ఇరవై రెండేళ్లకే జీవితంలోని ఎత్తుపల్లాల్ని,కాఠిన్యాన్నంతా చూసి అత్యంత సాహాసం పట్టుదలతో ఇద్దరు బిడ్డలతో సహా సంసారపు నిప్పుల గుండంలోంచి నడిచొచ్చిన రాధ సాహసాన్ని ఎవరైనా అభినందించి తీరాల్సిందే! వీరిది మహబూబ్‌నగర్ జిల్లాలోని చిన్న పల్లెటూరు.తండ్రి చనిపోవడంతో రాధ చదువు 5వ తరగతిలో ఆగిపోయింది. రాధ ఇంటి పనిచేస్తూ టైలరింగ్ కొంతవరకు నేర్చుకుంది.తల్లి అన్న కూలి పనులు చేసి తిండికి సరిపొయెంత సంపాదించగలిగేవారు.
15సం||రాగానే ఆర్థికంగా తమ కన్నా పై మెట్టులో వున్న సంబంధం వెతుక్కుంటూ వచ్చిందని తల్లి వెంటనే పెళ్లికి ఒప్పుకుంది రాధ తల్లి మాట విని. భర్తకు పుట్టెడు చెవుడు, మూగ, ఈవిషయం పెళ్ళెన తర్వాత గాని రాధకు తెలియలేదు. చేసేదేంలేక రాధ జీవితంలో సర్దుకుపోవడానికి ప్రయత్నించింది. భర్త మెన్స్ టైలర్. సొంత ఇల్లు క్రింద అత్తమామ మరిది వుంటారు. పైన వీళ్లు ఉంటారు. ఆర్థికమైన ఇబ్బందులు పెద్దగా లేవు.కానీ భర్తకు శారీరక వికలంగత్వమే కాదు మనసికంగా కూడా చాలా వికారాలు ఉన్నాయి. ఆమెను అనుమానించడం, లైంగికంగా విపరీత ధోరణులతో ఆమెకు రాత్రిళ్లు నరకం చూపించడం కొట్టడం తిట్టడం చేస్తుండటంతో రాధ విసిగిపోయింది. అత్తకు చెప్పినా సర్దుకుపోవాలని తిట్టింది. ఇద్దరు పిల్లలతో ఈమె పుట్టింటికెళ్లినా సపోర్టు చేసి తమతో ఉంచుకునేందుకు అన్నదమ్ములు సిద్ధంగా లేరు. తల్లి చనిపోయింది. అప్పటికే ఎన్నో పంచాయతీలు జరిగాయి. అయినా పరిస్థితిలో ఏం మార్పులేదు. భర్త ఇంట్లోకి డబ్బులివ్వడం మానేశాడు. పెళ్లైన దగ్గరినుంచి రాధ దగ్గర్లో వున్న బట్టల షాపులో టైలర్‌గా చేసి ఫ్యాషన్ డిజైనర్‌గా ప్రావీణ్యం సంపాదించి సొంతంగా షాప్ నడిపి కుటుంబాన్ని పోషించుకొవడం ఇంట్లోకి కావాల్సిన సామాను,కొంత బంగారం కొనుక్కోగలిగింది.భర్త ధోరణి రోజురోజుకి విపరీతంగా తయారవుతుండటంతో పోలీస్‌స్టేషన్ వెళ్లి కంప్లైంట్ ఇచ్చింది. వీళ్లు అందర్ని పిలిచి భర్తను మందలించి రాధను సర్దుకుపోవాలని సలహా ఇచ్చి పంపించేశారు. మరిది కూడా ఈమెను లైంగికంగా వేధించడం మొదలు పెట్టాడు. ఇంట్లో వాళ్లకు చెపితే సంసారం పాడైపోతుందని తనలోనే బాధంతా దాచుకుంది. రాను రాను ఆమె పరిస్థితి దుర్భరంగా తయారయ్యింది. ఎక్కడికైనా పారిపోయి తన బ్రతుకు తాను బ్రతకాలని లేకుంటే చనిపోదామని మనసులో ఒకటే ఆలోచనలు. ఆ సమయంలో తెలిసిన వాళ్లు ఆమెకు భూమిక హెల్ప్‌లైన్ ఫోన్‌నెంబర్ ఇచ్చి నీకు వాళ్లు సహాయం చేస్తారు చెప్పారు. ఆ విధంగా ఆమె మాతో మాట్లాడి తన ఇద్దరు పిల్లతో ఇంట్లో చెప్పకుండా మా దగ్గరికి వచ్చేసింది. ఆమె కొన్ని రోజుల పాటు గృహహింస బాధితుల కోసం నడిపే హోంలో తలదాచుకుంది. ఆ హోం వాళ్లే లోకల్ పోలీసులకు ఈమెపై అత్తగారు మిస్సింగ్ కేసు పెట్టారని తెలుసుకొని విషయమంతా చెప్పారు. అత్త మామ, మరిది,భర్త అందరిని ఇక్కడ ఉమెన్ పోలిస్స్టేషన్లో పిలిచి అన్ని విషయాలు చెప్పి గట్టిగా వాళ్లతో రాధ ఇక అక్కడకు రాను అని చెప్పేసింది. తమ కుట్టు మిషిన్లు, ఇంట్లో సామాను తనకు అప్పగించేటట్లు ఒప్పంద పత్రం రాయించుకుంది.ఇద్దరు పిల్లలను ఇవ్వనని గట్టిగా చెప్పేసింది. కొన్ని నెలల తర్వాత తనే సిటీలో స్వంతంగా టైలరింగ్ బొటిక్ స్టార్ట్ చేసి తన స్వంత ఇంట్లో తన ఇద్దరు పిల్లలను పెంచుకుంటూ తన కష్టంతో తాను బ్రతుకుతూ తనలాంటి ఆడవాళ్లకు ఆదర్శంగా వుంది.