నవంబర్ 25 నుంచి డిసెంబర్ 10 వరకు మహిళలపై హింసకు వ్యతిరేకంగా 16 రోజుల పాటు ప్రపంచ వ్యాప్తంగా అనేక కార్యక్రమాలు చేపడుతున్నారు. ప్రతి సంవత్సరం భూమిక కూడా ఈ 16 రోజులలో విద్యార్ధులకు అవగాహనా కార్యక్రమాలు నిర్వహిస్తోంది. అదే విధంగా డిసెంబర్ 2న కల్వకుర్తిలోని డిగ్రీ కాలేజీ విద్యార్ధులతో ఒక కార్యక్రమం జరిపింది. ఇందులో ప్రభుత్వ పాఠశాల, కళాశాలలో చదివే పదవ తరగతి, ఇంటర్, డిగ్రీ చదివే అమ్మాయిలు, అబ్బాయిలు దాదాపు 150 మంది పాల్గొన్నారు. భూమిక సత్యవతి గారు విద్యార్ధులను ఉద్దేశించి చాలా విషయాలు చర్చించారు. అందులో ముఖ్యంగా బాలికలపై వేధింపులు, స్త్రీలపై జరుగుతున్న హింస రోజు రోజుకూ పెరుగుతోందని, దానికి అనేక కారణాలు ఉన్నాయని, అందువలనే యునైటెడ్ నేషన్స్ నవంబర్ 25ని స్త్రీలపై హింసకు వ్యతిరేక దినంగా ప్రకటించారన్నారు.
ఈ వయసులో యువత చదువుపై దృష్టి పెట్టాలని తమ లక్ష్యాలను ఏర్పారుచుకొని అందుకు అనుగుణంగా కృషి చేయాలని కోరారు. అమ్మాయిలు బాగా చదువుకొని తమ కాళ్ళపై తాము నిలబడుతూ తమ వ్యక్తిత్వాలను కాపాడుకుంటూ తమకంటూ గౌరవ ప్రదమైన జీవితాన్ని ఏర్పారుచుకోవటం గురించి మాత్రమే అలోచించాలని చెప్పారు. వారి ఎదురయ్యే అనేక సమస్యలకు మౌనంగా ఉండకుండా గొంతు విప్పాలని అందుబాటులో ఉన్న సపోర్టు సిస్టమ్స్‌ని వినియోగించుకోవాలని చెప్పారు. ఈ కాలేజీలో జెండర్ డెస్క్ ఏర్పాటు చేయటం చాలా మంచి ప్రయత్నమని, ఈ సెంటర్ ద్వారా అనేక అవగాహన కార్యక్రమాలను విద్యార్ధులకు కల్పించాలని కాలేజి యాజమాన్యాన్ని కోరారు. చివరిగా తమ కాలేజీ క్యాంపస్‌ని స్త్రీపై హింసకు వ్యతిరేకంగా ”నో వైలెన్స్ జోన్” గా తిర్చిదిద్దటానికి కృషి చెయ్యాలని విద్యార్ధులచేత ప్రతిజ్ఞ చేయించారు.