నీరజకు మెడిసిన్ చదవాలని…. డాక్టరవ్వాలని కోరిక వుంది. కానీ పరిస్థితులు అనుకూలించక పోవటం వలన కనీసం తాను నర్స్‌గానైనా బాధితులకు సేవలందించాలనే ఆలోచనతో సరిపెట్టుకుని నచ్చచెప్పుకోక తప్పలేదు.
నాయుడు చిన్న చిన్న కాంట్రాక్ట్ పనులు చేసే రోజుల్లో అందంగా వయసులో వున్న రాజమ్మను దగ్గరకు తీశాడు. ఏదైనా కూలిపని ఇప్పించమని తనను వేడుకున్నప్పుడు నాయుడు ఆమె కళ్లలోకి చూచి ఇంతటి సౌందర్యరాసి తనవద్ద పనిలో చేరి ఇసుక తట్టలు… ఇటుకలు మోయటమా అన్పించింది. రాజమ్మకు ఎలాంటి లోటు రానివ్వనంటూ చేతిలో చెయ్యివేశాడు.
రాజమ్మతో సాంగత్యం ఏర్పడిన నాటినుండి నాయుడికి అన్ని విధాల కాలం కలిసొచ్చి ఎదిగాడు. బిల్డర్ అయినాడు. స్కూటర్ బదులు ఫోర్‌వీలర్‌కి ఓనరయ్యాడు. బ్యాంకు బేలన్స్ పెరిగింది. నాలుగు ఇంగ్లీషు ముక్కలు నేర్చుకున్నాడు. అధికారులతో సాన్నిహిత్యం పెరిగింది. కాంట్రాక్ట్ పన్లు తనను వెతుక్కుంటూ వచ్చినయ్. రాజమ్మ కడుపు పండింది! ఆడపిల్లకు తండ్రి అయినాడు నాయుడు.
తాను ఎదుగుతున్నా రాజమ్మను మాత్రం వదల్లేదు. పాప నీరజంటే తనకు ప్రాణం. ఇంట్లో వున్న సమయాల్లో పాపే తన సర్వస్వం! కూతురికి మెళ్లో వంటిపేట గొలుసు చేతులకు బంగారం మురుగులు చేయించాడు. రాజమ్మకు కూడా నాలుగుపేటల చంద్రహారం, చెవులకు రాళ్ల దుద్దులు చేయించాడు. కానీ రాజమ్మకు లేని లోటల్లా మెళ్లో తాళి! అధికారికంగా సభ్యసమాజంలో రాజమ్మ తాళి కట్టించుకున్న భార్య కాలేకపోయింది. అయినా బాధపడ్లేదు. తనను కూతురిని ఆప్యాయతాను రాగాలతో నాయుడు చూసుకుంటున్నందుకు తెగ సంబరపడింది. అంతే తనకు ప్రాప్తమని తృప్తి చెందింది!
మట్టిలో పుట్టి పేడ పిసుక్కుంటూ బ్రతికిన తాను నాయుడి ప్రేమానురాగాలను పొందగలిగింది. తనకేలోటూ లేకుండ చూచుకోవటం తన పూర్వజన్మ సుకృతంగా భావించింది.
నాయుడు నాలుగైదేళ్లలో పేరు పలుకుబడి డబ్బు సంపాదించటం చూచిన వాళ్ళు తమ పిల్లను పెళ్లి చేసుకోమంటూ వెంటబడసాగేరు. కొడుకుని పెళ్లి చేసుకోమని బ్రతిమాలారు..! కన్నవారిమాట కాదన్లేక సరేనన్నాడు. తను పెళ్లి చేసుకుంటే రాజమ్మ గతేమవుతుంది? పైగా ఆమె ఒంటరిది కాదు. ఆమెతోపాటు తన బిడ్డ నీరజ కూడా తనకు దూరమౌతుంది.
నాయుడిలో స్వార్ధం మితిమీరింది. రాజమ్మ కేవలం తన ఉంపుడుకత్తె! పెళ్లి చేసుకున్న తర్వాత ఆమెతో తనకు పనేంటి? ఈనాడు తన స్థాయి ఏంటి? తన్లాంటి వ్యక్తి రాజమ్మలాంటి లోక్లాస్ వుమన్‌ని వుంచుకున్నాడనుకోరూ? అది తనకు అవమానం కాదూ? నాయుడు మరోవిధంగ ఆలోచించసాగాడు.
నో! తాను తప్పుగా ఆలోచిస్తున్నాడు. పాపం రాజమ్మ తననే సర్వస్వం అనుకుంటూ బ్రతికేస్తున్నది. తన మూలంగా బిడ్డకు తల్లి కూడ అయింది. ఇప్పుడు తల్లీబిడ్డను కాదనుకోవటం న్యాయమా ధర్మమా అన్పించింది.
నాయుడు మనసు కలవరపాటుకు లోనైంది. తాను అండగ వుండటంతో నీరజ కాన్వెంట్‌లో చేరింది. తాను దూరమైతే మళ్లీ.. రాజమ్మ మట్టి తట్టలు మోసి బ్రతుకీడ్చక తప్పదు. నీరజ కాన్వెంట్ చదవగల ఆర్థిక స్థోమతలేక ప్రభుత్వ పాఠశాలకు వెళ్ళాల్సి వస్తుంది.
