జెండర్ ఆధారిత హింసకు వ్యతిరేకంగా 16 రోజుల క్రియాశీల కార్యక్రమంలో భాగంగా ఈసారి భూమిక ఉమెన్స్ కలెక్టివ్ స్కూల్స్, కాలేజీలలోని విద్యార్ధులకు అవగాహనా కార్యక్రమాలు నిర్వహించింది. ఈ సమయంలోనే బంజారా హిల్స్ జి.వి.కె. ఒన్ మాల్‌లోని షాపర్స్ స్టాప్ వారు భూమికు ఫోన్ చేసి ”మా స్టాఫ్‌కు స్త్రీల భద్రత, స్త్రీల చట్టాల’పై అవగాహన కల్పించగల్గుతారా అని అడిగారు. ఇలాంటి గ్రూపును చేరటానికి, మంచి అవకాశం వచ్చిందని వెంటనే సరేనన్నాము.
డిసెంబర్ 5వ తేదీ నాడు కె.సత్యవతి, భూమిక స్టాఫ్ కలిసి షాపర్స్ స్టాపుకు వెళ్లాం. మీటింగ్‌కి వచ్చిన అమ్మాయిలందరూ చక్కగా ఎక్సలేటర్లపై కూర్చొన్నారు. వారికి మీటింగ్ హాల్ సౌకర్యం లేక ఈ విధంగా ఏర్పాటు చేసామన్నారు. మొదటగా పరిచయం చేసుకొని, భూమిక హెల్ప్‌లైన్, సపోర్ట్ సెంటర్స్ గురించి వీటి ద్వారా నిర్వహిస్తున్న కార్యక్రమాల గురించి సత్యవతి గారు వివరించారు. తీసుకెళ్ళిన పాంప్లెట్స్, హెల్ప్‌లైన్ మెటీరియల్ అందరికీ ఇచ్చాం. తరువాత వారికి 16 రోజుల క్రియాశీల కార్యక్రమం ఎందుకు చేసుకుంటున్నాం, మీరాబెల్ సిస్టర్స్ వృత్తాంతం గురించి వివరిస్తూ ప్రస్తుత కాలంలో అమ్మాయిలు, స్త్రీలపై జరుగుతున్న లైంగిక దాడులకు, హింసలకు, వాటికి కారణాలు, సమాజంలో వస్తున్న మార్పులు మన ఆలోచనా ధోరణి, ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలు, చట్టాల గురించి వివరించారు. ముఖ్యంగా నిర్భయ కేసు గురించి చర్చిస్తున్నప్పుడు పాల్గొన్న వారందరూ దాదాపుగా స్పందించి ఇలాంటి వాటిని అందరూ ఎదిరించాలన్నారు.
ఎవరికైనా ఇలాంటి సంఘటనలు ఎదురైనపుడు, వాటిని ఎదిరించడం, ఆపడం ప్రతి ఒక్కరి బాధ్యతగా గుర్తించాలన్నారు. పని చేసే చోట లైంగిక వేధింపుల నివారణ చట్టం గురించి చర్చించినపుడు వారికి ఎలాంటి సంఘటనలు ఎదురువలేదని అన్నారు. అదే విధంగా వారి మేనేజ్‌మెంట్ వారికి కావలసిన సదుపాయాలను కల్పిస్తున్నారన్నారు. గత నెలలో వారికి సెల్ఫ్ డిఫెన్స్ టెక్నిక్స్‌పై ఒక సెషన్ కూడా నిర్వహించారని అలాగే ఈ చట్టం ప్రకారం ఏర్పాట చేసుకోవలసిన అంతర్గత కంప్లయింట్స్ కమిటీ, అందులోని సభ్యుల ఎంపిక, వారి విధి విధానాలను వివరించడం జరిగింది. ఈ సెషన్ 50-60 మంది అమ్మాయిలతో మొదలయి నప్పుటికీ మధ్యలో అబ్బాయిలు కూడా రావటం వల్ల మొత్తంగా 150 మంది ఉద్యోగులకు ఈ సమాచారాన్ని అందించగలిగాం. యాజమాన్యంవారికి ఈ కార్యక్రమం నిర్వహణ పట్ల వారి ఆలోచన, ఉత్సాహాన్ని అభినందిస్తూ కృతజ్ఞతలు తెలిపాము.
యాజమాన్యం వారు మాట్లాడుతూ ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం వారి ఉద్యోగులకు చాలా అవసరమని మొత్తంగా 400 మంది ఉద్యోగులు 2 షిఫ్ట్స్‌లో పని చేస్తున్నారని. వీరందరికీ ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించి వారి సమాచార స్థాయిలను, తద్వారా వారిలోని ఆత్మస్థైర్యం పెంపొందించడం ద్వారా వారు ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేలా చేయవలసిన అవసరం ఉందన్నారు. ఇదే కాకుండా వారికి మెయిన్ బ్రాంచ్ బేగంపేట, కూకటట్‌పల్లిలో బ్రాంచ్‌లు ఉన్నాయని అందులో చాలా మంది పని చేస్తున్నారు, వారికి కూడా ఇలాంటి అవగాహన కల్పించాలని, దానికి సత్యవతి గారు రావాలని వారు కోరారు.
ఇలాంటి గ్రూప్‌కు కార్యక్రమం చెయ్యడం మాకు బాగా అనిపించింది. ఎందుకంటే వీరందరూ కూడా 10వ తరగతి, ఇంటర్మీడియట్, డిగ్రీలు ముగించుకొని వెంటనే ఉద్యోగాలలో చేరిన వారున్నారు. అందులోను వారు పని చేసి తిరిగి ఇంటికి వెళ్లే సమయాలు, బస్సులలో ప్రయాణాలను చూసినట్లయితే ఇలాంటి కార్యక్రమాలు ఎక్కువగా నిర్వహించి, వారికి చట్టాల పట్ల అవగాహన, సమాచారం కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.