చార్వాక పత్రిక, నాస్తిక వాద, హేతువాద, మానవ వాద కార్యకర్తలకు నాయకులకు మహిళా సంఘాలు, సామాజిక సాంస్కృతిక కార్యకర్తలు, అభ్యుదయ వాదుల లేఖ

అనేక సంవత్సరాలుగా మహిళా సంఘాలు, కుటుంబ సలహా కేంద్రాల వద్దకు వచ్చే ఫ్యామిలీ డిస్ప్యూట్స్‌లో సాంప్రదాయక కుల మత భావజాలాన్ని వ్యతిరేకించేవారి కుటుంబాలకు సంబంధించినవి అనేకం ఉన్నాయి.
ఇందులో వింతేమీ లేదు. అభ్యుదయ భావాలను ఆమోదించినంత మాత్రాన ఆయా కుటుంబాల్లో ఛాందస భావజాలం తుడిచిపెట్టుకు పోతుందనే భ్రమలు మాకు లేనందువల్ల కేస్‌ టు కేస్‌గా వాటిని డీల్‌ చేడయం జరిగింది. జరుగుతున్నది. ఎవరివైపు తప్పులు జరిగినా, రెండు వైపులా జరిగినా వాటిలో వ్యక్తిగత దృక్పథాలు, టెంపర్‌మెంట్స్‌, అవగాహనా లోపాలు వంటి అంశాలు కారణంగా భావించి సరిచేసుకోవాలని కౌన్సిలింగ్‌ ఇవ్వడం, లేకుంటే పరస్పర అంగీకారంతో విడిపొమ్మని చెప్పడం జరుగుతుంది. గృహహింస చట్టం 498-ఎ వినియోగం కేసుల స్వభావాన్ని బట్టి ఉంటుంది.

అయితే గత ఏడాది 498-ఎపై వేసిన చార్వాక పత్రిక మా దృష్టికి వచ్చింది. 498-ఎ, గృహహింస, కుటుంబ విలువలపై ఎక్కువ చర్చ జరగాలనే కోరికగల మాకు అది అవసరంగా అనిపించింది. అయితే పత్రిక అధికార వాణిగా ఉండే సంపాదకీయం, ప్రముఖ హేతువాద, నాస్తిక వాదుల వ్యాసాలు చదివిన తర్వాత తమనితాము సమాజ విశ్లేషకులుగా శాస్త్రీయ ఆలోచన కలిగినవారుగా చెప్పుకునే వారికి కుటుంబ వ్యవస్థపై ఇంత అశాస్త్రీయమైన సంకుచిత సాంప్రదాయక దృక్పథం ఉండడం ఆశ్చర్యం కలిగించింది. వందలాది కేసుల్లో పనిచేస్తున్న కుటుంబ సలహా కేంద్రాల అనుభవాలకు విశ్లేషణలకు చోటు ఇవ్వకపోగా ఈ పత్రిక ఒకటి రెండు కేసుల ఉదాహరణలను పునరావృతం చేస్తూ స్త్రీలను కించపరుస్తూ సాగింది. 498-ఎ దుర్వినియోగంపై మత ఛాందస సంస్థల కరపత్రం మాదిరిగా ఉన్న ఈ పత్రిక ఏ హేతుబద్ధతను ప్రచారం చేయదలచిందో! వారు వివరిస్తే మంచింది.

498-ఎకి ఇప్పటికే తూట్లు పొడిచి దాన్ని అమలుకాకుండా చూస్తున్న వ్యవస్థ, దాని వైఫల్యాలు కప్పిపుచ్చుకుంటూ ఉంటే 498-ఎ అసలు ఉద్దేశ్యాన్ని పక్కదారి పట్టించి దురుపయోగం అంటూ రచ్చకెక్కుతున్న పురుషాధిక్య ప్రపంచం అసలు ఈ చట్టమే లేకుండా చేయాలని కుట్ర పన్నుతున్న నేపథ్యంలో ఈ విష ప్రచారానికి కారణమైన భావజాలంపై చర్చ అవసరంగా భావించి ఈ లేఖ రాస్తున్నాము.

చార్వాక జనవరి ఫిబ్రవరి 2014 సంపాదకీయం : ”గతంలో పోలిస్తే నేటి సగటు వివాహ వయస్సు వివాహచట్టం ఆమోదించిన దానికన్నా పెరిగిపోయింది”

వాస్తవం : ఉమ్మడి రాష్ట్రపు సగటు వివాహ వయస్సు 16.8 సంవత్సరాలు. (2014 ప్రభుత్వ లెక్కలు) బాల్యవివాహాలు కొన్ని కులాల్లో కొన్ని ప్రాంతాల్లో పెరుగుతున్నాయి.

సంపాదకీయాల్లోనైనా వాస్తవాలు చెక్‌ చేసుకుని రాయడం అవసరం. ఏ సర్వేల ఆధారంగా పై విషయం రాశారో మరి!

సంపాదకీయం: ఆడపిల్లల సంపాదన రుచి మరిగిన సంపాదనలేని తల్లిదండ్రులు కూతురికి పెళ్లి చేస్తే తమ ఆదాయానికి గండి పడుతుందనే స్వార్థ పూరిత కారణంతో ఆలోచించి వచ్చిన సంబంధాలు నచ్చలేదనో జాతకాలు కలవలేదనో పెళ్లి వాయిదా వేసుకుంటూ పోవడమో, పెళ్లయినా ఏదో కారణంతో కూతురి వివాహ బంధాన్ని చెడగొట్టాలని చూడటమో జరుగుతోంది.