కొన్నాళ్లపాటు తాను పెళ్లి చేసుకున్న విషయాన్ని అత్యంత గోప్యంగవుంచాడు. రోజూ రాజమ్మ ఇంటికొచ్చే మనిషి వారానికో పదిరోజులకో రావటం ఆమెను విస్మయానికి గురిచేసింది. కానీ తెగించి అడగ్గల ధైర్యం రాజమ్మలో లేకపోయింది. ‘డాడీ’ ఏడని నీరజ తరచి తరచి తరచు అడుగుతుంటే పిల్లకు ఓదో ఒక నోటికొచ్చిన అబద్ధం చెప్పి సముదాయిస్తూవుంది.
రాజమ్మ వట్టి అమాయకురాలు!. నాయుడే తన సర్వస్వం అనుకుంది. జీవితాంతం తనకు అండగ వుంటాడని ఆశపడింది. నాయుడు అప్పుడప్పుడొచ్చి పోవటం చూచి తట్టుకోలేక కళ్లనీళ్లు పెట్టుకోవటం నీరజ గమనించి ఎందుకమ్మా ఏడుస్తున్నావ్ అనడిగితే తప్పించుకోవటానికి ఏదోటి చెప్పటానికి అలవాటుపడింది రాజమ్మ.
ఆ వూళ్లో పన్లున్నయ్… ఈ వూళ్లో పన్లున్నయ్ అంటూ నాయుడు సమయానుకూలంగ బొంకినా రాజమ్మలో ఏదో అనుమానం ఆమెను సతమతపెడుతూనేవుంది. నాయుడు వెనకటిలా నిజం చెప్పటంలేదు అన్పిస్తోంది. ఆవచ్చినప్పుడు వెయ్యో.. రెండువేలో వాళ్ల ఖర్చుకు విసిరి రాజమ్మ ముఖాన పడేసి వెళ్లటం చూస్తూ నాయుడు శానా మారిపోయిండు.. ఎనకటిమడిసి కాదు… అనేసి గొణుక్కునేది.
‘అవతల నాకు బోలెడన్ని పన్లు నెత్తిమీదున్నయ్! నీకాడే కూర్చోను తీరిక వుండటంలేదు రాజీ! నాకు వీలున్నప్పుుడొచ్చి పోతుంటా… నాకోసం నువ్వు పిల్లా బెంగపెట్టుకుని ప్రయోజనం లేదు…’ అన్నాడొకసారి నాయుడు రాజమ్మతో..
‘నా మాట అటుంచు! నిన్ను చూడాలని పిల్లది అల్లాడిపోతోంది. స్కూలుక్కూడా వెళ్లనని మొండికేస్తోంది. దాన్ని అన్యాయం చేసి పసిమనసును బాధపెట్టమాకు… నీ కూతుర్ని అక్కున చేర్చుకుని ముద్దాడితే అది మురిసిపోతుందయ్యా…’ నాయుడిని వేడుకుంది.
సరిగ్గా అదే సమయానికి నీరజ స్కూలు నుండి ఎగురుకుంటూ ఇంట్లోకొచ్చి ఎదురుగా వున్న తండ్రిని చూచి కాళ్లకు చుట్టేసుకుంది.
‘యాడికి పోయినావు నాయినా… కానరావటం లేదు’…
‘పనులుండి వూళ్లు తిరుగుతాన్నాను. తల్లీ’…
తండ్రి కూతురి అనురాగబంధాన్ని చూస్తూ నిలబడ్డ రాజమ్మ కళ్లు ఆనందంతో చెమర్చినాయ్. తనూ మనసులో తెగసంబరపడింది. ‘నీరూ! మనమిద్దరం కార్లో అట్లా కాస్సేపు బైట తిరిగొద్దాం రా!…. మేం ఇప్పుుడే వస్తాం రాజీ…’ అనిచెప్పి కూతుర్ని ఎత్తుకుని బైటికొచ్చి కార్లో కూర్చోపెట్టుకుని వీధిలోకెళ్లాడు నాయుడు.
చాక్లెట్లు… బిస్కెట్లు కొనిచ్చాడు. ఐస్‌క్రీం తినిపించాడు. నాలుగైదు రకాల డ్రెస్సులు కొనిచ్చాడు. తిరిగి తీసుకొచ్చి నీరజను ఇంట్లో దించి పిల్ల చేతిలో ఓ వెయ్యి రూపాయల నోటు వుంచి ‘టా,టా…’ చెప్పి కారెక్కి వెళ్లిపోయాడు నాయుడు.
నాయుడు హిమాలయమంత ఎదిగేక రాజమ్మ ఇంటికెళ్లటం నామోషీ అన్పించటాన…. తన వద్ద పనిచేసే మేనేజరు ద్వారా అప్పుడప్పుడు అవసరాలకు డబ్బు పంపుతూ రాసాగేడు.
మొదట్లో తండ్రి కోసం కలవరించి…. దిగులుబడి ఆ తర్వాత చదువుమీద మనసు లగ్నం చేసింది.
ఆడప తడప నాయుడు పంపించే డబ్బు అవసరాలకు చాలక పోవటంతో పెద్ద ఇల్లు ఖాళీ చేసి వేరొకచోట పెంకుటి ఇంట్లో రెండు గదులు అద్దెకు తీసుకుంది రాజమ్మ.
ఎప్పుడైనా తండ్రి గుర్తుకొచ్చి తల్లిని అడిగితే కళ్లనీళ్లు పెట్టుకోవటంతో ఆ విషయాన్ని తల్లితో ప్రస్తావించటానికి నీరజకు మనస్కరించలేదు.
