మహిళా ఉద్యమాలు దృక్పథం – గమనం – కాత్యాయనీ విద్మహే

1991లో సరళీకృత ఆర్థికవిధానాలకు సింహద్వారం తెరిచిన ప్రభుత్వం సామ్రాజ్యవాద బహుళజాతి సంస్థలకు అనుకూలమై నూతన ఆర్థిక పారిశ్రామిక విధానాలను చాప కిందనీరులా ప్రవేశపెట్టింది. జిందాల్‌, అన్‌రాక్‌ (రస్‌ అల్‌ ఖైౖమా) వంటి సంస్థలకు బాక్సైట్‌ గనుల తవ్వకానికి, బాక్సైట్‌ శుద్ధి కర్మాగారాల నిర్మాణానికి, యురేనియం తవ్వకాలకు అనుమతులు ఆ క్రమంలోనే లభించాయి. థర్మల్‌ పవర్‌ప్లాంట్ల నిర్మాణానికి, అణువిద్యుత్‌ కేంద్రాల ఏర్పాటుకు అనుమతులు కూడా ఆకోవలోకే వస్తాయి. 2005లో స్పెషల్‌ ఎకానమిక్‌ జోన్‌-సెజ్‌ (ప్రత్యేక ఆర్థిక మండలి) చట్టం చేసి పారిశ్రామికీకరణ, అభివృద్ధి పేరుమీద బహుళజాతి కంపెనీలకు దేశీయ వనరులను కట్టబెట్టే  విధానాలను ప్రత్యేకంగా రూపొందించింది. వేల ఎకరాల భూములను వందల సంఖ్యలో గ్రామాలను, ప్రజల జీవనాధారాలను జీవితాన్ని కూడా మింగేసే కోస్టల్‌ కారిడార్ల, ఇండిస్ట్రియల్‌ కారిడార్ల నిర్మాణానికి ఎర్ర తివాచీ పరిచి ఆహ్వానించింది. ఈ నేపధ్యంలో నూతన సహస్రాబ్ది మొదటి దశకం ఆంధ్రప్రదేశ్‌లో సామ్రాజ్యవాద వ్యతిరేక ప్రజా ఉద్యమాల దశకం అయింది. మహిళలు వీటిలో భాగం కావటం, మహిళా సంఘాలు ఇతర ప్రజా సంస్థలతో కలిసి ఉద్యమ నిర్మాణంలో భాగం కావటం సహజంగా జరిగాయి. మహిళా ఉద్యమం రాజకీయార్థిక దృక్పథంతో పదునెక్కిన కాలం ఇది.

 ఆంధ్రరాష్ట్రంలో శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం నుండి నెల్లూరు జిల్లా వరకు ఏర్పాటయ్యే కోస్టల్‌ కారిడార్‌లో శ్రీకాకుళం, తూర్పుగోదావరి జిల్లాల మధ్యభాగం ఉత్తర కోస్టల్‌ కారిడార్‌ పెట్రోలియం కెమికల్‌ పరిశ్రమలు, ఓడరేవులు, అంతర్జాతీయ విమనాశ్రాయాలు, కొత్తరైలు మార్గాలు, ఐటి పార్కులు మొదలైనవి ఇక్కడ నిర్మించబడతాయి. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖల మధ్య కోస్తాతీర ప్రాంతం పవర్‌జోన్‌గా ప్రకటించబడింది. ఇక్కడ థర్మల్‌ విద్యుత్‌, అణువిద్యుత్‌ కేంద్రాల నిర్మాణం చేపట్టబడింది. ఏ నిర్మాణం జరగాలన్నా ముందు జనాన్ని జీవనాధారాలకు దూరం చేయటం, నిర్వాసితులను చేయటం,నిర్వీర్యులను చేయటం. అభివృద్ధి తమ జీవితాలలోకి తెచ్చే చీకటిని గురించి తెలుసుకొంటున్న జనం అభివృద్ధి విధానాలకు, పరిశ్రమల నిర్మాణానికి ఎదురు తిరిగి నిలబడక తప్పదు. ఆ క్రమంలోనే 2005 తరువాత కాకినాడ, పోలేపల్లి, సోంపేట, కాకరాపల్లి మొదలైనవి తిరుగుబాటు చరిత్ర రచించారు.

