1960వ దశకంలో తెలగుకథ, నవల జాజ్వలమానంగా ప్రకాశించిందని అందరికి తెలిసిందే. అందునా రచయిత్రులు సాధించిన విజయం అనన్యసామాన్యం ఆ వైభవానికి ప్రతినిధులలో ద్వివేదుల విశాలాక్షిగారు ప్రథమశ్రేణికి చెందుతారు.
1963లో విశాలాక్షిగారి తొలినవల ”వైకుంఠపాళీ” ఆంధ్రప్రభ నవలల పోటీలో ప్రథమ బహుమతి పొంది పాఠకుల దృష్టినాకట్టుకుని శాశ్వతంగా నిలిచిపోయింది వారి హృదయాల్లో.
విశాలాక్షిగారిపేరు ఈనాటి యువతరానికి కొత్త కావచ్చు కానీ ముందుతరంవారికి, అంటే నలబైయేళ్ల వయసు దాటిన వారికి ఆమెరచనలు సుపరిచిత మూ ప్రీతిపాత్రమూను. లత అంటే ఊహాగానం, మాలతీచందూర్ అంటే ప్రశ్నలూ-జవాబులూ, సులోచనారాణి అంటే రాజశేఖర్… కానీ విశాలాక్షిగారికి అలాటి ”మార్కు” అంటూ ఒకటి లేదు. ఆవిడ రచనలన్నీ సామూహికంగా ఒక ప్రత్యేకమయిన అభిప్రాయాన్ని కలిగిస్తాయి. పాఠకుడిలో ద్వివేదులు విశాలాక్షిగారికి సంబంధించినంత వరకూ ఏ నవలకి ఆ నవల, ఏ కథకి ఆ కథ-దేనికదే.
ఆమె ఎంచుకున్న వస్తు వులూ, ఆమె శైలీ ఆమెకి అలాంటికీర్తిని తెచ్చిపెట్టేయి. విశాలాక్షిగారికి తనదైన శైలి వుంది. కొంతవరకూ భాష- విజయనగరం మాండలీకం. ఆవిడ దేశదేశాలు తిరిగినవారే అయినా కథల్లో ఆ తూర్పుయాస అలాగే నిలబెట్టుకున్నారు (నాలా కాకుండా). రెండోది, సంభాషణలోనూ, కథనంలోనూ కూడా ఆమె అచ్చ తెలుగు నుడికారం వాడుతూ ఒక విలక్షణమయిన అందాన్ని సమకూర్చుకున్నారు తమ కథలకి.
నేను తూలిక నెట్ మొదలుపెట్టిన తరువాత, పాఠకులు నన్ను అడిగిన మొదటిప్రశ్న విశాలాక్షిగారి కథలు ”మీరెందుకు అనువాదం చెయ్యరు?” అని. నేను అనేక విధాల ప్రయత్నించాను కానీ ఆమె ఆచూకీ నాకు దొరకలేదు. ఆఖరికి ఆమె అజ్ఞాతవాసంలో ఉన్నారని నిర్ణయించుకుని, ఆమె నవల ”వైకుంఠపాళీ” మీద సమీక్ష రాశాను. సమీక్షలకి అనుమతి అవసరం లేదని. మొత్తంమీద గత ఆగస్టులో నేను విశాఖపట్నం వెళ్ళినప్పుడు ఆమెని కలవడం జరిగింది.
ఇది ఎందుకు చెబుతున్నానంటే, ఆమె కథలూ, నవలలూ ఎంతటి ప్రచారం పొందాయో, వ్యక్తిగతంగా ఆమె అంత ప్రైవేటు వ్యక్తి అని చెప్పడానికి. నేను విశాఖపట్నం వెళ్ళినప్పుడు, ఫోనులో పిలిచి ”మిమ్మల్నో సారి కలవాలనుంది” అని అడిగితే, ఆవిడ, ”తప్పకుండా రండి, కానీ నేను ఇంటర్వూ ఇవ్వను. ఇవ్వడానికి నా దగ్గర పుస్తకాలు లేవు,” అన్నారు. ఆవిడ తన పుస్తకాలనన్నిటినీ సర్వహక్కుభుక్తములుగా విశాఖ పౌరగ్రంథాలయానికి రాసి యిచ్చేశారు. తన దగ్గర లేని పుస్తకాలు సేకరించడానికి వెలగా వెంకటప్పయ్యగారు సహాయం చేశారట. ఆయన తన పత్రిక ”గ్రంథాలయసర్వస్వం”లో ప్రకటిస్తే, దానికి స్పందిస్తూ అనేక మంది పాఠకులకు తమ దగ్గరున్న కాపీలు పంపేరుట జీరాక్స్ చేసుకుని తిరిగి యిచ్చేసి షరతులమీద అనువాదాలకి పౌరగ్రంథాలయంవారి అనుమతి తీసుకోమని చెప్పేరు విశాలాక్షిగారు.
