”అంతులేని క(వ్య)థ” (కథ) – విడదల సాంబశివరావు – కవిని
ఇల్లంతా భీతావహంగా ఉంది. రామారావు నిప్పులు కురిపిస్తున్నాడు. కళ్ళు ఎరుపెక్కి వున్నాయి. తాగిన విస్కీ మత్తుకుతోడు ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న 16 సం||రాల కొడుకు కౌషిక్ మీద కోపం కళ్ళను మరింత ఎరుపెక్కేలా చేశాయి. పద్మ బతికి ఉన్న శవంలాగా అయ్యింది. ఏం జరుగుతోందో ఆమెకు తెలియకుండా ఉంది. ఒకటే టెన్షను, దడ, నరాలు పట్టుతప్పుతున్నట్టుగా అనిపిస్తోంది పద్మకు. తండ్రి రౌద్ర రూపానికి భయపడి, బిక్కచచ్చిపోయి, సన్నగా ఒణుకుతూ వంటగది తలుపును ఆనుకుని నిలబడిపోయింది పది సంవత్సరాల పద్మ కూతురు గీత. కుర్చీమీద కూర్చుంటుంటే కింద నేలమీద కూర్చోమని కొడుకుని ఆజ్ఞాపించాడు రామారావు. ఒక అపరాధిలాగా చేతులు కట్టుకుని నిలబడి ఉన్న కొడుకును చూసి తల్లడిల్లిపోతూ ”వీడికేం తక్కువయ్యిందని ఈ స్థితి తెచ్చుకున్నాడు” అని మనసులోనే అనుకుంది పద్మ. ”చెప్పరా చెప్పు నువ్వు తీశావా? లేదా? చెప్పు” రామారావు రెట్టిస్తున్నాడు. కౌషిక్‌ను బెదిరిస్తున్నాడు. ”నిన్ను… నీ వెనకాల ఉన్న నీ స్నేహితులందర్నీ లాక్కొస్తా. ఒక్కొక్కడి సంగతి చెప్తా. మీరంతా కలిసి ఏం చేస్తున్నారో ఇప్పుడే తేలాలి.” రామారావు రుద్రరూపాన్ని అనేకసార్లు చూశాడు, దెబ్బలు తిన్నాడు కానీ ఈ రోజు రామారావు ముందు నిలబడాలంటేనే భయపడిపోతున్నాడు కౌషిక్. ఏదో చెప్పటానికి ప్రయత్నిస్తూ జంకుతున్నాడు. ”ఇప్పుడు ఎక్కడనుండి వస్తున్నావురా?” రామారావు అడిగిన ప్రశ్నకు సమాధానం ఏమీ చెప్పకుండా తలదించు కునే ఉన్నాడు కౌషిక్. ”మాట్లాడవేంరా… తాగొచ్చావా.” రామారావు మళ్ళీ రెట్టించి అడిగాడు వినీ వినపడనట్టుగా ”పబ్‌కెళ్ళా” అన్నాడు కౌషిక్.
కౌషిక్ చెప్పింది రామారావుకు వినపడలేదు. ఇంకా కోపం ఎక్కువయ్యింది రామారావుకు.
”అరేయ్ చెప్పరా లం..కొడకా మాట్లాడవేంరా. అసలు నిన్ను కాదురా, నీ తల్లి లంజను అనాలి. దీని మూలంగానే ఈ ఇల్లు నాశనం అయ్యింది” అంటూ ఇక తిట్లపురాణం లంఖించుకున్నాడు.
