– సరిత, భూమిక
నేను భూమికలో జాయిన్ అయ్యి 1 1/2 సంవత్సరాలయ్యింది. అప్పటి నుండి ఏదైనా ఫైల్స్ తీసేటప్పుడు ఫోటోలు కనపడటం, ఇవి రచయిత్రుల క్యాంప్ ఫోటోలు, అబ్బ భలే ఎంజాయ్ చేసాం అని ప్రసన్న, లక్ష్మి, కల్పనలు అనడం, సత్యవతి గారి ”తుపాకీ మొనపై వెన్నల” పుస్తకం కోసం ఫోటోలు వెతికేటప్పుడు మేడం ప్రతి ఫోటోను, సందర్భాన్ని వివరించడం వల్ల నాకు కూడా ఈసారి ట్రిప్ వేస్తే వెళ్లాలి అన్న ఉత్సాహం కలిగేది. అయితే, ఈసారి జనవరి 20-22 నిజామాబాద్ – ఆదిలాబాద్ వెళ్దామని సత్యవతి గారు రైటర్స్ అందరికీ మెయిల్, ఎస్.ఎం.ఎస్ పెడ్తుంటే మేము కూడా వస్తాము అని అన్నాను. భూమిక స్టాఫ్ అందరూ అనుకున్నాం కానీ ఇద్దరు రాలేదు.
జనవరి 20 సాయంత్రం 4-30 గంటలకు గీతగారి సారధ్యంలో బస్సు భూమిక ఆఫీసు దగ్గర నుండి బయలు దేరింది. వచ్చిన వారిలో కొంత మంది మాత్రమే నాకు తెలుసు. చాలా మందిని చూడటం ఇదే మొదటిసారి. వీరందరూ గొప్ప రచయిత్రులు అని విన్నాను. ప్రతి ఒక్కరు వారు రచనలతో పాటు ఇంకొక వృత్తిలో కొనసాగుతున్నవారే. వీరికి ఇలా రకరకాలుగా పని చేయడం ఎలా వీలవుతుంది, ఎలా మేనేజ్ చేసుకుంటారో అని తెలుసుకోవాలని చాలా కుతూహలం. ఇక అందరూ చాలా రోజుల తర్వాత కలిసారట. ఒకరినొకరు పలకరించు కోవడం, వారి వారి మాటలలో ఉండిపో యారు. బస్సు సిటీ దాటగానే స్నాక్స్ మొదలెట్టాం. మా కోసం అమృతలత గారు మూడు రోజుల ముందే పంపిన పప్పు చెక్కలు, గీతగారు తీసుకొచ్చిన కమ్మని కమలాపండ్లు, నోరూరించే రకరకాల స్వీట్లు, ప్రతిమగారి కొబ్బరి కజ్జికాయలు అన్నీ కలిపి 3రోజులు బాగా తిన్నాం.
నిజామాబాద్ దగ్గరలో లాలన ఓల్డేజ్ హోంకు వెళ్లాం. దారిలో మొత్తం పసుపు సువాసన. అక్కడ పసుపు పంట చాలా ఫేమస్, ఆ ప్రాంతాలన్నింటి గురించి నెల్లుట్లు రమాదేవి గారు చక్కగా వివరించారు. లాలన హోం ఆ పేరే ఎంత హాయిగా ఉంది కదా. కానీ పెద్ద వాళ్లందరం ఎందుకు ఓల్డ్ ఏజ్ హోంలో ఉండాలి, వారికి ఈ వయస్సులో పిల్లలుతోడు అందించలేరా? వీరందరూ ఎందుకు వారి కుటుంబ సభ్యులకు దూరంగా ఉండాలి, ఎవరైనా రావాలని, వారిని ఎవరైనా పలకరించాలని ఎందుకు ఎదురు చూడాలని బాధ వేసింది. కానీ ఇప్పటి పరిస్థితులను చూస్తే వీరికి ఇక్కడైనా కనీసం మిగతా వారి తోడు, పలకరింపులు, నిర్వాహకుల సహకారం లభిస్తున్నందుకు ఒక విధంగా ఇదే మంచిదేమో అని సర్దిచెప్పుకున్నాం. పక్కనే గుడి, గుడి చుట్టూ రంగు రంగుల గులాబీ పూల పరిమళం. అక్కడ వాతావరణం మాత్రం అద్భుతంగా చల్లగా, ప్రశాంతంగా, కాలుష్యం లేకుండా హాయిగా ‘లాలన’ లాలిస్తూ ఉంది.
