డా|| కె. సీత

నేను, మా శ్రీవారు శ్రీనివాసరావు గారు, మా ఇంట్లోని మరో పోర్షన్‌లో ఉంటున్న ప్రసాద్‌ గారు, వారి శ్రీమతి శ్రీలక్ష్మి గారు, వారి కుమార్తె గోమతి కలిసి ”వాలీ ఆఫ్‌ ఫ్లవర్స్‌”కి వెళ్ళడానికి ప్లాన్‌ చేసుకున్నాము. ఈ ట్రిప్‌ మొత్తం పదకొండు రోజులు. ఆగస్ట్‌ నెల 14వ తేదీ మొదలుపెట్టి 24వ తేదీ ఆగస్టున పూర్తిచేశాం. ఎందుకంటే జూలై, ఆగస్టు, సెప్టెంబర్‌ నెలలు ఈ వాలీ సందర్శనకు ముఖ్యమైన నెలలు.  1

ఆగస్టు నెల 14వ తేదీ ఉదయం ఏ.పీ. ఎక్స్‌ప్రెస్‌లో బయలుదేరి న్యూఢిల్లీకి ఉదయం 9 గం||లకు చేరుకున్నాము. లంచ్‌ పూర్తిచేసి న్యూఢిల్లీలో 12 గం||లకు మధ్యాహ్నం బయలుదేరే ఇండోర్‌ – డెహ్రాడూన్‌ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణించి సాయంత్రం 5.30 గం||లకు హరిద్వార్‌ చేరుకున్నాము. ఆ రోజుకి హరిద్వార్‌లో బస చేశాము. సాయంత్రం హరికి పౌరి, ఆరతి చూసి మరుసటి రోజు ఉదయం ఛత్రపాల్‌ సింగ్‌జీ టాక్సీ ఎక్కి ‘జోషిమఠ్‌’ చేరేసరికి రాత్రి 7 గం|| అయింది. ఆ రోజుకి జోషిమఠ్‌లో నైట్‌హాల్ట్‌ చేశాము. మర్నాడు ఉదయం 6 గం||లకే బయలుదేరి ఉదయం 10 గం||ల వరకు ‘బదరీనాథ్‌’ చేరుకున్నాము. బదరీ నారాయణుడిని దర్శించుకుని ఆరోజు అక్కడే బస చేశాము. మరుసటి రోజు ఉదయం 7 గం||లకు ఆగస్ట్‌ 18న బయలుదేరి మా టాక్సీలో 20 కి.మీ. ప్రయాణించి

9 గం||లకు ”గోవిందఘాట్‌” చేరుకున్నాము. గోవిందఘాట్‌ నుంచి గంగారియాకు టాక్సీలు వెళ్ళవు. రోడ్డుండదు. కనుక గోవిందఘాట్‌లో మేము 2 రోజులకోసం గుర్రాలను మాట్లాడుకొని ”గంగారియా”కి బయలుదేరాము. దారి అంతా రాళ్ళు, గుట్టలమయంగా ఉంది. సెలయేళ్ళు, జలపాతాలు, రకరకాల మొక్కలు ఔషధులు, పుష్పాలు, ‘భయందర్‌ గంగానదీ’ పరవళ్ళు, భయందర్‌ గంగానదీ లోయగుండా మా ప్రయాణం మొత్తం అద్భుతమైన దృశ్యాలే. మధ్యలో వర్షం మొదలైంది. రెయిన్‌కోట్స్‌ తీసుకొని వెళ్ళడం వలన గుర్రాలు దిగి వాటిని కప్పుకొని మళ్ళీ ప్రయాణించాము. మధ్యలో గుర్రాలు ఎగిరెగిరిపడే రాళ్ళు, పర్వతాలు దాటుకుంటూ మార్గ మధ్యలో, 2 గం||లకు ఒక చిన్న రెస్టారెంట్‌లో వేడి వేడి వెజిటబుల్‌ పలావ్‌ తిని భయందర్‌ గంగ ఫొటోలు తీసుకుంటూ మళ్ళీ ప్రయాణం మొదలు పెట్టాము. అలా 14 కి.మీ. ప్రయాణాన్ని 4 గం||లలో పూర్తి చేసుకుని మధ్యాహ్నం ఒంటిగంటకు గంగారియా చేరుకున్నాము.   02

