– పి. ప్రసాదు
సర్దార్ వల్లభాయి పటేల్, మోహన్ కరమ్ చంద్ గాంధీ యిద్దరూ జాతీయోద్యమంలో సమకాలికులే! పైగా ఇద్దరూ గుజరాతీయులే! అంతేకాకుండా సమకాలీన రాజకీయరంగంలో ఇద్దరూ గురు శిష్యులు కూడా! వారిద్దరిలో ఒకరైన గాంధీ (గురువు)ని ఆర్‌ఎస్‌ఎస్ ఆర్గనైజరు నాథూరామ్ గాడ్సే 30.1.1948వ తేదీన కాల్చి చంపాడు. ఆ ఇద్దరిలోని మరొకరైన పటేల్ (శిష్యుడు) ఆనాటి ప్రభుత్వం తరపున హోమ్‌మంత్రిగా ఆర్‌ఎస్‌ఎస్ నిషేధించడంలో చొరవ తీసుకున్నాడు. ఇప్పుడు గోల్వాల్కర్ వీరాభిమాని, ఆర్‌ఎస్‌ఎస్ చరితుడైన మోడీకి హఠాత్తుగా పటేల్ మీద ప్రేమ పుట్టుకొచ్చింది. అరుదుగానైనా అప్పుడప్పుడు చరిత్రలో యిలాంటి ఆకస్మిక మార్పులు చోటు చేసుకుంటాయి. అలాంటి ‘మార్పుల’ను రాజకీయ భాషలో అవకాశవాద ఫిరాయింపులంటారు. ఈ తరహా ‘మార్పు’ను తెచ్చే రాజకీయ ప్రక్రియకి నేడు మోడీ ఓ ప్రతీక (సింబల్)గా నిలుస్తాడు.
చారిత్రిక పాత్రలను తారుమారు చేసిన చరిత్ర మోడీతో ప్రారంభం కాలేదు. ఇది మోడీతో ముగిసేది కూడా కాదు. రెండు వేల ఏండ్ల క్రితం ఏసుక్రీస్తు పోషించిన చారిత్రక పాత్ర తెల్సిందే! రోమ్ సామ్రాజ్యంలో బానిసత్వపాలనపై తిరుగుబాటు చేసిన విప్లవాత్మక పాత్ర క్రీస్తుకి వుంది. నాటి ఏసుక్రీస్తు నడివీధిలో పట్టపగలే రోమన్ పాలకులు శిలువ వేసి ఖూనీ చేశారు. అలాంటి హంతక పాలకులే తదనంతర కాలంలో ఏసుక్రీస్తును దేవుణ్ణి చేశారు. ఈ తరహా చారిత్రిక పాత్రల ఫిరాయింపులు చరిత్రలో కోకొల్లలు జరిగాయి. వాటి వారసత్వం నేటికీ కొనసాగుతూనే వుంది. అందులో ఓ నయా వారసుడు మోడీ!
చరిత్ర విధ్వంసకులు కూడా తమ విధ్వంస రాజకీయ లక్ష్యాలకి తిరిగి చరిత్రనే వుపయోగించుకుంటారు. ‘భవిష్యత్తు చరిత్ర’ను పారలతో పూడ్చి పెట్టే దుష్ట లక్ష్యంగల చరిత్ర హీనులు కూడా ‘గత చరిత్ర’ను పలుగులతో త్రవ్వితీస్తారు. హిట్లర్, ముస్సోలినీ వంటి ఫాసిస్టు నియంతలు అలా తమ దేశాల పాత చరిత్రలను త్రవ్వితీసిన వాళ్ళే! ఇటలీ జాతిపితలైన గారీ బాల్డీ, మాజ్జినీల ఉజ్వల చరిత్రలను తన దుష్టలక్ష్యాలకి ముస్సోలినీ వినియోగించుకున్నాడు. జర్మన్ తత్వవేత్త గోథే మరియు మత సంస్కరణ వాది మార్టిన్ లూథర్‌లతో పాటు ఆధునిక యుగంలో జర్మన్ జాతిని ఏకీకరణ చేసిన బిస్మార్క్ తదితరుల చరిత్రను తన నాజీ సామ్రాజ్య స్థాపనకి హిట్లర్ కూడా శక్తివంతంగా వినియోగించుకున్నాడు. ఇటలీ, జర్మనీ దేశాల ప్రాచీన, మధ్యయుగాల చరిత్రలోని గత పాజిటివ్ పాత్రలను తమ రేపటి నెగిటివ్ రాజకీయ లక్ష్యాలకు పైనియంతలు వినియోగించుకున్నారు. ఇప్పుడు మోడీ త్రవ్వితీస్తున్న గత చరిత్రలో పటేల్ దొరికాడు. గాంధీని హత్య చేసిన హిందుత్వ రాజకీయ సిద్ధాంతాన్ని, వర్తమాన సమాజంలో మోడీ విస్తరించదలుచుకున్నాడు. అందు కోసం గాంధీ శిష్యుడైన పటేల్‌ను తన ‘గాడ్‌ఫాదర్’గా ఎంచుకుంటున్నాడు. హిట్లర్, ముస్సోలినీల అడుగుజాడలను మోడీ ఎంచుకోవడం వెనక నిర్దిష్ట రాజకీయ లక్ష్యాలున్నాయి.
