ఈ దశకంలో స్త్రీలపై హింస కొత్తరూపాలను తీసుకొన్నది. కుటుంబ హింస, పెత్తందారీ దౌర్జన్యాలు, రాజ్యహింస ముప్పేటలుగా స్త్రీల జీవితాన్ని ఊపిరాడనీయకుండా చేసాయి. కుటుంబంలో వరకట్న హత్యలు, గర్భస్థ ఆడ శిశుహత్యలు యధాతథంగా కొనసాగాయి. యాసిడ్ పోసి, తాగించి అత్యంత క్రూరంగా స్త్రీలను హింసించటం కనబడుతుంది. చీమకుర్తిలో గ్రానైట్ కంపెనీ యజమానులు తమ దగ్గర పనిచేసే యువతులపై అత్యాచారం చేసి చంపేసిన ఉదంతం (24-4-92) పాలమూరులో ఒక భూస్వామి తన దగ్గర కట్టుబానిసగా వున్న మైనర్ బాలికపై అత్యాచారం జరపటం (14-8-93) రాయలసీమలో ఫ్యాక్షన్ ముఠా రాజకీయ ఘర్షణలలో తరచు ఆడవాళ్ళపై అత్యాచారాలు జరపటం వంటివి అలావుండగా ఏదో ఒక సందర్భంలో పోలీసు స్టేషనుకు వెళ్ళాల్సి వచ్చిన సాధారణ స్త్రీలపై పోలీసు అత్యాచారాలు, పోలీసు క్యాంపులు వున్నచోట్ల నమ్మించి మోసం చేసి అవసరాలు తీరాక స్త్రీలను హత్య చేసిన సంఘటనలు కూడా ఉన్నాయి. కన్నూ మిన్నూ గానక, స్త్రీలపై చేసిన అత్యాచారాలు చెప్పలేనన్ని. రోజు రోజుకు పెరుగుతున్న ఇలాంటి ఘటనల పట్ల మహిళా సంఘాలు ఎక్కడి కక్కడ ఇతర ప్రజాస్వామిక సంఘాలతో కలిసి పీడిత మహిళల పక్షాన నిలబడి న్యాయం కోసం పోరాడాయి. వరంగల్లులో ‘న్యాయపోరాట కమిటీ’ ఒకటి అన్ని ప్రజాస్వామిక సంఘాల భాగస్వామ్యంలో ఏర్పడి పనిచేసింది ఈ కాలంలో.
ఒక ప్రేమ జంటకు సహకరించిం దనే కారణంతో అది గిట్టని గ్రామ పెత్తందా రులు ముత్తవ్వ అనే స్త్రీని నల్లగొండ చలకుర్తిలో నగ్నంగా తిప్పిన ఘటన సభ్యసమాజాన్ని నివ్వెర పరిచింది. దీనిపై మహిళా సంఘాలు ఆందోళనలు చేపట్టాయి. ఉద్యమాలలో పనిచేస్తున్న స్త్రీలపై కూడా ఈ కాలంలో హింస బాగా పెరిగింది. నక్సలైట్ ఉద్యమ సానుభూతిపరులనో, సహాయం చేశారనో, ఆచూకీ చెప్పమనో వేధించటంలో భాగంగా స్త్రీలపై అత్యాచారాలు జరిగాయి. నల్లగొండ జిల్లా భువనగిరికి చెందిన బెల్లి లలిత హత్య వీటికి అత్యంత క్రూరమైన ప్రతినిధి ఘటన. గొల్లకురుమడోలుదెబ్బ సాంస్క ృతిక వేదికకు రాష్ట్ర కన్వీనరుగా, తెలంగాణ కళాసమితి కో కన్వీనరుగా వుండి ప్రత్యేక తెలంగాణ ఆకాంక్షను పాడుతూ ప్రచారం చేస్తున్న బెల్లి లలితను ఒంటరి స్త్రీ అని, అక్రమ సంబంధాలను అంటగట్టి బెదిరించటంతో, అవమానించటంతో ఆగక ఆమెను మాయం చేసి ఖండ ఖండాలుగా చేసి వేరు వేరుచోట్ల బావుల్లో పడేసిన ఘటనపై రాష్ట్ర వ్యాప్త ఆందోళన జరిగింది. ‘బెల్లి లలిత హత్య వ్యతిరేక కమిటీ’ ఏర్పడి రాజ్యహింసపై ప్రజలను చైతన్యపరిచే కార్యక్రమాన్ని తీసుకొన్నది.
