– ఎ. పుష్పాంజలి

దుర్గకి చిన్నప్పట్నించి సినిమాలు తెగచూట్టం అలవాటు. ఆ అలవాటువల్ల ఆమె నిజజీవితానికి, సినిమాకి మధ్య తేడా వుంటుందనుకోడం లేదు.

తనను తల్లి తిడితే, ఆమెకు ఆశ్చర్యంగా ఉండేది! ఆ సినిమాలో సుహాసిని, శారద ఎంత అన్యోన్యంగా ఉంటారు? తల్లులు ఆడపిల్లల్ని ఎంత ముద్దుగా చూస్తారు? తన తల్లేమిటో? అని అబ్బురపడుతుండేది. ఆమెకొక నాయనమ్మ కూడా వుంది. ఈ నాయనమ్మ సినిమాల్లోలాగా ”ఆదర్శంగా” ఉండక దుర్గని తిడుతూ కసురుతూ వుండేది. పైగా దుర్గ మీద తండ్రికి చాడీలు కూడా చెప్పేది. పనిచెయ్యకపోతే తిట్టేది. తండ్రి కూడా అంతే. అన్నయ్య కూడా అంతే. ”అన్నయ్య సన్నిధి, అదే నాకు పెన్నిధీ…” అని పాడలనిపించే అన్న కాదు. అందుకని ఆ పాట పక్కింటి రవిని చూసి పాడసాగింది దుర్గ. తను చూసిన ఎన్నో సినిమాల్లో అన్నయ్యలు ఎంత మంచివాళ్లు! ”చెల్లెలి కాపురం”లో శోభన్‌బాబు, ఎన్నో సినిమాల్లో నాగేశ్వర్రావూ, రామారావూ ఎంత మంచి అన్నయ్యలు! హిట్లర్‌లో చిరంజీవి చెల్లెళ్లకోసం జీవితం ధారపోయలేదా? చిన్న ఎన్‌.టి.ఆర్‌. సంగతి చెప్పనే అక్కర్లేదు.

ఇక స్నేహితురాళ్లా? ఆమె జానపద చిత్రాలు, కాంతారావు, రాజశ్రీలవి ఎక్కువగా చూసివుండటంవల్ల తన స్నేహితురాళ్లనంతా తన చెలికత్తెల కింద జమకట్టింది.

ఆమెకి భాస్కరం మేష్టారంటే చాలా ఇష్టంగా వుండేది. ”మాస్టారు” సినిమాలో చిరంజీవిలాగా ఎందుకుండరీయన? అనుకుంటూ వుండేది.

టెన్త్‌ పాసయ్యి ఆమె, ఆమె చెలికత్తెలు అంతా కాలేజిలో చేరారు. ”అదేంటి? ఈ వెధవలంతా తనని లవ్‌ యట్‌ ఫస్ట్‌ సైట్లో ప్రేమించరు? తనకోసం గులాబి పట్టుకుని దార్లో ఒకడైనా ఎదురుచూడ్డేం? ”ప్రేమంటే” ”ప్రేమంటే ఇదేరా!” ఇంకా ప్రతి సినిమాలో హీరోలు, హీరోయిన్‌ పట్ల ఎంత ఆరాధనాభావం కలిగివుంటారు! అంతెందుకు! ఎంతో ”శుభ్రంగా” ఉండి ”నీతి” బోధించే ”ఆరాధన”, ”మంచిమనసులు”, ఇంకా వందలాది పాతసినిమాల్లోల్లాగా ఈ విద్యార్థులంతా వుండరేం! ఇంత ”బుద్ధు”ల్లా వుంటారేం! ప్రతి ఒక్కడికీ ప్రేమించాలంటే తల్లిదండ్రుల పర్మిషన్‌ కావాలి. అధవా ప్రేమించినా, కట్నం కావాలి. కులం, గోత్రం, జాతకం అన్నీ సరిజూసుకోవాలి. ఇవేం ప్రేమలు? ప్రేమలూ లేవు చట్టుబండలూ లేవు అన్న నిర్ణయానికొచ్చేసింది దుర్గ. అయినా ఎక్కడో ఒకచోట తన కలల రాకుమారుడుంటాడన్న నమ్మకంతో ఉందామె. ‘ఈ సమాజాన్ని లెక్క చేయకుండా, కులగోత్రాలెన్నకుండా, తనను చూడగానే వరించేవాడు తప్పక వస్తాడు’ అని ఆశ పడుతోంది దుర్గ.