‘గంగారియా’లో భయందర్‌ గంగ, పుష్పవతీ నది సంగమించి ”లక్షణగంగ” గా ఏర్పడుతుంది. ఇది ముందుకి సాగి గోవిందఘాట్‌ వద్ద అలకానందానదితో సంగమం చెంది బదరీనాథుని పాదాలవద్దకు చేరుకుంటుంది. గంగారియా అతి చిన్న కుగ్రామం. వేళ్ళపై లెక్కబెట్టగలిగినన్ని ఇళ్ళున్నాయి. అన్నీ చిన్న చిన్న డబ్బారేకుల ఇళ్ళు. ‘గరేవాల్‌ మండల్‌ వికాస్‌ నిగమ్‌’ వారి వసతి గృహం ఉంది. మా బస ఇందులోనే. ఒక గంట విశ్రాంతి తీసుకొని, 2 గం||లకు బయలుదేరి 6 కి.మీ. దూరంలో వున్న ‘హేమకుండ్‌ గురుద్వారా, లక్షణ టెంపుల్‌ దిక్కుగా గుర్రాలపై ప్రయాణమయ్యాము. దారి అంతా కొండవాలు ప్రదేశాలు, రాళ్ళు, గుట్టలు, హిమాలయాలు, అక్కడక్కడ పచ్చిక బీళ్ళు, లోయలు, అనేక రకాల ఔషధ మొక్కలు, ‘బ్రహ్మ కమలాలు ఓహ్‌! అద్భుత కమనీయ దృశ్యాలు స్వర్గాన్ని తలపిస్తున్నట్లుగా ఉంది. అలా 3 1/2 గం|| ప్రయాణించి ‘హేమకుండ్‌ సాహెబ్‌’ గురుద్వారా చేరుకున్నాము. హేమకుండ్‌ హిమాలయాల ఒడిలో వుంది. గురుద్వారా ఎదురుగా హేమకుండ్‌ సరస్సు సగం మంచుతో నిండి వుంది. కొద్దిగా నీరుంది. మార్గమధ్యంలో ఎదురైన సిక్కు భక్తులంతా మగవారు మాత్రం ఆ గడ్డకట్టే చలిలో సరస్సులో స్నానాలు చేశారు. వారి భక్తే చలినుండి కాపాడినట్లుంది. హేమకుండ్‌ అంటేనే మంచుతో నిండిన సరస్సు అని అర్థం. హేమకుండ్‌ 15, 200 అడుగుల ఎత్తుపై (సముద్రమట్టానికి) ”సప్త శిగరి” హిమాలయ పర్వతాల ఒడిలో వుంది.

గురుద్వారా చిత్రమైన ఆర్కిటెక్చర్‌తో ‘స్టార్‌’ ఆకారంలో నిర్మించబడింది. సిక్కుల 10వ మత గురువు గురుగోవింద్‌ సింగ్‌జీ ఇక్కడ ధ్యానం చేశారని చెపుతారు. పాండురాజు, పాండవులు ఇక్కడ తపస్సు చేశారట. గురుద్వారాలో పవిత్ర ”గురుగ్రంథ్‌ సాహెబ్‌” ఉంది. ఇది హిమాలయాలలో ఉన్న అతి ఎత్తైన గురుద్వారా. సిక్కులకు పవిత్ర స్థలం. గురుద్వారాకి వెనుకనే ఉన్న ”లక్షణ్‌ టెంపుల్‌” హిందువులకి పవిత్ర స్థలం. మేఘనాథునిచే గాయపడిన లక్ష్మణుడు (రామ, రావణ యుద్ధంలో) ఇక్కడ చేరి ధ్యానం చేసుకుని తిరిగి ఆరోగ్యాన్ని పొందాడని ప్రతీతి. ప్రతి సంవత్సరం మంచు నిండడంవల్ల కొట్టుకుపోయిన గంగారియా – హేమకుండ్‌ మార్గాన్ని సిక్కు భక్తులు కరసేవ ద్వారా కొంత పునరుద్ధరిస్తారట. అక్టోబర్‌ నుంచి తిరిగి జూన్‌ నెలవరకు మంచుతో కప్పబడి మానవ మాత్రులు ఎవరూ ఇక్కడకి చేరలేరు.

ఇప్పుడున్న గురుద్వారాను 1960వ సంవత్సరంలో మేజర్‌ జనరల్‌ హర్‌కిరాట్‌సింగ్‌, ఇంజనీర్‌ ఇన్‌ ఛీఫ్‌, ఇండియన్‌ ఆర్మీ ఇక్కడకివచ్చి ఆర్కిటెక్ట్‌ సియాలి పర్యవేక్షణలో కట్టించారు. గురుద్వారాలో లంగర్‌ 24 గంటలూ సాగుతుంది. కరసేవకుల సేవలు అద్భుతం. వారిచ్చే వేడి వేడి ప్రసాదం సుమధురంగా వుంటుంది.

మేం ఐదుగురం గురుద్వారా దర్శించుకుని లెక్కలేనన్ని ఫొటోలు తీసుకుని, లక్షణ టెంపుల్‌ని కూడా దర్శించుకుని ప్రకృతికి ‘పరవశిస్తూ హిమాలయాల శిఖరాల దర్శనం చేసుకుంటూ తిరిగి మా ప్రయాణాన్ని కొనసాగించాము. గుర్రాలపై సవారీ చేస్తూ గంగారియా చేరేసరికి రాత్రి 7 గం|| అయింది. హిమాలయాల్లో రాత్రి 8 గంటలవరకు వెలుతురు ఉంటుంది. గరేవాల్‌ మండల్‌ వారి వసతి గృహంలో ఆరోజు డిన్నర్‌ పూర్తిచేసుకుని రాత్రికి విశ్రాంతి తీసుకున్నాము.

