‘Social Dimensions of Early Budhism’, ‘Rewriting History : The Life and Times of Pandita Ramabai’, ‘Gender and Caste through a Feminist ‘Everyday Lives and Everyday Histories : Beyond the Kings and Brahmins of India’ లాంటి ముఖ్యమైన పుస్తకాలు రచించిన డా|| ఉమా చక్రవర్తి (జననం 1941) ప్రసిద్ధ స్త్రీవాద చరిత్ర రచయిత్రి. స్త్రీల సాధారణ ప్రజల అధికారాలకు సంబంధించిన ఉద్యమాల్లో క్రియాశీలమైన పాత్ర వహించడమే గాక
ఈమె ఢిల్లీలోని Centre for Women Development Studies అనే సంస్థలో ప్రశంసించదగ్గ పనిచేశారు. ఢిల్లీ విశ్వవిద్యాలయం మిరండాహౌస్లో చరిత్రోపన్యాసకురాలుగా చాలా
ఏళ్ళు పనిచేసి పదవీ విరమణ చేశారు. డా|| రమేశ్ ఉపాధ్యాయ వారితో జరిపిన ఈ ఇంటర్వూ 10.05.2003న రికార్డు చేయబడి ‘కథన్’ అనే హిందీ సాహిత్య పత్రిక జూలై- సెప్టెంబర్ 2003 సంచికలో వెలువడింది. డా|| ఉపాధ్యాయ ‘కథన్’ పత్రిక సంపాదకులే కాక, పేరుమోసిన హిందీ రచయిత. 25కు పైగా వీరి నవలలు, కథాసంపుటాలు, అనువాదాలు, వ్యాస సంపుటాలు వెలువడ్డాయి. వీరు కూడా ఢిల్లీ విశ్వవిద్యాలయంలో హిందీ ఉపన్యాసకులుగా పని చేసి పదవీ విరమణ చేశారు.
రమేశ్: ఉమగారూ, మీరు Social Dimensions of Early Budhism’ అనే పుస్తకం రాసి చరిత్ర రచయిత్రిగా పేరుపొందారు. మరి స్త్రీ వాదానికి సంబంధించిన రచనలు చేయాలనే అభిలాష మీకు ఎలా కలిగింది?
ఉమ : నేను 1966 నుండి 1988 వరకు ఢిల్లీ విశ్వవిద్యాలయంలో చరిత్ర పాఠాలు చెప్పాను. ఉపాధ్యాయురాలిగా ఉపాధ్యాయుల ఉద్యమంలో సహజంగానే చేరిపోయాను. తర్వాత ఎమర్జెన్సీ రోజుల్లో ప్రజాస్వామ్య హక్కుల సాధనకు సంబంధించిన ఉద్యమంలో చేరాను. అదే విధంగా ఆ తర్వాత స్త్రీవాద ఉద్యమంలోకి వచ్చాను. స్త్రీ వాదానికి సంబంధించిన రచనలు చేయాలనే కోరికకు సంబంధించినంత వరకు ఈ కోరిక నాలో ‘Social Dimensions of Early Budhism’ రాసేందుకు పరిశోధన చేస్తున్న రోజుల్లోనే కలిగింది. బౌద్ధ సాహిత్యం ప్రపంచంలో అన్నింటికంటే ప్రాచీనమైన స్త్రీవాద సాహిత్యానికి మూలస్థానం.
రమేశ్: నాకు తెలిసినంత వరకు స్త్రీవాదం ఒక ఆధునికవాదం. బౌద్ధ సాహిత్యంలో స్త్రీవాదం మీకెక్కడ దొరికింది?
ఉమ: మీలాగే చాలామంది స్త్రీవాదం పాశ్చాత్యదేశాల నుండి వచ్చిన ఆధునిక వాదమనీ, బయటి దేశాల వాదమనీ, మనదేశ వాదం కాదనీ అనుకుంటారు. కాని, పితృస్వామ్యం ఎంత ప్రాచీనమైందో, స్త్రీవాదం కూడా అంతే ప్రాచీనమైందని తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. స్త్రీలను పురుషుల అధీనంలో ఉంచే ఉద్దేశ్యంతో ఎన్నో బంధనాల్లో వారిని పట్టి బిగించడాన్నే పితృస్వామ్యమని మనం అనుకుంటే, ఆ బంధనాల నుండి విముక్తి పొందడానికి తిరుగుబాటు చేయడం, స్త్రీ పురుషుల సమానత్వం కోసం ప్రయత్నించడమే స్త్రీవాదం. ఇలాంటి ప్రయత్నాలు, తిరుగుబాట్లు ప్రతి సమాజంలోనూ జరుగుతూ వచ్చాయి. బుద్ధుడు తాను స్థాపించిన సంఘంలో స్త్రీలు చేరడానికి మొదట అనుమతి ఇవ్వలేదని మీకు తెలుసు. కాని, ఆ తర్వాత స్త్రీలకు కూడా పురుషుల్లాగే ఇల్లు, కుటుంబం వదిలిపెట్టి బౌద్ధసంఘంలో చేరాలనే కోరిక ఉందని తెలిసిన తర్వాత ఆయన అనుమతించాడు.
రమేశ్: ఆయన శిష్యుడు ఆనందుడు పైరవీ చేశాడు…
ఉమ : అందువల్లనే నేను ఆనందుణ్ణి చరిత్రలో మొదటి పురుషస్త్రీవాదిగా భావిస్తాను. ఇక బౌద్ధసాహిత్యంలో ‘థేరీ గాథలు’ అనే రచనలున్నాయి. వృద్ధులైన బౌద్ధ భిక్షవులను ‘థేర్లు’ (స్థవిరులు) అని, వృద్ధ బౌద్ధ భిక్షుణిలను ‘థేరీలు’ (స్థవిరలు) అని అనేవారు. ఈ వృద్ధ స్త్రీలు సామాజిక బంధనాల నుండి తమ విముక్తికీ, స్త్రీ పురుషుల సమానత్వానికీ సంబంధించిన ఏ గీతాలు రాశారో, వాటిని ‘థేరీ గాథలు’ అని అంటారు. ఎందుచేతనంటే, వీటిలో ఈ గీతాలు పాడిన స్త్రీల ఆధ్యాత్మిక అనుభవాలతో పాటు క్లుప్తంగా వారి జీవిత కథలు కూడా ఉన్నాయి కాబట్టి. ఈ కథల ద్వారా ఆ కాలం నాటి సమాజ స్థితిగతుల గురించి, స్త్రీపురుషుల పరస్పర సంబంధాల గురించి మనకు కొంత తెలుస్తుంది. ఉదాహరణకు – సుమంగళ మాత అనే ఒక థేరీ ఇక ముందు తన కూడా ఇంటి పనిపాటల నుండి, భర్త నుండి విముక్తి పొంది, ప్రశాంతంగా చింతన, ధ్యానం చేసుకోగలనని చెప్తుంది. నందుత్తర అనే మరో థేరీ ”ఇప్పుడు నేను నా దేహాన్ని దాని నిజరూపంలో చూడడం ఆరంభించాను, అన్ని విధాలైన బంధనాల నుండి విముక్తి పొంది నా హృదయం ఇప్పుడు శాంతి పొందింది” అని అంటుంది. మునుపు వేశ్యగా ఉండిన విమల అనే మరో థేరీ ”ఇప్పుడు నా బంధనాలన్నీ తెగిపోయాయి, అందరు పురుషులను, దేవుళ్ళను నా జీవితం నుండి తొలగించేశాను” అని అంటుంది. ఈ విధంగా ఈ గాథలు స్త్రీలు చేసిన రచనలకు, స్త్రీలు తమ గురించి రాసుకున్న రచనలకు అన్నిటికంటే ప్రాచీనమైన ఉదాహరణలు. వీటి ద్వారా స్త్రీలు ఆధ్యాత్మిక అనుభవాలకు, పురుషుల ఆధ్యాత్మిక అనుభవాలకు మధ్య తేడా ఏమీ లేదని తెలుస్తుంది. పురుషులు ఏ విధంగా తమ ముక్తి గురించి, నిర్వాణం గురించి ఆలోచిస్తారో, స్త్రీలు కూడా అలాగే ఆలోచించారు. ఇది స్త్రీవాదం కాక మరేమిటి?
రమేశ్ : ఈ థేరీ గాథల రచనాకాలం ఏమిటి?
ఉమ: ఈ వృద్ధ భిక్షుణిలు బుద్ధుని సమ కాలికులు. అందువల్ల వీటి రచనాకాలం క్రీ.పూ. 6వ శతాబ్దం అయి ఉండాలి. కాని, ఈ రచనలు దాదాపు 500 సంవత్సరాల వరకు మౌఖిక రూపంలో ప్రచారంలో ఉండినాయి. ఆ తర్వాత వాటిని లిపిబద్దం చేయడం జరిగింది. ఈ మధ్యకాలంలో ఆ మూల రచనల్లో ఎలాంటి మార్పులు జరిగాయో, తెలుసుకోవడం ఇప్పుడు సాధ్యపడదు. అయినా ఈ రచనలు ప్రాచీన భారతదేశ సామాజీక చరిత్రను, ఆనాటి సామాన్య ప్రజల స్థితిగతులను తెలుసుకొనేందుకు గొప్పగా ఉపకరిస్తాయి. ఈ గాథలు స్త్రీవాద రచనల మొట్టమొదటి నమూనాలే కాక వీటి ద్వారా ఆ కాలం నాటి స్త్రీవాద
ఉద్యమం గురించి కూడా మనకు కొంత తెలుస్తుంది. బుద్ధుడు మొదట తన సంఘంలో స్త్రీల ప్రవేశాన్ని నిషేధించాడు. అంతేకాదు, తనను చిన్నతనంలో పెంచి పెద్ద చేసిన తల్లిలాంటి దాదికి కూడా ప్రవేశం ఇవ్వలేదు. అలాంటప్పుడు స్త్రీలు ఆ సంఘంలో స్థానం ఎలా పొందారు? పోరాటం చేసి, ఉద్యమం నడిపి, అని తెలుస్తూనే ఉంది.
రమేశ్: ఆనందుడు ‘మొదటి పురుష స్త్రీవాది’ అని మీరన్నారు. ఇది చాలా ఆసక్తికరమైన మాట. మరి పురుషులు కూడా స్త్రీవాదులు కాగలరంటారా?
ఉమ: ఎందుకు కాలేరు? పాశ్చాత్యదేశాల్లో ‘Male Feminists’ లాంటి పుస్తకాలు కూడా వెలువడ్డాయి. బౌద్ధసంఘంలో ప్రవేశం పొందడానికి ఉద్యమం నడుపుతున్న స్త్రీలకు వకీలులాంటి పాత్ర నిర్వహించడం ఆనందుని విశిష్టత. ఆయన స్త్రీలను అడ్డగించడానికి తీసుకువచ్చే వాదనలన్నింటిని ఏకరువు పెట్టి స్త్రీల పక్షం నుండి తర్కిస్తాడు. స్త్రీలకు సంఘంలో ప్రవేశం ఎందుకు కల్పించరాదు, అనే విషయంలో బుద్ధునితో స్పష్టంగా వాదిస్తాడు. స్త్రీలు నిర్వాణం పొందగలరా లేదా, అని బుద్ధుని అడుగుతాడు. పొందగలరని బుద్ధుడు సమాధానం చెప్తాడు. అప్పుడు ఆనందుడు ”సంఘంలో ప్రవేశించకుండా నిర్వాణం పొందడం సాధ్యం కాదని మీరే అంటారు కదా, అలాంటప్పుడు ఈ స్త్రీలు సంఘంలో ప్రవేశం పొందలేనప్పుడు నిర్వాణం ఎలా పొందగలరు? వీరిని చేరనివ్వండి” అని వాదిస్తాడు. చివరకు బుద్ధుడు ఆయన తర్కాన్ని అంగీకరించి స్త్రీలకు సంఘంలో ప్రవేశం కల్పించాడు.
రమేశ్: కానీ బౌద్ధ సంఘంలో కూడా స్త్రీల పట్ల భేదభావం కనపరచేవారు.