 కాకినాడ సెజ్‌లో చమురు శుద్ధి కర్మాగార నిర్మాణానికి జరుగుతున్న భూ ఆక్రమణలను అడ్డుకోవటానికి కాకినాడ సెజ్‌ వ్యతిరేక కమిటీ, సెజ్‌ వ్యతిరేక యువసేన, కాకినాడ సెజ్‌ వ్యతిరేక మహిళా సంఘాలు కలిసి సెజ్‌ వ్యతిరేక ఉద్యమంలోకి విశాల ప్రజా సమూహాలను సమీకరించారు. 2008 మార్చి 8 అంతర్జాతీయ మహిళాదినం రోజున వేలాది మంది మహిళలు గ్రామాల నుండి తరలివచ్చి సెజ్‌ భూముల చుట్టూ కట్టిన ముళ్ళ కంచెలను తొలగిస్తూ తమ నిరసనను వ్యక్తం చేయటం మార్చి 8 ని మహిళా ఆక్రందన దినంగా ప్రకటించటం, సెజ్‌ వ్యతిరేక ఉద్యమాన్ని మహిళలు ఎంతగా తమదిగా చేసుకున్నారో స్పష్టం చేస్తుంది.

 అదే విధంగా సోంపేటలో నాగార్జున కనస్ట్రక్షన్స్‌ కంపెనీ నిర్మించ తలపెట్టిన థర్మల్‌ విద్యుత్‌ ప్లాంటుకు వ్యతిరేకంగా 2008 నుండి నిర్మించబడుతున్న ప్రజా ఉద్యమంలో మహిళలున్నారు. పర్యావరణ వరిరక్షణ కమిటీ నాయకత్వంలో రైలురోకోలు, రాస్తారోకోలు నిర్వహించి నిరసన తెలపటమేకాక (2009 అక్టోబర్‌ 27) 2009 డిసెంబర్‌ 5నుండి నిరాహార దీక్షాశిబిరం ప్రారంభించారు. ఈ శిబిరాన్ని నిరవధికంగా నిర్వహిస్తున్నది. సోంపేట చుట్టు పక్కల ఇరవై నాలుగు గ్రామాల మహిళలు. ప్రజల నిరంతర ప్రతిఘటనల మధ్యకూడా నిర్మాణానికి తెగించిన కంపెనీ 2010జూన్‌ 14న అందుకు రంగం సిద్ధం చేసుకొన్నప్పుడు ప్రజలంతా మూకుమ్మడిగా బీల భూముల్లోకి చేరి ఆపని సాగనియ్యమని అడ్డుకొన్నారు. కంపెనీ గుండాల, పోలీసుల దాడిని ఎదుర్కొని దెబ్బలు తిన్నారు. సరుగుడు కర్రలు సంపాదించి వాళ్ళమీద తిరగబడ్డారు. చుట్టు ప్రక్కల 24గ్రామాల నుండి ప్రజలు వచ్చి పాల్గొన్న ఈ ప్రతిఘటన చర్యలో స్త్రీలు అనేక మంది వున్నారు. ఒక్క గొల్లంగడి గ్రామానికి చెందిన స్త్రీలే 60మంది దారుణంగా గాయపడ్డారంటే సోంపేట ఉద్యమంలో స్త్రీలది ఎంత క్రియాశీలక పాత్రో అర్ధం చేసుకోవచ్చు. జీవనోపాధుల కోసం మత్స్యకార మహిళలతో సహా అనేకమంది గట్టిగా నిలబడ్డారు. ‘అందర్నీ సముద్రంలో కలిపేస్తాం’ అని ప్లాంటు నిర్మాణానికి దిగిన వాళ్ళపై క్రోధాన్ని వెళ్ళగక్కారు. సోంపేట కాల్పులలో మరణించిన గున్నా జోగారావు భార్య ప్రభుత్వం ఇస్తానన్న నష్టపరిహారాన్ని తిరస్కరించి తాను ప్రజలతో, సోంపేట థర్మల్‌ పవర్‌ ప్లాంట్‌ వ్యతిరేక ఉద్యమంతోనే అని ప్రకటించింది. పోలీసులు తొలగించిన నిరాహార దీక్షా శిబిరాన్ని మర్నాడే పునరుద్ధరించుకొని మహిళలు సోంపేట ఉద్యమాన్ని కొనసాగించటంలో ముందున్నారు.