ప్రశ్న : ఆడపిల్ల సంపాదనపై ఆమె తల్లిదంద్రులకు హక్కు ఉండదా? ఆడపిల్లకు తన కుటుంబం గురించిన బాధ్యత ఫీల్‌ కాదా? చదివి ఉద్యోగం రాగానే వచ్చేదంతా రాబట్టుకుని పెళ్లి చేసుకుని పోవాలని భావిస్తుందా? తన కుటుంబం పట్ల ఆడపిల్లకు బాధ్యత వహించే ఆలోచన అసలు ఉండదనీ, ఆమెకు ఉన్నాగానీ సాంప్రదాయంగా పెళ్లి చేసి పంపాలిగానీ ఆమె సంపాదన ఆశించరాదనీ ఆ సంపాదనపై భర్తకూ అత్తగారికీ మాత్రమే హక్కు ఉంటుందనీ అర్థం అన్నమాట. మగపిల్లవాడి సంపాదన ఆ తల్లిదండ్రులకు ”రుచి” మరగడం ఆచారం. పెళ్లయినా కాకపోయినా భర్త సంపాదన అతని కుటుంబ బాధ్యతలకు ఖర్చు చేయడం సహజం. దాన్ని ప్రశ్నించే హక్కు భార్యకు లేదు. అడిగితే కుటుంబం విచ్ఛిన్నం, కుటుంబ విలువ పతనం, డబ్బు మాత్రమే ఆశించే భార్య అని గగ్గోలు.. ఇది ఏ భావజాలానికి నిదర్శనం?

పెళ్లయిన తర్వాత స్త్రీ సంపాదనపై భర్తకూ అతని కుటుంబానికీ హక్కు ఏర్పడుతుందా? స్త్రీలకు తమను చదివించిన కుటుంబం పట్ల బాధ్యత అవసరం లేదా? ఏ సాంప్రదాయక ధోరణి కట్టుబాట్లకు కొనసాగింపు ఇది? మగవాడు తన సంపాదనతో తల్లిదండ్రులను పోషిస్తూ సోదరీ సోదరులను చదివిస్తూ పెళ్లి ఆలస్యం చేస్తే అది బాధ్యత. అతని పెళ్లి ఆలస్యం కూడా కాదు. ఎందుకంటే అతని సంపాదనపై ఈ కుటుంబం హక్కు ఎటూ పోదు పైగా కట్నం, లాంఛనాలు అదనంగా కోడలి సంపాదన జతకావచ్చు కదా?

ఎవరి తల్లిదండ్రులపట్లయినా వారి పిల్లలకు బాధ్యత ఉంటుంది అనే సమకోణం నుంచి కాక ”మనువు” కోణంలో దుష్పరిణామంగా వర్ణించడం ఏ హేతువాదం? ఏ నాస్తిక వాదం? సమాజాంలో ఈ సమత్వం లేదు కాబట్టి మనం కూడా గుడ్డిగా దాన్నే ప్రోత్సహించాలా? ఆడపిల్లలను పెంచి చదివించిన తల్లిదండ్రులకు ఆమె సంపాదన ఆశించే హక్కుని ‘రుచిమరగడం’ అంటూ అభివర్ణించడం ఏ సంస్కారం?

సంపాదకీయం: బాధితుల్లో అధికులు స్త్రీలే కావడం కట్నం ప్రధాన సమస్య కావడంతో వారికి రక్షణగా ఏర్పడిన చట్టాలను దుర్వినియోగం చేస్తూ అత్తమామలు, ఆడ పడుచులు, ఇతర సమీప బంధువులను వేధించి బ్లాక్‌ మెయిల్‌ చేస్తే అస్త్రంగా 498-ఎ సెక్షన్‌ కింద క్రిమినల్‌ కేసులు పెట్టే ఘటనలు నానాటికీ పెరుగుతున్నాయి.

ప్రశ్న : బాధితుల్లో అధికులు స్త్రీలు.. కారణం కట్నం అని రాశారు. ఇక 498-ఎ దురుపయోగం ఏముంది? కట్నం హింస, కుటుంబ హింస క్రిమినల్‌ నేరాలే. కాబట్టే క్రిమినల్‌ కేసు పెట్టడం. హింసించడం క్రిమినల్‌ చర్యకాదా? లేక కుటుంబ హింసని అలా పిలవరాదా? హింస నుండి రక్షణకే కదా 498-ఎ. దాన్ని అలా వాడడం సరైందే కదా? నేరం చేసినపుడు కేసు పెడితే అది బ్లాక్‌ మెయిల్‌ ఎలా అవుతుంది? అంటే నేరం చేసినా పెట్టకూడదా? పెట్టినా 498-ఎ పెట్టకూడదా? హింసించడం అత్తవారింటి హక్కుగా భావించి నోర్మూసుకోవాలా? ఒకే వాక్యంలో ఇన్ని వైరుధ్యాలా? హింసించడం అనేది ఒక క్రిమినల్‌ చర్య దానికి క్రిమినల్‌ కేసే ఉంటుంది. ఈ నేరానికి సివిల్‌ కేసు పెట్టరు. ఆ హింస పెరిగితే కేసులూ పెరుగుతాయి.