ఉమ: అవును మొదటమొదట చాలా భేధభావం చూపేవారు. కొన్ని పనులు భిక్షవులే చేసేవారు. భిక్షుణిలను అవి చేయనిచ్చేవారు కాదు. స్త్రీలను పురుషుల కంటే హీనంగా చూసేవారు. ఉదాహరణకు ఒక నియమం ఉండేది. భిక్షుణి భిక్షువు కంటే వయసులో ఎంత పెద్దదైనా ఆమె భిక్షవుకు ప్రణామం చేయాలి. ఇలాంటి బేధభావం తొలగించడానికి కూడా ఆనందుడు స్త్రీల తరుపునుండి చెప్పవలిసిన మాటలన్నీ స్త్రీల ద్వారా చెప్పించకుండా ఈ విధంగా ఒక పురుషుని ద్వారా చెప్పించడం ‘text’ యొక్క‘strategy’ కూడా అయి ఉండవచ్చు. ఏమయినా దీనివల్ల ఆ కాలంలో స్త్రీపురుషుల సమానత్వం కోసం, స్త్రీ పైన పురుషుని అదుపును తొలగించడం కోసం స్త్రీల ఉద్యమం ఒకటి సాగుతూ ఉండిందని, ఆ ఉద్యమంలో వారికి తోడుగా కొందరు పురుషులు కూడా ఉండేవారని మాత్రం మనకు తెలియనే తెలుస్తుంది. అందువల్లనే నేను ఆనందుణ్ణి చరిత్రలో ప్రప్రథమ పురుషుడైన స్త్రీవాది అని అన్నాను.
రమేశ్: సరే, స్త్రీలలో కూడా పురుషులకు సమానంగా ఆధ్యాత్మిక సామర్థ్యం ఉందని నమ్మి బుద్ధుడు తన సంఘంలో ప్రవేశం ఇచ్చి వారికి సమానమైన అధికారులు కల్పించాడు. కానీ, ఆనాటి సమాజంలో స్త్రీల స్థానం ఏమిటి? వారిని ఎలాంటి దృష్టితో చూసేవారు? స్త్రీలలో కూడా పురుషులతో సమానమైన ఆధ్యాత్మిక సామర్థ్యం ఉందని అంగీకరించడం అంటే స్త్రీ పురుషునితో సమానంగా విద్య, జ్ఞానం పొందగలదనీ, ఆమె బౌద్ధిక సామర్థ్యం కూడా పురుషునితో సమానంగా ఉంటుందనీ చెప్పడమే కదా! కానీ, సంఘం వెలుపల అంటే ఆనాటి జనసామాన్యంలో స్త్రీ బౌద్ధిక సామర్థ్యాన్ని ఏ విధంగా అంచనా వేసేవారు?
ఉమ : ఈ ‘థేరీ గాథల్లో, సోమ అనే థేరీకి సంబంధించిన గాథ ఒకటి ఉంది. దాని ఆధారంగా మీ ప్రశ్నకు ఆసక్తికరమైన సమాధానం చెప్పవచ్చు. సోమ ఒక బౌద్ధబిక్షుణి. ఆమె ప్రాపంచిక బంధనాలు తెంచుకుని, లేదా త్యజించి సంఘంలోకి వచ్చి నిర్వాణం పొందడం కోసం కృషిచేస్తుంది. అదే ఆమె ఆధ్యాత్మిక లక్ష్యం. దాన్ని పొందడానికి ఆమె సాధన చేయాలి. ఆధ్యాత్మిక అర్థంలో ఈ సాధన ఏదైనా ఒకదాన్ని గురించి ధ్యానం చేసే క్రియ కావచ్చు, భౌతిక అర్థంలో విద్య లేక జ్ఞానం పొందే క్రియ కావచ్చు. ఏది ఏమైనా నిశ్చలమైన ధాన్యం రెండిటిలోనూ అవసరమే కదా! కాని బౌద్ధ సాహిత్యంలో ‘మారుడు’ అనే ఒక మహాదుష్ట పాత్ర ఒకటుంది. అతడు చేసేవారి ధ్యానం చెడగొట్టే ప్రయత్నం చేస్తూ ఉంటాడు…
రమేశ్ : ‘మారుడు’ అంటే మన్మథుడు, అంటే కాముడు లేదా ‘సెక్స్’ కూడా కదా…..
ఉమ: అవును. కానీ ఆ అర్థం ఇక్కడ ప్రాసంగికం కాదు. ‘సయుత్త నికాయ’ అనే బౌద్ధగ్రంథంలో సోమ కథ ఈ విధంగా ఉంది – మారుడు సోమ వద్దకు వస్తాడు. వచ్చి ఆమెను అదరించి – బెదిరించి ఆమె ధ్యానం భంగం చేయడానికి, ఆమెను తన చింతనమనన నిండి విచలితురాలిని చేయడానికి ప్రయత్నిస్తాడు. ఆమెను నిరుత్సాహపరచడానికి గొప్ప- గొప్ప జ్ఞానులు మాత్రమే ముక్తి ద్వారాన్ని చేరగలుగుతారని అంటాడు. కేవలం ‘రెండువేళ్ళ బుద్ధి’ కలిగి ఉండే స్త్రీ ముక్తిద్వారం ఎలా చేరగలుగుతుంది.? అని ప్రశ్నిస్తాడు. ‘రెండువేళ్ళ బుద్ధి’ అంటే అతని ఉద్దేశం – స్త్రీలకు అన్నం వండడం మాత్రమే తెలుసు. అన్నం ఉడికిందా లేదా, తెలుసుకునేందుకు వాళ్ళు ఉడుకుతున్న అన్నం మెతుకును బొటనవేలు, చూపుడువేలు మధ్య వత్తి చూస్తారు కదా! అలాంటి తెలివితేటలే వారికి
ఉంటాయి. బుద్ధికి సంబంధించిన పనులు చేసే యోగ్యత వారికి ఉండదు, అని. అంటే, వారు విద్య, విజ్ఞానం, నిర్వాణం లాంటివి పొందలేరు అని. ఈ మాటలని మారుడు సోమను కించపరచాలని చూస్తాడు. సోమలో అలాంటి హీనభావన ఉండి ఉంటే మారుడు ఆమెను తమ మార్గం నుండి తప్పించగలిగేవాడే. కానీ, సోమ తెలివైంది. ఆమె తన కవిత (థేరీ గాథ) ప్రకారం మారుడు ఈ ప్రశ్నల వలలో చిక్కుకోదు. ఎదురు ప్రశ్న వేసి మారునితో ”నీకు నాతో మాట్లాడే అర్హత లేదు” అని అంటుంది. ఆమె కవితలో ఇంకా ఇలా అంటుంది. – స్త్రీలలో పురుషులకంటే తక్కువ బుద్ధి ఉంటుందనీ, వారు తమ ప్రవృత్తిననుసరించి ఇంటిపనులే చేయగలదనీ, మీరు మాతో అంటున్నారు. కానీ మేము నిరంతరం జ్ఞానమార్గంలో ముందుకు సాగిపోవాలని నిర్ణయించుకుని ముందుకు సాగిపోతున్నప్పుడు, మా జ్ఞానం నిరంతరం పెంపొందుతున్నప్పుడు, మా ‘ప్రవృత్తి’ మమ్ములను ఎలా ఆపగలుగుతుంది? మీరు స్త్రీపురుషుల పాత్రలను వేరువేరుగా నిర్ణయించి, స్త్రీలకిచ్చిన పాత్రను వారి ‘ప్రవృత్తి’ అని అంటున్నారు. కానీ, నేను ఆ ‘ప్రవృత్తి’కి విరుద్ధంగా పురుషులు చేసే పనిచేస్తున్నాను. అలాంటప్పుడు ఇక మీరే చెప్పండి, ఇలాంటి పనిచేస్తున్న నేను స్రీనా లేక పురుషుణ్ణా? నేను ఇటు స్త్రీని గానీ, అటు పురుషుడు గానీ, కానప్పడు మహాశయా, మీరిప్పుడు ఎవరితో మాట్లాడుతున్నారు? ఇది ఆమె ప్రశ్న.
రమేశ్: నోరు మూయించే భలే ప్రశ్న వేసింది!
ఉమ: మహాశయా, నాతో మాట్లాడే అర్హత మీకులేదు, అని సోమ అంటుంది. ఈ ‘థేరీ గాథ’లో గమనించవలసిన విషయం ఏమిటంటే, ఏ స్త్రీతో అయితే పురుషునితో పోల్చి చూసినప్పుడు నీవు చాలా హీనురాలివని చెప్పడం జరిగిందో, అమె తనను గురించిన ఈ అంచనాను త్రోసిపుచ్చింది. నిరుత్సాహం కలిగించే క్షణాల్లో కూడా ఆమె నేను స్త్రీని కాబట్టి నాలో ఆధ్యాత్మిక సిద్ధి పొందే యోగ్యత లేదు, అని ఆలోచించదు. అంతేకాక స్త్రీ హీనత్వం గురించిన అభిప్రాయాన్ని మారుడు పన్నిన వలగా భావించి దానిలో చిక్కుకోడానికి నిరాకరిస్తుంది. నిర్వాణం పొందడానికి స్త్రీలు కూడా అర్హులే, అన్న బుద్ధుని మాట ఆమెకు ఎల్లప్పుడూ గుర్తు ఉంటుంది. పితృస్వామ్యానికి ప్రతినిధి అయిన మారుడు ఆమె ప్రశ్నకు జవాబివ్వలేక నిరాదరణకు గురి అవుతాడు.
రమేశ్: అంటే స్త్రీలు సహజంగా పురుషుల కంటే హీనులు, అని బుజువు చేయడానికి పితృస్వామ్యం ప్రాచుర్యం కల్పించిన అభిప్రాయాలను, ఆచరణలోకి తెచ్చిన నమ్మకాలను ప్రశ్నించడం, స్త్రీవాదానికుండే ఒక ముఖ్యమైన లక్షణం అని మనమనుకోవాలి!
ఉమ: అది ఉండనే ఉంది. ప్రాచీనకాలానికి చెందిన ఈ ఉదాహరణలు చూపి ఇది మన స్వంత స్త్రీవాదమని చెప్పడానికి ప్రయత్నిస్తున్నాను. ఈ స్త్రీవాదం ఈనాడు ఏర్పడింది గానీ, పాశ్చాత్య దేశాల నుండి వచ్చిందిగానీ కాదు. స్త్రీలు తమను తాము తెలుసుకోవడం, లేదా తమ ఉనికి కొరకు పోరాడడం, ఈ పోరాటంలో సామాజిక సాంస్కృతిక స్థాయిలో పురుషులు లేవనెత్తే స్త్రీ విరోధ ప్రశ్నలను తిరస్కరిస్తూ ఎదురు ప్రశ్నలు వేయడం, పురుషుల ప్రశ్నల స్థానంలో తమ స్వంత ప్రశ్నలు లేవనెత్తడం, ఇదంతా అన్ని సమాజాల్లో చాలా పాతకాలం నుండి – పితృస్వామ్యం ఉదయించిన కాలంనాటినుండి – నడుస్తూనే ఉంది. దీన్ని పాశ్చాత్య దేశాల నుండి వచ్చిన ధోరణిగా భావించడం గానీ, అభివృద్ధి చెందిన దేశాల నుండి అభివృద్ధి చెందని లేక అభివృద్ధి చెందుతున్న దేశాలలోకి వచ్చిన ధోరణిగా భావించడం గానీ, లేదా, మనం వెనకబడి ఉన్నాం, గనుకనే మనదేశంలో పితృస్వామ్యం నెలకొని
ఉందని భావించడం గానీ పొరపాటు. అత్యంత అభివృద్ధి చెందిన దేశాల్లో కూడా పితృస్వామ్యం ఉంది, అది నెలకొనినప్పటి నుండి దాన్ని ఎదిరించే ప్రయత్నాలు అక్కడా ఇక్కడా కూడా జరుగుతూ ఉన్నాయనేది మాత్రం వాస్తవం.
రమేశ్: అది ఎప్పుడు నెలకొనింది ?
