కోయంబత్తూర్ వెళ్ళింది కె కె ఎస్ జాతీయ స్థాయి పార్టనర్స్ సమావేశానికి. భూమిక హెల్ప్‌లైన్, సి.ఐ.డి. ఆఫీసులో ఉన్న భూమిక సపోర్ట్ సెంటర్‌లకు గత ఫిబ్రవరి నెలలోనే ఆక్స్ ఫాం ఇండియా సపోర్ట్ ఆగిపోయింది. వాళ్ళు ఏపి నుండి ఒరిస్సాకు వెళ్ళిపోయారు.హెల్ప్‌లైన్ ఆగిపోయే పరిస్థితి వచ్చిందని నా మిత్రులందరికీ తెలుసు.అలాంటి సమయంలో కె కె ఎస్ అనే ఒక జర్మన్ సంస్థ హెల్ప్‌లైన్‌ని సపోర్టు చెయ్యడానికి ముందుకొచ్చింది. దీనికి సంబంధించిన తొలి సమావేశం కోయంబత్తూర్‌లో జరిగింది.
వివిధ రాష్ట్రాల నుండి వచ్చిన 34మంది కె కె ఎస్ పార్టనర్స్‌తో ఈ సమావేశం రెండు రోజులపాటు జరిగింది. అన్ని రాష్ట్రాల ప్రతినిధులతో పరిచయాలేర్పడి వారు చేస్తున్న వివిధ కార్యక్రమాల గురించి తెలిసింది. ఇది కోయంబత్తూర్ వెళ్ళిన కారణం. మేమున్న ట్రయినింగ్ ఇన్స్టిట్యూట్ కోయంబత్తూర్‌కి 50 కిమీ దూరంలో వెస్ట్రన్ ఘాట్స్ (పడమటి కనుమలు)కి అతి సమీపంలో ఉంది.చుట్టూ పచ్చటి కొండలు…లోయలతో మహా అందంగా ఉంది. ప్రశాంతి…. భూమిక ప్రెసిడెంట్ హోదాలో నాతో ఈ మీటింగ్‌కి వచ్చింది.ఇద్దరం కలిసి చేసే ప్రయాణాలు…ఆ అనుభవాలు అద్బుతంగా ఉంటాయి.
మేము 20వ తేదీ సాయంత్రం ఫ్లైట్‌లో కోయంబత్తూర్ బయలుదేరాం.అది ఏటీఅర్ ఫ్లైట్(చిన్న విమానం)… తెగ కుదుపుతుందని నాకు అస్సలు నచ్చదు. అయితే కుదుపులేమీ లేకుండా హాయిగానే ఉంది. ఏడు గంటలైనా ఆకాశంలో సుర్యాస్తమయం కాలేదు. అద్భుతమైన వర్ణాలతో పడమటి ఆకాశం శోభాయమానంగా ఉంది. ఆ రంగుల్ని చూస్తూ మేము కబుర్లలో మునిగాం. ” అమ్మూ! మనం 80 గంటలు కలిసి వుండబోతున్నాం.” అంది ప్రశాంతి మహానందంగా. ”భలే! ఎన్ని కబుర్లు చెప్పుకోవచ్చో కదా!” అన్నాను నేను ఆకాశంలో మారుతున్న రంగుల్ని చూస్తూ. 7.30కి ఫ్లైట్ దిగి 8.30కి ట్రయినింగ్ ఇన్స్టిట్యూట్ చేరుకున్నాం. అడవిలోంచి, కొండల్లోంచి వెళుతున్నాం కానీ అవేవి స్పష్టంగా కనబడ్డం లేదు. కోయంబత్తూర్ టౌన్ లోంచి ఈ ప్రాంతానికి రాగానే వాతావరణం చల్లగా ఉంది. గాలిలో తేమతో పాటు తేలికదనం ఉండి హాయిగా అనిపించింది. మేము రూంలో సెటిల్ అవ్వగానే డిన్నర్ రెడి అని పిలుపొచ్చింది. చాలా వేడిగా రుచికరమైన భోజనం. డైనింగ్ హాల్‌లో చాలామంది ఇతర రాష్ట్రాల ప్రతినిధులు కలిసారు. కాసేపు వాళ్ళతో కబుర్లయ్యాయి. ఆ తర్వాత ఇద్దరం ఆవరణలో చాలా సేపు నడుస్తూ మాట్లాడుకున్నాం. ఎప్పుడు తెల్లవారుతుందో… చుట్టూ ఏమున్నాయో చూడాలనే అనే ఆతృత ఇద్దరికీ. వేడి వేడిగా తిన్నాం కదా కళ్ళ మీదకి నిద్ర ముంచుకొచ్చింది. రూంలోకి వెళ్ళేం కానీ నిద్రపోకుండా కబుర్లలో పడ్డాం. వాటికి అంతూ పొంతూ ఉండదు. మాట్లాడుకుంటూనే నిద్రలోకి జారిపోయాం.
