నాటి మేము
అమానవీయతకు ఆహుతైన బలిపశువులమై
పురుషాధిక్యతా ఘాతానికి పగిలిన గాజుముక్కలమై
రక్కసిముళ్లు గీసుకుని చీలికలైన పూరెక్కలమై
తీగలు తెగి, మూగబోయిన మనోజ్ఞ వీణలమై
అల్పుడెవడో ఆరగించి వదిలేసిన మధుర ఫలాలమై
కాలిన గాయాలు మానినా మానని మచ్చలమై
వేటగాడి దెబ్బకు నేలకొరిగిన శుకపికాలమై
వంచనకి తలవంచి.. యిన్నాళ్ళూ…
కుంచించుకు పోతూ జీవించాం..!
మమ్మల్ని తెలుసుకున్న నేటి మేము…
కూలిన గూటిని మళ్ళీ కట్టుకునే పక్షుల్లా సర్వశక్తుల్నీ సమీకరించుకుంటున్నాం!
మోడైనా, మళ్ళీ మళ్ళీ చిగురించే మానుల్లా కొత్త చిగుళ్ళేస్తున్నాం!
మబ్బులెన్ని మూగిన, ఆగని కోటికాంతుల సూర్యునిలా ప్రభవిస్తున్నాం!
అడ్డుకట్ట వేసినా దారి మళ్ళి మున్ముందుకు సాగే యేరులా ప్రవహిస్తున్నాం!
ఇకపై….
ఆ జీవనం పోరాడే అజేయ విక్రమార్కులమై నిలుస్తాం!
గరళాన్ని కంఠాన దాచి అమృత భాండాన్నావిష్కరించిన శివమూర్తులుగా వెలుస్తాం!
జాతిచరిత్రకు మేమే పునాదులమని నిరూపిస్తాం!
కొంగ్రొత్త జవజీవాలతో తలలెత్తి మరోసారి జీవిస్తాం!