ఉమ: దాని కాలాన్ని గురించి గానీ, దాని చరిత్ర గురించి గానీ, నిర్ధారణగా చెప్పడం కష్టం. అయితే పితృస్వామ్యాన్ని గానీ, దాని ప్రతిఘటనను గానీ విదేశాల నుండి వచ్చిన దానిగా భావించడం మాత్రం పొరపాటు. మన వైదిక యుగాన్ని స్వర్ణయుగంగా భావించేవారు చెప్తూ ఉంటారు – మాదేశంలో ప్రాచీన కాలంలో స్త్రీ పురుషులు సమానంగా ఉండేవారు. అంతేకాదు, సమాజంలో స్త్రీలను చాలా గౌరవించేవారు, వాళ్ళను పూజించేవారు.. అని, గతాన్ని మహిమాన్వితం చేసే ఉద్దేశ్యంతో ఆనాటి స్త్రీపురుష సంబంధాలను ఆదర్శీకరించే ఈ ప్రయత్నం యధార్థంపైన గాక కల్పనపైన ఆధారపడి ఉంది. ఇక్కడ నేనొక ఉదాహరణ ఇస్తాను. 19వ శతాబ్ధంలో సంఘ సంస్కర్తలు స్త్రీవిద్య అవసరాన్ని గురించి చెప్పేటప్పుడు ప్రాచీన కాలంలోని గార్గి, మైత్రేయి లాంటి కొందరు స్త్రీల ఉదాహరణలిచ్చి అంటూ ఉండేవారు – ”చూడండి, మనదేశంలో ఎలాంటి విదుషీమణులుండేవారో! పురుషులతో సమానంగా శాస్త్రచర్చ చేసేవారు!” అని. అయితే పితృస్వామ్యం అప్పుడు కూడా ఉండేదనీ, యాజ్ఞవల్కుడు గార్గి అడిగిన ప్రశ్నలకు జవాబు చెప్పలేని స్థితిలో నిండుసభలో ”నీవు అతిగా ప్రశ్నలడుగుతున్నావు” అని మందలించగలిగేవాడు, అనే విషయం వాళ్ళు చెప్పరు!
రమేశ్ : కేవలం మందలించడమే కాదు, బెదిరించగలిగేవాడు కూడా!
ఉమ: అవును. అదే చెప్పబోతున్నాను. గార్గి, యాజ్ఞవల్కుడు మధ్య జరిగిన శాస్త్రచర్చ కథ చాలా ఆసక్తికరంగా ఉంటుంది. యాజ్ఞవల్క్యుడు ఎంత విద్వాంసుడో, అంతే గర్విష్ఠి, కోపిష్ఠికూడా. ఒకసారి జనకమహారాజు ఒక యజ్ఞం చేసి అందుకు చాలామంది పండితులకు ఆహ్వానించాడు. పండితుల సభలో శాస్త్రచర్చ ఏర్పాటుచేసి అందులో ఎవరు గొప్ప జ్ఞానిగా ఋజువుతారో, వారికి వెయ్యిగోవులు బహుమానం ప్రకటించారు. యాజ్ఞవల్క్యుడు నేనే అందరిని మించిన జ్ఞానిని అని గర్వంతో ప్రకటించుకున్నాడు. అది విని ఆరుగురు పండితులు ఆయన్ను సవాలు చేశారు. వారిలో ఐదుమంది పురుషులు, ఒక స్త్రీ ఉన్నారు. ఆ ఏకైక స్త్రీయే గార్గి. ఐదుమంది పురుష పండితులూ యాజ్ఞవల్క్యునితో ఓడిపోయారు. చివరన గార్గి వంతు వచ్చింది. దీనివల్ల ఆ రోజుల్లో పురుషులతో పోల్చి చూస్తే విద్యావంతెలైన స్త్రీలు చాలా తక్కువగా ఉండేవారని మనకు తెలుస్తుంది. మరో విషయం కూడా మనకు తెలుస్తుంది. వారిని హీన దృష్టితో చూసేవారని. అందువల్లనే గార్గి వంతు చిట్టచివరన వచ్చింది. అది అలా ఉంచితే, యాజ్ఞవల్క్యుడు, గార్గి మధ్య జరిగిన శాస్త్రచర్చలో యాజ్ఞవల్క్యుడు గార్గి ప్రశ్నలతో ఇబ్బందుల పాలయ్యాడు. మొదట ”నీవు అతిగా ప్రశ్నలడుగుతున్నావు” అని గార్గిని మందలించాడు. తర్వాత మరింత కోపం వచ్చి ”ఇంక ఒక్క ప్రశ్న అడిగినా నీ తల తెగి క్రింద పడిపోతుంది” అని బెదిరించాడు.
రమేశ్ : ముర్థాలే నిపతిష్యతి …. (నీ తల క్రింద పడిపోతుంది.)
ఉమ : అవును. అంటే ఏమిటి అర్థం? నిన్ను నేను చంపేస్తాను, అనే కదా! నిండుసభలో ఒక పురుషుడు ఒక స్త్రీని – మామూలు స్త్రీని కాదు, ఒక విదుషిని – ఆమె అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేకపోయిన స్థితిలో ఇలా బెదిరించగలిగాడంటే, దీనివల్ల మనకు తెలిసేదేమిటి? సమాజంలో స్త్రీలకు చాలా గౌరవం ఉండేదనా? వారిని పూజించేవారనా?
రమేశ్ : అది సరే. ఇలాంటి స్త్రీల గొప్పల కథలు ప్రచారం చేసి 19వ శతాబ్దంలో స్త్రీవిద్యను ప్రోత్సహించిన సంఘసంస్కర్తల్లో చాలా వరకు పురుషులే ఉన్నారు కదా! మరి స్త్రీల తరుపునుండి ఎవరైనా మాకూ విద్య కావాలి, విద్యావతులం కావడం మా హక్కు అని కోరడం జరిగిందా?
ఉమ : ఇదే కదా, విడ్డూరం! స్త్రీలకు ఏమి కావాలి, అనేది కూడా పురుషులే నిర్ణయిస్తారు! 19వ శతాబ్దంలో పురుషులకు విద్యావంతులైన స్త్రీలు కావలసి వచ్చారు. ఎందుకంటే, ఆ కాలంలో సమాజంలో కొత్త వర్గం ఒకటి ఏర్పడుతూ ఉండేది. ఇంగ్లీషు చదువుకున్న శిష్టజనుల వర్గం. ఈ వర్గానికి ఒక కొత్త పద్ధతిలో ఉన్న స్త్రీ అవసరమైంది. ఈ వర్గంలోని వారికి ఇంట్లో పిల్లలను కొత్త పద్ధతిలో పెంచగలిగిన, బయట సొసైటీలో లేదా సోషియల్ లైఫ్లో భర్తతో పాటు తిరగగలిగిన స్త్రీ కావలసి వచ్చింది. పురుషులు ఇంగ్లీషు నవలలు చదివేవారు. వాటిలోని హీరోయిన్లను తమ చుట్టుప్రక్కల చూడాలని కోరుకునేవారు. వాళ్ళు మేధావులుగా ఎదుగుతున్నవారు. కాబట్టి తెలివితేటలు గల సహచరి వాళ్ళకు అవసరమైంది. అందుకుగాను స్త్రీలను విద్యావంతులుగా చేసేందుకు గార్గి, మైత్రేయిలాంటి ఉదాహరణలు ముందుంచి స్త్రీవిద్యను ప్రోత్సహించారు. అయితే గార్గి కథ చెప్తూ కూడా వాళ్ళు – ఆకాలంలో విద్యావతి అయిన స్త్రీ ఏదైనా ప్రశ్న లేవనెత్తితే ఆమె నోరు మూయించేవారు, అనే విషయం మాత్రం చెప్పేవారు కాదు. స్త్రీని గానీ, మరెవ్వరిని గానీ, మాట్లాడనివ్వకపోవడం, ప్రశ్నలు లేవనెత్తనివ్వకపోవడం, వారి పట్ల జరిగే పెద్దహింస. ఎందుకంటే, ఇందులో వాస్తవమైన అంటే శారీరికమైన హింస అవసరం ఉండదు. దాని బెదిరింపే చాలు. మనదేశంలో ఇలాంటి హింస యొక్క మూడు రూపాలు ప్రాచీనకాలం నుండే కనిపిస్తాయి – వర్గహింస, కులహింస, జెండర్ హింస. కానీ ఈ హింసకున్న అన్నింటికంటే భయంకరమైన రూపం ప్రత్యక్ష హింస. లేక శారీరక హింస కాదు, ఎదుటివారిని నోరు మెదపనివ్వని ఆప్రత్యక్ష హింస లేక హింసిస్తామనే బెదిరింపు. ఉదాహరణకు ప్రజలు రాజుకు వ్యతిరేకంగా మాట్లాడకూడదు. శూద్రుడు బ్రాహ్మణునికి వ్యతిరేకంగా మాట్లాడకూడదు. స్త్రీ పురుషునికి వ్యతిరేకంగా నోరు మెదపకూడదు. ఈ విధంగా వారి నోరు మూయించి, అధికారం – అది రాజ్యాధికారం గానీ, ధర్మం యొక్క అధికారం గానీ, లేక పురుషుని అధికారం గానీ – ఎదుటి వారిని తమ మద్దతు దారులుగా చేసుకుంటుంది. వారు ఎల్లప్పుడూ ”నిజమే, నిజమే, మీరు చెప్పేదంతా సబబే” అని దాన్ని సమర్థించేలా చేసుకుంటుంది.
ఉదాహరణకు పురుషుడు స్త్రీలకు విద్య అవసరం లేదంటే స్త్రీలు కూడా అవసరం లేదు అంటారు. పురుషులు స్త్రీలకు విద్య అవసరం అంటే వాళ్ళు కూడా అవును, అవసరమే, అంటారు. ఈ విధంగా అధికారం చేసే అక్రమాల్లో పీడితులే పాలుపంచుకోవడం ఉందే, అది అన్నింటికంటే భయంకరమైంది, అన్నిటికంటే ప్రాణాంతకమైంది.
రమేశ్ : ఉమగారూ, మీరు వర్గం, కులం, జెండర్, మూడింటినీ కలిపి మాట్లాడుతున్నారు. స్త్రీల సమస్య వర్గం, కులం, వీటి సమస్యల కంటే భిన్నమైందని మీకనిపించదా? సమాజంలో ఎన్నో వర్గ, కుల భేదాలున్నాయి. ఈ కారణంగా అక్కడ ప్రత్యక్ష హింస జరగవచ్చు. ఉదాహరణకు అధికారం పొందిన వర్గం ఇతర వర్గాలను హింస ద్వారా అణిచిపెట్టవచ్చు, లేదా అగ్రకులం తక్కువ కులాలను హింస ద్వారా అణచిపెట్టవచ్చు, అంటే ప్రత్యక్ష హింసను ఆశ్రయించవచ్చు, అప్పుడప్పుడు అలా జరుగుతుంది కూడా. అంతేకాక కొన్నిసార్లు ఇలాంటి అధికార హింస ప్రత్యర్థుల నుండి ప్రతిఘటన ఎదుర్కోవలసి కూడా వస్తుంది. మరి స్త్రీల విషయంలో అలా జరుగుతుందా? అక్కడ జెండర్ వేరైనా స్త్రీ పురుషులు వర్గపరంగా, కులపరంగా సమానులై ఉంటారు కదా!
