పురిటి గుడ్డలో తలెత్తి చూస్తే
పితృ స్వామ్య పడగలో నా తండ్రి
నగ్నపు నా శరీరాన్ని తన విలువల బట్టతోకప్పేసి
భద్రంగా తన గుండెలకు హత్తుకున్నాడు…
అప్పట్నుంచి బానిస బాండేజీలను
ప్రశ్నించిన ప్రతిసారి
పేగు ప్రేమను దాచి
నాన్న నన్నువెలివేస్తూనే ఉన్నాడు…
ఓ ఇజాన్ని నమ్మినందుకు ఇంటినుంచి వెలివేసిన వాడు
కులాన్ని కాదన్నందుకు కుటుంబం నుంచి వెలివేసిన వాడు
కాషాయ కాలుష్యాన్ని కాలదన్నితే కాటికీ కూడా వెలివేసిన వాడు
పాపం నాన్న! ‘వెలి’ వేసి, వేసి, విసిగి, అలిసి
తనకి తానే ‘వెలి’ వేసుకొని
ఆకాశంలో ఆరుద్రై నిలిచిపోయినాడు!
నాన్నా!
మళ్ళీ వెలివేసినా మరొక్కటి అడగనానిన్ను!
మళ్ళెప్పుడొస్తావ్ నాన్నా?
ఉరిమే వేలివేతలో నువ్వొక స్పార్టకస్ వి!
వెలివేత ఇంకా మిగిలే ఉంది, రావా? మరొక్కసారి!