”వాలీ ఆఫ్‌ ఫ్లవర్స్‌” : మరుసటిరోజు ఉదయం త్వరగా తయారై బ్రేక్‌ఫాస్ట్‌ ముగించి 8 గంటలకే బయలుదేరి ఎంతో ఉత్కంఠతతో ఎదురుచూసిన వాలీ ఆఫ్‌ ఫ్లవర్స్‌కి కాలినడకన ప్రయాణమయ్యాము. మధ్యలో గ్లేషియర్స్‌ దాటాల్సి ఉండడంవల్ల గుర్రాలు పోవు. ట్రెక్కింగ్‌న మాత్రమే పోవాలి. ఈ 4 కి.మీ. ప్రయాణంలో విపరీతమైన ఎత్తుప్రదేశాలు, స్లోపులు, దాటుకుంటూ 2 గంటలలో 3 కి.మీ. నడిచేసరికి గాలిలో పరిమళభరితమైన సువాసలు వీచడం మొదలైంది. అలా పుష్పాల పరిమళాలు పీల్చుతూ జీవితానికి సరిపడ్డ ఆక్సిజన్‌తో మా ఊపిరితిత్తులు నిండి వుబ్బిపోయాయి. అలా పూలసౌరభాలతో మా ప్రయాణం మరో కిలోమీటర్‌ సాగింది. ఎదురుగా పుష్పవతీనదీ లోయ, నది, గ్రేటర్‌ హిమాలయాలు, గొప్ప ప్రకృతి కళాకారుడు గీసిన అద్భుతమైన చిత్రం ఈ పూలలోయ. మా ఎదురుగా రెండు పెద్దపెద్ద గ్లేషియర్స్‌, మంచు కరిగి జారుడుగా వుంది. రెండు గ్లేషియర్స్‌ నడుమ భయంగొలిపేలా ఒక మీటర్‌ గాప్‌ వుంది. మా గైడ్‌ ఒక్కొక్క గ్లేషియర్‌ పైకి లాగాడు. పాపం మా మిత్రులు ప్రసాద్‌ గారు భయపడి నేను రావని ఎంత బ్రతిమాలినా వినకుండా మొదటి గ్లేషియర్‌ పైనే కూర్చుండిపోయాడు. బ్రతికి వుంటే బలుసాకు తినవచ్చు అనుకొన్నాడు. రెండు గ్లేషియర్స్‌ దాటుతేనే పూలలోయలోకి అడుగుపెడతాము. చేసేదిలేక మేం అతన్ని వదిలేసి పూలలోయలోకి ప్రవేశించాము.

ఇంకేముందు, మాటలకందని అద్భుతమైన పూలలోయలో రంగురంగులు పూలు మెత్తని పరుపులా పరుచుకున్నాయి. స్లోపులు, హిమాలయాలు, పుష్పవతీ నది, లోయ, పూలసౌరభాలు అనేక రకాల అరుదైన ఓషధ మొక్కలు, లోయలోని పూలతో ఐక్యమవ్వాలని మనస్సు పులకించిపోయింది. అలా నడుచుకుంటూ ఆ దృశ్యాలను శాశ్వతం చేయాలని ఆరాటంతో వేలవేల ఫొటోలు తీసుకుంటూ ముందుకెళ్ళి ”మిస్‌ మార్గరెట్‌ లెగ్గీ” సమాధి చూశాము. ఆమె ఎంత అదృష్టవంతురాలో కదా! ఈ పూలతో ఐక్యమయిందనిపించింది. మా గైడ్‌ అతి ఉత్సాహాన్ని ప్రదర్శించి లోయలోని జారిపోయాడు. ఒక్క క్షణం మా గుండెలు కొట్టుకోవడం ఆగిపోయాయి. అతను అతిలాఘవంగా లోయలోంచి లేచి అంటిన మంచుపొడిని దులుపుకుని నవ్వుతూ పైకొచ్చాడు. మేమంతా ఒక్కసారి ఊపిరి పీల్చుకున్నాము. మళ్ళీ గుండె కొట్టుకోవడం ప్రారంభించింది లబ్‌డబ్‌ సౌండ్‌ మా చెవులకి వినపడేలా.

వాలీ ఆఫ్‌ ప్లవర్స్‌ నందాదేవి బయోస్ఫియర్‌ రిజర్వ్‌ యొక్క రెండవ కోర్‌ జోన్‌లో వుంది. వాలీ ఆఫ్‌ ప్లవర్స్‌ నవంబర్‌ 6వ తేదీన 1982వ సంవత్సరంలో నేషనల్‌ పార్కుగా డిక్లేర్‌ అయింది. అది ఉత్తరాఖండ్‌లోని ఘరేవాల్‌ హిమాలయాలకు పైవైపున ‘జన్‌స్కర్‌ హిమలాయ పర్వత పంక్తులలో భాగంగా వుంది. వాలీలో అతిఎత్తైన పర్వతం ‘గౌరీ పర్వతం’ సముద్రమట్టానికి 6,719 మీటర్ల ఎత్తున వుంది. వాలీ ఆఫ్‌ ప్లవర్స్‌ వరల్డ్‌ హెరిటేజ్‌ సైట్‌లో భాగం. ఈ నేషనల్‌ పార్క్‌ 87.5 చదరపు మైళ్ళ వైశాల్యం కలిగి వుంది. ఈ వాలీలోని పుష్పాల రంగులు ఐదు లేదా 6 రోజులకి ఒకసారి మారిపోతూ ఉంటాయి. అంటే కొన్ని రోజుల్లో వాలీ మొత్తం పింక్‌ వర్ణంలో వుంటే కొన్నిరోజులు ఊదావర్ణం, మరికొన్ని రోజులకు పసుపు వర్ణం, తెలుపు వర్ణం ఇలా రంగులు మారుతూ పుష్ప ప్రేమికులకు, ప్రకృతి ప్రేమికులకు, ఫొటోగ్రాఫర్లకు ఇది స్వర్గధామం అంటే అతిశయోక్తి కాదు.

ప్రపంచవ్యాప్తంగా అతిప్రమాదపు అంచున వున్న, సమీప భవిష్యత్తులో విలుప్తమయ్యే (లినిశిరిదీబీశి) అరుదైన, మరే ప్రదేశంలో కనబడని, ప్రపంచవ్యాప్తంగా అతి అరుదైన రకాల లెక్కకు మించిన ఔషధ మొక్కలకు, పుష్పాలకు, జంతు, వృక్షసంపదకూ ఇది వునికిపట్టు. ఈ వాలీలో అతి అరుదైన బ్రహ్మకమలాలు, బ్లూ పాపి (ఔజితిలి ఆళిచీచీగి), కోబ్రా లిల్లీల వంటివి విస్తారంగా కనపడతాయి. ఇవి ప్రపంచవ్యాప్తంగా అతిప్రమాదపు అంచున వున్న, సమీప భవిష్యత్తులో అంతరించిపోయే జాతులకు కొన్ని ఉదాహరణలు మాత్రమే.