బీజేపికి అధికారం కావాలి. అధికారానికి రావాలంటే ప్రజాకర్షణ గల (పాప్యులర్) ప్రధాని అభ్యర్థి ఒకరు కావాలి. ఉదారవాద (లిబరల్) ముసుగు ధరించిన వాజ్‌పాయి ఒకప్పుడు బీజేపి అధికారానికి రావడానికి వుపయోగపడ్డాడు. ఆచరణలో వాజ్‌పాయి సర్కారు అంతకంటే ముందు పాలించిన సర్కార్లకి భిన్నమైనది కాదని రుజువైపోయింది. ఒకే రూపం మళ్ళీ మళ్ళీ బూర్జువా ‘పొలిటికల్’ మార్కెట్‌లో యథాతధంగా చెలామణీ కాదు. కాల క్రమంలో దాని గిరాకీ పడిపోతుంది. అందుకే లిబరల్ వాజ్‌పాయి స్థానంలో ఆ తర్వాత తిరిగి పిడివాద సనాతన (కాన్సర్వేటివ్) అద్వానీ రూపాన్ని బీజేపీ రంగంలోకి తెచ్చింది. అది వెలగక ముందే ఫిలమెంటు రాలిపోయింది. ఒక దశలో ‘సనాతన అద్వానీ’ని కూడా ‘ఉదారవాద అద్వానీ’గా మార్చే ఓ ప్రయత్నం జరిగింది. అందులో భాగంగా పాకిస్తాన్ జాతిపిత జిన్నాను అద్వానీ ప్రశంసించడం గమనార్హం! అయితే అట్టి ప్రయోగం సఫలం కాలేదు. పైగా వికటించింది. దీనికి తోడు వృద్ధాప్యం కూడా తోడు కావడంతో బిజెపిలో అద్వానీ శకం ముగియక తప్పలేదు. కార్పొరేటు కంపెనీలకి ఓ కొత్త నేత అవసరమైనది. ఈ నేపథ్యంలో బిజెపి ఇప్పుడు మోడీని ముందుకు తెచ్చింది. తాను అధికారానికి రావడానికి మోడీకి ముచ్చటైన ముస్తాబు చేసింది. ఈ విధంగా బీజేపీ వర్తమాన రాజకీయాధికార లక్ష్యానికి మోడీ ఓ సాధనంగా ఎంపిక కాబడ్డాడు.
స్వదేశీ, విదేశీ బడా కార్పొరేటు కంపెనీలకి ‘సుస్థిర ప్రభుత్వాలు’ కావాలి. వాటికి ఏ రంగుజెండా గద్దెనెక్కినా ఒకటే! ఏ పార్టీ ఏలుబడి చేసినా ఒకటే! కానీ తమ లాభాలు గరిష్టస్థాయిలో వర్థిల్లాలి. వాజ్‌పాయిని ఒక కాలంలో గొప్ప ఉదార రాజకీయ వేత్త (లిబరల్ పొలిటీషియన్)గా మొదట అవి పబ్లిసిటీ చేసి పెట్టాయి. తమ చెప్పు చేతుల్లోని మీడియా ద్వారా కార్పొరేటు కంపెనీలు అలాంటి ప్రచారం చేయించి తద్వారా గతంలో బీజేపిని అవి అధికారంలోకి తెచ్చాయి. అయితే త్వరలోనే ఎన్‌డిఏ సర్కారు పొలిటికల్ మార్కెట్లో తన పరపతిని కోల్పోయింది. ఆ తర్వాత మరో ‘ఉదాత్త రాజకీయ వేత్త’ను అవి కాంగ్రెస్ పార్టీలో వెదికి పట్టుకోవాల్సి వచ్చింది. అప్పుడు అవి తమ మానసపుత్రుడైన మన్మోహన్ సింగ్‌ను ఎంచుకున్నాయి. ఆయన సారథ్యంలో కాంగ్రెస్‌ను ప్రభుత్వాన్ని (యూపీఏ సర్కారు) అధికారానికి తెచ్చుకున్నాయి. దానికి చచ్చీచెడి రెండు టరమ్స్ గడిచాయి. ఇక అది కూడా ఇప్పుడు మార్కెట్లో పరపతిని కోల్పోయింది. ముఖ్యంగా అవినీతి కుంభకోణాలతో దేశ ప్రజల చేత అసహ్యించుకోబడుతున్నది.
