పునర్నిర్మాణము

రమా సుందరి

చెంప మీద చెయ్యి పెట్టి మోచేతిని బల్లకు ఆనించి నా ఎదురుగా కూర్చొని ఉంది మాలతి. ఇరవై తొమ్మిదేళ్ళ యువతి. గడ్డం క్రింద నొక్కు, తడి ఊరే కళ్ళు, సన్నని నవ్వుతోనే వెలిగి పోయే మొహం… ఈ మూడూ మారి ఉంటే నేను ఆమెను గుర్తు పట్టకపోదును. చూసి పన్నెండు ఏళ్ళు అవలా! నేను వచ్చానని తెలుసుకొని హడావుడిగా వచ్చింది.

ఇద్దరం చాలా సేపు మౌనంగా ఉండిపోయాం. చాలా సేపటి తరువాత ”అదో పీడ కల మేడమ్‌” అంది. ఆమె గొంతులో ధ్వనించిన విచారం ఎక్కడ నుండో అడిగి తెచ్చుకొన్నట్లుగానే ఉంది కానీ సహజంగా లేదు. ఆ విషయాలు మాట్లాడటానికి అప్పటి దాకా సంశయిస్తున్న నేను ఆ గొంతులోని అరుపుని పసిగట్టాను. గతం తాలూకు పీడ నుండి విడివిడి, ఆ విషాదాన్ని ఎవరి విషయంగానో చెప్పగలిగే దశకు చేరితే… ఇక నిరాటకంగా ఆ విషయాల్ని మాట్లాడవచ్చు అని నాకు గతంలో అనుభవమయ్యింది. అయినా ఇప్పుడు నాకు ఆమె గతం కంటే వర్తమానమే ముఖ్యం. వర్తమానం దివ్యంగా ఉందని తేలిన ఆమె రూపు… సౌకర్యవంతంగా కనిపిస్తున్న చుడీదార్‌లో నుండి కొద్దిగా ఎత్తుగా కనిపిస్తున్న ఆమె పొట్ట… ఆమెను బండి మీద నా దగ్గరకు తీసుకొని వచ్చి, మా ఇద్దరికీ ఏకాంతం ఇచ్చి కాస్త దూరంలో నిల్చొన్న ఆమె భర్త… నాకు అర్థం చేయిస్తున్నారు.

ఈ లోపల మాలతి ”మీరు అప్పుడు నన్ను చూడటానికి వచ్చారు కదా మేడమ్‌?” సంబరంగా గుర్తుకు తెచ్చుకొని అడిగింది. అవును. వెళ్ళాను. అప్పటికి సంవత్సరం క్రితమే మా కాలేజ్‌ విడిచిపెట్టిన పద్దెనిమిది ఏళ్ళ పిల్ల, వాలిబాల్‌ కోర్ట్‌లో ఎగిరెగిరి బాలును ఉరుకులెత్తించిన ఆటకత్తె… అగస్మాత్తుగా దినపత్రికలో కనిపిస్తే వెళ్ళకుండా ఎవరు ఉంటారు? ఆ పత్రిక ఇచ్చిన హెడ్డింగ్‌ నాకు గుర్తుంది. ”కుక్కల బోనులో బంధించి, కుక్క మలాన్ని తినమని బలవంతం చేసి…..”

ఒక సంవత్సరం క్రూరమైన వైవాహిక జీవితం… దాన్ని అల్లుకొని ఉన్న సమాజం ఆమెను ”కడుపునొప్పితో ఆత్మహత్య చేసుకొన్న ఇల్లాలిగానో”, ”ప్రమాదవశానా గాస్‌ స్టవ్‌ పేలి మరణించిన మహిళగానో” చూపించి కొన్ని కన్నీటి బొట్లు కార్పించి… మరిపింప చేసే ప్రయత్నాన్ని వమ్ము చేసి ఆమె బ్రతికి వచ్చినందుకు ఆమెను అభినందించటానికి వెళ్ళాను. బ్రతుకు మీద అంతులేని విరక్తిని ప్రసాదించగలిగిన పరిస్థితులు ఉన్నా, క్షణికావేశానికి గురికాకుండా అర్ధ రాత్రి యాభై సవర్ల బంగారాన్ని వదిలేసి, కేవలం సర్టిఫికేట్లు మాత్రమే చేత బట్టుకొని పారిపోయి వచ్చిన తెగువను స్పర్శించి వద్దామని వెళ్ళాను. తండ్రి చిన్నప్పుడే చనిపోయినా… తాత, తల్లి పెద్దగా చదువుకోకపోయినా ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని… ఆ రాత్రి వాళ్ళు ఆమెకు తలపెట్టిన మరణాన్ని ధిక్కరించి వచ్చిన పోరిని గుండె కద్దుకొని… పోలీసు కంప్లైట్‌ ఇచ్చిన ఆమె కుటుంబాన్ని కళ్ళకద్దుకొందామని వెళ్ళాను.