రకరకాల పక్షుల కూతలతో… ఎక్కడో నెమలి అరుపులతో మెలకువ వచ్చింది. అర్రే!! తెల్లారిపోయింది అనుకుంటూ కిటికీ తలుపు తీసి చూద్దును కదా… దట్టంగా పెరిగిన చెట్లు… ఆ చెట్ల మీద నుంచే పిట్టల అరుపులు. గబ గబ బ్రష్ చేసేసుకుని రూం లోంచి బయట కొచ్చాం. వావ్!! చుట్టూ అడవి… ఆకుపచ్చటి కొండలు. ఆ కొండల మీద కూర్చున్న మబ్బులు. అద్భుతం. ఇద్దరం బాగా ఎగ్జైట్ అయ్యాం. ఆవరణంతా తిరుగుతూ ప్రతి చెట్టుని పలకరిస్తూ… దూరంగా ఉన్న కొండల్ని పారవశ్యంతో చూస్తూ చాలా సేపు తిరిగాం. మీటింగ్‌కి టైం అవుతోంది. తిరగడం చాలించి రూంకి వెళ్ళిపోయాం. 9.30 మీటింగ్ మొదలైంది. 5.30 అయిపోయింది.
తొలిరోజు మీటింగ్ అయిపోయాక ఇన్ట్సిస్ట్యూట్ ఆవరణ దాటి ఎదురుగా కనబడుతున్న కొండవేపు నడవసాగాం. ముందువేపు దట్టంగా పెరిగిన చెట్లు, వెనుక వేపు చెట్లులేని బండలాంటి కొండ పెద్ద గిన్నెను బోర్లించినట్టు భలేవుంది. వాటిని చూసుకుంటూ, కబుర్లాడుకుంటూ సన్నటి బాటమీద అడవిలోకి నడుస్తున్నాం. లోపల్లోపలికి వెళ్ళిపోయేవాళ్ళమే. వెనుక నుంచి ”మేడం! మేడం” అంటూ ఎవరో అరుస్తూ పరుగెత్తి వస్తున్నాను. మమ్మల్ని కాదులే అనుకుని మేము ముందుకెళ్ళసాగాం. సెక్యూరిటీ గార్డు పరుగెట్టుకుంటూ మా దగ్గరకొచ్చాడు. ”ఆప్‌లోగ్ బాహర్ జానా నహీ! ఓ పహడ్ తక్ జానా మనా హై” అన్నాడు ఆయన ఆయాసపడుతూ. ”ఎందుకు?” అని హిందీలో అడిగితే… ”అక్కడ ఏనుగుల గుంపు వుంది. దాడి చేస్తుంది. చలో! చలో! జల్దీ అందర్ చలో అంటూ అదరగొట్టాడు. మమ్మల్ని ఒక్క అడుగు కూడా ముందుకేయనీయలేదు. చేసేదేమీ లేక మేము వెనక్కి వచ్చాం. ”మేమ్‌సాబ్! ఆప్ ఐసా రిస్క్ నహీలేనా?” అంటూ రాత్రి ఏనుగుల గుంపు అదిగో అక్కడ రోడ్డు మీద నిలబడింది. కార్లన్నీ ఆగిపోయాయి. ఈ మీటింగ్‌కి వచ్చిన ఒకాయన కూడా కారులో వున్నాడు. మీరు బయటకెళ్ళొద్దు” అని ఏనుగుల కథ విన్పించాడు. మాకైతే సెక్యురిటీ వాళ్ళ కళ్ళుకప్పి ఏనుగుల్ని చూద్దామా అన్పించింది కానీ అప్పటికే సన్నగా చీకటి పడుతోంది. సాయంత్రం డాక్యుమెంటరీ కూడా వుందని చెప్పారు. ఇద్దరం ఆవరణ లోపలే ఇకచోట కూర్చుని, గూళ్ళకు చేరుతున్న పక్షుల పాటల కచేరి వింటూ గడిపేసాం.