డిటో పాత యుపిఏ సర్కారుకు కొత్త నేత రాహుల్ ద్వారా తిరిగి అధికారానికి తేవడమా? లేదంటే, పాత యూపీఏకి బదులు కొత్త బీజేపిని మోడీ ద్వారా అధికారానికి తేవడమా? ఈ రెండు ప్రశ్నలు బడా కార్పొరేటు కంపెనీలకి నేడు ఎదురయ్యాయి. ఈ నిర్ధిష్ట పరిస్థితిలో కొత్త నేత (రాహుల్) ద్వారా పాత సర్కారు (కాంగ్రెస్‌ను) తేవడం కంటే, కొత్త నేత (మోడీ) ద్వారా కొత్త సర్కారు (బీజేపీ)ను తేవడం ఎన్నికల మార్కెట్‌లో ఒకింత తేలికైనది. దానివల్ల రెండు లేదా మూడు శాతం ఓట్లు అదనంగా రాల్చే వీలుంది. అంతేకాకుండా ఇస్లామ్ తీవ్రవాద బూచితో కూడా మరో ఒకటి లేదా రెండు శాతం ఓట్లు అదనంగా పొందవచ్చు. వర్తమాన పార్లమెంటరీ రాజకీయాలలో ఈ కొద్ది శాతం పెంపుదలే అధికారాలను తారుమారు చేస్తున్నది. ఈ అవకాశాన్ని అవి వదులుకోవు. వాస్తవానికి రాహుల్ కూడా కార్పొరేటు కంపెనీల ముద్దు బిడ్డడే! అందులో ఎలాంటి సందేహం బడా కార్పొరేటు కంపెనీలకి వుండదు. అయితే ఒక ‘కొత్త’ ఒక ‘పాత’ మిశ్రమ పొందిక (కాంబినేషన్) కంటే, ‘రెండు కొత్త’ల పొందిక ఓటర్లను ఎక్కువ ప్రభావితం చేస్తుంది. అవసరమైన సమయంలో రాహుల్‌ను ఎలాగూ రిజర్వుడు ఆయుధంగా అవి భద్రపరుచుకుంటాయి. మున్ముందు బిజెపి సర్కార్ పాత చింతకాయ పచ్చడిగా ప్రజలు తిరస్కరించినపుడు తిరిగి రాహుల్‌ను వుపయోగించుకోవచ్చు. అందుకే బడా కార్పొరేటు కంపెనీలు ఈసారి యిలాంటి సులువైన మార్గాన్ని ఎంచుకునేందుకు దోహదం చేస్తుండవచ్చు.