నానాటికీ స్త్రీలపై పెరిగిపోతున్న గృహ హింస గురించి బాధ లేదుగానీ కేసులు పెరగడం బాధగా ఉందా? 2014లో 27 శాతం వరకట్న హత్యలు పెరిగాయి. (రెండు రాష్ట్రాల్లో కలిపి) వీటినైనా క్రిమినల్‌గా చూడవచ్చా? చచ్చిపోతే నేరం అవుతుంది కానీ, స్త్రీ బతికి ఉంటే దాన్ని క్రిమినల్‌గా చూడకూడదా? కుటంబ హింస సివిల్‌ కేసని చార్వాక నిర్ధారిస్తున్నదా? భార్యాభర్తల మధ్య అవగాహన భేదాల్ని సరిచేయడానికి గృహ హింస చట్టం (సివిల్‌) ఉంది. అభిప్రాయ భేదాలంటే కావాలని చేసే మానసిక, శారీరక హింస కాదు.

సంపాదకీయం: నిజంగా హింసలు పడే గ్రామీణ స్త్రీలకన్నా పట్టణ, నగర జీవితం గడుపుతున్న ఆధునిక స్త్రీలే ఈ అస్త్రాన్ని ఎక్కువగా సంధిస్తున్నారు.

ప్రశ్న : అంటే పట్టణ, నగర స్త్రీలకు గృహ హింస లేదా? లేక తక్కువ ఉందా? ఏ ఆధారంతో ఈ నిర్ధారణ జరిగింది? లేదా పట్టణ స్త్రీలు పడే హింస నిజమైంది కాదా? ఆధునిక స్త్రీలు 498-ఎని వాడకూడదా? వారికి అవగాహన ఉండడం, లాయర్‌ దగ్గరికి వెళ్లే సంపాదన ఉండడం, ధైర్యం ఉండటం తప్పా? స్త్రీలకు రక్షణ 498-ఎ అస్త్రం అయితే దాన్ని అస్త్రంగా వాడటంలో తప్పేముంది?

‘చురుకైన కార్యకర్తల కోసం’ ఈ రకమైన అసంబద్ధమైన, ఆధార రహితమైన, అసమగ్ర పరిశీలన అసమాన సాంప్రదాయక కోణాల సంపాదకీయమా? ఈ సంపాదకీయం ఏ రకమైన కార్యచరణకు పురికొల్పుతుందో?

ఇక చార్వాక వ్యాసాల్లో అంశాలపై కొన్ని సందేహాలు…

– నాస్తిక, హేతువాద మానవ వాదులుగా మాట్లాడే వారంతా ఆటోమేటిగ్గా తమ కుటుంబంలో అణచివేతకూ హింసకూ సాంప్రదాయ కట్టుబాట్లకూ అతీతంగా ఉంటారా? (బయట నాస్తికం మాట్లాడిన నాయకులు ఇళ్లల్లో పూజలు వ్రతాలు కొనసాగిస్తున్నారని మీరే రాస్తారు. కానీ, స్త్రీల విషయంలో ఎవరూ రెండు నీతులు ద్వంద విలువలు పాటించరని ప్రకటిస్తారు)

– కట్నం, కులం ప్రసక్తి పెళ్లిలో లేనంత మాత్రాన కుటుంబ హింస జరగదా? అది తీవ్ర మానసిక శారీరక సామాజిక ఆర్థిక రూపాల హింసగా వ్యక్తం కాదా? ఆదర్శ వివాహం జరిగితే కుటుంబ హింస జరగకూడదని ఆశించడం ఒక భాగం కానీ, అసలు కుటుంబ హింస జరగదని ఖచ్చితంగా అయినా హామీ ఏమైనా ఉందా?

– చదువుకుని సంపాదించే స్త్రీల పట్ల అడుగడుగునా ద్వేషం ఎందుకు? వారంటే విపరతమైన అభద్రత, భయం తిరస్కారం ఎందుకు?

– ఆడయినా మగయినా చదువుకోగానే, సంపాదించగానే అభ్యుదయం వచ్చేస్తుందా?

– పూజలు వ్రతాలు నుండే ఇంకా బయట పడని నాస్తిక వాదులు కొందరున్నపుడు అంతకంటే లోతుగా పాతుకుపోయిన పురుషాధిక్య కుటుంబ వ్యవస్థ భావజాలం నుండి బయట పడతారనడం ఏం హేతుబద్ధత? ఇంటి పేరు మార్చడంతో సహా అన్నీ పాటించే ఆదర్శ వివాహాలు హింస అణచివేత ఆధిపత్యం చూపవా?

– 498-ఎ మాత్రమే దుర్వినియోగం అవుతున్నదా? దానికి కారణం స్త్రీలేనా? దుర్వినియోగం అరికట్టాలా? ఏకంగా రక్షణ చట్టాన్ని మార్చాలా?

– కుటుంబ విలువలు అంటే ఏమిటి? ఏ విధమైన కుటుంబ విలువలు? సంపాదనతో పాటు ఇంటి చాకిరీ, కుటుంబ గౌరవం పిల్లల పెంపకం అన్ని స్త్రీలపై వదిలేసే కుటుంబ విలువల్ని రక్షించాలా?

