ఉన్నత పదవి ఉన్న మహిళకు తప్పని స్త్రీ వివక్షత- వి. సత్యవతి

చిన్న ఉద్యోగిని నుంచి ఉన్నత పదవుల నలంకరించిన మహిళ వరకు అంతా తోటి ఉద్యోగుల నుంచి వారిపై అధికారుల నుంచి నేటికీ వివక్షతకు గురవుతూనే ఉన్నారు. లీలాసేథ్‌ లక్నోలో పుట్టారు, న్యాయశాస్త్రంలో పట్టా పుచ్చుకున్నారు. తొలుత బీహార్‌ రాజధాని పాట్నలో ప్రాక్టీస్‌ ప్రారంభించారు. 1958లో లండన్‌లో బార్‌ పరీక్షల్లో పాల్గొన్నారు. అందరిలోను టాప్‌గా నిలచి క్రెడిట్‌ సాధించిన ప్రథమ మహిళగా రికార్డు గుర్తింపు పొందారు. సివిల్‌, క్రిమినల్‌ టాక్స్‌కేసులు మొదలగు అన్ని రకాల కేసులను చేపట్టారు. ఆదాయపన్నుకు జూనియర్‌ స్టాండింగ్‌ కౌన్సిలుగా నియమింప బడ్డారు. పది సంవత్సరాలు పాట్నా హైకోర్టులో పని చేశారు. తర్వాత కలకత్తాలో చేసి అక్కడ నుంచి ఢిల్లీకి చేరుకున్నారు. ఢిల్లీలో ముఖ్యమైన అన్ని విభాగాలలోను అయిదు సంవత్సరాలు పనిచేశారు. 1978లో ఢిల్లీ హైకోర్టులో న్యాయాధీశురాలుగా నియమింప బడ్డారు. న్యాయాధీశురాలుగా నియమితమైన ప్రథమ మహిళ లీలా సేథీ. అనేక విచారణ కమిటీలలో నియమింపటం జరిగింది. ‘లా కమీషన్‌ ఆఫ్‌ ఇండియా’లో ఆమె 2000 సంవత్సరం వరకు పనిచేశారు. లీలాసేథీ హిందూ వారసత్వ చట్టంలో ప్రాధాన్యతగల కొన్ని మార్పులను తీసుకొచ్చారు. ఉమ్మడి కుటుంబ ఆస్తిలో కూతుళ్ళకు కూడా సమాన హక్కు ఉండేలా సవరణను తీసుకొచ్చారు.

ఢిల్లీలో న్యాయాధీశురాలుగా ఉన్నపుడు సేధీ లింగ వివక్షతకు గురయ్యారు. న్యాయాధీశురాలుగా నియమితు లయినపుడు ప్రమాణ స్వీకరాం చేసిన తర్వాత ప్రధాన న్యాయ మూర్తితో కలసి కోర్టులో కూర్చోవాలి. అది మొదలునుంచి వస్తువున్న సాంప్రదాయం. ఆ ప్రధానన్యాయమూర్తి కరుడుగట్టిన సాంప్రదాయావాది. ఆయన శరీరంలో పురుషాధిక్యభావజాలం రక్తంలా ప్రవహిస్తోంది. సేధీ ప్రక్కన కూర్చొటానికి నిరాకరించాడు. అంతేకాదు. ఛాంబరులోపల కూడ ఒక మహిళా న్యాయాధీశురాలుతో కలసి కూర్చుని చట్టపరమైన అంశాలను చర్చించటానికి కూడ ఒప్పుకోలేదు. అది తన వలన కాని పనని నిసిగ్గుగా చేతులెత్తేశాడు. అలా చేయటం వివక్షతే కాదు అవమానించటం కూడ. నిర్భయకేసులోను నిందుతుల తరపు న్యాయవాదులు కూడా సంస్కారహీనంగా మాట్లాడారు. ఈ పురుషాధిక్య భావజాలం పవిత్రమైన న్యాయవాద వృత్తికే కళంకం. అప్పుడు లీలాసేథీ ఒక సీనియర్‌ న్యాయాధీశుని ప్రక్కన కూర్చున్నారు. కోర్టులో న్యాయవాదులు తాము చేపట్టిన కేసులను న్యాయాధీశులకు వినిపించే ముందు యువర్‌ ఆనర్‌ అనో లేక మైడియర్‌ అనో సంభోదించాలి (గుర్తులేదు) తెలుగులో గౌరవనీయులైన న్యామూర్తిగారికి అని అర్థం. కాని సేథీని కోర్టులో న్యాయవాదులు ‘మిలార్డ్‌’ అని సంభోదించేవారు. తోటి న్యాయాధీశులు ఆ న్యాయవాదులకు ‘మైలేజీ’అని సంబోధించవలసినదిగా సూచించేవారు. అయినా వారు తమ తీరు మార్చుకునేవారు కాదు. సేథీ అడిగిన ప్రశ్నలకు ఆమె వైపు చూచి సమాధానం చెప్పేవారు కాదు. ప్రక్కనున్న పురుష న్యాయాధీశులవైపు చూస్తూ ఆమె ప్రశ్నలకు జవాబు చెప్పేవారు. తోటి న్యాయాధీశులు కూడ కొత్తవారికి లీలాసేథీని పరిచయం చేయవలసి వచ్చినపుడు ‘ఈమె మాకొత్త న్యాయాధీశురాలని’పరిచయం చేసేవారు. ఏవైనా విందులు జరిగేటప్పుడు దాని ఏర్పాట్లను ఆమెను చూడమనేవారు. అది ఆడవాళ్ల పని అని, ఆమె స్త్రీ అయినందున ఆలా చేసేవారు. వారి కుసంస్కార చేష్టలకు సేథీ క్రుంగిపోలేదు. ఎంతో సైర్థ్యంతో తన పనులు ఆచితూచి జాగ్రత్తగా చేసేవారు. టీ వగైరా ఏర్పాట్లను చూడమని చెప్పినవారికి సేథీ ఇంతకు ముందు చేసినవారే ఇప్పుడు ఆ పనులను చేస్తారని గట్టిగా సమాధానం చేప్పేవారు.