‘వేధించమాకే… నాకు మాత్రం ఏం తెలుసు మీ అయ్యయాడుండో? – పెళ్లాం పిల్లలతో యాడో వుండే వుంటాడు. మనలను మరిచిపోయాడు. అందుకే మనకాడికి రావటం మానేశాడు. విసుక్కుంది రాజమ్మ.
‘అంటే…. అమ్మా… నిన్ను డాడీ పెళ్లిచేసుకోలేదా?…
కూతురి ప్రశ్నకు జవాబు ఏమివ్వాలో అర్థంకాక మౌనం వహించింది.
‘చెప్పమ్మా!…. చెప్పకపోయావంటే.. నామీద ఒట్టే..’
‘సెప్తాను తల్లీ!.. నువ్వూ పెద్దదానివౌతున్నావు. కదా… ఇక దాచలేను! – ఆరోజుల్లో పనికోసం ఆయన కాడికెళ్లాను. నన్ను చూచి పనివ్వకుండానే సాయం చేసిండు… పెళ్లాంకంటే ఎక్కువ ప్రేమతోనే వుండేవాడు. కోరింది కొనితెచ్చేవాడు…
నేనాయనకు దగ్గరయ్యేకనే నాయుడుగోరికి అన్నివిధాల యాపారం కలిసొచ్చింది…
కొన్నాళ్లకు నువ్వు పుట్టావు… నిన్ను నెత్తిన పెట్టుకున్నాడు. నీకు ఏలోటు రానివ్వకుండా ప్రేమగా చూచుకుంటూ వచ్చాడు. ఆ తర్వాత ఆయనకు పెళ్లి వేరొకరితో జరిగివుండి వుంటుందని ఊహించాను.
అప్పుడప్పుడు వస్తున్నవాడల్లా తర్వాత అసలు రావటం మానేసి… ఎప్పుడో గురుతుకొచ్చినప్పుడు డబ్బు పంపుతూ రాసాగేడు.
కొన్నేళ్లుగా అదీలేదు. మనలను మర్చిపోయివుంటాడని మనసు రాయి చేసుకున్నాను.
మట్టితట్టలు మోసే ఓపిక లేక నాలుగు ఇళ్లల్లో పాచిపనులు చేసి పొట్టపోసుకోవాల్సిన దౌర్భగ్యస్థితి ఏర్పడింది.
‘నువ్వు చాలామంచిదానివమ్మా! నాన్న నిన్నూ నన్నూ మోసం చేసినా డాడీ చాలా మంచోడమ్మా. కాకపోతే… ఇప్పుడు మనలను అక్కర్లేదనుకుని వుంటాడు!’ కళ్లొత్తుకుంది నీరజ.
‘బాధపడమాకు తల్లీ! మనలాంటోళ్ల బతుకులు ఇంతే!… నువ్వు నాలా అన్యాయమైపోకూడదనే నిన్ను సదివిస్తుండాను. నువ్వయినా బాగుపడి ఏదైనా వుద్యోగం చేసి సుఖంగ జీవించాలమ్మా! నాలో ఆ ఒక్క కోరిక మిగిలివుంది! నాగురించి నాకేదిగులూ లేదు… ఈ బీదదానికి మీ అయ్య మంచి బతుకునిచ్చాడు.నీడ కల్పించాడు. ఆశ్రయం ఇచ్చాడు. నాకు నిన్ను ఇచ్చాడు! – నాకింకా కోరికలేం లేవు…’ బావురుమంటూ నీరజను కౌగిలించుకుంది రాజమ్మ.
నాయుడు ఫోటో ముందు నిలబడి ‘డాడీ! నేను టెన్త్ పరీక్ష మంచి మార్కులతో పాసయ్యాను. నా ఆనందాన్ని పంచుకోవటానికి మాతో నువ్వు లేవు. పెద్దయ్యాక నేను నిన్ను చూచే అదృష్టం లేకుండాచేశావ్! అమ్మా… నేను… ఏం తప్పు చేశామని మాకు కన్పించకుండా… మమ్మల్ని పట్టించుకోకుండా ఎక్కడికో వెళ్లిపోయావ్?- నువ్వు మాకు కన్పించకుండా వెళ్లిపోయాక… మాకు ఎప్పుడైనా పంపే డబ్బులు పంపటం మానేశావ్! మా ఇద్దరి పొట్టలు గడవటం కష్టమైపోయింది డాడీ! మమ్మీ నాలుగు ఇళ్లల్లో పాచి పనులు చేసి నన్ను చదివించింది. అమ్మకు నువ్వు కన్పించకపోవటంతో తిండి, నిద్ర కరువైంది. నీగురించే అమ్మకు దిగులు. నువ్వు ఎంత మంచివాడివి డాడీ!- ఒక్కసారి రా డాడీ! వచ్చి మమ్మీని నన్ను చూచిపో… చాలు! నాకేమో చదువుకోవాలని వుంది. చదివించే స్తోమత అమ్మకు లేదు. నువ్వయినా కన్పించి నన్ను చదివిస్తే డాక్టరవాలని వుంది డాడీ! – తన మనసులోని గోడంతా తండ్రితో వెళ్లబోసుకుంది నీరజ. వెక్కివెక్కి ఏడుస్తూ కళ్లు తుడుచుకుంది.
