రాసాని కథలు – మహిళ- ఆచార్యమూలె విజయలక్ష్మి

చిత్తూరు జిల్లా కథాసాహిత్యంలో విశిష్ట స్థానం వున్న రచయిత రాసాని, వృత్తిరీత్యా అధ్యాపకులు. ప్రవృత్తి రీత్యా రచయిత. కథ, నవల, నాటక ప్రక్రియల్లో సాహిత్యం వెలుపరించారు. మావూరి కథలు, మెరవణి, పయనం కథా సంపుటాలు, మట్టి బతుకులు, వలస, పరస, చీకటి రాజ్యం, చీకటి ముడులు, ముద్ర నవలలు రచించారు. బడుగు, బలహీన వర్గాల, సంచార జీవుల, జానపద కథాకారుల జీవితాల్లోని మారుమూల కోణాలు వీరి సాహిత్యానికి ముడి సరుకులు. చిత్తూరు జిల్లా మాండలిక భాషప్రయోగం వీరిశైలి ప్రత్యేకత. నిఘంటువులకెక్కని ఎన్నో పదాలు, నుడికారాలు ప్రయోగింపబడినాయి. స్థానిక సంస్కృతి ప్రతిఫలిస్తుంటుంది.

రాసాని కథలు వాస్తవ జీవన దృశ్యాలు. ప్రజలు జీవితాల సునిశిత పరిశీలన వీరి సొంతం. ఈ దిశలోనే నిత్య జీవితంలోమహిళల వెతలు, ఆచార సంప్రదాయాల ముసుగులో నలుగుతున్న మహిళల మనసులు, పురుష అహంకార ప్రవృత్తి, మోసం ఓ పిడికెడు కథల్లో చిత్రించారు. సమస్యకు ప్రతిస్పందనగా స్త్రీ చైతన్యవంతంగా ప్రవర్తించిన తీరు కథల్లో ప్రస్పుటమవుతుంది.

మరో మనువు ఆచారమున్నా మనసు లేని మనువులు, పురుషుని అహంభావానికి గురయి. తన తప్పేంటో చెప్పండంటూ ప్రశ్నించిన సంచార తెగ యువతి గాథ ”నల్లపూసలు”

నాంచారికి ఐదేండ్ల ప్రాయంలో భార్య గతించినా మారుమనువాడలేదు ఆమె తండ్రి. యుక్త వయస్సు వచ్చిన బిడ్డను ఓలి యిచ్చి పెళ్ళాడతామని సిద్ధమయ్యారు. ఆమె పై మనసు పడింది ఇద్దరు యాదన్న, అజ్జప్పంటే అమ్మాయికిష్టం. సర్పంచ్‌ కన్ను కూడా బడింది. చెయ్యేసిన అతనికి బుద్ధి చెప్పింది.

రెండు వేలు, పంది పిల్లలను ఓలిగా ఇచ్చి, కులస్థులకు కల్లు తాపించియాదన్న మనువాడాడు. సంసారం సజావుగా సాగుతున్నా సంతానం కలుగలేదు. గొడ్డుపోతులంది లోకం. మారుమను వాడతానని బెదిరించాడు యాదన్న. సంతానం కోసం అజ్జప్పతో జతకట్టింది. అది తెలిసి పంచాయితీ పెట్టాడు. యాదన్నకు ఓలి తిరిగి కట్టి అజ్జప్ప పెళ్ళాడాడామెను. పరిస్థితి మొదటికి వచ్చింది. భార్యను వదిలేశాడు. వయస్సులో వున్న కూతురికి మరో మనువు చేశాడు తండ్రి. కొడుకు పుట్టాడు. కరువు వల్ల నెల్లూరు ప్రాంతంలో పూసలు దారాలు అమ్ముకుంటూ కాలం గడుపుతున్నారు. అక్కడికే వచ్చిన మేనత్త కూతురితో వెళ్ళిపోయి భార్యబిడ్డలను నట్టేట ముంచాడు మూడోభర్త. మళ్ళా పెళ్ళాడుతా మని వచ్చినా అంగీకరించలేదు. మొదటి ముగ్గురు తిరిగి వచ్చినా తిరగ్గొట్టింది. చంకలో పిల్లోనితో మిగిలింది.

