– జూపాక సుభద్ర
‘యీ ఆఫీసు మాదే యీ పరిసరాలు మావే బైటి రౌడీలు వస్తే వూరుకునేది లేదు’ అని బెదిరిస్తూ.. తెలంగాణ బిల్లు ప్రతుల్ని చించేసి, కాల్చేసి కిందేసి తొక్కిన సచివాలయ సీమాంధ్ర ఉద్యోగుల్ని అడ్డుకునే తెలంగాణ ఉద్యోగ శక్తులే సచివాలయంలో లేకపోవడం ఒక విషాదం. బిల్లు చించివేత సెక్రెటేరియట్ నుంచి అసెంబ్లీ దాక సాగింది.
తెలంగాణ వాల్లకు తెలంగాణ బిల్లు చాలా అపురూపం. ఆ బిల్లులో అరవైండ్ల ఉద్యమ ఆకాంక్షలున్నయి, తెలంగాణ బిడ్డల ప్రాణత్యాగాలున్నయి. ఉస్మానియ విద్యార్ధు లు తమ భవిష్యత్‌ని, ప్రాణాలను పణంగా బెట్టిన యుద్ధ భూములున్నయి, పోరాటాల పొలికేకలున్నయి. యావత్ తెలంగాణ ఏకకంఠంగా ఎలుగెత్తిన నినాదాలున్నయి. నాలుగు కోట్ల ప్రజల ఆకాంక్ష సాకారమయే ఎదురుచూసిన ఉదయం తెలంగాణ బిల్లు.
మా గడ్డ మీన్నే మమ్మల్ని రౌడీలను చేస్తున్న దుర్మార్గం. మూడు, నాలుగు తరాలు యిదే సచివాలయంలో సీమాంధ్ర ఉద్యోగులు, తెలంగాణ ఉద్యోగులు కల్సి పంజేస్తున్నా సీమాంధ్రులు కడుపులో కత్తులు బెట్టుకునే వున్నారనేది మొన్న తెలంగాణ బిల్లు పట్ల వీరు ప్రదర్శించిన దుశ్చర్యే చెప్తుంది. ఎన్ని అవమానాలకు, అన్యాయాలకు వివక్షలకు గురయినా కల్సిమెల్సి వున్నం, స్నేహాలు పంచుకున్నమ్, రాష్ట్రాలుగా వేరైతే వీల్లంతా దూరమైతారని సచివాలయ తెలంగాణ బిల్లు ప్రతిని చించేయడం, తగల బెట్టడం, కసిగా కాళ్లకిందేసి తొక్కడం ఎంత అమానుషం? సాటి తెలంగాణ ఉద్యోగులపట్ల కనీస మానవ మర్యాదలు కూడా పాటించకుండా, సౌహార్ద్రత చూపించకుండా, సహానుభూతి లేకుండా పక్కలో బల్లెంగా సచివాలయంలో సీమాంధ్ర ఉద్యోగులున్నారు.
వాల్ల ప్రతీఘాతుకమైన యిట్లాంటి దుశ్చర్యల్ని నిరసించి నిలువరించే స్థితి సచివాలయంలో తెలంగాణ ఉద్యోగులకు లేకపోవడం విచారించదగ్గ విషయం.
సచివాలయ సీమాంధ్ర ఉద్యోగులు రాజకీయ నాయకులకన్నా కౄరంగా తెలంగాణ ఉద్యోగులపట్ల ప్రదర్శిస్తున్నరు. రెచ్చగొట్టే మాటలు, చర్యలు రోజు రోజుకు శృతిమించుతున్నయి. వాటిని పకడ్బందిగా ఎదుర్కొనే తెలంగాణ నాయకత్వం వెలమ, రెడ్డిగా చీలి ఉద్యోగుల్ని కూడా చీల్చి తమ అదుపాజ్ఞల్లో పెట్టుకున్నది. సచివాలయం లోనే సీమాంధ్రులు తెలంగాణకు అమూల్య మైన, అపురూపంగా గౌరవించుతున్న బిల్లును అగౌరవపరచి అవమానిస్తూ రేపు ఆప్షన్స్ బెట్టి తెలంగాణలో ఎట్లా వుండగలరు. 60 సం||నుంచి యీ గడ్డమీద చల్లచల్లగా పచ్చ పచ్చగా బతికినమనే కృతజ్ఞత, బతకని చ్చారనే స్నేహభావం లేక యిన్నాల్లు స్నేహాన్ని పంచిన సాటి తెలంగాణ ఉద్యోగుల్ని గాయ పరచడం ఎంత వికృతమైన చర్యనో ఆత్మ విమర్శ చేసుకోవాలి వాల్లు.