ఫ్రెండ్ ఇంటికి వెళ్లి వస్తూండగా రోడ్డు పక్క కారు పక్కనే నిలబడి వున్న నాయుడిని చూచి తన తండ్రేనని గుర్తించిన నీరజ గబగబా దగ్గరై ‘డాడీ….’ అంటూ పలకరించింది.
‘ఎవరు నువ్వు? నన్ను డాడీ అంటావేంటి? -‘ నొసలు చిట్లించి కోపగించుకున్నాడు నాయుడు.
‘నేను డాడీ నీరజను… గుర్తుపట్టలేదా?- అవున్లే ఎప్పుడో నాకు అయిదేళ్లప్పుుడు చూశావ్. ఆతర్వాత కన్పించకపోతివి… నన్నెట్లా గుర్తించగలవ్… నేనూ పెద్దదాన్ని అయ్యానైతిని…’
ఆ!… ఆవును ఈ పిల్ల రాజమ్మ కూతురు. తల్లీ కూతుళ్లను నిర్లక్ష్యం చేసి గాలికి వదిలేసి తాను కాంట్రాక్ట్ పన్లతో బిజీ అయినాడు. తనకిద్దరు మగపిల్లలాయె. వాళ్లతోనే సమయం సరిపోకుండా వుంది.. గతాన్ని ఆకళింపుచేసుకుని ‘నీరజా! నువ్వా అమ్మా?… ఇప్పుుడెక్కడ వుంటున్నారు మీరు? పాత ఇంటి దగ్గరకెళ్లి విచారిస్తే మీరా ఇల్లు ఖాళీచేసి ఎక్కడికో వెళ్లారని తెల్సింది!… మీ అమ్మ ఎట్లావుంది?- నువ్వేం చేస్తున్నావిప్పుుడు?… ఆప్యాయంగా మాట్లాడాడు గతంలో వున్న బంధాన్ని మమకారాన్ని మర్చిపోలేక.
‘డాడీ! నీకు మేమింకా గుర్తున్నామా? నువ్వు మమ్మల్ని మర్చిపోనందుకు థ్యాంక్స్! – నేను టెన్త్ మంచి మార్కులతో పాసయ్యాను. నువ్వు చదివిస్తే డాక్టరవుతాను.’
అలాగా? – కంగ్రాట్స్… రా! కార్లో నిన్ను తీసుకెళ్లి స్వీట్స్ కొనిస్తాను…’
‘వద్దులే డాడీ నువ్వొకసారి వచ్చి మమ్మీని చూస్తే చాలు! ఆ పిచ్చి తల్లి సంబరపడి మురిసి మరో పదేళ్లు ఆ తృప్తితో బ్రతకగ్గలుగుతుంది!… రా డాడీ!… మనింటికి పోదాం!…’ చెయ్యి పట్టుకుని గుంజుతూ ఆప్యాయంగా అడిగింది నీరజ.
వెళ్లాలా వద్దానే సందిగ్దంలో వూగిసలాడుతున్నాడు నాయుడు. వెళ్లకపోతే కన్న కూతురు చిన్నబుచ్చుకుంటుంది. బాధపడుతుంది. తీరా బయల్దేరి వెడితే పాతపాశం కాళ్లకు చుట్టుకోక మానదు.
‘ఏంటీ డాడీ ఆలోచిస్తున్నావ్?-‘
‘ఏంలేదమ్మా… నే మళ్లీ కలుస్తాలే! మీరుంటున్న ఇంటి అడ్రసు చెప్పు! – నాకు అవతల అర్జెంటుపనుంది… ఆపని పూర్తి చేసుకుని మనింటికొస్తాను… ఏం?-‘ లాల్చీ జేబులోనికి చెయ్యి పోనిచ్చి నాలుగు వెయ్యి రూపాయల నోట్లు బయటికి తీసి నీరజ చేతిలో వుంచి ‘నువ్వు టెన్త్ మంచి మార్కులతో పాసైనందుకు నేనిచ్చే గిఫ్ట్…’ అని చెప్పి కారెక్కి వెల్లిపోయాడు నాయుడు. ప్రస్తుతానికి తప్పించుకున్నాడు.
అవునూ… డాడీ ఇంటి అడ్రసు అడిగి నేను చెప్పేలోపే వెళ్లిపోయాడేంటి?- అడ్రసు లేకుండా ఇంటికెలా రాగలడు?- అసలు డాడీ వస్తాడా? రాడా?
గబాగబా ఇంటికొచ్చేసిన నీరజ తల్లి పడుకున్న నులకమంచాన్ని సమీపించి డాడీ ఇచ్చిన డబ్బు తల్లి చేతికిచ్చింది సంబరపడిపోతూ!
‘పిచ్చితల్లి! నీ ముఖాన నవ్వు చూచి ఎన్నేళ్లయిందే?- ఎందుకే అంత ఆనందం?-‘ రాజమ్మ పడుకుని వున్నదల్లా లేచి కూర్చోబోతూ అడిగింది.
‘అమ్మా… నాన్న బజార్లో అవుపించాడే! నేను గుర్తుపట్టి పలకరించాను. నేను పరీక్ష పాసైన సంగతి చెప్పా! ఇంటికి రమ్మన్నాను. మళ్లా వస్తానని చెప్పి నా చేతిలో ఈ డబ్బు వుంచి అర్జెంటుగ వెళ్లాల్సిన పని వుందని కారులో వెళ్లిపోయాడమ్మా…’
కూతురి నోట ఆ మాట వినగానే రాజమ్మ మొహం చాటంతైంది. అంతలోనే నిరుత్సాహం ఆవహించటంతో ‘ఆయన మనింటికెందుకొస్తాడే పిచ్చితల్లి! – ఆయనిక రారు!. మనల్ని ఎప్పుడో మర్చిపోయారాయన!