ఈ వాలీ చాలా సంవత్సరాలు టూరిస్టులు పోవడానికి అనుకూలంగా లేని పర్వత ప్రాంతాలలో, గడ్డకట్టే అతిశీతల గ్రేటర్‌ హిమాలయాలలో భాగంగా వుండడంవల్ల టూరిస్ట్‌ ఖబిచీ (చిత్రపటం) నుంచి కనుమరుగైంది. కాని 1931 సంవత్సరంలో ఫ్రాంక్‌ ఐ.స్మైతిచ ఎరిక్‌ షింప్టన్‌, హోల్డ్‌వర్స్‌ అవే బ్రిటిష్‌ పర్వతారోహకులు ‘మౌంట్‌ కామేత్‌’లో దారితప్పి ఈ సుందర పూలలోయలోకి రావడం జరిగింది. వారు ఈ పూలలోయ సౌందర్యానికి ముగ్ధులై ”వాలీ ఆఫ్‌ ఫ్లవర్స్‌”గా నామకరణం చేశారు. మళ్ళీ 1939వ సంవత్సరంలో మిస్‌ మార్గరేట్‌ లెగ్గీ అనే బొటానిస్ట్‌, రాయల్‌ బొటానికల్‌ గార్డెన్స్‌, ఎడింబరో వారి ఆర్డరుపై బొటానికల్‌ స్టడీ చేయడానికి ఈ వాలీకి పంపించబడింది. ఆవిడ అరుదైన పూలను సేకరించే క్రమంలో పర్వత స్లోప్‌ల నుండి జారి లోయలో పడిపోయి మరణించింది. ఆమె సోదరి తిరిగి ఈ లోయకువచ్చి ఆమె జ్ఞాపకార్థం ‘మిస్‌ మార్గరేట్‌ లెగ్గీ’ మెమోరియల్‌ కట్టించింది.

వైల్డ్‌ లైఫ్‌ ఇన్సిటిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా వారి అనుమతితో ప్రొ|| చంద్రప్రకాష్‌ కాలా అనే వృక్ష శాస్త్రవేత్త పూలలోయలోని పుష్పాలపై శాస్త్రీయమైన అధ్యయనం చేయడానికి వచ్చారు. ఆయన తన అధ్యయనాన్ని 10 సంవత్సరాలపాటు కొనసాగించి ‘ద వాలీ ఆఫ్‌ ప్లవర్స్‌ మిత్‌ అండ్‌ రియాలిటి’ ‘ఇకాలజి అండ్‌ కన్‌జర్వేషన్‌ ఆఫ్‌ ది వాలీ ఆఫ్‌ ఫ్లవర్స్‌ నేషనల్‌ పార్కు, ద ఘరేవాల్‌ హిమాలయా’ అనే రెండు గ్రంథాలు రచించారు.

ఈ వాలీ ఇప్పుడు ఉత్తరాఖండ్‌ స్టేట్‌ ఫారెస్ట్రీ డిపార్ట్‌మెంట్‌, నేషనల్‌ మినిస్ట్రీ ఆఫ్‌ ఎన్విరాన్‌మెంట్‌ అండ్‌ ఫారెస్ట్స్‌, ఇండియా వారి అధీనంలో వుంది. వాలీలో వేసవిలో జూన్‌ నుండి అక్టోబర్‌ వరకే సందర్శకులకు అనుమతి వుంది. పశువులు మేపడానికి గ్రామస్థులకు అనుమతి లేదు. మిగతా నెలలలో అఖండమైన మంచుతో వాలీ కప్పబడి వుంటుంది.

ఈ పూలలోయ గరేవాల్‌ హిమాలయాలకు దగ్గరగా భయందర్‌ గంగాకి సమీపంలో ఉంది. గోవిందఘాట్‌ దగ్గర భయందర్‌ గంగ, భయందర్‌ వాలీ ఉన్నాయి. వాలీ ఆఫ్‌ ఫ్లవర్స్‌లో పుష్పవతీ నది ప్రవహిస్తూ పుష్పవతీ లోయను ఏర్పరచింది. నందాదేవీ నేషనల్‌ పార్కుకు 20 కిలోమీటర్ల దూరంలో ఉత్తర-పడమటి దిక్కున భయందర్‌ వాలీని క్రాస్‌ చేస్తుంది ఈ పూలలోయ. వెడల్పైన భయందర్‌ లోయ తల పైభాగంలోని రెండు వేలాడే లోయల్లో ఒకటి పూలలోయ, రెండవది హేమకుండ్‌ లోయ. పూలలోయ 15 కి.మీ. పొడవు, 6 కి.మీ. వెడల్పున పుష్పవతీ నదీలోయలో వ్యాపించింది. పుష్పవతీ నది తిప్రా (ఊరిచీజీబి) గ్లేషియర్‌ నుంచి చిన్న ప్రవాహంగా బయలుదేరి తూర్పునవున్న గౌరీ పర్వతం నుంచి క్రిందికి జాలువారుతుంది.