చివరికా రాకుమారుడు ఆమె డిగ్రీ చదువుతున్న రోజుల్లో ”మనోహర్‌” రూపంలో వచ్చాడు.

మనోహర్‌ ఆమె క్లాస్‌మేట్‌. చూట్టానికి జగపతిబాబులాగా ఉంటాడు. ఎవర్నైనా ప్రేమించి ”హీరో” ఇమేజ్‌ కొట్టేద్దామని ఆరాటపడుతున్నాడతను. అతని దృష్టిలో దుర్గపడనే పడ్డది. ఆమెతో మాటలు కలిపి, పరిచయం పెంచుకున్నాడు.

ఒకరోజు పార్కులో కలుసుకున్నారు. ”డమరుకం” సినిమాలో అనుష్కలాగా ”నేస్తమా! నేస్తమా!” అని పాడసాగింది దుర్గ. ఆమె గొంతు బాగానే వుంటుంది. మనోహర్‌ది బొత్తిగా శ్రావ్యమైన కంఠం కాదు. అతను పాటందుకోగానే దగ్గర్లో కాగితాలు మేస్తున్న గాడిదలు తమ శక్తికొద్దీ ఓండ్రపెట్టాయి. తన ప్రేమవిపంచికలో అపస్వరం పలికినట్టు బాధపడిపోయింది దుర్గ.

ఆమె ప్రేమ వ్యవహారంలో సాయం చేయవలసిన చెలికత్తెలు ఈ వార్త ఆమె నాన్నకు అందజేశాడు. ”కయామత్‌సే కయామత్‌ తక్‌” సినిమాలోలాగా మనోహర్తో అతని బైక్‌ మీద ”లేచిపోదాము” అనుకుంది దుర్గ. అదే మాట అతన్తో అంటే ”నా దగ్గర పెట్రోలుకి డబ్బుల్లేవు” అని ఆమె ఆశల సౌధాన్ని కూలదోశాడు. దుర్గ ”అంతా భ్రాంతియేనా” అని పాడుకుంది ఇంటివెనక బాదంచెట్టునానకుకుని.

మరోసారి పార్కులో చీకటి పడేంతవరకూ కబుర్లు చెప్పుకుంటూ వుండిపోయారా ప్రేమజంట. వీళ్లని ఫాలో అయి వస్తున్న ముగ్గురు రౌడీలను దుర్గ గమనించింది గాని మనోహర్‌ గమనించలేదు. వీళ్లు కూచున్న స్థలానికంతదూరంలో కూచున్న ఆ ముగ్గురూ ఏవేవో సినిమాపాటలు పాడి వాళ్లని టీజ్‌ చేయసాగారు. మనోహర్‌ కాస్త భయపడ్డాడుగాని దుర్గ చాలా ధైర్యంగా వుంది. తనని వాళ్లేమైనా చేయబూనితే మనోహర్‌ ఊరుకుంటాడా? ఎముకలు కుళ్లబొడవడూ? తనెన్ని సినిమాల్లో ఇల్లాంటి సీన్లు చూళ్లేదు. అంతిమవిజయం హీరోదే. ఇక్కడ మనోహరే హీరో!

వాళ్లల్లో ఒకడు లేచి దగ్గరకు వచ్చి ఏదో పాట పాడి, ఆమెపై ఒక పువ్వు విసిరాడు.

