జూపాక సుభద్ర
నవంబర్ నెలంటే అమరుల నెలగానే చెప్పొచ్చు. చాలామంది విప్లవకారులు విప్లవకారిణులు యిదే నెలలో చంపబడిండ్రు. యీ కాలంలో రైతులు, కూలీలు పంటల పనిలో వూపిరాడని శ్రమలో వుంటరు. ఇన్ఫార్మర్లు యిదే సందుగా పట్టించి పైసలు సంపాయించుకుదామను కునే కారణాలేగాక పోలీసులు వాల్లను రకరకాల నిర్బంధాల పాలుజేసి వత్తిడి చేసి విప్లవంలో, ఉద్యమాల్లో పనిచేసే వాల్లను చంపేసిండ్రు. అయితే అమరవీరుల సంస్మరణేగాని అమరవీర నారీమణుల సంస్మరణేది యిప్పటి దాకా జరగలే. చాలా మంది ఉద్యమ మహిళలు ఎన్‌కౌంటర్లలో చచ్చిపోయిండ్రు. కాని వారి స్మృతి విప్లవ పితృస్వామ్యానికి విస్మృతే కావడం విషాదం. జెండర్ వివక్షలుండని సమాన అవకాశాలుంటే సమస్యలుండే సమాజం కోసం విప్లవము అనే సిద్దాంతీక రణలు అచరణలో అమలు కానందువల్లనే అమరవీరమణుల సంస్మరణలు కనబడవేమో!
ఉద్యమాల్లో మహిళల భాగస్వామ్యం, గుర్తింపులు విప్లవ శక్తులు కూడా విస్మరించి విషయాన్ని స్త్రీ శక్తి సంఘటన వాల్లు ‘మనకు తెలియని మన చరిత్ర’ 1986లోనే తీసి పెద్ద చర్చ లేవదీసినారు. దాంట్లో కూడా దళిత, ఆదివాసీ మహిళల చరిత్రలు విస్మరణకు గురికాబడింది అందికో సంగతి. అయినా ఒక దిద్దుబాటు జరగలే యిప్పటి దాకా విప్లవశక్తుల్నించి, ఉద్యమ శక్తుల్ని ంచి. అన్ని ఉద్యమాల్లో సగం ప్రపంచం విస్మరణకు గురికాబడుతుంది యింకా.
కాని యీ మధ్య రంగవల్లి సంస్మరణ సభ జరగడం, ఆమె జీవితాన్ని ఆమె ఉద్యమ చైతన్యాల్ని చర్చించుకోవడం, మాట్లాడు కోవడం, ఒక పుస్తకం కూడా తీసుకురావడం ఒక కొత్త పరిణామం.
రంగవల్లి పాలక కులం నుండి వచ్చిన సంపన్న బిడ్డ. అగ్రకుల దోపిడి కులం నుంచి వచ్చినా మా గూడెల కొచ్చింది, మ తండాల్లో కొచ్చింది. ఆమె సంపన్న సుఖాలను, సౌఖ్యాల్ని వదిలి కొత్త సమాజానికి తనవంతుగా పీడితులను ‘విముక్తి’ చేయడానికి వచ్చిన ఒక మంచి, గొప్ప మహిళ. ఆమె చాలా నిజాయితీగా మాననీయంగా వుండేది. మనుషుల్ని అందులో దళితుల్ని, ఆదివాసీలపై ప్రత్యేకమైన మానవత్వాల్ని కనబర్చేది.