ఆ రోజు సాయంత్రం ”హంగర్” మీద డాక్యుమెంటరి ఫిల్మ్ చూపించారు. నేను ఆ ఆకలి బీభత్స దృశ్యాలను చూడలేనని, రానని ప్రశాంతికి చెప్పాను కానీ పర్వాలేదులే అమ్మూ!! చూద్దాం అంది ప్రశాంతి. రెండు గంటల సేపు ఆ సినిమా చూసాం. చూస్తున్నంత సేపూ నేను ఏడుస్తూనే ఉన్నాను. కడుపులోంచి తెరలుతెరలుగా దుఃఖం పొంగుకొచ్చింది. ఆకలంటే ఏంటో తెలియని నాకు ఆకలి భీకర రూపాన్ని చూపించారు. కెన్యా.. హైతి.. మన ఛత్తీస్‌ఘడ్..లలో ఆకలి… మట్టిలో కొంచం చక్కెర కలిపి చేసిన కేక్‌లను గంపలలో దాచుకుంటుంటే మనమెంత నేరస్తులమో… ఎంత ఎక్కువ తింటామో… ఎంత వేష్ట్ చేస్తామో మనకి అర్ధమౌతుంది. ఆ దృశ్యాలను చూసి నేను పొగిలిపొగిలి ఏడుస్తుంటే ప్రశాంతి నన్ను గుండెల్లో పొదుపుకుంటూ ఓదార్చింది. ఆ రాత్రి నాకు నిద్రపట్టలేదు. చాలా సేపు మాట్లాడుకుంటూ ఉండిపోయాం. హంగర్ సినిమా మళ్ళీ మళ్ళీ గుర్తు వస్తూనే ఉంది. ఇద్దరం కబుర్ల జలపాతంలో తడిసిముద్దయ్యాం. నా దుఖాన్ని పోగొట్టడం ఎలాగో తనకి తెలసు…. తన సామీప్యత నన్ను చాలా ఓదార్చింది. ఆ తర్వాత నేను గాఢంగా నిద్రపోయాను.
మర్నాటి మీటింగ్ విశేషాలు చాలా ఉన్నాయి. వాటి గురించి వివరంగా రాయాలి. 60మంది ప్రతినిధులను మా ఇద్దరి ఉనికి అదరగొట్టింది. మేము లేవనెత్తిన అంశాలు వాళ్ళని ఒక అభద్రతలోకి నెట్టినట్టు మాకు అనిపించింది. కె కె ఎస్ పార్ట్‌నర్స్ అందరికీ జండర్ సెన్సిటివిటి ట్రయినింగ్ ఇవ్వాలని, ప్రతి పార్ట్‌నర్ జెండర్ పాలసిని అమలు చెయ్యాలని మేము ప్రతిపాదించాము. దీని మీద చాలా చర్చ జరిగింది. సమావేశానికి వచ్చిన ఎన్.జి.వోలందరూ పురుషులే. ఇద్దరు మాత్రమే మహిళలున్నారు. మేము తొలిసారి హాజరయ్యాం కాబట్టి వారెవ్వరి గురించి మాకు తెలియదు. అయితే మహిళల ప్రాతినిధ్యం చాలా తక్కువ వుందని మాకు అర్థమైంది. జర్మనీ నుంచి వచ్చిన కె.కె.