ప్రేమ పేరుతో స్త్రీలపై వేధింపులు ఈ దశకంలో ప్రారంభమయ్యాయి. తన ప్రేమను అంగీకరించలేదని హైదరాబాద్‌లో అనురాధ అనే అగ్రికల్చర్ బియస్సీ చదువుతున్న విద్యార్ధిపై సహ విద్యార్ధి శ్రీనివాసరెడ్డి చేసిన యాసిడ్ దాడి (1997) సభ్యసమాజాన్ని దిగ్భ్రాంతికి లోను చేసింది. గుంటూరు సికెసి కళాశాలలో ఇంటర్ చదివే ప్రసన్న వరలక్ష్మి పై తరగతి గదిలోనే సుభాని అనే యువకుడు కొబ్బరి బోండాలు కొట్టే కత్తితో నరికి చంపేయటం ఆందోళనను కలిగించింది. మహిళా సాధికారత గురించి అప్పుడప్పుడే మాట్లాడుకొంటున్న సందర్భంలో ప్రేమించటానికి కానీ, ప్రేమించకుండా వుండటానికి గానీ స్త్రీకి హక్కు నిరాకరించబడుతున్న, చదువులకు, ఎదుగుదలకు ఆటంకంగా, అవరోధంగా మారుతున్న ఇలాంటి ఘటనలను తీవ్ర స్వరంతో ఖండించాలని మహిళా సంఘాలు భావించాయి. బాధిత స్త్రీ పక్షాన సామాజిక పౌరన్యాయం కోసం నిలబడి ఉద్యమాన్ని నిర్మించాయి.
సామాజిక రంగాలలోకి విద్యా ఉద్యోగ రంగాలలోకి ప్రవేశిస్తున్న ఆడవాళ్ళ ఆత్మగౌరవాన్ని పరిరక్షించటం కూడా మహిళా ఉద్యమ కర్తవ్యం అయింది. 1996 లో విశాఖపట్ణణంలో కింగ్‌జార్జ్ హాస్పిటల్‌లో నర్సింగ్ విద్యార్ధుల కన్యత్వ పరీక్షలకు వ్యతిరేకంగా మహిళా సంఘాలు ఈ క్రమంలోనే కదిలాయి. ఉద్యోగులుగా వచ్చే మహిళల లైంగికతపై నియంత్రణలో వున్న జండర్ అసమానతను ప్రశ్నిస్తూ ఉద్యమించాయి. మానవహక్కులకు ఇది వ్యతిరేకమని కోర్టులో సవాలు చేశాయి.
ఈ దశకంలో 1995లో సెంట్రల్ యూనివర్సిటీలో మార్చి 22న జరిగిన ‘సునీత’ ఆత్మహత్య సందర్భం నుండి జండర్ కులానికి సంబంధం ప్రముఖంగా చర్చలోకి వచ్చింది. సునీత దళిత విద్యార్ధి. యోగీశ్వ రరెడ్డి అనే విద్యార్ధి ప్రేమ పేరుతో ఆ అమ్మా యితో రెండు సంవత్సరాలు తిరిగి మరో అమ్మాయితో పెళ్ళికి సిద్ధపడ్డాడు. ఇది భరించలేక సునీత ఆత్మహత్య చేసుకొన్నది. ఈ సందర్భంగా జరిగిన విద్యార్ధి ఉద్యమం యోగీశ్వరరెడ్డికి శిక్ష పడేట్లు ఒత్తిడి చేయటంతో ఆగక పురుషాధిపత్య అణచివేత సంస్క ృతి అందులో కులం, వర్గం కూడా సంలీనమై వుండటాన్ని చర్చకు పెట్టాయి. ఆ రకంగా ఈ ఘటన మహిళా ఉద్యమ తాత్త్వికతలో ఒక పదునైన పార్శ్వాన్ని ఆవిష్కరించింది. 1998 సంవత్సరాన్ని మహిళలకు మానవహక్కులకని, 1999 సంవత్సరాన్ని మహిళల పట్ల హింసలేని సమాజంకోసమని అంకితమైతే చేసింది ప్రభుత్వం కానీ స్త్రీలు కనీసహక్కులనైనా పొందలేక పోయారు. హింసలేని జీవితాన్ని పొందలేకపోయారు.