పూలలోయలో జూన్‌ నుంచి సెప్టెంబర్‌ మాసాల్లో వర్షాలు అధికంగా కురుస్తాయి. అందువల్ల నేల చిత్తడిగా వుండి దట్టమైన చిట్టడవులు, పచ్చని వృక్షాలు, మొక్కలు దట్టంగా ఏర్పడ్డాయి. ఏప్రిల్‌-జూన్‌ మాసాల్లో అత్యధికంగా 19ళ్పిు ఉష్ణోగ్రత వుంటుంది. వేసవిలో దట్టమైన పొగమంచుతో నిండివుండి, వేసవి అంతంలో వర్షారంభం అవుతుంది. ట్రెక్కర్స్‌ ఘరేవాల్‌ ప్రాంతంలోని జోషిమఠ్‌ నుంచి 17 కి.మీ. ట్రెక్కింగ్‌ చేసి మాత్రమే ఈ లోయకు చేరుకుంటారు. సాధారణ యాత్రీకులు బదరీనాథ్‌ నుంచి 16 కి.మీ. ప్రయాణించి గోవిందఘాట్‌ చేరుకుని అక్కడనించి 14 కి.మీ. ట్రెక్కింగా గాని, గుర్రాలపై గాని గంగారియా చేరవచ్చు. గంగారియా నుంచి ఒక దారి వాలీ ఆఫ్‌ ఫ్లవర్స్‌కు 4 కిలోమీటర్ల దూరంలో, మరోదారి 6 కి.మీ. దూరంలోని హేమకుండ్‌కు చేరుతుంది. వాలీ ఆఫ్‌ ఫ్లవర్స్‌లో ఫారెస్ట్‌ రిసర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ వారు సర్వే చేసి 600 జాతుల ఆంజియో స్పర్మ్స్‌, వాటిలో 592 పుష్పించే మొక్కలు, 30 జాతుల టెరిడోఫైట్స్‌, 58 రకాల సరికొత్త జాతుల మొక్కలను నమోదు చేశారు. అందులో ఉత్తరప్రదేశ్‌ హిమాలయాల్లో అసలే కనిపించనివి ఈ పూలలోయలో ఉన్నట్లుగా నమోదు చేశారు. అతిఅరుదైన 6 జాతులలో 5 జాతుల మొక్కలు ప్రపంచవ్యాప్తంగా మరియూ నందాదేవి నేషనల్‌ పార్క్‌లో కూడా లేనివి, అతిప్రమాదపు అంచున వున్నవి ఇక్కడ వున్నాయి. వాటిలో ‘అకోనిటమ్‌ ఫాల్కోవేరి, అ.బాల్‌ఫోరి, హిమాలయన్‌ మాపుల్‌, ఏసర్‌ కేసియమ్‌, బ్లూ హిమాలయన్‌ పాపి, మెకనోప్సిస్‌ అక్యులియేట్‌, సాసురియా అట్‌కిన్‌సోని ఉన్నాయి. మనదేశంలోనే అరుదైన 31 జాతులు ఈ లోయలో ఉన్నాయి. ఇక్కడ విరివిగా కనపడే మొక్కలు ఆస్టరేసి కుటుంబానికి చెందినవి 62 జాతులు, 45 జాతుల ఔషధ మొక్కలు, వీటిలో సాసురియా జిబవల్లేటాను బ్రహ్మ కమలాలని కూడా పిలుస్తారు. ఈ బ్రహ్మకమలాలను ఇక్కడి దేవతామూర్తులైన నందాదేవి, సునందాదేవి పూజలో వినియోగిస్తారు. ఈ లోయను ‘సెంట్రల్‌ ప్లాంట్‌ బయోడైవర్సిటి’గా కూడా అభివర్ణిస్తారు.

ఈ లోయలోని జంతుసంపద అతిఅరుదైనది. దేశవ్యాప్తంగా వీటి వునికి అతిప్రమాదపు అంచున వుంది. 13 జాతుల క్షీరద జంతువులలో ‘గ్రేలంగూర్‌’, ‘ఫ్లైయింగ్‌ స్క్విరల్‌’, ‘హిమాలయన్‌ బ్లాక్‌ బేర్‌’, ‘రెడ్‌ఫాక్స్‌’, ‘వుల్ఫిస్‌ వుల్ఫిస్‌’, ‘యెల్లో మార్టిన్‌’, ‘హిమాలయన్‌ గోరల్‌’, ‘హిమాలయన్‌ మస్క్‌డీర్‌ (కస్తూరి మృగం)’, ‘ఇండియన్‌ ఛెవర్టేన్‌’, ‘హిమాలయన్‌ థార్‌’, ‘సీరో’, ‘పాంథేరా పార్థస్‌’ ‘పాంథేరా యునికా’ (స్నోలెపార్డ్‌), ‘బ్రౌన్‌ బేర్‌’, ‘బ్లూషీప్‌’, వున్నాయి. ఇంతేకాక రంగురంగుల హిమాలయన్‌ పక్షులు ఈ లోయలో ఉన్నాయి.

పుష్పాలలో ఎక్కువగా ఆర్కిడ్స్‌, పాపీస్‌, ప్రైములా, మారీగోల్డ్‌, డెయిబీలు, అవీమోన్స్‌ లోయలో కార్పెట్‌ పరిచినట్లుగా పెరుగుతాయి. పెద్ద వృక్షాలలో పైన్స్‌, రోడో డెండ్రాన్స్‌ వున్నాయి.