యాదన్న ‘వసే గాట్లో గెడ్డితో కడుపు నిండకపోతే గొడ్డు సేన్లోనన్నాబడి ఎవ్వురూ గానకుండా పైరుమేసేసి కడుపునింపుకోవాల’ అని సలహా ఇచ్చాడు. నాంచారి చీదరించుకుంది. తర్వాత తన మీద మనసు పడ్డ అజ్జప్పతో కలిసి జతగా ఊరొదిలింది. సలహా ఇచ్చిన యాదన్న గొడవ చేశాడు. నాంచారికి సంతానం కలుగకపోవటం నెపంతో ఓలి తిరిగి చెల్లించిన వానికి భార్యగా మారింది. అక్కడా చుక్కెదురయింది. ఇంటినుంచి గెంటబడి పుట్టిల్లు చేరింది. కానీ మూడో భర్త వల సంతానం కలిగింది. అంటే సంతానం కలుగకపోవటానికి నాంచారిలో లోపం లేదనేది స్పష్టం. అయినా నిందలు పడింది. మనసుతో సంబంధం లేకుండా ముగ్గురి చేతుల్లోకి మారి బాధలు పడింది. ”ఏ మొగోడొచ్చినా నా వంటి సొంపులే జూశగానీ నా మొణునును జూడలే. నాకూ వొక యిదుంటుందని అనుకోలే” అంటూ బాధపడింది. ఆ తర్వాత కూడా వంట్లో బిగువుండే దాకా సరదా తీరిన తర్వాత నాకేసిన పుల్లాకు మాదిరి విసిరి పారేస్తారని చేసుకుంటామని వచ్చినా మరో మనువాడలేదు.

మాతమ్మ ఆచారాన్ని వ్యతిరేకించి, నిరసన ప్రకటించిన యువతి గాధ ‘అక్షింతలు’ మాదన్న లచ్చుమమ్మలు దళితులు. బాగ్యమ్మకు ఊహతెలియని వయస్సులో మేనమామ కొడుకుతంగమణితో పెళ్ళయ్యింది. మాదన్న వచ్చి తాగుబోతు. తల్లి శ్రమ కుటుంబానికి ఆధారం. ఒకసారి ఆ ఊరిలో రోగాలు చుట్టుముట్టాయి. వల్లె పెద్దలు ఎవరో ఆచారం తప్పడం వల్ల ఇలా జరుగుతోందని ఆరా తీశారు. ఊర్లో మొక్కుబడి ఉన్న వాళ్ళ తమ ఆడబిడ్డను బసివిని చేయకపోవటం వల్లనే ఇలా జరుగుతుందనీ, ఆ మొక్కుబడి తీర్చనిది మాదన్న అని తేల్చారు. మొక్కుకున్న, తర్వాత కలిగిన భాగ్యమ్మకు పెండ్లయిందన్నా అంగీకరంచ లేదు. బసివిని చేయాల్సిందేనని నిర్ణయించారు. భాగ్యమ్మ అత్త మామలు బసివిని అంటే వాడకంతా వదినెకాబట్టి తన కొడుక్కి వేరే పెళ్ళి జరపాలనుకున్నారు. మాదన్న రెండో చెల్లెలు కూతురు అలివేలుతో పెళ్ళి జరుగుతుంది. భాగ్యమ్మ గుండె పగిలింది. అప్రయత్నంగా పెళ్ళి పందిరి వద్దకు వెళ్ళింది. ఎవరు పట్టించుకోలేదు అమె అమ్మ, వదిన, అక్కడే వున్నారు. అందరితో పాటు అక్షింతలు ఆమె చేతిలో పెట్టారు. తాను బసివినిగా మారే దైన్యస్థితిని తలచుకొని ఆలోచించింది. ఇంటికి వచ్చి తప్పతాగి పడి ఉన్న తండ్రిని చూసి, అక్షింతలు నేలకేసి కొట్టింది. గడపదాటి అడుగు ముందుకేసింది.

