– నంబూరి పరిపూర్ణ

ఇంటర్‌ ఫస్టుక్లాసులో పాసయిన సాధన, మేథమెటిక్సు బి.యస్సీ చెయ్యాలని ఎంతగానో కోరుకుంటూ, అందుకు సిద్ధపడుతోంది.

”చదివింది చాల్లే అమ్మాయ్‌! డిగ్రీ” హఠాత్తుగా అన్నాడు తండ్రి చలమయ్య.

దిగ్భ్రాంతి పడిపోయి, తండ్రి ముఖంలోకి చూస్తూ ”అదేంటి నాన్నా! అలా అంటున్నావెందుకు? మొదట్నించీ, ప్రతి క్లాసులో నేను ఫస్టు ర్యాంకర్నవడంతో, సెంట్రలు గవర్నమెంటు స్కాలర్‌షిప్‌ వస్తూనే వుంది గదా! నా చదువు భారం కొంతయినా తగ్గింది గదా నీకు!” అర్థింపుగా ప్రశ్నించింది కూతురు.

”నువ్వు గ్రాడ్యుయేటు వవుదామను కుంటున్నావు సరే. మరి ఏ పోస్టు గ్రాడ్యుయేట్‌నో నీకు భర్తగా తేవాలి, అతగాడికి బోల్డు కట్నం పొయ్యాలి. అది నావల్ల అయ్యే పని గాదు. అంచేత – యింతటితోనే సరిపెట్టు నీ చదువు.” ఇదే నా ఆఖరు తీర్మానం అన్న ధ్వని చల్లమయ్య కంఠంలో.

తల్లీ తమ్ముడూ కూడా తండ్రి మాటనే దట్టుకోడంతో, ఆశకు నీళ్లొదలక తప్పింది గాదు సాధనకు.

చలమయ్య – బాగా చిన్నతనంనించీ తాగుడుకు అలవాటుపడ్డాడు. పెళ్లి తరవాత అది మరింత ముదిరింది. ఆ సంగతెలా వున్నా, అతడు పొగాకు కమిషన్‌ వ్యాపారంలో దిట్ట; పేరున్న మంచి ”బయ్యరు! ఎంత బాగా సంపాదించగలడో అంత బాగా తాగగలడు. మూడొంతుల సంపాదన మందుకీ, జూదానికీ మిగిలింది భార్య చేతికీ. అందులోనే అన్నీ గడపమని హుకుం. తనవన్నీ అవసర ఖర్చులు, మిగిల్నవి వృథా ఖర్చులు. కుటుంబపు ఖర్చు ప్రతిదాన్లోనూ పొదుపు; అతిపొదుపు పాటించాలి.

గడ్డకట్టే చలిలో అయినా, తనుదప్ప, యింట్లో మరెవ్వరూ వేడినీళ్ల స్నానం చెయ్యగూడదు. నడివేసవిలో ఫ్యాన్లు తిరగ్గూడదు. పిల్లలెప్పుడైనా ఫ్యాన్‌ ఆన్‌ చేస్తే చటుక్కున ఆపేస్తాడు… చుట్టపక్కాలరాక… అది ఎందుకు? అసలు ఎడమొఖం పెడముఖంగా వుంటే పోలా, త్వరగా పోతారు.

ఈ బాపతు పొదుపు చర్యలు తు.చ. తప్పకుండా అమలవ్వాలి సంసారంలో నిత్యం తాగి రావడం, వచ్చీ రాగానే సుష్టుగా భోజనం ముగించడం, తీరా భార్యాబిడ్డలు తినబోయేప్పటికి, ఏదో ఓ గొడవ రేపి, దాన్ని తర్కించి తర్కించి పెంచేసి, చివరకు భార్యను బాగా బాదేస్తే తప్ప అతడికి సేదదీరినట్టు అనిపించదు.

దుఃఖం మింగుతూ తల్లి, అభోజనంగా పిల్లలు – ఎన్నెన్ని రాత్రులో యిలా సాగిపోవడం!

