– ఆదూరి హైమవతి

”ఈ ఆడపీనుగును తీసుకెళ్ళి మురిక్కాలవలో పడేసి రా! లేదా నీవూ ఎక్కడికైనా వెళ్ళిపోయి చావు. నీ ఆడమూకతో… నా గుమ్మం తొక్కకు. అన్నీ ఆడపీనుగలే. ఒక్క కొడుకును కనడం చేతకాదు. థూ…” కోపంగా అరిచాడు చలపతి.

హాస్పిటల్లో సిజేరియన్‌ చేయగా పుట్టింది నాల్గో కూతురు. కమల కుమిలిపోయింది. తన శని కాకపోతే ఇలా అంతా ఆడపిల్లలే పుట్టడమేంటి? ఐనా దాన్లో పూర్తిగా తన ప్రమేయమేముంది.

”దీనికంతా కారణం నేనే ఎలా అవుతాను? మగబిడ్డను నేను కనననలేదే!” అంది బాధగా.

”థూ! మాట్లాడకు వెధవ ఆడసంతను పెంచటం నావల్లకాదు” కసిగా అన్నాడు చలపతి.

అక్కడే ఉన్న నర్స్‌ ”మీ అమ్మా! ఆడమనిషేగా! మీ అక్కా ఆడమనిషేగా! అసలు ఆడవాళ్ళు లేంది మీరెక్కడ్నుంచీ వచ్చారు? ఆడదే కంటుంది కానీ మీ సంతానాన్ని, మగవారెక్కడైనా కంటారా! అలా చాతనైతే నీవే పదిమంది మగపిల్లల్ని కనకపోయావా? అసలే బలహీనంగా ఉన్న ఆమెను ఇలా బాధిస్తావా? వెళ్ళు” అంది.

”నీవేవరమ్మా! చెప్పను, నీపని నీవు చూసుకోపో. అధికప్రసంగం చేయకు. నా భార్య, నా బిడ్డలు నా యిష్టం చంపుతాను ఐతే ఏం” అన్నాడు కోపంగా.

”చంపి చూడు ఎక్కడుంటావో జీవితాంతం జైల్లో పడుంటావు. సరి నీవు ముందు బయటికి నడూ, విజిటింగ్‌ టైమైపోయింది” అంది ఆ నర్స్‌.

”రావే ఇంటికి వస్తావుగా! నిన్నూ నీ ఆడము-ల్నీ చంపి పాతరేస్తాను” అంటూ వడివడిగా వెళ్ళిపోయాడు చలపతి.

”ఎక్కడ దొరికాడమ్మా ఈ అడవి మనిషి నీకు? ఇంత అందమైనదానికి, సౌమ్యురాలికి ఈ కుసంస్కారి! దైవచిత్రం!” అంది నర్స్‌.

”అంతా నా ఖర్మ, చదువుకుంటున్న దాన్ని అర్థాంతరంగా ఆపేసి ఈ పెళ్ళి చేశారు, ఈ రూపమే నా బ్రతుకును బలిగొంది. అమ్మా! నర్స్‌! నీవు చాలామంచిదానిలా ఉన్నావ్‌. నాక్కాస్త సాయం చేస్తావా?” అర్థించింది ఆ బాలింత.

”చెప్పమ్మా! నీకేం సాయం కావాలి, నాకు చేతనైనది చేస్తాను” అంది ఆ నర్స్‌.

”నేను కాస్త చదువుకున్నదాన్నే, డిగ్రీ పూర్తిచేయలేదు కానీ, నాకు కాస్తంత చోటుచూపిస్తే కొంచెం ఓపిక రాగానే పదిమందికి ట్యూషన్స్‌ చెప్పగలను. ఏదైనా లెక్కలు రాయగలను. కూలిపనైనా చేసి నా నలుగురు ఆడపిల్లల్నూ పోషించుకుంటాను. నాక్కొంచం సాయం చేయి తల్లీ” అని ఆ పచ్చి బాలింతరాలు కమల ఏడుస్తూ చేతులు మోడ్చి దండం పెట్టింది.

”అమ్మా! నీవు డిస్చార్జ్‌ కాను ఇంకా వారం పడుతుంది. ఈలోగా నాకు తెల్సిన ఒక సంస్థ ఉంది. అక్కడ విషయం చెప్పి నీకేమన్నా సాయం దొరుకుతుందేమో చూస్తాను.