చారిత్రత్య్రకంగా విశాలాక్షిగారు రచన ప్రారంభించేనాటికి కథలకి వస్తువులు ఆనాటి సాంఘిక సమస్యలు దేశపునరుద్దరణలో భాగంగా స్త్రీలకి అన్ని రంగాల్లోనూ లభిస్తున్న ప్రోత్సాహం, పాశ్చాత్య నాగరీక ప్రభావంతో మారుతున్న విలువలు, చదువుక్నున అమ్మాయిలకి కొత్తగా వచ్చిన సాంఘిక స్థాయి, వాటికి ప్రతిగా కుటుంబంలో కొత్తగా పుట్టిన ఒడిదుడుకులూ, చదువుల మూలంగా పెళ్ళిళ్ల విషయంలో ఎదురైన కొత్త సమస్యలూ- ఇవన్నీ ఆనాటి స్త్రీలు సృష్టించిన సాహిత్యానికి వస్తువులే.
విశాలాక్షిగారు ఆ వస్తువులనే స్వీకరించినా, ఆమె ఆవిష్కరించిన విధానం ఒక ప్రత్యేకత సంతరించుకుని పాఠకుల అభిమానాన్ని విశేషంగా చూరగొంది. సాధారణంగా రచయితలు తమ రచనల్లో వస్తువుని ఆవిష్కరించే విధానం రెండు రకాలుగా ఉంటుంది. ఒక తరగతి రచయితలు ఉన్నది ఉన్నట్టు, చూసింది చూసినట్టు రాస్తారు. ఈ రచనల ధ్యేయం – సంఘంలో కట్టెదుట కనిపిస్తున్న దురాచారాలనీ, అన్యాయాలనీ మరోసారి ఎత్తి చూపడం, తద్వారా పాఠకులు, ముఖ్యంగా ఆ దురాచారాలకీ, అన్యాయాలకీ లోనయినవారు స్పందించి, జ్ఞానోదయమయి, తమ దుస్థితి నుండి బయటపడటానికి ప్రయత్నించాలి ఆశించడం.
మరొక తరగతి రచయితలు తమ పరిసరాల్లో జరుగుతున్న సంఘటనలనీ, పరిస్థితులనీ, ప్రజలనీ సూక్ష్మంగా పరిశీలించి చూసి, ఆలోచించి, ఆ వ్యక్తులనీ, పరిస్థితులనీ చిత్రిస్తూ విశ్లేషణాత్మకంగా రాస్తారు. తద్వారా పాఠకుల మేథకి మరింత పని కల్పిస్తారు.
విశాలాక్షి ఈ రెండో కోవకి చెందుతారు. ఆమె కథలు గానీ నవలలు గానీ చదువుతుంటే రచయిత్రి ఒక సమస్యనీ, పాత్రలనీ, పాత్రల మధ్య సంఘర్షణనీ నిశితంగా పరిశీలించి, అర్థం చేసుకుని ఆవిష్కరించిన స్పృహ కలుగుతుంది పాఠకుడికి
”వైకుంఠపాళీ” (1965)లో ఇతివృత్తం పెంపకం. సాధారణంగా పెంపకం అనగానే, వరిముల్లంత అనుమానం మనసులో అవిరళంగా కెలుకుతూనే ఉంటుంది.
ఏదో ఒక కారణంగా ఒక పసివాడిని ఇంటికి తెచ్చుకుంటే, వాడిని చట్టరీత్యా దత్తత తీసుకొనకపోతే కొన్ని చిక్కులు ఆ తరువాత తమకి ఒక పిల్లవాడు కలిగితే పరిస్థితి మరింత క్లిష్టం అవుతుంది.