”రెండెకరాల తెనాలి మాగాణి, ఐదు లక్షల కేషు, అమ్మాయి బంగారం అంతా ఆళ్ళ ఎదాన పోసాము. ఇంకా పొలం అమ్మక రమ్మని పిల్లను ఏపుకుతిన్నారు.” వాళ్ళమ్మ కళ్ళ నీళ్ళతో చెప్పిందపుడు.

”తరువాత చాలా కష్టపడ్డాను మేడమ్‌. ఈసెట్‌ రాసి ఇంజనీరింగ్‌ సీట్‌ తెచ్చుకొన్నాను. తరువాత ఎంటెక్‌ చేసాను. తాతయ్య చాలా సపోర్ట్‌ చేశారు.” చెబుతోంది ఈ ఇరవై తొమ్మిదేళ్ళ పిల్ల.

”వాళ్ళ విషయాలు తెలుసా?” అడిగాను. పెదవి విరిచింది. ”అమెరికాలో ఉన్నాడంట.” చెప్పింది.

”మళ్ళీ పెళ్ళి చేసుకొన్నాడా?”

”మనకేమి తెలియదు మేడమ్‌.”

”ఆ కేసు మరీ?”

”తాతయ్య బతికినంత కాలం తిరిగాను. ఆయన పోయాక కూడా పట్టుదలగా తిరిగాను. కానీ నా పరీక్షలప్పుడే వాయిదాలు వచ్చేవి. కొంతకాలానికి ఆ పంతం తగ్గింది. డబ్బు గుమ్మరించి వాళ్ళు కేసు కొట్టేయించుకొన్నారు.”

”గుండెను చువ్వతో గెలికిన గాయాన్ని కూడా కాలాపహరణతో నిస్సహాయ స్థితిలోకి నెట్టి మాయం చేయగల ఇండియన్‌ జుడీషియల్‌ సిస్టంకి జై” అనుకొన్నాను.

ఉన్నట్లుండి చిన్నగా చిరునవ్వు నవ్వింది మాలతి. దూరంగా నిలుచొని ఉన్న భర్తను చూస్తూ ”నేను ఎంటెక్‌లో ఉండగా ప్రపోజ్‌ చేశాడు. నా విషయం అంతా తెలుసు. మా కులం కాదు.” రకరకాల విషయాలు కలగలిపి చెప్పింది. ”ఇప్పుడు నేను చాలా సంతోషంగా ఉన్నాను మేడమ్‌.” గతాన్ని పూడ్చేసి భవిష్యత్తును నిర్మించుకొన్న యువతి మాలతి. కాదు కాదు గతం శిధిలాల మీద భవిష్యత్తు నిర్మించుకొంటున్న మాలతి.

”మీ ఆయన్ను పరిచయం చేయవా?” అడిగాను.

మాలతి సైగ చూసి వచ్చాడు అతను. ఇంకో కుర్చీ లేకపోవటంతో మేము ఇద్దరం కూడా నిలబడ్డాము. సముద్రపు గాలి సర్రుమంటున్న ఆ సమయంలో మేము ముగ్గురం త్రికోణాకారంలో నిలబడి ఒకళ్ళనొకరు కళ్ళతో అభినందించుకొన్నాము. వీడ్కోలు వచ్చిందని అర్ధం అయ్యింది.

”మంచి నిర్ణయం తీసుకొన్నారు.” అతనితో అన్నాను.

అతను సంకోచంగా అన్నాడు. ”నాలుగేండ్ల క్రితం సింగరాయకొండలో ఒక యువతిని అత్తారు చంపి బాత్‌రూమ్‌లో కిరోసిన్‌ పోసి కాల్చారు. గుర్తుందా మేడమ్‌?” అవును గుర్తుంది.

”ఆమె మా అక్కే”

బండి ఎక్కి అతని నడుము పట్టుకొని కూర్చోన్న మాలతిని గతుకుల్లో భద్రంగా నడుపుతూ తీసుకొని వెళుతున్నాడు. మేడ మీద నుండి నేను చెయ్యి ఊపాను.

Share
This entry was posted in moduga poolu. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.