– ఉమ్మడి కుటుంబంలో ”పెద్ద” అయిన పురుషుడు (తప్పొప్పులతో నిమిత్తం లేకుండా) మందలిస్తే సర్దుకు పోయిన విలువ ఎటువంటిది? కుటుంబాన్ని కాపాడాలంటే స్త్రీలకు హక్కులు ఉండకూడదా? స్త్రీలకు హక్కులు ఉంటే కుటుంబం విచ్ఛిన్నం అవుతుందా?

– మానసిక శారీరక వేధింపులను ఎదుర్కొని భరించలేక విడిపోవాలంటే అది తప్పా? హింసంటే కనిపించే రక్త గాయాలేనా? మానసిక హింసలున్నా కలిసి బతకాలా?

– విభేదాలు తగాదాలు చిన్నవా పెద్దవా? హింస తీవ్రమైందా.. భరించదగ్గదా? వాటిని భరించి కలిసి బతకాలా వద్దా ఎవరు నిర్దారించాలి? పురుషులు మాత్రమేనా? ఏ రకం హింసకు విడిపోవాలో ఈ వ్యాసకర్తలు నిర్దారిస్తారా?

– దూర దూరంగా వివసిస్తున్నా గానీ ఫోన్లు స్కైప్‌ల ద్వారా వేధింపులు జరగడం లేదా? అసలది సాధ్యం కాదా? (498-ఎ పెట్టిందని భార్య ఫొటోని ఫోన్‌ నెంబర్ని నెట్‌లో పెట్టి వ్యభిచారి అంటే అది దూరం నుండి జరిగే హింస కాదా? సైబర్‌ క్రైమ్‌ అంతా దూర హింస కాదా?) టెక్నాలజీ పెరిగాక హింస రూపాలు మారలేదా?

– కుటుంబాన్ని రక్షించడం అంటే స్త్రీలు మనిషిగా (హింస లేకుండా) బతికే హక్కు నిరాకరించాలా? కుటుంబాలు విచ్ఛన్నం కావడానికి ప్రధాన కారణం ఆధిపత్యం దాని రూపమైన హింస. దాన్ని ఖండించకుండా హింసను స్త్రీలు సహించడం లేదు కాబట్టి వారే కారణం అనడం ఎట్లా సరైంది? గృహ హింస నేరం కాదా? భర్త అత్తింటి వారి ఆధిపత్యాన్ని అహంకారాన్ని రెచ్చగొట్టడంలో పెంచి పోషించడం అతని కుటుంబ సభ్యులు, బంధువుల పాత్ర ఉండదా?

– 498-ఎ కింద శిక్షలు పడక పోవడానికి కారణం నేరం జరగక పోవడమా? నిరూపించ లేక పోవడమా? (ఇటీవలి మీరట్‌ దగ్గరి హషీంపురాలో 28 ఏళ్ల క్రితం పోలీసులు జరిపిన ఊచకోతలో 402 మంది ముస్లింలు మరణించారు. వాస్తవం అందరికీ తెలిసినా అది నిరూపితం కాలేదు) నేరం నిరూపించ లేక పోవడానికి స్త్రీలే బాధ్యులా? నిరూపించకపోతే హింస జరగనట్టేనా? క్రిమినల్‌ కేసుల్లో నేర నిరూపణ ఎవరి బాధ్యత?

– స్త్రీలు కట్నం ఇచ్చి ఖర్చు చేసి పెళ్లి చేసుకునేది హాయిగా కాపురం చేయడానికా లేక డబ్బు గుంజడానికి, అక్రమ సంబంధాల కోసమా? మగవారు మాత్రం పాపం విశ్వాస పాత్రంగా ఏ ఆధిపత్యం చూపకుండా హింస చేయకుండా బుద్థిగా కాపురం చేయాలనుకుంటారా? స్త్రీలను ఇంత దుర్మార్గ స్వభావంతో చిత్రించింది మొదట మనువు రెండు మత ఛాందసత్వం తర్వాత చార్వాక.

– నేటి కుటుంబ చట్రం స్త్రీల హక్కులకూ నిర్ణయాత్మక భాగస్వామ్యానికీ ప్రజాస్వామిక సమాన చర్చకు వేదికగా ఉందా? అట్లా లేని కుటుంబ వ్యవస్థ దీర్ఘకాలం మనగలుగుతుందా? ఆయా సమాజాల్ని బట్టి కుటుంబ స్వరూప స్వభావాలు, విలువలు మారతాయా? లేక స్థిరంగా శాశ్వతంగా ఉండిపోతాయా?

– దురుపయోగం అవుతున్నది 498-ఎ మాత్రమేనా.. మరే చట్టమూ కావట్లేదా..? ఏ చట్టంలోని లొసుగుల్ని ఎవరెవరు ఎన్ని రకాలుగా వాడుకుంటున్నారో అందరికీ తెల్సు.. వాటిని రద్దు చేసుకోవాలని చర్చ ఎందుకు లేదు? 498-ఎ పై విరుచుకుపడటానికి కుటుంబంలో మగ పెత్తనంపై ధిక్కారాన్ని సహించలేని మగ ఆధిపత్య భావజాలం కారణం కాదా?