ఇది ఎన్నికల సీజన్! మరో ఐదారు నెలల్లో జనరల్ ఎన్నికలు జరగనున్నాయి. 1992లో ‘రామజన్మభూమి వివాదం’ బీజేపి బలాన్ని అనూహ్యంగా పెంచింది. అది మందిర్ ఓట్ బ్యాంక్! కానీ క్రమంగా ‘మండల్’ నినాదం ‘మందిర్’ను వెనక్కి నెట్టింది. బడుగు, బలహీన వర్గాల ప్రజల సామాజిక చైతన్యం ఎదుట రామజన్మభూమి నినాదం చివరకు వెలవెల బోయింది. అయోధ్య పట్టణం అంతర్భాగంగా గల ఫైజ్ పూర్ శాసనసభా స్థానాన్ని కూడా ఒక దశలో బీజేపీ చేజార్చుకున్నది. అసలు సిసలైన యు.పి.ని కూడా చేజారుకున్నది. అయోధ్య వివాదం అంతిమంగా బీజేపిని బలహీన పరిచింది. పైగా అది ఎస్.పి., బీయస్‌పీలు బలపడటానికి కూడా దారి తీసింది. ఇది తదనంతర కాలంలో బీజేపిలో రాజకీయ అంతర్మథనాన్ని తీవ్రతరం చేసింది. ఈ నేపథ్యంలో ఆ తర్వాత కాలంలో ‘కన్సర్వేటివ్ అద్వానీ’కి బదులు ‘లిబరల్ నేతల’ని బీజేపి ముందుకు తేక తప్పలేదు. దళిత, వెనుకబడిన, ఆదివాసీ, మైనార్టీ ప్రజలు అధిక సంఖ్యాకు లుగా గల భారతదేశంలో రామాలయ నిర్మాణోద్యమానికి ఖచ్చి తంగా పరిమితులుంటాయి. భావోద్వేగాలు తలెత్తే కొన్ని అరుదైన సందర్భాలలో తప్ప బిజెపికి సదా లభించదు. ఇదే వాస్తవాన్ని గతం నిరూపించింది. అయినా ఇప్పుడు కలిసొచ్చిన భావోద్వేగ పరిస్థితిని కార్పోరేట్ కంపెనీలు తక్షణం చేజార్చుకోవు కదా!
చరిత్ర కొన్నిసార్లు పునరావృతమవుతుంది. ఇటీవల జాతీయంగా, అంతర్జాతీయంగా జరిగిన అనేక సమకాలీన రాజకీయ పరిణామాలవల్ల తిరిగి హిందుత్వ వాదానికి ఒకింత బలం చేకూరుతున్నది. కారణాలు ఎమైనప్పటికినీ, ఇటీవల ఇస్లామ్ తీవ్రవాదం దేశంలో పెరిగింది. అందుకు అనేక ఆర్థిక, రాజకీయ, సామాజిక నేపథ్య కారణాలున్నాయి. ప్రత్యామ్నాయ ప్రగతిశీల, ప్రజాతంత్ర, విప్లవ శక్తులు దేశంలో ఎలాగూ ఎదగలేదు. వాటికి కనీసం తక్షణ రాజకీయ పరిష్కారం వెదికే పార్లమెంటరీ ప్రజాస్వామ్య రాజకీయ నాయకత్వం కూడా నేడు దేశంలో లేదు. ఈ పరిస్థితి దొపిడీ పాలకశక్తులకి కలిసొచ్చింది. పైగా ఇస్లాము తీవ్రవాదాన్ని ఒక బూచిగా చిత్రించి హిందుత్వ శక్తుల పెరుగుదలకి ఉద్దేశ్యపూర్వకంగా, వూహాత్మకంగా బుర్జువా ప్రచార సాధనాలు పనిచేస్తున్నా. అన్ని మతాలకి చెందిన సామాన్య ప్రజలను కొల్లగొడుతున్న ప్రపంచీకరణ విధానాలను పెట్టే కుట్ర అందులో దాగి వుంది. ప్రజల అసంతృప్తిని ప్రజా శత్రువులైనా పాలక వరాలపైకి, కార్పొరేటు వ్యవస్థల మీదికి మళ్ళనివ్వకుండా పన్నిన పన్నాగమిది. ఈ కారణంగా కన్సరేటివ్ హిందుత్వ రాజకీయ శక్తులకు సహజంగా డిమాండ్ పెరుగుతున్నది. ఈ నేపథ్య పరిస్థితుల్లో బడా కార్పొరేటు కంపెనీల అవసరాల కోసం రాజకీయ రంగంలో ముందుకొచ్చిన ప్రధాని అభ్యర్థే ‘మోడీ’!