ఈ మధ్య తాగుడు డోసు రోజురోజుకు పెంచుతున్నాడు చలమయ్య. ఇల్లూ సంసారం బొత్తిగా పట్టకండా వుంది. టెన్తు చదివే కొడుకు స్కూలు ఫీజులు కట్టడం ఆపేశాడు. ఎంత బతిమాలి అడిగినా తండ్రి డబ్బులు విదిలించకపోయేసరికి, ఏకంగా స్కూలుకి గుడ్‌బై చెప్పాడు కొడుకు.

వ్యాపారపు పన్లమీద – చుట్టుపక్కల ఊళ్లు తిరిగొచ్చే చలమయ్య, కొన్నాళ్లుగా, ఎందుకనో ఇంటికి రావడం లేదు. అతడొచ్చి రొక్కమిస్తేనే పొయ్యిలో పిల్లి లేవడం… తండ్రి రోజుల తరబడి ఇంటి ముఖం చూడకపోతుంటే, పిల్లలు ఆకలితో అలమటించిపోతున్నారు. రోగాల పాలవుతున్నారు. తల్లిమీద చీటికీ మాటికీ అసంతృప్తినీ ఆగ్రహాన్నీ చూపుతున్నారు.

అయ్యో! ఈ మనిషేమయినట్టు? తాగి, ఏ రోడ్డుకడ్డం పడో యాక్సిడెంటు చేసుకోలేదు గదా – అన్న దిగులు భార్య సుభద్రకి – ఓ పక్క పిల్లల అవసరాలు తీర్చలేని అశక్తత, మరోవైపు భర్త రాక కోసం ఎదురుతెన్నులు!

రానురాను – చలమయ్య రాకపోకలు పదీఇరవై రోజులకొకసారిగా మారసాగాయి. అతడొచ్చి ఈసారి రెండునెలలు దాటింది. సుభద్రకు మతిలో మతి వుండడం లేదు. ఏంచేసి, ఎలా పిల్లల కడుపుకింత పెట్టాలో తెలియని అయోమయం! రోజుల తరబడి పస్తులు, ఎన్నాళ్లిలా!

ఆడపిల్ల సాధనకు ఈ స్థితి భరించరానిదిగా వుంది. ఇందులోంచి బయటబడక తప్పదు. తీవ్రంగా ఆలోచిస్తూ, నడుము బిగించింది. తను కొంత చదువుకుంది. తల్లీ తమ్ముడు నిస్సహాయులు. తను ఏదో ఒక దారి వెదకాలి. ఎంత చిన్న ఉద్యోగమైనా చెయ్యవలసిందే.

గట్టిగా సంకల్పబలంతో ప్రయత్నించి ఒక ఫ్యాన్లు తయారీ కంపెనీలో అకౌంటెంటు ఉద్యోగంలో కుదురుకుంది. జీతం రెండువేలు, ఫరవాలేదు! దాన్లో చేరినప్పటినించీ తల్లి ముగ్గురికీ కడుపు నిండుతోంది. తమ్ముడు మళ్లీ స్కూలుకెళుతున్నాడు. తల్లి ముఖం కళకళలాడుతోంది.

తల్లి సుభద్రమ్మకు – కూతురుసాక్షాత్తూ అన్నపూర్ణగా, తమ్ముడు ప్రసాద్‌కు అక్క సాక్షాత్తూ సరస్వతీదేవిగా అగపడసాగింది – సాధన.

చలమయ్య జాడలేదు, ఏమయ్యాడో, ఎక్కడున్నాడో!

జ జ జ

పూర్తిగా సంవత్సరం గడిచాక ఇంటిముఖం చూచాడు చలమయ్య. వచ్చాక యిచ్చిన ఆర్డరు – తనింతకాలం ఎక్కడుందీ అడగొద్దని.

ఇంటికి దిగిన అవతారం ఎట్లా వుందో! ఒంటిమీది బట్టలన్నీ మురిక్కంపు. బట్టలు విడిపించి, ఒంటి నిండుగా చమురు పట్టించి, తలంటి పోసింది సుభద్ర. ఎముకల పోగుగా మారిన మనిషిని చూస్తోంటే పుట్టెడు జాలి కలుగుతోంది. రోజూ మాంసం, లివరూ తనొక్కడికే వండి తినిపిస్తూ, నెలదిరిగేసరికల్లా ఏనుగులా తయారయేలా చేసింది చలమయ్యను.