 సోంపేట ఘటన జరిగిన ఏడు నెలలకే జరిగింది కాకరాపల్లి ఘటన. ఈస్ట్‌ కోస్ట్‌ కంపెనీ నిర్మించ తలపెట్టిన థర్మల్‌ విద్యుత్తు ప్లాంట్‌ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ 194 రోజులుగా వడ్డి తాండ్రలో నిర్వహించబడుతున్న నిరాహార దీక్షా శిబిరంపై దాడి చేసి ఆ తరువాత ఊరంతా లాఠీలతో, టియర్‌ గ్యాస్‌తో, తూటాలతో వీరవిహారం చేసి ఇళ్ళు, పంట పొలాలు తగలబెట్టి పోలీసులు విధ్వంసం సృష్టించిన రోజు – మరణించిన వారు మరణించగా జైళ్ళల్లోకి తోయబడ్డవాళ్ళు 150 మంది వరకు వున్నారు. వారిలో 36 మంది స్త్రీలు- తంపర భూములను కోల్పోతే చేపలు పట్టటం, తుంగకోసి, చాపలు అల్లి అమ్ముకోవటం వంటి ఎన్నో జీవనాధారాలను కోల్పోతామని పోరాటానికే సిద్ధపడ్డవాళ్ళు వాళ్ళంతా. పోలేపల్లి, వాన్‌పిక్‌ పేర్లే మారుతుంటాయి కానీ ఎక్కడయినా సెజ్‌ అంటే ప్రజలను భూముల నుండి వెళ్ళగొట్టటమే. అయితే అలా  వెళ్ళి పోవటానికి ఎవరూ సిద్ధంగా లేరు. తమ అంగీకారంతో సంబంధం లేకుండా జరిగిపోయే పరిణామాలతో ఉక్కిరి బిక్కిరి అవుతూ కూడా ఆయా ప్రాంతాలలో భూముల కోసం ప్రజలు ఆఖరి పోరాటాలు చేస్తూనే వున్నారు. వాళ్ళలో స్త్రీలు తమ భూములను, వనరులను పోగొట్టుకోకుడదన్న నిర్ణయం మీదనే వున్నారు. ఆక్రమంలో కుటుంబంలోని పితృస్వామ్య ఆధిపత్యంతో కూడా ఘర్షణ పడుతున్నారు. కన్నతల్లి వంటి భూములను వదులుకున్నాక పరిశ్రమల పేరు మీద వచ్చే అభివృద్ధి తమ అక్కరలకు ఆదుకొంటుందా అని వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. తమ జీవికకు, ఆహారానికి కనీస భద్రత కరువవుతుందని ఆందోళనకు దిగుతున్నారు.