ఉమ : మీరన్నది సబబే. వర్గ, కుల సమస్యలకు, స్త్రీల సమస్యలకు కొంచెం తేడా ఉంది. అక్కడ చేతిలో అధికారం ఉన్నవాళ్ళు తిన్నగా మరో వర్గాన్ని, లేక కులాన్ని అణిచివేయగలరు. కానీ, ఇక్కడ స్త్రీపురుషుని వర్గానికే, కులానికే చెందిందే అయినా అతని అధీనంలో ఉంటుంది. అందువల్ల స్త్రీ సమస్య కొంచెం క్లిష్టంగా ఉంటుంది. ఈయన పురుషుడు కావడం వల్ల నన్ను అణచిపెడుతున్నాడు, కానీ నా తండ్రి కదా, నా సోదరుడు కదా, నా భర్త కదా, నా కుమారుడు కదా. . . అనే భావనలు వారికి అడ్డం తగులుతాయి. ఈ కారణం వల్లనే స్త్రీల పితృస్వామ్య ప్రతిఘటన ఒక హద్దుకు మించి ముందుకు సాగలేదు. వాళ్ళు ఒక హద్దుకు మించి పురుషుని అధికారాన్ని ప్రశ్నించలేదు. ఈ విధంగా వాళ్ళు స్త్రీపట్ల పురుషుడు చేసే అత్యాచారాలకు తోడ్పడిన వారవుతారు, లేకపాలుపంచుకున్న వారవుతారు. ఇది లేకుండా పితృస్వామ్యం ముందుకు పోలేదు. ఇది ఇలా ఉండగా ఈ వ్యవస్థకు వ్యతిరేకంగా స్త్రీలు అప్పుడప్పుడు తమ అసంతృప్తిని వెలిబుచ్చుతూనే వచ్చారు. పాశ్చాత్య దేశాల్లో ఇలాంటి అసంతృప్తి స్వరాల డాక్యుమెంటేషన్ జరిగినట్లు మనదేశంలో జరగలేదు. అయినా 18వ శతాబ్దం నుండి మనదేశంలో అక్కడక్కడ పురుషుల అధికారానికి విరుద్ధంగా స్త్రీలు గళ మెత్తుతూ వచ్చారు. 19వ శతాబ్దంలో అయితే పండితా రమాబాయి, తారా బాయి శిందే పితృస్వామ్యాన్ని తీవ్రంగా విమర్శించారు.
రమేశ్ : పండితా రమాబాయి గురించి మీరు విస్తారంగా రాశారు కదా…
ఉమ : అవును… వీరి విమర్శ చాలా సృజనాత్మకంగా ఉంది. మనువు ఏ విధంగా పురుషుని జీవితంలోని నాలుగు దశలు- బ్రహ్మచర్యం, గార్హస్థ్యం, వానప్రస్థం, సన్యాసం అని చెప్పాడో. అదే విధంగా వీళ్ళు స్త్రీ జీవితానికి నాలుగు దశలు చెప్పారు. కుమారి, భార్య, తల్లి, విధవ చెప్పి, స్త్రీ పురుషులను పోల్చి, స్త్రీల కోసం ఏర్పరచిన నియమాలు ఎంత కఠోరమైనవో నిరూపించారు.
ఉదాహరణకు భార్య మరణించగానే పురుషుడు మరో పెళ్ళి గురించి ఆలోచించడం ఆరంభిస్తాడు, 13వ రోజు తర్వాతనే రెండో పెళ్ళి చేసుకోగలుగుతాడు కూడా. కానీ, స్త్రీ భర్త చనిపోతే జీవితమంతా భర్తను తలచుకొని ఏడుస్తూనే ఉండిపోతుంది. లెక్కలేనన్ని కష్టాలతో, అవమానాలతో కూడిన జీవితం జీవిస్తుంది. ఇలాంటి రెండు వేర్వేరు నైతిక కొలమానాలుండడం పితృస్వామ్యానికున్న ముఖ్యలక్షణం. దాన్ని పండితా రమాబాయి, తారాబాయి శిందే విమర్శించారు. తారాబాయి శిందే రాసిన ‘స్త్రీపురుష తులన’ అనే పుస్తకం పితృస్వామ్యాన్ని తీవ్రంగా విమర్శించిన పుస్తకం. ఈ విమర్శ పురుష సంస్కర్తలు స్త్రీల పక్షంగా రాసిన రచనలకు చాలా భిన్నంగా ఉంది. ఉదాహరణకు సహగమనం, లేదా వైధవ్యం కారణంగా స్త్రీలు పడే పాట్లు చూసి స్త్రీల పునర్వివాహాన్ని ప్రోత్సహించినప్పుడు పురుషులు శాస్త్రాల నుండి ఋజువులు, సమర్ధన, ఉదాహరణలు వెదికారు. కానీ, వీళ్ళు అలాకాక సమాజం స్త్రీలకు, పురుషులకు వేరువేరుగా విధించిన నైతిక నియమాలను, ఆచారాలను తిన్నగా విమర్శించారు. ఈ నియమాలు, ఆచారాలు శాస్త్రసమ్మతాలు కాబట్టి వీరు ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ఆ శాస్త్రాలను కూడా విమర్శించారు. పితృస్వామ్యానికి ఆధారభూతమైన ఆ చట్రాన్నే ప్రశ్నించారు.
రమేశ్ : కానీ, వాళ్ళ దృష్టి కూడా కొంత అటు- ఇటుగా సంస్కరణవాద దృష్టిగానే ఉండింది. మొత్తం సమాజ వ్యవస్థను ప్రశ్నించే రచనలు గానీ, ప్రస్తుతం ఉన్న వ్యవస్థ స్థానంలో మరో వ్యవస్థ రావాలని డిమాండ్ చేసే రచనలు గానీ మనకు కనిపించవు.
ఉమ : అలాంటి రచనలు 20వ శతాబ్దంలో వామపక్షీయ రాజకీయాలకు చెందిన స్త్రీల రచనల్లో మీకు కనిపిస్తాయి. నేనిప్పుడు 19వ శతాబ్దం గురించి మాట్లాడుతున్నాను. ఆ రోజుల్లోని భారత సమాజంలో ఒక కొత్త వర్గం ఏర్పడుతూ ఉండేది. ఉదారవాద ఆలోచనాధోరణి ప్రచారంలోకి వస్తూ ఉండేది. అందువల్ల స్త్రీలు కూడా అదే పద్ధతిలో రాసేవారు. పెట్టుబడిదారీ విధానానికున్న ఒక విశిష్టత ఏమిటంటే, అది వ్యక్తివాద అభివ్యక్తికి వీలు కల్పిస్తుంది. భూస్వామ్యవాద చట్రం నుండి వెలుపలికి వస్తున్న సమాజంలో ఇది ఒక కొత్త సార్థకమైన అభివ్యక్తిగా నిలుస్తుంది. కొంత విద్యనార్జించిన స్త్రీలు ఈ కొత్త పద్ధతిలో తమ రచనల ద్వారా సమాజంలో స్థానం ఏర్పరచుకునే ప్రయత్నం చేసేవారు. వారు రచన చేయగలగడమే పెద్ద విశేషం. అందుచేత వారి రచనల్లో సంస్కరణవాదం లేదా ఉదారవాదమే కనిపించినా అప్పటికి అదే చాలా గొప్ప. వారి రచనల్లో మనం చూడ వలసిందేమిటంటే వారు పితృస్వామ్యాన్ని ప్రశ్నిస్తున్నారనీ, పురుష సంస్కృతిని ప్రశ్నిస్తున్నారని.
రమేశ్ : ఇప్పుడు కూడా స్త్రీవాదం ఎదుట ఉన్న ముఖ్య సమస్య పితృస్వామ్యమే. ఈ పితృస్వామ్యం అన్ని దేశాల్లో, అన్ని కాలాల్లో ఒకే రకంగా ఉంటుందా? ఒకే రకంగా ఉండదనే నేననుకుంటాను. ఒకే కాలంలో, ఒకే సమాజంలో కూడా అది ఒకే రూపంలో ఉండదు. ఉదాహరణకు నేటి మన సమాజాన్నే గమనిస్తే ఉన్నత- మధ్యతరగతికి, విద్యావంతుల వర్గానికి, ఉద్యోగం చేసేవారి వర్గానికీ చెందిన స్త్రీల పరిస్థితికి, దిగువ తరగతికి, లేక దిగువ-మధ్యతరగతికి చెందిన, విద్యలేని కుటుంబ స్త్రీల పరిస్థితికి తేడా ఉంది కదా! పట్టణాల్లో ఉండే స్త్రీల పరిస్థితికి, పల్లెటూళ్ళలో ఉండే స్త్రీల పరిస్థితికి, ధనిక కుటుంబాలలో ఉండే స్త్రీల పరిస్థితికి పేద కుటుంబాలలోని స్త్రీల పరిస్థితికి, హెచ్చు కులాలకు చెందిన స్త్రీల పరిస్థితికి, తగ్గుకులాలుగా చెప్పబడే కులాలకు చెందిన స్త్రీల పరిస్థితికి మధ్య కూడా తేడా ఉంది కదా! అలా అయినప్పుడు ఇలాంటి వేర్వేరు పరిస్థితుల్లో జీవిస్తున్న స్త్రీలపైన పితృస్వామ్యం ఒకే విధంగా ప్రభావం చూపిస్తుందా? అది అందరు స్త్రీలను ఒకే విధంగా ప్రభావితం చేయనప్పుడు నేటి స్త్రీవాదం పితృస్వామ్యాన్ని ఎదిరించడం వరకు మాత్రమే తనను పరిమితం చేసుకోవాలా? వర్గానికి, కులానికి సంబంధించిన ప్రశ్నలను కూడా అది కలుపుకోవద్దా?
ఉమ : తప్పక కలుపుకోవాలి. కలుపుకుంటూ ఉంది కూడా. నేటి స్త్రీవాదం గానీ, ఏ దేశకాల స్త్రీవాదం గానీ, ఎల్లప్పుడు ఒకే విధంగా లేదు. స్త్రీవాదం పితృస్వామ్యం తెచ్చిపెట్టే చిక్కులను అర్థం చేసుకునే ఒక విధానం కాబట్టి అది ముఖ్యంగా పితృస్వామ్యాన్ని గురించే ఆలోచిస్తుంది అనే మాట నిజమే అయినా అది అంత వరకే పరిమితమై ఉండిపోదు. పితృస్వామ్యం ఒక విధమైన అసమానతా చట్రం. అయితే అది వర్గానికీ, కులానికీ సంబంధించిన అసమానతలతో సంబంధం లేనిది మాత్రం కాదు. ఈ అసమానతలను విస్మరించి కేవలం పితృస్వామ్యాన్ని ఎదరించి లేదా దాన్ని పెకిలించివేసి అన్ని అసమానతల నుండి, లేదా స్త్రీల పట్ల చూపే భేదభావం నుండి ముక్తి పొందుతాము, అని మనం అనుకుంటే అది పొరపాటే. స్త్రీవాదం గానీ, మరోవాదం గానీ, దాని ఉద్దేశ్యం సమసమాజ నిర్మాణం అయినప్పుడు అది మొత్తం సమాజాన్నీ అందులో ఉన్న సమస్త అసమానతలను దృష్టిలో ఉంచుకోవలసి ఉంటుంది.