చలమయ్య – తను ఊహించినట్టుగా, ఇల్లు అలోపొలోమంటూ లేదు. ఇన్నాళ్లు తను లేనందుకు – వీళ్లు యిబ్బందులేం పడుతున్నట్టు లేదే! ఇల్లు పస్తు సంభారాల్తో నిండుగా వుంది! ఈ జరుగుబాటంతా సాధన ఉద్యోగం చేస్తుండబట్టే అయ్యుంటుంది. తన పెళ్లానికి కూతురి అండ మాబాగా దొరికింది గదా! ఇంక తననేం లెక్కచేస్తుంది. వెనకటిలాగా, భయపడ్తూ, తన అడుగులకు మడుగులొత్తుతుందా?

తనక్కలిగిన సంశయాన్ని తీర్చుకోవాలనుకున్నాడు చలమయ్య. ఓ రాత్రి పూటుగా తాగి, బాగా నిషా ఎక్కించుకొని ఇల్లు జేరాడు. రాగానే ”ఏయ్‌! మంచినీళ్లు పట్రా!” కేకేశాడు భార్యను. ఆమె నీళ్లగ్లాసు అందిస్తుండగానే ”ఏంటీ ఆలస్యం, అడగ్గానే నీళ్లివ్వకుండా చేస్తున్న పెత్తనాలేంటి?” అంటూ గ్లాసు విసిరికొట్టేసి, సుభద్రను బాదడం మొదలెట్టాడు.

అప్పుడే ఆఫీసునించి వచ్చి, ఇంట్లో అడుగుబెడుతున్న సాధన ”ఏంటి నాన్న! అమ్మనెందుకూ అలా కొడుతున్నావు?” అని గట్టిగా గదిమింది.

అమ్మాయ్‌! నువ్వడ్డం రాకు… ఈ మధ్య దీనికి పొగరు బాగా బలిసింది. నా మాటల్ని లక్ష్యపెట్టడం లేదు. ఆ జలుబేంటో వదిలిస్తానివ్వాళ” అంటూ మళ్లీ తల్లిమీదకెళ్తున్న తండ్రిని ఒక్కతోపుతో పక్కకి నెట్టి ”ఇంతకాలం, ఇన్ని రోజులపాటు అమ్మ నీ దెబ్బల్ని తిన్నది చాలు. ఇంక ఆమ్మీద నీ చెయ్యి పడనిచ్చేది లేదు. మళ్లీ చెయ్యెత్తావో… జాగ్రత్త!” అని వార్నింగిచ్చి తల్లిని లోపలి గదిలోకి తీసికెళ్లింది.

కూతుర్ని మింగేసేలా చూస్తూ, గబగబా బయటికి పోయాడు తండ్రి.

మర్నాటి నుండి తండ్రి వేధింపులు సాధింపులు అధికమైనాయి సాధనకు.

”అమ్మాయ్‌! ఆడపిల్ల బయటికెళ్లి ఉద్యోగం చెయ్యడమన్నది నాకేమాత్రం యిష్టముండని సంగతి. తండ్రినైనా నాకది చిన్నతనమనిపిస్తుంది. ఆడపిల్ల ఆర్జనమీద బతకాల్సిన పనేంటి మాకు? రేపట్నించీ ఉద్యోగమంటూ బయటిక్కాలుబెట్టావా ఊరుకునేది లేదు. ఇంటోనించి కదలద్దు” ఆజ్ఞాపించాడు చలమయ్య.

ఇదే విషయం మీద రోజూ తండ్రీ కూతుళ్ల వాద వివాదాలు సాగిపోతున్నాయి.

ఎప్పుడు ఇల్లొదిలిపోయేదీ, ఎప్పుడు తిరిగొచ్చేదీ తెలియపర్చని, నిలకడలేని తండ్రి ఒత్తిడికి తనెందుకు లొంగాలి? ఇంటిల్లిపాదికి ఆధారమవుతున్న బంగారంలాంటి ఉద్యోగాన్ని ఎందుకు వదలాలి?

వదలదల్చుకోలేదు సాధన.

నిత్య సంఘర్షణలతో ఓ నెలపాటు ఇంటి దగ్గరున్నాక, మళ్లీ బుర్రలో ఏం తొలిచిందో ఎవరికీ చెప్పకండా మాయమైపోయాడు చలమయ్య.