– అసలు కుటుంబంలో స్త్రీలపై హింస జరుగుతుందా? లేదా? జరిగితే దాన్ని నిరోధించే చట్టం ఉండాలా? వద్దా? అతి కొద్ది కుటుంబాల్లో హింస లేదు కాబట్టి అదే సామాజిక వాస్తవంగా భావించాలా?

– రాజ్యాంగం ఆమోదించిన సమానత్వాన్నయినా ఎక్కడా ఈ పత్రిక గుర్తించలేదు. చారిత్రకంగా స్త్రీ అణచివేత కారణాలు జోలికి అసలు పోలేదు. మూఢ నమ్మకాల్లో స్త్రీని తక్కువ చేయడం ఒకటనే విషయం పేర్కొనలేదు. కులమత భావాల కొనసాగింపునకు వివాహం స్త్రీలపై అణచివేత ఎలా వారధులుగా పని చేస్తాయో ప్రస్తావించలేదు. కానీ చట్టాల గురించి తప్పుల గురించి ఏకపక్ష సుదీర్ఘ చర్చ నడిపారు. ఏ రంగు కళ్లద్దాలతో చూస్తున్నారు?

– స్త్రీల చదువు ఆరోగ్యం తప్పనిసరి అవసరాలుగా మారినపుడు ఇంటిపని వంటపని, పిల్లల సంరక్షణ, సేవలు అందరూ చేయాలి. కానీ, అత్తింట్లో అందరికీ పాతకాలం మర్యాదలు, చాకిరీ చేస్తూ సంపాదన కూడా చేయాలనడం ఏం కాలంనాటి ధోరణి? అది అసలు సాధ్యమేనా? అది ఆశించదగినదా? మనం ప్రబోధించాల్సింది ఇదేనా?

– మారిన పరిస్థితుల్లో కుటుంబంలో వైరుధ్యాలు పెరిగాయి. వాటిని గుర్తించి పరిష్కరించడానికి, ఛాందస ఆలోచనలకీ నేటి తరానికి మధ్య అంతరాలను సామరస్యంగా పరిష్కరించడానికీ (పరిష్కరించగలిగే వాటిని) ఆలోచనా ప్రయత్నం చేయాలని సహేతుకంగా మాట్లాడకుండా స్త్రీలపై దురుద్దేశాలు ఆపాదించి దుమ్మెత్తిపోయడం ఎందుకు?

– 498-ఎ అమలులో ఎందుకు విఫలమైంది? మహిళలు సుదీర్ఘ పోరాటాల ఫలితంగా 9 సంవత్సరాల పాటు పార్లమెంటరీ కమిటీ అన్ని తరగతుల వారితో చర్చించి రూపొందించిన ఈ చట్టాన్ని నీరుగారుస్తూ కోర్టులు కొన్ని కేసుల ఆధారంగా మార్గదర్శకాలు జారీచేయడం వాటిని ప్రభుత్వం ఎగబడి అమలు చేయడం ఎలా సమంజసం…?

– కాలంతోపాటు కుటుంబ సంబంధాలు మారతాయని అంగీకరించి ఏ మార్పులు మానవ సంబంధాల్ని బలోపేతం చేస్తాయో చర్చించాలా? లేక స్త్రీల సంపాదన వల్ల రక్షణ చట్టాల వల్ల కుటుంబంలో మానవ సంబంధాలు నాశనం అవుతున్నాయని గగ్గోలు పెట్టడం శాస్త్రీయ ఆలోచనా? ఈనాటి సమస్యలకు గతంలో పరిష్కారాలు వెతకడం ఏ పురోగమనం? ఏం పరిష్కారం?

– ”అపురూపమైనదమ్మ ఆడజన్మ” అంటే మగజన్మ ఏంటి? ఇది పొగడ్త రూపంలో వివక్ష కాదా..?

– అపురూపం, పాతివ్రత్యం, ఇంట్లో ఉన్నత స్థానం, దేవత వంటి పదాలతోనే కదా స్త్రీని బానిసను చేసింది. ఈ ముసుగులోనే ఇపుడు హింసను భరించే సహనమూర్తిగా ఉండమంటున్నారా? ఇల్లాలిగా పడిఉండటమే స్త్రీకి కర్తవ్యం అన్నమాట. మనిషిగా ఆమె మెదడుకి, శరీరానికి పదును పెట్టుకుంటూ అన్ని రంగాల్లో రాణిస్తూ ఆమె పబ్లిక్‌ లైఫ్‌లో వుండకూడదా? ఎవరైనా మగవాడు నాకు వంట, ఇంటి బాధ్యతలు ఇష్టం అంటే అతని మగాడి తనానికి నష్టం ఏమైనా ఉంటుందా? స్త్రీలకు వంటిల్లు, మగాడి రాజ్యాలేలేపని, సంపాదన.. ఏ కాలంలో బతకమని బోధిస్తున్నారు చార్వాకులు?

– రాసిన కేసుల్లో విలన్స్‌ ఆడపిల్లల తల్లులే.. దురాశతో, దురుద్దేశంతో వారు కాపురాలు చెడగొడుతున్నారంట. తండ్రులు పాపం ప్రమేయమే లేదు. మగాడి తల్లిదండ్రులు, ఆడపడుచులంతా ఉత్తములు సౌమ్యులు. ఆహా ఎంతటి నిశిత పరిశీలన!?

