అక్కా ! అనే పిలుపు
అపరిచితమేమీకాదు నాకు
తొలిఊహ పలకరించిన క్షణం నుంచీ
తోబుట్టువుల పిలుపులు అలవాటే నాకు
కానీ
భూమేష్ !
మొదటిసారిగా
నీ నోటి నుంచి వచ్చిన పిలుపు వినగానే
నా ఎడద వాయులీనంలో
ఏదో తీగ తాకిన భావన
నన్ను చూడగానే ఒక్కసారిగా
మెరిసిన నీ నయనాల నక్షత్రాలు
పెదవులపై విరిసిన నంది వర్ధనాల నవ్వులు
ఇరువురి మధ్య ఏదో పురాకృతజన్మల వాసన
పదే పదే మననం చేసుకునే
అభిమాన కవి పద్యంలా
మాటిమాటికి గుర్తుకు వస్తూనే వుంటావు
నీవు అక్కణ్ణుంచి వచ్చి ఇన్ని రోజులైనా
ఆ రోజు ఉదయం
అనుకోకుండా అందరం కలిసి
గుట్ట ఎక్కుతున్నపుడు
విజయపతాకాన్ని ముందుగా ఎగరేయాలనే లక్ష్యంతో
ఎవరికి వారే గబ గబా ముందుకు పోతున్నప్పుడు
నున్నటి బండల మీద అడుగు పెట్టినప్పుడల్లా
కిందికి జారిపోతున్నప్పుడు
అందరిలో వున్నా నన్నే గమనిస్తూ
చటుక్కున చేయందించిన ఆ అనుభూతిని
వర్ణించడానికి యాభైఆరు అక్షరాల వర్ణమాల చాలదు
గుట్ట దిగుతూ
కడుపులో ఆకలి మంటలతో పాటు
తలపై భానుని భగభగలతో
ఇళ్ళకు వెళ్ళాలనే తొందరలో
అందరూ పరుగులు తీస్తుంటే
నువ్వు మాత్రం దారిలో తురాయి పూలచెట్టు దగ్గర ఆగి
నాలుగు కొమ్మలు తెంచి దగ్గరగా చేర్చి
అక్కా ! ఇదిగో ! అని
నాచేతిలో అందమైన పూలగుత్తి పెట్టిన సమయం
మనసు చెమర్చిన అపురూపక్షణం ఎన్నో సందర్భాల్లో సన్మానాల్లో
ప్లాస్టిక్ పేపర్లో చుట్టిన
ఖరీదైన పూలగుత్తుల బహుమతుల
జ్ఞాపకాలు కొత్తకాదు నాకు
కానీ
రేకు రేకులో
ఎన్నటికీ వాడని ఆత్మీయతా పరిమళాన్ని పొదిగి
ఇచ్చిన ఈ కానుకను మరువలేనెన్నడు
చదువుల సోపానాల నధిరోహించి
గెలుపు చందమామనందుకోవడం నీకు సునాయాసం
భగీరథ సంకల్పం నీది
ఏ లక్ష్యాన్నైనా సాధించగలవు
కానీ !
నాది ఒకే ఒక్క కోరిక జీవితంలో ఎప్పటికీ
ఈ అక్కను మరచిపోకూడదని!