది. పని చెయ్యకుండా ఓ మూల కూర్చోదు ఎప్పుడూ, ఆ బీస్టుకి బందీ అయ్యే వరకూ.
తమకే సరిగా తెలియని విషయాలని పిల్లలకి సరిగా నేర్పలేరు.
– ప్రసాద్
మీరు ఎలాగయినా విమర్శించాల్సిందే అనే తొందరలో ఉన్నట్లున్నారు . తొందర పడక విషయాన్ని మళ్ళీ ఒక సారి చదవండి. ఆవిడ ప్రస్తావించిన బిడ్డ వయసును గుర్తుంచుకొని మీ మేధో ప్రదర్శన చేయండి .