 అదేవిధంగా జలయజ్ఞంలో భాగంగా సాగుతున్న పోలవరం, పులిచింతల వంటి భారీ ప్రాజెక్టులకు వ్యతిరేక ఉద్యమాలు కూడా వర్తమాన చరిత్రలో భాగం. పోలవరం గోదావరి నదీ జలాల వినియోగానికి సంబంధించినది కాగా అందువలన పశ్చిమ గోదావరి, తూర్పుగోదావరి, ఖమ్మం జిల్లాల ఆదివాసీ గ్రామాలు ముంపుకు గురవుతాయి. అందువల్ల లక్షల మంది ఆదివాసీల జీవనభద్రత ప్రశ్నార్థకమవుతుంది. కృష్ణాజిల్లా పులిచింతలలో 12.5 లక్షల ఎకరాల ఆయకట్టును స్థిరీకరించే ప్రాజెక్టు. దానివలన నల్లగొండ, గుంటూరు జిల్లాలలో దాదాపు 30వేల ఎకరాల భూమి ముంపుకు గురవుతుంది. ఏడు గ్రామాలు అదృశ్యమవుతాయి. అభివృద్ధి లక్షల మంది సాధారణ ప్రజల కనీసఅవసరాలను బలిగా కోరుతున్నదంటే దాని దుర్మార్గ స్వభావం అర్థమవుతూనే వుంది. అందువలన దానిని ప్రతిఘటించే ప్రజా ఉద్యమాలు ఇక్కడ కూడా జరుగుతున్నాయి. వాటిల్లోనూ స్త్రీల క్రియాశీలక భాగస్వామ్యం అత్యంత సహజంగా అనివార్యంగా కొనసాగుతున్నది.  

 ఈ విధమైన అభివృద్ధి నమూనాలను స్త్రీల కోణం నుండి అధ్యయనం చేయటం ఈ ఉద్యమాల క్రమంలో జరిగింది. రత్నమాల, రుక్మిణి, గీతాంజలి, హేమలలిత, సూరేపల్లి సుజాత వంటివారు ఉద్యమాల గతి క్రమాన్ని పరిశీలిస్తూ  క్షేత్రపర్యటన అనుభవాలను కలుపుకొంటూ వ్రాసిన సమగ్ర విశ్లేషణలు, నివేదికలు ఇచ్చే అవగాహన సామ్రాజ్యవాద వ్యతిరేక మహిళా ఉద్యమ నిర్మాణానికి దిక్సూచిగా పనిచేస్తాయి.

 ఈ దశకంలో ప్రజలు వ్యతిరేకించిన మరొక ప్రాజెక్టు యురేనియం ప్రాజెక్టు. జార్ఖండ్‌లోని జడగోడ యురేనియం ప్రాజెక్టు అనుభవాల నుండి నల్లగొండలో యురేనియం తవ్వకాలు ఎంత ప్రమాదకర ఫలితాలనిస్తాయో చర్చను లేవనెత్తి చైతన్యం పెంచేపని చేసాయి ప్రజాసంఘాలు. ముఖ్యంగా యురేనియం తవ్వకాల వల్ల వచ్చే రేడియేషన్‌ ప్రభావం పర్యావరణానికి ముప్పు కలిగించటమేకాక స్త్రీల ఆరోగ్యంపై విషమ పరిణామాలను కలిగిస్తుంది కనుక స్త్రీలు నల్లగొండలోనూ, రాయలసీమలోనూ ప్రతిపాదిత యురేనియం వ్యతిరేకంగా ప్రచార ఉద్యమాలలో భాగమయ్యారు. ఈ సందర్భం మహిళా ఉద్యమ పరిధిలోనికి రాని విషయం ఏదీ లేదని స్పష్టం చేసింది.