ఆ తరువాత అతని రాకపోకలు రెండేళ్లకూ మూడేళ్లకు ఒకసారిగా సాగుతున్నాయి. అలా రావడం, నెలపాటుండడం, భార్యచేత సకల సేవలు చేయించుకోడం! అంతటితో ఆగితే ఫరవాలేకపోను. సుభద్ర ఇంటిఖర్చులకోసం దగ్గర బెట్టుకున్న డబ్బుల్ని ఊడలాక్కుపోతున్నాడు ప్రతిసారీ.

ఇంట్లో ఎవ్వరికీ అతడి మీద రవ్వంత భరోసా లేదు. అతడసలు రాకపోతేనే మంచిదనీ, గొప్పమేలనీ అనుకునే స్థితి ఏర్పడింది.

రోజురోజుకూ అన్ని వస్తువుల ధరలు అందండా పోతుండగా, కూతురొక్కదాని సంపాదనతోనే ఇల్లు గడవదని గ్రహించింది సుభద్రమ్మ. బ్యాంకు లోనుకు గట్టిగా ప్రయత్నించి, మూడు గేదెల్ని కొనగలిగింది. వాటిని శ్రద్ధగా చూస్తూ, మంచి మేత అందిస్తూ, పాలకేంద్రానికి పాలు అమ్మడం ప్రారంభించింది. నెలవారీ సంపాదన వెయ్యి దాటుతోంది.

కూతురుతోపాటు, పెళ్లాం కూడా సంపాదించుతోందని తెలిసి, నెమ్మదిగా ఇంటికి చేరాడు చలమయ్య. భార్యపట్ల యిదివరకెన్నడూ చూపని ప్రేమ ప్రదర్శిస్తూ, ముచ్చట్లు సాగిస్తున్నాడు. ”చేతిలో డబ్బు ఆడుతున్నప్పుడు, దాని వ్యాపారం మీద పెట్టి, లాభాలు సంపాదించడం తెలివైన పని” అని నచ్చజెప్పి, నమ్మించి, ఆమె పొదుపుచేసే రొక్కాన్ని ఊడ్చుకుపోతున్నాడు. మాటిమాటికీ వచ్చి, వ్యాపారానికంటూ, ఇంట్లో డబ్బు చేజిక్కించుకుపోవడం మామూలయ్యింది. ఇదిగో యిది మనకొచ్చిన లాభమని ఏనాడూ తెచ్చియిచ్చింది లేదు.

ఒకనాడు డబ్బివ్వమంటూ పట్టుకున్నాడు సుభద్రను. తన దగ్గర యింక చిల్లిగవ్వ దొరకదనీ, డబ్బు కోసమే అయితే యింక మీదట ఇంటికి రావలసిన పనిలేదని ఖచ్చితంగా చెప్పింది. ఉగ్రుడయి, తలుపులన్నీ మూసి, భార్య జుట్టు పట్టుకు వంగదీసి గుద్దడం మొదలెట్టాడు చలమయ్య. ఇంకా కోపం తీరక రెండుచేతుల్తో ఆవిడ మెడ పట్టుకుని గట్టిగా బిగించసాగాడు! కంపెనీ వదిలి ఇంటికి చేరుతున్న సాధనకు ఆ దృశ్యం కిటికీలోంచి కంటబడింది. గుండె గుభేలుమనడంతో, గట్టి కేకల్తో ఇరుగుపొరుగుల్ని పిలిచి, తలుపులు తెరిపించి ”ఒరే! మనిషివా మృగానివా? మా అమ్మను అలా చంపేస్తున్నావెందుకు? మాటిమాటికొచ్చి మమ్మల్ని ఎందుకని పీడిస్తున్నావు? అసలు యిప్పుడెందుకు పిసుకుతున్నావు తన మెడని? తక్షణం కదులిక్కణ్ణించి… కదలవూ… పోలిసుల్ని పిలిపించేస్తా.” చూపుడువేలుతో బయటికి దారి చూపిస్తూ, గొంతు పగిలేలా అరిచింది సాధన.