ఒకప్పుడు రామారావు ‘పద్మా’ అని పిలిస్తే ఆ పిలుపు ఎంతో మధురంగా అనిపించేది. రామారావు గొంతు వినటం తోటే పరవశించిపోయేది పద్మ. ఇప్పుడు ‘పద్మా’ అన్న పిలుపు దాదాపుగా చాలాకాలంనుంచీ వినిపించటం లేదు. కౌషిక్ పొరపాటు చేసినపుడు ”నీతల్లి” అన్న తిట్లు మాత్రమే రామారావు నోటినుండి వస్తోంది. భర్త నోటినుండి అత్యధికంగా వచ్చే బూతుమాటలు పద్మకు భరింపశక్యం కానివిగా మారాయి. భర్త కళ్ళల్లో ఒకప్పుడు తనపట్ల, పిల్లలపట్ల కనిపించిన ప్రేమ, మమకారం ఏమైపోయాయో అని అప్పుడప్పుడు అనుకుంటూ ఉంటుంది పద్మ. ఇంతలో ఎంత మార్పు… చలికాలం కప్పుకోవటానికి దుప్పట్లు లేక పిల్లలకు మాత్రమే కప్పి చలికి తట్టుకోలేక లేచి కూర్చొని తెల్లవార్లూ ఎన్ని కబుర్లో, ఆ కబుర్లకు అంతే ఉండేది కాదు. పిల్లల భవిష్యత్తు నుండి మొదలుపెట్టి అప్పటి రాజకీయాలదాకా… ఎప్పుడు తెల్లవారిందో తెలిస్తేగా! కప్పుకోవటానికి ఒక్క దుప్పటి ఉంటే ఎంత బాగుండో! ఒక్క బిందె మంచినీళ్ళకోసం మధ్యాహ్నం మండుటెండలో రెండుమైళ్ళ దూరం వెళ్ళి తెచ్చుకునేటప్పుడు మంచినీళ్ళు వచ్చే ఇంట్లో అద్దెకుంటే ఎంత బాగుండో! అని అనుకునేది పద్మ. ఇప్పుడు అన్నీ ఉన్నా జీవితం మాత్రం నిరాశగా, నిస్తేజంగా అనిపిస్తోంది పద్మకు.
ఆ మధ్యకాలంలో మహానగరపు శివారు ప్రాంతాలలో ఉన్న అనేక కుటుంబాలలో పెనుమార్పులు వచ్చాయి. అలాంటివాటిల్లో రామారావు, పద్మల కుటుంబం కూడా ఒకటి. డాలర్ మహిమ వలన ఎందుకూ పనికిరాని సవ్వుడునేలలు కూడా బంగారాలయ్యాయి. భూములకు ఒక్కసారే రెక్కలు రావటం వలన చాలామంది లక్షాధికారులయ్యారు. చాలా చిన్న వ్యాపారం చేస్తూ, చాలీచాలని ఆదాయం వచ్చే రామారావు కూడా తన ఇంటిని, భూమిని అమ్మాడు. వచ్చిన డబ్బుతో పెద్ద వ్యాపారం ప్రారంభించాడు. మార్కెటింగ్ రంగంలో తిరుగులేనంతగా ఎదిగాడు. తిమ్మినిబమ్మిని చేశాడు. తలలు మార్చాడు. అవకాశం ఉన్నచోట జుట్టు పట్టుకున్నాడు. అవకాశం లేనిచోట కాళ్ళబేరానికి వచ్చాడు. ఒకమారు చెప్పింది మరొకమారు చెప్పకుండా రకరకాలుగా మారుతూ అందరూ అబ్బురపడేంత పైకి ఎదిగాడు. చాలా చాలా ఆర్థిక విజయాల్నే సాధించాడు. బంధువర్గాలు, పరిచయస్థులు రామారావుని చూసి నేర్చుకోవాలన్నంతగా ఎదిగాడు. రామారావు సాధించిన విజయాలలో పద్మదే ప్రధానపాత్ర. సరియైన అంచనా వేయగలగటం, ముందుచూపు, రాణింపు, సామర్థ్యంలాంటి విషయాలలో తనకంటే కూడా పద్మ సృజనాత్మకంగా చేయగలుగుతోందని ఇట్టే గ్రహించాడు రామారావు. గతంలో స్కూలు టీచరుగా పనిచేసిన పద్మ పిల్లల పెంపకంలో కూడా ముందుండేది. చాలా సందర్భాలలో ఆత్మన్యూనతకు లోనవుతూ ఉండేవాడు రామారావు. పిల్లలు పద్మకు ఎక్కువ చేరువ కావటం, ఆమె తెలివితేటలు, రాణింపుతనం, సృజనాత్మకత రామారావులో అభద్రతాభావాన్ని పెంచేశాయి. వ్యాపారం బాగా అభివృద్ధి చెందాక పద్మను ఇంటికి మాత్రమే పరిమితం చెయ్యాలనుకున్నాడు రామారావు. పద్మపై మానసికంగా పైచేయి సాధించటానికి నీచపు ఎత్తుగడలను ఎంచుకోవటం మొదలుపెట్టాడు. పిల్లలు తల్లిని ద్వేషించి తనకు మాత్రమే దగ్గర కావాలని అవసరానికి మించి అధికంగా డబ్బులు ఇస్తూ, కొడుకు చేసే పొరపాట్లను ప్రోత్సహిస్తూ అన్నింటికీ పద్మను బాధ్యురాల్ని చేయటం మొదలుపెట్టాడు. వయసుతో సంబంధం లేకుండా పబ్‌లు, గర్ల్‌ఫ్రెండ్స్, తాగుడులాంటి చెడుఅలవాట్ల ఊబిలోకి నెట్టివేయబడ్డాడు కౌషిక్. అస్తవ్యస్తంగా ఉన్న ఇంటి వాతావరణం, తల్లిదండ్రుల మధ్య ఎప్పుడూ గొడవలు, నిరాశా, నిస్తేజంగా ఉండే పద్మ మానసిక స్థితి, రామారావు దురహంకారం అసూయ, ఆత్మన్యూనత కౌషిక్‌ను అశాంతికి గురిచేశాయి. మొగ్గలోనే వాడిపోతున్న కౌషిక్ జీవితం కనీస విలువల్ని కోల్పోతున్న వ్యసనపరుడైన రామారావు తన జీవితంతోపాటు కౌషిక్ జీవితం నాశనం కావటానికి దోహదపడుతున్న అతని అహంభావం. ఎంతో నమ్మి, ప్రేమించి, సర్వస్వం భర్తే అనుకున్న పద్మకు భర్తలోని తీవ్రమైన మార్పులకి సరైన కారణాలేమిటో అర్థంకాక అత్యంత మానసిక వేదనకు గురవుతూ జీవశ్చవంలా మారిపోయింది పద్మ. ఇంట్లో ఏమి జరుగుతున్నదో, ఏమి జరగనున్నదో అర్థంకాక గందరగోళానికి గురవుతోంది గీత. రామారావు దృష్టిలో మాత్రం సమస్త సమస్యలకు కారణం పద్మ మాత్రమే.
”మాట్లాడవేంరా చెప్పు…” గట్టిగా గద్దిస్తున్నాడు రామారావు.
”తలెత్తరా… తలదించు కుంటావేంరా…” పక్కనున్న స్కేలు చేతిలోకి తీసుకుని కౌషిక్ మోకాళ్ళమీద కొడ్తూ అంటున్నాడు రామారావు.
”ఇంట్లో టేబులు మీద పెట్టిన నా బ్యాగులోని డబ్బులు పోయాయి. ఎవరు తీశారో చెప్పు.” ఒక్క నిమిషం మౌనంగా ఉండి మరలా రెట్టించి అడిగాడు రామారావు.
”నాకేం తెల్సు నేను పొద్దున బయటకు వెళ్ళి ఇప్పుడే వచ్చా” అన్నాడు కౌషిక్.
”నీకు తెలియదురా” తెలియదన్నట్టు తల అడ్డంగా ఊపాడు కౌషిక్.
”అయితే ఎవరు తీసినట్టు?” కౌషిక్ కళ్ళలోకి చూస్తూ అడిగాడు రామారావు.
”ఏమో నాకేం తెల్సు?”
”ఈ ఇంట్లో ఉండేది మనం నలుగురం. నీ తల్లి, నువ్వూ, నీ చెల్లి, నేనూ అవునా…” అవునని తల ఊపాడు కౌషిక్.
”నేను నా డబ్బుల్ని తీసుకుని నిన్నయితే అడగను కదా! నీ చెల్లె చిన్నపిల్ల. మరి ఇంకెవరు తీస్తార్రా నీ తల్లా.. అనుమానించాల్సిందే. నీ తల్లికంటే లంబాడీది నయం. చెప్పినట్టల్లా వింటుంది. నీ తల్లికి అది కూడా రాదు. చెప్పవేంరా…”
”నాకు తెలియదు.. తీస్తే చెప్పేవాడ్ణేగా” కౌషిక్ తలదించుకుని కూర్చున్నాడు.