స్కూలు టీచరు అవధానిగారు ఒక పసివాడిని ఇంటికి తీసుకువచ్చారు భార్య పార్వతమ్మకి మాటమాత్రంగానైనా చెప్పకుండా ఆ అబ్బాయిని ఎంతో ప్రేమతో చూసుకుంటారు. కానీ చట్టరీత్యా దత్తత తీసుకోరు. ఒకటి, రెండసార్లు అనుకున్నారు కానీ ప్రతిసారీ ఏదో అవాంతరం. ఎంచేతంటే వారు చెప్పుకున్న కారణం – తీసుకోకపోతేనేం, మనం వాడికేం తక్కువ చేస్తున్నాం అని. పైగా పంచుకోవడానికి పెద్ద ఆస్తులు లేవు అంటారు. వాస్తవంలో మాత్రం అలా ఆ దత్తత చట్టబద్ధం చేయకపోవడంలో చిక్కులు ఉన్నాయి. మొదట ఆ అబ్బాయి, రంగనాథాన్ని స్కూల్లో చేర్పిస్తున్నప్పుడు ”ఇంటిపేరేమిటి” అంటే ఏమీ చెప్పలేక, అవధానిగారు ”ఎ” అంటూ ఓ పొడిఅక్షరంతో సరిపెడతారు. స్కూల్లో ఉద్యోగం చేస్తున్న అవధానిగారికి తలాతోకా లేని ఈ పొడి అక్షరం మూలంగా భవిష్యత్తులో వచ్చే సమస్యలు తెలీవా? అది మానసికంగా రంగనాథానికి ఎంత హాని చేస్తుందో తెలీదా అన్న ప్రశ్నలకి తార్కికంగా జవాబు లేదు. అలాగే అవధాని గారు మాటమాత్రమయినా భార్యతో చెప్పకుండా ఒక పిల్లవాడిని ఇంటికి తీసుకొచ్చేయాడినికి కూడా మంచి సమాధానం లేదు. ఇలాటి సంఘటనలని ఎలా సమర్థిస్తాం?
చెప్పగలిగిందల్లా – మన సంస్కృతిలో చాలా విషయాలు సీరియస్‌గా తీసుకోం. దానంతట అదే సర్దుకుంటుందన్న కర్మ సిద్ధాంతం, రంగనాథమే అవసరం వచ్చినప్పుడు తేల్చుకుంటాడన్న పలాయనవాదం ఇలా ఎన్నో ఆలోచనలు. ఎప్పటికప్పుడు ఏదో ఒక కారణం చెప్పి అతి ముఖ్యమయిన విషయాన్ని దాటవేయడం మనవారికే చెల్లింది. ఈ కథలో బహూశా రచయిత్రి చెప్పదల్చుకున్నది, ఈ సంఘటనలకి సంబంధించినంత వరకూ అదేనేమో మరి.
రంగనాథం తాను దత్తపుత్రుడిని కాదని తెలిసినా, ఆ దంపతులు తనని స్వంత కొడుకులాగే ఆదరించేరు కనక పుత్రుడిలాగే తన విద్యుక్తధర్మం తాను నెరవేరుస్తాడు. తమ్ముడిని చదివిస్తాడు. తన చదువు బిఎతో సరిపెట్టుకుని. తల్లిదండ్రులని చరమదశలో ఆదుకుంటాడు.
ఈ నవలలో నాకు విలక్షణంగా అనిపించిన భాగం అవధానీ, పార్వతమ్మా వైకుంఠపాళీ ఆడుతుండగా పార్వతమ్మ ఓడిపోయిన ఘట్టం. ఆమె కళ్లనీళ్ళు పెట్టుకుని, భార్యభర్తల జీవితాల మీద, ఎవరికి ఎవరు ఆలంబన అన్న అంశం మీద వ్యాఖ్యానిస్తుంది. ఇది నాకు సందర్భోచితంగా అనిపించలేదు. వృద్ధదంపతులు ఒకరికొకరు ఆలంబన కావాలన్న సత్యం ప్రధానాంశంతో సంబంధం లేదు. కథలో ప్రధానపాత్ర రంగనాథం. అతడి జీవితంలో పాములూ, నిచ్చెనలూ చాలానే చూశాడు. అతనిపరంగా వైకుంఠపాళీకి వ్యాఖ్యానం చెప్పి ఉంటే, శీర్షికకి బలం ఎక్కువ అయ్యేది అనుకుంటాను.
