తెలంగాణ హిజ్రా ఇంటర్‌సెక్స్, ట్రాన్స్ జెండర్ సమితి నుంచి రచన, బిట్టు, వైజయంతి ఫోన్స్ చేసి 10-10-14 ఇందిరాపార్క్‌లో మా సమావేశముంది రావాలి అని చెప్పంగానే చిన్నప్పట్నించి వాల్లతో వున్న యాదులన్ని గుప్పుమన్నయి. సమాజంలో అంటరాని వాల్లకన్న అంటరానివాల్లు వీల్లు.
బెల్లంపల్లి సింగరేణి కాలరీ బస్తీల పక్కనే హిజ్రాల బస్తివుండేది. అప్పుడు(40 సం||ల కింద) కొజ్జోల్ల బస్తీ అనేటోల్లు. యిప్పుడు ఆ పదము అవమానించేదని వాడటము లేదు. నాకు వాల్లందరు పేర్లతో సహా యింకా గుర్తే. చాల గౌరవంగా మర్యాదగా వుండేటోల్లు, ప్రేమగా వుండేవాల్లు. చిన్నపిల్లల పట్ల చాలా ముద్దు జేసేవాల్లు. వాల్లంటే చాలా ప్రేముండేది. ఆడవాల్లందర్ని అక్కా, మగవాల్లను బావా అనే వాల్లు. వాల్లతో వుండడం వాల్ల సమక్షంలో వుండడం మంచిగనిపించేది. అపురూపమనిపించేది. కొంతమంది మగవాల్లు జుట్లు పెంచుకొని చీరలు కట్టుకున్నట్లు తెలిసేది, కొంతమంది అట్లా తెలువకపోయేది.
నా చిన్నప్పుడు నన్ను బాగా ఏడిపించిన అనుభవం యిప్పటికి మెలిపెడ్తుంటది. రాజన్న అని ఒకతను మాయింటి పక్కన గుడిసెలో వుండేది. దోతి మోకాల్ల దాక టైట్‌గా వుండేది. రెక్కల బనీను కూడా గుత్తెంగా యేసుకొని కాటిక బొట్టు పెట్టుకొని నాజూకు, నాజుగ్గా మాట్లాడేది. ఉప్పరి పనికిపోయేది. చిన్న పిల్లల్ని ఎవర్ని గొట్టినా ఎత్తుకుని ఆడిపిచ్చుకొని బిస్కెట్లు పిప్పరమెంట్లు కొనిచ్చేది. అట్లా నన్ను మాయింట్ల వాల్లు కొట్టినప్పుడల్లా ఎత్తుకొని అటిటూ తిప్పి ముద్దుజేసేది, తినేవి కొనిచ్చేది. రాజన్న దగ్గర వుంటే బాగుండు. అట్లాంటి ప్రేమ కుటుంబంలో దొర్కకపొ యేది. అందుకే రాజన్నతోనే వుండాలనిపి చ్చేది. రాజన్నను ఆడోల్లు రాజన్నంటే, మగోల్లు ‘రాజాలు’ అని పిలిచేది. రాజన్న బతుకు రాజన్న బతుకుతున్నా తమ్ముల్లు, చుట్టాల మొగవాల్లు తిట్టిపోయేది కొట్టిపోయేది ‘యీ ఆడిబుద్ది మార్చుకో, బట్టబాత మంచిగ గట్టుకో యీ ఆడిసెకలేంది అనీ పెండ్లాన్ని తీసుకొచ్చుకో యాడికి బోయినా వచ్చినా నీ వల్ల తలెత్తుకోలేక పోతున్నమని కొట్టేటోల్లు. రాజన్న బాగా ఏడ్చేది. అసహాయంగ నాకేమి అర్తంకాక రాజన్నతో పాటు నేంగూడ ఏడ్చేది. యీల్ల పెద్దిర్కం నాశనంగాను, నాబతుకు నన్ను బత్కనియ్యరా వద్దనంగ పెండ్లిజేసిండ్రు నేనేంజెయ్యను, వాల్లజోలికి బోతలేను, వార్తకు బోతలేను నాయింటి మీదికొచ్చి కొట్టడు తిట్టుడేంది? ఎవ్వరు న్యాయం జెప్పరా న్యాయం పాడువడ, దేవుడు లేడా ! అని ఏడ్చేది రాజన్న. అట్లా రాజన్నకు జరిగిన అవమానం, హింస, గేలిచేయడం ఎందుకో తెలువకున్నా అట్లా చేసిన వాల్లపట్ల విపరీతంగా ద్వేషించేది. తర్వాత రాజన్న ఎటో వెళ్లి పోయిండు. యింకా కొన్నాల్లకు ఏదో అయి చనిపోయినట్లు తెలుసుగానీ పూర్తి వివరాలు తెలువలే. యాదొచ్చినప్పుడల్లా ఆ ప్రాణిని అట్లా హింసపెట్టాల్నా ఎట్లోకట్ల బత్కనిస్తే ఏంబొయింది అనుకునేది. రాజన్నను తన యిష్టమొచ్చినట్లుగా బత్కనియ్యలే…. ఎక్కడికక్కడ గాయాలు జేసి చంపేసింది కుటుంబము, సమాజము.