”కానీ ఈ ఊర్లో మాత్రం వద్దు. తెల్సినవారెవ్వరూ కనిపించని చోటుకు పంపండి. కూలిపని చేయనైనా నేను సిద్ధమే. ఈ నలుగుర్నీ ఈ భూమి మీదకు తేవటంలో నాభాగమూ ఉంది కదా! వీర్ని అన్యాయంగా చంపడంకానీ, అనాథలను చేయడం కానీ చేయను” స్థిరంగా అంది కమల.

”నీ ధైర్యానికి నాకు చాలా సంతోషంగా ఉంది కమలా! నీలా అంతా ఉంటే ఈ మగజాతి క్రౌర్యం సాగదు” అని ధైర్యం చెప్పింది నర్స్‌.

జ జ జ

”డాక్టర్‌! మాకు అమ్మాయని చెప్పారు. వద్దు. అబార్షన్‌ చేయండి” స్థిరంగా అన్నాడు సిద్ధార్ధ.

”అంతా మీలా అనుకుంటే ఇహ ఈ భూమ్మీద అమ్మాయిలే ఉండరు. అది కుదర్దు. అంతే” ఖచ్చితంగా అంది డాక్టర్‌ దమయంతి.

”మీరా తల్లిదండ్రులు? మేమా? మాకు వద్దంటే మీ బలవంతమేంటి?” విసుగ్గా అన్నాడు సిద్ధార్ధ.

”మీకు అమ్మాయిలంటే ఎందుకండీ అంత ఏహ్యం?’ అడిగింది దమయంతి.

”అసహ్యం కాదు డాక్టర్‌! భయం. ఈ రోజుల్లో అమ్మాయిని పెంచడం, చదివించడం, పెళ్ళి చేయడం అన్నీ కష్టమే! పైగా ఈ యాసిడ్‌ దాడులు, ప్రేమించమని వెంటబడి పొడిచేయటాలు అందుకనే అమ్మాయి వద్దని నిర్ణయించుకున్నాం. ఇటీవల జరుగుతున్న సంఘటనలు ఢిల్లీ సామూహిక అత్యాచారం, ఇంకా తెరపైకిరాని అనేక సంఘటనలు మమ్మల్నిలా నిర్ణయించుకునేలా చేశాయి.” చాలా ఖచ్చితంగా తన నిర్ణయాన్ని చెప్తున్న అతడితో మరేమీ మాట్లాడలేకపోయింది దమయంతి.

”తన తండ్రీ ఇలా అనుకునేగా తను పుట్టగానే అమ్మను వెళ్ళిపొమ్మన్నాడు! లేక తలకొరివి పెట్టే కొడుకు, వంశోద్ధారకుడైన కొడుకు కోసమా! ఏమైనా తన తల్లి ఎంత శ్రమకోర్చి తామందర్నీ ఇలా పెద్ద చదువులు చదివించి భూదేవంత ఓర్పుతో, కష్టాలు భరించి సంస్కారవంతంగా సామాజిక స్పృహతో పెంచి పెద్ద చేసింది. నిజంగా దేవత” అనుకుంది దమయంతి.

ఇంటరకమ్‌ మోగింది. ”చెప్పండి సార్‌!” అంది దమయంతి. అటు మాటలన్నీ విని ”సరే సర్‌!” అని ఫోన్‌ పెట్టేసింది. ”సరి, మీరు మా డైరెక్టర్‌గారితో మాట్లాడండి. ఆయన నిర్ణయిస్తారు. మేమిక్కడ ఉద్యోగులమే!” అంది సిద్ధార్ధతో డాక్టర్‌ దమయంతి.

జ జ జ

”నా గొంతెవరో నొక్కేస్తున్నారు… ఊపిరాట్టంలేదు అబ్బా!” అంటూ అరవసాగింది దమయంతి.

”దమయంతి! దమయంతి! ఏమైందమ్మా!” తట్టి పిలుస్తూ అడిగింది తల్లి కమల. దమయంతి ఈ లోకంలోకి రాలేదు, అలా అరుస్తూనే ఉంది. కొంతసేపయ్యాక నీళ్ళు తెచ్చి ముఖాన చల్లింది కమల. ఒళ్ళంతా చెమటలు పట్టగా, రొప్పుతూన్న దమయంతిని లేపి కూర్చోబెట్టింది కమల.