”నీ తల్లి కూడా కాకపోతే ఇంకెవడో బయటినుండి వచ్చి తీసుండాలి. ఎవడు వాడు? ఎందుకు వస్తున్నాడు? ఇప్పుడే తేలాలి.”
”బయటినుండి ఎవడో మన ఇంటికి ఎందుకు వస్తాడు డాడీ” అసహనంగా అన్నాడు కౌషిక్.
”ప్రశ్నకు ఎదురుప్రశ్న నన్నే వేస్తావురా. నీకేం తక్కువ చేశానురా? వందరూపాయలు అడిగితే వెయ్యిరూపాయలు ఇచ్చా. ఎనిమిదవ తరగతిలోనే కెమెరా సెల్‌ఫోను కొనిచ్చా. ఎవరికైనా ఇట్లా కొనిస్తారేమో పోయి అడుగు. నా డబ్బుతో మీరంతా బతుకుతూ నాకే ఎదురుతిరుగుతార్రా… అయితే నీ తల్లిమీద ఒట్టేసి చెప్పరా నువ్వు తీయలేదని…”
కౌషిక్ మెల్లగా లేచి రూములోకి వెళ్ళబోయాడు. రామారావు ఇంకా ఉగ్రుడై కౌషిక్ షర్టు కాలరు పట్టుకుని ”నాకు సమాధానం చెప్పిపోరా” అంటూ కౌషిక్ తలను తలుపుకేసి కొట్టాడు. గీత పరుగెత్తుకుంటూ వచ్చి అడ్డుపడింది. ”డాడీ.. అన్నను కొట్టవద్దు. డాడీ… ప్లీజ్..” తండ్రి చెయ్యి గట్టిగా పట్టుకుని బతిమిలాడుతోంది.
”నువ్వెళ్ళమ్మా… నువ్వెళ్ళు… నీ రూముకెళ్ళి పడుకోపో…” కూతుర్ని చూసి కొంచెం తగ్గి అన్నాడు రామారావు. గీత హాల్లో సోఫాలో కూర్చుండిపోయింది.
”చెప్పరా…” అంటూ దెబ్బమీద దెబ్బ వేస్తూనే ఉన్నాడు రామారావు.
”అమ్మ మీద ఒట్టు… నేను తీయలేదు” అన్నాడు కౌషిక్ దెబ్బలకు తాళలేక.
పద్మలో చలనం ఎప్పుడో చచ్చిపోయింది. ప్రతిరోజు ఇంట్లో ఏదో ఒక రభస పెడుతూనే ఉంటాడు రామారావు. ఈ రోజు డబ్బులు పోవటాన ఇంకా ఎక్కువ. నిజంగానే బ్యాగులోని డబ్బులు పోయాయా? లేక తనే ఎక్కడైనా పోగొట్టుకున్నాడా? లేకపోతే కౌషిక్ ఒట్టేసి అబద్ధం చెబుతున్నాడా? ఏదీ నిర్ణయించుకోలేకపోతుంది పద్మ. నాలుగు బెడ్‌రూముల ఇల్లు. ఎవరి గదులు వారివే. రామారావు దాదాపుగా బిజినెస్ పనుల మీద బయటే తిరుగుతూ ఉంటాడు. ఇంటికి వచ్చాక తన రూములో టి.వి చూసుకుంటూ, విస్కీ తాగుతూ, రకరకాల సి.డిలు తెచ్చుకుని చూసుకుంటూ ఉంటాడు. ఇక ఆ బ్యాగు ఎక్కడ పెట్టుకున్నాడో? ఏమో? మెదడు ఆలోచిస్తే మొద్దుబారిపోయిందనిపించింది పద్మకు. ”ఇది కాకపోతే మరొకటి. ఎప్పుడూ రభసేగా!” మనసులోనే అనుకుని నిట్టూర్చింది పద్మ. గొడవని ఆపాలని అనుకున్నది పద్మ. కానీ గొడవను ఆపటానికి ఏమాత్రం ప్రయత్నించినా అసలు విషయాన్ని పక్కకునెట్టి పద్మను బాధ్యురాల్ని చేస్తూ… నోటికొచ్చినట్టు తిడుతుంటాడు రామారావు. అందుకే ఆ ప్రయత్నాన్ని ఆపేసింది పద్మ.