ఉదాహరణకు మార్క్స్‌వాదం ఒక సమతామూలకమైన సిద్ధాంతం. మనదేశంలోని చాలా మంది మార్క్స్‌వాదులు సమాజంలో వర్గభేదం అంతరించిపోతే అన్ని రకాలైన సమానత్వం వచ్చేస్తుందని భావిస్తారు. అంటే కులాల భేదం అంతరించిపోతుంది, స్త్రీ పురుషుల భేదం అంతరించిపోతుంది అని. కానీ, సామ్యవాద విప్లవం జరిగి, ఒక కొత్త వ్యవస్థ ఏర్పడిన రష్యా, చైనాలాంటి దేశాల్లో కూడా పితృస్వామ్యం అంతరించి పోలేదు. మనదేశంలోని మార్క్స్‌వాదులు కూడా ఇప్పుడు మనం కేవలం వర్గభేదం పైనే కాక కులవివక్ష, స్త్రీపురుషుల అసమానత, వీటిపైన కూడా దృష్టి నిలిపి ఉండవలసింది, అని అనుకుంటున్నారు. అదే విధంగా వర్గభేదం, కులవివక్షలతో మాకు సంబంధం లేదు, కేవలం స్త్రీపురుషుల అసమానతతోనే మాకు సంబంధం ఉంది, అని అనుకునే స్త్రీలు కూడా ఇప్పుడు తమ ఆలోచన తప్పని తెలుసుకుంటున్నారు. అందువల్లనే ఇప్పుడు మనదేశంలో జరుగుతున్న స్త్రీవాద రచనల్లో కేవలం పితృస్వామ్యం కారణంగా స్త్రీలు అనుభవిస్తున్న అణచివేత, పీడనపైనే కాక వర్గం, కులం ఆధారంగా జరిగే స్త్రీల అణచివేత, పీడనలను కూడా లెక్కలోకి తీసుకోవడం జరుగుతూంది. ఈ కారణంగానే ఇప్పుడు స్త్రీలు అనుభవిస్తున్న రెండు లేక మూడు విధాలైన అణచివేత – పీడన గురించిన చర్చ జరుగుతూ ఉండడం మీరు గమనించి ఉంటారు. ఒకవైపు స్త్రీ అవడం మూలాన ఆమె ఈ అణచివేతకు గురయితే, రెండవవైపు పేదస్త్రీ కావడం మూలాన, మూడవవైపు దళిత లేక తగ్గుకులం అనబడే ఒకానొక కులానికి చెందిన స్త్రీ అవడం మూలాన ఇదంతా జరుగుతుంది. అందుచేత నేటి స్త్రీవాదం సమాజంలో వ్యాపించి ఉన్న అన్ని విధాలైన అసమానతలను పరిగణనలోకి తీసుకోవడం అవసరం. ఇది జరుగుతూ ఉంది కూడా. ఇప్పుడు మార్క్స్‌వాదం, స్త్రీవాదం, దళితవాదం వేరు-వేరుగా కనిపించినా, వాటిలో ఎన్నో రకాల అభిప్రాయభేదాలె కనిపించినా, ఇవి మూడూ ఒక దాన్నుండి మరొకటి చాలా నేర్చుకుంటున్నాయని నాకనిపిస్తుంది.
రమేశ్ : ఇది మంచిదే. కానీ నేటి స్త్రీవాదుల్లో, దళితవాదుల్లో ఒక విచిత్రమైన ఆలోచన మేరకు కనిపిస్తుంది. అదేమిటంటే, స్త్రీల సమస్యలను స్త్రీలే అర్థం చేసుకోగలరు, దళితుల సమస్యలను దళితులే అర్థం చేసుకోగలరు, అనేది.
ఉమ : నేనీ ఆలోచనను ఒప్పుకోను. అది గనుక నిజమే అయితే ఈ రోజు స్త్రీవాదం గురించి మీరు నాతో మాట్లాడుతూ ఉండేవారు కాదు. అలా అయినప్పటికీ ఆ ఆలోచనలో కొంతకు కొంత నిజం లేకపోలేదు. భారతదేశ చరిత్ర రచన నుండి కొన్ని చాలా మంచి వ్యాసాలు రాశారు. అయితే బాగా గమనిస్తే శూద్రుల చరిత్ర శూద్రపురుషుల చరిత్రే అని తెలిసిపోతుంది. అందులో శూద్రస్త్రీల చరిత్ర లేదు. పితృస్వామ్య చరిత్ర లేదు. శర్మగారు భారతీయ భూస్వామ్య వ్యవస్థ గురించి రాశారు. అయితే ఉత్పత్తి విధానం మారినప్పుడు, ఉత్పత్తికి కొత్త విధానం ఏర్పడడం వల్ల కొత్త సమాజవ్యవస్థ ఏర్పడినప్పుడు జెండర్ స్థితి ఏమవుతుంది, అనే విషయం ఆ చరిత్ర ద్వారా మనకు తెలియదు. అంటే పితృస్వామ్యం మారుతుందా లేక ఎప్పటిలాగే ఉంటుందా? సమాజంలో పురుషులతో పోల్చినప్పుడు స్త్రీల పరిస్థితి మునుపటిలాగే ఉంటుందా, లేక మారిపోతుందా? దీన్ని అర్థం చేసుకోవడం అవసరం. దీన్ని గురించి అధ్యయనం చేయడం అవసరం. దానికోసం మనం మన చరిత్రను ఒక కొత్త పద్ధతిలో రాసుకోవాలి అని నాకనిపిస్తుంది. అందులో వర్గం, కులం, పితృస్వామ్యం ఈ మూడింటినీ మనసులో ఉంచుకొని మొత్తం సమాజాన్ని అందులో వచ్చే మార్పులతో పాటు, మార్పుల ప్రక్రియలతో పాటు చూడడం అవసరం. దీనివల్ల వర్గం గురించిన మన అవగాహన మెరుగుపడుతుంది, కులం గురించిన అవగాహన మెరుగుపడుతుంది, పితృస్వామ్యం గురించిన అవగాహన మెరుగుపడుతుంది.
రమేశ్ : నా మనసులో మాటే మీరు చెప్పారు. నా ఆలోచన కూడా అదే. ఇక చరిత్రలో పితృస్వామ్యం లాగానే మాతృస్వామ్యం నెలకొని ఉండిన రోజులు కూడా ఎప్పుడైనా ఉన్నాయా? మన పురాణాల్లో, కొందరు ఆదివాసుల్లో అయితే ఇప్పుడు కూడా, వంశం తండ్రి పేరున కాక తల్లి పేరున నడుస్తుంది. ఉదాహరణకు పురాణాల్లో దితి, దను అనే స్త్రీల వంశజుదైత్యులు, దానవులు అని చెప్పబడ్డారు. అదే విధంగా కౌంతేయుడు, సౌమిత్రుడు లాంటి పేర్లు…..
ఉమ : మీ మాట నాకర్థమైంది. కాని మాతృస్వామ్యం లాంటి వ్యవస్థ ఏదీలేదు. కొన్ని సమాజాల్లో తండ్రికి బదులు తల్లి కుటుంబ పెద్దగా ఉంటుంది, లేదా తల్లిపేరుతో వంశం నడుస్తుంది. అయితే దాన్ని పితృస్వామ్యంలాంటి ఏదో వ్యవస్థ అని గానీ, లేక పితృస్వామ్యానికి సరిగ్గా వ్యతిరేకమైన ఒక వ్యవస్థ అని గానీ అనడానికి వీలులేదు. పితృస్వామ్యంలో ఏ విధంగా స్త్రీ శరీరంపైన , ఆమె శరీరశ్రమపైన, ఆమె స్త్రీత్వం పైన పురుషుని నియంత్రణ ఉండేదో, ఆ విధంగా పురుషుని శరీరంపైన, అతని శ్రమపైన, అతని పురుషత్వంపైన స్త్రీ నియంత్రణ ఎప్పుడూ లేదు. ఎందుచేతనంటే, దాని అవసరమే ఏర్పడలేదు గనుక. అందువల్ల పితృస్వామ్యం అంతరించగానే దాని స్థానంలో మాతృస్వామ్యం వచ్చేస్తుందని, తమపైన స్త్రీల నియంత్రణ ఏర్పడుతుందని పురుషులు భయపడనవసరం లేదు. తల్లి కుటుంబానికి పెద్దగా ఉండడం, తల్లి పేరుతో వంశం నడవడం వల్ల స్త్రీ వంశకర్త్రిగా ఉండండం అనే ఏర్పాటు కొన్ని సమాజాల్లో ఉండింది, ఇప్పుడు కూడా ఉంది, అనే మాట మాత్రం మనం చెప్పవచ్చు. అయితే దీన్ని మాతృస్వామ్యం (matriarchy) అనే బదులు మాతృవంశీయత (matriarchy) అనడం సబబు. కాని, ఈ మాతృవంశీయత కూడా అన్నిచోట్లా ఒకే రకంగా ఉండదు. ఉదాహరణకు అది మీకు ఖాసీ ఆదివాసుల్లో ఒక రకంగా కనిపిస్తే కేరళలో పూర్తిగా మరో రకంగా కనిపిస్తుంది. ఎందుచేతనంటే ఒకటి ‘Tribal Social Formationµ.. అయితే రెండవది ‘Agrarian Social Formation’. ఒకదాంట్లో కులవ్యవస్థ లేదు. మరోదాంట్లో ఉంది. రెండు విధాలుగా ఉన్న మాతృవంశీయ సమాజాల్లో చాలా తేడా ఉండండం సహజమే. ఈ తేడాను మనం అర్థం చేసుకోవచ్చు.
రమేశ్ : మాతృవంశీయతకు వేర్వేరు రూపాలున్నప్పుడు పితృస్వామ్యానికి వేర్వేరు రూపాలుండవా మరి?
ఉమ : ఉన్నాయి కదా! చరిత్రలో పితృస్వామ్యానికి కూడా అనేక రూపాలుండినాయి. ఉదాహరణకు ఆదిమసమాజంలో పితృస్వామ్యం మొదలైనప్పుడు దాని స్వరూపం ఒక విధంగా ఉండేది, భూస్వామ్య వ్యవస్థలో అది మరో రూపంలో ఉండేది, నేటి పెట్టుబడిదారీవిధానంలో అది మరో రూపంలో ఉంది. కొందరు ఈ పితృస్వామ్యం భూస్వామ్య వ్యవస్థకు చెందిన అవశేషమో, లేక పెట్టుబడిదారీ వ్యవస్థకు ముందున్న ఏదో వ్యవస్థకు సంబంధించిన అవశేషమో అనీ, పెట్టుబడిదారీ సమాజంలో దీనికి స్థానం లేదనీ, ఒకవేళ పెట్టుబడిదారీ వ్యవస్థలో కూడా అది అలాగే ఉండినా, సామ్యవాద వ్యవస్థ రాగానే తనంత తానే అంతరించిపోతుందనీ అనుకుంటూ ఉంటారు. కానీ అది సరియైన ఆలోచన కాదు. మొట్టమొదట మనం తెలుసుకోవలసిన విషయం ఏమిటంటే పితృస్వామ్యం మునుపటి ఏ వ్యవస్థకు సంబంధించిన అవశేషమూ కాదు. రెండోది పితృస్వామ్యం కేవలం ఆలోచనపరమైన, లేక సాంస్కృతిక స్థాయికి చెందిన లేక ‘superstructure’ కు చెందిన విషయం కాదు. అది సమాజ మూలానికి, లేక దాని మూలాధారానికి సంబంధించిన విషయం. దీనికి ఉత్పత్తి సాధనలతో, ఉత్పత్తి సంబంధాలతో, ఉత్పత్తి విధానాలతో చాలా సన్నిహితమైన భౌతిక సంబంధం ఉంది. పురుషుని స్థానం ఎల్లప్పుడూ ఉన్నతంగానూ, స్త్రీస్థానం ఎల్లప్పుడు తక్కువగానూ ఉంటుందని భావించడం మన దేశంలో ప్రాచీనకాలం నుండి వస్తున్న ఏదో ఒక సంప్రదాయం అని అనుకోకూడదు. అలా అనుకుంటే అది కేవలం ఒక నమ్మిక, లేక ఒక మన:ప్రవృత్తి మాత్రమే అని మనకు తోస్తుంది.
రమేశ్ : మీరు చెప్పింది సరిగానే ఉంది. కానీ హిందీలో వస్తున్న స్త్రీల అనేక రచనల్లో, స్త్రీవాద రచనల్లో కనిపించే ఆలోచన ఏమిటంటే, ఇది పురుషుని మన:ప్రవృత్తికి సంబంధించిన సమస్య కాబట్టి పురుషుడు తన మన:ప్రవృత్తిని మార్చుకుంటే లేదా స్త్రీలు వాళ్ళ ఈ మన:ప్రవృత్తిని మార్చివేస్తే సమస్య మొత్తం తీరిపోతుందని.
ఉమ : కాదు. ఇది మన:ప్రవృత్తికి సంబంధించిన సమస్య కాదు. మొదట చాలామంది సంస్కరణవాదులు, సామ్యవాదులు కులం కూడా మన:ప్రవృత్తికి సంబంధించిన సమస్య అనుకొని జాతి, కులం వీటిని పాటించుకుంటే, పేర్ల నుండి కులాలను సూచించే పదాలను తీసేస్తే కులాంతర వివాహాలు చేసుకుంటే, ఈ జాతులు, కులాలు, అన్నీ సమిసిపోతాయి, అని నమ్మేవారు.
