అది అందమైన ప్రకృతి ఒడిలో వున్న నగరం. విశాఖ నగర శోభకు, ప్రకృతి సోయగాలకు, అరకు అందాలకు ముగ్థులు కాకుండా బహుశా ఎవరూ వుండరేమో? విశాఖ నగర శోభను తిలకించటానికీ, ప్రకృతి అందాలను ఆస్వాదించటానికీ గతంలో కుటుంబ సభ్యులతో కలిసి అనేక మార్లు విశాఖకు వెళ్ళాను. క్షేత్ర దర్శనంలో భాగంగా నవంబరు 7,8 తారీకుల్లో మా ప్రరవే సభ్యులతో కలిసి విశాఖకు వెళ్ళటం జరిగింది. విశాఖ నగరంలోకి అడుగు పెట్టగానే హుద్‌హుద్ తుఫాను సృష్టించిన ప్రణయ బీభత్సం మమ్మల్ని కదిలించేసింది. వేర్లతో సహా కూలిపోయిన పెద్దపెద్ద వృక్షాలు, ఎక్కడ చూసినా, ఎటుచూసినా సర్వం కోల్పోయామనిపించే ఎండుదనం… ఒక నిరాశాయుత వాతావరణం మాకు స్వాగతం పలికింది. తర్వాత క్షేత్ర దర్శనంలో అనేక విషయాలను మేము తెలుసుకున్నాం. ఆధునిక కాలంలో ఎలక్ట్రిసిటీ మన జీవితాల్లో విడదీయరాని భాగమైపోయిందనేది లేదనలేని సత్యం. కరెంటు వెలుగులు మనకు ఆనందాన్నీ, ఆహ్లాదాన్నీ కలిగిస్తాయి కానీ ఆ వెలుగుల వెనుక చిమ్మ చీకటి అలుముకునె, గాడాంధకారంలో మునిగిపోతున్న అభాగ్యుల జీవితాలు మాత్రం మనకు కనపడవు.
ప్రపంచంలో వున్న మిగితా అన్ని దేశాల కంటే అమెరికా పవర్‌ప్లాంట్స్‌ను అత్యధికంగా ప్రోత్సహిస్తోంది. ఈ పవర్ ప్లాంట్స్ వలన ప్రపంచవ్యాప్తంగా 170 లక్షల ఎకరాల అడువులు నాశనం అవుతాయని పర్యావరణ నిపుణులు చెప్తున్నారు. అంతే కాకుండా ఎకరాలకు ఎకరాలు అటవీ సంపదను నాశనం చేస్తే పచ్చదనం లేక కార్బన్‌డైఆక్సైడ్ అత్యధికంగా ఉత్పత్తి అవుతుందని, దీని వలన వరదలు, తుఫానులు ఏర్పడతాయని నిపుణులు హెచ్చరిస్తూనే వున్నారు. కూటికి, గుడ్డకు నోచుకోని అతి సామాన్య ప్రజల నుండి మధ్య తరగతి ప్రజల దాకా అందరూ తీవ్ర నష్టాన్ని చవిచూడాల్సి వస్తుందని కూడా హెచ్చరిస్తున్నారు. పర్యావరణ నిపుణుల హెచ్చరికల్ని బేఖాతరులో పెట్టింది అమెరికా. అమెరికాకు భారత ప్రభుత్వం తానా అంటే తందానా అంటోంది.
నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ ఉన్న పరవాడ ప్రాంతానికి వెళ్ళినపుడు ఎలక్ట్రోమేగ్నటిక్ వేవ్స్ ప్రభావం చాలా ఎక్కువగా వుంటుందని అక్కడి ప్రజలు చెప్పారు. ఆ వేవ్స్ నుండి ఒక రకమైన సన్నని శబ్దం నిరంతరం వినపడుతూనే వుంటుంది. ఈ వేవ్స్ (తరంగాల) ప్రభావం వలన చుట్టుపక్కల పిచ్చుకలు. పక్షులు, పిట్టలు నశించి పోతున్నాయని స్థానికులు చెప్పారు. అందుకే పరవాడ ప్రాంత పరిసరాల్లో ఎక్కడా పిట్టలు కానీ పక్షులు కానీ మనకు కనపడవు. ఈ ఎలక్ట్రోమేగ్నటిక్ వేవ్స్ ప్రభావం దాదాపుగా 500 కి.మీ వరకూ వ్యాపించి వుంటుంది కనుక జనావాసాలకు ఇవి దూరంగా వుండాలనేది నిపుణుల వాదన. కానీ భారత ప్రభుత్వం వీటన్నింటినీ పెడ చెవిన పెట్టింది. పచ్చని పొలాలలో గ్రామాల నడి మధ్యన వీటిని ఏర్పాటు చేస్తోంది. నిరంతరం వచ్చే సన్నని శబ్ద తరంగాల వలన యన్.టి.పి.సి చుట్టు పక్కల గ్రామాల ప్రజల్లో అనేక మంది మతిస్థిమితం కోల్పోవటం శోచనీయం.
ఇక మూల స్వయంభూవరం, పిట్టవానిపాలెం గ్రామాలకు వెళ్ళినపుడు చాలా ఆశ్చర్యకరమైన విషయాలు తెలిశాయి. యన్.టి.పి.సి నిర్మాణం జరిగి దాదాపుగా 17 సం||రాలు అయ్యిందని స్థానికులు చెప్పారు. బోరు నీళ్ళు అత్యంతంగా కలుషితమయి తాగటానికే కాదు కనీసం వాడుకోవటానికి కూడా పనికి రాకుండా పోతున్నాయని, నీళ్ళు ఎర్రగా వుండి ఫినాయిల్ వాసన వస్తుంటాయని, బోరు నీళ్ళు తాగిన వారి కాళ్ళు, చేతులు పడిపోయాయని గ్రామస్థులు వాపోయారు. గ్రామస్థులు చెప్పిన దానిబట్టి అక్కడ జలుబు, కిడ్నీ వ్యాధులు, వినికిడిలోపం, రక్తం కక్కుకోవటం సర్వసాధారణం. వాంతులు, జ్వరాలు వారి జీవితంలో భాగమై పోయాయి. ఇక చర్మవ్యాధులకు కొదవలేదు. ఒంటిమీద నల్లని మచ్చలు, కురుపులు లేనివారంటూ ఎవరూ వుండరంటే అతిశయోక్తి కాదు. మధ్యాహ్న సమయంలో పసిపిల్లల దగ్గర నుండి వయోవృద్ధులదాకా దాదాపుగా అందరికీ తలనొప్పి వస్తుంది. రాత్రిళ్ళు వాయువుల్ని వదుల్తూంటారు. మే-జూన్ వేసవికాలంలో యన్.టి.పి.సి బూడిదను గాలిలోకి వదలటాన గాలితో పాటు బూడిద పైనుండి పడుతూ వుంటుంది. మాట్లాడుతుంటే నోట్లోకి బూడిద పోతూ వుంటుంది. ఎండలో బట్టలు ఆరేసిన మరుక్షణం మసిబొగ్గు వచ్చి పడుతూనే వుంటుంది. పై పెచ్చు పైనుంచి రాలే బూడిదలో వున్న రేడియో యాక్టివిటి వలన శారీరక, మానసిక సమస్యలే కాకుండా బుద్ధి మాంధ్యం వచ్చే అవకాశాలూ ఎక్కువే. నాడీ వ్యవస్థ దెబ్బతిని, బ్రెయిన్ ట్యూమర్లు ఏర్పడుతుంటాయి. పెట్రో, కెమికల్స్, హైడ్రోకార్బన్స్ వలన పుట్టే పిల్లలు అంగవైకల్యంతో పుట్టే అవకాశాలు ఎక్కువ అంటున్నారు నిపుణులు. అక్కడ వున్నంత సేపూ మా అందరికీ శరీరమంతా మండగా, ఇరిటేషన్‌గా అనిపించింది.