పళ్లు పటపట కొరికాడు చలమయ్య. ”ఎంత పొగరే నీకు? నా పెళ్లాం గాదా యిది. కొట్టుకుంటా, తిట్టుకుంటా; అవసరమైతే చంపుకుంటా, నువ్వెవరివి అడగటానికి? ఉద్దోగం ఎలగబెడతున్నానని గదా ఈ పొగరు? అదింక ఎన్నాళ్లుంటదో చూస్తా. మూడ్రోజుల్లో ఊస్టు చేయిచ్చకపోతే చూడు” గట్టిగా కేకలు బెడ్తూ, పెద్ద అంగల్తో బయటికి పోయాడు తండ్రి.

మర్నాడు సాధన పన్జేస్తున్న కంపెనీ మేనేజర్ని కలిశాడు చలమయ్య. ”సార్‌! మా ‘సాధన’ మీ కంపెనీలోనే గదా పనిజేసేది. దాని తండ్రినే నేను. పెళ్లీడుకొచ్చిన కూతురుకి సకాలంలో పెళ్లిజేసి పంపటం తండ్రిగా నా బాధ్యత, ధర్మం. కానీ పిల్ల ససేమిరా నాకు పెళ్లొద్దంటంది. చేసుకున్నోడు ఉద్యోగం చెయ్యనివ్వడని దాని భయం. అసలు పెళ్లయినాక ఉద్యోగంతో పనేంటండీ దానికి! పెళ్లి సంగతేమో గాని, ఉద్యోగం మాత్రం మానేది లేదంటూ సంబంధాల్ని చెడగొడతా వుంది. అంచేత, మీరు నాపట్ల దయుంచి దాన్ని ఉద్యోగంనించి తొలిగిస్తే, దార్లోకొచ్చి పెళ్లికొప్పుకుంటది. మీరే పూనుకుని పెళ్లి జరిపిచ్చినట్టనుకుంటాం మేం. బాబ్బాబు మాకు సాయపడి పుణ్యం గట్టుకోండి” ఒకటే యిదిగా బ్రతిమాలాడు చలమయ్య.

అతడి మాటలన్నీ సాలోచనగా వింటూ, అలాగే తొలగించేస్తానన్నట్టుగా తలవూపాడు మేనేజరు. కానీ, మరుక్షణంలోనే, బుర్రలో మరో ఆలోచన తళుక్కుమంది. ‘సాధన’ అన్న అమ్మాయి మంచిపిల్ల. బాగా కష్టపడి, తన పనిని యిష్టంగా చేస్తుంది. అలాంటి అమ్మాయిని ఎలా ఒదులుకోవడం. ఉద్యోగాలు మానితేగాని ఆడపిల్లల పెళ్ళిళ్లు అవ్వవా? ఎందుకు, ఏం కారణంతో తొలగిస్తాడు తనా అమ్మాయినీ?

చలమయ్య ఇంటి దిక్కుకు పోకుండా, ఏం తిక్క రేగిందో మళ్ళీ దేశమ్మీదికి సాగిపోయాడు. ఎన్నాళ్లకీ తిరిగి చూడలేదు. బ్రతికున్నదీ, లేందీ తెలియని స్థితిలో పడింది కుటుంబం.

జ జ జ

సాధన తమ్ముడు ప్రసాద్‌. తండ్రికి పూర్తి నకలు. పిల్లచేపకు ఈత అబ్బినంత సహజంగా యితనికి తండ్రి లక్షణాలన్నీ అబ్బాయి. అక్క ధీమాగా ఉద్యోగం చేస్తూ బ్రతకడం అతనికెందుకో నచ్చడంలేదు. అక్క సాయంతోనే తన చదువు పూర్తయిన మాట నిజమే. తనిప్పుడు ఐ.టి.ఐ. ఎలక్ట్రానిక్సు డిప్లమా హోల్డరయ్యాడు గదా. అందాక రెండువేల జీతంతోనే ప్రయివేటు కంపెనీలో చేస్తున్నాడు. సర్వీసు కోసం. ఈ సర్వీసుతో కొద్దికాలంలో, మంచి జీతంతో గవర్నమెంటు జాబు తప్పక వస్తుంది. అమ్మ కూడా పాడి శ్రద్ధగా చేస్తూ పాల అమ్మకం ద్వారా బాగానే సంపాదిస్తోంది. అంచేత ఉద్యోగం చెయ్యాల్సిన అవసరం అక్కకు లేదిప్పుడు. వయసుమీరక ముందే, పెళ్లి చేసుకుని, అత్తారింటికెళ్లడం తనకు ఎక్కువవస రమిప్పుడు. తమకు తగ్గ సంబంధం చూచి, పెళ్లి చేస్తేనే అటు తనకూ కుటుంబానికీ గౌరవమర్యాదలు దక్కుతాయి. కుటుంబ వారసుడుగా, మగబిడ్డగా పెళ్లి బాధ్యత నెరవేర్చి వంశగౌరవం నిల్పాలిగదా తను!

