కన్నీళ్ళు రోదిస్తున్నాయి
ఇంకెన్ని గుండెలోతుల్లోంచి స్రవించాలని
మౌనానికి మాటలు ”బందీ” అయినప్పుడు
లోకం చీదరింపుల శరాలు సంధిస్తుంటే
ఆత్మబంధం దూరమయిన ఆ(మె)వేదన
మోము చూపకుండా మూలన కూర్చుంది
ముంగిట్లోంచి ”యవ్వనం” కనుమరుగవకుండానే
వితంతువవడం విధి శాపమే…..!
మేను నగవును పసిమిఛాయ వీడక మునుపే
తెల్ల చీరప్పుడే అవసరమా…?
మాతృత్వపు మమకారాల్ని
పసిమనస్సులు పెనవేసుకుంటుంటే …!
నాన్న లేడని ఎలా…? చెప్పేది
ఊహ తెలిసేనాటికి
అవిసిపోవా ఆపసి హృదయాలు
వీధిలో ఆడే నాటకం కొద్ది సేపటిది.
విధి ఆడే నాటకం జీవితాలది.
తీపి జ్ఞాపకాల అలలు
తనువును స్పృశిస్తుంటే
నుదుటి బొట్టు, సిగలోని పూలు
చేతి గాజులు ప్రశ్నిస్తున్నాయి
మూర్తీభవించిన స్త్రీ అస్థిత్వానికి
పుట్టుకతో వచ్చిన కానుకలం
మమ్మల్ని మధ్యలో
చెరిపి, నలిపి పగలగొడ్తారెందుకని
నిలదీసి హెచ్చరిస్తున్నాయి.
నేటికినీ సభ్యసమాజంలో సమాధానం శూన్యం
తర, తరాలుగ స్త్రీ జాతికి జరుగుతున్న దౌర్భాగ్యం
ఇదేమని ప్రశ్నిస్తే సాంప్రదాయపు కొనసాగింపు
చూపులో చులకన, సంస్కృతి పేర ఈసడింపు
గోడ తనలో ఇమిడ్చుకున్న గ్రూప్ ఫోటో ఫ్రేం
చూసినప్పుడల్లా తల్లి మనస్సు స్థాణువైన వైనం
మరుపురాని కలలా…
రెప్పచాటు దాగిన స్వప్నం
కరిగి కన్నీటి చుక్కలా చెక్కిలి జారదా…
అల్పాయుష్షు ఆత్మ అనంతంలో కల్సిపోయినప్పుడు.