యన్.టి.పి.సి నిర్మాణం జరిగిన పరిసర గ్రామాలలోని ప్రజలు ఎక్కువ శాతం సన్నకారు రైతులూ, కూలీపనులు చేసేవారే. యన్.టి.పి.సి నిర్మాణానికి ముందు ఎకరాకు 2లక్షల 25వేల రూపాయలు ఇస్తామని చెప్పటమే కాకుండా ఇంటింటికీ ఉద్యోగాలు కూడా ఇస్తామని నమ్మబలికారు. ఐతే, పిట్టవానిపాలెంలో ఎకరాకు 50వేల రూపాయలు మాత్రమే ఇచ్చారు. యన్.టి.పి.సి వలన కలిగే నష్టాలను మాత్రం ప్రజలకు ఇటు ప్రభుత్వం కానీ, ఇతర రాజకీయ పార్టీలు కానీ అటు కంపెనీ కానీ కనీసం తెలియపర్చలేదు. ప్రజల అమాయకత్వాన్ని ఆసరా చేసుకుని వాళ్ళకు మెరుగైన జీవితాలను అందిస్తామని భరోసా ఇచ్చి ఎకరాలకు ఎకరాలు భూమిని కారుచౌకగా కొట్టేశారు. కంపెనీ ప్రజలకు భరోసా ఇచ్చిన ఏ ఒక్క అంశాన్ని ఆచరణలో పెట్టలేదు. యన్.టి.పి.సి ద్వారా అతి కొద్దిమందికి మిగిలిన వాళ్ళకు ఉద్యోగాలు అందలేదు సరికదా మరే విధమైన సహకారమూ, వారిని చేరలేదు. ఒకప్పుడు ఎకరానికి 40,50 కట్టల ధాన్యాన్ని పండించే రైతులు కూలీలుగా మారి మట్టి తవ్వటానికీ, కంకర పోయటానికీ వెళ్తున్నారు. ఇంకా డ్రస్సులు కుట్టడానికీ, ఫార్మాసిటీ కంపెనీలలో పనిచేయటానికీ వెళ్తున్నారు. కిడ్నీ వ్యాధులు సోకిన కుటుంబాలలో పరిస్థితి మరీ దారుణంగా వుంది. వచ్చే ఆదాయం ఏమీ లేకపోగా వైద్యానికి 15రోజులకు 3,000 రూపాయలు ఖర్చువుతాయిట. యన్.టి.పి.సి వచ్చాక కరెంటు బిల్లులు కూడా అధికమయ్యాయి అన్నారు. గ్రామాలను దూరంగా తరలిస్తామని చెప్పినా సరియైన స్థలాలను చూపించలేకపోయారు.
చివరగా, ఆ గ్రామ ప్రజలు తమ దయనీయ పరిస్థితులను మాకు వివరిస్తూ ”బతికితే బతుకుతాం… లేకపోతే చావటమే” అన్నారు. ఈ సందర్భంగా ఒక మహాకవి చెప్పిన ఒక దోహ నాకు గుర్తుకు వచ్చింది. ”చెరువు ఎండిపోతే పక్షులకు రెక్కలు వుంటాయి కాబట్టి అవి ఎగిరిపోతాయి. కానీ చేపలకు ఎగరటానికి రెక్కలుండవు కదా! అవి ఎక్కడికీ వెళ్ళలేక మరణిస్తాయి!” వందకు పైగా గడపలున్న ఆ గ్రామంలో కొద్దీ, గొప్పా ఆర్థిక పరిస్థితి బాగున్నవారు గ్రామాలను వదిలి దూరంగా వెళ్ళిపోయారు. మరి బీదా, బిక్కీ జనాలకు దిక్కేది? అక్కడే ఆ గ్రామాలలోనే యన్.టి.పి.సి దుష్ఫ్రభావాలకు గురవుతూ, బలవుతూ మరణానికి చేరువవుతున్నారు.
ఛాలాస్మంచి విస్లెషన కవిని గారూ