మునిగి తేలినప్పుడే
జీవితం లోతెంతో తెలుస్తుంది.
పైపైన ఈదుతూ పోతుంటే
ప్రాప్తించేది ఏముంటుంది
జలక్రీడా నిమగ్న సంతృప్తి తప్ప.
పక్షులకు ప్రశంసలు లభించేది
గాలికి కొట్టుకుపోయినప్పుడు కాదు
ఎక్కుపెట్టిన రెక్కలతో
శూన్యంలోనికి కుమ్ముకుపోయినప్పుడు.
నిమిరితే వెన్నుపూసలా ఉండే బతుకు
ఒక్కొక్కసారి కరుకురాయిలా మారుతుంది.
కరుకురాయిని కూడా
వెన్ను పూసగా మలచగలిగే
కార్యనిపుణత ఉన్నప్పుడు
ప్రతికూల పరిస్థితులు
అనుకూల పరిణామాలుగా రూపుదిద్దుకుంటాయి.
సుడిగుండంలో చిక్కుపడిన పడవ
ఎన్ని తిరుగుళ్లు తిరిగినా
తల తిరగకుండా తట్టుకుని
అవతలిగట్టుకు పదిలంగా చేరుకున్నప్పుడే
అది నది మెప్పులను పొందుతుంది.
మనిషి మనుగడ కూడా అంతే.
చుట్టు ముట్టే సమస్యల
వికట వలయాలను ఛేదించకుని
శిరసెత్తి సాగిపోయినప్పుడే
ఆ వ్యక్తిత్వం సుస్థిరతకు
సార్ధకత ఏర్పడుతుంది.