మోడీ ఇటు రాజకీయంగా బీజేపికి కావాలి. అటు వాణిజ్యప రంగా కార్పోరేటు కంపెనీలకి కావాలి. అయితే మోడీకి కావాల్సినవి కూడా కొన్ని వున్నాయి. తన పార్టీని అధికారంలోకి తేవడం కోసం ఓటర్లను ఉత్తేజితులను చేయగలిగే రాజకీయ అస్త్రం మోడీకి కావాలి. బూర్జువా పార్టీలన్నింటికీ ఎన్నికలలో గెలుపుకి అవసరమైన ఓ కామన్ సరుకుగా ‘డబ్బు’ వుంటుంది. అయితే ఒకే ఒక్క ‘డబ్బు’ వారిని ఎన్నికలలో గట్టెక్కించదు. అందుకు సహకరించే కొన్ని ఉత్ప్రేరకాలు కావాలి. నిజానికి ఓటర్లను ప్రభావితం చేయడంలో మిగిలిన అంశాలన్నింటి కంటే పార్లమెంటరీ రాజకీయాలలో డబ్బు ఎక్కువ పాత్రను పోషిస్తుందనడంలో సందేహం లేదు. అదే సమయంలో ఓటర్లను ఆకర్షించే రాజకీయ, సాంస్కృతిక, సామాజిక నినాదాలు కూడా కావాలి. సరిగా ఇలాంటి సమయాలలోనే హిట్లర్, ముస్సోలి నీలు తమ దేశాల గత చరిత్ర గర్భాలను తవ్వారు. వాటి నుంచి తమకి అవసరమైన సాంస్కృతిక, చారిత్రక సంపదను తస్కరించారు. అందుకే కార్పొరేటు కంపెనీలు సమకూర్చే భారీ ఎన్నికల నిధులతో పాటు యిలాంటి ‘సాంస్కృతిక సంపద’ కూడా బీజేపీకి నేడు అవసర మైనది. అందుకు వుపయోగపడేదే కుహనా హిందూ జాతీయపదం!
ప్రజలలో భావోద్వేగాల (సెంటిమెంట్లు)ను రెచ్చగొట్టగల ‘ఉద్దీపన శక్తి’ ఇప్పుడు మోడీకి కావాలి. అందుకు ఆయనకి రాజకీయ ఉత్ప్రేరకంగా ఒక ‘గాడ్ ఫాదర్’ కూడా కావాలి. అందుకు తన రాజకీయ మార్గదర్శకులైన హెడ్గేవార్, శ్యామ్ ప్రసాదు ముఖర్జీ, దత్తోపంత్ ఠేంగ్దీలు సరిపోరు. ఎన్నికల మార్కెట్‌లో వారు తగినంత స్థాయిలో వుపయోగపడరు. ఎందుకంటే, వారందరూ మనువాద హిందుత్వ ప్రవచనాలతో చేసిన ప్రసంగ పాఠాలు లిఖిత రూపంలో మన ఎదుట వున్నాయి. అవి దళిత, బహుజన, మైనార్టీ, స్త్రీల హృదయాలను నగ్నంగా, పచ్చిగా గాయపరిచేవే! దేశంలో నూటికి తొంభై మంది దళిత, బడుగు, నిమ్న సామాజిక వర్గాల ప్రజలున్నారు. అలాంటి భారతదేశంలో గత కాలపు ఆర్‌ఎస్‌ఎస్ సిద్ధాంత కర్తలు మోడీకి వుపయోగపడరు. పైగా వారి గూర్చి ప్రస్తావిస్తే రాజకీయ ఫలితాలు వికటిస్తాయి. అందుకే గాంధీ శిష్యుడైన పటేల్‌ని తన ‘గాడ్ ఫాదర్’గా మోడీ ఎన్నుకొని వుండొచ్చు. ఈ అవసరాల కోసం పటేల్ విగ్రహావిష్కరణకి దిగివుండొచ్చు. రెండున్నర వేల కోట్ల రూ||లలో అద ‘ఉద్దీపన పథకం’గా బీజేపీ అమలు జరపబోతుండటం గమనర్హం!