జ జ జ
ఆ మధ్య పద్మ షాపింగ్ చేసినప్పుడు తమతోపాటుగా భూమిని అమ్మిన శ్యామలా, సుందరరావులు కలిశారు. వారిద్దరూ టీచర్లే. తమ భూముల్ని గవర్నమెంటు కొని ఇవ్వవలసిన డబ్బులో కనీసం ఒక్కశాతం కూడా చెల్లించకుండా ముప్పతిప్పలు పెడుతున్నారని, ఇప్పటికీ ఇంకా అధికారుల చుట్టూ, కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. వాళ్ళు చెప్తే పద్మ చాలా బాధపడింది. రామారావులాంటి కొద్దిమంది తప్ప చాలామంది మోసపోయారన్న విషయం అర్థమయ్యింది పద్మకు. ఒకప్పుడు శ్యామలా, సుందరరావుల కుటుంబం కూడా వీళ్ళలాంటి కుటుంబమే. చాలాసార్లు ఆపదల్లో పద్మ, రామారావులను ఆదుకున్నారు. రామారావుతో మాట్లాడి ఏదో ఒక రకంగా అప్పుల ఊబిలో ఉన్న శ్యామలా, సుందరరావుల కుటుంబాన్ని ఆదుకోవాలని అనుకున్నది పద్మ. కానీ రామారావు ప్రవర్తన గుర్తుకు వచ్చింది పద్మకు. ఎదిగే క్రమంలో ఒకప్పటి అత్యంత సన్నిహితుల్ని కూడా దూరం పెడుతూ వచ్చాడు రామారావు. బంధువుల్ని స్నేహితుల్ని కూడా దూరం పెట్టాడు. ఎవరైనా ఇంటికి వచ్చినా విపరీత అసహనాన్ని ప్రదర్శిస్తూ, అవమానపరుస్తుంటాడు రామారావు. దాదాపుగా తెలిసినవాళ్ళెవరూ రామారావు ఇంటికి రావటానికి సాహసించరు. పద్మ తన కుటుంబంలో వచ్చిన మార్పును వివరించి చెప్పింది శ్యామలకు. ఇద్దరూ కలిసి గతంలో తమకు ఎంతో సన్నిహితురాలైన డా|| రవళిని కలిశారు. డా|| రవళి రామారావుకు కూడా బాగా పరిచయం ఉన్న డాక్టర్. రామారావు ప్రవర్తన వలన తాను శారీరకంగా, మానసికంగా ఎంతగా దెబ్బతింటున్నదీ, రోజురోజుకూ నరకంగా మారుతున్న తన కుటుంబ జీవితాన్ని గురించి, పిల్లలపై పడుతున్న దుష్ప్రభావాన్ని గురించి డా|| రవళితో చర్చించటం మొదలుపెట్టింది పద్మ. రామారావుకు పద్మ డా|| రవళిని కలవటం సుతరామూ ఇష్టంలేదు. అవకాశం దొరికినప్పుడల్లా ”ఆమె ఒక వేస్టు డాక్టరు. అప్పుడేదో గతిలేక ఆమె దగ్గర వైద్యం చేయించుకున్నాం. కానీ ఇప్పుడు ఎంతోమంది డాక్టర్లు ఉన్నారు. ఆమె దగ్గరకు వెళ్ళవలసిన అవసరం లేదని” ఖరాఖండిగా చెప్పేశాడు రామారావు. రామారావు ఎంత వెళ్ళవద్దని చెప్పినా పద్మ వినిపించుకోలేదు. ”పిల్లల్ని తీసుకుని పుట్టింటికి వెళ్ళిపోయి ఏదో ఒక ఉద్యోగం చేసుకుంటూ బతుకుతాను” అన్న తన నిర్ణయాన్ని డా|| రవళికి చెప్పింది పద్మ. కొద్దిసేపు మౌనంగా ఉండి చెప్పటం మొదలుపెట్టింది డా|| రవళి. ”గతంలో రామారావు అప్పుడప్పుడు వచ్చి కలుస్తుండేవాడు. కానీ నువ్వు చెప్తున్నదానికి పూర్తి విరుద్ధంగా బయట ఉంటాడు. ఎంత విరుద్ధంగా అంటే నీ పరిస్థితిని చెప్పినా ఎవరూ నమ్మనంతగా!” ఏదో చెప్పబోయి ఆగిపోయింది పద్మ. రామారావు ప్రవర్తనకు కారణాన్ని తను అర్థం చేసుకున్నంతలోనే వివరిస్తూ ఇలా చెప్పింది డా|| రవళి. ”రామారావు స్వతహాగా మంచివాడే కానీ మధ్యలో వచ్చిన డబ్బు, పలుకుబడి, పేరు అతనిలో అహంభావాన్ని పెంచుతూ వచ్చాయి” అని స్పష్టం చేస్తూ… ”నువ్వు ఇందాక పుట్టింటికి వెళ్ళిపోదామని అనుకుంటున్నావన్నావు. నువ్వు పుట్టింటికి వెళితే రామారావు ఊరుకుంటాడా… నా భార్య నాకు కావాలి అని వచ్చి మీ ఇంటిముందు కూర్చుంటే… మీ తల్లిదండ్రులు మాత్రం ఏమనగలుగుతారు? మళ్ళీ నువ్వు రామారావు దగ్గరికే రావల్సి వస్తుందేమో! అప్పుడు ఇంకా నరకంగా మారుతుందేమో!”
