రెండు రోజుల వర్క్‌షాప్ భూమిక వుమెన్స్ కలెక్టివ్, దళిత స్త్రీ శక్తి సంయుక్తంగా, ఆక్స్‌ఫామ్ ఇండియా, సహకారంతో మినార్వాగ్రాండ్ హోటల్లో అక్టోబర్ 7, 8వ తేదీలలో, రెండు రోజుల వర్క్‌షాప్‌ను నిర్వహించింది. ఇందులో ఆక్స్‌ఫామ్ ఇండియా, క్రిస్టియన్ ఎయిడ్ మరియు వాటర్ ఎయిడ్‌తో పనిచేసే పలు స్వచ్ఛంద సంస్థలు తమ తమ అనుభవాలను పంచు కున్నాయి. వర్క్‌షాప్‌లను ప్రారంభిస్తూ, ప్రొఫెసర్ సుధారాణిగారు దళిత మహిళలపై హింస గురించి చెప్పారు. స్వాతంత్య్ర పోరాటానికి పూర్వమే దీన్ని ప్రభుత్వం గుర్తించిందని అందుకే రాజ్యాంగంలో స్త్రీ పురుషులు సమానం అని అన్నారు. మహిళలపై హింసతో పోల్చితే దళిత మహిళలపై హింస ఎక్కువని అన్నారు. వీరికి ఇంట్లోనే కాకుండా సాంఘికంగా కూడా చేతబడుల పేరిట, జోగిని పేరిట హింస ఉంటుందని రాజస్థాన్‌లోని ‘భవరదేవి’ గాధను ఉదహరించారు. కుల వ్యవస్థ ఈ హింసకు మూలం అన్నారు. అన్ని రంగాలలో ఎందరో దీనికి బలి అవుతు న్నారు అని అన్నారు.
దళిత స్త్రీ శక్తి నుంచి ఝాన్సీగారు మాట్లాడుతూ హైదరాబాద్, రంగారెడ్డి, గుంటూరు, కృష్ణ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి మరియు విశాఖపట్నం జిల్లాల్లోని 42 మండలాల్లో తమ సంస్థ పని చేస్తుందని తెలిపారు. ప్రతి గ్రామం నుండి 5 నుండి 7గురు దళిత మహిళలను విలేజ్ వుమెన్ కలెక్టివ్ (ఙఇ్పు)గా ఏర్పరచి, మండల స్థాయిలో ప్రతి గ్రామం నుండి ఒక దళిత మహిళను అదే విధంగా మండలం నుండి ఒక దళిత మహిళ చొప్పున డిస్ట్రిక్ట్ విమెన్ కలెక్టివ్ ఏర్పరిచి అదే విధంగా స్టేట్‌లెవల్ కలెక్టివ్‌ను ఏర్పరచినామని వారు వారి స్థాయిలో సమస్యను గుర్తించి దాన్ని పరిష్కరించుకొనే విధంగా శిక్షణ ఇచ్చామని అన్నారు.
మహిళలు, బాలికలపై జరుగుతున్న హింసను, గ్రామాల్లో, షోషల్ వెల్ఫేర్ హస్టల్స్లో, గవర్నమెంట్ స్కూళ్ళలో మరియు అంగన్వాడి కేంద్రాల్లో హింస జరిగిన ప్రాంతానికి వెళ్ళి నిజానిజాలు కనుక్కొని, ఎఫ్.ఐ.ఆర్ రిజిస్టర్ చేసి జడ్జిమెంట్ వచ్చే వరకు ఉండే ఇబ్బందులను పంచుకున్నారు. ఇలాంటి ఇబ్బందులను అనుభవ పూర్వకంగా గుర్తించి సంబంధిత అధికారులకు తెలియ జెప్తామన్నారు. చిన్న పిల్లలు అత్యాచారాలకు గురైనపుడు వారి అబార్షన్ కొరకై అంగీకారం కోసం ఎంతో శ్రమించాల్సి వస్తుందని, విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటి సభ్యత్వం ఉన్నందున ఎందరికో న్యాయం అందించగలిగామని అన్నారు. ప్రతి సంవత్సరం ‘రధయాత్ర’ పేరిట 10 రోజులు దళిత మహిళల కొరకు దళిత మహిళలలో ఒక కాంపెయిన్ నిర్వహిస్తున్నా మన్నారు. అలాగే జిల్లా మరియు రాష్ట్రస్థాయిల్లో రౌండ్‌టేబుల్ కాన్ఫరెన్స్, పబ్లిక్ హియరింగ్ నిర్వహిస్తున్నామని ఇందులో ప్రభుత్వ ఉద్యోగులను కూడా ఆహ్వానిస్తామని అన్నారు. ప్రజలు మీడియా సమక్షంలో ప్రభుత్వోద్యోగులు హింసకు గురైనవారు తమ బాధను తెలియజేస్తారని చెప్పారు.