రమేశ్ : వాళ్ళే ఇప్పుడు మహా జోరుగా కుల రాజకీయాలు నడుపుతున్నారు !
ఉమ : అందువల్ల వర్గం, కులం ఏ విధంగా మూలాధారమైన వాస్తవికతో, అదే విధంగా పితృస్వామ్యం కూడా ఒక వాస్తవికత. దీనికి సమాజం యొక్క పునాది, ‘superstructure’ రెండింటితోను సంబంధం ఉంది. అంటే సమాజంలో వచ్చే మార్పులతో పాటు ఇది కూడా మారుతుంది. కొత్త-కొత్త రూపాలు ధరిస్తుంది అని అర్థం. అంతేకాక, వర్గాన్ని, కులాన్ని, ప్రాంతాన్ని బట్టి కూడా దీనికి వేర్వేరు స్వరూపాలు ఉండవచ్చు. ఉదాహరణకు ధనికుల్లో, పేదవారిలో, విద్యావంతుల్లో, నిరక్షరాస్యుల్లో, పట్టణవాసుల్లో, గ్రామీణుల్లో,
ఉత్తరాది వారిలో, దక్షిణాదివారిలో దీని వేర్వేరు స్వరూపాలు మనకు కనిపించవచ్చు. అందువల్ల పితృస్వామ్యం కేవలం ఆలోచనాధోరణికి, సంస్కృతికి, లేదా మన:ప్రవృత్తికి మాత్రమే చెందిన సమస్య అని భావించడం తప్పు. రెండోది అది అన్ని చోట్లా ఒకే విధంగా
ఉంటుందని అనుకోవడం కూడా తప్పే. దాన్ని ఎదరించి చేసే పోరాటం గట్టి భౌతిక పునాదితో చేయవలసి ఉంటుంది, దాని వేర్వేరు స్వరూపాలను దృష్టిలో ఉంచుకొని చేయవలసి ఉంటుంది. వ్యవస్థ ఎలాంటిదైనా దాని కనుకూలంగా తనను మార్చుకొనే శక్తి పితృస్వామ్యానికి ఉంటుంది. ఉదాహరణకు గ్రీకు సమాజంలో బానిసత్వం ఉన్న రోజుల్లో అక్కడ పితృస్వామ్యం ఒక రూపంలో
ఉండేది. భూస్వామ్య విధానం వచ్చినప్పుడు దాని స్వరూపం మరోలా మారింది. పెట్టుబడిదారీ విధానం రాగానే అది మూడో స్వరూపాన్ని సంతరించుకుంది. రేపు అక్కడ సామ్యవాద వ్యవస్థ ఏర్పడితే పితృస్వామ్యం దానంతట అదే అంతరించి పోతుందని అనుకోకూడదు. గట్టి భౌతిక పునాదితో ప్రతిఘటించి దాన్ని అంతమొందించక పోతే అది సామ్యవాద వ్యవస్థలో కూడా మరో రూపంలో కొనసాగుతుంది. అందువల్ల పితృస్వామ్యాన్ని సమాజం యొక్క భౌతిక పునాది, దాని సాంస్కృతిక superstructure రెండింటిలో భాగంగా భావించి దాని వాస్తవమైన, పరివర్తనశీలమైన రూపంలో దాన్ని అర్థం చేసుకోవాలి.
రమేశ్ : నేటి పెట్టుబడిదారీ విధానం మునుపటి పెట్టుబడిదారీ విధానానికి – అంటే ఉదాహరణకు పారిశ్రామికీకరణ రోజులనాటి పెట్టుబడిదారీ విధానానికి భిన్నంగా ఉంది. ఇప్పుడది ప్రపంచ పెట్టుబడిదారీ విధాన మార్కెట్గాను, పెట్టుబడి యొక్క భూమండలీకరణకు చెందిన సరికొత్త పెట్టుబడిదారీ విధానంగాను రూపొందింది. అంతేకాక దాన్ని ఒక కొత్త సామ్రాజ్యవాదంగా కూడా చెప్పవచ్చు. అలాంటప్పుడు నేటి పితృస్వామ్యాన్ని కూడా ఒక కొత్త రకమైన పితృస్వామ్యమనే అనుకోవాలా?
ఉమ : అవును. నేటి పెట్టుబడిదారీ విధానంలో అది కేవలం కొత్త రకమైన పితృస్వామ్యం గానే లేదు. అది మునుపటి కంటే ఎక్కువయింది, మరింత బలపడింది. పారిశ్రామికీకరణ జరిగినప్పుడు అంతకు మనుపు ఇళ్ళల్లో జరుగుతూ ఉండిన ఉత్పత్తి కార్ఖానాల్లో జరగడం మొదలైంది. ఇళ్ళల్లో భూస్వామ్య విధానానికి చెందిన స్త్రీల దోపిడి జరుగుతూ ఉండేది. ఇప్పుడు కార్ఖానాల్లో పెట్టుబడిదారీ విధానపు దోపిడి మొదలైంది. మునుపు ఇళ్ళల్లో ఉత్పత్తి జరుగుతూ ఉండినప్పుడు స్త్రీల శారీరక శ్రమకు, పనికి ఏమీ విలువ ఉండేది కాదు. ఇప్పుడు కార్ఖానాల్లో దాని విలువ చేతికందడం మొదలైంది. అయితే ఆ విలువ పురుషునికందే విలువకంటే తక్కువగా ఉండేది. పురుషునితో సమానంగా పనిచేసేనా ఆమెకు కూలి తక్కువ ఇచ్చేవారు, ఆమె స్త్రీ కాబట్టి. న్యాయానికి పెట్టుబడిదారీ విధానంలో నియమమెలా ఉండవలసిందంటే శ్రమ మార్కెట్టు ననుసరించి, లేదా శ్రమ డిమాండు, సప్లై ననుసరించి ఏ శ్రమనైనా కొనుగోలు చేసినప్పుడు స్త్రీ శ్రమ గానీ, పురుషుని శ్రమగానీ, అది సమానంగా ఉన్నప్పుడు దాని విలువ కూడా సమానంగా ఉండాలి. అయితే ఇక్కడ స్త్రీ పురుషుల మధ్య బేధభావం చూపేది, స్త్రీని పురుషుని కంటే తక్కువగా భావించేది, అయిన పితృస్వామ్యం మధ్యలోకి వచ్చేసింది. అందువల్ల చేసిన పని సమానమైనా కార్ఖానాల్లో కూడా స్త్రీలకు పురుషుల కంటే తక్కువ కూలీ ఇవ్వడం జరిగింది. ఆ కూలి ఒక వ్యక్తి సంపాదన అయినా కూడా నిజానికి అది ఒక కుటుంబ సంపాదనగా మారిపోతుంది. ఈ విధంగా wage (కూలి) family wage (కుటుంబ కూలీ) అయిపోతుంది. అలాంటప్పుడు ఏ కుటుంబానికి పురుషుడు సంపాదనపరుడు (breadwinner)గా ఉంటాడో, ఆ కుటుంబం స్త్రీసంపాదన పైన ఆధారపడిన కుటుంబం కంటే ఎక్కువ సుఖంగా ఉంటుంది. ఇప్పటి పెట్టుబడిదారీ విధానంలో జరుగుతున్నదేమిటంటే, పెద్ద-పెద్ద కార్ఖానాలతో కూడిన పాత కాలపు పారిశ్రామిక ఉత్పాదనకు బదులు కొత్త సాంకేతిక విజ్ఞానం ఆధారంగా నవీన పద్దతుల్లో ఉత్పాదన మొదలైంది. ఇందులో మనుపటికంటే చాలా తక్కువ మంది కూలీలు అవసరమవుతారు. అందువల్ల పనివాళ్ళను తొలగించడం జరిగి నిరుద్యోగ సమస్య పెరిగిపోతుంది. శ్రమ మార్కెట్టులో శ్రమశక్తి విలువ తగ్గిపోతుంది. అయితే పితృస్వామ్యం ఇలాంటి సందర్భంలోకూడా స్త్రీపురుషుల మధ్య తేడా ఎప్పటిలాగాఉండేట్లు చూస్తుంది కాబట్టి పురుష కార్మికునితో పోలిస్తే స్త్రీ శ్రామికురాలి శ్రమశక్తి విలువ మరింత తగ్గిపోతుంది. కుటుంబంలో ఆమె ఒక్కతే సంపాదనపరురాలయినప్పుడు దాని ప్రభావం ఆమె పిల్లలపైన కూడా పడుతుంది. ఆమె ఆరోగ్యం పైనే కాక ఆమె పిల్లల ఆరోగ్యంపైన, వాళ్ళ చదువుసంధ్యల పైన కూడా పడుతుంది.
రమేశ్ : ఇంకా ముందుకెళ్తే సమస్య స్త్రీ చేసే production (ఉత్పత్తిని) దాటి ఆమె చేసే reproduction (పునరుత్పత్తి) వరకు కూడా వెళ్తుంది కదా!
ఉమ : మీరు సరిగా చెప్పారు. పెట్టుబడిదారీ విధానానికి స్త్రీ ఏ విధంగా సేవ చేస్తుంది. అనేది కూడా మనం చూడాలి. భర్త సంపాదనపరుడుగా ఉండి, భార్య పితృస్వామ్యం ద్వారా నిర్ధారింపబడిన పాత్ర ననుసరించి ఇంటిపనులు చక్కబెడుతున్నట్లయితే, ఆమె వంట చేయడం, బట్టలుతకడం, ఇల్లు శుభ్రం చేయడంలాంటి అనేక ఇంటిపనులు చేయడంతో పాటు భర్త మరుసటిరోజు తాజాగా, తాపీగా తన పనికి వెళ్ళేందుకు అతనికవసరమైన భావనాత్మకమైన తోడ్పాటు కూడా అందచేయాలి. ఆ తర్వాత పిల్లలను కని, పెంచి, పెద్దచేసే వారికి పెట్టుబడిదారీ వ్యవస్థకు సేవచేయడంకోసం తయారు కూడా చేయాలి. భర్త ఆదాయం చాలనప్పుడు ఆమె కూడా ఉద్యోగం చేస్తుంది. లేదా ఇంట్లోనే డబ్బు వచ్చే పని ఏదైనా చేస్తుంది. భర్త లేకపోవడం వల్ల సంపాదించేది ఆమె ఒక్కతే అయినప్పుడు అదనంగా కొంత ఆర్జించడం కోసం పిల్లలు కూడా పని చేయవలసివస్తుంది. అలాంటప్పుడు మగపిల్లలను చదువుకు, ఆడపిల్లలను పనికి పంపే బేధభావం అక్కడ మళ్ళీ పనిచేస్తుంది. ఈ విధంగా చదువులేకపోయినవాళ్ళకు వాళ్ళ అన్న-తమ్ముళ్ళ కంటే తక్కువ కూలి వచ్చే పనులే చేయవలసి వస్తుంది. ఇదంతాచూసిన తర్వాత తేలేదేమిటి? ఒకటి – పితృస్వామ్యం ఏదో ప్రాచీనవ్యవస్థ యొక్క ‘అవశేషం’ కాదు, పెట్టుబడిదారీ విధానానికున్న స్వంత అవసరం అని, అందువల్లనే పెట్టుబడిదారీ విధానం దాన్ని పెంచుతుంది. బలపరుస్తుంది. అని, రెండవది పితృస్వామ్యం ఆనవాయితీకీ, సంప్రదాయానికీ, మనఃప్రవృత్తికీ, లేక సమాజపు superstructure కు సంబంధించిన సమస్య కాదు, సమాజ పునాదికీ, దాని మూలాధారానికీ సంబంధించిన సమస్య అని మూడవది స్త్రీలు పురుషులకు వ్యతిరేకంగా పోరాటం సాగించి దీన్నుండి విముక్తి పొందడానికి ఇది కేవలం స్త్రీపురుషుల మధ్యనే ఉండేసమస్య కాదు, అని. ఇదిమొత్తం వ్యవస్థ ను మార్చివేసేందుకు సంబంధించిన సమస్య.