పాత్రచిత్రణకి సంబంధించినంతవరకూ అవధాని, పార్వతమ్మ, కొడుకు గోపీ, మేనత్త శాంత… వీళ్లందరి మనస్తత్త్వాలూ మనసుకి హత్తుకునేలా ఆవిష్కరించారు రచయిత్రి.
మన సంస్కృతిలో ఉన్న విశిష్ఠతనీ, అవకతవకలనీ కూడా ఎత్తి చూపుతుంది ఈ నవల. పెంపకం తీసుకోవాలనుకునే వారికి మంచిపాఠం ఇది.
”మారిన విలువలు” (1966) నవలలో ప్రధానాంశం ఆనాడు మారుతున్న సమాజంలో చదువుకున్న అమ్మాయి స్థానం. ఇంటా బయటా కూడా ప్రధాన పాత్ర జానకి ఎదుర్కొన్న సమస్యలూ, దానికి ఆమె ఎంచుకున్న పరిష్కారం.
జానకి అయిదుగురు పిల్లలతో తొలిసంతానం. రెండోకూతురు శాంత పరీక్ష పాసయ్యానని ప్రకటించడంతో నవల ప్రారంభమవుతుంది. తల్లికి శాంత పాసవడం కంటే, మూడో కొడుకు సాంబు ఫెయిలవడం ఎక్కువ బాధాకరం. ఆమె దృష్టిలో చదువు మగపిల్లలకి మాత్రమే ముఖ్యం. ఇక్కడ ఐరనీ ఏమిటంటే అప్పటికే, పెద్దకూతురు జానకీ తనకున్న కొద్ది చదువుతో ఉద్యోగం చేసి సంపాదిస్తోంది. ఆ ఆదాయమే ఆ కుటుంబానికి ఆధారం. అయినా, ఆ తల్లికి ఆడపిల్లల చదువుల మీద గౌరవం లేదు. సంఘంలో స్త్రీలు పురోగమించాలని మొత్తుకునేవారు, ఒక ప్రక్కన ఎంతమంది ఉన్నా, మరోప్రక్కన ఇలా వెనక్కి లాగేవారు కూడా ఉన్నారనడానికి దృష్టాంతం ఆవిడ.
మరొకసారి విషయం కూడా గుర్తు తెచ్చుకోవాలిక్కడ. పూర్వం సాంప్రదాయకులు స్త్రీ ధనాన్ని ఆ స్త్రీయే తప్ప ఇతరులు అనుభవించడం హేయంగా భావించారు. ఆడపిల్ల సంపాదన మీద బతకడం ఇరవయ్యవ శతాబ్దం రెండోభాగంలో ప్రారంభమయింది. ఆడపిల్లలు చదువులూ, ఉద్యోగాలూ మొదలయేక, వారి ఆదాయం కూడా మగపిల్లల ఆదాయంతో సమానం అయిపోయింది. కానీ ఈ సమానత్వం ఆదాయాలవరకే. సంపాదిస్తున్న ఆడపిల్లలకి తమ ఆదాయాల మీద కూడా అధికారం లేదు.
జానకి ఉద్యోగంలో చేరడానికి కారణం పెళ్లిపీటల మీద ఆగిపోయిన తన పెళ్లి. కట్నం తక్కువయిందని తండ్రి పెళ్లికొడుకుని పెళ్లిపీటలమీంచి లేవదీసుకుపోతాడు.. పెళ్లికూతురు జానకికి అది అమానుషం అనిపించి, అర్థరాత్రి స్టేషనుకి వెళ్తుంది. పెళ్లికొడుకుని స్వతంత్రించి బాధ్యతాయుతంగా ప్రవర్తించమని అడగడానికి. అతను ఆమెని హేళన చేసి, వెనక్కి పంపేస్తాడు. ఆ తరువాత జానకి ఒక అనాథాశ్రమంలో పని చేస్తూ, తమ్ముళ్లనీ, చెల్లెలినీ ఆదుకుంటుంది. అన్న సూర్యారావు వెన్నుముక లేనివాడు. ఇంట్లోంచి పారిపోయిన శాంత తిరిగొస్తే, సంఘానికి భయపడి ఆమెని ఇంట్లోకి రానివ్వడు. తమ్ముడు ప్రకాశం పేపర్లు అమ్ముతుంటే అది పరువు తక్కువ అని, అతనిచేత ఆపని మానిపించడానికి శతవిధాలా ప్రయత్నిస్తాడు. చిన్నతమ్ముడు సాంబుని కూడా తనలాగే తయారు చేయడానికి చూస్తాడే తప్ప, అతని సామర్థ్యం ఏమిటి అన్న జ్ఞానం లేదు.
జానకి ఒక విధంగా సూర్యారావుకి ”ప్రతినాయకుడు” పరిస్థితులు అర్థం చేసుకుని, స్వతంత్రించి తమ్ముళ్లకీ, చెల్లెలికీ సాయం చేస్తుంది. అన్న వెళ్లగొట్టిన శాంతని చేరదీస్తుంది. ప్రకాశం పుస్తకాల షాపు పెట్టుకుంటానంటే ప్రోత్సాహిస్తుంది. వదిన కనకం పాతకాలపు అమాయకురాలిలా కనిపించినా ప్రకాశాన్ని మనసారా దీవిస్తుంది. సాంబు ఒక్కడే ఆయింట బీబిరీతిబిజిశిగి. సూర్యారావు మూర్ఖత్వానికి బలి అయిపోయేడు. జానకి శతవిధాలా ప్రయత్నిస్తుంది కానీ ఫలితం కనిపించదు.
ఈ నవలకి ముగింపు – జానకి అనాథాశ్రమంలో ఉండగా, తనని పెళ్లిపీటల మీద వదిలేసిన భర్త వచ్చి తన రెండోభార్య చనిపోయిందనీ, అంచేత జానకి వచ్చి తననీ, తన పిల్లలనీ చూసుకోవాలనీ అడగడం. జానకి అతని కోరికకి నిరాకరిస్తుంది. అనాథ శరణాలయంలో ఉండి అక్కడ పిల్లలని చూసుకోవడంలోనే తనకి ఎక్కువ ఆనందం, తృప్తి ఉన్నాయని సమాధానమిస్తుంది.
స్త్రీలని ఆత్మగౌరవం, చిత్తస్థైర్యం కలవారుగానూ, మగవారిని పిరికివారూ, దుర్బలులుగానూ చిత్రించడం కనిపిస్తుంది ఈ నవలలో. ఇంట్లోంచి పారిపోయిన శాంత చదువు నిర్లక్ష్యం చేసినా, తొక్కింది తప్పుదారే అయినా, తనకి ఏం కావాలో గుర్తించి అది సాధించుకోడానికి చేసిన ప్రయత్నం ఉంది. ప్రకాశం చదువు అబ్బకపోయినా, వ్యాపారంలో మెళుకువలు నేర్చుకుని పుస్తకాల కొట్టు పెట్టుకున్నాడు. అయితే అతని విజయానికి కారణం ఇంటికి మగదిక్కు అయిన సూర్యారావు కాకపోవడం గమనార్హం. తన అనుభవాల మూలంగా జానకీ అమాయకత్వంతోనే అయినా కనకం ప్రకాశానికి సాయపడ్డారు. సాంబుని మాత్రం సూర్యారావు తనలాగే పిరికివాడిని చేసి అతని చావుకి కారణం అవుతాడు. సాంబు విషయంలో జానకి ప్రయత్నాలు ఫలించకపోవడానికి కారణం అతని మీద సూర్యారావు ప్రభావం.
ఈ కథలో రెండు సంఘటనల గురించి చర్చించడం అవసరం. మొదటిది జానకి అర్ధరాత్రి ఒంటరిగా రైల్వే స్టేషనుకి వెళ్లిన ఘట్టం. అది ఆ రోజుల్లో వాస్తవంగా జరగగల సంఘటనేనా? ఆడపిల్లలకి అంత ధైర్యం వుండేదా? అని ఒక ప్రశ్న. నిజానికి ఈ ప్రశ్న ఆ రోజుల్లో ఎవరూ అడిగినట్టు లేదు. ఇప్పుడే ఈ మధ్యనే విన్నాను.
ఇంతకీ ఈ ప్రశ్నకి సమాధానం కావాలంటే ఆనాటి సాంఘిక పరిస్థితులు గమనించాలి. చదువుకోమనీ, తమకి తాము ఆలోచించుకోవడం నేర్చుకోవాలనీ ఆడవారిని సంస్కర్తలు ప్రోత్సహిస్తున్న కాలం అది. అంచేత ఆనాటి కథల్లో రెండు విషయాలు బలంగా చోటు చేసుకున్నాయి. మొదటిది – రచయితలు తమకథల్లో స్త్రీల దౌర్భాగ్యాన్నీ, దుర్భర స్థితినీ ఉన్నదున్నట్టు మన కళ్లెదుట పెట్టారు. తద్వారా, స్త్రీలు స్ఫూర్తి పొంది, ఉత్తేజితులయి తమ జీవితాలని మరొకసారి తరిచి చూసుకుని, ఆలోచించుకుని, చక్కదిద్దుకునే ప్రయత్నం చేస్తారని.