‘నిజం మమ్మీ ! తప్పకుండా వస్తానన్నాడు కనుక…. నీవెక్కడ బాధపడుతావో అనే నీ తృప్తికోసం అన్న మాటలే అవి! ఆయనకు రావాలనే వుంటే… నిన్ను వెంట బెట్టుకుని ఇంటికొచ్చేవాడే! అలా రాలేదూ అంటే నా ముఖం ఆయన చూడటానిక్కూడా ఇష్టం లేదన్నమాట! చెప్తూ బాధపడింది.
‘డాడీ చాలా మంచివాడమ్మా! చెడ్డవాడు మాత్రం కాదు…’
‘ఒక్క మీ డేడీయే కాదే…. మగాళ్లంతా ఇంతే! తాము వుంచుకున్న దానితో జీవితాంతం కలిసివుండరే. మధ్యలోనే వదిలేస్తారు. ఏదో విధంగ వదిలించుకుంటారు… నీకివన్నీ అర్థంకావులే…. చిన్నపిల్లవి..’ జీవితానుభవాన్ని లోకరీతితో రంగరించి చెప్పింది రాజమ్మ. మంచంలో పడుకున్న రాజమ్మ ఖొళ్లు ఖొళ్లున దగ్గుతోంది. మధ్య మధ్య ఉమ్ముతోంది. అప్పుడప్పుడు నెత్తురు పడుతోంది నోటివెంట.
వళ్లు బాగుండకపోవటంతో రాజమ్మ పదిరోజులుగ పన్లోకి పోవటంలేదు. నీరజను ఆ నాలుగిళ్లకు వెళ్లి పని చేసి పైసలు తెమ్మంటే అది ససేమిరా పోనని మొండికేసింది. చదువుకున్న పిల్లకదా! పాచిపన్లప్పగించటం తనదే తప్పు! మరైతే ఇల్లు గడిచేదెట్లా! సగం దిగులు రోగంతో మనిషి చిక్కి సగమైంది రాజమ్మ. కడుపులోకి ధారకం పోవటంలేదు.
తల్లి రోజురోజుకు నీరసించిపోవటం చూచి ‘అమ్మా!… నిన్ను దర్మాసుపత్రిలో చేర్పిస్తాను… వెళ్దాం పద! – కొన్నాళ్లపాటు మందులు తీసుకుంటే కాని నీ ఆరోగ్యం కుదుట పడదు…’ బలవంతాన తల్లి రెక్కపుచ్చుకు నడిపించి ఆటో ఎక్కించింది నీరజ.
ఆస్పత్రి ముందు ఆటో దిగి లోనికెళ్లి తల్లి కోసం ‘వీల్స్ ఛైర్’ తెమ్మని అక్కడున్న వార్డ్‌బోయ్ నడిగింది. వాడు ఎగాదిగా చూచి ‘కరుసవుద్ది…’ నీలిగాడు.
వార్డ్‌బోయ్ సమాధానం అర్థం కాలేదు నీరజకు.
‘ఏంటయ్యా నువ్వనేది? – పెషేంట్ ఆటోలో వుంది. ఆవిడ మా అమ్మ! నడిచిలోపలికి రాలేదు…’
‘అట్టనా!? – ఓ పదికొట్టండి. ఛైర్ తెత్తాను….’
‘ఇవ్వకపేతే తేవా?-‘
”నేనే కాదు ఎవ్వరూ తీసుకురారు… మామూలు ఇవ్వనిదే…’
‘అలాగేం?… నేనే వీల్స్‌ఛైర్ తెచ్చుకుంటాను….’
‘మీరు దాన్ని ముట్టుకోను వీల్లేదు!
‘డాక్టర్‌కి కంప్లైంట్ చేస్తాను…’
‘నీ మాట ఇక్కడ ఆలకించే వారెవరూ లేరు…’
విసవిసా లోనికి నడిచి వార్డ్‌బాయ్ ప్రవర్తన గురించి అక్కడున్న డాక్టర్‌కు ఫిర్యాదు చేసింది నీరజ.
‘వాళ్లతో ఎందుకొచ్చిన గొడవ, వాళ్లు అడిగింది మొహానకొడితే మీ పని వెంటనే అయిపోను కదా?-‘ అన్నాడు డాక్టర్.
నీరజ ఆమాట వినగానే వళ్లు మండినట్టన్పించింది. వీళ్లీ విధంగ అవినీతి ప్రోత్సహించడం నచ్చలేదు.
వార్డ్‌బోయ్‌కి లంచం ససేమిరా ఇవ్వదల్చుకోలేదు నీరజ! తనే తల్లిని ఆటోలోంచి దింపి తన భుజం మీద ఆమెచెయ్యి వేసి హాస్పిటల్ అవుట్ పేషెంట్ వార్డ్ వైపు మెల్లగా అడుగులో అడుగేస్తూ నడిచింది.