దళిత వెనుకబడిన కులాల్లో మొక్కుబడి పేరుతో ఆడపిల్లలను మాతమ్మలుగా మార్చేదురాచారం ఉంది. ఊర్లో రోగాలు వ్యాపించినపుడో మరో కారణం చేతనో తల్లిదండ్రుల ఇష్టపడో, ఇష్టపడకనో ఊరి పెద్దల ప్రమేయంతో బాలికలకు దేవతతో పెళ్లి జరిపిస్తారు. అప్పటి నుండి ఆమె వాడవదినె. అక్షింతలు కథలో మొక్కుబడి ఉన్నా తల్లిదండ్రులు భాగ్యమ్మకు పన్నెండేళ్ళకు పెళ్ళి జేశారు. కాని గ్రామ పెద్దల బలవంతంమీద మాతమ్మగా మార్చడానికి సిద్దమయ్యారు. భాగ్యమ్మ భరించలేకపోయింది. భాగ్యమ్మ పెళ్లి జరగడంలో, ఆ తర్వాత మాతమ్మగా మార్చాలనుకోవడంలో, భర్తకాపురాన్ని కాదని, మరో మనువాడడంలో ఆమె మానసిక స్థితిని ఎవరూపట్టించుకోలేదు. భాగ్యమ్మ చైతన్యంతో ఆలోచించుకుంది. తాగుబోతు తండ్రిని చీత్కరించుకుంది. ఇల్లు వదిలింది. మాతమ్మ వ్యవస్థ పట్ల నిరసన వ్యక్తం చేసింది.

ప్రేమ, నమ్మకంతో సాగాల్సిన కుటుంబ సంబంధాలు, అనుమానం అపమానం మధ్య నిలబడవని తెల్పిన మహిళ ‘గాధ’ తీర్పు.

పల్లెలో ఇరు కుటుంబాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. రాశింటోళ్లపై చేయి భరించలేని రాజు వాళ్ళ పొలంలో టెంకాయలు కోస్తూ రాశింటోళ్ల కోడలు గౌరమ్మ కంటపడ్డాడు. బుద్ధిమాటలు చెప్పి వదిలేసింది. దాంతో రాజు గౌరమ్మ కన్పించినప్పుడు మాట్లాడేవాడు. గౌరమ్మ కుటుంబీకులు అనుమాన పడి, అక్రమ సంబంధం అంట గట్టారు. పంచాయితీ పెట్టి పది మందిలో ప్రశ్నించారు. తాను ఏ పాపం ఎరుగనంది. తలవంపులు తెచ్చానని నలుగురి ముందు నాలుగు తగిలించాడు ఆమె భర్త. అక్కడున్న పెద్దలు నోరు మెదపలేదు. ”వొక ఆడదాన్ని కొట్టేదానికి నీకు సిగ్గు లేదా! పెండ్లాన్ని కొట్టేది వీరత్వం అనుకుంటివా ఇంకా నిలు చాలా గాని” అని భర్తను గదమాయించింది. పెద్ద మనుషులను కడిగేసింది. మరోసారి చేయెత్తిన మొగునితో ఎవరో ఏదో చెప్పారని బతుకును వంచుకున్న పెండ్లాన్ని అందరి ముందర అగుడు చేస్తావా అడుగడుగునా అనుమానించి కొడతావా… ఇక నీతో కాపురం చెయ్యలేనంది. చెట్టుకు కాయలు బరువు కాదని అక్కడున్న తండ్రి అక్కున చేర్చుకున్నాడు.