అందులోని పెద్దలకు బై చెప్పి అమృతలత గారి ఇంటికి వెళ్లి వారే స్వయంగా చేసిన వంటకాలను ఆయమ్మలు వడ్డిస్తుంటే కడుపు నిండా తిని, వెరైటీ ఆటలతో, డాన్స్‌లతో, పాటలతో బాగా ఎంజాయ్ చేసాం. పొచ్చెర జలపాతంలో మేము ముగ్గురం మాత్రం వీరందరినీ చూస్తూ తడవాలా వద్దా అని అనుకుంటుంటే వెళ్లండని కొందరు, ఇక రమాదేవి గారు, ప్రశాంతి అక్క తీసుకెళ్లి దింపారు. ఒక పక్క సత్యవతి గారు దూరం వెళ్లకండి జారుతుంది అన్ని మమ్మల్ని జాగ్రత్త పరిచారు. మొత్తానికి చాలా సంవత్సరాల తర్వాత నీటిలో బాగా ఆడాను. తర్వాత అందరూ కూర్చొని ‘నేమ్స్ గేమ్’ 60 పేర్లు రిపీట్ అవ్వకుండా రాయాలి. నేను 90 రాసాను. అయితే ప్రైజ్ వస్తే ముగ్గురం పంచుకుందాం అని నవ్వుకుంటూ అందరితో పాటు బస్సెకాం. కానీ చాలా పేర్లకు ‘సాయి’ నామం జోడించడం వల్లనేమో ప్రైజ్ రాలేదు. ఇది ఓకే. అయితే ఇంత పెద్ద వాళ్లు ఈ వయస్సులో చెట్టు ఎక్కడం, నీటి కింద తడుస్తూ కేకలు, అల్లరి చేయడం బాగా అనిపించింది. ఎంత మందికి ఇలాంటి అవకాశం ఉంటుంది, ఉన్నా ఇలా ఎంత మంది మైమరిచి మిత్రులతో ఎంజాయ్ చేయగల్గుతారు అని అనిపించింది.
అక్కడ నుండి కుంతల జలపాతం దగ్గర మేడం వాళ్ల టైటానిక్ ఫోజులతో ఫోటోలు, ఎవరి గ్రూపులతో వారు ఫోటోలు తీసుకొని వెనుదిరిగాం. దారంతా రమాదేవిగారి అద్భుతమైన మాటలు, జోకులు. అటునుండి కొండగుట్టుకు వెళ్లాం. అక్కడ ఒకటే ఇల్లు. 2 చిన్న గుడిసెలు, ఒక షెడ్. ఆ ఇంటల్లో అమృతలత గారి బంధువులు – కరుణ, కల్పన గార్లు కొత్త వాళ్లమైనా ఎంత బాగా రిసీవ్ చేసుకున్నారు. అందరూ విద్యా సంస్థలు నిర్వహిస్తున్నవారే. మీరందరూ కలిసి మా కోసం చక్కటి నాటిక ప్రదర్శించారు. తర్వాత భోజనం చేసి రెండు ట్రాక్టర్లలో బయలుదేరి దట్టమైన అడవిలో పచ్చటి ప్రయాణం చెట్ల క్రింద చేస్తూ బుర్కరేగడి తండాకు వెళ్లాం. దారిలో అంత్యాక్షరి, జోకులు, వాగులు వచ్చినప్పుడంతా కేకలు పెడుతూ, ముందుకూ, వెనక్కు ఊగుతూ, ఒకరిని ఒకరు పట్టుకొని ప్రయాణించాం. ప్రయాణం చాలా బాగుంది. నేను చిన్నప్పుడు ట్రాక్టర్లలో తిరిగాం కానీ ఇలాంటి అడవిలో ట్రాక్టర్‌పై వెళ్లడం మొదటిసారి.
బుర్కరేగడి తండాలో ఊరిలోని అందరం ఉప్పులు, గోండి నృత్యాలతో మమ్మల్ని ఆహ్వానించారు. అమ్మాయిలం దరూ మేము మాట్లాడిస్తుంటే ఎంత సిగ్గు పడిపోయారో. తర్వాత వారితో మాట్లాడి, వారి జీవన విధానం, అందుబాటులో ఉన్న సౌకర్యాలు, వారి వృత్తుల గురించి తెలుసుకొని స్కూల్ దగ్గర ఆపి వున్న ట్రాక్టర్లలో ఎక్కి తిరిగి మొండిగుట్టకు వచ్చి అక్కడ అమృతలత గారి టీం అందరికీ కృతజ్ఞతలు తెలిపి ఉట్నూరు బయలుదేరం.