‘డాక్టర్! ఈమె నా తల్లి ! ఇరువై రోజులుగ ధారకం లేదు. నీరసించి పోతుంది! తెగ దగ్గుతోంది. ఉమ్మినపుడల్లా నెత్తురు కూడా పడుతోంది. కాస్త చెకప్ చేసి ఎడ్మిట్ చేసుకుని ట్రీట్‌మెంట్ ఇప్పించండి?…’ గుక్కతిప్పుకోకుండా మాట్లాడింది నీరజ.
‘బెడ్లు ఖాళీలేవ్! ఇన్ పేషెంట్‌గ ఎడ్మిట్ చేసుకోలేం…. కావాలంటే నాలుగు బిళ్లలు… రెండు గొట్టాలు ఒక ఇంజక్షన్ ఇస్తాను! వెళ్లిపోండి ఇంటికి…’
వీడేం డాక్టర్‌రా బాబూ అని విసుక్కుంది నీరజ.
‘అమ్మాయ్…. చూడూ! బెడ్ కావాలన్నా…. పేషెంట్‌ను ఎడ్మిట్ చేసుకోవాలన్నా… ట్రీట్‌మెంట్ ఇవ్వాలన్నా… డాక్టర్ గారికి ఓ వెయ్యి రూపాయలు ముట్ట చెప్పండి!. లేకపోతే ప్రయోజనం ఉండదు….’ నర్స్ చెప్పింది.
ఆ విధంగ మాట్లాడిన నర్స్ చెంప చెళ్లుమన్పించాలనుకుంది నీరజ కానీ…. డ్యూటీలో వున్న వుద్యోగిపై చెయ్యి చేసుకోవటం నేరమౌతుందనే భయంతో పొంగివచ్చే కోపాన్ని దిగమింగింది.
‘నేనెవరో తెలుసా?-‘ గుడ్లురిమింది నీరజ నర్స్‌ను చూచి పళ్లు కొరుకుతూ.
‘ఎవరేంటి?.-‘
‘కాంట్రాక్టర్ నాయుడు కూతుర్ని…’
‘నువ్వు ముఖ్యమంత్రిగారి పుత్రికవైనా మామూళ్లు ఇవ్వనిదే ధర్మాసుపత్రిలో పన్లు జరగవ్!- అటుచూడు ఓసారి! వాళ్లంతా డబ్బు ఇవ్వని పేషెంట్లే! నేలమీద ఎలా పడుకున్నారో చూడు…!
నిరాహారదీక్ష చేస్తున్నవారిలాగ…. నీ తల్లి గతీ అంతే… ఎల్లెల్లవమ్మా… చదువుకున్న పిల్లలా వున్నవ్.. మీయమ్మ మంచి కోరి సలహా ఇస్తే నీలుగుతావేంటీ…’ అన్చెప్పి అక్కడ్నించి నిష్క్రమించింది నర్స్.
రోగం ముదరటంతో రాజమ్మ కళ్లుమూసింది. తల్లి అంత్యక్రియలు నీరజ తానే జరిపించింది. తనకు ఇన్నేళ్లుగా అండగ వున్న కనిపెంచిన తల్లి కూడా పోవటంతో నీరజ వంటరిదైంది.
ఈ విషయం తండ్రికి చెప్పటం ఎట్లా?- ఆయన్ను కలవటం? ఎక్కడని వెతగ్గలదు తాను?
తానిప్పుడు ఒంటరి! తండ్రి పట్టించుకోలేదు. వుండే తల్లి కాస్తా కాలం చేసింది. నీరజకు అంతా అంధకారబంధురంగా తోచింది.
తనకున్న ఒక్కొగానొక్క మిత్రురాలు మేరీ తనకు ధైర్యాన్ని నూరిపోసింది. ఒంటరితనాన్ని దూరం చేయటంకోసం ఒక ఆదివారం నాడు మేరీ తనతోపాటు నీరజను కూడా ‘చర్చి’కి తీసుకెళ్లింది.
తానేమో హిందువు అయినా ఇష్టపడే చర్చికొచ్చింది. తన జీవితానికో వెలుగు ప్రసాదించమని మనసారా ఏసు ప్రభువును వేడుకుంది నీరజ.
చర్చి కేంపస్‌లోనే మిషనరీ హాస్పిటల్… నర్స్ ట్రైనింగ్ సెంటర్ కూడా వుందని మేరి చెప్పింది. నీరజ తనలో తాను నర్స్ కావాలనుకుంటున్న విషయం మేరీకి చెప్పింది. ఇక్కడ తనకు సాయం ఎవరైనా చేస్తారా అని మేరీని అడిగింది.
‘అక్కడ క్రైస్తవులకు మాత్రమే సహాయం లభిస్తుంది. నువ్వేమో హిందువు కదా?- ఆ ! నాకో ఆలోచన వచ్చింది నీకెవ్వరూ లేరు. నువ్వు క్రైస్తవ మతం పుచ్చుకోవటానికి ఇష్టపడితే ప్రభువు నిన్ను అక్కున చేర్చుకుంటాడు. ఆలోచించుకో…’ తనకు తోచింది చెప్పింది మేరీ.
ష్యూరా ! – నాకు అడ్డు చెప్పేవారే లేరు? – నేను నా ఉజ్వల భవిత కోసం మతం మార్చుకుంటాను. నేరెడీ…’ వెంటనే తన అంగీకారాన్ని వెలిబుచ్చింది నీరజ సంబరపడిపోతూ.
క్రైస్తవమతం పుచ్చుకున్న మరుక్షణమే నీరజ పేరు మైసమ్మగా మారిపోయింది.