ఎందరో స్వాతంత్య్రోద్యమ నేతలుండగా కేవలం సర్దార్ వల్లభాయి పటేల్‌నే బీజేపీ యిలా ఎందుకు ఎంపిక చేసుకున్నది? ఇదో ప్రశ్న! దీనికి కూడా బలమైన నేపథ్య రాజకీయ కారణాలుం టాయి. పటేల్ గుజరాతీయుడు. గుజరాతీ వాణిజ్య వర్గాలు దేశంలో, విదేశాలలో విస్తృత స్థాయిలో వున్నాయి. వీరు బ్రిటీష్ వలస పాలన కాలంలోనే వాణిజ్య, వడ్డీ వ్యాపారులుగా, నగల వ్యాపారాలుగా, బ్యాంకర్లుగా, పారిశ్రామికవేత్తలుగా స్థిరపడ్డారు. నేడు అమెరికాలో లక్షలాది మంది గుజరాతీయులు పెద్ద వ్యాపారులు సాగిస్తున్నారు. ముఖ్యంగా అమెరికాలో జాతీయ రహదారుల వెంట హోటళ్ళ పరిశ్రమలో గుజరాతీ వ్యాపారులు బలంగా వున్నారు. నేడు అమెరికాలో వారొక బలమైన లాబీగానే వున్నారు. ఈ లాబీ అమెరికన్ రాజకీయ పార్టీలను కూడా ఓ మేరకి ప్రభావితం చేయగలిగే పరిస్థితి వుంది. ఒకే గుండుకు అనేక పిట్టలున్నట్లు పటేల్ విగ్రహావిష్కరణ వల్ల అనేక రకాల లాభాలు బీజేపీకి చేకూరవచ్చు. విగ్రహావిష్కరణ పేరిట వేల కోట్ల రూ||లను ఓవైపు స్వజాతి భావనతో గుజరాతీ సంపన్న వర్గాల నుంచి సేకరించుకోవచ్చు. మరోవైపు పటేల్ పేరుతో భారీ భారీ ఎన్నికల నిధులను కూడా వారి నుంచి వసూలు చేసుకోవచ్చు. ఇంకో వైపు వారి అండతో అమెరికన్ కార్పొరేట్ కంపెనీల నుంచి కూడా నిధులు రాబట్టుకోవచ్చు. అంతేకాకుండా అమెరికాలోని ‘గుజరాతీ వాణిజ్యలాబీ’ సాయంతో అమెరికన్ ప్రభుత్వ రాజకీయ అండదండలను కూడా పొందవచ్చును. అమెరికాలోని ‘గుజరాతీ లాబీ’ ద్వారా యిలాంటి రకరకాల అండదండలను పొందవచ్చును. పటేల్ విగ్రహావిష్కరణ వెనక ఇలాంటి ఎన్నెన్నో లాభాలు దాగివుండొచ్చు. అందుకే హఠాత్తుగా బీజేపీకి పటేల్ ఓ రాజకీయ కల్పవృక్షంగా మారాడు.
గాంధీ, నెహ్రూ, పటేల్ తదితరులందరూ కాంగ్రెస్ సంస్థకు చెందిన నేతలే! వీరందరి మధ్య విభేధాలు లేవని కాదు. గాంధీకీ, నెహ్రూకీ మధ్య విభేధాలున్నాయి. నెహ్రూకీ, పటేల్‌కి మధ్య విభేధాలున్నాయి. గాంధీకీ, పటేల్‌కీ మధ్య కూడా ఉన్నాయి. అవి ఒక్కొకసారి వారి మధ్య అలకలు, నిరసనల వరకు వెళ్ళిన సందర్భాలున్నాయి. హిందూ, ముస్లిం సమస్యపై కూడా విభేదాలు ఉన్నాయి. అయితే బడా బూర్జువా, భూస్వామ్య వర్గ ప్రయోజనాల కోసం నిలబడటంలో వీరి మధ్య మౌలిక విభేధాలు లేవు. స్వాతంత్రోద్యమంలో భగత్సింగ్ నుంచి కమ్యూనిస్టుల వరకూ గల విప్లవశక్తులను వ్యతిరేకించడంలో వీరి మధ్య ప్రాథమిక విభేదాలు లేవు. కాశ్మీరు ప్రజల జాతీయ ఆకాంక్షలను, వారి స్వయం నిర్ణయాధికార హక్కును అణిచివేయడంలో వీరి మధ్య ఏకీభావం వుంది. సోషలిజాన్ని వ్యతిరేకించడంలో మౌలిక ఏకీభావం ఉంది. తెలంగాణా, మలబారు, వర్లీ, తెభాగా రైతాంగ భూపోరాటాలను అణిచివేయడంలో వీరందరి మధ్య ఏకీభావం వుంది. బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి తిరగబడ్డ బొంబాయి నావికా సిబ్బందిని అణిచివేయడంలో వీరందరి మధ్య ఏకీభావం వుంది. అన్నిటికంటే ముఖ్యంగా తెలంగాణా సాయుధ విప్లవ పోరాటాన్ని నెత్తురుటేరుల్లో ముంచెత్తడంలో ధృడమైన ఐక్యతను ప్రదర్శించారు. అయితే మరి పద్దతులలో వీరి మధ్య విభేధాలున్నాయి. నేడు ఇవి ఒకే బీజేపీ పార్టీలో వాజ్‌పాయికీ, అద్వానీకీ మధ్య వున్న విభేధాల వంటివే. నేడు అద్వానీకీ, మోడీకీ మధ్యనున్న విభేధాల వంటివే! వాటిని నేడు భూతద్దంలో పెద్దవిగా చిత్రించి పటేల్‌ను కాంగ్రెస్‌ను నుంచి వేరు చేసి చూడాలనుకోవడం హేయమైంది.