అట్లా మాబస్తీ పక్కన హిజ్రాల బస్తీ వుండడం వల్ల రాజన్నతో వున్న అనుబంధం ప్రేమవల్ల, రాజన్న మీద జరిగిన హింస, దౌర్జన్యాలు దగ్గరినుండి చూసినందువల్ల వాల్లంటే గౌరవం, ప్రేమ. తర్వాత్తర్వాత, కేరళ, తమిళ్‌నాడు, కర్నాటకల్లో సంగాలు ఏర్పడ్డం, ఆత్మగౌరవ పోరాటాలు, వాల్ల సభలు, చర్చలు యింకా వాల్లకు దగ్గర జేసినయి.
సమాజంలో ఆడ, మగనే కాదు యింకా అనేక జెండర్ వైవిద్యాలున్నాయి. అగ్రకుల మగస్వామ్యం ట్రాన్స్‌జెండర్, హిజ్రాల పట్ల చాలా కౄరంగా హీనంగా చూసింది. వాల్లమీద అనేక దాడులు దౌర్జన్యాలు చేసింది. మిగితా కింది కులాల మగవాల్లు, ఆడవాల్లు వాల్లపట్ల ద్వేషమున్నా అది ఆధిపత్య పితృస్వామ్య భావజాలం నుండే వచ్చిందనుకోవాలి.
పురాణాల్లో, చరిత్రల్లో చూస్తే అంతప్పురం ఆడవాల్ల రక్షణ కోసం హిజ్రాలనుపయోగించి వాల్లని ఆ కాపలా కోసం పెద్ద ఎత్తున బలిదానాలు జరిగేవని తెలుస్తది. ఆడ రూపం దాల్చిన విష్ణువు, శివునికి పుట్టిన అయ్యప్ప హిజ్రా. కానీ యిదే పురుషులు పెద్దఎత్తున అయ్యప్ప మాలలు వేసుకొని భజనలు చేస్తరు. స్వామియే శరణమయ్యప్పా అని మరి అదే హిజ్రాలను మానవత్వం లేకుండా మనుషులుగా గుర్తించకుండా అనేక దాడులు, అవమానాలు, ఎలాంటి మానవ హక్కులు, మానవ చట్టాలు అమలుచేయని దమన నీతి అమలుచేయడం దుర్మార్గం. సమాజంలో మనుషులుగా బతకగలిగే పరిస్థితిలేదు.
స్వతంత్ర తెలంగాణలో హిజ్రా, ట్రాన్స్‌జెండర్, ఇంటర్‌సెక్స్ సమితిగా ఏర్పడడం స్వాగతించాల్సిన అంశము. తెలంగాణ ప్రభుత్వం వారు కోరుతున్నట్లు వారికోసం సంక్షేమ మండలిని ఏర్పాటుచేయాలి, సుప్రింకోర్టు యిచ్చిన నాల్సా తీర్పుననుసరించి రిజర్వేషండ్లు ఉద్యోగరంగంలో కల్పించాలి, అమలుచేయాలి. వీరిమీద జరిగే దాడులను నేరాలుగా గుర్తిస్తూ ప్రత్యేక అత్యాచార నిరోధక చట్టం రూపొందించాలి. మహిళల కోసం అమలవుతున్న చట్టాల్ని హిజ్రాలక్కూడా వర్తించేలా చేయాలి. పబ్లిక్ ప్రదేశాల్లో ప్రత్యేక టాయిలెట్లు ఏర్పాటుచేయాలి. యింకా డిమాండ్స్ సమాజమ్ముందు పెట్టారు. వారి పోరాటానికి భుజం కలుపుదాము.