నాకైతే అసలు బాగా కడుపు నొప్పి, తిరిగి వచ్చేద్దాం అనుకున్నా, నేను ఎవరికి చెప్పక పోయినా సత్యవతి గారు అమ్మ కదా, ముఖం వాయిస్ కనిపెట్టి ఏమైంది. గోట్లా గసాలు వేసుకొని నీళ్ళు తాగి కొద్దిగా రెస్ట్ తీసుకోమన్నారు. గసాలతో పాటు జెల్‌సిల్ సిరప్ ఇచ్చారు. కరుణ గారు పడుకుంటే నాతో పాటు కల్పన గేమ్స్‌లో పాల్గొనకుండా నాకు తోడుగా ఉండిపోయారు. ఆదిలాబాద్ వెళ్లకుండా తిరిగి హైదరాబాద్ వచ్చేద్దామను కుంటే ప్రశాంతి అక్క, గీతగారు బాగా రెస్ట్ తీసుకో తగ్గిపోతుందన్నారు. ఉదయంకి నొప్పి చాలా వరకు తగ్గిపోయింది. లేవగానే అందరూ ఎలా ఉంది అని అడిగేసరికి నాకు ఇంట్లో అమ్మ వాళ్ళు గుర్తొచ్చారు. అందరూ ఎంత ప్రేమ చూపించారు, దాని వల్ల ఇక నొప్పి తెలియలేదు.
ఉట్నూరు నుండి కొమరం భీం సమాధి దగ్గరకు వెళ్లాం. మధ్యలో జైనూర్‌లో మహిళా సమతా నుండి సరిత, సాక్రూ జాయిన్ అయ్యారు. ముందు మహిళా సమతలో పనిచేయడం వల్ల వాళ్లు నన్ను చూసి సాక్రూ అయితే మరీ ఎక్సైట్ అయ్యింది. నాకు కూడా వాళ్లను మళ్లీ కలవడం చాలా సంతోషంగా అనిపించింది. ప్రశాంతి అక్క వాళ్లను పరిచయం చేసి, ఆదిలాబాద్ జిల్లాలో మహిళా సమత ద్వారా ఏ విధంగా పనిచేస్తున్నారు, ఇక్కడ గిరిజన ప్రాంతాలు వారి జీవన విధానాలు ప్రాముఖ్యతుల గురించి సాక్రూ, సరితలతో కలిసి చక్కగా వివరించారు.
తర్వాత ఝరిలో ఫెడరేషన్ – క్యాటరింగ్ కమిటీ వారు మా కోసం ఫౌష్టిక విలువలు గల మంచి టిఫిన్ చేసి వడ్డించారు. అవి చాలా రుచిగా ఉండటం వల్ల అందరికీ బాగా నచ్చాయి. ఎలా చేయాలో కూడా వారిని అడిగి తెలుసుకున్నారు. నాకు ఇంకా ఇద్దరు పాత మిత్రులు గోదావరి, ఇందిరలు కూడా కలిసారు. వారిని కలవడం, మాట్లాడటం చాలా సంతోషం కలిగించింది. అక్కడ నుండి జీవ వైవిద్య కమిటి సభ్యుల ద్వారా(బయో-డైవర్సిటీ) వారు ఆ ప్రాంతంలో ప్రకృతిని కాపాడటానికి అమలు చేస్తున్న ఆర్గానిక్ ఫార్కింగ్ విధానాలను వాటి ప్రత్యేకతుల గురించి తెలుసుకున్నాం.
ఉషేగాఁలో ఇత్తడి, తెనె తుట్టలతో వస్తువులు తయారు చేయడం ఒక ప్రత్యేకత. గ్రామంలో అందరిదీ ఇదే వృత్తి. తయారు చేసిన వస్తువులను ఏ విధంగా తయారు చేస్తారు, వాటి పేర్లు, ఉపయోగించే విధానం, మార్కెటింగ్ వంటి విషయాలను అందరూ అడిగి తెలుసుకున్నాం. కొంత మంది వారికి నచ్చిన వస్తువులను కొని తెచ్చుకున్నారు కూడా. అక్కడ ఇంకొక పాత ఫ్రెండ్ పద్మ కూడా కలిసారు. ఈ ట్రిప్ ద్వారా నా పాత ఫ్రెండ్స్‌ని కలవడం చాలా సంతోషానిచ్చింది. అసలు కడుపునొప్పి వల్ల వెనక్కు వెళ్లిపో యుంటే వీళ్లందరినీ మళ్లీ కలిసుండేదాన్ని కాదు. నిజంగా అందరికీ థాంక్స్.
