తెలంగాణ ప్రభుత్వం సెప్టెంబర్, 2014లో ఐ.ఎ.ఎస్, ఐ.పి.ఎస్ అధికారులతో ఒక సేఫ్టీ కమిటీని ఏర్పాటు చేసి రాష్ట్రంలో మహిళల రక్షణ, భద్రతపై అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలని సూచించింది. ఈ కమిటీ వివిధ సంస్థలు, విద్యార్థులతో పలు సమావేశాలు నిర్వహించి వారి అభిప్రాయాలను, సూచనలను సేకరించి ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. ఇలాంటి సమావేశాలలో భూమిక కూడా పాల్గొని స్త్రీల రక్షణ సంబంధించి అనేక సూచనలు, సలహాలు ఇవ్వటం జరిగింది. ప్రభుత్వం ఈ నివేదిక ఆధారంగా హైదరాబాద్‌లో ఈవ్‌టీజింగ్, మహిళలపై జరిగే వేధింపులను కట్టడి చేసేందుకు వంద షీ టీమ్‌లు (మహిళా రక్షణ బృందాలను) అక్టోబరు నెలలో ఏర్పాటు చేసారు. ఈ ‘షీ’ బృందాలు హైదరాబాద్ అడిషనల్ కమీషనర్ ఆఫ్ పోలీస్, స్వాతి లక్రా గారి ఆధ్వర్యంలో పనిచేస్తున్నాయి. ఒక్కో బృందంలో మహిళలు, పురుషులతో కూడిన ఐదుగురు పోలీసులు సభ్యులుగా ఉంటారు. వీరు సాధారణ పౌరులలో కలిసిపోయి, సివిల్ డ్రెస్‌లో ఉంటారు. ఏ ప్రాంతాల్లో మహిళలపై వేధింపులు ఎక్కువగా జరుగుతున్నాయో అలాంటి ప్రాంతాలను పోలీసు వారు గుర్తించి అక్కడ ఈ ‘షీ’ బృందాలను ఏర్పాటు చేసారు. ఆర్టీసీ బస్సుల్లో కూడా ఈ బృందాలు ఉంటున్నాయి. ‘షీ’ బృందాలవారు మహిళల వేధింపులు, ఈవ్ టేజింగ్, అమ్మాయిలను ఏడ్పించడం వంటి ఘటనలను ఈ బృందాలు సీక్రెట్ కెమరాలతో రికార్డు చేసి వారిని సీసీఎస్‌కు తరలిస్తారు. అక్కడ వారి తల్లిదండ్రులను పిలిపించి కౌన్సిలింగ్ ఇస్తారు. ఒకే వ్యక్తి 2-3 సార్లు పట్టుబడితే వారిపై నిర్భయ కేసులు నమోదు చేస్తారు. మహిళలు వేధింపు ఎదుర్కొంటుంటే వెంటనే ‘100’ నెంబర్‌కు సమాచారం ఇస్తే వెంటనే ‘షీ’ బృందాలు వెళ్ళి నిందితులను పట్టుకుంటారు. ఈ విధంగా ‘షీ’ బృందాలు పనిచేస్తున్నాయి.
‘షీ బృందాల పనితీరు బాగుందంటూ, వెంటనే చర్యలు చేపడ్తున్నారని భూమిక హెల్ప్‌లైన్‌కు ఫోన్ చేసి చేబుతున్నారు, కాలేజీల్లో సమావేశాలు ఏర్పాటు చేసినప్పుడు విద్యార్థులు కూడా చెప్పడం జరిగింది. గత వారంలో స్వాతి లక్రా గారిని కలవటానికి భూమిక బృందం వెళ్లినప్పుడు ఈ ‘షీ’ బృందాల పనితీరును అభినందించారు. అప్పుడు స్వామి లక్రా గారు ‘షీ’ బృందాలపై ఒక చిన్న అధ్యయనం చేసి సామాన్య ప్రజల్లో వీటిపై అవగాహన ఎంత వరకు ఉంది, వీటివల్ల ఎలాంటి ప్రయోజనం పొందుతున్నారు, వీటి ప్రభావం వల్ల నగరంలో మహిళలపై వేధింపుల ఏమైనా తగ్గాయా, ఎలాంటి మార్పు వచ్చింది అనే అంశాలను అంచనా చేయగలుగుతారా అని అడిగారు.
దీనికి సరేనంటూ భూమిక వివిధ కాలేజీల్లోని విద్యార్ధులను ఎంపిక చేసుకొని, ఒక ప్రశ్నావళి తయారు చేసి జనవరి 20వ తేదీన విద్యార్థులకు భూమిక ఓరియెటేషన్ చేయడం జరిగింది. వీరందరూ ఎంపిక చేయబడ్డ ప్రాంతాలలో ప్రజలను ఇంటర్వ్యూ చేస్తున్నారు. జనవరి నెలాఖరికి రిపోర్ట్ తయారు చేసి స్వాతి లక్రా గారికి ఇవ్వనున్నాం. దాదాపు 100 మంది విద్యార్థి, విద్యార్థినులు ఇందులో పాల్గొని మాకు సహకారం అందించినందకు రోడా మిస్ట్రీ కాలేజ్ ఆఫ్ సోషల్ వర్క్, శ్రీనిధి కాలేజి, అనిబిసెంట్ కాలేజ్ సయోధ్య షెల్టర్ హాం, టాటా ఇన్సిటిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ విద్యాఉ్ధలందరికీ, లోక్‌సత్తా పార్టీ కార్యకర్తలకు మా హృదయపూర్వ అభినందనలు తెలియచేస్తున్నాం. ఈ అధ్యయనాన్ని కొనసాగిస్తూ ప్రజల్లో ‘షీ’టీమ్ మీద అవగాహన కల్గించాలని భూమిక నిర్ణయించుకుంది.