పల్లవి : హిజ్రాలంటే ఎవరు ?
గొప్ప మానవత్వమున్న వజ్రాలు ||2||
కన్నీటి గాథల్తో
కథలు రాసుకుంటూ
అవమాన మాటల్తో
కడుపు నింపుకుంటూ
స్వాభిమానంకై – సాగిపొయ్యేటోళ్ళు ||హిజ్రా||
చరణం: సుట్టాలు పక్కాలు – రావద్దని చెప్పిన
అయినోళ్ళు కానోళ్ళు – ఎగతాళి చేసిన
అన్నదమ్ములు – అసహ్యించుకున్న
తల్లిదండ్రులు – ఇల్లిడిసిపొమ్మన్న
గుండెనిండా – బాదలున్న గాని
ఎన్నడు ఎవర్ని – నిందించలేదు
కన్నపేగే కాదని పొమ్మన్న
సమత మమతని మరవనోళ్ళు
”హిజ్రాలంటే ఎవరు – గొప్ప ప్రేమగల్ల బిడ్డలు” ||2||
చరణం: వేదాలు శాస్త్రాలు – పునాది అంటారు
రామాయణం భారతం – గొప్పాని చెప్తారు
అర్జునుడంటే – బృహన్నల అని
సౌందర్యానికే – మూలం అన్నారు
శిఖండి అంటే – వీరనారి అని
యుద్ధానికి – మరో పేరని అన్నారు.
హరిహర పుత్రుడు – అయ్యప్ప స్వామని
మాలలు వేస్తారు – భజనలు చేస్తారు
అర్ధనారీశ్వరుడు – శివుడాని చెప్పి
పురాణ కథలు – దండిగా అల్లారు
హరిహర అయ్యప్ప దేవుల్లు అయితే
మరి హిజ్రాలెందుకంటరానోళ్ళయే
”హిజ్రాలంటే ఎవరు
ఆ వేదాలకే పునాదులు”
హిజ్రాలంటే ఎవరు
స్వాభిమాన జండాలు
హిజ్రాలంటే ఎవరు
గొప్ప ప్రేమ గల్ల బిడ్డలు
హిజ్రాలంటే ఎవరు
ఆ వేదాలకే పునాదులు
హిజ్రాలంటే ఎవరు
మన మద్యల ఉన్నట్టి దోస్తులు