తరువాత అన్వేషి సంస్థ నుండి శ్యామల మరియు సుజాత గార్లు దళిత మహిళలపై గృహహింస అనే విషయమై వారు చేసిన ఒక రీసెర్చ్ గురించి తెలిపారు. దళిత స్త్రీలు ఇళ్ళల్లో పని చేసుకుంటూ పొలం పనులలో భర్తలకు సహాయం అందించడం వల్ల వారికి ఇంట్లో, బయట పని భారం పెరుగుతుందని అన్నారు. అలాగే వారి పిల్లలపై ఇంటిపనుల భారం వేసి చదివించలేకపోతున్నారని, సంక్షేమ హాస్టళ్ళలో పాఠశాలల్లో వారు ఎదుర్కొంటున్న హింసను తెలిపారు. శుభ్రత పనులు, ఇతర పనులు దళిత బాలికలతో చేయిస్తున్నా రన్నారు. ఇవన్ని ఒక ఎత్తుకాగా గ్రామాలలో కూడా మద్యం విచ్చలవిడిగా లభించడం వల్ల దళిత మహిళలు మద్యం కోసం డబ్బులు ఇవ్వనం దున, ఇచ్చిన తరువాత మద్యం మత్తులో రెండు రకాలుగా హింసను ఎదుర్కొంటున్నారు. పంటలు సరిగా పండక నగరాలకు వలస వస్తున్న ఎంతో మంది దళిత మహిళలు నగరాలలో కొత్త రకంగా హింసకు గురవుతున్నారని అన్నారు.
తరువాత సుజాత మాట్లాడుతూ దళిత మహిళలపై హింస, తరువాత వారు ఎదుర్కొంటున్న సమస్యల గురించి వివరించారు. హింస జరిగిన తరువాత దళిత మహిళలు సపోర్టు సెంటరుకు వెళ్ళినపుడు వారికి సరియైన ఫాలో అప్ ఉండటం లేదని, పోలీస్ స్టేషన్‌కు వెళితే పరిస్థితి ఇంకా దుర్బలంగా ఉంటుందని వివరించారు. సమాజంలో వారికి రాజ్యంగపరంగా సమాన హక్కులు ఉన్నప్పటికి ఇంకా వారిని వ్యక్తులుగా కాకుండా వస్తువులుగానే చూస్తున్నారన్నారు.
తరువాత ఆశ్రయ్ నుండి గ్రేస్ నిర్మల గారు జోగిని వ్యవస్థను గురించి మాట్లాడారు. దేవదాసి వ్యవస్థను ప్రభుత్వం రద్దు చేసి చట్టం చేసినప్పటికి ఎన్నో జిల్లాల్లో ఇంకా ఉందని పగటిపూట వారిని అంటరానివారిగా చూస్తూ రాత్రిళ్ళు మాత్రం అగ్రజాతి వారు వారిని తమ విలాస వస్తువుగా వాడుకుంటారని అన్నారు. వారికి రేషన్ కార్డులు, ఓటరు కార్డులు, పాస్‌పోర్ట్, పెన్షన్, కనీస గృహవసతిలాంటి సౌకర్యాలకు మాత్రం అర్హత లేదని అన్నారు. వారి కోసం ప్రత్యేకమైన కాలనీలు ఉన్నప్పటికిని, అవి ఊరికి దూరంగా సరియైన కనీస వసతులు లేకుండా కేవలం వ్యభిచార గృహలుగా ఉన్నాయని అన్నారు. వీరికి అందరికి ఉండే ప్రభుత్వ పథకాలకు కూడా అర్హత లేదని అన్నారు. ఈ వ్యవస్థను సమూలంగా నిర్మూలించడానికి మీడియా అడ్వకసి, కమ్యూనిటి మొబిలైజేషన్, సిబివోని బలపరిచి సిఎస్ఒలను నెట్వర్క్చేసి, ప్రభుత్వ పథకాలను అనుసంధాన పరిచి పథకాలను ఏర్పరచాలి. ఆశ్రయ్ జోగిని స్త్రీల పిల్లల విషయంపై పనిచేస్తుంది. తండ్రిపేరు చెప్పలేని కారణంగా వారికి ఎన్నో ఇబ్బందులు ఎదురైనప్పుడు దీనిపై ఒక జి.ఓ.ను (ఖ.ఐ.శ్రీళి. 139) తేవటంలో ముఖ్యపాత్ర పోషించగలి గాము. ఈ జి.వో వల్ల జోగిని పిల్లల తండ్రులను గురించి ఎవరు అడగరాదు.