స్త్రీ పురుషునితో మాట్లాడితేనే సంబంధం అంట గట్టి, అనుమానించి నిందలు వేసే కుటుంబం. అది నమ్మి నలుగురి ముందు కొట్టి, అవమానించి, పురుష అహంకారం చూపిన భర్తతో కాపురం చేయనని తెగేసి చెప్పింది. స్వాభిమానాన్ని చాటుకుంది. పురుష అహంకారం మీద గట్టి దెబ్బ కొట్టింది. నోరు మెదపకుండా చోద్యం చూసిన సమాజానికి సవాల్‌ విసిరింది. ఇదంతా చూస్తూన్న రాజు స్నేహితుడు సూర్యం ”ఆడది మాట్లాడనంతవరకే స్త్రీ పైన మగాడి అధిపత్యం సాగుతుంది. ఇక ప్రశ్నించడం ప్రారంభించిందంటే, ఆనాటితో పురుషుడు పునరాలోచింపక తప్పదు. తరతరాలపురుషాధిక్యం పూడ్చబడక తప్పదు” అనుకున్నాడు.

సంతానం పెంపకంలో బాధ్యత వహించని తండ్రికి వారిపై ఎలాంటి హక్కు ఉండదని తెల్పిన మాతృమూర్తి గాధ ‘గాలిచెట్టు’

మునెయ్య కూతురు మునిలక్ష్మి. ఉద్యోగస్తుడైన వెంకటమునికిచ్చి పెళ్ళి చేసాడు. ఆడపిల్ల పుట్టిందని రాచిరంపాన పెట్టి పుట్టింటికి పంపారు. మునెయ్య బిడ్డను చేరదీశాడు. ఆమె రక్షణార్థం కొంత ఆస్తి కూడా రాసాడు. మునిలక్ష్మి పట్టుబట్టి టైప్‌ నేర్చుకుని ఉద్యోగంలో చేరింది. ఇది తెలిసి బాగా చూసుకుంటానని రాయబారాలు పంపాడు భర్త. ఆమె చలించలేదు. అయినా ప్రయత్నాలు మానలేదు. పుట్టు వెంట్రుకలు తీస్తున్న దగ్గరకు వచ్చి భార్య, బిడ్డను తీసుకెళతానని పెద్దల ముందు అడిగాడు. తండ్రీబిడ్డ సమ్మతించ లేదు. తన బిడ్డను తనకు ఇమ్మన్నాడు. పెద్దలు న్యాయమే కదా అని వంత పాడారు. కానీ మునిలక్ష్మి నవమాసాలు మోసి, కని, పెంచి, ఆలనా పాలనా చూసింది తాను కాబట్టి బిడ్డ పైన హక్కు తనదేనంది. పక్షులు పండ్లనుతిని రెట్టను ఎక్కడో వేస్తే, అవి మొలుస్తాయి, ఆ చెట్టు అధికారం భూమిది లేదా! ఆ యజమానిదే తప్ప పక్షిది కాదు కదా! అని ప్రశ్నించింది. పెద్దలు కిమ్మనలేదు. వెంకటమునికి వెనుతిరగక తప్పలేదు.

గాలిచెట్టు కథలో మునిలక్ష్మి బిడ్డను కనడంలో స్త్రీ పురుషుల ప్రమేయం ఉన్నా పెంపకంలో బాధ్యత వమించనపుడు తండ్రిగా బిడ్డను తీసుకెళ్ళే హక్కులేదనీ, ఆలనా పాలనా చూసే తల్లిదేనని స్పష్టం చేసింది. ఎవడికో పుట్టిందని నిందలు వేసి, తన్నితరిమేసి, భార్య ఉద్యోగంలో చేరాక తగుదునమ్మా అని వచ్చాడని లోకులు గుసగుసలాడుకున్నారు. ఆమె తండ్రి బిడ్డ వస్తే తీసుకుపోమ్మన్నాడు. మునిలక్ష్మి మౌనందాల్చింది. తన బిడ్డను ఇచ్చేయమన్నాడు. తల్లికే కాదు తండ్రికి హక్కుందన్న పెద్దలకు ‘మీరంతా మొగోళ్లే గాబట్టి అట్టంటారు. నా స్థానంలోకి వచ్చి మాట్లాడండని గడ్డి పెట్టింది.

కులం పెళ్ళికి అడ్డుగోడై, అగమ్యగోచరమైన స్థితిలో సాహసమైన నిర్ణయం తీసుకున్న దళిత యువతి గాధ ‘రెక్కల గుర్రం’.