ఎస్ ఎగ్జిక్యుటివ్ డైరెక్టర్‌కి భూమిక గురించి మేము చేసిన పవర్ పాయింట్ ప్రజంటేషన్ చాలా నచ్చింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో భూమిక చేసిన కార్యక్రమాలు, ట్రయినింగ్‌లు, అధ్యయనాలతో మేము పవర్‌పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చాము. నన్ను నేను పరిచయం చేసుకుంటూ నేను ఎడిటర్‌ని, రైటర్‌ని… ఫెమినిస్ట్‌ని అని చెప్పగానే… ఫెమినిస్ట్ అనే మాట అక్కడ కల్లోలాన్ని రేపింది. మీ ఆఫీసులో మగవాళ్ళు వుండరా? మీ పత్రికలో పురుషులు రాస్తారా? మీరు పురుష వ్యతిరేకులా? అమ్మో! ఫెమినిస్ట్‌లా! బచకే రెహనా హై లాంటి కామెంట్లు విని మేము ఆశ్యర్యపోయాం. పది పదిహేను సంవత్సరాలుగా డెవలప్‌మెంట్ ఫీల్డ్‌లో వున్నారు అందులో కొందరు. జండర్ సెన్సిటివిటీ వుండాలి. అసలు వీళ్ళకి జండర్ స్పృహ అంటే తెలుసా? అనిపించింది. మేము రెండు సూచనలు చేసాం. ఒకటి పార్టనర్స్ అందరికీ జండర్ సెన్సటైజేషన్ ట్రయినింగ్స్ చెయ్యాలి. రెండోది ప్రతి సంస్థ జండర్ పాలసీని పాటించాలి. సంస్థలో సగం మంది మహిళలుండాలి. మా సూచనలని జర్మన్ ఇ.డి వెంటనే ఆమోదించి…. జర్మనీ ప్రభుత్వం కూడా జండర్ కాంపొనెంట్‌ని ప్రమోట్ చెయ్యాలని భావిస్తోందని, ఈ సూచనని మేము పాజిటివ్‌గా తీసుకుంటున్నామని ప్రకటించగానే అక్కడున్న అందరికీ గొంతులో పచ్చి వెలక్కాయ అడ్డం పడినట్టయింది. రాయ్ అనే బెంగాలీ మాతో చాలాసేపు వాదనలు చేసాడు. వెకిలిగా మాట్లాడబోయి మా సీరియస్‌నెస్ చూసి ”హమ్మో! మిమ్మల్ని చూస్తే భయమేస్తుంది” అన్నాడు. అతనితో చాలా సేపు మాట్లాడాం.
కె.కె.ఎస్ వాళ్ళు ఇప్పటికే ”చైల్డ్ పాలసీ”ని అమలు చేస్తున్నారు. కె.కె.ఐ డి ట్రయినింగ్ సెంటర్ ఆవరణలో పిల్లలకు సంబంధించి స్నేహపూర్వకమైన చక్కటి నినాదాలు రాసి పెట్టారు. ఎటు వెళ్ళినా పిల్లలకి సంబంధించి ఏదో ఒక కాప్షన్ కన్పించి పిల్లల గురించి పాజిటివ్ ఆలోచనలకు ఆస్కారమిస్తుంది. అలాగే మహిళా ఫ్రెండ్లీ ఆవరణగా దీనిని తీర్చిదిద్దాలని మేము చెప్పాం. కె.కె.ఎస్ కుటుంబంలో మా ప్రవేశం బలమైన ముద్రవేసిందని ఇ.డి ప్రకటించారు. నాకు, ప్రశాంతికి కూడా అది నిజమేనని అన్పించింది. ‘ఫెమినిస్ట్’ అనే పదం వారందరినీ ఎందుకంత కలవరపరిచిందో… ఆ పదం పట్ల వారికున్న అవగాహన ఏమిటో నాకు అర్థం కాలేదు. బహుశ తదుపరి మీటింగ్‌లో కొంత క్లారిటీ వచ్చే అవకాశం వుండొచ్చు.