దండకారణ్యంలో సాగుతున్న సమాంతర మహిళా ఉద్యమం తునికాకు రేటు పెంపుదల ఉద్యమంతో ఊరేగింపులతో ముడిపడిసాగింది. క్రాంతికారీ ఆదివాసీ మహిళా సంఘటన కానీ ఉత్తర తెలంగాణ మహిళా విముక్తి సంఘంగానీ ఏదో ఒక రూపంలో ప్రధాన జీవనస్రవంతి మహిళా ఉద్యమాలపై తమ ప్రభావాన్ని వేశాయి. తెలంగాణ గ్రామీణ మహిళలు అనేకమంది వివక్షకు, పురుషాధిపత్యానికి గృహహింసకు వ్యతిరేకంగా విప్లవోద్యమ మహిళా సంఘ నిర్మాణంలోకి వచ్చారు. సారావ్యతిరేక ఉద్యమంలో క్రియాశీలక పాత్ర వహించారు. బీడీ కార్మిక మహిళా ఉద్యమం నిర్మించారు. బీడి కార్మిక చట్టం అమలు గురించి, చైతన్యం కలిగించారు. పని పరిస్థితులలో వేతనాలలో మార్పుకోసం బీడీ కార్మిక మహిళలు సంఘటితమయ్యేట్లు చేశారు. లైంగిక వేధింపులకు వ్యతిరేకంగా బీడి కార్మికులు నిలబడగల ధైర్యం ఇచ్చారు.
క్రాంతికారీ ఆదివాసీ మహిళా సంఘటన దండకారణ్యంలో మార్చి 8ని అంతర్జాతీయ శ్రామిక మహిళా దినోత్సవంగా నడపటంలో మహిళలను గొప్పగా సమీకరించింది. ఏదో ఒక అంశం మీద ఆ సంవత్సరం ఆ సందర్భానికి తగిన అంశం మీద చర్చలు ఏర్పాటు చేసింది. ఒక్కొక్క ప్పుడు అవి వారోత్సవాలుగా కూడాసాగాయి. ప్రపంచ సుందరి పోటీలను వ్యతిరేకించటం దగ్గరనుండి మొత్తం సామ్రాజ్యవాద సంస్కృతిని వ్యతిరేకించటం వరకు ఆయా అంశాలపై జ్ఞాన చైతన్యాలను దండకారణ్యంలో ప్రసరింపచేయటం వరకు కార్యక్రమాలు విస్తరించాయి. ప్రధాన జీవన స్రవంతి మహిళా ఉద్యమానికి అవసరమైన విప్లవ పదునును సమకూర్చే పత్రాలను కూడా అనేక సందర్భాలలో సమర్పించింది. 1994లో తిరుపతిలో జాతీయ కో ఆర్డినేషన్ కమిటీ నిర్వహించిన సెమినార్‌లో సమర్పిం చిన ‘మా అడవి గురించీ – అడవిలో పోరాటాల గురించి 1997లో హైదరాబాదు లో ఆంధ్రప్రదేశ్ చైతన్య మహిళా సమాఖ్య నిర్వహించిన ‘భారత శ్రామికోద్యమంలో మహిళలు’ అనే సెమినారులో సమర్పించిన ‘దండకారణ్య తునికాకు సేకరణ కూలీల సమస్యలూ – పోరాటాలూ’ వంటి పత్రాలు ఈ కోవలోవే. దండకారణ్య ఆదివాసీ మహిళా ఉద్యమ అనుభవంతో మొత్తంగా ఆంధ్రప్రదేశ్ మహిళా ఉద్యమ సమగ్ర స్వరూప ఆవిష్కరణకు ఇవి ఎంతగానో దోహదం చేశాయి.