నీలమ్మ తల్లిదండ్రుల గారాల పట్టి, నీలమ్మ తండ్రి బీకయ్య వాచ్‌మన్‌. తల్లి వేన్నీళ్లకు చన్నీళ్ళు తోడుగా మిషన్‌ కుట్టేది. నీలమ్మకు చదువు అబ్బింది. తొమ్మిదిలో ఉండగా తండ్రికు జబ్బు చేసింది. బడిమానేయక తప్పలేదు. వయస్సుతో పాటు అందం, ఆకర్షణ చేరి చెక్కిన బొమ్మలా వుంది. దానికి తోడుతెలివి తేటలు. ట్యూషన్స్‌ చెప్తూ ఊర్లో వాళ్ళను ఆకట్టుకుంది. దాంతో అహం పెరిగింది. అందాల రాకుమారుడు రెక్కల గుర్రం పై వస్తాడని కలలు కనింది. ఆ ఊరికి టీచర్‌గా వచ్చిన సుందరం నీలమ్మకు రాకుమారుడిగా కన్పించాడు. పరిచయం పెరిగింది. పెళ్ళాడతానన్నాడు, నమ్మింది. ఫలితంగా ప్రతిరూపం కడుపులో పెరిగింది. పెళ్ళి గురించి అడిగితే కడజాతి దాన్ని చేసుకోవడానికి తల్లిదండ్రులు ఒప్పుకోలేదన్నాడు. తప్పుకున్నాడు. తల్లి తల్లడిల్లిపోయింది. అబార్షన్‌ చేయిస్తానంది. డాక్టర్ల మొదటికే మోసమన్నారు. నీలమ్మ తల్లి కడుపులో బిడ్డను కడతేర్చాలనుకుంది. కానీ నీలమ్మ బిడ్డను కంటాను తన లాంటి వారి కండగా నిలబడేలా పెంచుతాను. తరతరాల నుంచి కులం పేరుతో, ధనం పేరుతో, మతం పేరుతో, కట్నం పేరుతో, ఇంకా రకరకాలు గా అణచివేయబడుతున్న తనలాంటి అభాగ్యుల పాలిట పెన్నిధిగా నిలిచే మనిషిగా నిలబెడతాను అని నీలమ్మ బిడ్డను కనింది.

వయసులో వున్న అందరి ఆడపిల్లల లాగే నీలమ్మ కలలు కనింది. నమ్మిన వాడు నట్టేటముంచాడు. అనుభవించడానికి అడ్డురాని కులం పెళ్ళికి ఆటంకమయింది. అవివాహితగానే బిడ్డను కని, ఆ బిడ్డను ఆదర్శంగా తీర్చిదిద్దాలనుకొంది. సాహసమైన నిర్ణయం తీసుకుంది.

”కడజాతి దాన్ని చేసుకునే దానికి వోళ్ళు ఒప్పుకోలే” అని తల్లిదండ్రులకు ఎదురాడలేననీ, తల్లిదండ్రుల పైకి నెట్టి తప్పుకున్నాడు. తల్లిదండ్రులనడిగే నీలమ్మతో సంబంధాలు పెంచుకున్నావా అని తనను తాను ప్రశ్నించుకోలేదు ఆ టీచరు.