ఈ అద్భుత పూలలోయలో మేము ఫొటోలు తీసుకుంటూ తిరుగు ప్రయాణం అయ్యేసరికి వర్షం చిన్నగా మొదలై తీవ్రమయింది. అందరం రెయిన్‌కోట్లు వేసుకొని నడవడం ప్రారంభించాము. వర్షంవల్ల స్లోపుల్లో భయంకరమైన జారుడు మొదలైంది. గ్లేషియర్స్‌ అతిభయానకంగా మారాయి. జారుతూ పడుతూ, లేస్తూ భయంతో బిగుసుకుపోయాము. అంతకు కొద్దిసేపటిక్రితం ఆనందించిన దృశ్యాలన్నీ భీభత్సంగా భయంగొల్పుతూ వున్నాయి. రెండు గ్లేషియర్స్‌ మధ్యా గాప్‌ను గైడ్‌ సహాయంతో దాటి బతుకు జీవుడా అని బయటపడ్డాము. ఆ తరువాత వర్షం తగ్గుముఖం పట్టెచిన్నజల్లులుగా మారింది. మేం తిరిగి ప్రసాద్‌ గారిని కలిసేము. ఆ తరవాత మాకు తెచ్చుకున్న వాటర్‌ బాటిల్స్‌, బిస్కట్స్‌ గుర్తువచ్చాయి. అవి ఆరగించి కొంచెంసేపు సేదదీరి లోయ క్రిందికి దిగడం మొదలుపెట్టాము.

అలా మరో 4 గం|| నడచి మెల్లగా గంగారియా చేరుకున్నాము. సమయం సాయంత్రం 5:30 గంటలైంది. ఆ రాత్రికి స్త్రఖఙశ్రీ గెస్ట్‌హౌస్‌లో బసచేసి డిన్నర్‌ పూర్తికానిచ్చి నిద్రకు ఉపక్రమించాము.

మరుసటిరోజు వుదయం ఆగస్టు 20వ తేదీన 7 గం||లకే బయలుదేరి గుర్రాలెక్కి 14 కి.మీ. ప్రయాణాన్ని తోడుగా భయందర్‌ గంగ వెంటరాగా గోవిందఘాట్‌ చేరేసరికి మా డ్రైవర్‌ ఛత్రపాల్‌సింగ్‌ మాకోసం ఎదురుచూస్తూ కనిపించాడు. మేం క్షేమంగా తిరిగివచ్చినందుకు మమ్మల్ని అభినందించి కారు స్టార్టు చేశాడు. అక్కడనించి జోషిమఠ్‌ మీదుగా ప్రయాణం చేసి ఒక గంటలో ‘ఛోప్తా’ చేరుకున్నాము.

ఛోప్తా : ఛోప్తాలో ఆరోజు రాత్రికి ఘరేవాల్‌ మండల్‌ వికాస్‌ నిగమ్‌వారి వసతి గృహంలో బసచేశాము. మర్నాడు అనగా ఆగస్టు 20న ఉదయం 7 గం||లకే బయలుదేరి తుంగనాథ్‌కి ప్రయాణమయ్యాము. మేమున్న విశ్రాంతి గృహం తుంగనాథ్‌కి 10 కి.మీ. దూరంలో దుగ్గులిబట్ట ఫారెస్ట్‌లో ఉంది. కారులో తుంగనాథ్‌ ట్రెక్కింగ్‌ ఏరియాకి ప్రయాణించి అక్కడ గుర్రాలను మాట్లాడుకొని బయలుదేరాము.

తుంగనాథ్‌: తుంగనాథ్‌ ఉత్తరాఖండ్‌ స్టేట్‌లోని ఛమోలి జిల్లాలో వుంది. పంచకేదారాలలో తుంగనాథ్‌ అతి ఎత్తైనది. సముద్రమట్టానికి 12,073 అడుగుల ఎత్తుపై వుంది. తుంగనాథ్‌ అంటే పర్వతాలకు రాజైన సాక్షాత్తు పరమేశ్వరుడు ఇక్కడ స్వయంభూగా వెలిశాడు. అలకానంద, మందాకినీ నదీ లోయల చుట్టూ తుంగనాథ్‌ పర్వత పంక్తులున్నాయి. తుంగనాథ్‌లో 1000 సం|| క్రిందట అర్జునుడు శివునికి ఆలయాన్ని నిర్మించాడని తెలుపుతారు. కురుక్షేత్ర యుద్ధంలో పాండవులు అనేకమంది వీరులు, స్వజనుల మృతికి కారకులైనందువల్ల వ్యాసమహర్షి సలహాపై పంచ కేదారాలలో శివుని ఆలయాలు నిర్మించి ఆయన ఆశీస్సులు పొందారట. స్వజనులు అనేకమంది మృతికి పాండవులు కారకులైనందుకు శివుడు కినుక వహించాడట. పాండవులు శివుని దయ పొందుటకై ఆయనను వెతుకుతూ బయలుదేరగా ఆయన వారికి చిక్కకుండా నంది రూపంలో గుప్తకాశిలో దాగినాడట. పాండవులు నంది వెంటపడగా నంది దేహంలోని అవయవాలలో బాహువులు తుంగనాథ్‌లో పడ్డాయి. నందిమూపురం కేదార్‌నాథ్‌లో, తల రుధ్రనాథ్‌లో, బొడ్డు, పొట్ట మధ్య మహేశ్వర్‌లో, జటాజూటం కపాలేశ్వర్‌లో పడడంవల్ల పాండవులు ఈ పంచ కేదారాలలో శివాలయాలు నిర్మించారని స్వజన హత్యాదోషం నుంచి విముక్తులై శివుని ఆశీస్సులు పొందారనీ స్థలపురాణాలు తెలుపుతాయి. తుంగనాథ్‌కు 3 కి.మీ. దూరంలో ఉన్న చంద్రగిరిపై శ్రీరాముడు తపస్సు చేశాడని అలాగే రావణుడు చంద్రశిలవద్దే శివుని గురించి తపస్సు చేసి వరాలు పొందాడని కూడా పురాణాలు తెలుపుతాయి. చంద్రశిల చాలా ఎత్తున ఉండడంవల్ల ఇక్కడినించి నందాదేవీ శిఖరం, పంచ్‌చౌలీ శిఖరం, బందర్‌పూంచ్‌ శిఖరం, కేదార్‌నాథ్‌, చౌకంబా, నీలకంఠ హిమాలయ శిఖరాలు ఒకవైపుగా, ఘరేవాల్‌ వాలీ ఈ శిఖరాలకు ఎదురుగా అద్భుతంగా కనపడుతాయి. రోడోడెండ్రాన్స్‌ మార్చిలో విరగబూసి క్రిమ్‌సన్‌, పింక్‌ వర్ణాల్లో కన్నులపండువగా ఉంటాయి.