”విడాకులకు అప్లయ్ చేద్దామనుకుంటున్నాను” సాలోచనగా అన్నది పద్మ.
”విడాకులకు నువ్వు అప్లయ్ చేసినా అతను సంతకం చేయడు. ఎందుకంటే నాకు అర్థమయినంత వరకూ నిన్నూ, పిల్లల్ని తన కాళ్ళ కింద పడేసుకోవాలనే ఆలోచన తప్ప అతనికి వేరే స్త్రీలతో సంబంధాలు లేవు. అలాగని మిమ్మల్ని వదిలేయను వదిలేయడు. మీకు సమస్త సౌకర్యాలను రామారావు కల్పిస్తున్నాడన్న విషయాన్ని నువ్వ మర్చిపోకూడదు” అన్నది డా|| రవళి.
”నేనేం చెయ్యాలి? ఎక్కడకు వెళ్ళాలి?” ఉద్వేగంగా అన్నది పద్మ.
”పడినచోటనే వెతుక్కోవాలి” అని సలహా ఇచ్చింది డా|| రవళి. డా|| రవళి అన్న మాటలు పద్మలో ఆలోచనలను రేకెత్తించాయి.
జ జ జ
అర్ధరాత్రి ఒంటిగంట అవుతోంది. తలుపులన్నీ పెట్టి ఉన్నా అరుపులూ, కేకలు, ఏడ్పులతోటి అపార్టుమెంటు దద్దరిలిపోతుంది అని అనిపిస్తోంది. గీత ఏడుస్తూ తండ్రిని, అన్నను బతిమాలుతుంది. గీత మీద దెబ్బపడకుండా జాగ్రత్తపడుతూ, గీతను రూములోకి వెళ్ళి పడుకోమని చెప్తున్నాడు రామారావు. కౌషిక్ ఒకపక్క దెబ్బలు తింటూనే మరొకపక్క గొడవపడుతున్నాడు.
”ఏమన్నా అను డాడీ… కానీ నన్ను లం…కొడకా అనొద్దు” ఉక్రోషంగా అన్నాడు కౌషిక్.
”నేను అలాగే అంటారా… అలాగే అంటా” రెట్టిస్తూ అన్నాడు రామారావు.
”నన్నెందుకు అలా అంటావ్. నేనేమన్నా లంజకు పుట్టానా” కోపంగా అన్నాడు కౌషిక్.
”అవున్రా నీ తల్లి లంజదే…” ఇంకా కచ్చిగా అన్నాడు రామారావు.
విషయం రూపాన్ని మార్చు కుంది. అటొచ్చీ, ఇటొచ్చీ పద్మే ప్రధాన పాత్ర అయ్యింది. అసలు సమస్య పక్కకు వెళ్ళింది. కొడుకు అడుగుతున్న ప్రశ్న అత్యంతనీచంగా ఉంది. నీచత్వానికి ప్రతిరూపంగా మారిన భర్తకు, జీవితం అంటే ఏమిటో తెలియని కొడుకుకు, వాళ్ళు తాగి చర్చిస్తున్న విషయం ఎంత నీచమయ్యిందో? ఎంతగా తన హృదయాన్ని గాయపరుస్తోందో? చెప్పే స్థితిలో పద్మ లేదు. వినిపించుకునే స్థితిలో వాళ్ళిద్దరూ లేరు. ఏమి జరుగుతోందో అర్థంకాక మూగదానిలా మారిపోయింది గీత.