చివరకు కళ్ళుతెరిచి ”అబ్బా! ఎంత భయంకరమైన కల! పిచ్చి కల!” ఆశ్చర్యంగా అంది ఆమె.

”ఏం కలమ్మా అది! ఎంత పిచ్చిగా అరిచావో తెల్సా! నాకే భయమేసింది!” ఆమె తల నిమురుతూ అంది కమల.

”ఎవరో నా పీక నులిమేస్తున్నారు. వారికి శరీరాల్లేవు! తలమాత్రం పెద్ద కనుగుడ్లతో ఉంది, కళ్ళు పాలపిట్ట కళ్ళలా రెప్పలులేని పెద్ద గుడ్లు!” అంది

”ఏదైనా దయ్యాల పుస్తకాలు చదివావా! దమయంతీ! ఎంతో ధైర్యం గల డాక్టర్‌ వని నీకు పేరు?”

”సరే! ఇహ పడుకో” అంటూ నిండుగా దుప్పటికప్పి, ఫాన్‌ ఆన్‌ చేసి వెళ్ళి పడుకుంది.

కమల తెల్లారి మెల్లిగా నిద్ర లేచాక ”ఏమైంది దమయంతీ! ఎప్పుడూ లేంది రాత్రి అలా అరిచావు? పీడకలలేమైనా వచ్చాయా!” ప్రేమగా అడిగింది కమల, కాఫీ కప్పు అందిస్తూ.

”రాత్రి నా గొంతు నులుముతున్న ఆకారాలు గాల్లో తేలి వచ్చాయి, వాటికి తల, కళ్ళు తప్ప శరీర ఆకారం లేదు. తోకలా ఉంది శరీరం. మూడోనాల్గో నెలల పిండాల్లా ఉన్నాయి. అమ్మా! ‘భ్రూణహత్య’లంటే అబార్షన్స్‌ చేయటమా అమ్మా!” అడిగింది దమయంతి.

గర్భవిచ్ఛిత్తి చేయటం ‘భ్రూణహత్యలే’ అవుతాయి. గర్భంలో ఉన్న పిండం ప్రాణాన్ని తీయడం కూడా హత్యతో సమానమే! ఈ రోజుల్లో అమ్మాయిలని తెలియగానే ఇలా అబార్షన్స్‌ చేయించుకోడం, లేదా పుట్టాక చంపేయటమో మామూలేగా! మొన్నటికిమొన్న ఒక నిర్భాగ్యుడు కన్నబిడ్డను బురదగుంటలోవేసి కాళ్ళతో తొక్కి చంపాడని మనం పేపర్లో చదవాం. సాయం చేసి మనందర్నీ కాపాడిన ఆ దేవతను మరవలేను” అంది కమల. ఆనాటి నర్స్‌ను తలుచుకుని.

”అమ్మా! ఈ రోజుల్లో సమాజంలోని అరాచకాలకూ, ఆకృత్యాలకూ భయపడి మాత్రమే తాము అమ్మాయి వద్దనుకుంటున్నామని కొందరు తల్లిదండ్రులు చెప్తున్నారు. కానీ అమ్మా! చంపాలనుకోడం ఎంత నేరమో, ఆడపిండాల హత్యలు చేయటమూ అంతే నేరం కదా!” తన సందేహం నివృత్తి చేసుకోను తల్లిని మించిన న్యాయమూర్తి మరెవరు లేరని అనుకుంది దమయంతి.

”ఔను. అది మన జాతిని మనమే హత్య చేయటంతో సమానం. సమాజంలో రక్షణ లేదని ఆడవారినంతా చంపేయాలా! దానికి తగిన నివృత్తి ఆలోచించాలా? స్త్రీజాతే నశిస్తే ఇహ ప్రపంచమేముంటుంది?”

”అమ్మా! ఆ పని చేసే వృత్తి ధర్మం కూడా నేరమేనా?”

”ఔను! ఆ పని ఎవరో ఒకరు చేస్తుంటేనే కదా వారి వద్దకు వస్తున్నారు. అలా ఆడపిండాల హత్యలు చేసేవారే లేనపుడు ఆలోచనే ఎవ్వరికీ రాదు. అసలు లింగనిర్ధారణ పరీక్షలు చేయడం నేరం కదా! అంది తల్లి. దమయంతి లేచి స్నానం చేసి హాస్పిటల్‌కు బయల్దేరింది, తన రాజీనామా లేఖతో.

 

Share
This entry was posted in కధానికలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి)


తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.