తాను నర్స్ ట్రైనింగ్‌లో వుండగా అప్పుుడప్పుడు తండ్రి గుర్తుకొచ్చేవాడు. ఆయనే కనుక ఆపన్నహస్తాన్ని అందించి అండగా వుంటే తాను డాక్టరే కాగలిగేది. ఇప్పుుడేమో ఏసు ప్రభువు ఆశీస్సులతో నర్స్ అవబోతోంది.
రోజులు గడుస్తున్న… తల్లిని మాత్రం మరిచిపోలేక పోతుంది. తనకోసం ఎంతో కష్టపడి తనను టెన్త్ వరకు చెప్పించి తన భవిష్యత్‌కో దారి కల్పించింది. ఆ మాతృమూర్తిని తాను జన్మజన్మలకు మర్చిపోలేదు.
నిస్సహాయస్థితిలో ఒంటరిగా మిగిలిపోయిన తనను స్నేహితురాలు సరైన సమయంలో సరైన సలహా ఇచ్చి ఆదుకుంది. అదేమరి! ఎంత మంచి స్నేహితురాలు మేరీ! మేరీ చేసిన మేలు ఈ జన్మకు మరువలేదు తను!
నర్స్ ట్రైనింగ్ చేస్తూ రెసిడెన్షియల్ హాస్టల్లో వుంటోంది మైసమ్మ ! తనకు అన్నీ ఫ్రీనే ! మెస్ చార్జెస్ వుండదు. పై పెచ్చు నెలనెలా స్టైఫెండ్ కూడా వస్తోంది. ఆ డబ్బు కేంపస్ బ్యాంకులో అకౌంట్ ఓపెన్ చేసుకుని దాచుకుంటోంది.
నర్స్ వుద్యోగమంటే ఎంతో గొప్పది! మానవసేవే మాధవసేవ! వ్యాధిగ్రస్తుల పట్ల ఆప్యాయతానురాగాలు చూపిస్తూ సర్వీస్ చేస్తుంటే ఇటు తనకు అటు రోగులకు ఎంత తృప్తి?… ఎంత మనశ్శాంతి?
సరిగ్గా అదే సమయంలో తన తల్లిని హాస్పిటల్‌లో జాయిన్ చేయటానికి వెళ్లినప్పుుడు అక్కడ కల్సిన నర్స్ తన మనసు ఎంత కలుషితం చేసింది?- అలాంటి వ్యక్తులు నర్స్ జాబ్‌కు సూటవనే అవరు అనుకుంది.
ప్రతిరోజూ ఉదయం సాయంత్రం చర్చికి వెళ్లి ప్రార్థనలు చేస్తోంది. బైబిల్ శ్రద్ధతో చదువుతోంది.
ఒక ఆదివారం నాడు మేరీ చర్చిలో కలిసింది. ఎంతో సంతోషంగా ఇద్దరూ ఎన్నో విషయాలు ముచ్చటించుకున్నారు!
‘బైదిబై మైసమ్మా ! – పై వారమే నా ఎంగేజిమెంట్…’ అంది మేరీ.
‘అవునా!… కంగ్రాట్స్… అవునూ నీ వుడ్ బీ ఏంచేస్తున్నారు.
‘చెప్పనా?… చెప్పనా… చెప్తే నువ్ స్టన్ అవుతావ్….’
‘అబ్బా…. ఊరించక చెప్పవే…’
‘ఆయన… అదే నా శ్రీవారు… నా లైఫ్ పార్ట్నర్ ఐ.ఎ.ఎస్.(జాయింట్ కలెక్టర్‌గా) వున్నారు….’
‘అబ్బో మేరీ…. నువ్వెంత లక్కీ…. గాడ్ బ్లస్ యూ’ కౌగిలించుకుని బుగ్గ మీద కిస్ చేసింది మైసమ్మ.
‘అవునూ… నీవెప్పుడు మేరేజ్ చేసుకుంటావే…?’
‘పెళ్లా?.. నేనా?- నోనో… నేను మేరేజ్ చేసుకోను…’
‘అదేంటి?-‘
‘జీవితాంతం నేను మానవసేవలో ఒంటరిగానే వుండిపోతాను- నీకింకో సర్‌ప్రైజింగ్ విషయం చెప్పనా? నేను ఈ ప్రపంచంలో ఒంటరిని ! నాకెవ్వరూ లేరు. అలాంటి నాకు మేరేజ్ దేనికీ?- నేను మతం మార్చుకుంటానని ఏనాడు అనుకోలేదు. వంటరినైన నేను ‘నన్’ గా మారాలనుకుంటున్నాను. వాట్‌డు యూ సే? – నా నిర్ణయం సరైనదే కదూ? – నా నిర్ణయాన్ని ఏసుప్రభువు తప్పక హర్షించి ఆశీర్వదిస్తాడు. ప్రభువు దీవెనలు నాకెప్పుడూ వుంటయ్…’ తన భవిష్యత్ నిర్ణయాన్ని మేరీతో చెప్పి చెమర్చిన కళ్లు తుడుచుకుంది మైసమ్మ.
ఫ్రెండ్ మాటలు విన్న మేరీ అవాక్కైంది !. తర్వాత మెచ్చుకుంది!!