హై ఆల్టిట్యూడ్‌ బొటానికల్‌ స్టేషన్‌ (ఘరేవాల్‌ యూనివర్సిటికి చెందినది) తుంగనాథ్‌కు 10 కి.మీ. దూరంలో దుగ్గులిబిట్ట వద్ద వుంది. మొత్తం 4 కి.మీ. దూరాన్ని 3680 మీటర్ల ఎత్తుకు ప్రయాణించి 3 గంటలలో తుంగనాథ్‌కు చేరుకున్నాము.

తుంగనాథ్‌ దేవాలయం నార్త్‌ ఇండియా దేవాలయాల స్టైల్‌లో దాదాపు యమునోత్రి దేవాలయంలా వుంటుంది. గర్భగుడి చాలా చిన్నది. చుట్టూ డజనుదాకా వివిధ దేవతల చిన్నచిన్న ఆలయాలున్నాయి. వీటి మధ్యలో పార్వతీదేవి ఆలయం వుంది. గర్భగుడిలోని శివుడు స్వయంభూ లింగరూపంలో కొద్దిగా ఎడమవైపుకు వంగి 0.3 మీటర్ల ఎత్తులో బాహువు ఆకృతిలో వుంటుంది. దేవాలయ రూఫ్‌ రాతిపలకతో నిర్మించబడి, ఆపై కొయ్యపలకపై 16 ప్రవేశ ద్వారాలలాంటి నిర్మాణాలుండి చూడడానికి యమునోత్రి గుడి శిఖరాన్ని పోలి వుంది. గర్భగుడి ఎదుట నందీశ్వరుడు, బయట విఘ్నేశ్వరుడు వున్నారు.

తుంగనాథ్‌లో కాశీబ్రాహ్మణులు పూజారులుగా ఉంటారు. ఈ ఆచారాన్ని ఆదిశంకరాచార్యులు ఏర్పరచారు. తుంగనాథ్‌కి దగ్గరలోనే ఉన్న ఆకాశగంగ వాటర్‌ఫాల్‌ వద్ద నందాదేవి ఆలయం, అందులో నందాదేవి (పార్వతి), ఈశ్వరుడు ప్రక్కనే ఆదిశంకరాచార్యుల విగ్రహం వున్నాయి. శీతాకాలం మంచుతో కప్పబడిపోవడంవల్ల ఆలయం మూసివేయబడి శివుని ప్రతిమామూర్తులను పూజారులు ఛోప్తా వద్ద వున్న దుగ్గులిబిట్ట వద్ద వుంచి పూజాదికాలు నిర్వహిస్తారట. తుంగనాథ్‌ నించి అద్భుతంగా హిమాలయ శిఖరాలు కళ్ళముందు సాక్షాత్కరిస్తాయి. ఇక్కడి హిమశిఖరాలపై మేఘాలు చాలా దగ్గరగా దోబూచులాడుతాయి. ఇక్కడ వానజల్లుల తరువాత ఏర్పడే ఇంద్రధనుస్సులు అద్భుతమైన రంగులతో హిమగిరులపై నయనానందకరంగా వుంటాయి.

మేము తిరిగి ప్రయాణమై 4 కి.మీ. దూరాన్ని దాదాపు 2 గం||లలో పూర్తిచేసి ఛోప్తా చేరి అక్కడనుండి దుగ్గులిబిట్టలోని విశ్రాంతి గృహాన్ని చేరుకున్నాము.

మరుసటిరోజు వుదయం బయలుదేరి కేదార్‌నాథ్‌ వైల్డ్‌ లైఫ్‌ శాంక్చువరీ, మస్క్‌ డీర్‌ శాంక్చువరీ (కస్తూరి మృగం)కి వెళ్ళాము. ఇది కర్‌చులా కరక్‌ వద్ద ఛోప్తాకి దగ్గరలో ఉంది. ఇక్కడ సుగంధభరితమైన హిమాలయ పుష్పాలు, ఔషధులు కలిగిన దట్టమైన అటవీ ప్రాంతం వుంది. మేము తిరిగి ప్రయాణమై ఛోప్తా చేరుకుని భోజనం పూర్తిచేసుకుని ఔలి దిక్కుగా కార్లో ప్రయాణమయ్యాము.