పటేల్‌కి ‘గాడ్ ఫాదర్’ గాంధీ! మోడీకి ‘గాడ్ ఫాదర్’ గోల్వాల్కర్! పటేల్ ‘రాజకీయ ఆత్మ’ గాంధీ! మోడీ ‘రాజకీయ ఆత్మ’ గోల్వాల్కర్! కాంగ్రెసు ఆనాడు అనుసరించిన బూర్జువా సెక్యులరిజాన్ని ఆర్‌ఎస్‌ఎస్ వ్యతిరేకించింది. బూర్జువా సెక్యులరిస్టు నేత పటేల్‌ను ఆర్‌ఎస్‌ఎస్ వ్యతిరేకించింది. అందుకే పటేల్‌ను గాడ్ ఫాదర్‌గా ఎంచుకునే హక్కు ఆర్‌ఎస్‌ఎస్, బీజేపీలకి లేదు. గోద్రా మరణకాండకి కారకుడైన మోడీకి అంతకంటెను లేదు. భావి భారత చరిత్ర విధ్వంస రచనకు పూనుకునే హిందూ మతతత్వశక్తులకి రాజకీయంగా పటేల్ విగ్రహావిష్కరణ చేసే హక్కు లేదు.
ఈ దేశంలో ఎవరు ఎవరి విగ్రహాలనైనా ఆవిష్కరించు కోవచ్చు. వాటిని అడ్డుకోవాల్సిన అవసరం ఎవరికీ లేదు. విగ్రహాల నిర్మాణాన్ని అడ్డుకోవడం వల్లగానీ, వాటిని విధ్వంసం చేయడం వల్లగానీ చేకూరే ప్రయోజనాలు ఏమీ వుండవు. అంతిమ పరిశీలనలో అట్టి చర్యలు వ్యతిరేక ఫలితాలనే యిస్తాయని చరిత్ర నిరూపించింది. అదే సమయంలో వాటి వెనక గల ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక ప్రయోజనాల గూర్చి ప్రజలు విస్తృతంగా చర్చించాల్సి వుంది. పటేల్ ‘రాజకీయాత్మ’ అయిన గాంధీని భౌతికంగా హత్య చేసిన ఆర్‌ఎస్‌ఎస్ రాజనీతి గూర్చి చర్చించాలి. దానిచే ప్రేరేపిత రాజకీయ పార్టీలు, సంస్థల విధానాల గూర్చి చర్చించాలి. అవి తమ విధ్వంస రాజకీయా లకు పటేల్‌ను వాడుకోజూస్తున్న పరిస్థితిని గూర్చి చర్చించాలి. ఈ దుర్నీతిని ప్రజలలో రాజకీయంగా బహిర్గత పరచడం నిజమైన ప్రజాతంత్ర, లౌకిక శక్తుల తక్షణ రాజకీయ కర్తవ్యం కావాలి. కేవలం బహిర్గత పరచడానికే పరిమితం కాకుండా వాటి దుష్ఫలితాలకు వ్యతిరేకంగా వుద్యమించాల్సివుంది. ముజఫర్‌నగర్ మతకల్లోలాలు దేశ ప్రజలకు ఓ ముందస్తు హెచ్చరిక చేశాయి. గుజరాత్ గోద్రాలను భారతదేశానికి విస్తరించనివ్వకుండా అప్రమత్తం కావాల్సిన సమయమిది. అందుకై హిందువులుగా, ముస్లిములుగా, క్రిష్టియన్లుగా, సిక్కులుగా కాకుండా ‘భారతీయులు’గా స్పందిద్దాం! లౌకికవాదులుగా, ప్రజాస్వామిక వాదులుగా స్పందించుకుందాం!