రాజ్యాలు విడిపోనీయ్ మనుషులుగా ప్రజలు కలిసివుండాలి. రాజకీయ నాయకు లను తలదన్నేట్లుగా సచివాలయ సీమాంధ్ర ఉద్యోగులు ప్రవర్తిస్తున్నరు. మావల్లనే మీరు నాగరికం నేర్చుకున్నారు, మేము స్కూల్స్, కాలేజీలు బెట్టి విద్య నేర్పినం, హాస్పిటల్స్ బెట్టి ఆరోగ్యాల్నిస్తే మీరు మామీదికి యిప్పుడు ఏకు మేకై మమ్మల్ని వెల్లగొట్టే బిల్లులు తెస్తారా! అని కరుస్తున్నరు. ఎడా పెడా అరుస్తున్నరు. శత్రువులుగా గుడ్లురిమి చూస్తున్నరు. మాటలు బందయినయి. గోడలు పెంచు కున్నరు. మాటల్లేవ్, పలకరింపుల్లేవ్.
కాని యివన్ని ఒక ఎత్తు. వీటన్నింటిని భరించిండ్రు మౌనంగా తెలంగాణ ఉద్యోగు లు. కాని తెలంగాణకు ప్రాణప్రదమైన బిల్లును చించడం, కాళ్లకిందేసి తొక్కడాన్ని మాత్రం తట్టుకోలేకపోతుండ్రు. యింత జరిగినా సచివా లయ తెలంగాణ ఉద్యోగ నాయకత్వానికి చీమ కుట్టిన బాద కూడా లేనట్టుంది. వుంటే సీమాంధ్రులట్లా చేసిందానికి సచివాలయాన్ని గాయి గాయి చేయాల్సింది. నిరసన ప్రదర్శ నలు చేసి జరిగిందానికి క్షమాపణలు కంప్లెయింట్స్ యిచ్చి సక్కగ జేయాల్సి వుండె. అవేవి జరగలేదంటే సెక్రెటేరియట్‌లో సీమాంధ్రుల ఆధిపత్యాలు అహంకారాలు, దొమ్మీలు ఎట్లా రాజ్యమేల్తున్నాయోననేది ఒకటైతే యింకోదిక్కు వున్న పిడికెడు మంది సచివాలయ తెలంగాణ ఉద్యోగులు వెలమ, రెడ్డి నాయకాధీనంలో పోటీగా వున్నరు. ఆ పోటీలో సొమ్మసిల్లి సీమాంధ్రులను నిలువరించలేకపోతున్నరు కల్సి.
విషయమేమిటంటే సెక్రెటేరియట్‌లో సీమాంధ్ర కమ్మ, రెడ్డీలు వెనకుండి నడిపిస్తున్నరు. బీసీలు, ఎస్సీలే (మహిళలు కూడా అదే సమూహం) సమైక్యాంధ్ర ఉద్యమం సచివాలయంలో నడిపిస్తున్నరు (అధి నాయకత్వ అండతో). సచివాలయంలో తెలంగాణ నాయకత్వం వెలమ రెడ్డీలుగా చీలి ఎస్సీ, బీసీ మైనారిటీ కులాలతో పాటు మహిళలను కూడా చీల్చుకోడంవల్ల సచివాలయంలో తెలంగాణ ఉద్యమం సచ్చుబడిందనే చెప్పొచ్చు. అవ్వేడ్వంగ బిడ్డేడ్సినట్లే వుంది.
యీ యాడాది జరిగినయన్ని యీ యాడాది చివర్నే ముడేద్దాం. వచ్చే కొత్త సంవత్సరంలో తెలంగాణ బిల్లుకు ఎవరు అడ్డుపడ్డా అలుగువడ్డా ఆగేదుండది. వచ్చే యేడాదైనా ఎవర్ని ఎవరు గాయపర్చుకోని ప్రజాస్వామిక విలువలకు, గౌరవాలకు స్వాగతం చెప్పుదాం.