కూతురు పెళ్లిచింత మరికాస్త ఎక్కువగానే పట్టుకుంది సుభద్రమ్మకు. ఏ సంబంధానికీ ఒప్పడం లేదీ పిల్ల. వయసు ముదిర్నకొద్దీ పెళ్లి సంబంధాలు దూరం జరుగుతాయ్‌. చెప్పినకొద్దీ మొండిదేరుతోందీ పిల్ల. కుర్రాడికి కొద్దిగా హోదావుంటే చాలు ఐదు లక్షలంటన్నారు కట్నం, మూడు లక్షలు బెడితే బస్సు కండక్టరు గాని, గుమాస్తా గాని దొరకచ్చు గదా, చేసుకోమ్మా అంటే, ఏమాత్రం చెవిని బెట్టదిది. పైగా, అసలు తనకి పెళ్లే వద్దంటుందే!! పెళ్లయినాక ఉద్యోగం మానమంటే ఏం చెయ్యను? అందుకని పెళ్ళే వద్దు నాకు అంటూ అడ్డంగా వాదన!

”తమ్ముడు ప్రసాద్‌ అక్క ముందరే ఆమె పెళ్లి ప్రస్తావన తల్లితో చేస్తూ ”అమ్మా! అక్కనసలు చదివించి తప్పు చేశామే! ఆ పైన ఉద్యోగానికీ పంపావు. ఆ ధీమానే గదా దీన్ని పెళ్లికొప్పనివ్వంది. ఉద్యోగాన్ని మాన్పించు వెంటనే. మీ అక్కకింకా పెళ్లిగాలేదెందుకని మా ఫ్రెండ్సంతా ఒకటే అడుగుతున్నారు.” కుటుంబ పరువు మర్యాదలన్నీ మట్టిలో కలిసిపోతున్నవన్నట్లు ముఖం గంటుపెట్టుకుని అంటున్న తమ్ముడి ధోరణికి అడ్డుపడుతూ అంది సాధన.

”తమ్ముడూ! ఒరేయ్‌! ఏమిట్రా నీ మాటలు? నాన్న మాటిమాటికీ మనల్నొదిలెళ్లుతూ మన సంగతసలు పట్టించుకోనప్పుడు ఈ ఉద్యోగమే గదరా ఎవరికీ చెయ్యిచాపకండా మనల్ని బ్రతికించుతూ వస్తున్నది. నీ చదువు పూర్తవ్వడానికీ యిదే ఆధారమైన సంగతి గుర్తులేదా? కాస్త గుర్తు తెచ్చుకో” మనసును మెలిపెడుతున్న బాధతో అంది సాధన.

తల్లి వెంటనే కల్పించుకుని ”ఓయబ్బ! అవసరాలన్నీ నువ్వొక్కదానివే తీరుస్తున్నట్టు మాట్టాడుతున్నావే తల్లీ! పాడిమీద వచ్చే నా సంపాదన ఏమవుతుంది? అదనీ యిదనీ నువ్వెన్నయిన చెప్పమ్మాయ్‌ – నీకిప్పుడు పెళ్లి జరగడం ముఖ్యం దప్ప మరొకటేం గాదు. కట్టుకున్నోడు కాదంటే తనే అన్నీ చూసుకుంటానంటే ఆడది ఉద్యోగం మానాల్సిందే. కాదు. నా మాటే సాగాలంటే ఎట్లా అవుతాయి పెళ్లిళ్లు?

తెల్లబోతూ తల్లి ముఖంలోకి చూస్తూ వుండిపోయింది సాధన.