రమేశ్: మరి ఈ విషయంలో శ్రమ విభజన గురించి కూడా తరుచు చెప్పడం జరుగుతూ ఉంటుంది. స్త్రీపురుషుల మధ్య ప్రకృతే స్వయంగా శ్రమవిభజన చేసింది, స్త్రీ ఇంట్లో ఉండి పిల్లలను పెంచాలి. పురుషుడు బయటికి వెళ్ళి, పనిచేసి, సంపాదించి తీసుకురావాలి, అని అంటూ ఉంటారు. అలాంటప్పుడు పితృస్వామ్యం శ్రమ విభజన నుండే పుడుతుందంటారా?
ఉమ: స్త్రీ పురుషుల మధ్య ఉన్న ఈ biological (జైవికమైన) తేడాకు పితృస్వామ్యంతో ప్రత్యక్ష సంబంధం ఏదీలేదు. చాలా మంది స్త్రీవాద చరిత్రకారులు, మానసిక శాస్త్రవేత్తలు తమ పరిశోధనల ద్వారా ఈ విషయం స్పష్టం చేశారు. పితృస్వామ్యంలో అన్నింటికంటే ప్రధానమైంది పురుషుని ద్వారా స్త్రీ నియంత్రించబడడం. ప్రకృతిలోగానీ, స్త్రీ పురుషుల నిర్మాణంలో గానీ స్త్రీపురుషుని అదుపులో ఉండడం అవసరమని సూచించే అంశం ఏదీలేదు. ఇక్కడ మనం ‘సెక్స్’, ‘జండర్’ రెండింటి మధ్య తేడాను ఎల్లప్పుడు గుర్తుంచుకోవాలి. ‘సెక్స్’ ప్రకృతి సిద్దమైంది. కానీ ‘జండర్’ సమాజం ద్వారా ఏర్పరచబడింది. ప్రకృతిలో స్త్రీని సహజంగా పురుషుని అదుపులో ఉంచడానికి గానీ, ఆమె ఇంటి పనులు చేయాలి, చేయవలసిన అవసరం ఉంది. అని నిరూపించడానికి గానీ అధారాలు లేవు. ఆదిమ మానవ సమాజాల్లో ఎక్కడ కూడా స్త్రీపైన పురుషుని నియంత్రణ కనిపించదు. పురుషుణ్ణి స్త్రీ కంటే శ్రేష్ఠుడుగా చూపడానికి అతడు మొదటి నుండి breadwinner లేక కుటుంబానికి సంపాదనపరుడుగా ఉంటూ వచ్చాడు. అని చెప్పడం కూడా సరికాదు. పురుషులు వేటకు వెళ్ళే స్త్రీలు ఇల్లు పిల్లలను చక్కబెట్టేవారు, అని కూడా అంటూ ఉంటారు. కానీ, వేట, ఆహార సంగ్రహం రెండూ పనులు ఒకే సమయంలో జరుగుతూ ఉండేపని చరిత్ర చెబుతుంది. పురుషులు వేటకు వెళ్ళి నప్పుడు స్త్రీలు ఆహారం సంగ్రహించేందుకు వెళ్ళేవారు. భోజనంలో వేటనుండి తెచ్చినమాంసం పాలు తక్కువగానూ, స్త్రీలు సంగ్రహించి తెచ్చిన కంద-మూల-ఫలాల పాలు ఎక్కువగానూ ఉంటూ ఉండేది. ఇప్పుడు కూడా ఆదివాసీ సమాజంలో ఉండడం, భూస్వామ్య వ్యవస్థకు గానీ, పెట్టుబడిదారీ వ్యవస్థకు గానీ చెందిన ఉత్పత్తి విధానంలోని ప్రజల్లో ఉన్నట్లుగా స్త్రీలపైన పురుషుల నియంత్రణ లేకపోవడం మనం చూస్తుంటాం. ఇదంతా చూస్తే పితృస్వామ్యం మొదటి నుండి నిరంతరంగా వస్తున్న వ్యవస్థ కాక తర్వాత ఏర్పడిన వ్యవస్థ అనీ, సమాజ నిర్మాణంలో సంక్లిష్టత పెరిగిన కొద్దీ అది పెరుగుతూ, బలపడుతూ వచ్చిందనీ మనకు తెలుస్తుంది.
రమేశ్: కానీ, ఏంగెల్స్ ‘కుటుంబం, స్వంత ఆస్తి, రాజ్యాధికారం’ అనే తన పుస్తకంలో దీనికి మూలకారణం స్వంత ఆస్తి అని చెప్పాడు.
ఉమ: అవును, కానీ, చాలా మంది స్త్రీవాదులు స్వంత ఆస్తి యొక్క మొదటి రూపం స్వయానా స్త్రీయే అని అంటారు. స్రసంతానం ఉత్పత్తి చేస్తుంది కాబట్టి ఆమె స్వయంగా ఒక వనరు (resource) అయిపోయింది. అలాంటప్పుడు ఆమెను తన స్వంత ఆస్తిగా మార్చుకోవడానికి, ఆమె శరీరంపైన, ఆమె లైంగికత (sexuality) పైన నియంత్రణ చేయడం అవసరమవుతుంది. ఈ నియంత్రణ ద్వారా పురుషుడు స్త్రీకి అధిపతి అయిపోవడమేకాక ఆమె ఉత్పత్తి చేసిన సంతానానికి కూడా అధిపతి అయిపోతాడు. సంతానం స్త్రీది, అని అనుకోవాలా లేక పురుషునిది, అని అనుకోవాలా? ఇది నిజానికి సంతానం పైన ఆధిపత్యానికి సంబంధించిన ప్రశ్న.
రమేశ్: అందుకేనేమో, మన ప్రాచీన సాహిత్యంలో స్త్రీని భూమి, లేక పొలం అనే రూపకం ద్వారా ప్రస్తావించారు. పొలం ఎవరిదో, పంట వారిది!
ఉమ: కానీ, చర్చ జరుగుతూనే ఉంది. పితృస్వామ్యం ముందువచ్చి ఆ తర్వాత స్త్రీ లైంగికత పైన నియంత్రణ జరిగిందా, లేక ముందు స్త్రీ లైంగికత పైన నియంత్రణ జరిగి, ఆ తర్వాత పితృస్వామ్యం పుట్టిందా? అనే అంశం గురించి చర్చ ఇంకా జరుగుతూ ఉంది. ఈ చర్చను ప్రస్తుతానికి వదలేద్దాం. ఇంతకూ మనకు స్పష్టంగా తెలిసేదేమిటంటే – సంతానోత్పత్తి చేసే సామర్థ్యం కలిగి ఉన్నందువల్ల స్త్రీ స్వయానా ఒక సంపత్తి అనీ, ఆమెను స్వంత ఆస్తిగా చేసుకునేందుకు పురుషుడు ఆమెను నియంత్రించి, ఆమెపైన అధికారం స్థాపించుకోవడమే పితృస్వామ్య మనీ, కుటుంబం, రాజ్యాధికారాలతో దీనికి సంబంధం ఉందనీ. ఈ ముఖ్యాంశాన్ని దృష్టిలో ఉంచుకుంటే పురుషులు బలవంతులు కాబట్టి వేటకు వేళ్ళేవారు, స్త్రీలు బలహీనులు కాబట్టి ఇల్లు చూసుకునేవారు, ఈ విధంగా పురుషులు స్త్రీలకంటే శ్రేష్ఠులు కావడం వల్ల స్త్రీల అధిపతులై పోయారు, అని చెప్పి స్త్రీలపైన పురుషుల నియంత్రణను సకారణంగా నిరూపిస్తున్నామనుకునే వారి తర్కం సరియైనది కాదని తెలిసిపోతుంది. ఈ తర్కం ఆదికాలం నాటి స్త్రీ పురుషుల సంబంధాల అతిశయ సరళీకరణ వల్ల విషయాన్ని గురించిన సరియైన అవగాహన లేకపోవడం వల్ల పుట్టిన తప్పుడు తర్కం.
రమేశ్ : మరి స్త్రీవాద ఉద్యమం వల్ల పితృస్వామ్యం ఇప్పుడు కొంత బలహీనమైందని అంటారా? మరో విధంగా చెప్పాలంటే ఇప్పుడు పితృస్వామ్యం ఏ స్థితిలో ఉంది.
ఉమ: స్త్రీవాద ఉద్యమం వల్ల ఒకటి మాత్రం ఖచ్చితంగా జరిగింది. మనం పితృస్వామ్యాన్ని మునుపటి కంటే బాగా అర్థం చేసుకోగలుగుతున్నాం. అయితే అది బలహీనమైపోయింది, అనే మాట నమ్మకంగా చెప్పలేను. నాకనిపించేదేమిటంటే, ఒకటి స్త్రీవాద ఉద్యమం ద్వారా – అందులోనూ కేవలం స్త్రీలద్వారా నడపబడే ఉద్యమం ద్వారా – పితృస్వామ్యం పెద్దగా నష్టపోదు. కారణం అది కేవలం స్త్రీపురుష సంబంధాలకే చెందిన విషయం కాదు. మొత్తం సమాజ వ్యవస్థకు సంబంధించిన విషయం. అందులో మనుష్యుల మధ్య ఉన్న అన్ని అసమానతలనూ, అన్ని విధాలై స్థాయి భేదాలనూ, వాటిని కాపాడే ప్రభుత్వాధికారాన్నీ, వీటన్నింటినీ మనం ఒకే సమయంలో చూడాలి, చూచి చాలా జాగ్రత్తగా, ఎంతో సృజనాత్మక రీతిలో ఈ వ్యవస్థ స్థానంలో నిలపడానికి శ్రేష్ఠతరమైన మరో వ్యవస్థను అన్వేషించి, దాన్ని నెలకొల్పడానికి కృషి చేయాలి. మొత్తం సమాజ వ్యవస్థను మార్చినప్పుడే పితృస్వామ్యాన్ని నిర్మూలించడం సాధ్యపడుతుంది. అయితే మనకున్న సమస్య ఏమిటంటే, ఈ విధానం మొత్తం వ్యవస్థను మార్చే లక్ష్యంతో నడుస్తున్న గొప్ప ప్రయత్నం ఏదీ ప్రస్తుతం జరగడం లేదు. ఇప్పుడు తమ-తమ పనులు చేసుకుంటూ పోతున్న అనేక రకాల ఉద్యమాలు సాగుతున్నాయి. ఒకటి వర్గభేదాన్ని నిర్మూలించే లక్ష్యంతో నడుస్తూంటే, మరొకటి కులవివక్షను తొలగించే ఉద్దేశ్యంతో సాగుతూంది మరొకటి జెండర్కు సంబంధించిన భేదభావాన్ని రూపుమాపే దీక్షతో సాగుతూంది. ఈ ఉద్యమాలన్నీ అవసరమే. కానీ ఇక్కడ మనం తెలుసుకోవలసిన విషయం ఏమిటంటే, ఈ ఉద్యమాలు సమాజంలోని ఏ నిర్మితులను మార్చాలని యత్నిస్తున్నాయో, అవన్నీ పరస్పరం కలిసి ఉన్నాయి. వీటిలో ఒక్కొక్క దాన్ని వేరువేరుగా మార్చడంవీలుపడదు. వాటిని మార్చడం కోసం వాటన్నింటిపైన ఒకేసారి దాడిచేయవలసి ఉంటుంది. వీటన్నింటి మధ్య ఉన్న సంలగ్నత (linkage)ను మనం అర్థం చేసుకోకుండా ఉన్నా మనేదే, నాకు అన్నింటి కంటే ఎక్కువ విచారం కలిగించే విషయం. మనం ఇంకా వర్గం, కులం, జెండర్, వీటి ప్రశ్నలను ఒకటిగా చేర్చి అర్థం చేసుకొనేలేదు. వర్గానికి కులంతో, ఈ రెండింటికి జెండర్తో ఎలాంటి సంబంధం ఉంది, ఈ మూడింటికి పితృస్వామ్యంతో ఎలాంటి పొత్తు ఉంది, అనేదాన్ని అర్థం చేసుకోవడం ఇంతవరకు జరగలేదు. అయినా కొంత సంతృప్తి కలిగించే విషయమేమిటంటే దీన్ని అర్థం చేసుకునే ప్రయత్నాలు మాత్రం జరుగుతున్నాయి, స్త్రీవాద ఉద్యమం ఇతర
ఉద్యమాలతో పొత్తు కుదుర్చుకునే విషయం గురించి ఆలోచిస్తూంది.