తరువాత షాహీన్ నుండి జమీలా నిషాత్ గారు పాతబస్తీలో నివసించే ముస్లిం దళితులు మరియు రాజస్థాన్ నుండి వలస వచ్చిన పారిశుధ్య కార్మికుల జీవనస్థితులు గురించి చెప్పారు. రాజస్థాన్ నుండి వలస వచ్చిన ఈ దళితజాతిలో కూడా ‘పరదా’ పద్దతి ఉంటుందని వీరిలో స్త్రీలే మరుగుదొడ్లను శుభ్రపరిచే పని చేస్తుంటారని పురుషులు ఈ పని చేయరని స్త్రీలు అభ్యంతర పెడితే వారిని హింసిస్తారని అన్నారు. ఈ పద్దతి అత్తల నుండి కోడళ్ళకు వారసత్వంగా వస్తుందని అన్నారు. వీరి యొక్క చలనాన్ని పురుషులే నియంత్రిస్తుంటారు. వారిలో కొందరు స్త్రీలు చార్మినార్ ప్రాంతంలో ఉన్నప్పటికి చార్మినార్ ను ఇప్పటికీ చూడలేదన్నారు. వీరు వేరే జాతివారితోగాని చుట్టు పక్కల వారితోగాని కనీస పరిచయ సంబంధాలు కూడా పెట్టుకోవడా నికి వీలు లేని స్థితిలో ఉన్నారు. వీరి జీవితంలో ఆశా రేఖలు నింపడానికి షాహిన్ పనిచేస్తుందని జమీలగారు అన్నారు. షాహీన్ కు వచ్చి పరిచయాలు పెంచుకొని మాట్లాడే సౌకర్యాన్ని కల్పించామని, బాల్య వివాహాలను నిరోధించి. బహుభార్యత్వాన్ని కూడా కొంతవరకు ఆపడానికి ప్రయత్నిస్తున్నట్టు తెలిపారు. వారిలో ఈ వృత్తి పట్ల ఆసక్తిలేని వారికి మెహందీ డిజైనింగ్ నేర్పుతున్నామని అన్నారు. ఈ వసతులన్ని ముస్లిం దళితులకు కూడా కల్పిస్తున్నట్టు తెలిపారు.
సిడబ్ల్యుఎస్ నుండి ఆశ మాట్లాడుతూ ఎంతోమంది దళిత వాడల్లో త్రాగునీరు, పరిశుభ్రత మరియు మరుగుదొడ్ల సౌకర్యాలు లేక ఇబ్బంది పడుతున్నారని అన్నారు. వీటిని పెంచడానికి ప్రభుత్వ పథకాలు ఉన్నప్పటికి దళిత వాడల పట్ల ఎంతో చిన్న చూపు ఉండి వారికి ఈ సౌకర్యాలు అందడం లేదని అన్నారు. ఈ సౌకర్యాలు సరిగా లేనందున ఎంతోమంది బాలికలు పాఠశాలలకు వెళ్ళడానికి విముఖత చూపుతున్నారని అన్నారు. విధిగా ప్రతి పాఠశాలలో ఈ సౌకర్యాలను కల్పించాలని అన్నారు.
సత్యవతి భూమిక వుమెన్స్ కలెక్టివ్ గురించి మాట్లాడుతూ హెల్ప్‌లైన్ ఏర్పాటుచేసి దాని ద్వారా ఎంతోమంది మహిళల అందుబాటులోకు ఉంటూ ఎన్నో సమస్యలను పరిష్కరించగలిగా మని అన్నారు. ముఖ్యంగా గృహ హింస బాధితులకు సహయపడిన విధానాన్ని వివరించారు. హెల్ప్‌లైన్ ద్వారా ఎంతో మందికి గృహ హింస చట్టం గురించి తెలియజేయగలిగామని, షెల్టర్ హోమ్స్ ఉనికిని, పనితీరును మెరుగుపరిచామని, కౌన్సిలింగ్ సెంటర్లలో పనిచేసే కౌన్సిలర్లకు ఇచ్చే జీతాన్ని 19,000 పెంచేలా, వారి జీతాల బకాయిలు ఇప్పించగలిగామని అదే విధంగా పి.ఓ.లకు రక్షణగా ప్రతీ ప్రొటెక్షన్ ఆఫీసులో ఇద్దరు హోమ్ గార్డ్స్‌ను ఏర్పాటు చేయించగలిగామని, అదే విధంగా పోలీస్, న్యాయ శాఖలో ఈ చట్టం పై అవగాహనను కల్పించడానికి ట్రైనింగ్ కార్యక్రమాలు ఏర్పాటు చేసామని చెప్పారు. జిల్లా న్యాయ స్థానాల్లో వారంలో ఒక రోజు గృహ హింస కేసుల పరిష్కారం కొరకు కేటాయించేలా చేసా మని, చట్టం అమలులోని లోటు పాటులను ప్రభుత్వానికి తెలియ చేస్తూ, గృహ హింస చట్టం అమలు కోసం తాను పని చేస్తున్నమని చెప్పారు.