జ జ జ

ఆఫీసుకెళ్లడానికి హడావుడిగా బస్సెక్కుతున్న సాధనకు, ఆమె తమ్ముడు ఫ్రెండొకడు హఠాత్తుగా దగ్గిరకొచ్చి – ‘బై’ చెప్పి చెయ్యూపడం చూచి, ఆశ్చర్యంగా నవ్వుకుంది. అప్పట్నించీ తను బస్సెక్కుతున్నప్పుడల్లా అతగాడు ప్రత్యక్షమై చెయ్యూపడం మొదలెట్టాడు. చిరాకేసి, ఒకటీ రెండుసార్లు అలా చెయ్యొద్దని వార్నింగిచ్చినా, ఆ తంతు సాగిస్తూనే వస్తున్నాడతను. క్రమంగా వెకిలినవ్వు నవ్వుతూ, సన్నగా ఈల వెయ్యడమూ ప్రారంభించాడు. చెప్పీచెప్పీ విసుగొచ్చి యింక తప్పదనుకొని పోలీసు కంప్లయింటిచ్చింది. ఏరియా ఇనస్పెక్టరు అతణ్ణి స్టేషనుకు పిలిపించి, ‘పాఠం’ బాగానే చెప్పాడు, గుర్తుండే విధంగా.

ఇంకేముంది – వాడు సాధన మీద బాగా కక్ష గట్టాడు. ఆమె గురించి ఏవేవో చెడుకథలల్లడం – అవి ప్రసాద్‌ బుర్రకు పట్టించడం మొదలుబెట్టాడు. ఒక్కో కథ విన్నప్పుడల్లా ప్రసాద్‌ గుండెలు భగభగ మండిపోతున్నాయి. ఇంటికి వచ్చీరాగానే అక్కను నిగ్గదియ్యడం పనిగా పెట్టుకున్నాడు తమ్ముడు.

”ఉద్యోగం మానమని ఎంత చెబుతున్నా నువ్వెందుకు మానటం లేదో, ఎందుకు చెవిని బెట్టటం లేదో అర్థమవుతున్నదిప్పుడు. ఇల్లొదిలి బయటకెళ్లి పనిజెయ్యడమంటే, ఆ నీ కొలీగ్‌గాడితో సినిమాలకూ షికార్లకూ తిరగడమనా? ఇకనించి బయటిక్కదులు చూస్తాను – నా మాట ధిక్కరించి కాలు బయట బెట్టావో, ఏం చేస్తానో చూడు మరి!” చూపుడువేలితో బెదిరిస్తూ గట్టిగా గదిమాడు ప్రసాద్‌.

తీవ్ర అవమానపు బాధతో, సాధన గిలగిలలాడ్తూ ”ఈనాటికి నువ్వు నన్ను బయటిక్కదలద్దని ఆజ్ఞాపించేవాడి వయ్యావన్నమాట! ఆ పోకిరి వెధవ కూతలు నిజమా నీకు? నా తమ్ముడు బాగా చదువుకోవాలి, పైకి రావాలి అన్న పట్టుదల కూడా నన్ను ఉద్యోగం చెయ్యమని అంటోంది. ఇంతకాలంగా కష్టపడి పనిజేస్తూ ఇంటిని ఆదుకున్నాను. అలా కాకపోయుంటే నువ్వీపాటికి ఏ హోటల్లోనో కప్పులు కడుగుతుండేవాడివి” ఆ సంగతి కొంచెం గుర్తుంచుకో” ఈసడించింది సాధన.

”ఏం కూశావే! ఏదీ మళ్ళీ కుయ్‌!” అంటూ అక్క మీదికి దుముకుతున్న కొడుకును, చేతులడ్డంగా పెట్టి, వెనక్కు నెట్టుకెళ్లింది సుభద్రమ్మ.

అప్పటికి వూరుకున్నా ఏదో ఒక వంకతో అక్క మీద ప్రతిరోజూ ఎగరడం, మాటలని గాయపరచడం అలవాటుగా మారింది ప్రసాద్‌కు.

ఈ మధ్య చెయ్యి చేసుకోడం కూడా మొదలయ్యింది అక్క మీద. రోజురోజుకూ చేదుగా, గడ్డుగా మారుతున్న పరిస్థితిని తట్టుకోలేకపోతున్నది సాధన. జీవితం, దాని ప్రయోజన పరమార్థాల గురించి, తీవ్రంగా, దీర్ఘంగా ఆలోచించింది. వాటిపట్ల తన ఆలోచనలు తనకున్నాయి. ఈ ఇంట్లో వుంటూ అవి సార్థకం చేసుకోవడం అసాధ్యం.