రమేశ్: స్త్రీవాద ఉద్యమం ఒకే ఉద్యమం కాదనీ, దానికి కూడాఎన్నో రూపాలున్నా యనీ, దాని లోపల ఎన్నో వేర్వేరు పాయాలున్నాయనీ, అనడం వింటూంటాం. ఉదాహరణకు పట్టణాల్లో అన్ని వసతులు కలిగి ఉన్న ఉన్నత, ఉన్నత-మధ్యతరగతికి చెందిన స్త్రీలు కేవలం పురుషుల ఆధిపత్యానికి వ్యతిరేకంగా నడుపుతున్న ఉద్యమం ఒక పాయ. ఈ స్త్రీలు ఇది కేవలం స్త్రీలే చేయవలసిన పోరాటమనీ, అదే వారు చేయవలసిన ఒకే ఒక పోరాటమనీ భావిస్తారు. కానీ, ఇక్కడ మరో పాయ కూడా ఉంది. అందులో మధ్య తరగతికి, నిన్ను-మధ్యతరగతికి చెందిన స్త్రీలు మొదలుకొని కూలిపని, పొలం పనిచేసే స్త్రీల వరకు చేరి ఉంటారు. వీరి ఉద్యమంలో మీరు ఇప్పుడు చేసిన linkage కనిపిస్తుంది.
ఉమ : అవును. ఇలాంటి విభజన కొంందరు చేస్తారు. అయితే నేనందుకు అంగీకరించను. నేనంటున్న linkage సైద్ధాంతిక స్థాయికి అకాడెమిక్ స్థాయికి, మొత్తం వీటన్నింటినీ కలిపి స్త్రీవాదాన్ని దాని విస్తృత అర్థంలో నిర్వచించడానికి సంబంధించింది. కాకపోతే వ్యావహారిక స్థాయిలో మాత్రం మన స్త్రీవాద ఉద్యమం చాలా జాగృతిని కలిగిస్తూ ఉంది. స్త్రీవాదుల్లోకొందరి అవగాహన ఖచ్చితంగా సామ్యవాద స్త్రీవాద అవగాహన అయితే, మరికొందరిది కొంత తక్కువ సామ్యవాద అవగాహన, అయితే సాధారణంగా అందరూ ప్రజావాదులే, అందరూ సామాజిక సంస్థలు, నిర్మితులు మరింత ప్రజాస్వామికంగానూ, తక్కువ క్రుంగదీసేవి గానూ ఉండాలని నమ్మేవారే. మనదేశంలో ఏ స్త్రీవాదీ, ఎప్పుడే గాని వర్గభేదం ప్రదానం కాదని గానీ, కులభేదం ప్రధానం కాదని గానీ, మతతత్వాన్నె దిరించి పోరాడడం ప్రధానం కాదని గానీ, వాతావరణాన్ని పరిరక్షించుకు నేందుకు పోరాటం కొనసాగించడం ప్రధానం కాదని గానీ, ఎప్పుడూ అనలేదు. మనదేశంలో మీరు ఏ ప్రజా ఉద్యమంలో నైనా చూడండి – మతతత్వ విరోధ ఉద్యమం మొదలుగకొని పరమాణు బాంబుల నిషేధోద్యమం వరకు – స్త్రీల సంఖ్య పురుషుల కంటే ఎక్కువగా
ఉంటుంది. ఎందుచేతనంటే, ఇవన్నీ పరస్పరం కలిసి ఉండడమే కాక తమ స్త్రీవాద పోరాటంతో కూడా కలిసే ఉన్నాయని వారికి తెలుసు కాబట్టి. అందువల్ల మన స్త్రీవాదంలోని ఒక పాయ కేవలం పురుషుల ఆధిపత్యానికి వ్యతిరేకంగా పోరాడుతుంద. ఈ పోరాటాన్ని కేవలం స్త్రీలే చేయవలసిన పోరాటంగానూ, అది చేయవలసిన ఏకైక పోరాటంగానూ భావిస్తుంది, అని అనడం పొరపాటు. నిజానికి ఇది ఒకరకమైన ఆరోపణ. పితృస్వామ్యాన్ని కాపాడు కోవాలనికోరుకునే వారి ద్వారా స్త్రీవాద ఉద్యమంలోని న్యాయ బద్ధతను సందేహస్పదం చేసే ఉద్దేశ్యంతో స్త్రీవాదులపైన చేసే ఆరోపణ. నిజానికి మనదేశంలోని స్త్రీవాద ఉద్యమం చాలా వ్యాప్తి కలది. అయితే మీడియా స్త్రీవాదం యొక్క ఒకే ఒక పార్శ్వం చూపిస్తూ ఉండడం తప్పనిసరిగా దౌర్భాగ్యకరం. అది పట్టణాల్లోని ఉన్నత మధ్యతరగతికి చెందిన స్త్రీలు కట్నాలు, బలాత్కారాలు లాంటి దురాచారాలకు, అకృత్యాలకు వ్యతిరేకంగా నడుపుతున్న ఉద్యమాన్ని మాత్రమే చూపడం. ధరల పెరుగుదలకు వ్యతిరేకంగా, అణచివేతకు, పీడనకు, వ్యతిరేకంగా, మతతత్వానికి వ్యతిరేకంగా, ప్రభుత్వం కొనసాగిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా, మానవ హక్కుల కోసం లేదా ప్రజాస్వామిక హక్కుల కోసం, భూమిలేనివారికి భూమి ఇప్పించడం కోసం, అందరికీ చదువు, అందరికీ బ్రతకుతెరువు కల్పించడం కోసం, లేదా ఆకలితో అలమటించేవారి ఆకలి తీర్చడం కోసం ఉద్యమం నడిపే స్త్రీలను ఈ మీడియా చూపదు. స్త్రీవాదుల ఎన్నో సంస్థలు సామ్యవాద దళాలలో కలిసి ఉన్నాయి, లేదా దళితుల, ఆదివాసుల సంస్థలతో కలిపి ఉన్నాయి. లేదా ప్రజల్లోకి వెళ్ళి అనేక పనులు చేస్తున్న ప్రభుత్వేతర సంస్థలతో కలిసి ఉన్నాయి. ఇవి కేవలం వ్యతిరేక ప్రదర్శనలు చేయడమే కాదు, సమాజంలో ఎన్నో నిర్మాణాత్మకమైన పనులు కూడా చేస్తున్నాయి. నేనింతకు ముందు చెప్పినట్లు సమస్య ఏమిటంటే, మీడియా వీటన్నింటిని ప్రజల ముందుంచదు. కేవలం బహుళ ప్రచారంలో ఉన్న స్త్రీవాద పురుష వ్యతిరేక స్వరూపాన్నే ఎదుటికి తెచ్చి చూపిస్తుంది.
రమేశ్ : మీడియా గురించి మీరన్నమాట బాగుంది.కానీ, సాహిత్యాన్ని గురించి, స్త్రీల రచనల గురించి మీ అభిప్రాయం ఏమిటి? అందులో ఇలాంటి పనుల లేక పోరాటాలచిత్రణకు బదులు స్త్రీ పురుషుల సంబంధాల గురించే, అందులోనూ వారి లైంగిక సంబంధాల గురించే చిత్రణ ఎక్కువ ఉండడం మనకు కనిపిస్తుంది.
ఉమ: ఇక్కడ రెండు విషయాలున్నాయి. ఒకటి, పురుషులు లైంగిక సంబంధాల గురించి రాస్తే – లైంగిక విషయాల గురించి స్త్రీల కంటే పురుషులే వెయ్యిరెట్లు ఎక్కువగా రాస్తారు – వాళ్ళనెవరూ వేలెత్తి చూపరు. కానీ స్త్రీ రాస్తే మటుకు వేళ్ళు లేస్తాయి. ఏ విషయం గురించి రాయడానికైతే పురుషులకు స్వేచ్ఛ ఉందో, ఆ విషయాల గురించి రాసే స్వేచ్ఛ స్త్రీలకు లేనట్లు. రెండవది – సాహిత్యం ఎక్కువగా ఆత్మాభివ్యక్తి కోసం రాయడం జరుగుతుంది. అందువల్ల వ్యక్తిగత అనుభవాలు దానికి అధారమవుతాయి. ఇక స్త్రీ వ్యక్తిగత అనుభవాల్లో లైంగిక సంబంధాలకు చాలాప్రాముఖ్యత ఉంటుంది. ఎందుచేతనంటే, ఆ సంబంధాల్లో ఆమె స్త్రీ కావడం అనేక రకాల పీడనకు కారణమవుతుంది కాబట్టి. అయినా స్త్రీల రచనల ఆరంభదశలోనే ఇలా జరుగుతుందని నా అభిప్రాయం. తర్వాత వాళ్ళు వేరేవేరే విషయాల గురించి కూడా రాయడానికి ఉపక్రమిస్తారు. అయితే మీడియా పాత్ర ఇక్కడ కూడా ప్రాధాన్యం వహిస్తుంది. అందులో స్త్రీల ఇలాంటి రచనలకేమో చాలా ప్రచారం ఇవ్వడం జరుగుతుంది. కానీ వాళ్ళు వేరే విషయాల గురించి రాసినప్పుడు దాన్ని ‘పురుషుల రచనల లాంటి రచనలు’ అని చెప్పి ఇవ్వవలసినంత ప్రాధాన్యం ఇవ్వడం జరగదు. ఈ విధంగా స్త్రీల రచనల పైన ఒక ప్రత్యేకమైన ముద్ర పడిపోతుంది. లేకపోతే ఈనాడు అనేక ప్రాంతాల నుండి అనేక కులాలకు చెందిన, అనేక రకాల కుటుంబిక, సామాజిక నేపథ్యం కలిగిన స్త్రీలు రచనారంగంలోకి వస్తున్నారు. తమతోపాటు కొత్త కొత్త అనుభవాలు తీసుకువస్తున్నారు. వీరిలో రచనల్లో చాలా వైవిధ్యం కనపడుతూంది.
రమేశ్ : కుమ్ కుమ్ సంగారీతో కలిసి మీరు సంకలనం చేసే ప్రచురించిన ‘From Myths to Markets’ అనే పుస్తకం నేనీ మధ్యనే చూశాను. అది కూడా ఒక స్త్రీవాద పుస్తకమే అయినా అదికేవలం స్త్రీల వ్యాసాలే ఉండే స్త్రీవాదపుస్తకం మాత్రం కాదు. అందులో పురుషుల వ్యాసాలు కూడా ఉన్నాయి. ఆ వ్యాసాల్లో ఒకటి ఒక పురుషుడు రాసిన పుస్తకాన్ని గురించి ఉండడం చూసి కూడా నాకు సంతోషం కలిగింది. నేను భీష్మ సాహనీ రచించిన ‘మాధవి’ అనే నాటకం గురించి మాట్లాడుతున్నాను.
ఉమ: నేను మొదటే చేప్పాను, పురుషులు కూడా స్త్రీవాదులు కావచ్చని. ఇక్కడ మీకొక జోక్ చెప్తాను. ఢిల్లీ విశ్వవిద్యాలయంలో లెక్చరర్లుగా ఉన్న కొందరు దంపతుల్లో భర్త మార్క్స్‌వాదిగా, భార్య స్త్రీవాదిగా ఉండడం చూసే ఎవరో అన్నారు – ”ఈ శ్రమ విభజన చాలా బాగుంది! భర్తలు ‘క్లాస్, క్లాస్’ అంటూ ఉంటారు, భార్యలు ‘జెండర్, జెండర్’ అంటూ ఉంటారు!” అని. జోక్ను అలా ఉంచి ఆలోచిస్తే, ‘క్లాస్’ను అర్థం చేసుకోకుండా ‘జెండర్’ను అర్థం చేసుకోకుండా ‘క్లాస్’ను, అర్థం చేసుకోవడం వీలుపడదు.