– పురుషాధిక్య కుటుంబ వ్యవస్థ కొనసాగాలని చార్వాక కోరుకుంటున్నాదా? విడాకులకు స్త్రీలే కారణం దాంతో ఆమె సామాజిక స్థాయి దిగజారుతుందనడం కరుడుగట్టిన పురుషాధిక్యత కాదా?

– కులం మతం నుండి లభించిన ఆధిపత్యాన్ని తమ హక్కులుగా భావించి అలవాటుపడి వాటిని స్త్రీలు హక్కులుగా గుర్తించకపోతే ఆమోదించకపోతే దాన్ని తమ పురుషత్వానికి సవాలుగా భావించి విక్టిమైజ్‌ అవుతున్నామనే భావన భార్యా బాధితుల సంఘానిది కాదా? భార్యా బాధితుల సంఘం అభిప్రాయాలతో విశ్లేషణలో చార్వాక ఏకీభవిస్తున్నదా?

– అలవాటైన సాంప్రదాయక చిత్రంలో ఇమడని స్త్రీలు, సాంప్రదాయక భావజాలాన్ని ధిక్కరించే స్త్రీలు లేదా సాంప్రదాయక వివాహం కుటుంబం నమూనాను అంగీకరించని స్త్రీలు దుర్మార్గులు విశృంఖలత్వం కలవారా? ఈ పాక్షిక హేతువాదం తమని తాము ఫ్యూడల్‌ వివాహ చట్రం నుండి బయట పడేసుకోలేని అభద్రత నుండి వచ్చింది కాదా? లేక మతాన్ని దేవుడిని తప్ప మిగిలిన అన్ని సాంప్రదాయాల్ని ఆంక్షల్ని వీరు ఆమోదిస్తున్నారా?

– తమకు నచ్చిన భాగస్వామిని ఎంపిక చేసుకునే హక్కు యువతీ యువకులకు ఉందా? తల్లిదండ్రులు వారు ఎంపిక చేసినపెళ్లి జరిపించడం (సాంప్రదాయం కావచ్చు, ఆదర్శ వివాహం కావచ్చు. ఎరేంజ్‌డ్‌ మ్యారేజెస్‌ బై పేరెంట్స్‌) పిల్లల అంగీకారంతోనైనా జరిపించడం వెనకబాటు తనం కాదా? (కట్నం కులం పురోహితుడు లేకుంటే చాలు ఆభ్యుదయం ఆదర్శం అయిపోతాయా?)

– భార్య భర్త ఒకరికి అనుకూలంగా ఒకరు మారాలి. ఎవరు ఎంత మారాలో ఎలా మారాలో వారు నిశ్చయించుకోవాలి. అంతేకానీ భర్తల్ని తమకి అనుకూలంగా మార్చడానికి 498-ఎ వాడుతున్నారంటే భార్యలపై భర్తలు ప్రతికూలంగా వున్నారనా? అలా సహజంగా ఉంటారనా? లేక భార్యలకి అనుకూలంగా భర్త ఉండకూడదా? అంటే భార్యే అనుకూలవతిగా ఉండాలి. భర్త ఉంటే అవమానమా? 498-ఎ అలా అనుకూలంగా భర్తల్ని మారుస్తుందా?

– ‘ఆడదానికి ఆడదే శత్రువు’ అనేది పురుషాధిక్య భావజాలపు ఫలితం. స్త్రీని తోటి స్త్రీకి శత్రువును చేసిన భావజాలం దీన్ని స్త్రీ పురుషలిద్దరూ జీర్ణించుకుని ఉన్నారు. దీనికి చార్వాక ఆమోదం ఉందా? ప్రతి పురుషుడికీ మరో పురుషుడు స్నేహంగానే ఉంటాడా శత్రుత్వంలో ఉండడా?

– ఇంటి పనులు, అతిథి మర్యాదలు భర్తా పిల్లలు అన్నీ స్త్రీల బాధ్యతేనా? టీవీ ప్రభావం స్త్రీలపై ఉందా? లేక టీవీ మంచి ప్రభావం పురుషుడిపైనా చెడు ప్రభావం స్త్రీపైనా ఉందా?

– విశృంఖలత్వానికి కారణం టెక్నాలజీనా? క్షీణ సంస్కృతా?

– చదువుకుంటే చట్టాలు తెలిసిపోతాయా? అమాయకత్వం = నిరక్షరాస్యతా? చదువుకుంటే, సంపాదిస్తే ఖచ్చితంగా అభిప్రాయాలు చెబితే, తప్పుని ఖండిస్తే ఎదిరిస్తే ఆ స్త్రీలు గయ్యాళులు అవుతారా? నిరక్షరాస్యతలో అమాయకత్వంలోనే స్త్రీలు మంచివారా? నాస్తిక భావాలు కలిగిన స్త్రీని భర్త, అత్తింటి వాళ్లు పూజలు చేయమని, తాళి వగైరా ధరించడమంటే అది హింసకాదా? ఈ సమస్య చిన్నదా పెద్దదా? ఆ నాస్తిక భావాలు స్త్రీలవి కాబట్టి వాళ్లు కుటుంబం కోసం సర్దుకుపోవాలా?

– భర్త అతని కుటుంబం చిత్రహింసలు పెడితే అది సహజమైన ఆనందమా? దానికి ప్రతిగా కేసు పెడితే వికృతానందం అవుతుందా?