మరొకరం కథలు దార్శనికం లేక సందేశాత్మకం – అంటే స్ఫూర్తిగల రచయిత భవిష్యత్తులో ఇలా జరగగలదనీ, అది అభిలషనీయం అనీ సందేశం ఇవ్వడం. అలాంటి కథల్లో స్త్రీ అబల కాదు అని నిరూపించడానికి ఇలాంటి వీటచిటి సన్నివేశాలు కల్పించడం జరిగింది.
నిజానికి ఈ సన్నివేశం జానకి పాత్ర చిత్రణకి ఆయువుపట్టు. ఆ తరువాత ఆమె తీసుకోబోయే నిర్ణయాలకి బాట వేస్తుంది. డా. శ్రీదేవి నవల ”కాలాతీత వ్యక్తులు” లో ఇందిర పాత్ర కూడా అలాంటిదే. ఆ నవల అంత ప్రాచుర్యం పొందడానికి కారణం కూడా అదే.
సినిమాల్లో ప్రేమలాగే, కథల్లో స్త్రీలు తమ వ్యక్తిత్వాలని నిరూపించుకునే పాత్రలు ప్రవేశపెట్టడం ద్వారా సంఘంలో స్త్రీలకి కొంత స్వాంతన కలిగించడం, కొంత ప్రోత్సాహం ఇవ్వడం కూడా జరిగింది. అదొక చారిత్య్రక సత్యం.
(ఈ విషయం మరింత విపులంగా నేను నా ఊలిజితివీతి గీళిళీలిదీ’రీ గీజీరిశిరిదీవీ, 1950-1975లో చర్చించేను.)
రెండోది ముగింపు – తనని వదిలేసిన భర్త తిరిగి వచ్చి, ”రా” అంటే భార్య నిరాకరించడం, నిజానికి ఇది కూడా ఆ రోజుల్లో అరుదే కావచ్చు కానీ అసంభవం కాదు. కానీ ఇక్కడ నా చర్చ విశాలాక్షిగారు చెప్పిన మరో పిట్టకథ- ఈ నవల సినిమాగా తీస్తానని దర్శకుడు సి.యస్. రావు విశాలాక్షిగారిని అనుమతి కోరి, దానితో పాటు ముగింపు మార్చాలని సూచించారుట. ఆయన సూచన- చివరిలో జానకి తనే భర్తని క్షమించమని వేడుకుని, అతనితో వెళ్లినట్టు చూపించమని.
విశాలాక్షిగారు ఆ సూచనకి అంగీకరించలేదు. అంచేత ఆ సినిమా తీయడం జరగలేదు! ఇక్కడ మరొక విషయం గమనార్హం. – జానకి అర్థరాత్రి స్టేషనుకి వెళ్లడం ఆయనకి అభ్యంతరం కాలేదన్న సంగతి.
మరో నవల ”గ్రహణం విడిచింది” (1967). నార్ల వెంకటేశ్వరరావుగారు ఆంధ్రజ్యోతికి నవల రాసివ్వమని అడిగినప్పుడు రాసిన నవల అని తన ముందుమాటలో రచయిత్రి చెప్పేరు. ఇందులో రెండు కథాంశాలు ఉన్నాయి. ఒకటి భర్త ఆకస్మిక మరణంతో వచ్చిన ఐశ్వర్యం, తన్మూలంగా బంధువర్గంలో వచ్చే మార్పులు కానీ బాధలు కానీ ఎలా ఉంటాయన్నది. సాదారణంగా డబ్బుంటే అందరూ అభిమానాలూ, ఆప్యాయతలూ చూపిస్తారు అన్నది లోకరీతి. అందరూ అనేది అదే. అయితే డబ్బు గలవారు కూడా కేవలం ఆ ఒక్క తలపుతోనే తలమునకలైపోతూ శాంతిని పొగొట్టుకుంటే ఆ తప్పు ఎవరిది? అంటే తేలిగ్గా జవాబు చెప్పలేం.