ఔలీ: ఔలీ ఉత్తరాఖండ్‌లోని మంచుతో నిండిన పర్వతాలు, స్లోపులలోని స్కైయింగ్‌ (మంచులో జారుతూ చేసే సాహసక్రీడ) క్రీడకు ముఖ్యమైనది. ఔలీ అంటే పహాడీ భాషలో ‘బుగ్యల్‌’ అంటే పచ్చిక మైదానాలు అని అర్థం. ఎండాకాలంలో ఈ పచ్చిక మైదానాలు రకరకాల పుష్కాలు, పొదలు, ఔషధమొక్కలతో నయనానందకరంగా వుంటాయి. శీతాకాలంలో దట్టంగా మంచుతో నిండివుండి స్కైయింగ్‌కు అనువైన స్లోపులనేర్పరుస్తాయి. ఔలి ప్రపంచంలోని గొప్ప స్కైయింగ్‌ రిసార్టులలో ఒకటి. ఇక్కడ స్కైయింగ్‌ శిక్షణా శిబిరాన్ని నిర్వహిస్తారు. చాలామంది ఫారినర్స్‌ స్కైయింగ్‌ కోసం ప్రతి శీతాకాలంలో ఇక్కడకి వచ్చి ఈ సాహసక్రీడలోని వినోదాన్ని పొందుతారు. ఔలీలో ఘరేవాల్‌ మండల్‌ వికాస్‌ నిగమ్‌ వారి ఆధ్వర్యంలో ఆసియాలోనే అతిపొడవైన 4 కి.మీ. గోండోలా కేబుల్‌ కార్‌ ద్వారా ఔలీ పైభాగానికి చేరుతాము. చైర్‌కార్‌, స్కైలిఫ్ట్‌ ద్వారా కూడా పైకి చేరగలము. ఇక్కడ ఇండో-టిబెటన్‌ బార్డర్‌ పోలీస్‌ శిక్షణా శిబిరాన్ని కూడా నిర్వహిస్తారు.

ఇక్కడ వున్న జడీబూటీ పౌధాలయ్‌ (ఔషధ మొక్కల వనం)లో అనేక రకాల అరుదైన సుగంధభరితమైన ఔషధ మొక్కల రంగు రంగుల పుష్పాలు, వేర్లు, కాయలు చూడడానికి రెండు కళ్ళూ చాలవు. స్లోపుల్లోని పచ్చిక మైదానాలు, ఆల్పైన్‌ వృక్షాల బారులు, ఔలీ సొగసుల్ని రెట్టింపు చేస్తాయి. స్కైయింగ్‌ క్రీడకు జనవరి నుంచి మార్చి మొదటివారం వరకు అనుకూలంగా వుంటుంది.

మేము ఔలీ నుంచి ప్రయాణమై సాయంత్రం 4 గం||లకు చంద్రపూర్‌ చేరాము. చంద్రపూర్‌ మందాకినీ నది ఒడ్డునే వుంది. అక్కడే ఘరేవాల్‌ మండల్‌ వికాస్‌ నిగమ్‌ వారి గెస్ట్‌హౌస్‌లో మా బస. సాయంకాలం చల్లని మందాకినీ నదీస్నానాలు చేసి మా అలసట తీర్చుకున్నాము. ఆ రాత్రికి అక్కడే డిన్నర్‌ చేసి నిద్రకుపక్రమించాము. రెస్ట్‌ తీసుకోవడానికి స్త్రఖఙశ్రీ, మందాకినీ పరిసరాలు ఎంతో సౌందర్యంగా ప్రశాంతంగా ఉండే ప్రదేశాలు.

మరునాడు ఉదయం 10 గం||లకే బయలుదేరి రిషీకేశ్‌ చేరేసరికి సాయంత్రం 5.30 గంటలైంది. సాయంత్రం జరిగే హరికిపౌరిలోని మహా ఆరతిని దర్శించుకొని ఆ రాత్రికి అక్కడే వున్న హోటల్‌ శివమూర్తిలో నైట్‌ హాల్ట్‌ చేశాము.

23 ఆగస్ట్‌ ఉదయం మా డ్రైవర్‌కి సెండాఫ్‌ ఇచ్చేసి 6:20కి జనశతాబ్ది ఎక్స్‌ప్రెస్‌ ఎక్కి 11.30 గంటలకి న్యూఢిల్లీ చేరాము. న్యూఢిల్లీలో సాయంత్రం 5.50 గంటలకు జు.ఆ. జూనిచీజీలిరీరీ లో బయలుదేరి 24 ఉదయం 5 గం||లకు కాజీపేట చేరుకున్నాము.

మొత్తం పదకొండు రోజుల ఈ యాత్రలో భూతలస్వర్గధామాలైన వాలీ ఆఫ్‌ ఫ్లవర్స్‌, తుంగనాథ్‌, ఔలీ వంటి చాలా భిన్నమైన మరో ప్రపంచంలో, మా వునికిని మేము మరచిపోయి తిరుగుతూ పూలలోయలో మా మనస్సు పారేసుకున్నాము. ఆ ఫొటోలు చూసినప్పుడల్లా వాలీ ఆఫ్‌ ఫ్లవర్స్‌లో మేం తిరుగాడుతున్న అనుభూతి పదేపదే మాకు కలుగుతుంది. మేమిద్దరం జంతు శాస్త్రజ్ఞులం, వృక్ష శాస్త్రజ్ఞులం, ఫొటోగ్రాఫర్లం కావడంవల్ల ఈ ట్రిప్‌లోని సంపూర్ణమైన ఆనందాన్ని, జ్ఞానాన్ని పొందామని అనిపిస్తూ వుంటుంది.

Share
This entry was posted in యాత్రానుభవం. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.