కామ్రేడ్ పద్మ వంటి వారు ఈ క్రమంలో నాయకత్వ స్థానంలో పోరాట క్షేత్రంలో వుంటూనే ఉద్యమంలోని పితృస్వామిక భావజాలంపై పోరాడారు. కమాండర్‌గా, జిల్లా కమిటీ సభ్యురాలిగా పద్మ చైతన్య శిబిరాలను నిర్వహించి దళాలలోని మహిళలకే కాక పురుషులకు కూడా తరగతులు నిర్వహించి పితృస్వామ్య భావజాలాన్ని తగ్గించటానికి కృషిచేసింది. 2002లో సంకేన బోరుగుట్టల్లో ఎదురు కాల్పులలో మరణించింది. ఇలాంటి ఎందరో మహిళల జీవితానుభవం, ఆర్తి, ఆదర్శం, ఆచరణ మహిళా ఉద్యమం గుణాత్మకంగా ఎదగటానికి దోహదం చేసింది.
స్త్రీ విముక్తికి సంబంధించి స్త్రీవాద దృక్పధానికి, మార్కి ్సస్టు విప్లవ చైతన్య చింతనా వైఖరికి మధ్య సంఘర్షణ, సంవాదం ఈ దశకపు లక్షణం. 1980వ దశకంలో వచ్చిన మనకు తెలియని మనచరిత్ర (1986), మాకు గోడలు లేవు (1988), మూడు తరాలు (1988) వంటి పుస్తకాలు స్త్రీవాద భావజాలాన్ని ప్రచారంలోకి తెచ్చాయి. భూస్వామ్య ధనస్వామ్య వ్యవస్థల రాజకీయార్థిక సాంస్క ృతిక సంబంధాలను అప్రధానం చేసి పితృస్వామ్య రాజకీయాలను ప్రధానం చేయటం ఏ పెద్ద రాజకీయ నిర్మాణంలోనూ భాగం కాకుండా స్వతంత్ర ప్రతిపత్తి మహిళా సంఘాలను ఏర్పరచి స్వతంత్ర ప్రతిపత్తి మహిళా ఉద్యమాన్ని నిర్మించాలని భావించటం వర్గ సంబంధాల స్థానంలో లింగ సంబంధాల గురించి భావిం చటం లైంగిక స్వేచ్ఛను స్త్రీవిముక్తిగా ప్రతిపాదించటం స్త్రీవాదంలోని ముఖ్యాంశా లు కాగా అవి వాదవివాదాలకు కారణమ య్యాయి. స్త్రీ విముక్తి భావనను అంగీకరి స్తూనే వామపక్ష ఆలోచనాపరులు స్త్రీవాదం లోని పెడధోరణిని విమర్శకు పెట్టారు. ఆ క్రమంలో వచ్చినవే మహిళా విముక్తి వర్గ దృక్పధర (1993) ఆంధ్రా ఫెమినిస్టులారా మీ ప్రయాణం పూర్తయిందా (1994) అన్న రెండు చిన్న పుస్తకాలు వచ్చాయి. మహిళా విముక్తిని వర్గదృక్పథం నుండి చూడాలని వాళ్ళు సృష్టం చేశారు. సాధారణ ప్రజలు తమకు తాముగా సామాజి క ప్రగతిశీల ఉద్యమాల్లో సంఘటితమైనట్లే స్త్రీలు కూడా అందులో పాలుపంచుకొనటమే కాక వారు, వారి భాగస్వాములైన పురుషులు క్రమేణా స్త్రీల హక్కుల గురించిన చైతన్యం పొందుతారని అనుభవం నుండి నిర్ధారిస్తూ విశాలమైన సాంఘిక ఉద్యమానికి, స్త్రీల ఉద్యమానికి మధ్య గల అవినాభావ సంబంధం కీలకమైందని వాళ్ళన్నారు. స్వతంత్ర మహిళా ఉద్యమం అంటే పాలక వర్గ ప్రయోజనాల నుండి స్వతంత్రంగా, దేశ విదేశీ ప్రభుత్వ తదితర సంస్థల నిధుల నుండి స్వతంత్రంగా వుండాలి కానీ పురుషుల నుండి స్వతంత్రంగా వుండరాదని నొక్కి చెప్పారు.