 ఈ దశకంలో నూతన ఆర్థిక విధానాలలో భాగంగా  ప్రభుత్వం ఉపాధి కల్పనా రంగంగా వ్యవసాయానికి వున్న ప్రాధాన్యతను తగ్గించటం, వ్యవసాయ ఉత్పత్తిలో భారీ పెట్టుబడులకు ప్రవేశం కల్పించటం లక్ష్యంగా వ్యవసాయ విధానాన్ని రూపొందించింది. చంద్రబాబు ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2020లో అవే ప్రధానాంశాలు. తత్ఫలితంగా 1990వ దశకం చివరలో రైతుల ఆత్మహత్యల పరంపర మొదలై 2003 నాటికి ఆ సంఖ్య బాగా పెరిగింది. దీని ప్రభావం స్త్రీల మీద పెనుభారాన్ని పడేస్తుందని అధ్యయనాలు వెల్లడించాయి. ఒంటరిగా కుటుంబాన్ని పోషించాల్సి రావటం, అప్పుల వాళ్ళ వేధింపులను ఎదుర్కోవలసి రావటం, లైంగిక వేధింపులకు కూడా గురికావలసి రావటం మొదలైన వాటి దృష్ట్యా రైతుల ఆత్మహత్యల సమస్యను స్త్రీ సమస్యగా గుర్తించి ఉద్యమంలో భాగం చేసుకోవలసి వుంటుందన్న అభిప్రాయం బలపడింది. వ్యవసాయ రంగంలో భారీ పెట్టుబడుల ప్రవేశం, యాంత్రీకరణ వంటివి స్త్రీలను ఉపాధి మార్గాల నుండి తప్పించటం వల్ల కూడా స్త్రీ సమస్యల వలయంలోకి నెట్టబడుతుంది. కనుక రైతుల ఆత్మహత్యలకు కారణమైన వ్యవసాయిక సంక్షోభం, పరిణామాలు మహిళా ఉద్యమం సంబోధించవలసిన అంశాలు అయినాయి.

 ఈ దశకంలో హెచ్‌ఐవి మరియు ఎయిడ్స్‌ వ్యాధిని గుర్తించటం, దాని గురించిన అవగాహన కలిగించటానికి ప్రచారం, ఎయిడ్స్‌ వ్యాధి నిరోధానికి నియంత్రణకు విదేశీనిధులు, మందుల దిగుమతి చేయటం విస్తృతంగా జరిగింది. ఈ వ్యాధి సోకటానికి వైవాహికేతర సంబంధాలే కారణమని స్త్రీల ద్వారా ఈ వ్యాధి వ్యాపిస్తుందని, అందువల్ల పురుషులు జాగ్రత్తగా వుండాలని హెచ్చరించటం ప్రచార కార్యక్రమాలలో, ప్రకటనలలో ప్రధానమైంది. ఈ మొత్తంలో స్త్రీలను అవమానించటం వుంది. వ్యభిచారిచే పురుషులకు కండోమ్‌ల వాడకం  గురించి బోధించటమే జరిగింది కానీ అసలు వైవాహికేతర సంబంధాల అనైతికత గురించిన చర్చ రానేలేదు. ఈ పరిస్థితులలో ఎయిడ్స్‌ నిరోధానికి వచ్చిన పులిరాజా ప్రకటన స్త్రీలను అసహనానికి గురిచేసింది. తాగిన మత్తులోనో, కోరికతోనో వైవాహికేతర సంబంధం పెట్టుకోవాలనుకొన్నప్పుడల్లా కండోమ్‌ వాడితే ఎయిడ్స్‌ రాదని చెప్పే ఆ ప్రకటనలో పురుషుడిని పులిరాజుగా సంబోధించటం జరిగింది. మహిళా సంఘాలు దీనిపై తీవ్రంగా ప్రతిస్పందించాయి. ఆకర్షణీయంగా తయారైనిల్చున్న స్త్రీ ఎయిడ్స్‌ అంటిచటానికి పొంచి వున్న ప్రమాదంగా సూచించే ఈ ప్రకటన, ఆ ప్రమాదం పట్ల జాగ్రత్తగా వుండమని పురుషుడిని హెచ్చరించటం స్త్రీని అవమానపరిచేదిగా, కించపరిచేదిగా వుందని మహిళా సంఘాలు అభ్యంతరాలు చెప్పాయి. బొంబాయి రెడ్‌లైట్‌ ఏరియాలో ఈ ప్రకటన ద్వారా ప్రచారం చేస్తే చాలామంది మగవాళ్ళు కండోమ్‌ వాడటానికి ఇష్టపడ్డారని ఎయిడ్స్‌ నిరోధక సంస్థ బాధ్యులు చెప్పటం దానిని సమర్థించుకొనటానికే.                  (ఇంకావుంది)

Share
This entry was posted in వ్యాసాలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.