ఆమె ”స్టుపిడ్‌” అని తిట్టింది. మనోహర్‌ పైకి లేచి ”వెళ్దాంపద” అనడం ఆమెకాశ్చర్యం కలిగించింది.

వాడి స్నేహితులిద్దరూ లేచి వచ్చారు. దుర్గ భుజం మీద ఒకడు చేత్తో తట్టి ”చీకటి పడ్డది చెల్లెమ్మా” అన్నాడు. ఇంకొకడు ”ఇంటిదారి పట్టమ్మా” అంటూ ఆమె డ్రస్‌ మీది దుపట్టా లాగాడు. మనోహర్‌ ”భయ్యా! చల్లగాలికి వచ్చాం. వెళ్లిపోతాం. మర్యాదగా దారి వదలండి” అన్నాడు. ”నువ్వెవడ్రా? మాకు మర్యాద నేర్పడానికి” అంటూ వాళ్లు ముగ్గురూ అతన్ని కుంగా నలగ్గొట్టారు. అతను దెబ్బలు తింటూ వుండిపోవడం, దుర్గకు అమితాశ్చర్యం కలిగించింది.

జాంపళ్లమ్మే ముసలావిడ జాంపళ్లన్నీ అమ్మేసి, ఆ బుట్టలో పార్కులో గడ్డి దొక్కుంటూంది. ఆమె తన దోకుడుబార (పార) పైకెత్తి ”ఒరే ఎదవనాయాళ్లారా? ఒక్కణ్ణి చేసి కొడతారా! ధైర్నముంటే నామీదికి రండి” అని గట్టిగట్టిగా అరవడం మొదలు పెట్టింది. రౌడీలు పారిపోయారు.

ఒక ముసలామె ఇంత ధైర్యంగా ప్రవర్తించడం దుర్గ ఏ సినిమాలోనూ చూళ్లేదు. కాకుంటే ”తెలంగాణా శకుంతల” కన్నా ఈమె వయసింకా చాలా ఎక్కువే.

రౌడీలు పారిపోయారు. తనూహిం చిన ధైర్యసాహసాలు మనోహర్‌ ప్రదర్శించ లేకపోవడం, ఆమెను నిరుత్సాహపరచింది. అతని మీద ఇష్టం సగం పోయింది.

ఇంట్లో ఆమెకు పెళ్లి సంకల్పించారు.

”నాన్నా! నాకు సంబంధాలు చూడొద్దు.”

”ఏంమ్మా? పెళ్లి చేసుకోవా” అన్నాడు తండ్రి.

”చేసుకుంటా నాన్నా. కాని మీరు చూసిన అబ్బాయిని మాత్రం కాదు. మనోహర్‌ అని నా క్లాస్‌మేట్‌ని” అని ధైర్యంగా చెప్పింది.

”ఎంతకు తెగించావే” అన్నాడు అన్న.

”ప్రేమించడం తప్పా అన్నయ్యా? మా ప్రేమ పవిత్రమైంది” అంది.

”ఎంత ధైర్యమమ్మాయే నీకు” అన్నాడు తండ్రి.

”ప్రేమ ధైర్యాన్నిస్తుంది నాన్నా”. ఇటీవల తను చూసిన సినిమాల్లో డైలాగులన్నీ మక్కీకిమక్కీ ఒప్పజెప్పింది.

ఐతే ఆ సినిమాలోలాగా తండ్రి ఎగిరిపడలేదు. మనోహర్‌ వివరాలు తెలుసుకుని ”నే మాట్లాడుతాలేమ్మా” అన్నాడు.

ఆయన అన్న ప్రకారం మనోహర్నీ, అతని తండ్రిని కలిసి మాట్లాడాడు.

