జీవితం కట్టుకొయ్యకు కట్టేసినట్టు అనిపించిందంటే
కనబడని కట్లను విప్పుకోవడం మొదలెట్టాల్సిందే!!
ఎవ్వరూ ఆపకపోయిన నీ దారుల్లో నువ్వెళ్ళలేకపోతున్నా వంటే
నీ మార్గమేదో నీకింకా స్పష్టమవ్వనట్టే!!
ఏ సంబంధంలోను లేని బానిసత్వం
భార్యాభర్తల సంబంధంలో ఎందుకుందో ఎప్పటికీ అర్థం కాదు!!
ఏమే ఒసే సంబోధనలకి
ఏమండీ అనే సంబంధానికి లంకె ఎలా కుదురుతుందో ఎవరైనా చెబుతారా!!
జ్ఞానం కోసం బుద్ధుడు సమస్తాన్ని త్యాగం చేసాడు
స్వేచ్ఛ కోసం నాలుగు గోడల్ని త్యాగం చెయ్యలేమా!!
66 ఏళ్ళ క్రితం ఈ దేశానికి స్వాతంత్య్రం వచ్చిందంట
ఎంత మెల్లగా నడిచి వస్తోందో నా దగ్గరకింకా రానేలేదు.
అమ్మంటే దేవతని కదా అంటారు
మరి… ఈ అడుక్కునే అమ్మలందరూ ఎవ్వరో??
కొండలపై కొలువున్న అమ్మలందరికి పాదనమస్కారాలు
ఇంట్లో ఉన్న అమ్మకి అన్నం కూడా కరువే!!
ఏమి భక్తిరా భాయ్! నొసటి నిండా బొట్లే
నోరుతెరిస్తే మాత్రం బూతుల పంచాంగమే!!
జనాలు రక్షించాలని మొక్కే దేవుళ్ళు
రోడ్ల మధ్యలో కొలువై యాక్సిడెంట్లు చేస్తున్నారు!!
సాయిబాబాని సాయిరాం చేసేసారు
బుద్ధుణ్ణి దశావతారం చేసినట్టు.
మఠాల్లో మేటలు వేసిన సంపద
బయటకొస్తే ఈ దేశంలో దరిద్రమే ఉండదు
మైండ్సెట్ మారాలి అంటూ ఉద్యమిస్తున్నాం కానీ…
మారాల్సింది హార్ట్ సెట్.
మనవాళ్ళ మేధస్సు పెరుగుతోంది
మనసే ఎందుకో కుంచించుకుపోతోంది??
స్త్రీలని పూజించే దేశమట
అకటా!! అరవై లక్షల అమ్మాయిల్ని చంపేసిందే!!
నాతి చరామి…
దీనిని మించిన అబద్ధం మరోటి లేదు.
కన్యాదానం…
దానమియ్యడానికి ఆమేమైనా వస్తువా???
ఏ రాయైతేనేం పళ్ళూడగొట్టుకోవడానికి
ఏపెళ్ళైనా అదే ఇరుకు!!
కట్నాలూ, కుంపట్లూ అని ఏడ్చే కన్నా
ఉన్నదాంట్లో హక్కుగా సగమిచ్చేస్తే పోలా!!!
అమ్మాయిల్ని ఇళ్ళల్లో మగ్గబెట్టకండి
ప్రపంచం మీదకి వదిలేస్తే పులిపిల్లల్లా తిరిగొస్తారు.
నువ్వు నేను సమం సమం నీకూ నాకు సగం సగం
ఇదేనండీ ఫెమినిజం!!!
ప్రపంచంమంతా పుషాధిక్యం ప్రతీచోటా పితృస్వామ్యం
పిడికిలి బిగించి ప్రశ్నించడమే ఫెమినిజం.
అన్నింటా అసమానతలు ఆంక్షలు, వివక్షలు, అడ్డుగోడలు
గోడల్ని కూల్చడమే నా పని
వేలాది బాబాలు, అమ్మలు ఎగబడ్డ దేశం
స్త్రీలపై హింసకు పాల్పడొద్దని ఒక్కరూ చెప్పి చావరే!!
తెల్లతోలు చుట్టూ అల్లుకున్న వ్యాపారం విలసిల్లేది
మన శరీరాలని ఎలా ఉన్న వాటిని అలా మనం ప్రేమించుకునే వరకే
అంతర్జాతీయ విమానాశ్రయం ధగ ధగల వెనక
వందలాది గ్రామాల చీకటి సమాధులున్నాయ్
”అభివృద్ధి” బాధితులంతా చేరేది నగరాల పేవ్‌మెంట్ల మీదకే
”అభివృద్ధి”లో బాధితులేంటి చిత్రం కాకపోతే….
పోలవరం ప్రాజెక్ట్….
కొంతమంది భూస్వాముల భూములకు నీళ్ళు
గంపెడు గిరిజనుల కొంపా గూడూ నీళ్ళపాలు.