– ఐటీ సెక్టారంతా స్నేహాలన్నీ అక్రమ సంబంధాలుగా మారతాయా? వాళ్లు విచ్చలవిడిగానే ఉంటారా?

(ఐటీ సెక్టార్‌లోని పని ఒత్తిడి మానసిక పీడన వలన 46 శాతం టెపంరరీ ఇంపోటెన్సీ ఉందని ఇటీవలి సర్వే చెప్పింది)

– ధనార్జన కేవలం యువతకే ధ్యేయంగా మారిందా? అయితే ఆ భావం నాటింది ఎవరు? యువత చెడు ధోరణులకు పూర్తిగా వారే వ్యక్తిగతంగా బాధ్యులా?

– పవిత్ర భారతీయ కుటుంబ వ్యవస్థ గొప్పదని కొనియాడటం ఏ రకమైన శాస్త్రీయత? వైదిక సాంప్రదాయ వివాహ వ్యవస్థ పరిణామం గురించి తాపీ వారి నుండి ఆరుద్ర దాకా అనేక మంది (నైతిక భాష్యాలు చెప్పకుండా) చారిత్రక నిస్పక్షపాతంతో వివరించారు.

– విడాకుల సంఖ్య పెరగడాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి ఏ పరిణామంలో భాగంగా చూడాలి? దాన్ని కుటుంబ విచ్ఛిన్నంగా దుర్మార్గంగానే వర్ణించాలా?

– స్త్రీ భరణం మెయింటెనెన్స్‌ అడగడం డబ్బు గుంజే వ్యవహారమా? పెళ్లి తర్వాత సంపాదించిన ఆస్తిలో ఇప్పటికీ భార్యకు సమాన వాటా చట్టం లేదు. ఇది అన్యాయం కాదా? సంపాదించే స్త్రీలూ సంపాదన లేని భర్తలకు భరణం ఇస్తారని తెలుసా?

– అడుగడుగునా చదువుకున్న సంపాదించే స్త్రీలను కించపరిచే పదాలతో భావాలతో ఏకపక్షంగా సాగిన ‘చార్వాక’ లక్ష్యం ఏమిటి? అసలు కుటుంబ హింస స్త్రీల వ్యక్తిగత సమస్యా? లేక కుటుంబ ప్రైవేటు వ్యవహారమా?

– దుర్వినియోగం ఉదాహరణ ఇచ్చిన ప్రతి దానికీ వంద ఉదాహరణలు 498-ఎ సద్వినియోగం ఉదాహరణలున్నాయి.

– చార్వాకలో కొన్ని కేసులు రిపీట్‌ అవడం చూస్తే 498-ఎ దురుపయోగం చర్చ ఎవర్నయినా రక్షించడానికా? ఎవరిపైన అయినా కక్ష సాధించడానికా? 498-ఎకి మీరు వ్యతిరేకులా? దాని సద్వినియోగానికి మీ సూచనలేవి? ఇటువంటి కూర్రమైన పరమ ప్రగతి నిరోధక భావజాలానికి ”చార్వాక” వేదిక కావడం దురదృష్టకరం. బలమైన వైయుక్తిక భావోద్వేగాలపై ఆధారపడి శాస్త్రీయ ఆలోచన పెంపొందించే పత్రికలు రాయవచ్చునా? ఒకవేళ ఎవరు రాసినా దాన్ని ప్రచురించవచ్చునా?

498-ఎకి అర్హత గలిగిన అనేక కేసుల్లో కూడా ఆ స్త్రీలు సామాజిక ఆమోదం లేకపోవడం, అభద్రత, కుటుంబ పరిస్థితులు వలన రాజీపడి బతకడం ఒక చేదు నిజం. కుటుంబ హింసకు గురైన వారిలో కేవటం 6 శాతం మాత్రమే పోలీసుల దాకా వెళ్తారు. 10 ఏళ్లు పోరాడి మహిళా సంఘాలు కుటుంబ కౌన్సిలింగ్‌ని చట్టబద్ధం చేశాయి. గృహహింస నిరోధక చట్టం (సివిల్‌ చట్టం)గా సాధించాయి. 498-ఎ కేసుల్లో అవి నిరూపితం కాకపోవడానికి ప్రధాన కారణం అవి నాలుగు గోడల మధ్య జరగడం, ఇరుగు పొరుగులకు చివరకి పుట్టింటికి కూడా చెప్పి పరువు తీయరాదని స్త్రీలకు చిన్నతనం నుండి చేసే బోధన వల్ల చెప్పక పోవడం, చెప్పినా సర్దుకుపొమ్మని వారికే చెప్పే ఇరుగు పొరుగులు, మధ్యవర్తులు కోర్టు సాక్ష్యానికి రాకపోవడం పోలీసులు ఎంక్వయిరీ సరిగా చేయక పోవడం రక్త గాయాలున్నా అరెస్టు చేయకపోవడం (వారి అలసత్వం వివక్షత గురించి సుప్రీం కోర్టు అనేకసార్లు మందలించింది) శరీరంపై గాయాలున్నపుడు వెంటనే స్త్రీలు రిపోర్టు చేయరు. దానికితోడు సాధింపులకు తిట్లకీ సాక్ష్యాలుండవు. కట్నానికి లాంఛనాలకు రాతపూర్వక ఆధారాలుండవు. ఇక పోలీసులు 498-ఎ చూసి లంచాలు గుంజడం చివరకి న్యాయ వాదుల లాలూచీ సర్వసాధారణం. మహిళా సంఘాలు అతి కొద్దిమంది దయగల మధ్యవర్తులు పోలీసులు న్యాయవాదుల వల్ల కొన్ని కేసులే నిలబడుతున్నాయి.