భారతి తనవాళ్లందరూ, వితంతువయిన తనని పెళ్లి చేసుకోడానికి ముందుకు వచ్చిన జగదీశ్‌తో సహా, తన డబ్బు వినియోగించడం గురించే ఆలోచిస్తున్నారని తెలిసి, అందర్నీ వదిలేసి, హృషికేష్ వెళ్తే అక్కడ బాబా కూడా ఆ డబ్బు ప్రస్తావన తెస్తే, భారతి మనసు ఎలా ఉంటుంది? తన డబ్బు కోసం ఆరాటపడేవారి నుండీ ఆగకుండా పరుగులు పెడుతున్న భారతికి మళ్లీ ఆ బాబాయే ఆమె ఆలోచనలో, ఆంతర్యంలో ఉన్న లోపాన్ని ఎత్తి చూపడం విశేషం. ధనానికీ, బంధుత్వాలకీ సంబంధం ఉన్నా, ఆ సంబంధంలోనే అనుబంధాలకీ, ఆత్మీయతకీ కూడా చోటుంటుందని రచయిత సందేశం.
ఈ నవలలో రెండో అంశం వితంతు వివాహం. ఈ విషయం ప్రస్తావిస్తూ రచయిత్రి తన అభిప్రాయం ముందుమాటలో ఇలా అన్నారు. వితంతువులంతా తప్పనిసరిగా వివాహం చేసుకోవాలన్నది కాదు సందేశం. ఎవరికి వారు ఆలోచించుకుని తమ వ్యక్తివికాసానికి అవసరం అనుకుని చేసుకుంటే తప్పులేదు అంటారు ఆమె.
”గోమతి” నవల చిన్ననాటి చెలిమిని రమణీయంగా చిత్రించిన రసఖండం అంటారు కొండముది శ్రీరామచంద్రమూర్తి (ఆంధ్రజ్యోతి. ద్వివేదుల విశాలాక్షి. 31 మే 1981.) ఇది నేను చదవని వాటిల్లో ఒకటి.
చిన్న కథల్లో కూడా విశాలాక్షి తాను దర్శించిన ఒక ప్రత్యేకకోణాన్ని ఆవిష్కరించడం కన్పిస్తుంది. డబ్బుగలవారి మనస్తత్త్వాలు రెండు కథల్లో కనిపించేయి నాకు. ”ఇత్తడిబిందె” కథలో ఒక ధనవంతురాలు ఖరీదయిన కారులో బజారుకెళ్లి ఆరువేలు ఖరీదు చేసే నెక్లెస్ కొనుక్కుని, సినిమాలో వేషం వేసినట్టు, సరదాకి బస్సు ఎక్కితే ఓ చిన్నది ముఫ్పై రూపాయలకి కొన్న ఇత్తడిబిందె గురించి తోటి ప్రయాణికులు ముచ్చట పడిపోతుంటే, ఆ ధనవంతురాలి మనసెలా ఉంటుంది? ఇది కథలో ఒక భాగం మాత్రమే. ఆ తరువాత, ఆచిన్నది వాళ్లింట్లో పనివాడి భార్య అని తెలిసి, వాళ్లిద్దర్నీ తమ ఇంట్లో ఉండమంటుంది, వారి అనురాగానికి ముచ్చటపడి. కానీ ఆ ఔదార్యం ఎంతకాలం నిలుస్తుంది? నిలవకపోతే, దాని వెనక కారణాలు ఏమిటి అన్నదే అసలు కథ. అలాంటి ఔదార్యానికి మరో కోణం ”తీరనికోరిక”లో కూడా చూస్తాం. రావు బహద్దర్ రంగరాజుగారి మరణంతో కథ మొదలవుతుంది. రంగరాజుగారు చేతికెముకలేని దాత. ఎవ్వరేం అడిగినా లేదనకుండా ఇస్తారు. కానీ ఇందులో చిన్న తిరకాసుంది. అవతలివారు వచ్చి అడగాలి. అడక్కుండా ఇవ్వలేరు.