తరువాత సంధానకర్తగా వ్యవహరించిన నందగోపాల్ గారు వివిధ సంస్థలు దళిత స్త్రీలపై హింస నివారణకు చేస్తున్న కార్యక్రమాలను అభినందిస్తూ. హింస నివారణకు ఈ వర్క్‌షాప్ ద్వారా నేర్చుకున్న విషయాలను, చట్టాన్ని మెరుగుపరచడానికి ఏవైనా సూచనలు చేయవలసిందిగా కోరారు. సభ్యులందరు ఐదు గ్రూపులుగా ఏర్పడి సూచనలు చేసారు. ముఖ్యంగా, గృహహింస చట్టం దళిత మహిళల అంశాలపై ప్రత్యేకంగా పనిచేయాలని, గృహహింస చట్టం ప్రచారంలో ప్రత్యేకంగా దళిత మహిళలకు అవగాహన కల్పించడానికి కృషి చేయాలని, చట్టాన్ని రచ్చబండ లాంటి కార్యక్రమాలలో భాగంగా చేయాలి. గ్రామ స్థాయిలో పాలన వ్యవస్థలో ఉన్న వారికి దళిత చట్టాలు, గృహహింస చట్టంపై అవగాహన కల్పించాలి. దళిత బాలికల చదువును ప్రోత్సహించడానికి, ప్రభుత్వ పాఠశాలల్లో త్రాగునీరు, పౌష్ఠికాహారం, మరుగుదొడ్లు వంటి సౌకర్యాలను ఖచ్చితంగా కల్పించాలి. దళిత మహిళలకు ప్రత్యేకంగా ఒక హెల్ఫ్‌లైన్ ఏర్పాటు చేయాలి అని ఆన్నారు.
సోషల్ వెల్ఫేర్ హస్ట్ళ్ళను మెరుగుపరచి వాటిని సమీక్షిస్తూ ఉండాలి. డివిజన్ స్థాయిలో విలేజ్ కమిటీ మీటింగులు ఖచ్చితంగా నిర్వహించాలి. సాంఘిక సమానత్వాన్ని చిన్నప్పటి నుండే దళిత బాలికలకు బోధించాలి. దళిత వాడలను గ్రామానికి దూరంగా ఉంచకుండా గ్రామాల్లో కలిపే విధంగా ఉంచాలి. దళిత మహిళల కొరకై ఏర్పాటు చేసే కమిటీల్లో విధిగా దళిత మహిళలకు భాగస్వామ్యం కల్పించాలి. ఎన్‌జిఒలకు ఇలాంటి అవగాహన అవకాశాలు కల్పించాలి. దేవదాసి వ్యవస్థ నిర్మూలనకు చట్టం ఉన్నప్పటికి సరియైన మార్గదర్శకాలను రూపొందించలేదు. వెంటనే వాటిని రూపొందించాలి.
తరువాత నందగోపాల్ గారి ఆధ్వర్యంలో ఝాన్సీ, అమల్ చార్లెస్, గ్రేస్ నిర్మల, సత్యవతి, విజయ మరియు శివకుమారి సభ్యులుగా కమిటీని ఏర్పరచడం జరిగింది. ఈ కమిటి దళిత మహిళలపై హింస నిర్మూలనకు తీసుకొనే చర్యల గురించి ఆలోచించి ప్రతి ఒక్కరిని భాగస్వాములను చేసుకొని కొత్త కార్యక్రమాలను ఏర్పాటు చేయాలి. అదేవిధంగా ఈ కార్యక్రమంలోని సూచనలను డిమాండ్లను ప్రభుత్వానికి అందజేయాలి అని నిర్ణయించారు. దీనికి ఝాన్సీ గారిని నాయకత్వం వహించాల్సిందిగా కోరుతూ అందరికి ధన్యవాదాలు తెలుపుతూ సత్యవతి సభను ముగించారు.