కుటుంబ సంబంధాల నుండి బయట పడలేని స్త్రీ గాధ ‘సాలెగూడు’ జానకి వయస్సు అరవై దాటింది. రోడ్డు ప్రమాదంలో తల్లిదండ్రి, అన్న వదిన, చనిపోవడంతో అన్న పిల్లలు, తమ్ముడు, చెల్లెలు మిగిలారు. జానకి ఉద్యోగం చేస్తూ అందరికీ ఊడిగం చేస్తూ, ఉన్నతులు చేసి, పెళ్ళిళ్లు చేసి, వృద్ధాప్యంకు చేరువైంది. ఆధారపడినంత వరకు అప్యాయత ఒలక పోసిన వాళ్ళకు ఇపుడు ఆమెంటేనే చులకన. కూడు, నీడ కూడా సరిగా ఇవ్వరు. అనాడు తన గతి తాను చూసుకొని వుంటే ఈ గతి పట్టేది కాదని వగిచేది జానకి. కానీ తమ్ముని పిల్లలతో ఆమెకు అనుబంధం. ఒకరోజు హార్లిక్స్‌ కింద పడేసింది. తమ్ముడి భార్య అడ్డూ ఆపూ లేకుండా తిట్టింది. ఇక ఆ ఇంట్లో ఉండకూడదని నిర్ణయించుకుని వీధిలో అడుగుపెట్టింది. అడుగు ముందుకు పడనీయకుండా పిల్లలు కాళ్ళు చుట్టేశారు. అడుగు వెనక్కి పడింది. సాలె గూట్లో పడిన ఈగ పరిస్థితి ఆమెది.

తల్లిదండ్రుల మరణంతో ఉద్యోగం చేస్తూ కుటుంబ భారం మోసింది. జీవిత మంతా అంకితం చేసింది. సంపాదనంతా వెచ్చించింది. మేలు పొందిన వారంతా ముసలి తనంలో మొండి చేయి చూపారు. మనస్తాపానికి గురి చేశారు. ఒక స్త్రీ ఆ కుటుంబం దీనస్థితిలో పడినపుడు ఆదుకుంది. చాకిరీ చేసింది. అందరినీ గట్టెక్కించింది. ఇల్లు వదలిపోవాలనుకునే స్థితికి నెట్టింది. ఆమె చూపిన ప్రేమాభిమానాలు వెలకట్టలేనివి. ఆత్మాభిమానం ఆమె సొంతం. అందుకే అడుగు బయట పెట్టాలనుకుంది. ఆ పసి పిల్లల అభిమానం ముందరి కాళ్ళకు బంధం వేసింది. ఒకసారి కుటుంబ బంధాలలో ఇరుక్కున్న మహిళలు బయటపడలేక సతమతమవుతారనడానికి సాలెగూడు కథ నిదర్శనం.

సాలెగూడు కథలో జానకి బంధాల్లో ఇరుక్కుపోయింది. తక్కిన కథల్లో తమ సమస్యకు ఘాటుగానే స్పందించారు. కుటుంబాన్ని కాదన్నారు., తీర్పు, గాలిచెట్టు, నల్లపూసలు కథల్లో తండ్రులు అండగా నిలబడ్డారు. ఇలాంటి పరిస్థితుల్లో పుట్టింటి వారి అండ లేకపోతే స్త్రీ పరిస్థితి నిప్పులపై నడకే. లేదంటే తన కాళ్ళపై తాను నిలబడాలి. దుర్మార్గుడైన భర్తను వదిలేస్తామని స్త్రీ నిర్ణయించుకున్నపుడు తీర్పు, గాలిచెట్టు కథల్లో వారి తండ్రులు చెట్టు కాయలు బరువు కాదని కష్టల కొలిమి నుండి కన్నవారు ఆదుకున్నారు. భర్త స్థానంలో ఒక పురుషుడు ఆరడిపెడ్తే, తండ్రి స్థానంలో పురుషుడు ఆడవారికి అండా ఆపూ అయ్యారు. నల్లపూసలులో నాంచారి పురుష స్వభావాన్ని ఏవగించుకుని లోకాన్ని నిలదీసింది. ఆక్షింతలు, రెక్కల గుర్రం కథల్లో స్త్రీలు తమ సమస్యకు తామే పరిష్కారం చూసుకున్నారు. సాహనంగా, సంచలమైన నిర్ణయాలు తీసుకున్నారు.

ఇలా రాసాని సంచార, దళిత, మధ్య తరగతి కుటుంబాల్లో స్త్రీల సమస్యల పట్ల స్పందించారు.సమస్యల్లో కూరుకుపోకుండా, వెలుగు దారి వైపునడిపించారు.

 

Share
This entry was posted in వ్యాసాలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.