చరిత్రలో తీవ్రమైన విభేదం ప్రాథమికంగా స్త్రీ పురుషులలో కాక ఆస్తిలేని వారికి, వున్నవారికీ మధ్య వుందని, చరిత్ర గమనాన్ని వర్గ విభజన ద్వారా వివరించగలి గినట్లు సెక్సు విభజన ద్వారా వివరించల ేమని స్పష్టం చేశారు. కమ్యూనిస్టు సంఘాల లో పురుషులు ఆధిపత్య ధోరణిని అంతర్గతం గా ప్రతిఘటిస్తూ వారిని చైతన్యవంతులను చేస్తూ పోవలసిందే కానీ ప్రత్యామ్నాయ సంఘాల ఏర్పాటు పెడధోరణి అని వాళ్ళ న్నారు. కుటుంబంలో స్త్రీలపై జరిగే అణచివే తకు వ్యతిరేకంగా పోరాడే మహిళా ఉద్యమం మొట్టమొదట సమాజంలోని ఆస్తి సంబంధా లకు వ్యతిరేకంగా సాగాల్సి వుంటుందని భావించారు. భారతదేశంలో దళితులు, ఆదివాసీలు కూడా మహిళల వంటి వారేనని తాము ప్రత్యేకంగా ఎదుర్కొంటున్న సమస్యలపై వారందరూ చైతన్యవంతులు కావలసే వుందని అభిప్రాయపడ్డారు. స్త్రీలు జాతిగా ఒకటే అయినా భిన్నమైన వర్గాలకు కులాలకు చెందిన వాళ్ళుగా భిన్నమైన ప్రయోజనాలు కలిగివుంటారు కనుక స్త్రీలం దరి ప్రయోజ నాలను కాపాడగల స్వతంత్ర ప్రతిపత్తి మహిళా ఉద్యమానికి వాళ్ళను సమీకరించ గల వాస్తవ భూమిక లేదని వాళ్ళు గుర్తు చేశారు. శ్రమవిముక్తి జరగకుం డా స్త్రీ విముక్తి జరగబోదని తేల్చి చెప్పారు.
ఈ సందర్భంలో స్త్రీ పురుష సమానత్వాన్ని గురించి సరియైన అవగాహన అందించటంలో రంగనాయకమ్మ చేసిన కృషి కూడా చెప్పుకోతగింది. పితృస్వామిక ఆధిపత్య ధోరణి మన మాట తీరులో, పదప్ర యోగాలలో ఎలా వ్యక్తమవుతుంటుందో చెప్పి కమ్యూనిస్టులు ఆ విధమైన ధోరణుల నుండి బయటపడే ప్రయత్నం చేయాలని సూచించి ంది. అసమానత్వం నుండి బయటపడటానికి మనం చేసే పోరాటం మరొక అసమానత్వం లోకి మనం తీసుకు వెళ్ళేదిగా వుండకూడ దని స్త్రీవాదులను హెచ్చరించింది. స్త్రీ పురుష వైరుధ్యాలు? మిత్ర వైరుధ్యాలా, శత్రు వైరుధ్యాలా? అని ప్రశ్నిం చి చర్చించి సంక్లిష్ట మానవ సంబంధాలను, స్త్రీ పురుష సంబం ధాలను అర్థం చేసుకొనేం దుకు గీటు రాళ్ళ నిచ్చింది. లైంగికత, లైంగిక స్వేచ్ఛ, వివాహం తో నిమిత్తంలేని స్త్రీ పురుష సంబంధాలు, తాత్కాలిక సంబంధాలు మొదలైనవి దీర్ఘకా లంలో స్త్రీకి ఎలా బరువవు తాయో కూడా ఈ కాలం చర్చించింది.
స్త్రీవాదం పితృస్వామ్య ఆధిపత్యం గురించి లేవనెత్తిన ప్రశ్నలు మార్కి ్సస్టు ఆలోచనాపరుల ఆత్మావలోకవానికి ఉపయో గపడితే మార్కి ్సస్టు శిబిరం నుండి స్త్రీవాదం పై వచ్చిన విమర్శ స్త్రీ విముక్తి సాధనంగా దానికి వున్న పరిమితిని బయటపెట్టి స్త్రీలు అంతిమంగా శ్రామికవర్గంతో అనుసంధానం ఏర్పరచుకొని పనిచేయవలసిన వాళ్ళేనని స్పష్టం చేసింది.