ఆయన తీరనికోరికతో చనిపోయేరు. రంగరాజు అంతటి ప్రభువులకి తీరని కోరిక ఏమిటి అంటే ఆ ఊరికి కొత్తగా వచ్చిన పొట్టిపంతులు ఎంత అవసరంలోనూ రంగరాజుగారి దగ్గరకొచ్చి దేహీ అని చెయ్యిచాచకపోవడమే. అది చాలనట్టు, అయాచితంగా ఆ పొట్టిపంతులికి లాటరీలో పెద్ద మొత్తం కలిసొచ్చింది. అది చాలదూ ఆయన ప్రాణానికి? లేదా, ప్రాణం తీయడానికి? మనసు అట్టడుగు పొరల్లో స్వోత్కర్ష ఎంత బలంగా పనిచేస్తుందో తెలుస్తుంది ఈ కథ చదివితే.
”కదలిక”లో ప్రధానపాత్ర ఉద్యోగం కోసం ప్రయత్నమ యినా చేయకుండా నిష్సూచీగా కాలం గడిపే యువకుడు. ”అచ్చు వేసి విడిచిన ఆబోతు”కీ తనకీ ”పోలికలు” ఉన్నాయని ఆ పాత్రచేతే చెప్పించడం రచయిత్రి చమత్కారం. అతడు చేసుకున్న అదృష్టం చిన్న తనంలోనే తండ్రిపోవడం. ఎద్దులా మేయడమే అలవాటయిన ఆ యువకుడు యాదృచ్ఛికంగా, అర్థమనస్కరగానే, మరొకరికి సాయం చేయడంతో అతని ధోరణి మారి జ్ఞానోదయం కావడమే ఈ కథ. ఆ కథానాయకుడిలో చలనం కలిగించిన సంఘటన చిత్రించిన విధానం చక్కగా ఉంది.
”బోణీబేరం” కథలో కాటికాపరి వీరిగాడు రాత్రరతా ఒక్కబేరమయినా తగిలితే, ఆస్పత్రిలో ఉన్న చిట్టికి మందు కొనొచ్చని ఆరాటపడతాడు. చివరికి తెలతెలవారుతూ ఉండగా, దూరాన ఓ మనిషి కన్పిస్తాడు. మూట విప్పుతే, కనిపించిన శవం ఆ చిట్టిదే. అదే క్షణంలో డ్యూటీలోకి దిగిన వీరబాహు ”పొద్దున్నే మంచి బోణిబేరం” అని మురిసిపోతాడు ఆ శవం చూసి. ఎద్దుపుండు కాకికి రుచి. ఒకరినొప్పి మరొకరికి విందు. ఈ చిన్న కథకి వల్లకాటిని నేపథ్యంగా ఎన్నుకోడం, ఇద్దరు కాపరుల పేర్లూ వీరిగాడూ, వీరబాహు కావడం రచయిత్రి సూక్ష్మదృష్టికి నిదర్శనాలు. డబ్బులాగే చావుకి అనేక కోణాలు.
నేను విశాలాక్షిగారి రచనలన్నీ చదవలేదు. చదివినవి దృష్టిలో పెట్టుకుని రాసిన ఈవ్యాసం అసమగ్రమే అయినా పాఠకులకి కొంతవరకైనా విశాలాక్షిగారి రచనాకౌశలాన్ని పరిచయం కాగలదని ఆశిస్తున్నాను.
విశాలాక్షిగారి జననం 1929లో విజయనగరంలో. 13 నవలలూ, 3 కథాసంకలనాలూ, ఒక వ్యాస సంకలనం (మలేషియా – నాడూ, నేడూ) ప్రచురించారు. దాదాపు 200 పుస్తకాలకి ”సుమన” అన్న కలంపేరుతో సమీక్షలు రాసారు. కొన్ని నవలలు కన్నడలోకి అనువదింపబడినాయి. ”వారధి” ఇతర భారతీయ భాషలలోకి అనువదించే కార్యక్రమం నేషనల్ బుక్ ట్రస్టు చేపట్టారు.
గృహలక్ష్మీ స్వర్ణకంకణం (1966), ఆంధ్రప్రదేశ్ సాహిత్య ఎకాడమీ అవార్డు (1982) వంటి అనేక ఘన పురస్కారాలు, పొట్టి శ్రీరాములు యూనివర్సిటీవారి గౌరవ డి.లిట్. పట్టా (1998) అందుకున్నారు.
ఆమె రచనల మీద రిసెర్చి చేసే అనేకులు యం.ఫిల్, పి.హెచ్.డి.లు పొందేరు.
తా.క. విశాలాక్షిగారు నవంబరు 7, 2014 తేదిన మరణించారు.
– తెలుగు తూలిక సౌజన్యంతో….