పోలీసులే కాదు న్యాయమూర్తులు కూడా పురుషాధిక్య భావజాలంతోనే పనిచేయడం సర్వసాధారణం. ”ఈ సమాజం నుండే వచ్చి న్యాయమూర్తులు ఆ భావాలకు అతీతంగా ఉండరు. వారిని మార్చాలి” అని కృష్ణయ్యర్‌ పేర్కొన్నారు. ”అసలు స్త్రీలు కేసు పెట్టడం తప్పు అది కుటుంబం విచ్ఛిన్నం. డబ్బు గుంజే కుట్ర. వివాహేతర విచ్చలవిడి లైంగిక సంబంధమే 498-ఎ పెట్టిస్తుంది” అని గగ్గోలు పెడుతున్న సాంప్రదాయక కుల మత కుటుంబ రక్షకులు అధికారానికి వచ్చాక స్త్రీలకు రక్షణ ఏమైంది? స్త్రీలని మనిషిగా పరిగణించి హక్కులతో బతకనిచ్చే సమాజం వైపు ఆలోచించలేమా?

కుటుంబ హింస మీద, కుటుంబ విలువలు, ఇంటిపని కుటుంబాల్లో ప్రజాస్వామిక సంబధాలు, స్త్రీలని కించపరచని ప్రత్యామ్నాయ భాషని రూపొందించుకోవడం మీద ఈ నాస్తిక, హేతువాదుల దృక్పధాలేమిటి? ఆలోచనలేమిటి? స్త్రీల సమానత్వం, స్త్రీ సాధికారత, స్త్రీల నిర్ణయాధికారం అంటే ఏంటి వీరి దృష్టిలో.

మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా చట్టం కావాలని ఉద్యమాలు చేస్తున్నారుకదా స్త్రీల అంశాల పట్ల, సమస్యల పట్ల ఇంత మూఢత్వమేల? మీ దృష్టిలో పెళ్ళంటే నూరేళ్ళ పంటా? ఆ పంటలో పండే పిల్లలు తల్లిదండ్రులిద్దరికీ చెందరా? మీరు విడాకులకు వ్యతిరేకులా? మతతత్వంతో వున్న వాళ్ళ మాటల్లో, రాతల్లో చేతుల్లో వ్యక్తమయ్యే మహిళా వ్యతిరేకతని తేలికగా గుర్తించవచ్చు… అభ్యుదయం ముసుగేసుకున్న ‘అభ్యుదయవాదుల’ నేలబారు భావాలని ఎలా పసి గట్టడం?

స్త్రీ స్వేచ్ఛ మీ ఎజండాలో లేదా?

స్వేచ్ఛగా వుండే స్త్రీలు మీ దృష్టిలో ఎవరు?

498 ఏ మీద ఇంత విషం కక్కడానికి, అసంర్భమైన రాతలు రాయడానికి వ్యక్తిగత అంశాలే కారణమా? కులాంతర, మతాంతర వివాహాల్లో గృహహింస ఏ స్థాయిలో వుంటుందో మీకు తెలుసా?

స్త్రీల పట్ల పరమ దిగజారుడు అభిప్రాయాలు ఉంచుకుని కులాంతర, మతాంతర, దండల పెళ్ళిళ్ళు చేసుకుంటే అదే అభ్యుదయమా?

సెక్షన్‌ 498 ఏ మీద మీరింత విషం కక్కారు కానీ… చాలా మంది స్త్రీలకు ఇలాంటి ఓ సెక్షన్‌ వుందని తెలియదు.

భూమిక చేపట్టిన వొక అధ్యయనంలో 498 ఏ చాలా తక్కువగా వినియోగించబడుతోంది అని తేలింది. మా దగ్గర ఆ అధ్యయనం రిపోర్డు వుంది. వినియోగమే సరిగా లేనపుడు దుర్వినియోగం ఎలా అవుతుంది? గృహహింస దారుణంగా పెరుగుతోంది అని వొప్పుకుంటూనే దానిని ఎదుర్కొవడానికి వున్న క్రిమినల్‌ చట్టాన్ని వినియోగించుకోకూడదని మీరు తీర్పులు చెప్పడం ఎలాంటి అభ్యుదయం?

మీ దృష్టిలో అభ్యుదయమంటే ఏంటి?

కనుక గృహహింసకు పాల్పడే వారిని అభ్యుదయ సంఘాలు వెలివేయాలనే మహిళా సంఘాల పిలుపునకు స్పందించాలని కోరుతున్నాం. 498-ఎ అమలు, వైఫల్యాల్ని అరికట్టి పటిష్టంగా సమర్థవంతంగా అమలు జరపాలనీ, కుటుంబ హింసను నిర్మూలించి కుటుంబ విలువల్ని, మానవ సంబంధాల్ని సంరక్షించడానికి మాతో చేతులు కలపాలని ఆహ్వానిస్తున్నాం.

Share
This entry was posted in కరపత్రం. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.