నిజానికి మనోహర్‌ తండ్రి మంచివాడు. కులం మతం పట్టించుకోని అభ్యుదయభావాలు కలవాడు. కాని ఆయన ఎదిగినంతగా ఈ సమాజం ఎదగలేదు. అలా తాను సమాజం లెవల్‌కు దిగజారిపోవడానికి, ఆయన తన ఇద్దరు కూతుళ్లను కారణంగా చూపాడు. కొడుకు భారీ కట్నం మీద వాళ్లిద్దరి పెళ్లిళ్లూ ఆధారపడి వున్నాయి. ఒకవేళ దుర్గ తండ్రి అంతే కట్నం ఇవ్వగలిగితే దుర్గను మనోహర్‌కి చేసుకోడానికెటువంటి అభ్యంతరం లేదన్నాడాయన.

”పది లక్షలు! ఎక్కణ్ణుంచి తెద్దాం? మన పూరిల్లు అమ్మినా అంత డబ్బు రాదే!” అని చప్పరించాడు అన్నయ్య. ఎన్నో తర్జనభర్జనలు జరిగాయి.

దుర్గ పెళ్లి భళ్లున జరిగింది. అయితే మనోహర్‌తో కాదు, యుగంధర్‌తో.

యుగంధర్‌ బాగానే ఉన్నాడు. ఈ మధ్య ఎంతోమంది అందంగా లేని యువకులు కూడా సినిమా హీరోలు కావడంలే! కాబట్టి ఈ యుగంధర్‌ అనే తన భర్తకు ఫస్టు, సెకండ్‌ మార్కులు కాకున్నా కనీసం థర్డ్‌ మార్కైనా వస్తుందిలే. ఎందరో అరవ డబ్బింగ్‌ సినిమాల హీరోలు, కన్నడ సినీనాయకులతో పోల్చుకుంటే ఇతనెంతో నయం! అనుకుంది దుర్గ. అతను తాలుకాఫీసులో గుమాస్తా.

ఆవాళ దుర్గ ”తొలిరాత్రి”. అన్ని సినిమాల్లోలాగానే ”ఫస్ట్‌ నైట్‌ ఫస్ట్‌ నైట్‌” అనే పదాన్ని ఏమాత్రం సిగ్గులేకుండా ఉచ్చరిస్తూ, తన చెలికత్తెలను పిలిచింది దుర్గ. ”పదండే! ఇవ్వాళ దుర్గ ఫస్ట్‌ నైట్‌. ఆ ఫంక్షన్లో మనమూ పాలుపంచుకుందాం” అని, అందరూ అలంకారాలు చేసుకుని మరీ వచ్చారు.

ఆవాళ ఉదయంనుంచీ దుర్గ ”ఇది తొలిరాత్రి” అన్న పాట పాడుకుంటూ గడిపింది. అనేక సినిమాల్లో తొలిరాత్రి జరుపుకునే హీరోయిన్లలాగానే సిగ్గు అభినయించడం, నవ్వు రాకపోయినా నవ్వినట్టు మూతి అప్పుడప్పుడూ సాగదీస్తుండడం లాంటివి ప్రాక్టీసు చేసింది. వాళ్లలానే ఓవర్‌ మేకప్‌ చేసుకుని గదిలో అడుగుపెట్టింది. నిజానికామెకు యుగంధర్ని చూస్తే ఏమీ సిగ్గు కలగటం లేదు. కాని అభినయించాలిగా? అభినయిస్తోంది. యుగంధర్‌ ”నాకు అర్టిఫిషియల్‌గా ఉండటం ఏమాత్రం నచ్చదు.

ఆ పువ్వులేంటి ఆ తలలో? బజార్లో ఇంకేమైనా మిగిలున్నాయా లేదా?” అనేసరికి ఆమె ఆకాశాన్నుంచి దబ్బున కింద పడ్డది.

యుగంధర్‌ చాలా ముక్కుసూటి మనిషి వస్త్రధారణ మాటలు, స్నేహాలూ ఏదీ ఓవర్‌గా ఉండటం అతనికి నచ్చదు. అటువంటి భర్త దొరికినందుకు దుర్గ గర్వపడాలి. కాని సినిమా మాయాజాలంలో చిక్కుకుపోయిన ఆమె మనసు స్వచ్ఛమైన, సహజమైన విషయాలను మెచ్చుకునేందుకు సిద్ధంగా లేదు.