శరీరంలో లేని శక్తిని కూడదీసు కుని ఏదో దృఢంగా నిశ్చయించుకున్న దానిలాగా లేచి నిలబడింది పద్మ. గీత వైపు తిరిగి భయపడవద్దని చెప్తూ దగ్గరకు తీసుకుంది.
”ఇప్పుడే మీ ముగ్గురూ బయటకు పొండిరా… నాకు ఎదురుచెప్పేవాళ్ళు నా కొంపలో ఉండటానికి వీల్లేదు. ఒక్కక్షణం కూడా మీరు ఇంట్లో ఉండొద్దు… బయటకు పొండి…” అంటూ రామారావు డైనింగ్ టేబులు మీద ఉన్న అన్నంగిన్నెను, కూర గిన్నెలను ఎత్తిపడేస్తున్నాడు. అడ్డం వచ్చిన కౌషిక్ గొంతు పట్టుకున్నాడు. పద్మ ”కౌషిక్” అని గట్టిగా అరవటంతో రామారావు కౌషిక్ గొంతును వదిలేశాడు. తన అహంకారానికీ, హింసకూ పెద్దగా ఎదురుతిరగకుండా తనలో తాను కుమిలిపోయే పద్మ ఇలా ఒక్కసారే గట్టిగా అరవటం రామారావుకు మింగుడుపడని విషయం అయ్యింది.
పద్మ గర్జిస్తున్న స్వరంతో రామారావు వైపు తీక్షణంగా చూస్తూ ”ఎవరిది ఈ ఇల్లు. నీ ఒక్కడిదా… ఈ ఇల్లు నీదే కాదు. మాది కూడా. ఏమన్నావ్… నా మూలకంగా ఈ ఇల్లు నాశనం అవుతోందా? ఈ ఇంటిని నాశనం చేస్తున్నది నువ్వు. నీ వ్యసనాలకు, నీ అహంకారానికి మమ్మల్ని బలిపశువుల్ని చేస్తున్నావ్… డబ్బు, పేరు ఇవే విజయం అని నువ్వు అనుకుంటున్నావేమో? పతనపు అంచుల్లో నువ్వు ఉన్నావని మర్చిపోవద్దు. ఇంట్లోని ప్రతి ఒక్క వస్తువు మీదా నీతోపాటు, నాకూ పిల్లలకూ సమాన హక్కులున్నాయ్… బయటకు పొమ్మంటున్నావుగా… మాతోపాటు నువ్వు కూడా బయటకు నడు. నడిరోడ్డు మీద పెడదాం… పంచాయితీ… ఈ ముసుగు జీవితాలు మాకు అఖ్కరలేదు. నేను రేపటినుంచే ఉద్యోగం వెతుక్కుంటా… నా తిండి నా కష్టంతోనే తింటా… కానీ పిల్లల బాధ్యత.. ఇంటి బాధ్యత మాత్రం నీదే..”
రోషంతో ఏదో అనబోతున్న రామారావుతో ”మరొక్కమాట నీ నోటి నుండి వచ్చినా మంచిగుండదు..” అని హెచ్చరిస్తున్న పద్మను చూసి జంకాడు రామారావు.
కౌషిక్ ఏడ్చుకుంటూ తల్లి దగ్గరకు వచ్చి ”అమ్మా… నేను ఇంకెప్పుడూ ఇలా చేయనమ్మా… సారీ అమ్మా…” అంటున్నాడు. పద్మ, గీతను, కౌషిక్‌ను దగ్గరకు తీసుకుంటూ ”ఇకనుండీ ఈ ఇల్లు విషవలయంగా మారటానికి వీల్లేదు. ఇష్టమున్నవాళ్ళ ఉండండి… లేనివాళ్ళు వెళ్ళిపోవచ్చు…” అని దృఢంగా, స్పష్టంగా, ఖచ్చితంగా అన్నది పద్మ.