తల్లి ఇంట్లో లేని సమయం చూచి, తన బట్టలూ వస్తువులూ సర్దుకుని పుట్టి పెరిగిన ఇంటి గుమ్మం దాటి వచ్చేసింది సాధన.

జ జ జ

మూడేళ్లుగా వుంటున్న వర్కింగు ఉమెన్సు హాస్టలు జీవితం ఎంతో హాయిగా వుంది సాధనకు. ఈ సిటీలో దొరికిన మరో చిన్న ఉద్యోగం చేస్తూనే ‘దూరవిద్య’ సాయంతో ఉన్నతవిద్యను అందిపుచ్చుకుంది. ఏపిపిఎస్‌సి గ్రూప్‌ (1) పరీక్షకు తపస్సులా అధ్యయనం చేసి ఉత్తీర్ణురాలు కాగలిగింది. దాంతో మంచి, ఉన్నతస్థాయి ఉద్యోగానికి సెలెక్టు కాగలిగింది.

ఆర్‌.డి.వోగా శ్రీకాకుళం జిల్లాలో పదవి చేపట్టేందుకు పయనమయ్యే ముందు, ప్రశాంత రాత్రి సమయంలో తల్లికి ఉత్తరం వ్రాయడానికి కూర్చుంది.

ప్రియమైన అమ్మా!

నీవు క్షేమమనీ, తమ్ముడు నిన్ను భద్రంగా చూచుకుంటున్నాడనీ తలుస్తున్నాను. నాపట్ల తమ్ముడి వైఖరినీ, అతడి సతాయింపుల్నీ భరించలేక నిన్నూ, మనింటినీ వదిలిరాక తప్పలేదమ్మా! అకారణంగా హింసించడంలో నాన్నను మించాడు వాడు.

నీకు చెప్పకండా వచ్చేసినా, నా జ్ఞాపకాలనిండా నువ్వే వుంటున్నావు. ఇలా వచ్చేసి నా ఆచూకీ అయినా నీకు తెలియనివ్వకపోతే నువ్వెంత బాధపడుతుంటావో తెలుసు నాకు. కానీ వచ్చినందుకు నాకు చాలా గొప్ప మేలే కలిగిందమ్మా! మొదటి సంగతి – దూరవిద్య ద్వారా ఎం.ఏ. డిగ్రీ సంపాదించాను. రెండో సంగతి – గ్రూపు (1) సర్వీసు కమీషన్‌ పరీక్షకు కూర్చుని, మంచి ర్యాంకుతో పాసయి, మొన్నీమధ్య ఆర్‌.డి.వో ఉద్యోగానికి ఎంపిక అయ్యాను. ఆ పదవిలో జాయినయ్యేముందుగా నీ ఆశీర్వచనాలు తీసుకోడం అవసరం నాకు.

ఆనందం నిండిన గుండెలతో నన్ను ఆశీర్వదించగలవని నమ్ముతున్నాను.

అన్ని అర్హతలుండీ – ఆడపిల్ల – భర్తనింకా కొనుగోలు చేసుకునే స్థితి ఏమిటి మన సంఘంలో! నేనా స్థితికి దిగజారను. నా విలువల్ని గుర్తించి, జీవిత సహచరిగా నన్నిష్టపడే సహచరుడు తటస్థపడినప్పుడే నేను పెళ్లికి సిద్ధమయ్యేది. నేను బిడ్డల తల్లినై, రేపేదైనా జరిగి అతడు దూరమైతే, వాళ్లను పెట్టుకుని ఏడుస్తూ కూచోను. అన్నీ సజావుగా వున్నాయనిపించినప్పుడే నేను సంసార జీవితంలోకి అడుగుబెట్టేది. తప్పటడుగు పడితే సరిదిద్దుకోగల్ను.

తమ్ముడు పెళ్లి తరవాత నా వద్దకు వచ్చెయ్యి అమ్మా! ఎప్పటికీ నీతోనే వుండగలనని ఆశిస్తూ…

నమస్సులతో… నీ సాధన…

Share
This entry was posted in కధలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.