అనేక సీరియల్స్‌లో చూపుతున్నట్టు అత్త, ఆడబడుచులు కుట్రధారులుగా ఉంటారని భావించింది దుర్గ. కాని అత్త కమలమ్మ మితభాషిణి. ఏ విషయంలోనూ అనవసరమైన జోక్యం ఉండదు. ఆడబడుచులిద్దరు రేవతి, కళావతి అప్పుడప్పుడూ వచ్చేవాళ్లు. వాళ్లు దుర్గను తమ అక్కచెల్లెలుగానే చూసేవాళ్లు. అత్త ఇంటిపనంతా చేసేది. తన అంచనాలన్నీ ఇలా తలకిందులవుతుండడంతో, దుర్గలో చిన్నగా మార్పు రాసాగింది. పూర్తిగా సినిమాయాజాలంలో చిక్కుకున్న ఆమె మెదడు, ఇప్పుడిప్పుడే సొంతంగా ఆలోచిస్తోంది.

మొదటి ప్రసవానికి హాస్పిటల్లో చేర్చారు. వంగి, లేస్తూ, మెట్లు ఎక్కుతూ, దిగుతూ వుంటూ, గర్భాన్ని ఒక జబ్బులాగా భరించి డాక్టర్ల దగ్గరకు అరక్కుండా వుంటే కాన్పు సులభంగా అవుతుందని అత్త చెప్పడంవల్ల అవన్నీ చేస్తూండేది దుర్గ.

ప్రసవ సమయంలో ఆమెకి నడుం దగ్గర సన్నగా నొప్పి మొదలైంది. సినిమాలో పెళ్లికాని హీరోయిన్లంతా ప్రసవ సమయంలో రెండు చేతులతో దిండు వెనకాల పట్టుకుని, శక్తికొద్దీ కేకలు పెట్టడం చూసి, ”ఎంత సహజంగా నటిస్తున్నారు” అనుకునేది దుర్గ. కాని కాన్పులో అంత అరవాల్సిన అవసరం లేదని ఆమె వ్యక్తిగత అనుభవంలో తెలుసుకుంది. అదంతా భరించగల నొప్పే. అంతా ఓవరాక్షన్‌ చేయాల్సిందేమీ లేదని ఆమె ఇప్పుడు స్వయంగా తెలుసుకుంది.

పిల్లల్ని చాకడం అంటే, సినిమా ఆడ్స్‌లోలాగా బిడ్డను నాప్‌కిన్‌ వేసో, పౌడర్‌ చల్లో, సబ్బు పూసో సంతోషపడే విషయం కాదనీ ఆమె తెలుసుకుంది. తన భర్త ఆర్థికస్తోమత నాప్‌కిన్స్‌ కొనలేదు గనక, ఆమె పాతగుడ్డలు వాడుకుంటోంది. పిల్లాడికి మలమూత్రాలు క్లీన్‌ చేయటం పాలివ్వడం ఇవ్వన్నీ సాధారణ విషయాలు కావని తెలుసుకుంది. ఆయా పనుల్లో నిమగ్నమైంది.

ఇప్పుడు దుర్గ ఇద్దరు పండంటి బిడ్డలకు తల్లి. జాన్సన్స్‌ పౌడర్‌ వాడకున్నా, ఫారెక్స్‌, సెరిలాకు తినిపించకపోయినా వాళ్లు ఎంతో బొద్దుగా, ముద్దుగా, అందంగా, ఆరోగ్యంగా ఉన్నారు.

”సినిమాలో చూపించేదంతా అబద్ధం” అని మొదటిసారి అనుకుంది దుర్గ.

 

Share
This entry was posted in గల్పికలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.