ఈ పరిణామాలను నేను, ప్రశాంతి కొంత ఆశ్చర్యంతోను, కొంత సంతోషంతోను గమనించాం. ఆశ్చర్యం ఎందుకంటే ఎన్నో సంవత్సరాలుగా ఎన్.జి.వో రంగంలో పనిచేస్తూ కూడా స్త్రీల అంశాలను సరిగ్గా అర్థం చేసుకోలేకపోవడం,… సంతోషమెందుకంటే ఇప్పటికయినా జండర్‌ని వాళ్ళ బుర్రల్లో వెయ్యగలగడం. ఒకాయనొచ్చి ”మీరు ఊరికే జండర్ జండర్ అంటున్నారు. ఏముంది అందులే… స్త్రీ లింగం… పుఃలింగమేగా” అన్నాడు. మేం బిత్తరపోయి నోళ్ళెల్ల బెట్టాం. ”జండర్” అంటే ఏంటి? ”జండర్ స్పృహ” అంటే ఏంటి అని ఆయనకు చెప్పాలంటే…. మీటింగ్ మరో మూడు రోజులుండాలని నవ్వుకుంటూ మేము డాక్యుమెంటరీ చూడ్డానికి వెళ్ళిపోయాం.
23వ తేదిన అక్కడకి దగ్గరలోనే వున్న సిరువణి వాటర్ ఫాల్స్… ఇషా సెంటర్ వెళ్ళాలని అనుకున్నాం. కారుణ్య ఇంజనీరింగ్ కాలేజిలో ఫ్రెండ్ కొడుకుంటే వాడిని చూసి సిరువణి వేపు బయలుదేరాం. అది చాలా గాఢమైన అటవీ ప్రాంతం. మా కార్‌ని లోపలికెళ్ళనివ్వలేదు. అటవీ శాఖవారి వాహనంంలో దట్టమైన అడవిగుండా తీసుకెళ్ళి వాటర్ ఫాల్‌కి ఓ అరకిలోమీటర్ దగ్గర దించారు. అక్కడ తరుల మీద కట్టిన వంతెన ఉంది. చెక్కలన్నీ ఊడిపోయాయి. మేము ఆ వంతెన ఎక్కకుండా వాటర్ ఫాల్ దగ్గరకెళ్ళాం. మన తలకోన జలపాతం లాగా ఉంది. చాలా ఉధృతంగా ఉరుకుతోంది జలపాతం. ఎత్తైన కొండల్లోంచి ఉరికి వస్తోంది. చుట్టూ పచ్చటి కొండలు..లోయలు మహాద్భుతంగా ఉంది. చాలా సేపు జలపాతం దగ్గరున్నాం. ఆ పచ్చదనాన్ని వదిలి రాబుద్ధి కాలేదు. కానీ ఇంకా ఇషా సెంటర్ కెళ్ళాలి… 6 గంటలకల్లా ఎయిర్పోర్ట్ చేరాలి. జలపాతం నుంచి తిరిగివచ్చేటప్పుడు తరుల వంతెన మీంచి నడిచాం. ఏ చెక్క ఊడి కిందపడతామో అనుకుంటూ జాగ్రత్తగా నడిచాం. చెట్ల మీద నడిచిన అనుభూతి. భలే ఉంది. ఇలాంటిది తలకోనలో కూడా ఉంది కానీ ఇది చాలా పొడవుగా ఉంది.
ఆ తర్వాత 150 ఎకరాల స్థలంలో జగ్గీ వాసుదేవ్ కట్టిన ఇషా సెంటర్‌కి వెళ్ళాం. ధ్యాన లింగం పేరుతో పెద్ద డోం లాగా కట్టిన దాంట్లో పెద్ద శివలింగం ఉంది. అక్కడ కూర్చుని 15 నిమిషాలు మెడిటేషన్ చేసుకోవచ్చు ఎవరైనా. అక్కడ అన్ని రకాల వ్యాపారాలు జరుగుతున్నాయ్. 150 ఎకరాలు ప్రభుత్వ భూమి కేటాయించారో… వాసుదేవ్ కొన్నారో తెలియదు. అది చాలా అందమైన ప్రాంతం, చుట్టూ కొబ్బరి, పోక తోటలు. ఎత్తైన వెళ్ళంగిరి పర్వత సముదాయం.. అందులో ఏడుకొండలున్నాయట. ఇషా సెంటర్ వెళ్ళంగిరి పర్వత పాదం దగ్గర విస్తరించి ఉంది. జనాలు జాతర కొచ్చినట్టు వస్తున్నారు. మేము ఓ గంట అక్కడుండి ఎయిర్‌పోర్ట్‌కి 5గంటలకి బయలుదేరాం. అలా మా 80 గంటల కోయంబత్తూర్ ప్రయాణం ముగింపు కొచ్చింది.