ఆమె ఆచరణ చాలా ఆదర్శంగా వుండేది. నేను చాలా మంది అగ్రకులాల ఉద్యమ మహిళల్ని చూసిన, వాల్లతో కల్సి పని చేసిన. వాల్ల అమానవీయత, హిపోక్రసి అనుభవాలే ఎక్కువున్నాయి నాకు. వాల్లిండ్లకు బోతే ఒక అగ్రకుల మహిళా కామ్రెడ్ ‘టాయిలెట్ కెల్లాలంటే నాల్లపనోల్ల్ల కోస మున్న బైటెక్కడో వెనక చివరన వున్న టాయిలెట్ చూయించింది. అది పబ్లిక్ టాయిలెట్స్ కన్నా నరకంగా వుంటే దడుసుకొని బైటకు రావాల్సి వచ్చింది. అట్లాంటి ట్రీట్‌మెంట్స్ వుంటయి సాటి కామ్రెడ్ పట్ల యీ మహిళలకు. మాటలో, ప్రవర్తనలో దూరముంచడం అవమానిం చడం చేయడం (ప్రతక్ష, పరోక్ష) చాలానే ఎదుర్కున్నరు దళిత ఆదివాసీ మహిళలు. కాని వీల్లందరికంటే రంగవల్లి కొంత మినహాయింపనే చెప్పాలి.
ఆమె ఒక బీసీ కులం విప్లవకారున్ని జీవిత భాగస్వామిగా ఎన్నుకుంది. ఆమె బాధితుల పట్ల నర్సుగా వ్యవహరించేది. తన దగ్గెర దగ్గు, జ్వరం, కడుపు నొప్పి, తలనొప్పి లాంటి చిన్న చిన్న రుగ్మతలకు మందులు, టాబ్లెట్లు వుంచేది. ఆమెను చూసినంక ‘రక్త సంబంధం కంటే వర్గ సంబంధం గొప్పది’ అనే విషయం కొంచెం సేపు నిజమేననిపించేది.
సమానత్వం, సమానన్యాయాలు అని విప్లవీకరించే సమూహాలు, సంగాల్లో కూడా మహిళా నాయకత్వాల్లేవు ఎందుకు? విద్యార్ధి, రైతుకూలి, కార్మిక సంగాల్లో కూడా మహిళా నాయకత్వాల్లేవు ఎందుకు? విద్యార్థి, రైతుకూలి, కార్మిక సంగాల్లో కూడా మగ నాయకత్వాలే వుండడం పట్ల మాకున్న అసహనాలకు, వ్యతిరేకాలకు తోడుగా, వెన్నుదన్నుగా అగ్రకులాల మహిళలు (రంగ వల్లితో సహా) కూడా వుంటే బాగుండను కునేది. కాని మాకా తోడ్పాటు, మా గొంతులకు గొంతుకలిపే స్వరాలే మాచెంతకు రాలే. అంతా మౌనమే, అప్రకటిత సెన్సార్లే ఫేస్ చేసేది దళిత మహిళలు.
రంగవల్లితోపాటు పోలీసులు అనిత అనే లంబాడోల్ల అమ్మాయి, యిద్దరు అబ్బాయిల్ని కూడా పోలీసులు 1999 నవంబర్ 11న కాల్చి చంపిండ్రు. రంగవల్లి సంస్మరణలో వేసిన పుస్తకంలో రంగవల్లితోపాటు ఎన్‌కౌంటర్ చేయబడిన అనిత గురించి యాదులు కూడా పొందు పరిస్తే బాగుండు. 14 సం||లు అయింది రంగవల్లి అమరత్వం పొంది. యిప్పటికైనా ఆమె యాదుల్తో పుస్తకం తీసుకొచ్చే దానికి రంగవల్లి అంటే ఒక దర్పం చూయించని, హిపోక్రసీలేని, సేవాభావం మానవీయమైన ప్రేమలున్న గొప్ప విప్లవకారిణి. రంగవల్లి యాదులంటే మొదటిసారి నన్ను ఒక వూరేగింపుల గట్టిగా చుట్టేసిన ప్రేమ స్పర్శ, ఉన్నపలంగా హాస్టల్ నుంచి హైద్రాబాద్ మీటింగులకొస్తే చెద్దర్లు లేక తన చీరల్ని రెండు మడ్తలేసి కప్పిన రంగవల్లి వెచ్చటి చలి యాదులు మెడలో యింకా పదిలమే.