నర్స్ ట్రైనింగ్ పూర్తి చేసుకున్న మైసమ్మ అదే హాస్పిటల్లో పోస్టింగ్ ఆర్డర్స్ అందుకుంది. మధురానుభూతిని పొందిన ఆక్షణంలో ముందుగా జన్మనిచ్చిన తల్లిని గుర్తుచేసుకుంది. అమ్మచేతి చలువవల్లే తనీనాడు తనకాళ్ల మీద తాను నిలబడగలిగింది. తరువాత తండ్రిని తల్చుకుని కృతజ్ఞతలు మనుసులోనే తెల్పుకుంది ! చివరగా తనకు మేలు చేసిన మేరికి కృతజ్ఞతలు చెప్పుకుంది.
సాయంత్రం చర్చికి వెళ్లి ఫాదర్‌కు నమస్కరించి తాను జీవితాంతం అవివాహితగానే వుండిపోవాలనుకుంటున్న కోర్కెను, ధృఢసంకల్పాన్ని వ్యక్తం చేసి తనను ‘నన్’గా మార్చమని వేడుకుని ఏసుప్రభువును పాదాల ముందు మోకరిల్లింది.
తన మనసులోని కోరిక ప్రకారం మైసమ్మ ‘నన్’గా మారింది ! ఆ క్షణంలో ఆమె తనువు పులకరించింది. హృదయాంతరాళంలో నుండి ఆనందం పెల్లుబికింది.
ఆరోజు తన డ్యూటీ ఎమర్జెన్సీ ఓ.పి.లో వుండటంతో మెడలో వ్రేలాడే ప్రభువు శిలువ కళ్లకద్దుకుని ఐ.సి.యు. చేరుకుని అక్కడే వున్న హెడ్ నర్స్‌ను చూచి విష్ చేసింది.
ఐ.సి.యు.లో ఎమర్జెన్సీ కేసొకటి రావటంతో లోపలంతా హడావుడిగా వుండటం గమనించింది.
పేషెంట్ శరీరమంతా నెత్తుటి మరకలతో నిండి వుండటాన డ్రెస్సింగ్ జరుగుతోంది. యాక్సిడెంట్ కారణాన నెత్తురు చాలాపోయిన పేషెంట్‌కి నెత్తురు ఎక్కిస్తున్నారు.
రెండు కాళ్లు చితికిపోవటాన ఆపరేషన్ చేయటానికి డాక్టర్లు ప్రిపేరవటం మైసమ్మ గమనించింది. పేషెంట్ స్పృహ లేకపోవటాన ఆక్సిజన్ మాస్క్ ముఖానికి అమర్చటం చూసింది.
అక్కడున్న డాక్టర్లకు నర్స్‌లకు తనవంతు సాయం సహకారాన్ని అందిస్తోంది మైసమ్మ !
ఆపరేషన్ చేసి రెండు కాళ్లు మోకాళ్ల నుండి క్రింద భాగాన్ని తొలగించటం జరిగింది. మొత్తానికి చావు బ్రతుకుల్లో వున్న పేషెంట్‌ను అంతా ఏకమై బ్రతికించగలిగినందుకు అక్కడ గల వారిలో తృప్తి ద్యోతకమైంది. అంతా ప్రభువు దయ అనుకున్నారు !
రెండవ రోజున పేషెంట్ స్పృహలోకొచ్చి కళ్లు తెరిచాడు. ఎదురుగా వున్న మైసమ్మను తరచి తరచి చూస్తూ ‘నీరజా… నువ్విక్కడ.. ఈ డ్రస్సులో…’ పొడిపొడిగ మాటలు నాయుడు నోట్లోంచి వెలువడినయ్.
పేషెంట్ తన ‘డాడీ’ అని గుర్తించినా ఆయనెవరో తనకు తెలియనట్టుగానే వుండిపోయింది మైసమ్మ.
‘నేన్నీకు మీ అమ్మకు తీరని ద్రోహం చేశాను. అందుకే నా రెండు కాళ్ళూ పోగొట్టి సరైన శిక్ష విధించాడా దేవుడు. మీ అమ్మ ఎలావుంది నీరజా?-‘ తడబడే మాటలతో ప్రశ్నించాడు.
‘మమ్మీ అనారోగ్యంతో చనిపోయి రెండేళ్లయింది!- దిక్కు మొక్కు లేని నాకు ఓ ఫ్రెండ్ సాయం చేసి భవిష్యత్‌కు మార్గం చూపింది…. నేను నీరజను కాను. నా పేరు మైసమ్మ ! ఏసు ప్రభువు బిడ్డను…! వణికే స్వరంతో జవాబిచ్చింది.
‘నువ్వు మతం మార్చుకున్నావా తల్లీ!… అవున్లే… సరైన నిర్ణయమే తీసుకున్నావ్. నువ్వు ఎవ్వరూ లేని అనాధగా మిగిలిపోకూడదు తల్లీ… ఆ జీసస్ నిన్ను అన్నివిధాల ఆదుకున్నాడు. నేను చేయని పని ఆ భగవంతుడు చేశాడు!. నేను మళ్లీ నిన్ను చూడలేనేమో అనుకున్నాను ! ఈ విధంగా మనం కల్సుకోవటం దైవకృప. గద్గద స్వరంతో మాట్లాడిన నాయుడి కంటి నుండి రెండు అశ్రుబిందువులు జాలువారి పక్కనే వున్న మైసమ్మ చేతిమీదపడ్డయ్.
ఆ స్పర్శకు ‘జీసస్!’.. అనుకుంది మనసులో మైసమ్మ!!!