అక్కడి నుండి అందరం ఎంతగా నో నిరీక్షిస్తున్న వర్ణిలోని సమతా నిలయంకు వెళ్లాం. అక్కడ పిల్లలు మేము వచ్చామని సగం నిద్రలో లేచి వచ్చి మమ్మల్ని తీసుకెళ్లి వారు ఇల్లు, వారి వేసిన బొమ్మలను చాలా హుషారుగా, చూయించారు. ఎంతో ఆప్యాయతతో అందరినీ పలకరించారు.
రవి అద్భుత యాంకరింగ్ మధ్య పిల్లలు గ్రూపులు గ్రూపులుగా చక్కటి ప్రదర్శనల ద్వారా మంచి సమాచారాన్ని అందించారు. వారు స్వయంగా చేసిన గ్రీటింగ్ కార్డులను మా అందరికీ ఇచ్చారు. నిజంగా ఆ గ్రీటింగ్స్ ఎంత కళాత్మకంగా తయారు చేసారో అక్కడ దొరికేటి పూలు, ఆకులు, పెన్సిల్ రస్ట్ మొదలగు వాటితో.
అక్కడ పిల్లలను చూసి కొంత మంది రైటర్స్ బాగా ఎమోషనల్ అయిపోయి కళ్లు చెమర్చారు. వారిని చూస్తూ నిశ్శబ్దంగా వస్తూంటే ప్రశాంతి అక్క వచ్చి ‘ఏరా ఏమైనా గుర్తొస్తున్నాయా’ అని దగ్గరకు తీసుకున్నారు. అంతే నాకు కూడా అప్పటి వరకు ఆపుకున్నా ఏడుపొచ్చేసింది. మహిళా సమతతో నాకున్న అనుబంధం, నేను నేర్చుకొన్న విషయాలు, పొందిన సపోర్ట్ అందరితో కలిసి వర్ణిలో చేసిన శ్రమదానం తోట, షికార్లు అన్ని గుర్చొచ్చి ఎందుకు వదలి వచ్చానా అని
దుఃఖం వచ్చేసింది. కానీ సమతా నిలయం పిల్లలలో ఎంతో అద్భుతమైన సామర్ధ్యాలు, తెలివితేటలు ఉన్నాయి. వారితో మాట్లాడటానికి డైరెక్ట్‌గా తరచూ వెళ్లలేం కాబట్టి కనీసం నెలకు ఒక ఉత్తరం వ్రాసి తద్వారా వారిని ప్రోత్సహద్దామని నా ఆలోచన.
ఈ ట్రిప్‌లో మొత్తంగా చూసినట్ల యితే ఇందులో విందు, వినోదంతో పాటు రకరకాల వ్యక్తులను కలసాను. అందరిలో ఏదో ఒక ప్రత్యేకత. ఇంత మంది గొప్ప వ్యక్తులతో రెండు రోజులు కలిసి ప్రయాణిం చాము. అందరికీ అందరి పట్ల బీళిదీబీలిజీదీ, ఎక్కడకు వెళ్లాలన్నా టైంకి రెడీ అవ్వడం, జోక్స్, పాటలు, డాన్స్‌లు, గేమ్స్ అన్నీ బాగా ఎంజాయ్ చేసాం.
ఫ్రెండ్స్‌తో ఈ విధంగా కలిసి వీళ్లందరూ ఈ వయస్సులో కూడా బయటకు వెళ్లడం, కలిసి సంతోషంగా కబుర్లు చెప్పుకుంటూ, ప్రకృతిని వీక్షించడం, అందులో సామాజిక అభివృద్ధికి ఏ విధంగా తోడ్పడవచ్చు అని ఆలోచనలు చేయడం నాకైతే చాలా కొత్తగా, మంచిగా అనిపిం చింది. నా ఫ్రెండ్స్‌తో నేను ఇలా ఎంజాయ్ చేసి చాలా సంవత్సరాలైంది. సంతోషాన్ని అందించడంతో పాటు ఈ ట్రిప్ ద్వారా కొత్త వారితో పరిచయాలు ఏర్పడ్డాయి. పాత ఫ్రెండ్స్, సమతా నిలయం పిల్లలను కలుసుకునే అవకాశాన్నిచ్చింది.
మహిళా సమత ద్వారా చాలా మంది అక్క-చెళ్ళెళ్ళ అనుబంధం లభిస్తే, భూమిక ద్వారా ఎంతో మంది అమ్మలకు దగ్గరయ్యాను. ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు సత్యవతిగారికి, వివిధ కార్యక్రమాలను ఆదర్శంగా నిర్వహిస్తూ అందరినీ ఉత్సాహ పరిచిన రచయిత్రులందరికీ, అమృత లత గారు ప్రశాంతి అక్క, సమత నిలయం పిల్లల కు భూమిక ఫ్రెండ్స్ అందరికీ నా హృదయ పూర్వక అభినందనలు.