తర్వాత సేథీ హిమాచల్‌ప్రదేశ్‌ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమించబడ్డారు. ఈ పదవి నలంకరించిన ప్రథమ మహిళ కూడా సేథీనే. ఆమె మొదటి నుంచి తన వృత్తిలోని లోతుపాతులను బాగా ఆధ్యయనం చేసి అవగాహన చేసుకున్న మహిళ. పురుషాధిక్య భావజాలంగల న్యాయాధీశులతోను, న్యాయవాదులతోను పని చేసిన అనుభవంతో వేయికళ్లు ఆమె తప్పులను వెతికి పట్టుకోవాలని వేచివున్నవన్న సంగతి ఆమెకు తెలియనిది కాదు. తాను స్త్రీనైందున తాను చేపట్టిన కార్యక్రమాలలోను, తీర్పులలోనూ తప్పులు వెలికి పట్టుకోవాలని న్యాయాధీశులు, న్యాయవాదులు లేచి కూర్చున్నారని గ్రహించారు. ఆ అవకాశంవారికి కలుగకుండ సమర్థవంతంగా తనపని నిర్వహించుకున్నారు. పుల్‌ కోర్టు మీటింగులలో మాట్లాడే సమయాన మృదువుగా మాట్లాడుతూనే అవసరమైన చోట సర్దుబాటుకు వీలుగాని విధంగా ఖచ్చితమైన నిర్ణయాలు తీసుకునేవారు. అందరిని కలుపుకుని పోవడానికి అధిక ప్రాధాన్యతనిచ్చేవారు. ఆ సమయంలో సహకారం లభించకపోతే, న్యాయానికి హాని కలుగుందనిపించితే కఠినమైన మార్గాన్ని ఎంచుకునేవారు. తాను తీసుకునే చర్యలు, నిర్ణయాలు తరువాత వచ్చే మహిళలపై ప్రభావం చూపుతవని ఆలోచించేవారు. మహిళలెదుర్కొనే వివక్షతను పూర్తిగా నిర్మూలించాలంటే పురుషుల ఆలోచనలలో మార్పు రావటం అత్యంత అవసరమని సేథీ తన అభిప్రాయాన్ని వెల్లడించారు.

పురుషాధిక్య భావజాలంలో నిండా మునిగివున్న న్యాయా ధీశులు న్యాయవాదులు వున్న న్యాయస్థానంలో మహిళలకు సరైన న్యాయం జరుగుతుందనుకోవటం కుందేటి కొమ్మును సాధించు కోవాలనట్లుగానే వుంటుంది.

Share
This entry was posted in వ్యాసాలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి)


తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.